బౌద్ధమతంలోని స్త్రీలు: భిక్షుని వ్యవస్థను పునరుద్ధరించడం

పురాతన కాలంలో, లింగ భేదాలు బహుశా అంత ఎక్కువగా ఉండేవి కావు. ఏదేమైనా, నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సమాజాలను వారి శత్రువుల నుంచి రక్షించడంలో బలం మరియు అధికారం కీలక పాత్రను పోషించాయి. అలా, పురుషులు వారి అధిక శారీరక బలంతో ఆధిపత్యాన్ని చలాయించారు. ఆ తర్వాతి రోజుల్లో, విద్య మరియు తెలివితేటలు ముఖ్యమైన పాత్రను పోషించాయి; ఈ విషయంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి తేడాలు ఉండేవి కావు. ఏదేమైనా, గొడవలలో మరియు ఇతర సమస్యలను పరిష్కరించడంలో ఆప్యాయత మరియు ప్రేమ చాలా కీలకమైన పాత్రను పోషించాయి. విద్య, తెలివితేటల వాడకాన్ని నియంత్రించడానికి, వాటిని వినాశకర లక్ష్యాలుగా మార్చకుండా నిరోధించడానికి ఈ రెండు లక్షణాలు అవసరం. అందువల్ల, స్త్రీలు ఇప్పుడు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు, ఎందుకంటే, వాళ్ళు సహజంగా పురుషుల కంటే సులభంగా ప్రేమను మరియు ఆప్యాయతను పెంపొందించుకోగలరు. ఇది వారి గర్భాలలో పిల్లలను మోయడం నుంచి అప్పుడే పుట్టిన పసి బిడ్డల ప్రాతమిక సంరక్షకులుగా ఉండటం నుంచి వస్తుంది.

యుద్ధాన్ని సాంప్రదాయకంగా పురుషులు మాత్రమే చేసేవారు, ఎందుకంటే వాళ్ళే ఇలాంటి ప్రవర్తనకు శారీరకంగా బాగా సన్నద్ధమయి ఉండేవారు. మరోవైపు, మహిళలు ఇతరుల అసౌకర్యం మరియు నొప్పిని చూసి ఎక్కువ శ్రద్ధతో బాగా సున్నితంగా అవుతారు. పురుషులు మరియు మహిళలు దూకుడు మరియు ఆప్యాయతకు ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ రెండింటిలో ఏది సులభంగా వ్యక్తమవుతుందో దానిలో వేరుగా ఉంటారు. అందువల్ల, ప్రపంచ నాయకులలో ఎక్కువ మంది మహిళలైతే, యుద్ధ ప్రమాదం తక్కువగా ఉంటుంది మరియు ప్రపంచ ఆందోళన విషయంలో ఎక్కువ సహకారం ఉంటుంది - అయినా కానీ, కొంతమంది మహిళలు కఠినంగా ఉండవచ్చు! ఫెమినిస్టుల పట్ల నాకు సానుభూతి ఉంటుంది, కానీ వాళ్ళు అరవకూడదు. వీళ్ళు సమాజానికి పాజిటివ్ సహకారాన్ని అందించడానికి కష్టపడాలి.

కొన్నిసార్లు మతంలో, పురుష ప్రాముఖ్యతకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే బౌద్ధమతంలో అత్యున్నత ప్రమాణాలు అంటే భిక్షువు, భిక్షుని సమానమే, మరియు వీళ్ళకు సమాన హక్కులు ఉంటాయి. కొన్ని ఆచార ప్రాంతాలలో సామాజిక ఆచారం కారణంగా భిక్షువులు ముందుంటారు. కానీ బుద్ధుడు రెండు సంఘ సమూహాలకు సమానంగా ప్రాథమిక హక్కులను ఇచ్చాడు. భిక్షుని సమాజాన్ని పునరుద్ధరించాలా వద్దా అని మాట్లాడుకోవడంలో అర్థం లేదు. వినయ సందర్భంలో సక్రమంగా ఎలా చెయ్యాలనేదే ఇక్కడి ప్రశ్న.

