ప్రాథమిక బౌద్ధమత అభ్యాసంలో మనకు మూడు రంగాలలో శిక్షణ అవసరం. మన స్వంత ఆరోగ్యం గురించి శ్రద్ధతో, మన సమస్యలు మరియు బాధలను అధిగమించడానికి మనం శిక్షణను పొందవచ్చు. ఇతరులకు ఇంకా సహాయంగా ఉండటానికి మనం ప్రేమ మరియు కరుణతో శిక్షణను ఇవ్వవచ్చు.

ఈ మూడు శిక్షణలు ఏమిటి?

  • నైతిక క్రమశిక్షణ – ఇది వినాశకరమైన ప్రవర్తనకు దూరంగా ఉండగలిగే సామర్థ్యం. దీనిని అభివృద్ధి చేసుకోవడానికి మనం నిర్మాణాత్మక ప్రవర్తనలో నిమగ్నం అవ్వాలి. ఈ మొదటి శిక్షణ క్రమశిక్షణ గురించి ఉంటుంది - మనం ఇక్కడ ఇతరులను క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నించడం లేదు.
  • ఏకాగ్రత – బయట ఆలోచనల వల్ల మన మనస్సు ఎటూ పోకుండా కేంద్రీకరించగలిగే సామర్థ్యం ఇది. మన మనస్సును నీరసంగా కాకుండా యాక్టివ్ గా మరియు ఏకాగ్రతతో ఉండేలా చేస్తాము. మానసిక స్థిరత్వంతో పాటు, భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా పెంపొందించుకోవడం చాలా అవసరం, అలా మన మనస్సులు కోపం, అనుబంధం, అసూయ మొదలైన వాటితో తొక్కివేయబడవు.
  • విచక్షణాత్మక అవగాహన – దేనిని స్వీకరించాలో మరియు దేనిని విస్మరించాలో అనే తేడాను గుర్తించగలిగే విచక్షణా సామర్థ్యం ఇది. మీరు కూరగాయల కోసం షాపింగ్ కి వెళ్లినప్పుడు, మీరు "ఇది చూడటానికి బాగోలేదు, కానీ అది చాలా బాగుంది" అని తేడాను చూపిస్తారు. ఇక్కడ, మనం ప్రవర్తన పరంగా తేడాను చూపిస్తాము - ఏది సరైనది కాదో మరియు ఏది సరైనదో అనేది మనం ఉన్న పరిస్థితులను బట్టి మరియు మనం ఎవరితో ఉన్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా లోతైన స్థాయిలో ఆలోచిస్తే అసలు ఏది నిజమైనది మరియు ఏది అంచనాల ఊహ అనే తేడాను చూపిస్తాము.

బౌద్ధ శాస్త్రం, బౌద్ధ తత్వశాస్త్రం మరియు బౌద్ధ మతం

ఈ మూడు శిక్షణలను మన సొంత ప్రయోజనాల కోసమో, ఇతరుల ప్రయోజనం కోసమో పాటించినా, వాటిలో దేనినైనా మనం రెండు కోణాల నుంచి పరిశీలించవచ్చు. ఈ రెండూ దలైలామా గారు ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు చేసే విభజన నుంచి ఉద్భవించాయి. అక్కడ, గురువు గారు బౌద్ధమతాన్ని మూడు భాగాలుగా వివరించారు: బౌద్ధ శాస్త్రం, బౌద్ధ తత్వశాస్త్రం మరియు బౌద్ధ మతం.

బౌద్ధ శాస్త్రం ప్రధానంగా మనస్సు యొక్క శాస్త్రాన్ని సూచిస్తుంది - అది ఎలా పనిచేస్తుంది, భావోద్వేగాలు, మరియు దలైలామా గారు పిలిచే మానసిక మరియు భావోద్వేగ పరిశుభ్రతలు. బౌద్ధమతం వివిధ భావోద్వేగ స్థితుల గురించి మరియు అవి కలిసి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి చాలా వివరణాత్మక విశ్లేషణను కలిగి ఉంటుంది.

