అహింస మార్గమే సరైన మార్గం

గొడవలను పరిష్కరించడానికి మరియు శాంతిని తీసుకురావడానికి అహింస అనేది ఒక రియలిస్టిక్ మార్గం. కరుణ అనేది ప్రాథమిక మానవ స్వభావం అని శాస్త్రీయ పరిశోధనలకు అనుగుణంగా ఉంటుంది. మనం గత శతాబ్దాల చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే, హింస అనేది ఇంకా ఎక్కువ ద్వేషాన్ని మరియు ఎక్కువ నెగెటివ్ భావోద్వేగాలను మాత్రమే తెస్తుందని మనం చూడవచ్చు. హింసను ఎదుర్కోవడానికి హింసను ఉపయోగిస్తే, దాని వల్ల ఏ పాజిటివ్ ప్రభావం ఉండదు. యూరోప్ లో హింస సరైన పద్ధతి కాదని నాయకులు తెలుసుకున్నారు. వాళ్ళు చాలా బాగా ఆలోచించి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, యూరోపియన్ యూనియన్ ను ప్రారంభించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్, జర్మనీలు శత్రువులుగా ఎలా ఉండేవో నేను అందరికి చెప్తూ ఉంటాను. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉన్న నా స్నేహితుడు మరియు ట్యూటర్, కార్ల్ ఫ్రెడరిక్ వాన్ వీజాకర్ 90 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు ఇలా చెప్పాడు - తన చిన్నతనంలో, జర్మన్లు ఫ్రెంచ్ వారందరినీ శత్రువులుగా భావించేవారని, ఫ్రెంచ్ వారు కూడా జర్మన్లందరినీ శత్రువులుగా భావించేవారని చెప్పాడు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ పూర్తిగా మారిపోయాయి.

ప్రజలు లోతైన అనుభవాన్ని పొందుతూ ఇంక హింస పోయిందని గ్రహించారు. హింస అనేది "మనం" మరియు "వాళ్ళు" అనే భావనలపై బలంగా ఆధారపడి ఉంటుంది మరియు దాని ఆధారంగా, యుద్ధాలు వస్తాయి. కానీ పొరుగు దేశాలన్నింటినీ ఒకే కమ్యూనిటీగా పరిగణించి యూరోపియన్ యూనియన్ ను ప్రారంభించడం జరిగింది. యూరోపియన్ యూనియన్ ప్రారంభమైనప్పటి నుంచి, ఐరోపాలో గొడవలు యుద్ధానికి దారితీసే ప్రమాదం లేదని నేను ఎప్పుడూ చెబుతాను. యూరోపియన్ యూనియన్ లేకపోతే, బహుశా ఈపాటికి కొన్ని తీవ్రమైన సమస్యలు వచ్చి ఉండేవి. కానీ ప్రజలు అహింసాత్మకంగా ఉంటూ వారి ప్రాథమిక మానవ స్వభావానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.

ప్రజల ఆలోచనలు 20 వ శతాబ్దం మొదట్లో మరియు ఆఖరిలో చాలా బాగా మారిపోయాయి. ఉదాహరణకు, పోలాండ్ లో జరిగిన సాలిడారిటీ మూవ్ మెంట్ నే తీసుకుందాం. అక్కడ 200,000 మంది రష్యన్ సైనికులు ఉన్నారు, కాని ఆ ప్రజలు అహింసాయుత పద్ధతులతో దురాక్రమణతో పోరాడాలని అనుకున్నారు. హింస ద్వారా ఎన్నో బాధలు అనుభవించిన అక్కడి ప్రజలు అహింసే ఉత్తమమైన పద్ధతి అని గ్రహించారని ఇలాంటి విషయాలు స్పష్టమైన సంకేతాలు.

