స్పుత్నిక్ జనరేషన్
నేను 1944 సంవత్సరంలో అమెరికాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాను. మా కుటుంబంలో ఎక్కువగా డబ్బులు ఉండేవి కాదు, అందరూ పనులు చేసే వాళ్ళే, ఎవరూ పెద్దగా చదువుకోలేదు కూడా. ఏదేమైనా, చిన్న వయస్సు నుంచే, నాకు ఆసియా విషయాలపై చాలా బలమైన ఆసక్తి ఉండేది. దీన్ని నా కుటుంబం ప్రోత్సహించలేదు, కానీ వద్దని కూడా చెప్పలేదు. ఆ రోజుల్లో, ఆసియా గురించి ఎక్కువ సమాచారం దొరికేది కాదు. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను ఒక స్నేహితుడితో కలిసి యోగా చెయ్యడం ప్రారంభించాను మరియు బౌద్ధమతం, భారతీయ ఆలోచన, చైనీస్ ఆలోచన మొదలైన వాటి గురించి నాకు దొరికిన వాటన్నిటినీ చదివాను.
అమెరికాలో "స్పుత్నిక్ జనరేషన్" అని పిలిచే దానిలో నేను ఒకడిని. స్పుత్నిక్ క్షిపణి అంతరిక్షంలోకి పంపబడినప్పుడు, రష్యా కంటే చాలా వెనుకబడి ఉన్నామని అనుకుని మన అమెరికా చాలా బాధ పడింది. నాతో సహా పాఠశాలలోని పిల్లలందరినీ సైన్స్ చదవమని ప్రోత్సహించారు, అలా మేము రష్యాను వెంబడించగలమని అనిపించింది. అలా 16 ఏళ్ల వయసులో కెమిస్ట్రీ చదవడానికి నేను రట్జర్స్ యూనివర్సిటీకి వెళ్లాను. రట్జర్స్ యూనివర్శిటీ న్యూజెర్సీలో ఉంది, అక్కడ నేను పెరిగాను, కల్మిక్ మంగోల్ బౌద్ధ గురువు అయిన గెషే వాంగ్యాల్ బహుశా నాకు 50 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ, అతని గురించి నాకు ఏమీ తెలియదు.
నా స్టడీస్ లో భాగంగా, నేను ఆసియన్ స్టడీస్ లో ఒక అదనపు కోర్సు తీసుకున్నాను, ఇది బౌద్ధమతం ఒక నాగరికత నుంచి మరొక నాగరికతకు ఎలా వెళ్ళింది మరియు ప్రతి నాగరికత దాన్ని భిన్నంగా ఎలా అర్థం చేసుకుంది అనే దాని గురించి చెప్తుంది. నాకు కేవలం 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, అది నాపై ఎంత బలమైన ప్రభావాన్ని చూపిందంటే నేను, "బౌద్ధమతం ఒక నాగరికత నుంచి మరొక నాగరికతకు వెళ్ళే పూర్తి ప్రక్రియలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను" అని చెప్పాను. నా జీవితాంతం ఎలాంటి మార్పులు లేకుండా నేను దీన్నే అనుసరించాను.
ప్రిన్స్ టన్: కెమిస్ట్రీ నుంచి చైనీస్ భాషలోకి, ఆలోచన నుంచి తత్వశాస్త్రం వరకు
ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో, ఆసియన్ స్టడీస్ విభాగానికి ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించడానికి ఒక కొత్త ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. అప్పట్లో చాలా తక్కువ మంది విద్యార్థులే ఉండేవారు. ఇది వియత్నాం యుద్ధం యొక్క ప్రారంభ రోజుల్లో జరిగింది, మరియు చాలా తక్కువ మంది అమెరికన్లకు ఆసియా భాషలు తెలుసు. చైనీస్ భాషను స్టడీ చేసేందుకు అవకాశం ఉన్నందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, కాబట్టి నేను అప్లై చేసుకున్నాను మరియు అంగీకరించబడ్డాను. 18 సంవత్సరాల వయస్సులో, నేను ప్రిన్స్ టన్ లో చైనీస్ భాషను చదవడం ప్రారంభించాను మరియు అక్కడ నా బ్యాచిలర్ చివరి రెండు సంవత్సరాలు పూర్తి చేశాను.
చైనా విషయానికి వస్తే బౌద్ధమతాన్ని అర్థం చేసుకునే విధానాన్ని చైనీస్ తత్వశాస్త్రం ఎలా ప్రభావితం చేసిందో, ఆ తర్వాత బౌద్ధమతం చైనీస్ తత్వశాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేసిందో నాకు ఆసక్తి ఉండేది. అలా చైనీస్ ఆలోచనలు, తత్వశాస్త్రం, హిస్టరీ, బౌద్ధమతం మొదలైన వాటిని స్టడీ చేశాను. నన్ను సమ్మర్ లో ఇంటెన్సివ్ లాంగ్వేజ్ స్కూళ్లకు పంపారు: హార్వర్డ్ లో ఒక సంవత్సరం, క్లాసికల్ చైనీస్ నేర్చుకోవడం ప్రారంభించడానికి స్టాన్ ఫోర్డ్ లో ఒక సంవత్సరం, మరియు నా డిగ్రీ పొందిన తర్వాత, తైవాన్ లో ఒక సమ్మర్ గడిపాను. నా గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం నేను హార్వర్డ్ వెళ్లాను. నేను అప్పటికే చైనీస్ ప్రోగ్రామ్ లో ఒక భాగంగా జపనీస్ భాషను నేర్చుకోవడం ప్రారంభించాను, మరియు నేను దూర ప్రాచ్య భాషలలో మాస్టర్స్ డిగ్రీ పొందే సమయానికే చాలా విస్తృతమైన చైనీస్ స్టడీస్ చేశాను.