బౌద్ధ శాస్త్రంలో ఇవి కూడా ఉన్నాయి:

  • అభిజ్ఞా శాస్త్రం – ఇందులో మన అవగాహన ఎలా పనిచేస్తుంది, చైతన్యం యొక్క స్వభావం మరియు ఏకాగ్రతను పెంపొందించడంలో మనకు సహాయపడే వివిధ శిక్షణా పద్ధతుల గురించి ఉంటుంది.
  • కాస్మోగోనీ - విశ్వం ఎలా ప్రారంభమయ్యింది, అది ఎలా గడుస్తుంది మరియు ఎలా ముగుస్తుంది అనే దానిపై వివరణాత్మక విశ్లేషణ.
  • పదార్థం - పదార్థం, శక్తి, ఉప పరమాణు కణాలు మొదలైనవి ఎలా పనిచేస్తాయనే వివరణాత్మక విశ్లేషణ.
  • మెడిసిన్ - శరీరంలో శక్తి ఎలా పనిచేస్తుంది.

పై విషయాలను ఎవరైనా అధ్యయనం చేయవచ్చు, నేర్చుకోవచ్చు మరియు వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. దలైలామా గారు తరచుగా ఈ విషయాలపై శాస్త్రవేత్తలతో చర్చలు జరుపుతారు.

రెండవ భాగమైన బౌద్ధ తత్వశాస్త్రంలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి:

  • నైతికత - దయ మరియు ఉదారత వంటి ప్రాథమిక మానవ విలువల గురించి చర్చించడం, అవి ఏ మతానికి సంబంధించినవి కాదు అని, మరియు వాటి నుంచి ఎవరైనా ప్రయోజనం పొందవచ్చు అని చెప్పడం.
  • లాజిక్ మరియు మెటాఫిజిక్స్ – ఇందులో సెట్ థియరీ, యూనివర్సల్స్, వివరాలు, లక్షణాలు మొదలైన వాటి యొక్క వివరణ. అవి ఎలా కలిసి పనిచేస్తాయి మరియు వాటిని మనం ఎలా తెలుసుకుంటాము అని ఉంటుంది.
  • కారణం మరియు ప్రభావం - కారణాత్మకత, వాస్తవం అంటే ఏమిటి మరియు మన అంచనాలు రియాలిటీని ఎలా మారుస్తాయి అని ఇందులో ఉంటుంది.

మళ్ళీ, ఈ బౌద్ధ తత్వశాస్త్రం కేవలం బౌద్దులకు మాత్రమే పరిమితం అని కాదు, దీని ప్రయోజనం ప్రతి ఒక్కరూ పొందగలరు.

మూడవ భాగమైన బౌద్ధ మతం, బౌద్ధ అభ్యాసం యొక్క విషయాలను కలిగి ఉంటుంది. ఇది కర్మ, పునర్జన్మ, ఆచార పద్ధతులు, మంత్రాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. అందువల్ల బౌద్ధ మార్గాన్ని అనుసరిస్తున్న వారికి ఇది చాలా ప్రత్యేకమైనది.

అందరికి కావలసినట్టుగా మరియు తగినట్టుగా ఈ మూడు శిక్షణలను కేవలం బౌద్ధ శాస్త్రం మరియు తత్వశాస్త్రం పరంగా ప్రెజెంట్ చెయ్యవచ్చు, లేదా ఆ రెండింటిని బౌద్ధ మతానికి సంబంధించినవిగా ప్రదర్శించవచ్చు. దీనిని నేను "ధర్మ-కాంతి" మరియు "నిజమైన ధర్మం" అని పిలుస్తాను.

  • ధర్మ-కాంతి - ఈ జీవితకాలాన్ని మెరుగుపరచడం కోసం బౌద్ధ శాస్త్రం మరియు తత్వశాస్త్ర పద్ధతులను నేర్చుకోవడం.
  • నిజమైన ధర్మం - మూడు బౌద్ధమత లక్ష్యాల కోసం శిక్షణ తీసుకోవడం: మెరుగైన పునర్జన్మ, పునర్జన్మ నుంచి విముక్తి మరియు జ్ఞానోదయం పొందడం.

