SEE లెర్నింగ్: మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభ్యాసం, ఎమోరీ యూనివర్శిటీ, సంక్షిప్త ఫ్రేమ్‌వర్క్

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక (SEE) అభ్యాసం అనేది ఎమోరీ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ అండ్ కంపాషన్ బేస్డ్ ఎథిక్స్’ అభివృద్ధి చేసిన ఒక ప్రోగ్రామ్. భావోద్వేగపరంగా ఆరోగ్యకరమైన మరియు నైతికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులకు, సామాజిక గ్రూపులకు మరియు విస్తృత సమాజాలకు శిక్షణ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ మొదటి భాగం, SEE లెర్నింగ్: మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో, మన భావోద్వేగాలను ఎలా నావిగేట్ చేసుకోవాలో మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాము.

పరిచయం

SEE లెర్నింగ్ అనేది మన జీవితంలోని మూడు విషయాలలో సహాయపడటానికి డిజైన్ చెయ్యబడింది: వ్యక్తిగత, సామాజిక మరియు ప్రపంచ స్థాయిలలో. ఈ మూడు డొమైన్‌లను వేరు వేరుగా లేదా ఏ క్రమంలోనైనా చూడవచ్చు; ఏదేమైనా, ఇతరులు మరియు పెద్ద జనాభా కలిగిన సమాజాల అవసరాలను ఎలా తీర్చాలో నేర్చుకోవాలంటే - మొత్తం ప్రపంచం కోసం అయినా - మనం ముందుగా మన సొంత అవసరాలు మరియు మన అంతర్గత జీవితాన్ని పట్టించుకోవాలి.

దీన్ని మనం "భావోద్వేగ చదువును" పెంపొందించుకోవడం ద్వారా చేస్తాము. ఇది మనపై మరియు ఇతరులపై భావోద్వేగాలు మరియు వాటి ప్రభావాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ గుర్తింపు మన భావోద్వేగాలను విజయవంతంగా నావిగేట్ చెయ్యడానికి సహకరిస్తుంది. చివరిగా, భావోద్వేగ చదువు మనకు మరియు ఇతరులకు హాని కలిగించే హఠాత్తు ప్రవర్తనకు దూరంగా ఉండటానికి అనుమతిస్తుంది, అదే సమయంలో మన సొంత దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుకూలమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అందుకని, భావోద్వేగ చదువు అనేది ఒక కీలకమైన నైపుణ్యం, ఇది మనం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

వ్యక్తిగత డొమైన్ లో అవగాహన, కరుణ మరియు నిమగ్నత

SEE లెర్నింగ్ "డైమెన్షన్లు" అని పిలువబడే అవగాహన, కరుణ మరియు నిమగ్నత యొక్క మూడు సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ డైమెన్షన్లు మన సమస్యలను ఎదుర్కోవటానికి, పెరుగుతున్న మన సంక్లిష్ట ప్రపంచంలో ఇబ్బందులను ఎదుర్కోవటానికి మరియు ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా మారడానికి జ్ఞానం, నైపుణ్యాలు మరియు ప్రేరణను అందించడానికి కలిసి పనిచేస్తాయి. వ్యక్తిగత డొమైన్ లో, ఈ మూడు కోణాలను మూడు వైపులా నుంచి చూస్తారు:

