గెషె గావాంగ్ ధార్గే గారి గురించి నాకు ఉన్న జ్ఞాపకాలు

నేను 1970 లో భారతదేశంలోని దల్హౌసీలో గెషె గావాంగ్ ధార్గే గారిని మొదటిసారి కలుసుకుని అతని దగ్గర చదువుకోవడం ప్రారంభించాను. PhD పరిశోధన కోసం రీసెర్చ్ చెయ్యడానికి ఏడాది క్రితం ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ మీద ఇండియాకు వచ్చాను. హార్వర్డ్ లో టిబెటన్ భాషను నేర్చుకుంటున్నప్పుడు న్యూజెర్సీలోని గెషె వాంగ్యాల్ తో నాకు అప్పటికే పరిచయం ఏర్పడింది, ఒకసారి భారతదేశానికి వచ్చినప్పుడు, గెషె వాంగ్యాల్ మార్గదర్శకత్వంలో అమెరికాలో ఇంగ్లిష్ నేర్చుకున్న ఇద్దరు యువ పునర్జన్మ లామాలు (తుక్కుల) అయిన షార్పా మరియు ఖమ్లుంగ్ రింపోచేల సహాయం తీసుకున్నాను.

నా అధ్యయనం కోసం గుహ్యసమజ తంత్రం గురించి రాయడం నా జ్ఞానానికి మించినదని తెలుసుకున్న తర్వాత, గురువు దలైలామా గారి జూనియర్ ట్యూటర్, క్యాబ్జే త్రిజాంగ్ రింపోచే గారు దానికి బదులుగా జ్ఞానోదయానికి గ్రేడెడ్ దశలైన లామ్-రిమ్ ను చదవమని సలహా ఇచ్చారు. గెషె గావాంగ్ ధార్గే గారు షార్పా మరియు ఖమ్లుంగ్ రింపోచేల యొక్క టీచర్, అతన్ని నేను నాకు లామ్-రిమ్ ని నేర్పిస్తారా అని అడిగాను దానికి ఆయన వెంటనే ఒప్పుకున్నారు. నేనే అతని మొదటి పాశ్చాత్య విద్యార్థిని.

గెషె ధార్గే గారు ఒక పాడుబడిన బురద మరియు పేడ గోశాలలో నివసించేవారు. తన మంచం కోసం ఒక పెద్ద గది మరియు దాని పక్కన తన విద్యార్థులు నేలపై కూర్చోవడానికి ఒక చిన్న స్థలం ఉండేది. దంతాలు లేని, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే అతని వంటమనిషి, ఖేడుప్ టార్చిన్ ఇంకా చిన్న వంటగది స్థలంలో ఉండేవాడు. గెన్  రింపోచే, గెషె ధార్గే గారిని "అమూల్యమైన పెద్ద వ్యక్తి" అని మేము పిలుస్తాము, ఇతను యువ తుల్కుల యొక్క టీచర్ గా ప్రసిద్ధి చెందాడు - అతని సంరక్షణలో తొమ్మిది మంది ఉన్నారు - మరియు పండిత డిబేటర్ మరియు అభ్యాసకుడిగా అతను ప్రసిద్ధి చెందారు. కాబట్టి, అతను అర్హత కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను.

వారానికి ఆరు రోజులు నాకు పాఠాలు ఉండేవి. ఆ సమయంలో నాకు అర్థం కాని ఖంపా మాండలికంతో గెన్ రింపోచే గారు మాట్లాడటంతో షార్పా, ఖమ్లుంగ్ గార్లు నా కోసం అనువదించి చెప్పేవారు. మరో యువక తుల్కు ఝాడో రింపోచే కూడా నాతో పాటు పాఠాలలో కూర్చొనేవారు. దలైలామాకు చెందిన నంగ్యాల్ మఠాధిపతిగా, ప్రస్తుతం గ్యూటో తాంత్రిక మఠాధిపతిగా అతను పనిచేస్తున్నారు. మేమందరం గెన్ రింపోచే గారి మంచం పక్కన ఉన్న చిన్న చోటులో కుర్చొనేవాళ్ళం.