నేను ధర్మ-కాంతి గురించి మాట్లాడేటప్పుడు, ఇది సాధారణంగా నిజమైన ధర్మానికి ప్రాథమిక దశ అని అర్ధం, ఎందుకంటే ముందు మన సాధారణ జీవితాలను మెరుగుపరుచాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి, మరిన్ని ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి మనం ఆలోచించవచ్చు. ఏదేమైనా, బౌద్ధ శాస్త్రం మరియు తత్వశాస్త్రం బౌద్ధ మతానికి ప్రాథమికమైనవి కావు, కాబట్టి ఈ మూడు శిక్షణలను మన జీవితాలను మెరుగుపరచడానికి ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోవచ్చు, దీనిని బౌద్ధ మార్గం యొక్క ప్రాధమికమైన దశగా లేదా సాధారణమైనది అని ఆలోచించాలి.

నాలుగు ఉత్తమ సత్యాలు

బౌద్ధ తత్వశాస్త్రం నుంచి, బౌద్దుల ఆలోచనలు పనిచేసే విధానం గురించి మనకు తెలుసు, వీటినే మనం సాధారణంగా నాలుగు ఉత్తమమైన సత్యాలు అని పిలుస్తాము. మనం వాటిని జీవితంలోని నాలుగు రియాలిటీలుగా కూడా చెప్పవచ్చు, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • మనమందరం ఎదుర్కునే బాధలు మరియు సమస్యలను చూస్తే, అందులోని మొదటి నిజం, జీవితం అనేది కష్టంతో కూడుకున్నది.
  • రెండవ నిజం, మన జీవితంలో సమస్యలు కారణాల వల్ల వస్తాయి అనేది.
  • మూడవ నిజం, మనం ఈ సమస్యలను ఆపగలము; మనం నోరు మూసుకుని మన సమస్యలను అంగీకరించాల్సిన అవసరం లేదు, మనం వాటిని పరిష్కరించగలము అని.
  • నాలుగవ నిజం ఏమిటంటే, కారణాన్ని తొలగించడం ద్వారా మన సమస్యలను వదిలించుకోవచ్చు. ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో సలహాలు ఇచ్చే అవగాహనా మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం దానిని సాధించగలం.

కాబట్టి, మనం వ్యవహరించే విధానం లేదా మాట్లాడే విధానం మనకు సమస్యలను కలిగిస్తే, మనం దానిని మార్చాల్సిన అవసరం ఉంది. మన సమస్యలకు గల కారణాలను వదిలించుకోవడానికి మనకు అవసరమైన వాటిలో ఈ మూడు శిక్షణలు ఒక భాగం. ఈ మూడు శిక్షణలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక సహాయకరమైన మార్గం, ఎందుకంటే మనం ఆ శిక్షణలు ఎందుకు తీసుకోవాలో ఇది సూచిస్తుంది. కాబట్టి, మనకు జీవితంలో సమస్యలు ఉంటే, మనం ఈ కింది వాటిని ఆలోచిస్తాము:

  • నా నైతిక క్రమశిక్షణలో, నా ప్రవర్తనలో మరియు నేను మాట్లాడే విధానంలో ఏదైనా సమస్య ఉందా?
  • నా ఏకాగ్రతలో ఏదైనా సమస్య ఉందా - నేను అన్ని చోట్లా సరిగ్గా ఉన్నానా, లేదా నేను భావోద్వేగ గందరగోళానికి గురయ్యానా?
  • ముఖ్యంగా, రియాలిటీకి, నా పిచ్చి ఊహల మధ్య తేడాను గుర్తించే విధానంలో ఏదైనా సమస్య ఉందా?