 • శ్రద్ధ మరియు సొంత-అవగాహన
 • సొంత-కరుణ
 • సొంత నియంత్రణ

శ్రద్ధ మరియు సొంత-అవగాహన అనేది మన దృష్టిని ఒక దారిలో పెట్టి దానితో మన మానసిక మరియు శారీరక స్థితుల గురించి సరైన అవగాహన పొందగలుగుతాము. అవి "మనస్సు యొక్క మ్యాప్" గైడెన్స్ తో మన భావోద్వేగాల గురించి నేర్చుకోవడంలో సహాయపడతాయి. అప్పుడు, సొంత-కరుణతో, మన భావాలను మరియు భావోద్వేగాలను పరిశీలించడం నేర్చుకుని వాటిని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇందులో వివిధ కారణాలు మరియు పరిస్థితుల నుంచి మన భావోద్వేగాలు ఎలా ఉద్భవిస్తాయో పరిశోధించడం గురించి ఉంటుంది, ఇది మంచి సొంత-ఆమోదానికి సహకరిస్తుంది. చివరిగా, మొదటి రెండు ఆలోచనల నుంచి పొందిన వాటితో, ప్రేరణ నియంత్రణను పెంపొందించడానికి మనం సొంత-నియంత్రణలో నిమగ్నమవుతాము, ఇది మన జీవితంలోని రోజూ వచ్చే సవాళ్లకు ఎదుర్కోవడానికి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మొత్తంమీద దీన్ని పరిశీలిస్తే, వ్యక్తిగత డొమైన్ లోని ఈ విషయాలన్నీ భావోద్వేగ చదువును పెంపొందించేవిగా చూడవచ్చు. మన మనస్సు మరియు భావోద్వేగాల యొక్క సంక్లిష్టమైన అంతర్గత ఆలోచనలను చర్చించే సామర్థ్యం లేకుండా, లోతైన, సొంత-విధ్వంసక అలవాట్లను అధిగమించడం దాదాపు అసాధ్యం. ఇది మన సొంత నియంత్రణ సామర్థ్యాన్ని మరియు మన స్వేచ్ఛను కూడా లిమిట్ చేస్తుంది. స్వార్థపూరితంగా ఉండటానికి బదులుగా, సొంత అభివృద్ధి సమయంలో మన సాధనాలు మరియు నైపుణ్యాలు భావోద్వేగాలు ఎటో పోవడం నివారించడానికి మరియు మనం అభివృద్ధి చెంది విజయం సాధించడానికి సహాయపడే మార్గాల్లో పని చెయ్యడానికి ఉపయోగపడతాయి. ఈ మూడు విషయాలను మనం ఇంకా లోతుగా పరిశీలిద్దాం.

శ్రద్ధ మరియు సొంత-అవగాహన

మన శరీరాలు మరియు మనస్సులలో ఏమి జరుగుతుందనే దానిపై సరైన అవగాహనను కలిగి ఉండగలగడమే ఈ వ్యక్తిగత డొమైన్ యొక్క లక్ష్యం. ఉదాహరణకు, కోపం అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది మరియు దాన్ని ఎలా తగ్గించవచ్చో అని మనం మేధోపరమైన అవగాహన తెచ్చుకుని, మన భావాలు మరియు భావోద్వేగాలపై దృష్టి పెట్టి మన సొంత అనుభవంలో కోపాన్ని గుర్తించడంతో నేర్చుకుంటాము. ప్రత్యక్ష అనుభవం మరియు నేర్చుకున్న జ్ఞానం యొక్క ఈ కలయిక భావోద్వేగ చదువుకు మొదటి మెట్టు.

శ్రద్ధ మరియు సొంత-అవగాహన అనేవి మూడు సామర్థ్యాలను కలిగి ఉంటాయి:

 • మన శరీరాన్ని మరియు దాని అనుభూతులను పట్టించుకోవడం
 • మన భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ ను పట్టించుకోవడం
 • మనస్సు యొక్క మ్యాప్ ను అనుసరించడం

మన శరీరాన్ని మరియు దాని అనుభూతులను పట్టించుకోవడం

అనుభూతుల స్థాయిలో మన శరీరం లోపల ఏమి జరుగుతుందో గమనించడం ద్వారా మనం దీన్ని ప్రారంభిస్తాము. ఈ శరీరం మన నాడీ వ్యవస్థ యొక్క స్థితి గురించి నిరంతరం సమాచారాన్ని అందించే ఒక సోర్స్, ఎందుకంటే భావోద్వేగ స్థితులు సాధారణంగా శరీరమంతా మార్పులను కలిగి ఉంటాయి: హార్ట్ రేట్, బిగుతు లేదా కండరాల సడలింపు, వేడి లేదా చల్లదనం యొక్క భావాలు ఇలా ఇంకెన్నో. మన శరీరంలో ఏమి జరుగుతుందో గమనించడం అనేది ఎప్పుడూ ఒక అనుభవం యొక్క మానసిక విషయాలకు మాత్రమే అనుసంధానించకుండా మన భావోద్వేగ స్థితికి వేగంగా సమాచారాన్ని పంపిస్తుంది.

మన శరీరంలోని అనుభూతులపై అవగాహన ద్వారా మన నాడీ వ్యవస్థపై దృష్టి పెట్టడం ద్వారా, మనం క్రమంగా ఒత్తిడి మరియు శ్రేయస్సు సంకేతాలను గుర్తించడం నేర్చుకుంటాము. మనం హైపర్-ఉద్రేకం (ఆందోళన, అధిక కోపం, ఆందోళన) లేదా హైపో-ఉద్రేకం (బద్ధకం, నిరాశగా అనిపించడం) స్థితిలో ఉన్నామా లేదా అని మనం బాగా త్వరగా గమనించడం ప్రారంభిస్తాము. శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం మరియు శారీరక శ్రేయస్సు స్థితికి తిరిగి రావడం అనేది నేర్చుకోవడంలో ఈ అవగాహన మొదటి దశ, ఇది మన సొంత మరియు ఇతరుల ఉత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా పని చెయ్యడానికి ముందస్తు కండీషన్.