చైనీస్, సంస్కృతం, టిబెటన్: కంపారిటివ్ స్టడీస్
బౌద్ధమతం అభివృద్ధిలో చైనా పాత్ర ఏమిటో నాకు తెలుసు కాబట్టి భారతీయ వైపు కూడా ఎలా ఉండేదో తెలుసుకోవాలనుకున్నాను, కాబట్టి నేను సంస్కృతం చదవడం మొదలుపెట్టాను. సంస్కృతం, భారతీయ అధ్యయనాలు, దూర ప్రాచ్య భాషల విభాగాలు అనే రెండు విభాగాల నుంచి నేను సంయుక్త డాక్టరేట్ పట్టా పొందాను. సంస్కృతం మరియు భారతీయ స్టడీస్ టిబెటన్ కు దారితీశాయి, మరియు అందులో తత్వశాస్త్రం మరియు బౌద్ధమతం యొక్క చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
నాకు జ్ఞానం కోసం చాలా బలమైన దాహం ఉండేది, కాబట్టి నేను తత్వశాస్త్రం మరియు సైకాలజీలో ఎక్స్‌ట్రా కోర్సులు తీసుకున్నాను మరియు వీటన్నింటి ద్వారా సైన్స్ పట్ల నా ఆసక్తిని కొనసాగించాను. ఈ విధంగా, నేను నా అధ్యయనాలను పూర్తి చేసి అనువాదాలను పోల్చే సాధారణ బౌద్ధ శాస్త్ర పద్ధతులను నేర్చుకున్నాను. సంస్కృతంలోని బౌద్ధమత గ్రంథాలను పరిశీలించి, అవి చైనీస్ మరియు టిబెటన్ భాషలలోకి ఎలా అనువదించబడ్డాయో చూస్తాము, అలాగే ఆలోచనల అభివృద్ధి యొక్క చరిత్రను మరియు ఇది సాధారణ చరిత్రతో ఎలా పరస్పర సంబంధం కలిగి ఉందో అధ్యయనం చేస్తాము. ఈ రకమైన శిక్షణ నా కెరీర్ అంతా బాగా ఉపయోగపడింది.
హార్వర్డ్ నుంచి సజీవ సాంప్రదాయం వరకు
ఈ ప్రయాణం మొత్తంలో, నేను అధ్యయనం చేస్తున్న ఆసియాలోని ఈ తత్వాలు మరియు మతాలు - బౌద్ధం మరియు హిందూ మతం యొక్క వివిధ రూపాలు మరియు దావోయిజం మరియు కన్ప్యూషియనిజం గురించి ఈ విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటుందనే దానిపై నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది. కానీ సజీవ సంప్రదాయంతో సంబంధంలోకి రావడానికి నాకు సరైన అవకాశాలు లభించలేదు; ప్రాచీన ఈజిప్టులోని మతాలను అధ్యయనం చేస్తున్నట్టు నాకు అనిపించింది. కానీ, నా ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది.
కానీ, నేను 1967 లో టిబెటన్ చదవడం ప్రారంభించినప్పుడు, రాబర్ట్ థర్మన్ హార్వర్డ్‌కు తిరిగి వచ్చాడు మరియు మేము క్లాస్ మేట్స్ అయ్యాము. గెషే వాంగ్యాల్ కు అత్యంత సన్నిహితుడైన థర్మన్ అతని దగ్గర కొన్నేళ్ల పాటు ఉన్నాడు. దాదాపు ఏడాది పాటు సన్యాసిగా ఉన్న అతను ధర్మశాలలో చదువుకునేందుకు ఇండియాకు వెళ్లాడు. టిబెటన్లు, మరియు గురువు దలైలామా గారు ఉన్న ధర్మశాలలో చదువుకునే అవకాశం గురించి, గెషే వాంగ్యాల్ గురించి ఆయనే నాకు చెప్పాడు. సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడల్లా న్యూజెర్సీలో గెషే వాంగ్యాల్ ను ఆయన ఆశ్రమంలో కలవడం ప్రారంభించాను మరియు బౌద్ధమతం ఒక సజీవ సంప్రదాయంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను గెషే వాంగ్యాల్ ను చాలా సార్లు కలిసినప్పటికీ, అతని దగ్గర ఉండడానికి మరియు స్టడీ చెయ్యడానికి నాకు ఎప్పుడూ అవకాశం దొరకలేదు. ఏదేమైనా, అతను నన్ను భారతదేశానికి వెళ్లి అక్కడ నా చదువును కొనసాగించడానికి ప్రేరేపించాడు, కాబట్టి టిబెటన్లతో కలిసి భారతదేశంలో నా పరిశోధనను చెయ్యడానికి నేను ఫుల్బ్రైట్ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకున్నాను.
1969లో నా 24వ వయస్సులో నేను భారత్ కు వచ్చి, అక్కడ దలైలామా గారిని కలిసి, టిబెట్ సమాజంలో పూర్తిగా లీనమయ్యాను. న్యూజెర్సీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి ప్రిన్స్ టన్, హార్వర్డ్ లలో పూర్తి స్కాలర్ షిప్ ల వరకు, ఇప్పుడు దలైలామా గారు మరియు ఆయన చుట్టూ ఉన్న గొప్ప టిబెటన్ గురువుల వరకు నన్ను నడిపించే కన్వేయర్ బెల్ట్ లో ఉన్నట్టుగా అప్పటి వరకు నా జీవితమంతా అలా అనిపించింది. టిబెటన్ బౌద్ధమతం గురించి నేను అధ్యయనం చేసిన ప్రతిదీ చాలా సజీవంగా ఉందని నేను గమనించాను మరియు బౌద్ధమత బోధనలలో ప్రతిదీ ఏమిటో కొంత మందికి మాత్రమే తెలుసు. వారి నుంచి నేర్చుకునే సువర్ణావకాశం నాకు లభించింది.
డల్హౌసీలో టిబెటన్ మాట్లాడటం నేర్చుకోవడం
నేను భారతదేశానికి వెళ్ళినప్పుడు, నాకు టిబెటన్ మాట్లాడటం తెలియదు. నిజానికి హార్వర్డ్ లో నా ప్రొఫెసర్ నాగతోమికి ఆ భాషను ఎలా ఉచ్ఛరించాలో కూడా తెలియదు. అతను జపనీస్ వ్యక్తి, మరియు మేము జపనీస్ గ్రామర్ పరంగా టిబెటన్ భాషను నేర్చుకున్నాము ఎందుకంటే ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఏకైక పాఠ్యపుస్తకం లాటిన్తో పోలిస్తే టిబెటన్ గ్రామర్ నే వివరించింది! లాటిన్ మరియు టిబెటన్ లకు కామన్ గా ఏమీ లేదు, అయితే జపనీస్ గ్రామర్ టిబెటన్ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది.