శాంతరక్షిత మూలసర్వస్థివాద భిక్షువు సమాజాన్ని టిబెట్ లో ప్రవేశపెట్టాడు. అయితే ఆయన సమూహంలోని భారతీయులంతా పురుషులే కావడంతో, భిక్షుని వ్యవస్థకు ద్వంద్వ సంఘం అవసరం ఉంటుంది కాబట్టి, భిక్షుని లైన్ ను ప్రవేశపెట్టలేకపోయాడు. ఆ తర్వాతి రోజుల్లో, కొంతమంది టిబెటన్ లామాలు తమ తల్లులను భిక్షునిలుగా నియమించారు, కాని వినయ విధానం నుంచి చూస్తే, ఇవి ప్రామాణికమైనవిగా పరిగణించబడలేదు. 1959 నుంచి, చాలా మంది సన్యాసినుల గృహాలు వారి విద్యా ప్రమాణాలను మఠాల స్థాయికి పెంచాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను. నేను దాన్ని అమలు చేశాను మరియు ఈ రోజు సన్యాసినులలో ఇప్పటికే పండితులు ఉన్నారు. కానీ భిక్షుని సమాజాన్ని పునరుద్ధరించే విషయంలో నేను ఒంటరిగా ఏదీ చెయ్యలేను. ఈ ప్రశ్నను వినయ నియమం ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది.

ఇప్పటికీ భిక్షుని సంప్రదాయం ఉన్న చైనీస్, కొరియన్, వియత్నామీస్ సంప్రదాయాల లాంటి ఇతర బౌద్ధమత సంప్రదాయాలతో ఈ సమస్యను చర్చించే అవకాశం ఇప్పుడు మనకు దొరికింది. ఇప్పటికే ధర్మగుప్తక సంప్రదాయం ప్రకారం సుమారు రెండు డజన్ల మంది టిబెటన్ మహిళలు భిక్షుని పద్ధతిని అనుసరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు భిక్షునిలు కాదని ఎవరూ చెప్పలేరు.

గత ముప్పై ఏళ్లుగా మేము మూలసర్వస్థివాద, ధర్మగుప్తక వినయ గ్రంథాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఈ రెండు సంస్కృత ఆధారిత సంప్రదాయాలలోను, పాళీ సంప్రదాయంలోను వినయ సాంప్రదాయం కనిపిస్తుంది కాబట్టి, మూడు వినయ సంప్రదాయాలకు చెందిన సంఘ పెద్దలు ఒకచోట చేరి ఈ విషయం గురించి మాట్లాడుకుని తమ అనుభవాలను పంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే శ్రీలంకలో భిక్షుని వ్యవస్థను పునరుద్ధరించగా, థాయ్ లాండ్ లోనూ అదే విధంగా చేసేందుకు ఆసక్తి వస్తుంది. ఇంకా ఎక్కువ పరిశోధన ఉపయోగకరంగా ఉంటుంది, అలా ఏదో ఒక రోజు మనం శాంతరక్షిత వైఫల్యాన్ని పొందకుండా ఉంటాము. అయితే, ఒక వ్యక్తిగా, ఈ సమస్యను నిర్ణయించే అధికారం నాకు లేదు. అది వినయ విధానాలకు అనుగుణంగా ఉండదు. ఆ పరిశోధన ప్రారంభించే అధికారం మాత్రమే నాకు ఉంది.

ధర్మగుప్త భిక్షుని సన్యాసాన్ని పొందిన టిబెటన్లు, పాశ్చాత్యులను ధర్మగుప్తక భిక్షునిగా మనమందరం అంగీకరిస్తున్నాం. ఇది సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే, మూలసర్వస్థివాద వినయ గ్రంథాల ద్వారా భిక్షునిలను నిర్దేశించడానికి ఒక మార్గాన్ని కనిపెట్టడం. ఇక్కడ అడగడానికి ఒక బుద్ధుడు సజీవంగా ఉండాలి. నేను ఒక బుద్ధుడిని అయితేనే నిర్ణయించగలను; కానీ నేను అలా లేను. నేను బుద్ధుడిని కాదు. నేను కొన్ని విషయాల్లో అధికారిగా వ్యవహరించగలను కానీ వినయ సాంప్రదాయ విషయంలో కాదు. ధర్మగుప్తక సంప్రదాయంలో నియమితులైన టిబెటన్ భిక్షునిలు సమూహాలుగా ఏర్పడి మూడు సంఘ ఆచారాలను నిర్వహిస్తారని నేను చెప్పగలను: [అతిక్రమణల ద్వైమాసిక శుద్ధి పనులు (సం. పోషధ, పాళీ: ఉపోశత), వేసవి రిట్రీట్ యొక్క సంస్థాపన (సం. వర్షోపనాయిక, పాళీ: వాసోపనాయిక), మరియు వేసవి రిట్రీట్ ఆంక్షల నుంచి దూరంగా వెళ్ళడం (సం. ప్రవరణ, పాళీ: పవరన)]. కానీ సన్యాస వేడుకను మళ్ళీ ప్రారంభించే విషయంలో మాత్రం ఇది వేరే విషయం. ఇది జరగాలని నేను కోరుకున్నప్పటికీ, దీనికి సీనియర్ సన్యాసుల ఏకాభిప్రాయం అవసరం. వారిలో కొందరు గట్టి వ్యతిరేకతను చూపించారు. ఇక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు, అదే సమస్య. అయితే, ఈ మూడు సంఘ ఆచారాల ధర్మగుప్తక వెర్షన్‌లకు కావాల్సిన గ్రంథాలను చైనీస్ నుంచి టిబెటన్ భాషలోకి నేను అనువదించగలను. దాన్ని ఎవరూ వ్యతిరేకించలేరు.