ఈ జన్మలో మన జీవితానికి లేదా భవిష్యత్తులో మనం ఎదుర్కునే సమస్యలకు దీనిని ఉపయోగించవచ్చు. ప్రారంభ స్థాయిలో, ఈ శిక్షణను మన జీవితంలో ఒక భాగంగా మాత్రమే పరిగణించాలి: అవి మనకు ఎలా సహాయపడతాయి? మనకు ఈ సమస్యలు రావటానికి మనం ఏమి చేస్తున్నాము? వాటిని తగ్గించడానికి మనం ఏమి చెయ్యగలం? అని ఆలోచించాలి.

బాధలకు కారణం

బౌద్ధ తత్త్వశాస్త్ర విధానంలో చూస్తే, మన బాధలకు కారణం అజ్ఞానమే. ముఖ్యంగా రెండు విషయాల గురించి మనకు ఏమీ తెలియదు.

మనకు తెలియని మొదటి విషయం ఏమిటంటే కారణం మరియు ప్రభావం, ముఖ్యంగా మన ప్రవర్తన పరంగా. కోపం, దురాశ, మమకారం, అహంకారం, అసూయ వంటి ఇబ్బంది కలిగించే భావోద్వేగాలు ఉంటే మనం వినాశనాన్ని కలిగిస్తాము. మనకు కోపం వచ్చి పక్కన ఉన్న వాళ్ల మీద అరుస్తాము, మనం అసూయపడతాము మరియు ప్రజలకు హాని చేయడానికి ప్రయత్నిస్తాము. మనం వ్యక్తులతో బాగా దగ్గర అయిపోతాము - ఇవన్నీ మనకు సమస్యలను కలిగిస్తాయి. ఎందుకంటే ఈ భావోద్వేగాలు మనల్ని వినాశకరంగా లేదా మనకు మనమే అన్నిటినీ పాడుచేసేలా చేస్తాయి కాబట్టి, చివరికి మనకు అసంతృప్తి మాత్రమే మిగులుతుంది.

ఇబ్బంది పెట్టే భావోద్వేగం యొక్క అర్ధం తెలుసుకోవాలి. ఇది ఒక మానసిక స్థితి, ఇది వచ్చినప్పుడు, మన మనశ్శాంతిని మరియు మన నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. కోపంతో మనం ఎవరినైనా తిట్టినప్పుడు, అది వారిని ఇబ్బంది పెట్టవచ్చు లేదంటే ఏ ప్రభావం చూపించకపోవచ్చు. మనం చెప్పేది వాళ్ళు అసలు వినకపోవచ్చు, లేదా వాళ్ళు మనల్ని చూసి నవ్వి మనం మూర్ఖులమని అనుకోవచ్చు. కానీ మనం మనశ్శాంతిని కోల్పోయి మానసికంగా బాధ పడతాము, ఇది ఎలాగో అరవటం ఆగిపోయిన తర్వాత సర్దుకుంటుంది. ఇది ఒక చేదు అనుభవం. మనం నియంత్రణను కోల్పోయాము కాబట్టి, తర్వాత పశ్చాత్తాపపడే మాటలను మాట్లాడతాము.

మనం ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తాము అంటే:

  • కారణం మరియు ప్రభావం మనకు నిజంగా అసలు అర్థం కావు. మనం కొన్ని విధాలుగా, ఇబ్బందిపెట్టే భావోద్వేగాల ప్రభావంతో ప్రవర్తిస్తే, అది మనకు అసంతృప్తిని తెస్తుందని మనకు తెలీదు.
  • లేదా, మనం కారణం మరియు ప్రభావం గురించి గందరగోళానికి గురవుతాము అలా దానిని రివర్స్ లో అర్థం చేసుకుంటాము. "సరే, నేను ఈ వ్యక్తిని తిడితే అది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది" అని మనం ఎప్పుడూ అనుకుంటాము. నిజానికి అలా అస్సలు జరగదు. లేదా, మనం నిజంగా ఎవరికైనా దగ్గరయినప్పుడు, "నువ్వు నాకు ఎందుకు ఎక్కువ సార్లు కాల్ చెయ్యవు, లేదా నన్ను చూడటానికి అసలు రావు ఏంటి?" అని మనం అడుగుతూ ఉంటాము. ఇది ఎప్పుడూ వారిని వెంటాడుతుంది, అవునా కాదా? మనం అనుకున్నది సాధించలేము, ఎందుకంటే కారణం మరియు ప్రభావం ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు.

