ఏమిటి...
ఆర్టికల్ 1 యొక్క 20
తర్వాతది Arrow right
Study buddhism what is buddhism

బౌద్ధమతం అనేది వాస్తవికత యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకుని మన పూర్తి మానవ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడే పద్ధతుల సమూహం.

దీనిని 2,500 సంవత్సరాల క్రితం భారతదేశంలో సిద్ధార్థ గౌతముడు స్థాపించాడు - ఇతను బుద్ధుడిగా బాగా ప్రసిద్ధి చెందాడు - బౌద్ధమతం ఆసియా అంతటా వ్యాపించింది, ఇప్పుడు ఇది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద మతంగా ఉంది. బుద్ధుడు తన జీవితంలో ఎక్కువ భాగం తాను గ్రహించిన మేలుకొలుపు పద్ధతులను బోధించడానికి గడిపాడు. వాటితో చాలా మంది జ్ఞానోదయం పొందిన బుద్ధులు అయ్యారు. అతను బుద్ధుడు కాగల సామర్థ్యంలో అందరూ సమానులే అయినప్పటికీ, ప్రజలు వారి ప్రాధాన్యతలు, ఆసక్తులు మరియు ప్రతిభలలో చాలా భిన్నంగా ఉన్నారని గమనించాడు. దీనిని గౌరవిస్తూ, ఒకరి పరిమితులను అధిగమించి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి అనేక రకాల మార్గాలను అతను బోధించాడు.

బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రతి సంస్కృతిలో విభిన్న అంశాలు చెప్పబడ్డాయి. బౌద్ధమతం అనేక రూపాలలో ఉన్నప్పటికీ, అవన్నీ దాని ప్రాథమిక బోధనలనే చెప్తూ ఉంటాయి.

ప్రాథమిక బౌద్ధ బోధనలు - నాలుగు ఉత్తమ సత్యాలు

బుద్ధుని అత్యంత ప్రాధమిక బోధనలను నాలుగు ఉత్తమ సత్యాలు అని పిలుస్తారు, ఇవి అందరూ ఒప్పుకుని సత్యమైనవిగా భావించే నాలుగు వాస్తవాలు:

మొదటి ఉత్తమ సత్యం: నిజమైన బాధలు

జీవితంలో మనకు ఎంత సంతోషం ఉన్నా కానీ, ప్రతి జీవి - చిన్న కీటకం నుంచి, నిరాశ్రయుడు, బిలియనీర్ వరకు - సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం పుట్టి మరణించే మధ్యలో, మనం ముసలి వాళ్ళం అయి అనారోగ్యానికి గురవుతాము, మనకు ఇష్టమైన వాళ్ళు మరణిస్తారు. మనం కోరుకున్నది లభించకపోవడంతో మనం నిరాశ, నిస్పృహలను ఎదుర్కొంటాం.

రెండవ ఉత్తమ సత్యం: బాధలకు అసలైన కారణం

మనకు బాధలు కొన్ని సంక్లిష్టమైన కారణాలు మరియు పరిస్థితుల నుంచి వస్తాయి, కాని వాటికి అసలైన కారణం వాస్తవికతను మనం పట్టించుకోకపోవడమే అని బుద్ధుడు చెప్పాడు.

మూడవ ఉత్తమ సత్యం: బాధల నుంచి అసలైన విముక్తి

మన అజ్ఞానాన్ని వదులుకోవడంతో మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని బుద్ధుడు గ్రహించాడు, అలా చేస్తే మనం మళ్లీ వాటిని అనుభవించనవసరం లేదు.

నాలుగవ ఉత్తమ సత్యం: మనస్సు యొక్క నిజమైన మార్గం

వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అజ్ఞానాన్ని తొలగించినప్పుడు సమస్యలు పోతాయి. ఇలా చెయ్యాలంటే మనం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నామని తెలుసుకోవాలి. దీని ఆధారంగా మనం సమస్త జీవుల పట్ల సమానమైన ప్రేమను, కరుణను పెంపొందించుకుంటాం. మనం మరియు ఇతరులు ఎలా ఉన్నారనే దానిపై మన గందరగోళాన్ని తొలగించుకున్న తర్వాత, ఇతరుల కోసం మనం మంచిగా ఉపయోగపడేలా ఉండగలుగుతాము.

