నైతిక విలువలతో ఒక సంతోషకరమైన మనస్సును పొందడం

Studybuddhism universal values 01

లౌకిక విలువలను ఉపయోగించి ఒక సంతోషకరమైన మనస్సును ఎలా పొందాలి అనే విషయం గురించి నేను ఈ రోజు మాట్లాడబోతున్నాను. ఇంత ఎక్కువ మంది ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా గొప్ప స్నేహితులలో ఒకరైన, ఇప్పుడు మన మధ్య లేని ఒక అమెరికన్ శాస్త్రవేత్త, డేవిడ్ లివింగ్ స్టన్, ఏం చెప్పారంటే ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఇతరులను కలిసినప్పుడు, అతని లేదా ఆమె కళ్ళు పెద్దవిగా తెరుచుకుని కనుపాపలు డైలేట్ అవుతాయి. నన్ను అతను కలిసినప్పుడు కూడా అలాగే కళ్లు తెరుచుకుని కనుపాపలు డైలేట్ అయ్యాయని చెప్పారు. ఇలా అతనికి మొత్తం మీద రెండు సార్లే జరిగింది. అతని భార్యను మరియు నన్ను కలిసినప్పుడు మాత్రమే. కానీ ఇప్పుడు, నేను వెళ్ళే ప్రతి చోటులోని ప్రజలు అలానే ఉన్నారు. వాళ్ళు నన్ను చూడగానే ఒక నిజమైన ఆత్మీయ భావాన్ని చూపిస్తున్నారు. నేను దానిని చాలా అభినందిస్తున్నాను, మీ అందరికి ధన్యవాదాలు.

"లౌకికవాదం" అంటే ఏమిటి? భారతీయ సంప్రదాయాలలో తగినట్టుగా నేను దానిని ఉపయోగిస్తాను. కానీ నాకున్న కొంతమంది ముస్లిం మరియు క్రైస్తవ ఫ్రెండ్స్ లో " లౌకికవాదం" అనే పదం మతాలకు కొంచెం వ్యతిరేకంగా ఉంటుందని అనుకుంటారు, అందుకని నేను ఈ పదాన్ని వాడటం వాళ్లకు ఇష్టం ఉండదు. ఇంకొంత మంది ఈ "నైతిక విలువలు" మతం మీదే ఆధారపడి ఉండాలని అనుకుంటారు, కాని భారత రాజ్యాంగం లౌకికవాదం పైనే ఆధారపడి ఉంది; ఇది మతానికి వ్యతిరేకమైనది కాదు. భారతదేశంలోని ప్రజలు మతాన్ని చాలా గౌరవిస్తారు. గాంధీ గారు, మరియు భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా చాలా మతపరమైన వ్యక్తులు. ఈ సందర్భంలో "లౌకికవాదం" అంటే ఏ మతం వేరే మతం కంటే గొప్పది కాదనే ఆలోచన లేకుండా అన్ని మతాలను గౌరవించడం; వేలాది సంవత్సరాలుగా ఈ లౌకికవాదం భారతదేశంలో అవిశ్వాసుల హక్కులను కూడా గౌరవిస్తూ వస్తుంది. అందుకని నేను "లౌకికవాదం" అనే పదాన్ని దీని అర్థం కోసం ఉపయోగిస్తున్నాను.

