SEE లెర్నింగ్: సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభ్యాసం, ఎమోరీ యూనివర్శిటీ, సంక్షిప్త ఫ్రేమ్‌వర్క్

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక (SEE) అభ్యాసం అనేది ఎమోరీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ అండ్ కంపాషన్ బేస్డ్ ఎథిక్స్ అభివృద్ధి చేసిన ఒక ప్రోగ్రామ్. భావోద్వేగపరంగా ఆరోగ్యకరమైన మరియు నైతికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులకు, సామాజిక గ్రూపులకు మరియు విస్తృత సమాజాలకు శిక్షణ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ రెండవ భాగంలో, SEE లెర్నింగ్: సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో, మనం ఇతరులతో శ్రేయస్సు మరియు సామరస్యాన్ని పెంపొందించే సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యడం నేర్చుకుంటాము.

వ్యక్తిగత డొమైన్ లో మనం నేర్చుకునే భావోద్వేగ విలువలు మరియు సొంత నియంత్రణ నైపుణ్యాలు ఖచ్చితంగా మనం మన జీవితంలో పురోగతి చెందుతున్నప్పుడు బాగా సహాయకారిగా ఉంటాయి. ఏదేమైనా, మనుషులు స్వభావ రీత్యా సామాజిక స్వభావం కలిగి ఉన్నట్లే, ఇతరులతో మంచి సంబంధంలో ఉండటం కూడా అంతే ముఖ్యం. సామాజిక లక్షణాలు పుట్టుకతో వచ్చినవి మరియు వాటిని మార్చలేమని ఇంతకుముందు అనుకున్నారు, కాని ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలు అభ్యాసం, ప్రతిబింబం మరియు ఉద్దేశపూర్వక అభ్యాసం ద్వారా సామాజిక లక్షణాలను పెంపొందించవచ్చని సూచిస్తున్నాయి. "సామాజిక" అనేది మన తక్షణ పరస్పర సంభాషణలను, అలాగే పాఠశాల, ఆఫీసు, కుటుంబం లేదా పక్కింటి లాంటి చిన్న-స్థాయి సమాజంలో పరస్పర సంభాషణలను సూచిస్తుంది. ఒక పట్టణం, ఒక సమాజం లేదా పూర్తి ప్రపంచం లాంటి పెద్ద-స్థాయి కమ్యూనిటీలు మూడవ మరియు చివరి డొమైన్ అయిన గ్లోబల్ లో కవర్ చెయ్యబడతాయి.

సామాజిక సందర్భంలో అవగాహన, కరుణ మరియు నిమగ్నత

సామాజిక డొమైన్ అనేక విధాలలో వ్యక్తిగత డొమైన్ ను పోలి ఉంటుంది, ఇప్పుడు దృష్టి మనపై కాకుండా ఇతరులపై ఉంటుంది. మళ్ళీ, మనం అవగాహన, కరుణ మరియు నిమగ్నత యొక్క మూడు విషయాల గురించి తెలుసుకుంటాము. అవగాహన అంటే ఇతరుల గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం, అలాగే సామాజిక జీవులుగా మన గురించి కూడా తెలుసుకోవడం - అంటే, మనం ఇతరుల కోసం జీవిస్తున్నాము, మనకు ఇతరులు అవసరం, మరియు మన పనులు ఇతరులను ప్రభావితం చేస్తాయి అని. ఈ అవగాహనలో మనుషులుగా మనలో ఏది ఒకేలా ఉంది మరియు మనల్ని ఒకరి నుంచి ఇంకొకరిని వేరు చేసేది ఏమిటి అని తెలుసుకోవడం ఉంటుంది. ఇతరులను మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి వ్యక్తిగత డొమైన్ లో పొందిన జ్ఞానాన్ని ఉపయోగించడం అనేది కరుణ. ఇలా మనం తక్కువ ప్రతిస్పందనతో తీర్పు ఇచ్చే విధంగా ఉంటాము. కృతజ్ఞత, క్షమాగుణం, ఉదారత మరియు వినయం లాంటి ఇతర సామాజిక లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనం ఈ అంతర్దృష్టిని ఉపయోగిస్తాము. చివరిగా, ఇతరులతో పాజిటివ్ గా మరియు నిర్మాణాత్మకంగా ఎలా సంబంధం కలిగి ఉండాలో తెలుసుకోవడానికి ఈ అవగాహన మరియు అంతర్దృష్టిని కలిపి ఉంచడం నిమగ్నత డైమెన్షన్ లో ఉంటుంది. కాబట్టి, సామాజిక డొమైన్ లోని మూడు భాగాలను ఈ క్రింది విధంగా పరిగణించవచ్చు:

  • వ్యక్తిగత అవగాహన
  • ఇతరుల పట్ల కరుణ
  • సంబంధ నైపుణ్యాలు

వ్యక్తిగత అవగాహన

మనమందరం మన స్వార్ధపు ప్రయోజనాలపై దృష్టి పెట్టే సహజ ధోరణిని కలిగి ఉన్నప్పటికీ, ఇతరులతో వారి ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారితో సంబంధం కలిగి ఉండటానికి శిక్షణ ఇవ్వడం కాలక్రమేణా నేర్చుకోగల నైపుణ్యం. ఇది ఇతరులకే కాకుండా, మనకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ఇతరుల పట్ల ప్రశంసా భావాన్ని సృష్టించడం శ్రేయస్సు యొక్క భావాలను పెంచుతుంది, అలాగే పరస్పర సంబంధం యొక్క భావాలను పెంచుతుంది. వ్యక్తిగత అవగాహన మూడు ప్రధాన విషయాలలో కవర్ చెయ్యబడుతుంది, అవి:

  • మన సామాజిక రియాలిటీను పట్టించుకోవడం
  • ఇతరులతో మన భాగస్వామ్య రియాలిటీను పట్టించుకోవడం
  • వైవిధ్యం మరియు తేడాను మెచ్చుకోవడం

మన సామాజిక రియాలిటీను పట్టించుకోవడం అనేది మన లోపల ఉండే సామాజిక స్వభావాన్ని మరియు ఇతరుల ప్రాముఖ్యతను మరియు మన జీవితంలో వాళ్ళు పోషించే పాత్రలను గుర్తించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇతరులతో మన భాగస్వామ్య రియాలిటీను పట్టించుకోవడం అనేది ఆనందాన్ని కోరుకోవడం మరియు బాధను నివారించడం లాంటి ప్రాథమిక స్థాయిలో ఇతరులతో పంచుకునేవి ఉంటాయి. చివరిగా, వైవిధ్యం మరియు తేడాను అభినందించడం అంటే వ్యక్తులు మరియు సమూహాల వైవిధ్యం, ప్రత్యేకత మరియు వాళ్లకు ఉన్న తేడాను గౌరవించడం మరియు అవి మన సామూహిక జీవితానికి ఎలా కలిసి ఉంటాయో చూడటం.

మన సామాజిక రియాలిటీను పట్టించుకోవడం

"ఏ మనిషీ కూడా ఒంటరి వాడు కాదు" అనే సామెత ఒకటి ఉంది. రియాలిటీ ఏమిటంటే, మనుషులమైన మనం సామాజిక జీవులం, మరియు మనం తెలుసుకున్నా లేకపోయినా మన జీవితంలో చాలా మంది వ్యక్తులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు. మనలాగే మిగతా వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని ఒక విషయంగా అనుభవిస్తారనే ప్రాథమిక నిజాన్ని కొన్నిసార్లు మనం మర్చిపోతాం. దీని వల్ల మనకు మాత్రమే కోరికలు, అవసరాలు ఉన్నాయి, ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉచ్చులలో పడటం చాలా సులభం అవుతుంది.

ముందుగా, మనమెవరో, మన ఉనికిని ప్రభావితం చేసే వ్యక్తుల గురించి, భవిష్యత్తులో మనల్ని ప్రభావితం చేసే వ్యక్తుల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, మన తల్లిద౦డ్రుల గురి౦చి లేదా మనకు అవసరాలు, రక్షణను కల్పించిన లేదా ఇప్పటికీ అందిస్తున్న వ్యక్తుల గురి౦చి ఆలోచి౦చవచ్చు. మిగతా వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. ఒక విస్తృత స్థాయిలో, చాలా మంది మనం తినే ఆహారాన్ని పండిస్తారు మరియు మనం వేసుకునే బట్టలను తయారు చేస్తారు. ఈ నిజాలను తెలుసుకోవడం ఇతరుల పట్ల ప్రశంస, సహానుభూతి మరియు కరుణను పెంపొందించడానికి ఒక పునాది వేస్తుంది.