మన భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ ను పట్టించుకోవడం

శరీరాన్ని పట్టించుకుని నియంత్రించడం నేర్చుకోవడం భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ ని పట్టించుకోవడానికి పునాదిని వేస్తుంది. శరీరం ఎంత ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే మనసుపై దృష్టి పెట్టడం అంత సులభం అవుతుంది.

భావోద్వేగాలు చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి, అవి సాధారణంగా ఒక అడవి మంటలాగా మారడానికి ముందు చిన్న నిప్పు రవ్వగా ప్రారంభమవుతాయి. కేవలం నిప్పు రవ్వగా ఉండే తొలి దశలోనే మన నెగెటివ్ భావోద్వేగాలను ఆపగలిగితే వాటిని చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. కానీ అలా చెయ్యాలంటే భావోద్వేగాలు, అనుభూతులు ప్రస్తుత క్షణంలో వచ్చినప్పుడు వాటిని చూసే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. బుద్ధిపూర్వకత లాంటి అభ్యాసాలతో ఈ సామర్థ్యాన్ని మనం సమయం గడిచే కొద్దీ నేర్చుకోవచ్చు మరియు మెరుగుపరుచుకోవచ్చు.

మనస్సు యొక్క మ్యాప్ ను అనుసరించడం

మన భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ ను గమనించడం మనస్సును తెలుసుకోవడం ద్వారా బాగా సహాయపడుతుంది, ఇది మన భావోద్వేగ విషయాన్ని నావిగేట్ చెయ్యడానికి మనకు సహాయపడే ఒక రిసోర్సు. భావోద్వేగాల యొక్క వివిధ విషయాలను, వాటి సాధారణ లక్షణాలను మరియు ఈ భావోద్వేగాలకు దారితీసే మరియు ప్రోత్సహించే వాటిని గుర్తించడానికి సహాయపడే దాన్ని మనస్సు అందిస్తుంది. అన్ని భావోద్వేగాలు సహజంగా వినాశకరమైనవి కావని, అవి సందర్భం మరియు పరిస్థితికి అనుగుణంగా ఉన్నప్పుడు వినాశనం కలిగిస్తాయని మనం తెలుసుకుంటాము. ఉదాహరణకు, ఒక విషపూరితమైన పాము దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించినప్పుడు భయం నిర్మాణాత్మకంగా ఉంటుంది, కానీ అది ఎప్పుడైతే ఆందోళన దశకు చేరుతుందో అప్పుడు అది నెగెటివ్ గా మారుతుంది.

మనస్సు యొక్క మార్గదర్శకత్వంతో భావోద్వేగ అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా, చికాకు అనేది ఒక తేలికపాటి భావోద్వేగ స్థితిగా కోపానికి దారితీస్తుందని మరియు నియంత్రణలో లేని కోపం పూర్తి స్థాయి కోపానికి దారితీస్తుందని మనం తెలుసుకుంటాము. భావోద్వేగాల యొక్క సూక్ష్మ రూపాలను అవి మేనేజ్ చెయ్యలేని భావోద్వేగ స్థితులుగా మారడానికి ముందు గుర్తించగలగడమే సమతుల్య మానసిక ఆరోగ్యానికి కావాల్సిన నైపుణ్యం.

సొంత-కరుణ

సొంత-కరుణ అనేది సొంత-జాలి, దయగల సొంత-సంతృప్తి లేదా అధిక ఆత్మగౌరవం కాదు. సొంత-కరుణ అనేది నిజమైన సొంత-సంరక్షణ, ముఖ్యంగా ఇది మన అంతర్గత జీవితానికి సంబంధించినది. మన భావోద్వేగాలు మన అవసరాలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో ఒక అవగాహనకు రావడం చాలా ముఖ్యం. భావోద్వేగ చదువు యొక్క ఈ పొర ఎక్కువ సొంత-అంగీకారాన్ని అనుమతిస్తుంది ఎందుకంటే భావోద్వేగాలు ఎందుకు మరియు ఎలా వస్తాయో మనం అర్థం చేసుకున్నప్పుడు, తక్కువ సొంత-తీర్పుతో మనం వాటితో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. అప్పుడు, భావోద్వేగాలు తాత్కాలికమైనవి, అవి సందర్భాలలో వస్తాయి మరియు మన మనస్సులో మారని భాగం కాదని మనం చూసినప్పుడు, ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని మరియు మనపై పని చేసుకోవడం కొనసాగించడానికి ప్రేరణను కూడా అందిస్తుంది.