రష్యా కూడా యూరోపియన్ యూనియన్ లో చేరాలని నేను కోరుకున్నాను. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోనూ EU స్ఫూర్తి మొదలవ్వాలని నేను అనుకున్నాను. ఆఫ్రికాలో చాలా రకాల దేశాలు ఉన్నాయి, కాబట్టి మొదట ఇది కేవలం ఉత్తర ఆఫ్రికాతో ప్రారంభించి, తర్వాత మధ్య, తూర్పు, పశ్చిమ మరియు దక్షిణ ఆఫ్రికాను చేర్చడానికి విస్తరించవచ్చు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం! అలా, ప్రపంచం మొత్తం ఒకే యూనియన్ గా ఉండాలనేది మన లక్ష్యం కావాలి. ఇది కుదురుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నా కల.

అందుకు భారత్ ఒక మంచి ఉదాహరణ. భారతదేశం ఉత్తర, మధ్య, తూర్పు, పడమర మరియు దక్షిణ ప్రదేశాల కలయిక. అన్ని రాష్ట్రాలు వేర్వేరు దేశాల్లా, వాటి స్వంత భాషలు, లిపిలతో ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు ఒక యూనియన్ ను ఏర్పరుస్తారు. నా కల - ఒక ఖాళీ కల కావొచ్చు - భారతదేశం, చైనా మరియు జపాన్ ఏదో ఒక రోజు ఒకే యూనియన్ గా ఏర్పడతాయి అని నేను అనుకుంటున్నాను, ఇదే నా కల. యూనియన్ అనే కాన్సెప్ట్ అహింస అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది.

ఈ శతాబ్దం చర్చల శతాబ్దం కావాలి. వ్యక్తులకు వేర్వేరు ఆలోచనలు ఉన్నప్పుడు, చర్చలు జరగాలి, ఆయుధాలను ఉపయోగించకూడదు. అది కుదురుతుంది. ముందుగా అణ్వస్త్ర నిర్మూలన జరగాలి. ఇది చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికాలో జరగాల్సిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల సమావేశం సందర్భంగా, అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నందుకు, రోమ్ కు తరలించి, అణ్వస్త్ర నిర్మూలనను ఎలా తీసుకురావాలో మేము మాట్లాడాము. ఆ సమయంలో, దాని కోసం ఒక టైమ్ టేబుల్ ను నిర్ణయించి, దానికి అణ్వస్త్ర శక్తులను సమయ నియామాలను పాటించాలని నేను సూచించాను. కానీ ఏమీ జరగలేదు. "అణ్వస్త్ర నిర్మూలన" - ఇది చాలా మంచి విషయం, కానీ ఒక స్థిరమైన టైమ్ టేబుల్ లేకుండా అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. అప్పుడు అది ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారితే, బహుశా దాన్ని సాధించవచ్చు. ఆ తర్వాత, మనం అన్ని దాడి చేసే ఆయుధాలను నిర్మూలించాలి, ఆ తర్వాత రక్షణాత్మక ఆయుధాలను తీసేయాలి. శాంతియుత ప్రపంచాన్ని సాధించాలంటే అంచెలంచెలుగా బలగాలను మనం ఉపసంహరించుకోవాలి. 

బయట శాంతిని సాధించడానికి, ముందుగా మనం అంతర్గతంగా కూడా ఆలోచించాలి. ఇక్కడ చాలా కోపం, అసూయ, అత్యాశ ఉంటాయి. కాబట్టి, మనకు బయటి నిర్మూలన మరియు అంతర్గత నిర్మూలన రెండూ అవసరం. అంతర్గత నిర్మూలన విద్య ద్వారా వస్తుంది. మంచి దయగల మనస్సుతో, మన శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

దీనికి సంబంధించి చిరునవ్వు కూడా చాలా ముఖ్యం. ప్రజలు చిరునవ్వును చూడటానికి ఇష్టపడతారు, సీరియస్ ముఖాన్ని కాదు. పిల్లలు మరియు కుక్కలు కూడా చిరునవ్వును ఇష్టపడతాయి. మీరు కుక్కను చూసి నవ్వినప్పుడు, అది దాని తోకను ఊపుతుంది. మీరు కుక్కకు ఆహారం తినిపిస్తే మరియు చాలా సీరియస్ గా చూస్తే, ఆ కుక్క ఆహారం తిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సామాజిక జంతువులకు సామాజిక బాధలు ఉన్నాయి ఎందుకంటే వాటి జీవితం సమాజంలోని మిగిలిన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మానవులమైన మనం సామాజిక జంతువులం మరియు ప్రపంచం మొత్తం మన సమాజం. ఈ ఆలోచనా విధానంతో ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది. అప్పుడు భిన్న అభిప్రాయాలు, విభిన్న ఆసక్తులు ఉన్నప్పటికీ, ఎలా ముందుకు సాగాలనే దానిపై మనం కొంత అంగీకారానికి రావచ్చు.

