మనమందరం సుమారు 2,500 సంవత్సరాల క్రితం భారతదేశంలో నివసించిన మరియు బోధించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన బుద్ధుడి గురించి విన్నాం. కానీ శాక్యముని బుద్ధుడిగా పిలువబడే చారిత్రక బుద్ధుడు ఒక్కడే కాదు. బౌద్ధమతంలో, లెక్కలేనంత మంది బుద్ధులు ఉన్నారు, నిజానికి, బౌద్ధమతం యొక్క ఒక ముఖ్య బోధన ఏమిటంటే, విశ్వంలోని ప్రతి జీవికి బుద్ధుడు అయ్యే సామర్థ్యం ఉంది.
Who is buddha 01

చారిత్రక బుద్ధుడు

చాలా సాంప్రదాయ బయోగ్రఫీల ప్రకారం, బుద్ధుడు అయిన వ్యక్తి క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని కులీన శాక్య వంశంలో జన్మించాడు. అతనికి సిద్ధార్థ గౌతముడు అని పేరు పెట్టారు, అతని పుట్టిన రోజున, అసిత అనే తెలివైన సన్యాసి ఈ చిన్న పిల్లవాడు గొప్ప రాజు లేదా గొప్ప మత గురువుగా అవుతాడని ప్రకటించాడు. సిద్ధార్థుని తండ్రి శుద్ధోధనుడు శాక్య వంశానికి అధిపతి, తన చిన్న కుమారుడు అతని అడుగుజాడల్లో నడవాలని అనుకుని, తన కొడుకును గొప్ప రాజుగా అవ్వకుండా అడ్డం వచ్చే అన్నిటి నుంచి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. 

ఆ యువ సిద్ధార్థుడిని వాళ్ళ కుటుంబ రాజభవనంలో ఒంటరిగా ఉంచి పూర్తి విలాసవంతమైన జీవితాన్ని అందించారు: విలువైన ఆభరణాలు మరియు అందమైన స్త్రీలు, తామర చెరువులు మరియు ఆహ్లాదకరమైన జంతువులు ఇచ్చారు. రోగులు మరియు వృద్ధులు రాజభవనంలోకి ప్రవేశించనివ్వకుండా, అతనికి ఎలాంటి కష్టాన్ని తెలియకుండా పెంచాడు. కాలక్రమేణా, సిద్ధార్థ తన చదువులో మరియు క్రీడలలో రాణించి యశోధరను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకు రాహుల అనే కుమారుడు జన్మించాడు.

దాదాపు 30 ఏళ్ల పాటు ఒక విలాసవంతమైన జీవితం గడిపిన సిద్ధార్థుడుకి ఆ ప్యాలెస్ గోడల బయట ఏం ఉందో అన్న కుతూహలం పెరిగింది. "ఈ భూమి నాదే కాబట్టి, నేను దానిని, మరియు నా ప్రజలను తప్పకుండా చూడాలి" అని అనుకున్నాడు. చివరికి శుద్ధోధనుడు తన కుమారుడిని రాజభవనం బయట విహారయాత్రలకు తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేశాడు. వీధులు శుభ్రం చేశారు, వ్యాధిగ్రస్తులు మరియు వృద్ధులను దాచేశారు, మరియు సిద్ధార్థను అతని రథసారథి చెన్నా వీధుల గుండా తీసుకెళ్లాడు, అక్కడి స్థానిక ప్రజలు చేతులు ఊపుతూ అతనిని చిరునవ్వుతో స్వాగతించారు. అయినా ఆ జనం గుంపులో సిద్ధార్థుడు రోడ్డు పక్కన ఉన్న ఒక ముసలి మనిషిని గమనించాడు. ఆశ్చర్యంగా, దిగ్భ్రాంతిగా చూసి అతనికి ఏమైంది అని చెన్నాను అడిగాడు. "మీరు చూస్తున్నది ఒక ముసలివాడిని, మనకి కూడా అలాంటి విధి ఎదురు చూస్తూ ఉంది" అని చెప్పాడు చెన్నా. ఇంకా ముందుకు వెళ్ళాక, సిద్ధార్థుడికి ఒక రోగి మరియు ఒక శవం కనిపించాయి. వాళ్లిద్దరూ కళ్ళు తెరిచే ఉన్నారు. అది జీవితంలో అతనికి కూడా వచ్చే భవిష్యత్తు సంఘటన అని అర్ధం అయ్యింది.