ఇతరులతో మన భాగస్వామ్య రియాలిటీను పట్టించుకోవడం

ఇతరులు ఉన్నారు మరియు మనకు కావలసినవన్నీ ఇస్తారు అనే నిజానికి మించి, వారికి భావోద్వేగ జీవితాలు కూడా ఉన్నాయని మనం గుర్తించాలి. మన ప్రాథమిక సారూప్యతలను గుర్తించడం ద్వారా ఇతరుల యొక్క గొప్పతనం ఇక్కడ పెరుగుతుంది మరియు ఏ తేడాలు వారిని పొగడకుండా ఆపాల్సిన అవసరం లేదు. మనం దృష్టి పెట్టే పోలికలు మన ప్రాథమిక మానవ అనుభవాలు. ఇవి మనుషులందరికీ ఒక్కటే. ఇతరులు కూడా మనలాగే శ్రేయస్సును కోరుకుంటారు, కష్టాలు మరియు బాధలను కోరుకోరు. వాళ్ళు కోరికలు, అవసరాలు, భయాలు, ఆశలు మొదలైన భావోద్వేగ జీవితాలను కలిగి ఉంటారు. వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, పరిమితులను కలిగి ఉంటారు, అడ్డంకులను ఎదుర్కుంటారు మరియు ఆనందాలు మరియు ఎదురుదెబ్బలను అనుభవిస్తారు. ఈ సారూప్యతలను గుర్తించడం అనేది ఒక నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు మరియు అలవాటుగా చెయ్యవచ్చు.

మనస్సు గురించి మరియు మొదటి వ్యక్తి భావోద్వేగ అవగాహనతో సహా ఒక నిర్దిష్ట స్థాయి భావోద్వేగ తెలివిని అభివృద్ధి చేసుకున్న తర్వాత, మనం ఇతరులతో పంచుకునే సారూప్యతలను గమనించడం సులభం. అదే సమయంలో ఇతరులు మనలాగా ఎలా లేరో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికీ కోరికలు, అవసరాలు, భయాలు మరియు ఆశలు ఉన్నప్పటికీ, వాళ్ళు తప్పనిసరిగా మనం చేసే అవే పనులను చెయ్యాలని కోరుకోరు. మనం ఈ నిజాన్ని గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది. అంతేకాక, ఇతరులకు రకరకాల జీవిత అనుభవాలు, ఆలోచనలు మరియు తెలివి ఉన్నాయి, ఇవన్నీ ప్రశంసించబడతాయి. మన సారూప్యతలను అభినందిస్తూనే మన తేడాలను గుర్తించడం వల్ల మన గురించి మరియు ఇతరుల గురించి అవగాహన ఏర్పడుతుంది, ఇది సంబంధాల నైపుణ్యాలలో ఒక ముఖ్యమైన విషయం.

వైవిధ్యం మరియు తేడాను మెచ్చుకోవడం

ఇతరులతో మన భాగస్వామ్య రియాలిటీలో ఒక భాగం ఏమిటంటే, మనమందరం ప్రత్యేకమైన, భిన్నమైన మరియు విలక్షణమైన లక్షణాలను కలిగి ఉన్న మరియు ఇతర సమూహాల నుంచి భిన్నంగా ఉండే సామాజిక సమూహాలకు చెందిన వాళ్లం. మనలో ప్రతి ఒక్కరికీ వేరే పెంపకం, వేరే కుటుంబ వాతావరణం మరియు మన ఆలోచనలు, వైఖరులు మరియు ఆకాంక్షలను రూపొందించే ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి.

అందువల్ల వైవిధ్యం అనేది మన భాగస్వామ్య రియాలిటీలో ఒక భాగం మరియు దాన్ని మనం అలా అభినందించవచ్చు - ఇది మనల్ని విడదియ్యడానికి బదులుగా ఒకటిగా చెయ్యగలదు. తేడాలను గౌరవించడం మరియు మన సామూహిక జీవితానికి వైవిధ్యం దోహదపడే విధానం మన పెరుగుతున్న ప్రపంచంలో ప్రత్యేకించి ఒక ముఖ్యమైన అవగాహన రకం. ఇది నిజమైన సహానుభూతి మరియు కరుణకు పునాదిని అందిస్తుంది.