మిగతా విషయానికొస్తే, మనం ఇంకా విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఇతర బౌద్ధమత సంప్రదాయాల సంఘం నుంచి సహాయం ముఖ్యమైనది కాబట్టి ఈ సమావేశం ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ. తర్వాతి పనిగా, ఈ అంతర్జాతీయ సంఘ బృందాన్ని భారతదేశానికి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. మూలసర్వస్థివాద భిక్షుని మండలి పునఃస్థాపనను వ్యతిరేకించే సంకుచిత మనస్తత్వం గల టిబెట్ పెద్దలతో ఈ విషయాన్ని చర్చిద్దాం.

బుద్ధుడు ఈ రోజు ఇక్కడ ఉండి ఉంటే నిస్సందేహంగా దీనికి అనుమతి ఇచ్చేవాడు. కానీ నేను బుద్ధుడిగా నటించలేను. ఎనిమిదవ శతాబ్దం నుంచి టిబెట్ లో సన్యాసం ఉన్నప్పటికీ, మూడు సంఘ ఆచారాలు చేసే భిక్షునిలు మన మధ్యలో ఎప్పుడూ లేరు, కాబట్టి ఇప్పుడు ఇది జరుగుతుంది. కానీ సన్యాసం తీసుకోవడం గురించి ఇప్పుడే మనం ఏ నిర్ణయం తీసుకోలేము.

ఈ సంవత్సరం ఈ మూడు భిక్షుని సంఘ పద్ధతులను ప్రారంభించడం కష్టం కావచ్చు, కానీ వచ్చే సంవత్సరం నాటికి వాటిని ప్రారంభించాల్సి ఉంటుంది. భిక్షుని ప్రతిమోక్ష ఇప్పటికే చైనీస్ నుంచి టిబెటన్ భాషలోకి అనువదించబడింది. ఇది ముప్పై నుంచి నలభై పేజీల మధ్య ఉంటుంది. టిబెటన్ ధర్మగుప్తక భిక్షునిలు దీన్ని చాలా మక్కువతో నేర్చుకోవాలి. ఈ మూడు సంఘ ఆచారాలకు సంబంధించిన అసలైన ఆచార గ్రంథాలను ఇంకా అనువదించాల్సి ఉంది.

టిబెటన్ సన్యాసినులు మూలసర్వస్థివాద భిక్షునిలుగా ఉండాలని కోరుకున్నప్పటికీ, ధర్మగుప్తక భిక్షుని నామకరణాన్ని మూలసర్వస్థివాదగా అంగీకరించలేము. ఈ రెండూ పరస్పరం మార్చుకోగలిగితే టిబెట్ లో మహాసంఘిక భిక్షువును ఇవ్వొద్దని అతిషాను కోరడానికి కారణం లేకపోలేదు. [క్రీ.శ. 11వ శతాబ్దం ప్రారంభంలో భారత గురువు అతిషాను రాజు జంగ్చుబ్ వో టిబెట్ కు ఆహ్వానించినప్పుడు, ఆ రాజు తాత యేషే వో అప్పటికే తన రాజ్యంలో మూలసర్వస్థివాద భిక్షు సన్యాసుల పునఃస్థాపనకు ఈస్టిండియా గురువు ధర్మపాలుడి ఆహ్వానం పొంది, తదనంతర సందర్శనతో స్పాన్సర్ చేశాడు. టిబెట్ కు రెండు వినయ వంశాలు పరిచయం అవుతాయి కాబట్టి మహాసంఘిక భిక్షువును ప్రదానం చెయ్యవద్దని అతిషాను అతను అభ్యర్థించాడు.]