చివరికి, బాధల నుండి విముక్తి కోసం వెతుకుతున్న ఒక పవిత్ర వ్యక్తిని అతను కలుసుకున్నాడు. ఈ మొదటి మూడు దృశ్యాలు చూశాక సిద్ధార్థుడికి రాజభవనంలో మోసపోతూ, ఈ అన్ని బాధల నుంచి రక్షించబడ్డాడని గ్రహించాడు. ఆ పవిత్రుని దృశ్యం బాధ నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించే అవకాశం కోసం అతన్ని మేల్కొల్పింది.

సిద్ధార్థుడు ఇంతకు ముందు వృద్ధులను లేదా అనారోగ్యంతో ఉన్నవారిని ఎప్పుడూ కలుసుకోలేదు, కానీ అతను - నిజానికి, మనమందరం - సాధారణంగా బాధలను ఎలా పట్టించుకోకుండా మన జీవితాన్ని గడుపుతున్నామో అలా గడిచిపోయింది. రాజభవనానికి తిరిగి చేరుకున్న సిద్ధార్థుడికి చాలా అసౌకర్యం కలిగింది. తన ప్రియమైన వారితో హాయిగా జీవితాన్ని గడిపాడు, కానీ ఒక రోజు, తను మరియు అతని కుటుంబం వృద్ధులు అవుతారని, అనారోగ్యానికి గురవుతారని మరియు మరణిస్తారని తెలిసుకుని అతను అందరి కోసం ఒక మార్గాన్ని వెతకాలనే తపనతో, అతను ఒక రాత్రి రాజభవనం నుండి తప్పించుకుని వెళ్లి ఒక సన్యాసి జీవితాన్ని గడిపాడు.

సిద్ధార్థుడు ఎందరో గొప్ప గురువులను కలుసుకున్నాడు, వారి మార్గదర్శకత్వంలో ధ్యానం ద్వారా అధిక స్థాయి ఏకాగ్రతను సాధించినప్పటికీ, ఈ ధ్యానం అతని బాధలను తగ్గించకపోవడంతో అతను అసంతృప్తిగా ఉన్నాడు. అతను సన్యాస పద్ధతులను నేర్చుకున్నాడు. ఆహారం తినకుండా అన్ని శారీరక సౌకర్యాలను వదిలేసుకొని తన ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపాడు. ఆరేళ్ల పాటు ఈ పద్ధతుల్లో నిమగ్నమైన అతని శరీరం చాలా సన్నగా మారింది, అప్పుడు అతని శరీరం చర్మం యొక్క సన్నని పొరతో కప్పబడిన అస్థిపంజరంలా అయిపోయింది.

ఒక రోజు, నది పక్కన కూర్చొని, ఒక ఉపాధ్యాయుడు తన చిన్న పిల్లవాడికి వాయిద్యాన్ని ఎలా వాయించాలో నేర్పించడాన్ని అతను విన్నాడు: "తీగలు చాలా వదులుగా ఉంచకూడదు, లేకపోతే నువ్వు ఈ వాయిద్యాన్ని సరిగ్గా వాయించలేవు. ఎందుకంటే, అవి చాలా గట్టిగా ఉండవు, అవి తెగిపోతాయి" అని. దీనితో సిద్ధార్థుడు తన సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలించలేదని గ్రహించాడు. ఆ రాజభవనంలో విలాసవంతమైన జీవితం లాగా, ఈ సన్యాస పద్ధతులు చాలా కఠినమైనవి, అయినా కానీ ఇవి అతని బాధలను అధిగమించేలా చెయ్యలేదు. అసలైన సమాధానం కావాలని అతను అనుకున్నాడు.