ఈ రెండు లక్షణాలు - సొంత-అంగీకారం మరియు ఆత్మవిశ్వాసం - విమర్శలను స్వీకరించడానికి మరియు సెట్-బ్యాక్‌లను నిర్మాణాత్మకంగా మరియు స్థితిస్థాపకతతో వ్యవహరించడానికి పునాదిని సృష్టిస్తాయి. ఇది నిరాశను అధిక సొంత విమర్శ లేదా సొంత విలువను కోల్పోకుండా నిరోధిస్తుంది. సొంత-కరుణలో రెండు అంశాలు ఉన్నాయి:

 • సందర్భాన్ని బట్టి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం
 • సొంత-అంగీకారం

సొంత-కరుణ అనేది మన సామర్థ్యాల యొక్క రియలిస్టిక్ అంచనాపై ఆధారపడి ఉంటుంది. మన పట్ల మన౦ దయ చూపి౦చకపోతే, మన౦ చెయ్యలేమని అనుకున్నప్పుడు మన౦ ఇంకా ఎక్కువ చెయ్యగలమని మన౦ అనుకుంటాము, అది నిరాశకు, శక్తిహీనతకు దారితీస్తు౦ది. ప్రాపంచిక విజయాన్ని బట్టి మనల్ని మనం అంచనా వేసుకునే బదులు, నిజాయితీతో, అవగాహనతో, సహనంతో మనం మన లోపాలను గుర్తిస్తాము.

సందర్భాన్ని బట్టి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం

సందర్భాలలో మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి - అవి మన విలువలు, అవసరాలు మరియు అంచనాలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయో  తెలుసుకోవడానికి మనకు విమర్శనాత్మక ఆలోచన అవసరం. ఇంతకు ముందు మన లోపలి ప్రపంచాన్ని గమనించడం నేర్చుకున్న తర్వాత, ఒక పరిస్థితికి మన భావోద్వేగ ప్రతిస్పందన బయటి ట్రిగ్గర్ ద్వారా మాత్రమే కాకుండా మన ఆలోచనలు మరియు వైఖరి ద్వారా కూడా ఎలా ప్రేరేపించబడుతుందో ఇక్కడ మనం తెలుసుకుంటాము. ఈ ఆలోచనలు మరియు వైఖరులు మన సొంత అవసరాల యొక్క ఆత్మాశ్రయ అవగాహనలో పాతుకుపోయాయి. ఉదాహరణకు, అది సాధ్యం కాని పరిస్థితిలో బాగా ఖచ్చితత్వం కోసం కోరిక నుంచి ఆందోళన కలుగవచ్చు. గౌరవించబడాలనే అవసరం నుంచి కూడా కోపం రావొచ్చు. సమయం మరియు సహనం అవసరమయ్యే పరిస్థితికి తక్షణ మార్పును కోరుకోవడం వల్లనే నిరాశ కలుగవచ్చు. ఈ అన్ని సందర్భాల్లో, భావోద్వేగాలు ప్రధానంగా మన వైఖరి మరియు అంచనాల ద్వారా బయటకు వస్తాయి.

ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు, మన విలువను గుర్తించడానికి, అభినందించడానికి మరియు సొంత-విలువ మరియు అంతర్గత ఆత్మవిశ్వాసం యొక్క స్థిరమైన భావాన్ని పెంపొందించడానికి మనం మంచి స్థితిలో ఉంటాము, అదే సమయంలో సరికాని సొంత-తీర్పుకు దారితీసే అవాస్తవిక అంచనాలను గుర్తించడం నేర్చుకుంటాము. భావోద్వేగాల ప్రతి చర్యలు ఎప్పుడూ అవసరాల నుంచి ఎలా వస్తాయో గుర్తించడం ద్వారా, ఆ అవసరాలను విమర్శనాత్మకంగా అంచనా వెయ్యడం కూడా మనం మొదలుపెట్టవచ్చు, కానీ ఇవన్నీ సమానంగా ఉండకపోవచ్చు. ఇది మన విలువలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా అవసరాలను కోరికల నుంచి వేరు చెయ్యడం మరియు ఆ విలువలను ప్రదర్శించే జీవితానికి మనల్ని నడిపిస్తుంది. ఇది దీర్ఘకాలిక శ్రేయస్సుకు దారితీయని స్వల్పకాలిక కోరికలను అనుసరించడానికి విరుద్ధంగా ఉంటుంది.