అంతేకాక ధర్మగుప్తక సన్యాసం మూలసర్వస్థివాద సన్యాసం అయితే, థెరవాడ సన్యాసం కూడా మూలసర్వస్థివాద సన్యాసమే అవుతుంది. ఇది అసంబద్ధం. పూర్తిగా మూలసర్వస్థివాద వినయం ప్రకారమే మూలసర్వస్థివాద భిక్షుని సన్యాసాన్ని మళ్ళీ స్థాపించాల్సి ఉంది.

ఈ శీతాకాలంలో, మనం ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తాం, అది భారతదేశంలో - బోధ్ గయ, సారనాథ్ లేదా ఢిల్లీలో కానీ. ఈ హాంబర్గ్ సమావేశానికి హాజరైన అంతర్జాతీయ సంఘ పెద్దలతో పాటు, మనం అన్ని అగ్రశ్రేణి టిబెటన్ సంఘ నాయకులను మరియు నాలుగు టిబెటన్ సంప్రదాయాలకు చెందిన ప్రధాన మఠాల మఠాధిపతులందరినీ బోంపోలతో సహా ఆహ్వానిస్తాము. బొంపోలలో ఇప్పటికే భిక్షునిలు ఉన్నారు. సీనియర్, అత్యంత గౌరవనీయులైన భిక్షు పండితులను కలిసి వంద మందిని మనం ఆహ్వానిస్తాం. అప్పుడు భిక్షుని మండలి పునఃస్థాపనకు అనుకూలంగా తమ సహేతుకమైన వాదనలను వ్యక్తిగతంగా వారి ముందు చెప్పమని అంతర్జాతీయ సంఘ పెద్దలను కోరుతున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. టిబెటన్లమైన మనం అటువంటి సదస్సుకు ఆర్థిక సహాయం చేస్తాము మరియు దీన్ని ఎవరు నిర్వహించాలో నిర్ణయిస్తాము.

గత ఇరవై ఆరు శతాబ్దాలుగా అభిధర్మ పాళీ, సంస్కృత వెర్షన్ల మధ్య అనేక తేడాలు ఏర్పడ్డాయి. నాగార్జునుడు కొన్ని విషయాలపై స్పష్టతను ఇచ్చాడు. ఈ రెండు సంప్రదాయాల మధ్య ఇతర స్పష్టమైన తేడాలను పరీక్ష ఆధారంగా స్పష్టం చెయ్యవచ్చు. ఉదాహరణకు మేరు పర్వతం గురించి, భూమి చదునుగా ఉండటం గురించి, సూర్యచంద్రులు దాదాపు ఒకే పరిమాణంలో భూమికి సమాన దూరంలో ఉండటం. వీటి గురించి బుద్ధుని మాటలను పరిశీలించే స్వేచ్ఛను మనం తీసుకోవచ్చు. ఇవి ఒప్పుకోదగినవి కావు. లాసాలోని నా గురువులు కూడా చంద్రునిపై ఉన్న పర్వతాలను నా టెలిస్కోప్ నుంచి చూసి అభిధర్మ చెప్పినట్లుగా చంద్రుడు తన కాంతిని మనకు ఇవ్వడం లేదని అంగీకరించవలసి వచ్చింది. కాబట్టి, నాగార్జునుడి వివరణల కోసం సంఘ చర్చ అవసరం పడలేదు. సూత్రాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. కానీ వినయ విషయానికి వచ్చేసరికి ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది.

వినయ గ్రంథాల అనువాదాలన్నీ సర్వజ్ఞుడైన దేవునికి నమస్కారంతో ప్రారంభమవుతాయి. అంటే సర్వజ్ఞుడైన బుద్ధుడికి మాత్రమే ఏ పనులు చెయ్యాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసు కాబట్టి బుద్ధుడే స్వయంగా ఆ గ్రంథాలను ధృవీకరించాడు. మరోవైపు అభిధర్మ గ్రంథాల్లో మంజుశ్రీకి నమస్కారం చెయ్యడం ఉంటుంది. అలాగే, పరిణిర్వాణతో బుద్ధుడు మరణించిన తర్వాత, ఒక సంఘాన్ని నిర్వహించి, దాని ద్వారా వినయలో కొన్ని మార్పులను చేశారు. బుద్ధుడు ఇలా చెయ్యడానికి అనుమతించాడు మరియు దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఉదాహరణకు, టిబెటన్లు బోధిసత్వాయణం మరియు తంత్ర యానాన్ని ఆచరిస్తారు, ప్రతి ఒక్కరూ వారి ప్రతిజ్ఞలతో ఆచరిస్తారు. వాటిలోనూ, వినయలోనూ కొన్ని విషయాలు, సూత్రాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కిందిస్థాయి ప్రతిజ్ఞల కంటే ఉన్నత ప్రమాణాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి.