ఆ గుడిసె ఎప్పుడూ ఈగలతో నిండిపోయి ఉండేది. అది నన్ను తప్ప ఆ గదిలో ఇంకెవరినీ ఇబ్బంది పెట్టేది కాదు. ఖమ్లుంగ్ రింపోచే గారు ఈగల ఆటలు ఆడేవారు, వాటిని తన చేతిలో పట్టుకుని - అతను దానిలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు - వాటిని కదిలించి ఆ తరవాత వాటిని వదిలెయ్యడం చేసేవారు. అవి ఎగిరిపోయేవి అది చూసి అందరూ నవ్వేవారు. నేను దాన్ని చూసి ప్రత్యేకంగా ఏమీ ఆనందించలేదు. నా అసౌకర్యాన్ని గమనించిన గెన్ రింపోచే గారు ఒక రోజు తన మంచంపై నిలబడి, ఆ ఈగలను తరిమికొట్టడానికి తన దుస్తులను గాలిలో బాగా ఊపారు, ఆ తర్వాత నా వైపుకి చూసి నవ్వారు. ఆ తర్వాత, నేను నా పాఠాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఆ ఈగలను పట్టించుకోవడం మానేసాను.

కొన్ని రోజుల తర్వాత, గెన్ రింపోచే గారు నివసించడానికి మంచి ప్రదేశం కొనుక్కోవడానికి నేను డబ్బులను ఇచ్చాను. అతను దయతో అంగీకరించారు, కానీ రహస్యంగా ఉండి బాగా జోకులు వెయ్యడానికి ఇష్టపడతారు, అతను ఎక్కడికి వెళ్ళారో మాకు చెప్పలేదు. అతను కనిపించకుండా వెళ్ళిపోయి మేము వెతుక్కుని అతని దగ్గరకు వస్తాం అని ఎదురుచూశారు. మేము ఆయనను కనిపెట్టినప్పుడు గట్టిగా నవ్వారు. అతను గ్యూమె తాంత్రిక మఠం పక్కన ఉన్న ఒక టిన్ గుడిసెలోకి మారారు. మేము అక్కడ మా పాఠాలను కొనసాగించాము మరియు అప్పుడప్పుడు, యువ తుల్కులతో కలిసి, ఒక అందమైన పర్వత పచ్చిక మైదానాలలో నడుస్తూ పిక్నిక్ లకు వెళ్ళాము. గెన్ రింపోచే గారు ఎప్పుడూ పిక్నిక్ లను బాగా ఇష్టపడేవారు.

గురువు దలైలామా గారు మా పాఠాలు తెలుసుకుని కొన్ని చిన్న టిబెటన్ గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించి ప్రచురణకు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత 1971లో ధర్మశాలలో లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్ ను గురువు గారు నిర్మించారు. మేమందరం ధర్మశాలలో ఉన్నప్పుడు, ఆ శరదృతువులో కొన్ని గుహ్యసమజ బోధనలకు హాజరైనప్పుడు, లైబ్రరీలో పాశ్చాత్యులకు గురువుగా ఉండమని గెన్ రింపోచే గారిని అనువాదకులుగా ఉండాలని షార్పా, ఖమ్లుంగ్ రింపోచే గార్లను కోరారు. నేను కూడా సహాయం చెయ్యవచ్చా అని అడిగాను, దానికి గురువు గారు అంగీకరించారు, కాని నేను ముందు హార్వర్డ్ కు వెళ్లి, నా అధ్యయనాన్ని సబ్మిట్ చేసి, డాక్టరేట్ ను పొంది, తిరిగి వస్తానని చెప్పాను. ఆ పని చేసి ఆ తర్వాతి సంవత్సరం ధర్మశాలలో గెన్ రింపోచే గారితో, మరియు ఇద్దరు తుల్కులతో కలిసి వచ్చాను. మేమిద్దరం కలిసి లైబ్రరీలో ట్రాన్స్ లేషన్ బ్యూరోను స్థాపించాము.

తర్వాతి పన్నెండు సంవత్సరాలు, విస్తృతమైన అంతర్జాతీయ బోధనా పర్యటన మినహా, గెన్ రింపోచే గారు వారానికి ఆరు రోజులు లైబ్రరీలో బోధించారు. నేను అతని అన్ని తరగతులకు హాజరయ్యాను మరియు అతను బోధించే ప్రతి దానిపై విస్తృతమైన నోట్స్ తీసుకున్నాను. ఆ సమయంలో కామన్వెల్త్ పౌరులు వీసా లేకుండా భారతదేశంలో ఉండవచ్చు, కాబట్టి చాలా మంది విద్యార్థులు ధర్మశాలలో చాలా సంవత్సరాలు ఉండగలిగారు. ఇది గెన్ రింపోచే గారి అనేక ప్రధాన బౌద్ధమత గ్రంథాలపై చాలా సంవత్సరాల కోర్సులను బోధించడానికి మరియు కొనసాగుతున్న ధ్యాన బోధనలో మాకు మార్గనిర్దేశం చెయ్యడానికి వీలు కల్పించింది. తాంత్రిక దీక్షలు, పద్ధతులపై విస్తృతమైన బోధనలు కూడా చేశారు. ప్రతి కొన్ని వారాలకు ఒకసారి, మేము గురు పూజ చెయ్యడానికి అతనితో సమావేశమవుతాము, అది ఎలా చెయ్యాలో ఆయన మాకు నేర్పించారు. అది మాకు అద్భుతమైన సమయం: ఈ అద్వితీయమైన అవకాశాన్ని పొందడం మా అదృష్టం.