సొంత-అంగీకారం

మన సమాజాలలో కోపం అంతకంతకూ అంతర్గతంగా మారుతున్నందుకు సొంత-అంగీకారం చాలా ముఖ్యమైనది. మితిమీరిన సొంత-విమర్శ, సొంత-ద్వేషం మరియు మనల్ని మనమే అసహ్యించుకోవడం వ్యక్తిగత ఆరోగ్యానికి మరియు ఆనందానికి చాలా హాని కలిగించి ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఆత్మగౌరవాన్ని బలోపేతం చెయ్యడం అనేది ఉత్తమమైన పరిష్కారం కాదు, ఎందుకంటే ఆత్మగౌరవం ఇతరులతో పోలికలపై ఆధారపడి ఉంటుంది మరియు ఒక వ్యక్తి యొక్క అధిక ఆత్మగౌరవాన్ని భయపెట్టినప్పుడు కోపం ఎక్కువగా వస్తుంది. మన భావోద్వేగ జీవితం మరియు అవసరాలను పట్టించుకుని అంతర్గత స్థైర్యం, స్థితిస్థాపకత, వినయం మరియు ధైర్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఇలా చెయ్యడం వల్ల పరిపూర్ణవాద ఆదర్శీకరణను రిలాక్స్ గా ఉంచడానికి మరియు మన గురించి మరియు ఇతరుల గురించి రియలిస్టిక్ అంచనాల వైపు వెళ్ళడానికి అనుమతిస్తుంది. 

సామాజిక మాధ్యమాలు, టీవీ, సినిమాలు మొదలైన వాటి ద్వారా అవాస్తవిక భావనలను మనకు బోధించడంలో ఆధునిక సంస్కృతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా సార్లు మనల్ని మనం ఆదర్శవంతులైన సెలబ్రిటీలతో పోల్చుకుంటాం లేదా "సూపర్ మ్యాన్" లేదా "వండర్ ఉమెన్" లాగా ఉండాలని అనుకుంటాము. ఈ చేరుకోలేని ప్రమాణాలు అనవసరమైన మానసిక క్షోభకు దారితీస్తాయి. దాని ఫలితంగా నిరాశ మరియు మనపై మనమే నిందలు వేసుకోవడం జరుగుతుంది, శారీరక హాని చేసుకోవడం లేదా శత్రుత్వం మరియు హింసను బయటకు చూపించడం కూడా జరుగుతుంది.

మన భావోద్వేగ జీవితంపై మనకు కొంచెం అవగాహన మాత్రమే ఉన్నప్పుడు, సవాళ్లు, ఇబ్బందులు మరియు ఎదురుదెబ్బలను తట్టుకోవడంలో మనకు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది, అలాగే మార్పుకి, మరియు నిర్మాణాత్మక పనికి అవకాశాలను వెతకడం తగ్గుతుంది. ఈ విష చక్రాన్ని అధిగమించడానికి మన లిమిట్స్ గురించి రియలిస్టిక్ ఆలోచన ఉండడం చాలా ముఖ్యం. మన కష్టాలను, వాటి స్వభావాన్ని, మూలాల గురించి సహనాన్ని, అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా, ఈ హానికరమైన మానసిక స్థితులు మరియు ప్రవర్తనల నుంచి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రేరేపించబడతాము. అదే సమయంలో, మన పనితీరు లేదా మనం లేదా ఇతరుల ప్రమాణాలను చేరుకునే మన సామర్థ్యంతో సంబంధం లేకుండా మనకు సొంత-విలువ ఉంటుందని మనం నేర్చుకుంటాము. ఈ సొంత-విలువ భావన బయటి పరిస్థితులపై ఆధారపడదు -ఇది స్థితిస్థాపకతకు ఒక శక్తివంతమైన సహాయకారిగా పనిచేస్తుంది.