మనుషులుగా, జంతువులుగా, కీటకాలుగా మనమందరం పూర్తి శాంతి మరియు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాము. ఎవరికి ఎలాంటి గొడవలు అవసరం లేదు. అందరికి సంతోషాన్ని సాధించడానికి మరియు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు మరియు కష్టాలను అధిగమించటానికి పూర్తి హక్కు ఉంది. ఆ విషయాన్ని లాజికల్ గానో లేదా ప్రయోగాత్మకంగానో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సహజంగానే సింపుల్ గా ఉంటుంది. అన్ని జీవులు, పక్షులు, జంతువులు, మానవులు అలాంటి జీవితాన్ని సాధించటానికే ప్రయత్నిస్తున్నాము. అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ లక్ష్యాన్ని సాధించే విధానాన్ని తెలుసుకోవటం. ఇది రియలిస్టిక్ గా ఉండాలి. అవాస్తవిక మార్గాలను ఉపయోగిస్తే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోలేము. ఉదాహరణకు, కొన్నిసార్లు జంతువులు భయంతో వాటికి తెలియని తప్పు వైపు పరిగెత్తడం మనం చూస్తాము; అవి సురక్షితమైన దారిలో కాకుండా హాని కలిగించే వైపు పరుగెడతాయి. కానీ మనం మనుషులం. మనకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. అందువల్ల మనకు ఉన్న హేతుబద్ధత మరియు తెలివితేటలతో రియలిస్టిక్ విధానాన్ని అనుసరించే సామర్థ్యం మనకు ఎక్కువ ఉంది. అందుకే మనం ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాం. మనకు దీర్ఘకాలిక అవగాహన ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మనం మన దీర్ఘకాలిక సంతోషాల కోసం చిన్నపాటి ప్రయోజనాలను వదులుకుంటాము. జంతువుల కన్నా మనకు తెలివితేటలకు ఎక్కువ ఉన్నాయని ఇది ఒక గుర్తు. కాబట్టి, ఈ తెలివితేటలతో మనుషులమైన మనం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము.

ఇక్కడ ఉన్న అసలైన ప్రశ్న ఏమిటంటే, అలాంటప్పుడు ఎలాంటి అనుభవం మనకు ఎక్కువ ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది? ఈ ఇంద్రియ స్థాయి అనుభవం తాత్కాలికమైనదే. ఉదాహరణకు, మీరు ఏదైనా ఒక బొమ్మను లేదా స్పోర్టింగ్ ఈవెంట్ కు వెళ్ళే, లేదా వివిధ ప్రదేశాలు, సీనరీలు, దుస్తులు మరియు వ్యక్తులను చూడటానికి వెళ్ళే ఒక పర్యాటకుడని అనుకోండి; వీటి నుంచి మీరు కొంత ఆనందాన్ని పొందుతారు. ఢిల్లీలో ఉండే నా డ్రైవర్, ఒక ఇండియన్, అతనికి క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. నేను అతన్ని నువ్వు మ్యాచ్ రోజు ఎన్ని గంటలు నిద్రపోతావని అడిగినప్పుడు, నిన్న రాత్రి క్రికెట్ మ్యాచ్ జరిగింది కాబట్టి నేను నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోయానని చెప్పాడు. అప్పుడు నేను అతనిని విమర్శించి ఆ క్రికెట్ మ్యాచ్ చూసే బదులు మంచిగా నిద్రపోయి ఉండొచ్చుగా అని చెబుతాను. అది మనసుకు మంచిదని చెప్తాను. ఆ తర్వాత సంగీతం, మంచి సువాసనలు, ఆహారం, ఆహ్లాదకరమైన శారీరక అనుభూతులు కూడా ఉంటాయి. ఈ ఆనందాలు అన్నీ ఇంద్రియ స్థాయిలో తాత్కాలికమైనవే. అవి అయిపోయిన తర్వాత మిగిలేది కేవలం వాటి జ్ఞాపకాలు మాత్రమే.

ఇంకొన్ని అనుభవాలు మానసిక స్థాయిలో ఉంటాయి. అవి ఇంద్రియాల అనుభవంపై ఆధారపడి ఉండవు; వాటి నుండి వచ్చే ఆనందం ఎక్కువ కాలం నిలుస్తుంది. కాబట్టి ఆనందం మరియు దుఃఖాన్ని అనుభవించడానికి రెండు స్థాయిలు ఉన్నాయని తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఒకటి, ఇంద్రియ స్థాయి, ఇది తాత్కాలికమైనది, రెండవది, మానసిక స్థాయి, ఇది చాలా దీర్ఘకాలికమైనది.