నేను అసలైన మాట్లాడే భాషను నేర్చుకోవాల్సి వచ్చింది, కానీ దాని పాఠ్యపుస్తకాలు లేదా మెటీరియల్స్ అందుబాటులో లేవు. గెషే వాంగ్యాల్ తో నాకు ఉన్న అనుబంధం ద్వారా, అతని మఠంలో కొన్నేళ్ళు ఉండి ఇంగ్లిష్ బాగా తెలిసిన షార్పా మరియు ఖమ్లుంగ్ రింపోచేలు అనే ఇద్దరు యువ తుల్కులతో (పునర్జన్మ పొందిన లామాలు) నేను కనెక్ట్ కాగలిగాను. వాళ్ళు డల్హౌసీలో నివసించారు, ఇక్కడ చాలా మంది టిబెటన్ శరణార్థులు స్థిరపడ్డారు. అక్కడ, వాళ్ళు దయతో ఒక పర్వతం పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో టిబెటన్ సన్యాసి సోనమ్ నోర్బుతో కలిసి నివసించడానికి ఏర్పాట్లు చేశారు. అతనికి ఇంగ్లీష్ రాదు, నేను టిబెటన్ మాట్లాడలేను, కానీ కలిసి అక్కడ ఉండడం వల్ల, మేము ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడే నా బౌద్ధమత మరియు ఇతర శిక్షణలను తీసుకున్నాను. నేను బోర్నియో లేదా ఆఫ్రికాలో ఇంకొక భాషను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఒక శాస్త్రవేత్తగా భావించాను.
నేను చదివిన ఆసియా భాషలన్నీ టిబెటన్ భాషలోని స్వరాలను వినడానికి మరియు కొంత ప్రోగ్రెస్ ను సాధించడానికి నాకు చాలా సహాయపడ్డాయి. నేను సోనమ్ తో మాట్లాడాలని అనుకున్నప్పుడు, నేను దాన్ని రాస్తాను (నాకు టిబెటన్ ఎలా రాయాలో తెలుసు), మరియు దాన్ని ఎలా ఉచ్ఛరించాలో అతను నాకు చెబుతాడు. మేమిద్దరం ఇలా కలిసి పని చేసాం, నేను కూడా వేరొకరితో కొన్ని భాషా పాఠాలు నేర్చుకున్నాను. చివరికి, ఇద్దరు యువ రింపోచేలు నేను వారి గురువు గెషె గావాంగ్ ధార్గేతో కలిసి చదువుకోవాలని చెప్పారు.
ఒక గోశాలలో లామ్-రిమ్ స్టడీ
నేను నా పరిశోధనను రాసుకోవడానికి భారతదేశానికి వచ్చాను. గుహ్యసమజ అనే పెద్ద తంత్ర విషయాన్ని పరిశోధించాలని నేను అనుకున్నప్పటికీ, సలహా కోసం వెళ్లిన దలైలామా గారి గురువులలో ఒకరైన సెర్కాంగ్ రింపోచే గారు అది అసంబద్ధమని, దానికి నేను ఇంకా పూర్తిగా సిద్ధంగా లేనని నన్ను చెప్పారు. త్రిజాంగ్ రింపోచే, గురువు గారి జూనియర్ ట్యూటర్, నన్ను దానికి బదులుగా మార్గం యొక్క గ్రేడెడ్ దశలైన లామ్-రిమ్ ను ముందు స్టడీ చెయ్యాలని చెప్పారు. అప్పటికి దాని గురించి ఏమీ అనువదించబడలేదు, కాబట్టి అది నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. ఆ రోజుల్లో టిబెటన్ బౌద్ధమతంపై కేవలం అలెగ్జాండ్రా డేవిడ్-నీల్, ఎవాన్స్-వెంజ్, లామా గోవిందా మరియు ఇంకొంత మంది పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. లామ్-రిమ్ యొక్క మౌఖిక సంప్రదాయాన్ని గెషే గావాంగ్ ధార్గేతో కలిసి అధ్యయనం చేశాను ఆ తర్వాత దానిపై నా పరిశోధనను ఆధారం చేసుకున్నాను.
నేను డల్హౌసీలో చాలా పాత మనిషిగా నివసించాను, అక్కడ నీళ్లు, మరుగుదొడ్డి ఉండేవి కాదు. అయితే, గెషే ధార్గే తన కంటే ముందు ఒక ఆవును ఉంచడానికి ఉపయోగించిన షెడ్డులో నాలాగే నివసించాడు. అతని మంచానికి సరిపడా స్థలం మాత్రమే ఉండేది, ఆ మంచం ముందు కొంచెం చోటు ఉండేది, అక్కడ అతని ముగ్గురు యువ రింపోచే శిష్యులు మరియు నేను మట్టి నేలపై కూర్చొనే వాళ్ళము. షార్పా, మరియు ఖమ్లుంగ్ రింపోచే, మరియు నాతో పాటు ఝాడో రింపోచే గారు కలిశారు. ఆ తర్వాత ఆయన దలైలామా గారి ఆశ్రమమైన నామ్ గ్యాల్ ఆశ్రమానికి అధిపతి అయ్యాడు. ఈగలు మరియు అన్ని రకాల ఇతర పురుగులతో నిండిన ఈ గోశాలలో మేము చదువుకున్నాము.
ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయం ఎందుకంటే అప్పుడు చాలా కొత్త విషయాలు ప్రారంభమయ్యాయి. దలైలామా గారు మేము ఏమి చేస్తున్నామో అని మా స్టడీల గురించి ఆసక్తి చూపేవారు, ఆ తర్వాత అతని కోసం అనువదించడానికి మాకు కొన్ని చిన్న గ్రంథాలను ఇచ్చారు. గురువు గారు ధర్మశాలలో టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్ లైబ్రరీని నిర్మించినప్పుడు, పాశ్చాత్యులకు గురువుగా ఉండమని గెషే ధార్గేను, మరియు నాకు సహాయం చేసిన షార్పా, ఖమ్లుంగ్ రింపోచే లను అనువాదకులుగా ఉండమని కోరారు. అప్పుడు నేను కూడా సహాయం చెయ్యగలనా గురువు గారు అని అడిగాను, "అవును, కానీ ముందు నువ్వు అమెరికాకు వెళ్లి, మీ పరిశోధనా పత్రాన్ని ఇచ్చి, డిగ్రీని పొంది, ఆ తర్వాత తిరిగి రా" అని చెప్పారు.