ఏదో ఒక స్థాయిలో నిరాశ, బాధలు తప్పవనే నిజాన్ని తెలుసుకోవడం ద్వారా దీన్ని మనం అంగీకరిస్తాము. అన్నింటిలోనూ ఉత్తమంగా ఉండటం, ఎప్పుడూ గెలవడం, ప్రతీ దాన్ని తెలుసుకోవడం లేదా ఎప్పుడూ తప్పు చెయ్యకపోవడం అసాధ్యం. దీన్ని ఎదుర్కోవాల్సింది మనం మాత్రమే కాదు. ఇవి ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన జీవిత సత్యాలు.

సొంత నియంత్రణ

ఇంతకుముందు రెండు విభాగాలలో కవర్ చెయ్యబడిన విషయాలు మరియు అభ్యాసాలు సొంత-నియంత్రణకు పునాదిని వేస్తాయి. సొంత-నియంత్రణ అనేది శరీరం, మనస్సు మరియు భావోద్వేగాల గురించి తెలుసుకున్న అవగాహనను బలపరిచే అభ్యాసాలు మరియు ప్రవర్తనలను సూచిస్తుంది. ఇక్కడ మన లక్ష్యం ఏమిటంటే, మన భావోద్వేగాలను విజయవంతంగా నావిగేట్ చేసుకోవచ్చు, అలా అవి మనకు లేదా ఇతరులకు ఏ సమస్యలను కలిగించవు: మన భావోద్వేగాలు మనకు అడ్డుగా కాకుండా సహాయపడేవిగా మారతాయి. సొంత-నియంత్రణ మూడు భాగాలను కలిగి ఉంటుంది:

 • శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం
 • అభిజ్ఞా మరియు ప్రేరణ నియంత్రణ
 • భావోద్వేగాలను నావిగేట్ చెయ్యడం

శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం

మనం ఒత్తిడికి గురైనప్పుడు లేదా హైపర్- లేదా హైపో-ఉద్రేకం స్థితిలో ఉన్నప్పుడు మన భావోద్వేగాలను విజయవంతంగా నావిగేట్ చెయ్యడానికి అవసరమైన అభిజ్ఞా మరియు ప్రేరణ నియంత్రణను పెంపొందించడం అంత సులభం కాదు. శరీరం యొక్క కొంత శారీరక నియంత్రణ లేకుండా మనస్సు యొక్క స్థిరత్వం మరియు స్పష్టతను తీసుకురావడం దాదాపు అసాధ్యం. అందువల్ల, శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడానికి సహాయపడే అభ్యాసాలు మనకు చాలా అవసరం. మనం గాయం లేదా చెడు బాల్య అనుభవాలతో బాధపడుతుంటే లేదా తక్కువ వాంఛనీయ పరిస్థితులలో ఉన్నట్లయితే శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం చాలా ముఖ్యం. 

శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం మరియు శరీరాన్ని రిలాక్స్ గా ఉంచడం లేదా నిద్రను ప్రేరేపించడం మధ్య ఉండే తేడాను మనం గుర్తించాలి. శ్రద్ధ మరియు అభ్యసనకు అనుకూలమైన శారీరక మరియు మానసిక నియంత్రణ స్థితిని తీసుకురావడమే ఇక్కడ లక్ష్యం. ఇది డల్ గా, నిద్రవచ్చే లేదా బద్ధకమైన స్థితి కన్నా ఒక చురుకైన, స్థితిస్థాపక మరియు సమతుల్య స్థితి.

శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడానికి మొదటి దశ సురక్షితమైన చోటుని సృష్టించడం. నమ్మకం, భద్రత అనే భావన లేకుండా, మనం అప్రమత్త స్థితిలో ఉంటాం. అయితే, మన౦ సురక్షిత౦గా ఉన్నప్పుడు, మన ఆలోచనలను, భావాలను ఉత్సుకతతో అన్వేషి౦చడానికి మనకు స్వేచ్ఛ ఉ౦టు౦ది. భద్రత అనేది అంచనా వెయ్యడం ద్వారా సృష్టించబడుతుంది, మరియు ఒక స్థిరమైన ప్రవర్తన ద్వారా ఈ అంచనా వస్తుంది. ఇక్కడ, స్థిరత్వం అనేది మనకు సంబంధించినది కాదు, కానీ అవగాహన మరియు కరుణతో మనం మనతో వ్యవహరించడంలో ఉండే స్థిరత్వం.

శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం మరియు భద్రతా భావాన్ని అభివృద్ధి చెయ్యడం ఈ క్రింది వాటి ద్వారా కుదురుతుంది:

 • రిసోర్సింగ్ అనేది బయటి లేదా లోపలి "రిసోర్సులను" పొందడాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. బయటి రిసోర్సులు ఒక స్నేహితుడు, ఇష్టమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన జ్ఞాపకం, ప్రియమైన పెంపుడు జంతువు లాంటివి కావచ్చు. లోపలి రిసోర్సులు మనకు ఉన్న నైపుణ్యం కావచ్చు లేదా మన హాస్య భావన లేదా మన శరీరంలోని బలమైన మరియు సామర్థ్యాన్ని అనుభూతి చెందే భాగం లాంటి ఒక పాజిటివ్ విషయం కావచ్చు. మన రిసోర్సులను మనస్సులోకి తీసుకోవడం మనల్ని స్థితిస్థాపకత, భద్రత మరియు సౌకర్యవంతమైన ప్రదేశానికి పంపడంలో సహాయపడుతుంది. ఇది అభివృద్ధి చెందిన తర్వాత, మన రిసోర్సుల గురించి ఆలోచిస్తున్నప్పుడు మన అనుభూతులను ట్రాక్ చెయ్యవచ్చు మరియు ఒత్తిడిలో లేదా ఆత్రుతగా ఉన్నప్పుడు మన శరీరం ఎలా భావిస్తుంది అనేది దీనికి విరుద్ధంగా ఉంటుంది.
 • గ్రౌండింగ్ అంటే మనకు కావాల్సిన వస్తువును తాకడం లేదా పట్టుకోవడం లేదా శరీరానికి అవసరమైనదిగా భావించడం. వస్తువు లేదా సహాయం ఎలా అనిపిస్తుందో మనం పట్టించుకుంటాము, మరియు భంగిమలను మారడం, మన భావాలు ఎలా మారుతున్నాయో గమనించడానికి ప్రయత్నిస్తాము.
 • యోగా, తై-చి, సంగీతం వినడం, డ్రాయింగ్ మరియు జర్నలింగ్ లాంటి పనులు కూడా శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడానికి మంచి అధికారిక పద్ధతులకు మారడానికి సరైన మార్గాలు. మన శ్వాసలను లెక్కించే లేదా లోతైన శ్వాసలో పాల్గొనే పురాతన మరియు సరళమైన పద్ధతిని కూడా మనం ఉపయోగించవచ్చు.

అభిజ్ఞా మరియు ప్రేరణ నియంత్రణ

మనం జీవితంలో విజయం సాధించాలంటే ఎప్పుడూ మన దృష్టి పోగొట్టుకోకుండా పనులపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇది ముఖ్యమైన మీటింగ్స్ లలో శ్రద్ధ వహించగలగడం గురించి మాత్రమే కాదు, పనికిరాని మన ఆలోచనలు మరియు ప్రవర్తనలను గమనించే సామర్ధ్యాన్ని కలిగి ఉండడం. మన ప్రేరణలను నియంత్రించగలగడం మరియు వాటిని అమలు చెయ్యకపోవడం అనేది మన దృష్టిని పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుంది, అంటే మనం దాన్ని నిలుపుకోగలము మరియు పరధ్యానంలో చిక్కుకోలేము అనే వరకు. మరీ ముఖ్యంగా, ఇక్కడ శ్రద్ధ అనేది లోపలిగా దృష్టి పెట్టడానికి మరియు మన శరీరం మరియు మనస్సులో మార్పులు జరుగుతున్నప్పుడు ట్రాక్ చేసే మన సామర్థ్యాన్ని సూచిస్తుంది. మన దృష్టికి శిక్షణ ఇవ్వడం ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య ఒక స్థలాన్ని సృష్టించడం నేర్పుతుంది.

మనం దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగాలంటే, మరియు మనం ఎదుర్కొంటున్న సవాళ్లను విజయవంతంగా మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఈ సామర్థ్యం అవసరం. మన దృష్టిపై మనకు మంచి నియంత్రణ ఉన్నప్పుడు, మన ఉపాధ్యాయుడు లేదా యజమానిపై శ్రద్ధ పెట్టడం కంటే, మన అభిజ్ఞా ప్రక్రియలు మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు మరియు మన పనులను బాగా వ్యక్తీకరించవచ్చు. ఈ విధంగా, మనం జీవితంలో ఒక ఎడ్జ్ ని పొంది ఆనందించవచ్చు.