21వ శతాబ్దంలో యుద్ధ భావన కాలం చెల్లింది. దానికి బదులుగా, వివాదాలను పరిష్కరించడానికి మనకు చర్చలు అవసరం మరియు వాటికి మన తెలివితేటలు సరిపోవు. ఇతరుల సంక్షేమం పట్ల మనకు ఆప్యాయత, శ్రద్ధ కూడా అవసరం. చిత్తశుద్ధితో కూడిన పనులకు కరుణ ముఖ్యం. బయోలాజికల్ విషయం కారణంగా, పురుషుల కంటే మహిళలు ఇతరుల బాధలకు ఎక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకు, మహిళలు వధకులు లేదా కసాయిదారులు కాదు. అందువల్ల, అంతర్జాతీయ చర్చలకు, మహిళలు చాలా అవసరం మరియు వీటిలో పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.

బుద్ధుని శిష్యులలో భిక్షువులు, భిక్షునిలు, ఉపాసకులు, ఉపాసికులు ఉన్నారు. ఇక్కడ స్త్రీ, పురుషులు సమాన పాత్రను పోషిస్తారు. కానీ, ప్రస్తుతం టిబెటన్లలో, ఫోర్ ఫోల్డ్ కమ్యూనిటీ అసంపూర్తిగా ఉంది. ఒక అమూల్యమైన మానవ పునర్జన్మ యొక్క ఎనిమిది మరియు పది లక్షణాలలో ఒకటి భౌగోళికంగా లేదా ఆధ్యాత్మికంగా నిర్వచించబడిన మధ్య భూమిలో జన్మించడం. టిబెట్ భౌగోళికంగా నిర్వచించబడిన మధ్య భూభాగం కాదు. ఆధ్యాత్మికంగా నిర్వచించబడిన భూమి విషయానికొస్తే, ఇది నాలుగు విధాల శిష్యుల సంఘం పరిపూర్ణమైన దానిలో ఒకటి. భిక్షునిలు లేకుండా ఇది అసంపూర్ణమైనది. భిక్షువులు ఉంటే, నాలుగు సమూహాలలో భిక్షువులు అత్యంత ముఖ్యమైనవారు కాబట్టి ఇది మధ్య భూమి అని చాలా మంది టిబెటన్లు చెబుతారు. కానీ అది కేవలం ఒక భూమి యొక్క సారూప్యతను మరియు విలువైన మానవ పునర్జన్మ యొక్క సారూప్యతను మాత్రమే చెప్తుంది. టిబెట్ లోని పూర్వపు యజమానులు దీనిపై దృష్టి పెట్టి ఉండాల్సింది.

ఒక సంఘ గ్రూప్ ని సంప్రదించకుండా, టిబెటన్ సన్యాసినులలో విద్య మెరుగుదలకు నేను ఒక ప్రారంభం చెయ్యగలను. నేను దీన్ని ఇప్పటికే చేశాను మరియు చాలా మంది సన్యాసినులు ఉన్నత స్థాయికి కూడా చేరుకున్నారు. ముండ్గోడ్ లోని మఠాలలో, మనం గెషెమా పరీక్షకు సన్నాహాలు చెయ్యాలని నేను చెప్పడం జరిగింది. కొందరు సీనియర్ సన్యాసులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు, కాని బుద్ధుడు భిక్షువులు మరియు భిక్షునిలుగా మారడానికి స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాడని నేను వాళ్ళకు చెప్పాను, కాబట్టి గెషెలు మరియు గెషెమాలుగా మారడానికి సమాన హక్కు ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ నేను అనుకుంటున్న సమస్య ఏమిటంటే, ఈ సీనియర్ సన్యాసులు ఇలాంటి ఆలోచనలకు అలవాటు పడలేదు.