మొదట, మనం ఇతరుల, మన సోదర సోదరీమణుల హక్కులను గౌరవించాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ భూమ్మీద అందరం కలిసి జీవించాలి. ఐరోపా యూనియన్ లో తూర్పు, పశ్చిమాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి, ఉత్తర, దక్షిణాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందరి భవిష్యత్తు వేరొకరిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ సరిహద్దులు అంత ముఖ్యమైనవి కావు.

గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక తీవ్రమైన సమస్య. ఇది ఇలాగే కొనసాగితే, వచ్చే శతాబ్దంలో ప్రపంచంలో మనం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను సన్యాసిని, కాబట్టి నాకు పిల్లలు లేరు. కానీ తల్లిదండ్రులు, తాతయ్యలు అయిన మీకు మీ పిల్లలు, మనవరాళ్ల పట్ల ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి గ్లోబల్ వార్మింగ్ ను సీరియస్ గా తీసుకోండి.

అలాగే, మనుషుల జనాభా కూడా పెరుగుతోంది. నేను ఇండియాకు వచ్చినప్పుడు అది ఆరు బిలియన్లు. ఇప్పుడు అది ఏడు బిలియన్లకు చేరింది. ఈ శతాబ్దం చివరి నాటికి ఇది పది బిలియన్లకు చేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి, పర్యావరణం మరియు సమాజంతో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించండి.

సమస్యలను పరిష్కరించడానికి అహింసాయుత మార్గాలు మాత్రమే సరైనవి. భారతదేశంలో, అహింస మరియు లౌకిక నీతి యొక్క పురాతన భారతీయ ఫిలాసఫీని పునరుద్ధరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. భారతదేశం అహింసకు పుట్టినిల్లు. 3,000 సంవత్సరాలకు పైగా అక్కడ మత సామరస్యం ఉంది. ఆఫ్ఘనిస్థాన్, సిరియా తదితర దేశాల్లోని సున్నీ, షియా మిత్రులకు భారతీయ ముస్లింలు సహాయం చెయ్యాలని నేను కోరాను. భారతదేశంలో సున్నీ, షియాల మధ్య ఎలాంటి సమస్యలు లేవు. భారతదేశంలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, పార్శీలు మొదలైన వారు చాలా సామరస్యంగా జీవిస్తున్నారు. ఇలా మత సామరస్యాన్ని పెంపొందించేందుకు నేను కొన్ని పనులను చేపట్టాను.

భౌతిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. భారతదేశంలో, ఆధునిక భౌతిక విద్యను అహింస, నైతిక బాధ్యత మరియు భావోద్వేగ జ్ఞానం యొక్క పురాతన సంప్రదాయాలతో కలపడం చాలా సులభం. భావోద్వేగాలకు సంబంధించి భారతదేశం దాని పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించడంలో సహాయపడటానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. చైనాకు కూడా పురాతన సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 400 మిలియన్ల మంది బౌద్దులు ఉన్నారు. భారత్, చైనాలను కలిపితే అది చాలా ఎక్కువ జనాభా.

అంచెలంచెలుగా, వివిధ వృత్తులను ఉపయోగించి, మనం ఒక శాంతియుతమైన, దయగల ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. కాబట్టి, 21వ శతాబ్దం రెండవ సగంలో ఇంకా శాంతియుతంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నా వయసు 84, కాబట్టి ఇంకొక పది, ఇరవై ఏళ్లలో నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకోవాల్సిన సమయం వస్తుంది. కానీ మనం ఇప్పుడు దృష్టి పెట్టి ఆచరణాత్మక పద్ధతులను ప్రారంభించాలి. అంతే. ధన్యవాదాలు. 

Top