టిబెటన్ సమాజంలో కలిసిపోవడం: అనువాదకుడిగా మారడం
భారతదేశంలోని ప్రారంభ సమయంలో, నేను టిబెట్ సమాజంతో కలిసిపోగల ఒక సాంప్రదాయ పాత్రను స్వీకరించడానికి ప్రయత్నించాను; అలా, నేను ఒక అనువాదకుడిగా మారాను. నేను నా బౌద్ధమత అభ్యాసాన్ని ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉండి 1970 ప్రారంభంలో ఒక అధికారికంగా బౌద్దుడిని అయ్యాను మరియు ధ్యాన అభ్యాసాన్ని ప్రారంభించాను. అప్పటి నుంచి ప్రతిరోజూ నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను.
అనువాదకుడి పాత్రలో, మీకు భాషా నైపుణ్యాలు మాత్రమే కాదు, బౌద్ధమతం గురించి చాలా లోతైన అవగాహన కూడా అవసరం, అంటే ధ్యానం మరియు బోధనలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం లాంటివి. ధ్యానంలో వివిధ మానసిక స్థితులను లేదా విభిన్న అనుభవాలను చర్చించే సాంకేతిక పదాలను మీరే అనుభవించకుండా అనువదించే మార్గం లేదు. అక్కడి వాడుకలో ఉన్న అనువాద పదాలను ఎక్కువ మిషనరీలే ఎంచుకునేవి, వాళ్ళు ప్రధానంగా బైబిల్ ను టిబెటన్ లోకి అనువదించడానికి ఆసక్తి చూపించారు మరియు బౌద్ధమతంలోని పదాల అసలైన అర్థంతో చాలా తక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి, ఈ ముందు సమయం నుంచే, నేను నా బౌద్ధమత అభ్యాసాన్ని నా బౌద్ధ శాస్త్ర శిక్షణతో కలిపాను.
నేను 1971 సంవత్సరం చివరిలో హార్వర్డ్ కు తిరిగి వెళ్ళాను మరియు కొన్ని నెలల తర్వాత, నా పరిశోధనను అందించాను మరియు 1972 స్ప్రింగ్ లో నేను డాక్టరేట్ ను పొందాను. నేను యూనివర్శిటీ ప్రొఫెసర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాబట్టి మా ప్రొఫెసర్ నాకు ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో చాలా మంచి టీచింగ్ ఉద్యోగాన్ని ఏర్పాటు చేశారు, కానీ నేను దాన్ని తిరస్కరించాను. బౌద్ధమతం అంటే ఏమిటో ఊహించే వ్యక్తులతో నా మిగతా జీవితాన్ని గడపడానికి నేను ఇష్టపడలేదు. దానికి బదులుగా, దాని అర్థం ఏమిటో సరిగ్గా తెలిసిన వాళ్ళతో ఉండాలని మరియు ప్రామాణిక సంప్రదాయం నుంచి స్టడీ చెయ్యాలని మరియు నేర్చుకోవాలని అనుకున్నాను, అదే సమయంలో నా బౌద్ధ శాస్త్ర శిక్షణ నుంచి నా ఆబ్జెక్టివ్ ఆలోచనను ఉంచుకున్నాను. నిజమే, మా ప్రొఫెసర్ నేను పిచ్చివాడినని అనుకున్నారు, కానీ నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. అక్కడ నివసించడం చాలా సులభం, కాబట్టి ఇది సాధ్యమైంది.
నా కొత్త భారతీయ జీవితం
నేను ధర్మశాలకు వెళ్లి అప్పటికే లైబ్రరీలో పనిచేస్తున్న గెషే గావాంగ్ ధార్గే, షార్పా, ఖమ్లుంగ్ రింపోచే గార్లతో కలిసి పని చెయ్యడం ప్రారంభించాను. నేను డల్హౌసీలో ఉన్న గుడిసె కంటే ఇంకా చిన్న గుడిసెలో ఉన్నాను, అక్కడ కూడా నీళ్లు లేదా మరుగుదొడ్డి లేదు మరియు దాని ఒక్క కిటికీకి కనీసం గ్లాసు కూడా లేదు. నాతో పాటు ఉన్న టిబెటన్ సన్యాసి సోనమ్ నోర్బు కూడా నాతో ఉండటానికి వచ్చాడు. అలా నేను భారతదేశమే నా ఇల్లుగా చేసుకుని 29 సంవత్సరాలు చాలా సింపుల్ గుడిసెలో నివసించాను.
ఆ సమయంలో గురువు గారికి లైబ్రరీలో ట్రాన్స్ లేషన్ బ్యూరోను స్థాపించడానికి సహాయం చేసి నా చదువును కొనసాగించాను. నా బౌద్ధమత నేపథ్యం నాకు ఇంకొన్ని బౌద్ధమత బోధనలను అధ్యయనం చెయ్యడానికి సాధనాలను ఇచ్చిందని నేను గమనించాను. నాకు చరిత్ర మరియు వివిధ గ్రంథాల పేర్లు తెలుసు, మరియు నాకు అసలైన విషయాలను నేర్పే వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను వాటన్నిటినీ చాలా సులభంగా నేర్చుకోగలిగాను. దలైలామా గురువు గారు నాలుగు టిబెటన్ సంప్రదాయాలను అధ్యయనం చెయ్యమని నన్ను ప్రోత్సహించారు, అయినప్పటికీ నేను ప్రధానంగా టిబెట్ బౌద్ధమతం యొక్క పూర్తి పరిధిని తెలుసుకోవడానికి గెలుగ్ పా ను అధ్యయనం చేశాను. అది చాలా ఉత్తేజకరమైన సమయం, ఎందుకంటే, ఆ రోజుల్లో, టిబెటన్ బౌద్ధమత బోధనలలో కూడా ఉన్న వాటి పూర్తి పరిధి గురించి ప్రజలకు ఏమీ తెలియదు.