ఇతరుల పట్ల కరుణ

అన్ని సామాజిక లక్షణాలు ఇతరుల పట్ల కరుణ నుంచి రావడం మరియు సహాయపడడం మనం చూడవచ్చు. పరస్పర అవగాహన విస్తృత శ్రేణి సామాజిక లక్షణాలను పెంపొందించడానికి మార్గం సులభతరం చేస్తుంది, కరుణ వాటిని ఒక నైతిక సందర్భంలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇతరుల పట్ల కరుణను పెంపొందించడానికి మూడు మార్గాలు ఉన్నాయి, అవి:

  • సందర్భానికి తగ్గట్టుగా ఇతరుల ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం
  • దయ మరియు కరుణను పట్టించుకోవడం మరియు పెంపొందించుకోవడం
  • ఇతర నైతిక స్వభావాలను పట్టించుకోవడం మరియు పెంపొందించుకోవడం 

సందర్భానికి తగ్గట్టుగా ఇతరుల ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం

మన సొంత భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడం సొంత-తీర్పుకు దారితీస్తుంది; అదే విధ౦గా, ఇతరులు మనకు అర్థ౦ కాని లేదా మనకు నచ్చని విధ౦గా ప్రవర్తి౦చడాన్ని చూసినప్పుడు, మన౦ సహజ౦గా దానికి తీర్పుతో స్ప౦దిస్తా౦. కోరికలు మరియు అవసరాల నుంచి మన భావోద్వేగాలు ఎలా వస్తాయో అర్థం చేసుకోవడం సొంత-అంగీకారం మరియు సొంత-కరుణకు దారితీసినట్లే, ఇతరులను చూసినప్పుడు కూడా ఇదే పని చేస్తుంది. 

ఇతరుల పనులు భావోద్వేగాల ద్వారా ప్రేరేపించబడతాయని మరియు ఈ భావోద్వేగాలు లోపల నుంచి వస్తాయని మనం అర్థం చేసుకుంటే, అది కోపం మరియు తీర్పు కంటే సహానుభూతి మరియు కరుణను పొందేలా చేస్తుంది. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే అనుచిత ప్రవర్తనను క్షమించడం కోసం కాదు, ఇతరులను మరియు వారి భావోద్వేగాలను మానవ స్థాయిలో అర్థం చేసుకోవడం.

దయ మరియు కరుణను పట్టించుకోవడం మరియు పెంపొందించుకోవడం

క్రూరత్వం కంటే కరుణకు మనం విలువను ఇవ్వాలని స్పష్టంగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రాథమిక నిజం నుంచి దూరంగా ఉండటం సులభం. మన సొంత అనుభవాల ను౦చి, చారిత్రక ఉదాహరణల ను౦చి మన౦ ఎప్పుడూ కరుణకు ఎలా విలువ ఇవ్వలేదో చూడవచ్చు. చరిత్ర అంతటా, మనుషులు ఇతరుల క్రూరత్వాన్ని అంగీకరించిన లేదా వారి క్రూరమైన పనులను తోసిపుచ్చిన లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి.

కరుణ అనేది మనకు చాలా సహాయపడే ఒక శక్తివంతమైన సూత్రం, కానీ మన మనస్సులను కరుణతో ఉండాలని ఆదేశించడం అస్సలు పని చెయ్యదు. కరుణ అంటే ఏమిటో, ఏది కాదో అని అర్థం చేసుకుని, దాన్ని మనం పెంపొందించుకోవాలి. కరుణ కంటే ముందు దయతో ప్రారంభించడం సాధారణంగా సులభం - ఇతరుల పట్ల శ్రద్ధగల, మంచి ఆలోచనను పెంపొందించుకోవడం లాగా.