అరవయ్యో దశకం ప్రారంభంలో సన్యాసులనే కాదు సన్యాసినులను కూడా పిలిపించి, ద్వైమాసిక సోజోంగ్ వేడుకలో వాళ్ళు కూడా పాల్గొనవచ్చని నేను చెప్పాను. ఆ సంవత్సరాలలో భిక్షునిలు ఎవరూ లేరు, కాబట్టి శ్రమనేరిక కొత్త సన్యాసినులను సాధారణంగా సన్యాసుల సోజోంగ్ లోకి అనుమతించనప్పటికీ, నా గురువులు వారికి అనుమతిని ఇచ్చారు. అందుకే మేము అలా చెయ్యడం మొదలుపెట్టాము. సన్యాసులు, సన్యాసినులు కలిసి సోజోంగ్ చెయ్యడం ఎప్పుడూ జరగలేదు కాబట్టి దక్షిణ భారతదేశంలోని మఠాల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. కానీ ఆ కారణంగా సన్యాసులెవరూ వెనుకాడలేదు!

70వ దశకం నుంచి కొందరు టిబెటన్లు భిక్షుని సంప్రదాయాన్ని చైనా సంప్రదాయం నుంచి స్వీకరించారు. నేను తైవాన్ లో పర్యటించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అక్కడ భిక్షుని వంశాన్ని స్వయంగా చూడటం మరియు దాని పరిస్థితిని చెక్ చెయ్యడం. భిక్షుని ప్రతిజ్ఞను పరిశోధించడానికి నేను లోసాంగ్ సెరింగ్ ను నియమించాను మరియు అతను ఇరవై సంవత్సరాలుగా దీన్ని చేస్తున్నాడు. మా తరపునుంచి మేము ఎక్కువ ప్రయత్నం చేసాము. భిక్షువులను అంతర్జాతీయ సంఘ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యమని నేను ప్రధాన చైనీయులను కోరాను, కాని వాళ్ళు అలా చెయ్యలేకపోయారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుంచి వచ్చే ఇబ్బందులు, కష్టాల కారణంగా నేను అలాంటి సమావేశాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయాను. అలాంటి సమావేశాన్ని ఇంకొక సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుని జంపా చోద్రోన్ ను అలా చెయ్యమని అడిగాను. ఒక సన్యాసి చెయ్యగలిగినదంతా జరిగిపోయింది. ఇప్పుడు మనకు టిబెటన్ భిక్షు పెద్దల నుంచి విస్తృత సన్యాస ఏకాభిప్రాయం అవసరం.

కొత్త సన్యాసి, సన్యాసినుల సంప్రదాయాలలో, ఆరాధన యొక్క సరైన విషయాలను తెలుసుకోవాలని చెప్పబడుతుంది. ఆ వ్రతం పరంగానే భిక్షువులు శ్రేష్ఠులు అని చెబుతుంది. బోధిసత్వ, తాంత్రిక ప్రతిజ్ఞలను, ముఖ్యంగా మహిళలను కించపరచకూడదనే తాంత్రిక ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకుని దీన్ని కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ కోణం నుంచి చూస్తే ఈ వినయ విషయాన్ని ఉంచడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి, మూడు సెట్ల ప్రతిజ్ఞలకు అనుగుణంగా, కొన్ని చిన్న విషయాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మూలసర్వస్థివాద భిక్షుని వ్రతాలను తీసుకునే ముందు వాటిని అధ్యయనం చేస్తే ధర్మగుప్తక వంశంలో భిక్షులుగా మారిన వారు వాటిని చదివి అధ్యయనం చెయ్యవచ్చు, అయినా కానీ వాళ్ళు తమ ఆచారాలను ధర్మగుప్తక ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, భిక్షుయేతరులు ఈ వ్రతాలను అభ్యసించడంలో ఇప్పటికీ ఒక సమస్య ఉంది.

ఈ మార్పులన్నిటిలోనూ, ముఖ్యంగా మూలసర్వస్థివాద భిక్షుని వ్యవస్థను తిరిగి స్థాపించే విషయంలోనూ, ఇది కేవలం టిబెట్ సంఘంలో కొందరు మాత్రమే చెయ్యకూడదని చెప్పబడింది. మనం సంఘంలో తేడాలు రాకుండా చూసుకోవాలి. టిబెట్ సంఘంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరం, ఆ దిశగా తర్వాతి పనులు చేపట్టాల్సి ఉంటుంది. మీ అందరి సహాయానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Top