మనకున్న రెండో రకమైన అజ్ఞానం రియాలిటీకి సంబంధించింది. రియాలిటీ అంటే ఏమిటో మనకు సరిగ్గా తెలీదు. అందుకే ఇలాంటి ఇబ్బందికరమైన వైఖరులు ఉన్నాయి. దీనికి ఒక ఉదాహరణ సొంత-శ్రద్ధ. ఇక్కడ మనం ఎప్పుడూ మన గురించి, నా గురించి మరియు నేనే అని ఆలోచిస్తాము. ఇది చాలా జడ్జిమెంటల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది మనం పరిపూర్ణంగా ఉండాలని భావించే సిండ్రోమ్ గా మారుతుంది. మనం నిర్మాణాత్మకంగా వ్యవహరించినా, పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నించినా, ప్రతీదీ సరిగ్గా ఉండాలనుకున్నా - అది చాలా బలవంతంగా మారుతుంది. అయినా కానీ, మనకు కొంత తాత్కాలిక ఆనందం ఉన్నప్పటికీ, అది తొందర్లోనే అసంతృప్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా  "నేను సరైన వాడిని కాదు" అని అనుకుంటాము మరియు మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఇంకా కష్టపడతాము.

అతి శుభ్రంగా ఉండే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం - అతని ఇంటిని బాగా శుభ్రం చేసుకునే వ్యక్తి. అలాంటి వాళ్ళు ప్రతి దాన్ని నియంత్రించగలరనే అపోహలో ఉంటారు మరియు అన్నింటినీ ఎప్పుడూ శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచుతారు. ఇది అసాధ్యం! మీరు మొత్తం శుభ్రం చేస్తారు; బాగా ఉండేలా చేస్తారు, మంచి అనుభూతిని చెందుతారు, తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి మొత్తం పాడు చేస్తారు; అప్పుడు మీరు అసంతృప్తి చెంది దాన్ని మళ్లీ శుభ్రం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అది తప్పనిసరి అవుతుంది. మీరు కొంచెం సంతోషాన్ని అనుభవించిన ప్రతిసారీ, "ఆహ్, ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది" - అనే ఈ భావన తొందర్లోనే పోతుంది. మీరు ఎప్పుడూ మిస్ అయిన ప్రదేశం ఏదొకటి ఉంటుంది!

ఈ మానసిక స్థితిని రిపీట్ అవ్వడంతో, అది కలవరపరిచే భావోద్వేగం లేదా కలవరపరిచే వైఖరి అవుతుంది, ఈ రకమైన బలవంతపు ప్రవర్తనను రిపీట్ అవ్వడంతో, మీరు "సర్వ వ్యాప్త బాధ" అని పిలువబడేదాన్ని అనుభూతి చెందుతారు. ఈ అలవాట్లను మనం ఎలా పెంపొందించుకుంటాం అంటే అవి మన సమస్యలను శాశ్వతంగా అలాగే ఉండేలా చేస్తాయి.

ఇది మనల్ని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మనం ఎప్పుడూ కోపంగా ఉంటే, మనకు అధిక రక్తపోటు వస్తుంది, ఆ తర్వాత ఆందోళన చెందడం వల్ల అల్సర్ కూడా వస్తుంది, ఇలా ఇంకెన్నో రోగాలు వస్తాయి. లేదా, మీరు ఒక అతి శుభ్రత వ్యక్తి అయితే, విశ్రాంతి తీసుకోవడం కష్టం అవుతుంది. మీరు ఎప్పుడూ టెన్షన్ లో ఉంటారు ఎందుకంటే ప్రతీదీ మీకు సరిగ్గా, శుభ్రంగా ఉండాలి. కానీ అలా ఎప్పుడూ జరగదు.