మన ఆధునిక కాలంలో, ప్రజలు ఇంద్రియ ఆనందాలలో చాలా నిమగ్నమై ఉన్నారు. ఇదే వాళ్ళకు ముఖ్యమైనదని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్లు ఎప్పుడూ ఆనందం కోసం బయట వస్తువులలో వెతుకుతున్నారు. అలా వాళ్ళు అంతర్గత, లోతైన వాటిని పట్టించుకోవడం లేదు. ఒకసారి నేను ఎప్పుడో చాలా స౦వత్సరాల క్రిత౦ జర్మనీలోని బెర్లిన్ లో ఉన్నప్పుడు, నేను ఉన్న ఒక హోటల్ సరిగ్గా ఒక నైట్ క్లబ్ కి ఎదురుగా ఉ౦ది. రాత్రి 7:30 లేదా 8 గంటల సమయంలో నేను నిద్రపోతాను. కానీ ఆ రోజు నేను బయట ఎరుపు, నీలం రంగుల, ఫ్లాషింగ్ మరియు పెద్ద శబ్దం చేస్తున్న వివిధ రంగుల లైట్లను గమనించాను. నేను నిద్రపోయి అర్ధరాత్రి లేచి చూశాను. అక్కడ ఆ గోల ఇంకా  జరుగుతూనే ఉంది. నాలుగు గంటలకు కూడా లేచి చూసినా అంతా అలాగే ఉంది. అక్కడ ఉన్న ఆ ప్రజల శక్తి అంతా ఆ ఇంద్రియ స్థాయిలో ఉంది. ఆ తర్వాత రోజు ఉదయం అయ్యే సరికి అక్కడి వాళ్ళందరూ అలసిపోయి ఉంటారని నేను అనుకున్నాను.

ఈ మధ్య నేను పిల్లలు ఉన్న ఒక ఇండియన్ కుటుంబాన్ని కలిశాను. వాళ్లతో నేను కాసేపు మాట్లాడాను. నేను వాళ్ళకు రెండు లేదా మూడేళ్ల క్రితమే టీవీ చూడటం మానేసాను, బిబిసి రేడియోలో వార్తలను మాత్రమే వింటాను అని చెప్పాను. ఆ ఫ్యామిలీలోని చిన్న పిల్లోడు నాతో ఇలా అన్నాడు, "మీకు టీవీ చూడకపోతే బోర్ కొట్టదా!" అని. అంటే వాళ్ళు టీవీ ఎక్కువగా చూస్తారు అని నాకు అర్ధం అయ్యింది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తారు. దీని వల్ల అంతగా ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది మంచి తెలివితేటలతో ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆనందాన్ని పొందడానికి ఇంద్రియ స్థాయిలో మాత్రమే కాకుండా మానసిక స్థాయిలో కూడా పనిచేయడం ముఖ్యమని మనకు తెలుస్తుంది.

ఇంకొక విషయం ఏమిటంటే, భావోద్వేగాల యొక్క నిజమైన ఇబ్బందులు ముఖ్యంగా మానసిక స్థాయి నుంచి వస్తాయి; కాబట్టి, ఒక సంతోషకరమైన జీవితం కోసం మనకు ప్రశాంతమైన మనస్సు అవసరం. ఇబ్బందులు మానసిక స్థాయి నుంచి వస్తాయి కాబట్టి, వాటిని గెలవడానికి మనం మానసిక స్థాయి నుంచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగా మనం మన అంతర్గత విలువలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చిన్న చోటులో ఉండే మెదడులో, మనం మనస్సు యొక్క విస్తారమైన అంతర్గత స్థలాన్ని అన్వేషించవచ్చు, కాని నిజానికి మనకు దాని గురించి కొంచెం మాత్రమే తెలుసు. మనం మన భావోద్వేగాలను పరీక్షించుకోవాలి. బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు, మనస్సులోని కొంత భాగం ఆ భావోద్వేగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కోపంతో నిండిన మనస్సును తెలుసుకునే సామర్థ్యం మన దగ్గర ఉంది; దానిని పరిశీలించి వెంటనే దానిని తొలగించుకోవాలి. మనసును లోతుగా పరిశీలించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇప్పుడు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం. ఇరవయ్యవ శతాబ్దం అనేది మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన శతాబ్దంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకంటే, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలా మన జ్ఞానం మరియు జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ, అదే సమయంలో, భయంకరమైన రక్తపాతం కూడా జరిగింది. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నో ఇబ్బందులను మరియు కష్టాలను అనుభవించారు. రెండు వందల మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. న్యూక్లియర్ ఆయుధాలతో చనిపోయిన వాళ్ళు కూడా ఇందులో భాగమే. అలాంటి విపరీతమైన హింస ఏదైనా మంచిని చేసిపెట్టిందా అంటే, అలా ఏమీ జరగలేదు. ఈ 21వ శతాబ్దపు ప్రారంభంలో కూడా ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ లలో ఉగ్రవాదం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి; ఇది గతంలో జరిగిన తప్పులకు మరియు నిర్లక్ష్యానికి గుర్తులు. బయట విషయాల మీదే ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తున్నారు. ఇప్పుడు, మనం బయట వాటి గురించి కాకుండా అంతర్గత విలువల గురించి ఎక్కువగా ఆలోచించాలి.