ఇతరుల బాధలను తగ్గించాలనే కోరికను కరుణ అంటారు. చాలా మంది కరుణను మానవ మనుగడ యొక్క కేంద్ర విషయంగా చూడనప్పటికీ, పరిశోధన కరుణ యొక్క జీవ మూలాలను సూచిస్తుంది. అన్ని క్షీరదాలు మరియు పక్షులు మనుగడ సాగించడానికి వాటి తల్లుల సంరక్షణ అవసరం, ఎందుకంటే అవి పుట్టిన తర్వాత వాటికవే సొంతగా జీవించలేవు. మానవులతో సహా వివిధ జాతులలో పరోపకార ప్రవర్తన మంచి బంధాన్ని సృష్టిస్తుంది, ఇది మనుగడకు సహాయపడుతుంది మరియు వ్యక్తిగత మరియు సమూహ స్థాయిలలో వృద్ధి చెందుతుంది. అందువల్ల, అనేక విధాలుగా, కరుణ అనేది మనుగడకు సంబంధించిన ఒక విషయం. మనుషులు చాలా చిన్న వయస్సు నుంచి దయకు ఎందుకు బలమైన ప్రాధాన్యతను ఇస్తారో మరియు శారీరక స్థాయిలో కూడా కరుణకు ఎందుకు సానుకూలంగా స్పందిస్తారో ఇది వివరిస్తుంది.

ఇతర నైతిక స్వభావాలను పట్టించుకోవడం మరియు పెంపొందించుకోవడం

కరుణతో పాటు, కృతజ్ఞత, క్షమాగుణం, తృప్తి, వినయం, సహనం మొదలైన స్వభావాలను కూడా మనం పెంపొందించుకోవచ్చు. ఈ నైతిక స్వభావాలన్నింటికీ సాధారణమైనది ఏమిటంటే, అవి మన జీవితాలకు ప్రయోజనం మరియు ఆనందాన్ని కలిగించే భౌతిక ఆస్తులు లేదా విజయాల కంటే అంతర్గత లక్షణాలను సూచిస్తాయి. వ్యక్తులను గౌరవించడం మరియు వాళ్ళు మన జీవితాలను ఎలా సుసంపన్నం చేస్తారో చూడడంపై దృష్టి పెట్టడం దీర్ఘకాలిక సంతృప్తి మరియు సంతోషానికి సహాయపడి ఆస్తులను సంపాదించడం అనే ఆలోచనను పోగొడుతుంది. ఈ అంతర్గత లక్షణాలు ఎంత ముఖ్యమో అని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థాయి భౌతిక ఆనందం తర్వాత జీవితంలో సంతృప్తి తగ్గిపోయినప్పటికీ, పిల్లలు మరియు పెద్దలలో కృతజ్ఞత మరియు ఆనందం మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కృతజ్ఞత జీవితంలో ఎక్కువ సంతృప్తికి దారితీయడమే కాదు, సామాజిక మాధ్యమాలు, ప్రకటనలు మరియు టెలివిజన్ ద్వారా తెలియచెయ్యబడే భౌతికవాద సందేశాలకు శక్తివంతమైన విరుగుడు కూడా కావచ్చు.

ఇతరులు మనకు అనేక విధాలుగా సహాయపడతారు, మరియు ఈ ప్రయోజనాలను అనుభవించడం మనకు ఉద్దేశపూర్వకంగా ఆలోచన ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇతరులు చెయ్యని పనిని కూడా మనం అభినందించవచ్చు - వాళ్ళు మన దగ్గర నుంచి ఏమీ దొంగిలించలేదు, మనకు ఏమీ హాని చెయ్యలేదు లేదా మనల్ని అవమానించలేదు. మరి౦త అధునాతన స్థాయిలో, ఇతరులు హానికరమైన మార్గాల్లో ప్రవర్తి౦చినప్పుడు మనకు లభి౦చే ప్రయోజనాన్ని మెచ్చుకోవడ౦ కూడా మనం నేర్చుకోవచ్చు. విపరీతమైన కష్టాలను అనుభవిస్తూ, వాటిని తట్టుకుని, తమ ఆలోచనలను మార్చుకుని, సంతోషకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితాలను గడిపే వ్యక్తుల ఉదాహరణలను మనం చూడవచ్చు. ఇతరుల తప్పుడు ప్రవర్తనను మనం క్షమించనప్పటికీ, కొత్త ఆలోచనలను తీసుకునే ఈ సామర్థ్యం కోపం, ఆగ్రహం మరియు ద్వేషాన్ని విడుదల చెయ్యడానికి ఒక శక్తివంతమైన మార్గం. ఇతరులు మనకు ఎలా సహాయపడతారో మన అన్వేషణ నిజమైన, స్థిరమైన కృతజ్ఞతా భావాన్ని పె౦పొ౦ది౦చుకోవడానికి దారితీస్తు౦ది, అది ఇతరులతో ఒక బలమైన బంధ౦గా పనిచేస్తు౦ది.