ముఖ్యంగా గుర్తుండిపోయే విషయం ఏమిటంటే, గెన్ రింపోచే గారు బోధించినప్పుడల్లా అతను ఎంత ఉత్సాహంతో లోతైన వివరణలను మంచి హాస్యంతో ఎలా చెప్తారు అని. ఆయన బోధించిన విషయాలు మనకు గుర్తుకు రానప్పుడు వాటినే పదే పదే వివరించడంలో అతను ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు - అతను కరుణ మరియు సహనానికి ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. క్రమశిక్షణ విషయంలోనూ, సన్యాసి ప్రతిజ్ఞల విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. అర్ధరాత్రి సమయంలో టాయిలెట్ కు వెళ్లేందుకు లేచినా ఆయన శాలువా ధరించుకుని వెళ్లేవారు.

గెన్ రింపోచే గారు నాకు అనేక కష్ట సమయాల్లో సహాయం చేశారు. స్పితిలో సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు అకస్మాత్తుగా మరణించినప్పుడు, నేను విన్న వెంటనే గెన్ రింపోచే గారి గదికి వెళ్లాను. గెన్ రింపోచే గారి గురువులలో సెర్కాంగ్ రింపోచే గారు కూడా ఒకరు. నేను లోపలికి వెళ్లి చూడగానే, గెన్ రింపోచే గారు కొంతమంది టిబెటన్ స్నేహితులతో కూర్చొని టీ తాగుతూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వారు వెళ్ళే వరకు కూర్చొని వేచి ఉండమని నాకు చెప్పారు. సెర్కాంగ్ రింపోచే గారి మరణ వార్త నేను ఇప్పుడే విన్నానని ఆయనకు చెప్పినప్పుడు, అతను కూడా నేను కూడా విన్నానని చెప్పారు. అప్పటికే చనిపోయిన తన గురువులందరినీ తన జపమాల మీద లెక్కపెట్టడం మొదలుపెట్టారు. చావు ప్రతి ఒక్కరికీ వస్తుందని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆయన అన్నారు. కానీ మన గురువులను, వారి సలహాలను మన హృదయాల్లో ఉంచుకుంటే, వారు శారీరకంగా మరణించినా, ఎప్పుడూ మనతోనే ఉంటారు, జీవితం ఇలా సాగిపోతుంది అని చెప్పారు. ఈ విషయం నాకు ఎంతగానో ఉపయోగపడింది.

గెన్ రింపోచే గారు 1984 లో లైబ్రరీని విడిచిపెట్టి, న్యూజిలాండ్ లోని డ్యూనెడిన్ లో స్థిరపడటానికి మరియు బోధించడానికి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించి వెళ్లారు. ఐరోపాకు, ఉత్తర అమెరికాకు దూరంగా ఉన్న మారుమూల ప్రదేశానికి వెళ్లడం సరైనదిగా అనిపించింది. ఆయన ఎప్పుడూ కొంచెం రహస్యంగా ఉండటానికి ఇష్టపడేవారు మరియు విద్యార్థులను అతన్ని కనిపెట్టడానికి మరియు అతని బోధనలను స్వీకరించడానికి కష్టపడడం ఇష్టపడేవారు.

గెన్ రింపోచే గారు 1995 లో మరణించే వరకు న్యూజిలాండ్ లోనే ఉన్నారు. డయాబెటిస్ కారణంగా ఆయన దృష్టిని కోల్పోయారు, కాని చివరి వరకు తన పనులన్నిటినీ, బోధనలను హృదయపూర్వకంగా చెయ్యడం కొనసాగించారు.

గెన్ రింపోచే గారిని న్యూజిలాండ్ వెళ్లిన తర్వాత నేను రెండు సార్లు మాత్రమే కలిశాను. కానీ ఆయన నాకు అన్ని ప్రాథమిక బౌద్ధమత బోధనలు, ఆచరణలను నేర్పించి, గొప్ప భారతీయ, టిబెటన్ గ్రంథాలను నాకు బోధించినందుకు నేను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. 1996లో జన్మించిన యాంగ్సీ రింపోచే గారు ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని సెరా జే మొనాస్టరీలో చదువుకుంటున్నారు.

Top