అలాగే, ఉన్నవాళ్లు లేనివాళ్ల మధ్య ఉన్న తేడా ఒక పెద్ద సమస్యగా మారింది, భౌతిక పురోగతిలో ఇది సాధారణమే. ఇక్కడ ఆస్ట్రియాలో, అందరిని సమానంగా చూసే స్థాయి చాలా బాగుంది. కానీ కిందటి సంవత్సరం నేను మెక్సికో, అర్జెంటీనా మరియు బ్రెజిల్ ని సందర్శించాను, అక్కడ నేను ఉన్నవాళ్లు లేనివాళ్ల మధ్య తేడా గురించి అడిగాను, అది చిన్నదా లేదా పెద్దదా అని అడిగాను. దానికి వాళ్ళు ఆ తేడా చాలా ఎక్కువే ఉందని చెప్పారు. ఇక్కడ ఆస్ట్రియాలో బహుశా అది చాలా తక్కువే ఉండి ఉంటుంది.

అలాగే, 'అవినీతి స్థాయి ఇక్కడ ఎక్కువగా ఉందా లేక తక్కువగా ఉందా?' అని అడిగాను. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో అవినీతి ఇంకా రాజ్యమేలుతోంది. సొంత క్రమశిక్షణ లేకపోవడం, నైతిక సూత్రాలు లేకపోవడమే దీనికి కారణం. ఉదాహరణకు, ఇండియా అనేది చాలా మతపరమైన దేశం, కానీ అక్కడ చాలా అవినీతి ఉంది. చాలా మంది ఇండియన్స్ ఇళ్ళల్లో దేవుళ్లు మరియు దేవతల బొమ్మలు ఉంటాయి, వాళ్ళు ధూపం, పువ్వులు సమర్పించి ప్రార్థనలు చేస్తారు, కాని నేను కొన్నిసార్లు జోక్ గా అనుకుంటాను వారి ప్రార్థనలో "నా అవినీతి పనులు బాగా జరగాలి" అని వాళ్ళు కోరుకుంటారు ఏమో అని. ఇది చాలా బాధాకరం. వాళ్లకు మతం మీద అంత నమ్మకం ఉన్నా కానీ వాళ్ళు అవినీతిపరులుగా జీవిస్తున్నారు. వారు నిజానికి విశ్వాసులు, కాని నిజానికి వారు తమ మత సూత్రాలను పాటించి దైవభక్తిని కలిగి ఉన్న వాళ్ళు అయితే కాదు.