సొంత-కేంద్రీకృత వైఖరి యొక్క నష్టాలను మరియు మన సంతోషం మరియు శ్రేయస్సు ఇతరులు చూపించే లెక్కలేనన్ని దయతో కూడిన పనులపై ఎలా ఆధారపడి ఉంటుందో ఆలోచించినప్పుడు, మనకు సహజంగా కృతజ్ఞతా భావం కలుగుతుంది. 

మనం సహానుభూతిని కూడా పెంపొందించుకోవాలి, ఇది వారి సంతోషాలు మరియు దుఃఖాలు రెండింటితో కలిసి ఉండే ఇతరుల అనుభవాలను గుర్తించే మరియు సున్నితంగా ఉండే సామర్థ్యం. మనలో చాలా మంది మనకు మనమే మన స్నేహితులు మరియు ప్రియమైన వారితో సహానుభూతిని అనుభవిస్తాము, కానీ దాన్ని విస్తృతంగా అందరికి పంచడం సాధ్యమవుతుంది. మన ప్రాథమిక భాగస్వామ్య సారూప్యతల జ్ఞానంతో సహానుభూతిని కలిపినప్పుడు, పక్షపాతం ద్వారా తక్కువ పరిమితం చెయ్యబడిన నిజమైన సహానుభూతి ఉద్భవిస్తుంది. ఇతరులతో సహానుభూతితో సంబంధం కలిగి ఉండటం అనేది వారి ఆలోచనని మరియు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. ఉదాహరణకు, "ఈ వ్యక్తి స్వార్థపరుడు" అని చెప్పడానికి బదులుగా, "అతని ప్రవర్తనను స్వార్ధంతో కూడినది" అని చెప్పవచ్చు. ఇది ఆ వ్యక్తిని శాశ్వతంగా స్వార్థపరుడిగా చూడకుండా ఉండటానికి సహాయపడుతుంది అలాగే అతను నిస్వార్థంగా ఉన్న సందర్భాలను గమనించడానికి మనకు అనుమతిస్తుంది. 

ఇతరులతో మన సారూప్యతలను అన్వేషిస్తున్నప్పుడు కృతజ్ఞత మరియు సహానుభూతిని పెంపొందించుకుని మనం సహజంగా క్షమాపణను ఇవ్వడం ప్రారంభిస్తాము. మన అవాస్తవికమైన అంచనాలను విడిచిపెట్టి, సొంత అంగీకారాన్ని పెంపొందించుకున్నప్పుడు, ఇతరుల పట్ల మనకు ఉన్న కోపాన్ని మరియు ఆగ్రహాన్ని విడుదల చెయ్యడం సులభం అవుతుంది. అందువల్ల క్షమాగుణం మనకు మనం ఇచ్చే ఒక బహుమతిగా మారుతుంది.

సంబంధ నైపుణ్యాలు

స్నేహం నుంచి ఫ్యామిలీ డ్రామా, ఆఫీస్ డైనమిక్స్ లాంటి కష్టమైన సామాజిక విషయాలను మనం క్రమం తప్పకుండా దాటాల్సి ఉంటుంది. సంతోషంగా మరియు విజయవంతంగా ఉండటానికి విస్తృత శ్రేణి సామాజిక సెట్టింగులకు అనుగుణంగా ఉండే సామర్థ్యం ఉండాలి. దీర్ఘకాలిక శ్రేయస్సు అర్థవంతమైన మరియు పాజిటివ్ సంబంధాలను ఏర్పరచడానికి మరియు నిర్వహించడానికి సామర్థ్యానికి గణనీయంగా సంబంధించినది, అదే సమయంలో హానికరమైన వాటిని గుర్తించగలిగి వాటిని అంతం చెయ్యగలదు.