మన సమస్యలకు కారణమైన వాటిని తొలగించడానికి మూడు శిక్షణలు ఎలా సహాయపడతాయి

మనకు నిజంగా కావాల్సిన మూడు శిక్షణలు:

  • మన అయోమయాన్ని వదిలించుకోవడానికి మనకు విచక్షణా అవగాహన అవసరం. ఉదాహరణకు, అతి శుభ్రమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, "ప్రతీదీ ఎప్పుడూ పరిపూర్ణంగా మరియు శుభ్రంగా ఉండాలి మరియు నేను ప్రతి దాన్ని నియంత్రించాలి" అనే ఆశను కలిగి ఉన్నప్పుడు, మీరు దానిని "అవును నా ఇల్లు మురికిగా ఉంటుంది, దీనిని ఎవరూ మార్చలేరు" అని మార్చుకోవాలి. మీరు అప్పుడు బాగా రిలాక్స్ అవుతారు ఎందుకంటే మీరు ఇప్పటికీ మీ ఇంటిని శుభ్రం చేశారు, కానీ మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీకు గుర్తుంటుంది. సాంప్రదాయ గ్రంథాలు పదునైన గొడ్డలితో చెట్టును నరికివేసే అనే ఉదాహరణను ఉపయోగించాలి.
  • ఈ గొడ్డలితో చెట్టును నరికివేయడానికి, మనం ఒకే చోట ఎక్కువ సార్లు కొడుతూ ఉండాలి, ఇక్కడ దీనినే ఏకాగ్రత అంటారు. మన మనస్సు ఎప్పుడూ పరధ్యానంలో ఉంటే, అప్పుడు మనం ఆ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాము. కాబట్టి, మనం ఏకాగ్రతను కలిగి ఉండాలి, అప్పుడే మనం ఒకేచోట గొడ్డలితో కొట్టగలం.
  • నిజానికి ఈ గొడ్డలిని ఉపయోగించడానికి చాలా బలం కావాలి. మీకు బలం లేకపోతే, అసలు మీరు ఆ గొడ్డలిని కూడా ఎత్తలేరు. ఈ బలం నైతిక క్రమశిక్షణ నుంచి వస్తుంది.

ఈ విధంగా, మన సమస్యల మూలాన్ని అధిగమించడానికి ఈ మూడు శిక్షణలు మనకు ఎలా సహాయపడతాయో మనం అర్థం చేసుకుంటాము. బౌద్ధ మతం యొక్క ప్రస్తావన లేకుండా పైవాటన్నిటినీ చేయవచ్చు, కాబట్టి ఇది ఎవరికైనా పని చేస్తుంది. ముందుకు వెళ్లే ముందు, మనం ఇప్పటి దాక నేర్చుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం:

  • ఫాంటసీ మరియు రియాలిటీ మధ్య తేడాను తెలుసుకోవడానికి మనం విచక్షణాత్మక అవగాహనను ఉపయోగిస్తాము, అలా మన స్వంత ప్రవర్తనలో కారణం మరియు ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. మనకు విచక్షణా అవగాహన లేనప్పుడు, మన ప్రవర్తన మరియు పద్ధతులు అసంతృప్తిని లేదా ఒక రకమైన సంతృప్తిని ఇవ్వని ఆనందాన్ని సృష్టిస్తాయి.
  • ఈ పై విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి, మనకు మంచి ఏకాగ్రత అవసరం, అప్పుడే మనం సరిగ్గా ఉండగలం.
  • మంచి ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి, మనకు క్రమశిక్షణ అవసరం, అప్పుడు మన మనస్సు ఎటైనా వెళ్తూ ఉంటే దాన్ని వెనక్కి తీసుకురాగలం.
  • మనం ఈ మూడు శిక్షణలను అప్లై చెయ్యాలని అనుకుంటున్నాము, ఇవి మన సమస్యలను ఎదుర్కోవటానికి మరియు మన జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మనకు సహాయపడతాయి.