సెర్కాంగ్ రింపోచే గారితో జ్ఞాపకశక్తి మరియు వినయ శిక్షణ
1974 సంవత్సరంలో దలైలామా గారి గురువుల్లో ఒకరైన సెర్కాంగ్ రింపోచే గారితో నేను కలిసి చదువుకోవడం మొదలుపెట్టాను, ఆయనను నేను 1969లో మొదటిసారిగా కలుసుకున్నాను. ధర్మశాలలో మా పరిచయం మొదలైనప్పటి నుంచి, ఆయనకు, చివరికి దలైలామాకు అనువాదకుడిగా ఉండటానికి నాకు కర్మ సంబంధం ఉందని ఆయన గమనించారు, అందువల్ల ఆయన నాకు ఈ విషయంలో శిక్షణ ఇచ్చారు. నేను అప్పటికే పుస్తకాలను అనువదిస్తున్నా కానీ, మౌఖిక అనువాదం మరియు బోధనలో శిక్షణను తీసుకున్నాను. అతను వేర్వేరు వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తారో చూడటానికి అతను నన్ను అతని దగ్గర కూర్చోపెట్టుకునేవారు. అతను నా జ్ఞాపకశక్తికి శిక్షణ ఇచ్చేవారు: నేను అతనితో ఉన్నప్పుడల్లా అతను ఒక్కసారిగా ఆగి, "నేను చెప్పిన దాన్ని అలాగే రిపీట్ చెయ్యి" అని లేదా "నువ్వు చెప్పిన దాన్ని అలాగే రిపీట్ చెయ్యి" అని అడిగేవారు.
ఆ తర్వాతి సంవత్సరం నుంచి అతను ఇతర పాశ్చాత్యులకు బోధిస్తున్నప్పుడు నేను అనువదించడం ప్రారంభించాను. ఆయన నాకు దేనినీ తనకు తానుగా బోధించేవారు కాదు, వేరొకరి కోసం అనువదించడం ద్వారానే నేను నేర్చుకున్నాను - కాలచక్రం తప్ప. అతను నాకు కాలచక్రాన్ని వ్యక్తిగతంగా బోధించారు; నాకు అందులో ఏదో ఒక లోతైన సంబంధం ఉందని అతను గమనించారు. నన్ను ఏ బోధనల సమయంలోనూ నోట్స్ తీసుకోవడానికి అనుమతించలేదు, కానీ నేను వాటిని గుర్తుంచుకుని ఆ తర్వాత రాసుకోవాల్సి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత, పాఠం అయిన తర్వాత నోట్స్ కూడా రాసుకోనివ్వలేదు. అతను నాకు చెయ్యడానికి ఇతర పనులు చెప్పేవారు, ఆ తర్వాత నేను రాత్రి ఆలస్యంగా మేల్కుని వాటిని రాసుకునేవాడిని.
గెషే వాంగ్యాల్ తన సన్నిహిత విద్యార్థులతో చేసినట్లుగానే, సెర్కాంగ్ రింపోచే గారు నన్ను ఎప్పుడూ తిట్టేవారు. ఒకసారి నేను ఆయన కోసం అనువదిస్తున్నప్పుడు, నాకు అర్థం కాని ఒక పదం ఏమిటని అడిగాను. అతను నన్ను చూసి నవ్వి, "ఆ పదాన్ని నేను నీకు ఏడేళ్ల క్రితమే వివరించాను. నీకు ఎందుకు అది గుర్తు లేదు? నాకు గుర్తుంది!" అని అనేవారు.
ఆయన నాకు పెట్టుకున్న ఇష్టమైన పేరు "మూర్ఖుడు" మరియు నేను అలా ప్రవర్తిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇతరుల ముందు అతను ఎప్పుడూ ఎత్తి చూపడంలో వెనుకాడేవారు కాదు. ఇది ఒక మంచి శిక్షణ. ఒకసారి నేను దలైలామా గారి కోసం అనువదించినప్పుడు, దాదాపు 10,000 మంది ప్రేక్షకులు వచ్చి ఉన్నారు, అప్పుడు ఆయన నన్ను ఆపి, నవ్వి, "అతను తప్పు చేశాడు" అని చెప్పడం నాకు గుర్తుంది. ఎప్పుడూ మూర్ఖుడు అని పిలిచే నా శిక్షణ నుండి, నేను రగ్గు కింద దాక్కోకుండా అనువాదం చెయ్యగలిగాను. అనువదించడానికి అద్భుతమైన శ్రద్ధ మరియు జ్ఞాపకశక్తి అవసరం, కాబట్టి బౌద్ధమత శిక్షణ మాత్రమే కాకుండా సాంప్రదాయ టిబెటన్ శిక్షణను కూడా పొందడం నా అదృష్టం.
నేను సెర్కాంగ్ రింపోచే గారి దగ్గర 9 సంవత్సరాలు చాలా తీవ్రంగా శిక్షణను పొందాను. నేను ఆయన కోసం అనువదించాను, ఆయన లెటర్స్ మరియు ప్రయాణాలలో సహాయం చేశాను, ఈ అన్ని సమయాల్లో, ఆయన నాకు రెండుసార్లు మాత్రమే "థాంక్యూ" చెప్పారు. ఇది కూడా నాకు చాలా సహాయపడింది, ఎందుకంటే, అతను చెప్పినట్లుగా, నేను ఇంకేం ఆశించగలను? నేను ఆయన నుంచి తలపై అలా ముట్టించుకుని ఆ తర్వాత కుక్క లాగా నా తోకను ఊపాలా? అనువదించడానికి ఒకరి ప్రేరణ ఇతరులకు సహాయం చెయ్యడానికి ఉండాలి, "థాంక్యూ" తో ప్రశంసించబడడానికి కాదు. నిజానికి, నా బౌద్ధ ధ్యానం మరియు అభ్యాసాలు అన్నీ ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా లేదా వదులుకోకుండా ఈ సాంప్రదాయ శిక్షణ ప్రాసెస్ కు చాలా ముఖ్యమైనవి.