మన దృష్టిని పెంచడానికి సహాయపడే కొన్ని వ్యూహాలు ఉన్నాయి. దృష్టి యొక్క నిర్దిష్ట వస్తువులపై దృష్టి పెట్టడం, మన శరీరం మరియు మనస్సులో ఏమి జరుగుతుందనే దానిపై అవగాహనను పెంపొందించడం మరియు మన ఆలోచనలు మరియు భావోద్వేగాలను చూడటంలో పాల్గొనడం ద్వారా మనం "పూర్తిగా ప్రెజెంట్ లో ఉండటం" అనేది నేర్చుకోవచ్చు.

భావోద్వేగాలను నావిగేట్ చెయ్యడం

మన భావోద్వేగాలను నావిగేట్ చెయ్యడానికి శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యడం మరియు అభిజ్ఞా నియంత్రణను పెంపొందించడం ద్వారా పొందిన నైపుణ్యాలను మనం ఉపయోగిస్తాము. ఈ చివరి దశ జ్ఞానాన్ని అసలైన ఆచరణలో పెట్టడం మరియు భావోద్వేగ అక్షరాస్యత యొక్క చివరి దశను కలిగి ఉంటుంది.

ఇక్కడ, మనం భావోద్వేగ విచక్షణను పెంపొందించుకుంటాము. భావోద్వేగాలు మనకు మరియు ఇతరులకు ఉత్పాదకంగా మరియు సహాయకారిగా ఉన్నప్పుడు మరియు అవి మనకు మరియు ఇతరులకు విషపూరితంగా లేదా హానికరంగా మారినప్పుడు గుర్తించే సామర్థ్యం ఇది. మన వ్యక్తిగత అనుభవాన్ని ప్రతిబింబించి మన మనస్సును ఉపయోగించి మనం దీన్ని చేయవచ్చు. భావోద్వేగాలు గతంలో ఎలా పనిచేశాయో, మరియు అవి ఇచ్చిన ఫలితాలను అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు, సహజంగా మనం నిర్మాణాత్మక మరియు విధ్వంసక భావోద్వేగాలపై అవగాహనను పెంపొందించుకుంటాము. ఇది మనకు మరియు ఇతరులకు హాని కలిగించే మానసిక స్థితుల గురించి జాగ్రత్తగా ఉండటానికి సహాయపడుతుంది. మనలో ఏ ఆలోచనలను ప్రోత్సహించాలో, వేటిని మార్చుకోవాలో కూడా మనం నిర్ణయించుకోవచ్చు. భావోద్వేగాలను గుర్తించడంలో మరియు నియంత్రించడంలో మనం సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు, మనం ఉత్సాహం, ధైర్యం మరియు మన ఆత్మవిశ్వాసం పెరగడాన్ని అనుభూతి చెందుతాము.

సారాంశం

భావోద్వేగ చదువును అభివృద్ధి చేసుకోవడం - మన మనస్సు, భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం అనేది - మన ఆత్మగౌరవం యొక్క ఆరోగ్యకరమైన భావన మరియు మన భావోద్వేగాలు సరిగ్గా వ్యవహరించే సామర్థ్యానికి మార్గంలో అవసరమైన ఒక స్టెప్. మన భావోద్వేగాలు మనలో అంతర్లీన భాగం కాదని మనం తెలుసుకున్నప్పుడు, మనం వాటిని విజయవంతంగా ఎదుర్కోగలిగి సొంత అంగీకారానికి రావచ్చు. కోపంగా ఉండటానికి లేదా నిరాశకు గురైనందుకు బాధ పడడానికి ఎటువంటి కారణం లేదని మనం తెలుసుకుంటాము. ఒకసారి మన మనస్సుని తెలుసుకుని, వివిధ భావోద్వేగాల కారణాలు, ప్రభావాలను అర్థం చేసుకున్న తర్వాత, మనకు మనశ్శాంతి కలిగించేది ఏమిటో, మనకు బాధ కలిగించేది ఏమిటో మనమే కనిపెట్టవచ్చు; మరియు ఆ నెగెటివ్ భావోద్వేగాలకు, అవి అదుపు తప్పక ముందే వాటిని ఆపడానికి కావాల్సిన నైపుణ్యాలు మనకు ఉంటాయి. దీనిలో శిక్షణ మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మరియు మన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మరియు దాన్ని పూర్తిగా సాధించడానికి మనకు సహాయపడుతుంది.

మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, SEE లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ యొక్క పూర్తి వెర్షన్ ను చదవండి మరియు సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ మరియు కంపాషన్-బేస్డ్ ఎథిక్స్ యొక్క మిగతా ప్రోగ్రామ్ ల గురించి తెలుసుకోండి.

Top