వీటన్నిటి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన జీవితంలో మనం అనుభవించే ఆనందం మరియు అసంతృప్తి మన స్వంత గందరగోళం నుంచే వస్తుంది. మన సమస్యలను ఇతరులు, సమాజం, ఆర్థిక ఇబ్బందులు మొదలైనవాటిపై నిందించడానికి బదులుగా, మనం లోతైన స్థాయిలో దృష్టి పెట్టి ఆలోచించాలి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు మన మానసిక స్థితిని పరిశీలిస్తాం. మనం చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు, కానీ ఇక్కడ మనం మన సాధారణ అసంతృప్తి భావన మరియు క్షణిక ఆనందం గురించే మాట్లాడుతున్నాము. మనశ్శాంతితో వచ్చే, మరింత శాశ్వతమైన, సుస్థిరమైన ఒక రకమైన ఆనందాన్ని మనం లక్ష్యంగా చేసుకోవాలి.

మనకు కష్టాలు ఎదురైనప్పుడు, మనమందరం నిరాశకు గురవుతాము మరియు పూర్తిగా బాధలోకి వెళ్ళిపోతాము. లేదా మనల్ని మనం మరింత మనశ్శాంతితో ఎదుర్కోగలం. ఎందుకంటే మనం పరిస్థితిని చాలా స్పష్టంగా చూస్తాము. దానిలో ఏమి ఉందో తెలుసుకుంటాము. అలా దానిని ఎదుర్కోవటానికి మార్గాలను కనిపెడతాము.

మీ పిల్లవాడు రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు, "వాడు సురక్షితంగా ఇంటికి వస్తాడా లేదా" అని మీరు నిజంగా భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఒక సందర్భాన్ని తీసుకోండి. మళ్ళీ, మన ఆందోళన మరియు అసంతృప్తికి సోర్స్ "నా బిడ్డ యొక్క భద్రతను నేను కంట్రోల్ చెయ్యగలను" అనే పద్ధతి, నిజానికి ఒక ఊహతో కూడుకున్నది. వాళ్ళు సురక్షితంగా ఇంటికి వచ్చినప్పుడు మరియు మీరు సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. కానీ అతను మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు, మీరు మళ్లీ ఆందోళనకు గురవుతారు. కాబట్టి ఆ రకమైన అనుభూతి శాశ్వతంగా ఉండదు, అవునా కదా? అప్పుడు మనం ఆందోళన చెందుతూ ఉంటాము, కాబట్టి ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది - మనం ప్రతి దాని గురించి ఆందోళన చెందే అలవాటులోకి వెళుతున్నాము - ఇది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి.

వీటన్నింటికి కారణం మన గందరగోళమేనని అర్థం చేసుకోవడమే అసలైన విషయం. కొన్ని పద్ధతులు ఆనందాన్ని తెస్తాయని, లేదా ప్రతి దాన్ని నియంత్రించగల ఆలోచనా విధానం సరైందని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. "ఇది అసంబద్దమైనది!" అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి దీనిపై దృష్టి పెడతాము.

సారాంశం

జీవితంలోని నాలుగు వాస్తవాల గురించి ఆలోచించినప్పుడు, మన సమస్యలు మరియు ప్రతికూల భావోద్వేగాలు స్థిరంగా ఉండవని, వాటిని మెరుగుపరుచవచ్చని తెలుసుకోవడం ద్వారా మనం ప్రోత్సహించబడతాము. వాటిని అలా పూర్తిగా తొలగించవచ్చు. బాధలకు గల కారణాలను మనం పరిష్కరించిన తర్వాత, అవి పూర్తిగా పోతాయి, కానీ ఈ కారణాలు వాటికవే వెళ్లిపోవు.

నైతికత, ఏకాగ్రత మరియు విచక్షణా అవగాహనలో మూడు శిక్షణల నేపధ్యంలో మన జీవితాలను అద్భుతంగా గడపవచ్చు. మనం ఎప్పుడూ కోరుకునే దానికి మనల్ని దగ్గర చేయడానికి అవి ఒకేసారి పనిచేస్తాయి: అదే సంతోషం.

Top