సంస్కృతుల మధ్య బ్రిడ్జిని నిర్మించడంలో సహాయపడటం
సెర్కాంగ్ రింపోచే గారు 1983లో చనిపోయారు. ఆ తర్వాత, ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వడానికి నాకు చాలా ఆహ్వానాలు వచ్చాయి, ఎందుకంటే నేను అప్పటికే రింపోచే గారి అనువాదకుడిగా చాలా ప్రదేశాలకు వెళ్ళాను. అప్పటికి నేను దలైలామా గారి కోసం అప్పుడప్పుడు అనువాదం చేస్తూ ఉండే వాడిని. కానీ అనువాదం అంటే కేవలం పదాలు పలకడం మాత్రమే కాదు, దానిలోని భావాలను వివరించడం, మరియు అనువదించడం. మొదట్లో పాశ్చాత్య మనస్తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మత పెద్దలతో జరిగిన సమావేశాల్లో, నా పని వారి ఆలోచనలను వివరించడం, వారి మాటలు కాకుండా (ఎందుకంటే వాటికి టిబెటన్ భాషలో ఎక్కువగా పదాలు ఉండేవి కావు), మరియు ఒక సాంస్కృతిక బ్రిడ్జిని సృష్టించడం. బౌద్ధమత బోధనల విషయంలో వివిధ సంస్కృతుల మధ్య బ్రిడ్జిగా ఎలా ఉండాలో చిన్నతనం నుంచి నాకు ఆసక్తి కలిగించేది ఇదే. అటువంటి బ్రిడ్జిని తయారు చెయ్యడానికి, మీరు రెండు సంస్కృతులను బాగా తెలుసుకోవాలి, ప్రజలు ఎలా ఆలోచిస్తారు అని మరియు వారి జీవితం ఎలా ఉంటుందో అని. కాబట్టి, టిబెటన్లతో ఇన్ని రోజులు జీవించగలగడం, వారి ఆలోచనా విధానం, వాళ్ళు జీవించే విధానం మొదలైన వాటితో అనుసంధానంగా ఉండడం నాకు ఒక గొప్ప మరియు చాలా అరుదైన అదృష్టం. బౌద్ధమత వ్యాప్తిలో ఇది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను.
నేను దలైలామా గారి కోసం వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. ప్రపంచాన్ని టిబెటన్లకు, గురువులకు తెరిచేందుకు ప్రయత్నించడం అందులో ప్రధానమైనది. వాళ్ళ దగ్గర పాస్ పోర్టులు లేవు, శరణార్థుల పత్రాలు మాత్రమే ఉన్నాయి, కాబట్టి వారిని ఆహ్వానిస్తే తప్ప వారు ఏ దేశానికి వీసాలను పొందలేరు. కానీ వాళ్ళకు కొన్ని చోట్ల మాత్రమే కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు, నా హార్వర్డ్ PhD చాలా ఉపయోగపడింది, ఎందుకంటే యూనివర్సిటీలలో గెస్ట్ ఉపన్యాసాలు ఇవ్వడానికి నన్ను ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానించగలిగారు. ఈ విధంగా భవిష్యత్తులో టిబెటన్లకు, చివరికి గురువు గారిని విదేశాలకు ఆహ్వానించడానికి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో గురువు గారి పనులను ప్రారంభించడానికి కావలసిన కాంటాక్ట్స్ ఏర్పరచుకున్నాను. 1985లో, నేను అన్ని మాజీ కమ్యూనిస్టు దేశాలకు, దాదాపు అన్ని లాటిన్ అమెరికన్ దేశాలకు, ఆఫ్రికాలోని అధిక ప్రదేశాలకు వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ తర్వాత బౌద్దులు, మరియు ముస్లింల మధ్య చర్చలు జరిపేందుకు మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లడం ప్రారంభించాను.
వీటన్నిటిలోనూ నేను సందర్శించిన ప్రతి దేశ సంస్కృతి, చరిత్ర గురించి గురువు గారికి తెలిసేలా రిపోర్టులు రాయడంపై దృష్టి పెట్టాను. తర్వాత, నా హార్వర్డ్ అనుబంధం సహాయంతో ఈ దేశాలలోని వివిధ మత పెద్దలను కలవడానికి మరియు వాళ్ళ నుంచి వాళ్ళ మతాల గురించి ఇంకా తెలుసుకోవడానికి నన్ను అనుమతించింది, అలా గురువు గారు ఈ దేశాలకు వెళ్లినప్పుడు, వాళ్ళ నమ్మకాల గురించి ఆయనకు ఒక ముందస్తు అవగాహన ఉంటుంది. ఏది ముఖ్యమో చూడటానికి, దాన్ని ఆర్గనైజ్ చెయ్యడానికి మరియు ఉపయోగకరమైన విధంగా ప్రదర్శించడానికి నేను చేసిన బౌద్ధమత మరియు శాస్త్రీయ శిక్షణ నాకు బాగా సహాయపడింది.
నేను ఎన్నో ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాను. సోవియట్ యూనియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన చెర్నోబిల్ బాధితులకు సహాయం చెయ్యడానికి టిబెటన్ వైద్యాన్ని ఉపయోగించే ఒక ప్రాజెక్టు అత్యంత ఆసక్తికరమైనది. టిబెటన్ వైద్యం చాలా ప్రభావవంతంగా ఉందని నిరూపించబడినప్పటికీ, సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు, రష్యా, బెలారస్ మరియు ఉక్రెయిన్ ఈ ప్రాజెక్టుకు సహకరించడానికి నిరాకరించాయి మరియు భౌతికంగా మరియు ఆర్థికంగా అసాధ్యమైన మూడు పూర్తిగా వేర్వేరు ప్రాజెక్టులను మేము చేపట్టాలని పట్టుబట్టాయి. పాపం ఆ ప్రాజెక్టు అక్కడితో ముగిసిపోయింది.