బుద్ధుని బోధనల పరిధి

దలైలామా బౌద్ధమతం గురించి మూడు వంతుల వ్యత్యాసాన్ని చెప్పారు:

  • బౌద్ధమత మానసిక శాస్త్రం - చూపు, ఆలోచన మరియు భావోద్వేగాలు ఆత్మాశ్రయ అనుభవం దృక్కోణం గురించి వివరిస్తుంది.
  • బౌద్ధమత ఫిలాసఫీ - నైతికత మరియు లాజిక్, వాస్తవికతపై బౌద్ధమతం యొక్క అవగాహన.
  • బౌద్ధ మతం - గతం మరియు భవిష్యత్తులో ఉండే జీవితాలు, కర్మలు, ఆచారాలు మరియు ప్రార్థనలపై విశ్వాసం.

ఇంద్రియ అవగాహన, ఏకాగ్రత, శ్రద్ధ, బుద్ధిపూర్వకత మరియు జ్ఞాపకశక్తి, మన పాజిటివ్ మరియు నెగెటివ్ భావోద్వేగాలతో సహా మనస్సు యొక్క వివిధ కార్యాకలాపాల యొక్క విస్తృతమైన విషయాలను అందిస్తూ బౌద్ధ శాస్త్రం ఆధునిక న్యూరోసైన్స్ కు అనుబంధంగా ఉంటుంది. పాజిటివ్ నరాల మార్గాలను రూపొందించడం ద్వారా, మన మనస్సు యొక్క ప్రయోజనకరమైన సామర్థ్యాలను మనం పెంచుకోవచ్చు.

బౌద్దుల ఆలోచనలు విశ్వాసం కంటే పరిశోధనపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి, కాబట్టి శాస్త్రీయ పరిశోధనలు బౌద్ధ ఆలోచనలకు చాలా ఉపయోగపడతాయి. - 14వ దలైలామా

భౌతిక స్థాయిలో, బౌద్ధ శాస్త్రం అనేక వ్యాధుల చికిత్స కోసం అధునాతన వైద్య వ్యవస్థలను కూడా కలిగి ఉంది. బయట చూసుకుంటే, ఇది క్వాంటం భౌతిక శాస్త్రంతో అనేక సమానమైన వాటితో పదార్థం మరియు శక్తి యొక్క వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది. ఇది విశ్వం యొక్క పుట్టుక, జీవితం మరియు అంతం గురించి కూడా చర్చిస్తుంది, ప్రస్తుత ఉన్న విశ్వం కంటే ముందు విశ్వం యొక్క ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.

బౌద్ధమత ఫిలాసఫీ పరస్పర ఆధారం, సాపేక్షత మరియు కారణాత్మకత వంటి సమస్యలను ఇది చర్చిస్తుంది. ఇది సెట్ థియరీ మరియు డిబేట్ ఆధారంగా ఒక వివరణాత్మక లాజిక్ వ్యవస్థను అందిస్తుంది, ఇది మన మనస్సులలో తప్పుగా అనుకునే అంచనాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది.

బౌద్ధ నైతికత అనేది మనకు మరియు ఇతరులకు ఏది ప్రయోజనకరమైనది మరియు ఏది హానికరం అనే వివక్షపై ఆధారపడి ఉంటుంది.

మనం విశ్వాసులమైనా, అజ్ఞేయవాదులైనా, భగవంతుడిని నమ్మినా, కర్మను నమ్మినా ప్రతి ఒక్కరూ ఈ నైతికతను అనుసరించవచ్చు. - 14వ దలైలామా

దయ, నిజాయితీ, ఉదారత మరియు సహనం వంటి ప్రాథమిక మానవ విలువలను ప్రశంసించి అభివృద్ధి చేయడం, ఇతరులకు హాని కలిగించకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించడం గురించి ఇందులో ఉంటుంది.

బౌద్ధ మతం కర్మ, గతం మరియు భవిష్యత్తు జీవితాలు, పునర్జన్మ యొక్క ప్రక్రియ, పునర్జన్మ నుండి విముక్తి మరియు జ్ఞానోదయం వంటి విషయాలను వివరిస్తుంది. ఇందులో జపం, ధ్యానం మరియు ప్రార్థనలు వంటి అభ్యాసాలు ఉన్నాయి. బౌద్ధమతంలో "బౌద్ధ బైబిల్" లాగా ఒకే పవిత్ర గ్రంథం అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ప్రతి సంప్రదాయం ఆధారంగా ఎవరికి వారికి స్వంత గ్రంథాలు ఉన్నాయి. 