కొన్ని సంవత్సరాల క్రితం, ఒక పండితుడితో నేను అక్కడున్న మల్టీ-నేషనల్ కంపెనీల గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళ లాభం నిజాయితీగా లేకపోవడం గురించి చర్చించాను. మేము ఈ విషయాలను మాట్లాడుకున్నాము. అప్పుడు నేను ఇలా అన్నాను "ఈ కంపెనీలను నడిపే వ్యక్తులు దైవభక్తులు కాబట్టి వారికి కొంత క్రమశిక్షణ ఉండాలి" అని. దానికి అతను ఇలా చెప్పాడు, "మీరు చెప్పింది పద్ధెనిమిదవ శతాబ్దపు మాట”. వాళ్ళందరూ దేవుడిని ప్రార్థించినప్పటికీ, అంత సీరియస్ గా ఏమీ ఉండరు. ఒకవేళ వాళ్ళు అంత సీరియస్ గా ఉండి ఉ౦టే, నిజాయితీ, శ్రద్ధ, నైతిక విలువలను పాటిస్తూ దేవుని సలహాలను పాటిస్తూ ఉండాలిగా. మనకు నైతిక విలువల యొక్క ప్రాముఖ్యత అవసరం, అంటే సొంత-క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి, ఏదో బాధ్యతలా లేదా భయంలా అని కాదు, మనకు మనమే, "నేను ఈ పనిలో పాల్గొంటే, అది నా నైతిక విలువలకు విరుద్ధం" అని తెలుసుకోవాలి.

ఈ నైతిక విలువలను పెంపొందించడానికి మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలా అధికంగా పెరుగుతున్న జనాభా మరియు తగ్గుతున్న రిసోర్స్ లతో, మనకు ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని, ఈ ఇరవై ఒకటవ శతాబ్దాన్ని మనం ఒక మర్చిపోలేని సుసంపన్నమైన శతాబ్దంగా మార్చుకోవటానికి కష్ట పడాలి. ఇదే ఈ లౌకిక నైతిక విలువలు యొక్క ప్రాథమిక సూత్రం.

నైతిక విలువలు మంచి హృదయానికి సంబంధించినవి. దీని అర్థం ఇతర మనుషుల పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉండటం. వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు; వాళ్ళకు కష్టాలు రావాలని అనుకోరు. మనమందరం పరస్పర సంబంధాలను కలిగి ఉన్నాము. వాళ్ళ సంతోషమే మన ఆనందానికి మూలం. దీన్ని అర్థం చేసుకుని మనం వాళ్లను గౌరవిస్తే, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, బెదిరించడం, దోపిడీ లాంటివి అస్సలు అవసరమే లేదు. దీని అర్ధం ఏమిటంటే, మంచి మనసుని కలిగి ఉండటమే సంతోషానికి మూలం. ఇది మన తల్లుల కాలం నుండి ఒక బయోలాజికల్ అంశంగా వస్తుంది: మనం మన తల్లుల ప్రేమ, మరియు ఆమె పాల నుంచి దీనిని స్వీకరించాము. ఈ అనుభవాన్ని మన జన్యువులు మరియు మన రక్తంలోకి తీసుకున్నాము. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే: పిల్లలు ఇతరుల నుండి డబ్బు మరియు సాంస్కృతిక విషయాల కంటే ఇతరుల నుండి ప్రేమను ఎక్కువగా కావాలనుకుంటారు, కాని వాళ్ళు పెరిగి తెలివైన వాళ్ళగా మారినప్పుడు ఈ విలువలు మారిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్వార్ధంతో నిండిపోయి ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తే అందుకు "ప్రతిఫలంగా నాకు ఏమి వస్తుంది?" అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి, స్వార్ధం అనేది పెద్ద సమస్యలకు మూలమైన "నేను" అనే భావనను తెస్తుంది. మనల్ని మనం యూరోపియన్ యూనియన్ లో భాగంగా లేదా మొత్తం ప్రపంచంలో ఒక భాగంగా భావించి మొత్తం మానవాళిని "మనం" లాగా పరిగణించాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఏడు బిలియన్ల మంది ప్రజలను "మనం" అని, మనం ఆ "మనం" లో ఒక భాగమని అనుకోవాలి; "నేను" అని అస్సలు ఆలోచించవద్దు. లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ గౌరవించాలి. ఆర్థికంగా, మరియు అన్ని రంగాల్లో అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఆ గౌరవం మనం ఎదుటివారి మంచి కోరుకుంటేనే వస్తుంది.