ఆ సమయంలో సుజాత అనే ఒక యువతి వచ్చి సిద్ధార్థుడికి పాల అన్నం పెట్టింది. అది అతని ఆరేళ్లలో తిన్న మొదటి ఆహారం అయ్యింది. అతను తోటి సన్యాసి మిత్రులను అబ్బురపరిచి ఆ భోజనం చేసి ఒక అంజీర చెట్టు కింద కూర్చొన్నాడు. "నాకు పూర్తి జ్ఞానోదయం అయ్యే వరకు నేను ఇక్కడి నుంచి లేవను" అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు బోధి వృక్షంగా పిలువబడే ఆ చెట్టు క్రింద సిద్ధార్థుడు సంపూర్ణ జ్ఞానోదయాన్ని పొంది, మేల్కొన్న బుద్ధుడుగా ప్రసిద్ధి చెందాడు.

జ్ఞానోదయం పొందిన వెంటనే బుద్ధుడు నాలుగు ఉదాత్త సత్యాలు, ఎనిమిది మార్గాలపై బోధనలు చేశాడు. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు అతను ఉత్తర భారతదేశంలో పర్యటించి తాను సాధించిన సాక్షాత్కారాలను ఇతరులకు బోధించాడు. అతను సంఘం అని పిలువబడే ఒక సన్యాస వ్యవస్థను స్థాపించాడు. ఇది బుద్ధుని బోధనలను భారతదేశం అంతటా మరియు ఆసియా నుంచి ప్రపంచం అంతటా వ్యాప్తి అయ్యాయి.

బుద్ధుడు తన 80వ వయస్సులో కుషినగర్ లో మరణించాడు. అలా జరగడానికి ముందు, సంఘం వారికి అతని బోధనలలో ఏవైనా సందేహాలు ఉన్నాయా లేదా ఇంకేమైనా వివరణలు అవసరమా అని అతను అడిగాడు. ధర్మాన్ని, నైతిక స్వీయ క్రమశిక్షణను నమ్మమని తన అనుచరులకు సలహా ఇస్తూ, ఆయన ఇలా తన చివరి మాటలను చెప్పాడు: "ఓ సన్యాసులారా, ఇదే మీకు నా చివరి సలహా. ప్రపంచంలోని అన్ని విషయాలను మనం మార్చవచ్చు. అవి శాశ్వతం కాదు. మీ స్వంత మోక్షాన్ని పొందడానికి బాగా కష్టపడండి" అని. తర్వాత అతను కుడి వైపుకు పడుకుని తనువు చాలించారు.


బుద్ధులు అంటే అసలు ఏమిటి?

మనం చారిత్రక బుద్ధుడు ఎవరో తెలుసుకున్నాం, కానీ అసలు నిజానికి బుద్ధుడిలా ఉండటం అంటే ఏమిటి?

సింపుల్ గా చెప్పాలంటే బుద్ధుడు అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి. బుద్ధులు గాఢనిద్ర నుంచి మేల్కుంటారు. ఇది రాత్రి పార్టీ చేసుకుని మనం అనుకునే గాఢమైన నిద్ర కాదు, మన జీవితంలోని ప్రతి క్షణం ఉండే గందరగోళం యొక్క గాఢ నిద్ర; మనం నిజంగా ఎలా ఉన్నాము, నిజానికి ప్రతిదీ ఎలా ఉంది అనే దానిపై గందరగోళం.

బుద్ధులు దేవుళ్లు కాదు, సృష్టికర్తలు కూడా కాదు. బుద్దులందరూ మొదట్లో మనలాగే గందరగోళం, కలవరపరిచే భావోద్వేగాలు మరియు అనేక సమస్యలతో నిండి ఉంటారు. కానీ, కరుణ మరియు జ్ఞానం యొక్క మార్గాన్ని నెమ్మదిగా అనుసరించడం ద్వారా, ఈ రెండు సానుకూల లక్షణాలను పెంపొందించుకుని వాళ్ళకు వాళ్ళే జ్ఞానోదయం పొందుతారు.

