సార్వత్రిక నైతికత విలువలను ఆచరణలో పెట్టడం

మానవ మనస్సు సమస్యలకు మూలం మరియు దాన్ని సరైన దిశలో తీసుకెళ్తే, వాటికి పరిష్కారం కూడా అదే ఇస్తుంది. గొప్ప జ్ఞానం ఉండి కూడా మంచి హృదయం లేని వారు ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది, ఇది కోరికలు నెరవేర్చలేని భావనగా మారిపోతుంది. భౌతిక జ్ఞానం నెగెటివ్ ఆలోచనలు మరియు భావాలకు సులభంగా మూలం కావచ్చు. దానికి విరుద్ధ౦గా, ఆధ్యాత్మిక విలువల గురి౦చిన సరైన అవగాహన శాంతిని ఇస్తుంది. - 14వ దలైలామా

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ వాల్యూస్ లో, గురువు గారు మనం సార్వత్రిక నైతిక విలువల గురించి ఎందుకు మాట్లాడాలో వివరించినప్పుడు, ఈ భూమ్మీద ఉన్న ఏడు బిలియన్ల మందిలో చాలా మందికి ఎటువంటి నిర్దిష్ట విశ్వాసం లేదని, ఒక నిర్దిష్ట మతంపై స్థాపించబడిన మనస్సుకు శిక్షణ ఇచ్చే వ్యవస్థను మనం ఈ ప్రజలకు అందించలేమని చెప్పారు. ఆయన లౌకిక విద్యలో ఈ శిక్షణా విధానాన్ని స్థాపించడం చాలా ముఖ్యమని కూడా చెప్పారు.

అప్పట్లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, అదే సమయంలో, వాల్ స్ట్రీట్ నాయకుల్లో ఎక్కువ మంది ఐవీ (Ivy) లీగ్ యూనివర్శిటీలకు చెందిన వారేనని ఆయన చెప్పారు. ఆ సంక్షోభ సమయంలో అంత స్పష్టంగా కనిపించిన అత్యాశను, మోసాన్ని వాళ్ళు చదువుకుంటున్న సమయంలో ఎలా ఎదుర్కోలేకపోయారు? భావోద్వేగాలు మన నిర్ణయాలను ఎలా మారుస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా మరియు మనం తీసుకునే నిర్ణయాల యొక్క దీర్ఘకాలిక ప్రభావాలను అర్థం చేసుకోవడం ద్వారా దురాశ, మోసం మరియు నెగెటివిటీని ఎలా పరిష్కరించాలో నేర్చుకోవడంలో MIT లోని ఈ కేంద్రం ఇప్పుడు నిమగ్నమైంది.

గురువు గారు ఈ సార్వత్రిక నైతిక విలువలను ఆచరణలోకి ఎలా తీసుకురావాలి అనే దాని గురించి కూడా ప్రసంగించారు, దీనిలో మూడు విషయాలను చెప్పారు:

  • సంయమనం యొక్క నైతిక విలువలు
  • ధర్మం యొక్క నైతిక విలువలు
  • పరోపకారం మరియు కరుణ యొక్క నైతిక విలువలు.

సంయమనం యొక్క నైతికత మన శరీరం మరియు మాటలలో నెగెటివ్ అలవాట్లను ఎలా విడిచిపెట్టాలి అని ఉంటుంది. శరీరం స్థూలమైనది, మనస్సు సూక్ష్మమైనది అని గురువు గారు చెప్పారు. శరీరాన్ని మనం నియంత్రించుకోలేకపోతే, మనస్సును నియంత్రించడానికి మనకు ఎటువంటి ఆశ ఉంటుంది? మొదట శరీరం మరియు మాటలు మరియు తర్వాత మనస్సు యొక్క నెగెటివ్ అలవాట్లను గమనించడం ద్వారా, మనం నైతిక సంయమనాన్ని పాటిస్తాము, ఇది ధర్మం యొక్క నైతిక విలువలలో నిమగ్నం కావడానికి మనల్ని అనుమతిస్తుంది. దీని అర్థం కరుణ, దయ, క్షమాగుణం మరియు విచక్షణ లాంటి మన పాజిటివ్ ప్రవర్తనను పెంపొందించడం అని. ఇది పరోపకారం లేదా కరుణ యొక్క నైతిక విలువలకు మనల్ని తీసుకువస్తుంది, దీనిలో మనం మన జీవితాలను ఇతరుల కోసం అంకితం చేస్తాము.

Top