బకులా రింపోచే గారు పుస్తకాలను ఆధునిక మంగోలియన్ భాషలోకి అనువదించడం మరియు ప్రచురించడం ఇంకొక ఉత్తేజకరమైన ప్రాజెక్టు, ఇది అక్కడి బౌద్ధమత పునరుద్ధరణకు సహాయపడటానికి సూచించబడింది. ఆ సమయంలో మంగోలియాలో భారత రాయబారిగా బకులా రింపోచే గారు ఉన్నారు.
పాశ్చాత్య దేశాలకు తిరిగి రావడం
నేను ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో పర్యటించి బోధించాను. వీటన్నిటిలో, నేను నా రోజువారీ ధ్యాన అభ్యాసాన్ని కొనసాగించాను, ఇది నన్ను ఇలాగే కొనసాగించడానికి బాగా సహాయపడింది. కాలక్రమేణా, బోధించడానికి మరియు ఉపన్యాసం ఇవ్వడానికి నన్ను ఇంకొన్ని ప్రదేశాలకు ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఉపన్యాస పర్యటనలు బాగా ఎక్కువ రోజుల వరకు సాగాయి; ఒకసారి అయితే పదిహేను నెలల సమయం తీసుకుంది - ప్రతి వారం రెండు లేదా మూడు వేర్వేరు నగరాలు, అన్ని చోట్లా ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ ప్రయాణంతో, బౌద్ధమత ధ్యాన అభ్యాసమే నాకు ఇవన్నీ చెయ్యడానికి స్థిరత్వాన్ని ఇచ్చింది, ప్రత్యేకించి నేను ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేస్తాను కాబట్టి.
ఇన్ని సంవత్సరాలలో నేను అనేక పుస్తకాలు రాశాను, ఒక నిర్దిష్ట సమయంలో, భారతదేశం నుంచి వచ్చినందుకు, నా ప్రచురణకర్త స్నో లయన్ తో కలిసి పని చెయ్యడం అంత సులభం కాదని నాకు అనిపించింది. అలాగే, నేను ఇంటర్నెట్ దారిలో వెళ్లాలని అనుకున్నాను కానీ అది భారతదేశంలో చెయ్యడం చాలా కష్టం. అలా 1998లో నేను ఇండియా నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లాను. నన్ను ఆహ్వానించిన వివిధ ప్రదేశాలను ఒక సంవత్సరం వరకు ప్రయత్నించిన తర్వాత, నేను జర్మనీలోని బెర్లిన్ లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాను. నాకు అప్పటికే జర్మన్ భాష బాగా తెలుసు కాబట్టి నాకు ఏ సమస్య ఎదురుకాలేదు, అక్కడ నాకు ఎక్కువ స్వాతంత్య్రం ఇవ్వబడింది. ఇది నాకు చాలా ముఖ్యమైనది; నేను ఏ సంస్థతోనూ ముడిపడి ఉండాలని అనుకోలేదు. తూర్పు ఐరోపా దేశాలు, రష్యా మరియు మాజీ సోవియట్ రిపబ్లిక్ లకు సులభంగా ప్రయాణించడానికి బెర్లిన్ ఒక మంచి చోటుగా ఉండింది, ఆ దేశాలలో నేను ఎక్కువగా బోధించేవాడిని మరియు వాటితో నాకు ప్రత్యేకమైన సన్నిహిత సంబంధం ఉండేది.
30,000 పేజీలకు పైగా ప్రచురించని వ్రాతప్రతులతో నేను పాశ్చాత్య దేశాలకు వచ్చాను - నేను రాసిన అనేక అసంపూర్ణ పుస్తకాలు, వాటి కోసం చదివే నోట్స్, నేను చదివిన గ్రంథాల అనువాదాలు, నేను మరియు నా ఉపాధ్యాయులు చేసిన కొన్ని ఉపన్యాసాల అనువాదాలు, ట్రాన్స్ స్క్రిప్ట్ లు. గురువు గారి, ఆయన ముగ్గురు ప్రధాన గురువులు, గెషే ధార్గే బోధనల నుంచి నేను తీసుకున్న నోట్స్ కూడా అందులో ఉన్నాయి. నేను చనిపోయినప్పుడు ఇవన్నీ చెత్తలో పడెయ్యకుండా ఉంటే బాగుంటుందని నేను చాలా ఆందోళన చెందాను.
ది బెర్జిన్ ఆర్కైవ్స్
కిందటి తరం యొక్క గొప్ప లామాల్లో గొప్పవారితో కలిసి ఇంతకాలం చదువుకునే అపూర్వమైన, విశిష్టమైన అవకాశం నాకు దొరికింది. నేను నేర్చుకున్నవి మరియు రికార్డ్ చేసినవి చాలా విలువైనవి మరియు వాటిని ఈ ప్రపంచంతో పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పుస్తకాలు, పట్టుకోవడానికి చాలా బాగుంటాయి కానీ మీరు బెస్ట్ సెల్లర్స్ ను రాస్తే తప్ప అవి చాలా మందికి చేరవు, నా పుస్తకాలలో కూడా అలాగే జరిగింది. మామూలుగా చెప్పాలంటే, పుస్తకాలు తయారు చెయ్యడానికి ఖరీదైనవి, మరియు కొనడానికి కూడా; వాటిని ఉత్పత్తి చెయ్యడానికి చాలా సమయం పడుతుంది మరియు తర్వాతి ఎడిషన్ వరకు మీరు వాటిలోని తప్పులను సరిదిద్దలేరు. నేను చరిత్రను అధ్యయనం చెయ్యడానికి గొప్ప అభిమానిని అయినప్పటికీ, భవిష్యత్తులో ఉండేది ఇంటర్నెట్ మాత్రమే. నిజానికి ఇప్పుడు కూడా ఇంటర్నెట్ యుగమే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని, నేను నా పూర్తి పనిని ఒక వెబ్‌సైట్లో ఉంచాలని నిర్ణయించుకున్నాను, కాబట్టి నేను నవంబర్ 2001 లో berzinarchives.com ను ప్రారంభించాను.