ఈ కోర్సు యొక్క ఇంతకుముందు రెండు భాగాలు - మన సామాజిక సందర్భంలో అవగాహన, సందర్భానికి తగ్గట్టుగా ఇతరుల ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం ఉంటుంది - మన సొంత మరియు ఇతరుల శ్రేయస్సుకు అత్యంత అనుకూలమైన వాస్తవ నైపుణ్యాలు, మంచి ప్రవర్తనలు అభ్యాసాలను నిర్మించడానికి ఒక పునాదిని సృష్టిస్తాయి. మన ప్రవర్తన సానుభూతి మరియు కరుణపై ఆధారపడినప్పటికీ, కొన్నిసార్లు మన పనులు నెగెటివ్ గా ఉంటాయి. మనకు మంచి ఉద్దేశాలు ఉండవచ్చు, కానీ అవి అనుకోకుండా మనకు మరియు ఇతరులకు ఇబ్బందులను కలిగిస్తాయి. ఎక్కువ అనుభవం పొందడం ద్వారా వీటిని మనం తగ్గించవచ్చు. మనం నేర్చుకున్న ఏ నైపుణ్యాలు అయినా సహజంగానే సాధన చెయ్యవచ్చు. నాలుగు అంశాల్లో మనం శిక్షణను పొందవచ్చు, అవి:

  • సహానుభూతితో వినడం
  • నైపుణ్యం కలిగిన సంభాషణ
  • ఇతరులకు సహాయపడటం
  • సంఘర్షణ పరివర్తన

సహానుభూతితో వినడం

సహానుభూతితో వినడం అంటే ఇతరులు చెప్పేది ఓపెన్ మైండ్ తో వినడం మరియు భావోద్వేగ ప్రతిస్పందన వల్ల పక్కకి వెళ్లిపోకుండా ఉండటం. అవతలి వ్యక్తి అభిప్రాయాలు మన అభిప్రాయాలకు వేరుగా ఉన్నప్పటికీ, వారి పట్ల గౌరవం మరియు ప్రశంసలపై ఇది ఆధారపడి ఉంటుంది. మనం "లోతైన శ్రద్ధతో వినడం" వ్యాయామాలతో సహానుభూతితో వినడం అనేది అభ్యసించవచ్చు, ఇక్కడ మనం కొన్ని నిమిషాలు వ్యాఖ్య లేదా తీర్పు లేకుండా ఇతరులు చెప్పేది వినడానికి ప్రయత్నిస్తాము. లేదా, మనతో విభేదించే విషయాలను చెప్పే వ్యక్తులను మనం చూడవచ్చు లేదా వినవచ్చు, కానీ భావోద్వేగంగా ప్రతిస్పందించే ముందు వాళ్ళు ఏమి చెబుతున్నారో వివరించడానికి లేదా తిరిగి చెప్పడానికి విరామం తీసుకోవచ్చు.

సహానుభూతితో వినడం అనేది పైపైన విషయాలపై మాత్రమే కాకుండా, ప్రజలు చెప్పే వాటిని విని అర్థం చేసుకోవడానికి అక్కడి అవసరాలు కూడా దృష్టి పెట్టే విధంగా వినాలి.

నైపుణ్యం కలిగిన సంభాషణ

వినడం చాలా ముఖ్యం, కానీ మనం చెప్పదలచుకున్న విషయాన్ని మనకు మరియు ఇతరులకు శ్రద్ధగా, ఉత్పాదకంగా మరియు సాధికారత కలిగించే విధంగా కమ్యూనికేట్ చెయ్యగలగాలి. "సాధికారిక సంభాషణ" అనే భావన మన కోసం మాత్రమే కాకుండా, మాట్లాడలేని వారి కోసం కూడా గౌరవంగా మరియు స్పష్టంగా మాట్లాడే మన సామర్థ్యాన్ని సూచిస్తుంది. డిబేట్ అనేది చాలా శక్తివంతమైన సాధనం అవ్వవచ్చు. ఉదాహరణకు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మన౦ సాధారణ౦గా మనకు నచ్చని సైడ్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాం. మన ఆలోచనలను వ్యతిరేకి౦చే వారిని మనుషులుగా కాదన్నట్టుగా చూస్తాము, అలా౦టి ప్రవర్తనతో వినయాన్ని, మేధోపరమైన ఉత్సుకతను, సాధారణ మానవత్వ భావాన్ని పె౦పొ౦ది౦చుకోవడానికి సహాయపడతాయి.

ఇతరులకు సహాయపడటం

వినడం మరియు సంభాషించడం ప్రాథమికమైనవి, కానీ ఇతరులకు సహాయపడటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఇతరులకు సహాయం చెయ్యడం ఎప్పుడూ ఇతరుల అవసరాలకు తగినట్టుగా ఉండాలి మరియు మన సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి. సమాజ సేవ నుంచి స్వచ్ఛంద సేవ వరకు "యాదృచ్ఛిక దయతో కూడిన పనుల" వరకు, సహాయం పొందడం కంటే సహాయం చెయ్యడమే మన శ్రేయస్సుకు మంచిదని పరిశోధనలు చెప్తున్నాయి. 

