బౌద్దులకు ఇతర మతాల గురించి ఉన్న ఆలోచనా విధానం

ఈ భూమ్మీద కోట్లాది మంది ప్రజలు ఉన్నట్లే, కోట్లాది విభిన్న మనస్తత్వాలు, మరియు అభిరుచులు కూడా ఉన్నాయి. బౌద్ధమత ఆలోచనా విధానం నుంచి చూస్తే, వివిధ ప్రజలకు వేరే వేరే అవసరాలకు అనుగుణంగా అనేక మతాల అవసరం ఉంటుంది. మానవాళి శ్రేయస్సు కోసం పనిచేయడంలో అన్ని మతాలు ఒకే లక్ష్యాన్ని పంచుకుంటాయని బౌద్ధమతం గుర్తించింది. ఇలాంటి సాధారణ ఆలోచనతో, బౌద్దులు మరియు క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గౌరవ స్ఫూర్తితో ఒకరి నుంచి ఒకరు మంచి విషయాలను నేర్చుకోవడానికి జ్ఞాన మార్పిడి లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ప్రతి ఒక్కరికి ఒకే విధమైన అభిరుచులు మరియు ఆసక్తులు ఉండవు కాబట్టి, బుద్ధుడు వేర్వేరు వ్యక్తులకు అనుగుణంగా అనేక రకాల పద్ధతులను బోధించాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దలైలామా గారు మన ప్రపంచంలో ఇన్ని అనేక మతాలు ఉండటం ఒక అద్భుతమని అన్నారు. ఒక ఆహారం అందరికీ నచ్చనట్లే, ఒక మతం లేదా నమ్మకం ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చదు అనేదే సత్యం. వివిధ మతాలు ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిని మనం స్వాగతించి వాటి నుంచి వచ్చే ఆనందాన్ని మనం పొందాలి.

మతాంతర మాటలు

బౌద్ధ గురువులు, మరియు ఇతర మతాల నాయకుల మధ్య పరస్పర గౌరవం ఆధారంగా ఇప్పుడు చర్చలు పెరుగుతున్నాయి. దలైలామా గారు తరచుగా పోప్ జాన్ పాల్ II ను కలుసుకుంటున్నారు, మరియు 1986 లో, పోప్ ఇటలీలోని అసిసిలో ఒక పెద్ద సభకు అన్ని ప్రపంచ మతాల నాయకులను ఆహ్వానించారు. అక్కడ 150 మంది ప్రతినిధులు ఉండగా, పోప్ పక్కన కూర్చున్న దలైలామా గారికి ముందుగా ప్రసంగం చేసే గౌరవం లభించింది. ఈ సదస్సులో ఆధ్యాత్మిక నాయకులు నీతి, ప్రేమ, కరుణ వంటి అన్ని మతాలలో ఉండే విషయాల గురించి చర్చించారు. వివిధ మత పెద్దలు పరస్పరం కలిగివున్న సహకారం, సామరస్యం, పరస్పర గౌరవంతో ప్రజలు ఎంతో ప్రోత్సహించబడ్డారు.

అవును, ప్రతి మతం భిన్నంగా ఉంటుంది. మెటాఫిజిక్స్ మరియు థియాలజిని పరిశీలిస్తే, ఈ తేడాలను అధిగమించడానికి ఎటువంటి మార్గం లేదు, కానీ మనం వాదించాల్సిన అవసరం లేదని దీని అర్థం కాదు. "నీ నమ్మకాల కంటే నా నమ్మకాలు గొప్పవి" అనే ఆలోచన విధానం ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అన్ని మతాలకు ఒకటైనదిగా ఏమి ఉందో చూడటం చాలా ప్రయోజనకరం: అంటే, అవన్నీ మానవత్వ పరిస్థితిని మెరుగుపరచడానికి మరియు నైతిక ప్రవర్తన మరియు ప్రేమ, కరుణ మరియు క్షమాపణ మార్గాన్ని అనుసరించమని ప్రజలకు నేర్పడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి. వాళ్ళందరూ జీవితంలోని భౌతిక విషయాలకు పూర్తిగా ఆకర్షితులు ఉండకుండా, భౌతిక మరియు ఆధ్యాత్మిక పురోగతిని అన్వేషించడం మధ్య సమతుల్యతను కనుగొనడానికి ప్రయత్నించమని ప్రజలకు బోధిస్తారు.

ప్రపంచ పరిస్థితిని మెరుగుపరచడానికి అన్ని మతాలు కలిసి పనిచేయగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భౌతిక పురోగతి ముఖ్యమే, కానీ ఆధ్యాత్మిక పురోగతి కూడా చాలా అవసరం. జీవితంలోని భౌతిక అంశాలను మాత్రమే మనం పట్టించుకుంటే, అప్పుడు ప్రతి ఒక్కరినీ చంపగల శక్తివంతమైన బాంబును తయారు చేయడమే మనకు లక్ష్యం అవుతుంది. మరోవైపు, మానవతా దృక్పథంతో లేదా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, సామూహిక వినాశన ఆయుధాలను ఎక్కువ తయారు చెయ్యడం వల్ల వచ్చే సమస్యల గురించి మనకు తెలుస్తుంది. మన౦ ఆధ్యాత్మిక౦గా మాత్రమే అభివృద్ధి చెంది, భౌతిక భాగాన్ని పూర్తిగా వదిలేస్తే, ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తారు. అది కూడా మంచిది కాదు! కాబట్టి బ్యాలెన్స్ చెయ్యడం చాలా ముఖ్యం.

ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకోవడం

ప్రపంచ మతాల మధ్య పరస్పర చర్య యొక్క ఒక అంశం ఏమిటంటే, వారికి ఉన్న ప్రత్యేకతలను పక్కన వాళ్లతో పంచుకుంటారు. ఉదాహరణకు, అనేక మంది క్రైస్తవ ఆలోచనాపరులు బౌద్ధమతం నుంచి ఏకాగ్రత మరియు ధ్యానం కోసం పద్ధతులను నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. అనేక మంది కాథలిక్ మతగురువులు, మఠాధిపతిలు, సన్యాసులు మరియు సన్యాసినులు ఈ నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు వాటిని వారి స్వంత చోట్లకి తీసుకెళ్లడానికి భారతదేశంలోని ధర్మశాలలను సందర్శించారు. అనేక మంది బౌద్దులు కాథలిక్ సెమినార్ లలో బోధించారు, మరియు ధ్యానం ఎలా చేయాలో, ఏకాగ్రతను మరియు ప్రేమను ఎలా పెంపొందించుకోవాలో నేర్పడానికి నేను అప్పుడప్పుడు ఆహ్వానించబడ్డాను. క్రైస్తవ మతం ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని మనకు బోధిస్తుంది, కానీ అది ఎలా చెయ్యాలో సరిగ్గా వివరించదు, అయితే బౌద్ధ మతం ప్రేమను అభివృద్ధి చేసే పద్ధతులతో సమృద్ధిగా ఉంది. క్రైస్తవ మతం దాని అత్యున్నత స్థాయిలో బౌద్ధమతం నుంచి ఈ పద్ధతులను నేర్చుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. దీని అర్థం వాళ్ళు అందరూ బౌద్దులుగా మారబోతున్నారని కాదు - ఇక్కడ ఎవరినీ మతం మార్చడానికి ప్రయత్నించడం లేదు. దాని అర్థం వారు తమ స్వంత మతంలో అవలంబించవలసిన సాధనాలుగా పద్ధతులను నేర్చుకోవచ్చు, మంచి క్రైస్తవులుగా ఉండటానికి వారికి సహాయపడవచ్చు.

అదే విధంగా, చాలా మంది బౌద్దులు క్రైస్తవ మతం నుంచి సామాజిక సేవ గురించి నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మెజారిటీ క్రైస్తవ సంప్రదాయాలు తమ సన్యాసులు మరియు సన్యాసినులు బోధన, ఆసుపత్రి పని, వృద్ధులు మరియు అనాథల సంరక్షణ మొదలైన వాటిలో పాల్గొనాలని నొక్కి చెబుతున్నాయి. కొన్ని బౌద్ధమత దేశాలు ఇప్పటికే ఈ సామాజిక సేవలను అభివృద్ధి చేసినప్పటికీ, వివిధ సామాజిక మరియు భౌగోళిక కారణాల వల్ల అన్నిచోట్లా ఇవి లేవు. బౌద్దులు క్రైస్తవుల నుంచి సామాజిక సేవ గురించి చాలా నేర్చుకోవచ్చు, మరియు గురువులు వీటి కోసం చాలా ఓపెన్ గా ఉంటారు. ప్రతి ఒక్కరు మరొకరి నుంచి మరియు వారి స్వంత ప్రత్యేక అనుభవాల నుంచి నేర్చుకోవడం అద్భుతమైన విషయం. ఈ విధంగా, పరస్పర గౌరవం ఆధారంగా ప్రపంచ మతాల మధ్య ఒక పరస్పరం సంబంధం నెలకుంటుంది.

సారాంశం

ఇప్పటివరకు, మతాల మధ్య పరస్పర చర్య మత నాయకుల అత్యున్నత స్థాయిలో జరిగింది - ఇక్కడ ప్రజలు ఎక్కువ బహిరంగంగా కనిపిస్తారు మరియు తక్కువ దురభిప్రాయాలను కలిగి ఉంటారు. కింది స్థాయిలో, ప్రజలు మరింత అభద్రతా భావానికి లోనవుతారు మరియు ఫుట్బాల్ జట్టు మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారు - ఇక్కడ పోటీ మరియు పోరాటం సాధారణమే. ఈ రకమైన ఆలోచనను కలిగి ఉండటం చాలా బాధాకరం, ఇది మతాల మధ్య లేదా వివిధ బౌద్ధమత సంప్రదాయాల మధ్య ఇబ్బందులను కలిగిస్తుంది. బుద్ధుడు అనేక విభిన్న పద్ధతులను బోధించాడు, ఇవన్నీ విస్తృత శ్రేణి ప్రజలకు సహాయపడటానికి కలిసిమెలిసి పనిచేస్తాయి. అందుకని, బౌద్ధమతంలో మరియు ప్రపంచ మతాలలో అన్ని సంప్రదాయాలను గౌరవించడం చాలా ముఖ్యం.

Top