నేను ఎప్పుడూ అనుసరించే ప్రధాన సూత్రం ఏమిటంటే, వెబ్‌సైట్లో ప్రతిదీ ఉచితంగా అందుబాటులో ఉండాలి, దానికి ఎటువంటి యాడ్స్ ఉండకూడదు మరియు అందులో ఏమీ అమ్మకూడదు. ఈ వెబ్ సైట్ లోని మెటీరియల్ ప్రధానంగా గెలుగ్ సంప్రదాయం గురించి అయినప్పటికీ, నాలుగు టిబెటన్ సంప్రదాయాలను కవర్ చేసే టిబెటన్ బౌద్ధమతం యొక్క అన్ని వివిధ అంశాలను కలిగి ఉండాలి. టిబెటన్ వైద్యం, జ్యోతిషం, బౌద్ధమత చరిత్ర, ఆసియా చరిత్ర, టిబెటన్ చరిత్ర, బౌద్ధమతం మరియు ఇస్లాం మధ్య సంబంధంపై చాలా తులనాత్మక విషయాలు, మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇతర భాషల్లోకి అనువదించడంపై కూడా నాకు చాలా బలమైన నమ్మకం ఉంది.
ముస్లిం టాపిక్ గురించి పని చెయ్యడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను, దలైలామా గారు దీన్ని చాలా బలంగా సమర్థిస్తారు. ఇస్లామిక్ ప్రపంచంలో నా ప్రయాణాలు, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు చూస్తే, అక్కడి ప్రజలు ప్రపంచం గురించి జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుస్తోంది. వాటిని వదలకుండా, టిబెట్ బోధనలను కూడా వారికి అందుబాటులోకి తేవడం, వారిని బౌద్ధమతంలోకి మార్చే ప్రయత్నం చెయ్యడం లేదని చెప్పడం కూడా ఈ ప్రపంచ సామరస్యానికి కీలకం..
ఎపిలోగ్
2015 నాటికి, బెర్జిన్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ 21 భాషలలో అందుబాటులో ఉంది మరియు సంవత్సరానికి రెండు మిలియన్ల విజిటర్లను పొందింది. ఇది 100 మందికి పైగా పెయిడ్ స్టాఫ్, మరియు వాలంటీర్ల కష్ట ఫలితం. ఈ మధ్య కాలంలో, దలైలామా గారు 21వ శతాబ్దపు బౌద్ధమతం యొక్క అవసరాన్ని బాగా నొక్కి చెప్పారు. దీని నుంచి ప్రేరణ పొంది, భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి వెబ్‌సైట్‌ను పునర్నిర్మించడంలో నాకు సహాయపడే కొంతమంది మిలీనియల్స్ ను నియమించాలని నిర్ణయించుకున్నాను. ఇది studybuddhism.com కు జన్మనిచ్చింది.
ఈ కొత్త వెబ్‌సైట్ ఒక రెస్పాన్సివ్ డిజైన్ ను కలిగి ఉంది, కాబట్టి డెస్క్ టాప్ మరియు అన్ని హ్యాండ్ హెల్డ్ డివైస్ లలో బాగా కనిపిస్తుంది. యూజర్ టెస్టింగ్, అనలిటిక్స్ ఆధారంగా అందరి అవసరాలు తీర్చేలా మేము వెబ్ సైట్ ను రూపొందించాం. మేము మా సోషల్ మీడియా ఉనికిని బాగా విస్తరించాము మరియు మంచి ఆడియో మరియు విజువల్ కంటెంట్ ను జోడించాము. ప్రారంభ స్థాయి నుంచి అధునాతన స్థాయిల వరకు అందరికి అందుబాటులో ఉండే, మరియు సులభంగా నేర్చుకోగల జ్ఞానాన్ని అందిస్తూ, టిబెటన్ బౌద్ధమతంపై ఆసక్తి ఉన్న అందరికి ఒక చోటుని సృష్టించడమే దీని లక్ష్యం. మేము అందరం కలిసి అధ్యయనం చెయ్యగల ఒక కమ్యూనిటీని సృష్టించాలని అనుకుంటున్నాము. అక్కడ ఉత్తమ బోధనలకు బహిరంగ వేదికను అందించాలనుకుంటున్నాము.
ఈ సమయంలో, మేము తక్కువ భాషలతో మరియు ఇంతకుముందు కంటెంట్ తో ప్రారంభిస్తున్నాము. అనేక కొత్త ఆర్టికల్స్ వీటిల్లో చేర్చబడ్డాయి, ముఖ్యంగా ప్రారంభకుల కోసం ఉద్దేశించబడినవి. పాత వెబ్‌సైట్ దాని మెటీరియల్ మొత్తాన్ని అప్ డేటెడ్ వెర్షన్ కు పూర్తిగా పంపే వరకు కొత్త వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోనే ఉంటుంది.
ముగింపు సారాంశం
ఇది నా కథ. నేను చెప్పిన విషయాలన్నిటిలో, నేను చాలా బలమైన బౌద్ధమత అభ్యాసాన్ని కొనసాగించాను. ఉదాహరణకు, ఈ అన్ని సంవత్సరాలలో, నేను ప్రతిరోజూ సుమారు రెండు గంటల పాటు ధ్యానం చేశాను. నేను చాలా సుదీర్ఘ ధ్యాన రిట్రీట్లను కూడా చేశాను. ఈ రోజుల్లో నేను నా ధ్యాన సమయాన్ని కొంచెం తగ్గించాను, కానీ నేను ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు ధ్యానం చేస్తాను. కరుణ, సరైన ప్రేరణ, అహంకారాన్ని జయించడం మొదలైన వాటిపై బోధనలలో ఉండే బలమైన ప్రాధాన్యతను నేను ఎప్పుడూ నొక్కి చెప్తాను. నా గురువుల ప్రేరణతో, దలైలామా గారి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళిన గెషే వాంగ్యాల్ నుంచి, ఆ తర్వాత దలైలామా గారి గురువుల ఆశీర్వాదంతో, బౌద్ధమత అభ్యాసం మరియు బౌద్ధ శాస్త్రం రెండింటినీ కలిపి, ఇతరులకు ఉపయోగకరంగా మరియు ప్రయోజనకరంగా చెయ్యగలననే ఒక అర్థవంతమైన జీవితాన్ని నేను గడపగలిగాను. బహుశా నా కథ మీలో కొందరికి అలా చెయ్యడానికి ప్రేరణను కలిగించవచ్చు.