ప్రజలు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ప్రార్థనలు చేయవచ్చు, కానీ చాలా మంది దేవాలయాలలో లేదా వారి ఇళ్లలోని విగ్రహాల ముందు మాత్రమే చేయడానికి ఇష్టపడతారు. ప్రార్థన యొక్క లక్ష్యం కోరికలను నెరవేర్చడమే కాదు, మన అంతర్గత శక్తిని, జ్ఞానాన్ని మరియు కరుణను మేల్కొల్పడం కూడా.

ఆహార నియమాలు ఏమీ లేవు, కానీ చాలా మంది గురువులు తమ విద్యార్థులను వీలైనంత వరకు శాఖాహారులుగా ఉండమని చెప్తారు. బుద్ధుడు కూడా మద్యం సేవించవద్దని, ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోవద్దని తన అనుచరులకు చెప్పాడు. బౌద్ధ శిక్షణ బుద్ధిపూర్వకత మరియు స్వీయ-క్రమశిక్షణను పెంపొందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది, వీటిని మనం తాగినప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడు సరిగ్గా నేర్చుకోలేము.

సంపూర్ణ బ్రహ్మచర్యంతో సహా వందలాది ప్రతిజ్ఞలను ఆచరించే సన్యాసులు మరియు సన్యాసినులతో బౌద్ధమతంలో ఒక సన్యాస సంప్రదాయాన్ని కలిగి ఉంది. వారు గుండు చేయించుకుని, పొడవాటి దుస్తులు ధరించి సన్యాస సంఘాలలో నివసిస్తారు. అక్కడ వాళ్ళు అధ్యయనం, ధ్యానం, ప్రార్థన మరియు సాధారణ సమాజం కోసం వేడుకలు చేస్తూ తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఈ రోజుల్లో, చాలా మంది సాధారణ ప్రజలు బౌద్ధ మతాన్ని అభ్యసిస్తూ బౌద్ధ కేంద్రాలలో ధ్యానం చేస్తూ ఉన్నారు.

బౌద్ధమతం అందరికీ ఓపెన్ గానే ఉంటుంది

మనలాంటి మనిషి అయిన బుద్ధుడు వాస్తవంగా మనం ఎలా పుట్టామనే వాస్తవాన్ని గ్రహించి, తన లోటు పాట్లను అధిగమించి, తన పూర్తి సామర్థ్యాన్ని గ్రహించాడు. బౌద్ధమతంలో, దీనినే మనం "జ్ఞానోదయం" అని అంటాము. బుద్ధుడు కేవలం చేతులు ఊపి మన సమస్యలన్నిటినీ దూరం చేయలేడు. కానీ, మన జీవిత సమస్యల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి మరియు మన మనస్సులలో మంచి లక్షణాలను పెంపొందించడానికి మనం అనుసరించగల మార్గాన్ని ఆయన మనకు చూపించాడు - ప్రేమ, కరుణ, ఉదారత, జ్ఞానం ఇంకా మరెన్నో.

ఈ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలో బోధనలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి - సాంస్కృతిక నేపథ్యం లేదా మతంతో సంబంధం లేకుండా ఇవి ఉన్నాయి. బౌద్ధమతంలో భగవంతుడు లేదా దేవుళ్ళపై విశ్వాసం గురించి ఏమీ ఉండదు, ఇది మనం నిజంగా విలువైన వస్తువును పరిశీలిస్తున్నట్లుగా బోధనలను పరిశీలించమని అడుగుతుంది. ఈ విధంగా, బుద్ధుని బోధనల సారాంశాన్ని నీతి, కరుణ మరియు జ్ఞానం లాంటి వాటిని అర్ధం చేసుకుని మనం హానిచేసే పనులకు దూరంగా ఉంటూ మనకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైన మంచి పనులనే చేస్తూ ఉంటాము. ఇది మనలో ప్రతి ఒక్కరికి కావలసిన దానికి దగ్గరగా తీసుకెళ్తుంది: అదే ఆనందం మరియు శ్రేయస్సు.

Top