ఇతరులకు సహాయ౦ చేసే ప్రక్రియ గురి౦చి ఆలోచి౦చడానికి మన౦ కొంత సమయాన్ని తీసుకోవచ్చు: మన౦ అలా చేసినప్పుడు ఏమి అనిపిస్తు౦ది, దాని ను౦చి మన౦ ఏమి నేర్చుకు౦టా౦, మన౦ సహాయ౦ చెయ్యడానికి ప్రయత్ని౦చే వారిపై అది ఎలా౦టి ప్రభావాన్ని చూపిస్తు౦ది అని. చివరిగా, ఇతరులకు వారి దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం నిజంగా ఎటువంటి సహాయం అవసరమో మనం కనుక్కోవచ్చు.

సంఘర్షణ పరివర్తన

మన జీవితకాలం మొత్తం అనవసరమైన గొడవలను ఎదుర్కొంటాం. గొడవ ఎప్పుడూ చెడ్డది కాదు, కానీ మనకు మరియు ఇతరులకు జరిగే గొడవల నుంచి తప్పించుకోవడం అనేది నేర్చుకోవడం ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఒక గొడవను పరిష్కరించడం అనేది ఇద్దరి మంచిని పెంచి ఆ పరిస్థితులు మరియు సంబంధాలు మెరుగుపడే మార్గంలో ఒక భాగం మాత్రమే. దీని కోసం మనం గొడవలకు సరిగ్గా ప్రతిస్పందించి వాళ్ళకు సహాయం చేసి మంచి సంబంధాలను కుదర్చగలగాలి.

అంతర్గత ప్రశాంతత బయటి ప్రశాంతతకు పునాదిగా పనిచేస్తుంది. అదే విధంగా, అంతర్గత సంధి బయటి సంధికి దారితీస్తుంది. మన అంతర్గత విషయాలతో వ్యవహరించడం ఒక విజయవంతమైన సంఘర్షణ పరివర్తన అవకాశాలను పెంచుతుంది. వినయం, సహానుభూతి, కరుణ, క్షమాగుణం, నిష్పాక్షికత మరియు మన ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించకుండా, సంఘర్షణ పరివర్తన మరియు పరిష్కారం కష్టం. ఈ నైపుణ్యాలు ఉన్న చోట, సంఘర్షణ పరిష్కార పని పాల్గొన్న అందరికి లోతైన మరియు నిజమైన పరివర్తన అనుభవంగా మారుతుంది.

సారాంశం

ఈ కోర్సు మొదటి భాగంలో, మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి భావోద్వేగ విద్యను పెంపొందించుకుంటాం. రెండవ భాగంలో, ఇతరులతో కలిసిపోవడానికి మనం ఈ అవగాహనను ఉపయోగిస్తాము: మన కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు మరియు మనకు ఎదురుపడే అపరిచితులతో. సంబంధ నైపుణ్యాలు అలవరచుకోవడం దయ మరియు కరుణ యొక్క సూత్రాలతో ముడిపడి ఉంటుంది. వాటిని మనం సరైన విధంగా సాధన చేస్తే, సామాజిక నైపుణ్యాలు కేవలం పద్ధతుల లాగానే మిగిలిపోవు; అవి ఇతరుల పట్ల మనకున్న ప్రశంసా భావం మరియు శ్రద్ధ యొక్క సహజ పరిణామంగా రూపాంతరం చెందుతాయి. మనం అనుభవించే సామాజిక సందర్భాలలో పాజిటివ్ స్ట్రాటజీలను ఆచరించినప్పుడు, మన సంబంధాలు మంచిగా మారడమే కాకుండా, మనం సంతోషంగా మరియు ఎక్కువ సంతృప్తిగా ఉంటాము.


మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, SEE లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ యొక్క పూర్తి వెర్షన్ ను చదవండి మరియు సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ మరియు కంపాషన్-బేస్డ్ ఎథిక్స్ యొక్క మిగతా ప్రోగ్రామ్ ల గురించి తెలుసుకోండి.

Top