బుద్ధులకు మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:

  1. జ్ఞానం - బుద్ధుడికి మానసిక అవరోధాలు ఏమీ ఉండవు, కాబట్టి వారు ప్రతి దాన్ని పూర్తిగా మరియు సరిగ్గా అర్థం చేసుకుంటారు, ముఖ్యంగా ఇతరులకు ఎలా సహాయం చెయ్యాలి అని. 
  2. కరుణ - పైన ఉన్న జ్ఞానంతో, మనమందరం ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నామని తెలుసుకుని, బుద్ధులు గొప్ప కరుణను కలిగి ఉంటారు. వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయగలరని తెలుసుకుంటారు. కరుణ లేని జ్ఞానం ఒక వ్యక్తిని చాలా విద్యావంతుడిని చెయ్యవచ్చు, కానీ వాళ్ళు సమాజానికి పెద్దగా ఉపయోగపడరు. కరుణ అనేది ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. అందుకే బుద్ధులు ఈ రెండవ లక్షణాన్ని పెంపొందించుకుని, మనందరితో సంబంధాలను ఏర్పరుచుకుంటారు.
  3. సామర్ధ్యాలు - బాధలను ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోవడం మరియు ఇతరులకు సహాయం చేయాలనే బలమైన కోరికను కలిగి ఉండటం అనే రెండు లక్షణాలు, మరియు వివిధ నైపుణ్య మార్గాల్లో జ్ఞానోదయ మార్గాలను బోధించడం ద్వారా ఇతరులకు నిజంగా ప్రయోజనం చేకూర్చే నిజమైన శక్తి మరియు సామర్థ్యాన్ని బుద్ధులు కలిగి ఉంటారు.

బుద్ధులు తాము బాధపడకూడదని అనుకున్నట్లే, వేరే వాళ్లు కూడా సమస్యలను అనుభవించకూడదని అనుకుంటారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి, బుద్ధులు తమ కోసమే కాకుండా, విశ్వంలోని ప్రతి జీవి కోసం పనిచేస్తారు. వాళ్ళు తమ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారో ఇతరులను కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు.

వారి బలమైన కరుణతో ప్రేరేపించబడి, మనకు వాళ్ళు అన్ని బాధల నుంచి విముక్తి పొందటానికి కావలసిన పరిష్కారాలను బోధిస్తారు, దీనినే జ్ఞానం అని పిలుస్తారు - నిజం మరియు కల్పన మధ్య సరైన తేడాను చెప్పడానికి మనస్సు యొక్క స్పష్టత ఇది. ఈ జ్ఞానంతో, మనం చివరికి అన్ని నెగెటివ్ విషయాలను వదిలించుకోవచ్చు: పూర్తి ఇబ్బందులు, స్వార్థం మరియు నెగెటివ్ భావోద్వేగాలు మొదలైనవి. మనం కూడా పరిపూర్ణ బుద్ధులుగా అయ్యి సంపూర్ణ మనశ్శాంతిని పొందవచ్చు.

సారాంశం

బుద్ధులు తమ నైపుణ్యమైన పద్ధతులతో మనకు ఎలా సహాయపడాలో ఖచ్చితంగా తెలిసిన పరిపూర్ణ టీచర్లు. వాళ్ళు దయగలవారు మరియు ఎల్లప్పుడూ సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారు మరియు మనల్ని ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచడానికి కష్టపడతారు. 

సిద్ధార్థుని లాగా, మనం కూడా తరచుగా ప్రపంచంలోని బాధలను చూసి గుడ్డివాళ్ళం అవుతాము. కానీ దాన్ని నివారించడానికి లేదా విస్మరించడానికి మనం ఎంత ప్రయత్నించినా, వృద్ధాప్యం, అనారోగ్యం మరియు మరణం లాంటివి మనందరికీ ఎదురవుతాయి. బుద్ధుని జీవిత గాథ ఆయన లాగే బాధల గురించి నిజాలను ఎదుర్కొని, వాటిని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో మనం అనుభవించే నిరాశా నిస్పృహల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోగలుగుతామని మనకు ప్రేరణను ఇస్తుంది. ఆయన జీవితం, మరియు బోధనలు మన వినాశకర భావోద్వేగాలను, అయోమయాన్ని అధిగమించడానికి మన వంతు కృషి చెయ్యాలని, ఆయన లాగే మనమూ సమస్త ప్రాణులకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేయవచ్చని మనకు గుర్తు చేస్తున్నాయి.

Top