ఇది తప్పనిసరిగా మతంలో భాగం కాకూడదు; మతం అనేది ఒక ప్రైవేట్ వ్యవహారం; ఇవి పూర్తి మానవాళికి సంబంధించిన విషయం. ఒకవేళ మనం అందరినీ గౌరవిస్తే ఎలాంటి దోపిడీలు జరగవు. అలాగే, మంచి మనసు కలిగి ఉండటం మన శారీరక ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ప్రమాదం మరియు భయం లాంటివి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని, అందుకని మనం స్వార్ధంతో నిండి ఉంటే, మనం చాలా భయాన్ని అనుభవిస్తాము మరియు ఇతరులకు మన మీద ఉన్న నమ్మకం పోతుందని చెప్తున్నారు. ఇది ఒంటరితనం మరియు భయం యొక్క భావానికి దారితీస్తుంది, చివరికి ఇది నిరాశకు మరియు కోపానికి దారితీస్తుంది. కానీ ఒకసారి మనం మన హృదయాలను తెరిచి, ఇతరులను పట్టించుకోవాలని ఆలోచిస్తే, అప్పుడు మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. దానితో మనం బహిరంగంగా, మరియు పారదర్శకంగా వ్యవహరించగలం. మనం ఎవరిని కలిసినా, ఎవరిని చూసినా, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మన అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్లుగా భావిస్తాం; మనకు మంచి మనసు ఉంది. ఇతరుల పట్ల శ్రద్ధ చూపి౦చినప్పుడు, చాలా మ౦ది ప్రజలు సానుకూల౦గా స్ప౦దిస్తారు. కానీ ప్రతిసారీ అలానే ఉండదు. నేను ప్రతిసారీ కారులో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్లను చూసి నవ్వుతూ ఉంటాను. ఒకసారి జర్మనీలో నేను ఫుట్ పాత్ మీద ఒక ఆమెను చూసి నవ్వినప్పుడు, ఆమెకు నా మీద చాలా అనుమానం కలిగింది. నా నవ్వు ఆమెకు సంతోషాన్ని కలిగించడానికి బదులుగా ఆమె భయపడటానికి కారణమైంది. అందుకని అప్పుడు నా తలను తిప్పేసుకున్నాను. కానీ సాధారణంగా అలా జరగదు.

మంచి మనసు అనేది మనం మన తల్లుల నుండి నేర్చుకునేది కాబట్టి దీనిని మనం మన జీవితాంతం మనతోనే ఉంచుకోవాలి. ఒక సైన్స్ మీటింగ్ లో, మాకు ఒక నినాదం ఉంది: "ఆరోగ్యకరమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం" అని. దీనికోసం మనం రియాలిటీని తెలుసుకోవాలి, మనకు ఒక ప్రశాంతమైన మనస్సు ఉండాలి. మనం డిస్టర్బ్ అయితే, మనం బయాస్డ్ గా మారి అసలైన నిజాన్ని చూడలేము. ఇది మనకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఒక మంచి మనస్సు అనేది ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

మనకు ప్రశాంతమైన మనస్సు లేకపోతే, అప్పుడు ఇది మన చదువులో సమస్యలను తెచ్చిపెడుతుంది. మనసు ప్రశాంతంగా, సంతోషంగా లేకపోతే ఏది నేర్చుకోవాలన్నా కష్టమే. కాబట్టి, ఒక ప్రశాంతమైన మనస్సు రాజకీయాలతో సహా అన్ని పనులను సక్రమంగా చెయ్యటానికి ఉపయోగపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మనస్సు యొక్క ప్రశాంతత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ఈ ఆత్మవిశ్వాసంతో, మనం రియాలిటీని బాగా చూడగలుగుతాము. దీన్ని బట్టి మనం ఇంకా మంచి ఆలోచనలను పొందుతాము.

ఇవి లౌకిక నైతిక విలువల యొక్క ప్రాథమిక సూత్రాలు మరియు ఆనందానికి కీలకమైన అంశాలు. నాకు, ఇది చాలా ఉపయోగకరమైనదిగా అనిపించింది. ఇవి సరైనవే అని మీకు అనిపిస్తే తప్పకుండా వీటిని పాటించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీటికి దూరంగా ఉండండి. 

అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Top