కరోనా వైరస్ గురించి దలైలామా గారి మాటలు: ప్రార్థన ఒక్కటే సరిపోదు

కరుణతో కరోనా వైరస్ పై ఎందుకు పోరాటం చెయ్యాలి

Studybuddhism dalai lama oaa

కొన్నిసార్లు స్నేహితులు నన్ను నా "మాయా శక్తులను" ఉపయోగించి ప్రపంచంలోని సమస్యలను తీర్చమని అడుగుతారు. నేను అప్పుడు ఈ దలైలామాకు ఎలాంటి మాయా శక్తులు లేవని చెప్తాను. ఒకవేళ నాకు ఆ శక్తులే ఉంటే, నా కాళ్లలో మరియు గొంతులో నొప్పి నేను ఎందుకు అనుభవిస్తున్నాను. మనమందరం ఒక్కటే, మనమందరం ఒకే రకమైన భయాలు, ఆశలతో పాటు అనుకోని సంఘటనలు సంభవిస్తున్నాయి.

బౌద్ధమత ప్రకారం చూస్తే, ప్రతి జీవికి బాధ, అనారోగ్యం, వృద్ధాప్యం మరియు మరణం అన్నీ ఇవ్వబడ్డాయి. కానీ మనుషులుగా మన మనస్సులను ఉపయోగించి కోపాన్ని, భయాందోళనలను, దురాశను మనం జయించగలం. ఈ మధ్య నేను "భావోద్వేగాలను వదిలించుకోవాలని" నొక్కి చెబుతున్నాను: భయం లేదా కోపం యొక్క గందరగోళం లేకుండా విషయాలను వాస్తవికంగా మరియు స్పష్టంగా చూడటానికి ప్రయత్నించాలని చెప్తున్నాను. ఒక సమస్యకు పరిష్కారం ఉంటే, దానిని కనిపెట్టడానికి మనం కష్టపడాలి; అలాంటి అవకాశం లేకపోతే దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోకూడదు.

బౌద్దులైన మేము ప్రపంచం మొత్తం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉందని నమ్ముతాము. అందుకే నేను తరచుగా సార్వత్రిక బాధ్యత గురించి మాట్లాడతాను. ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి మనకు ఏమి చూపించింది అంటే ఒక వ్యక్తికి ఏదైతే జరుగుతుందో వేరే వ్యక్తికి కూడా అదే జరుగుతుంది. కానీ ఆసుపత్రులలో పనిచేయడం లేదా సామాజిక దూరాన్ని పాటించడం - కరుణతో కూడిన పని లేదా నిర్మాణాత్మక పని చాలా మందికి సహాయపడే సామర్ధ్యం ఉందని మనకు గుర్తు చేసింది.

వూహన్ కరోనా వైరస్ గురించి వార్తలు వచ్చినప్పటి నుండి, నేను చైనాలో మరియు ఇతర అన్నిచోట్లా ఉండే నా సోదర సోదరీమణుల కోసం ప్రార్థనలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ వైరస్ కు ఎవరూ అతీతులు కాదని అర్థమవుతోంది. మనమందరం ఆప్తుల గురించి మరియు భవిష్యత్తు గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు మన స్వంత ఇళ్ల గురించి ఆందోళన చెందుతున్నాము. కానీ ప్రార్థనలు చేస్తేనే సరిపోదు.

ఈ సంక్షోభం గురించి మనమందరం సాధ్యమైనంత వరకు బాధ్యత తీసుకోవాలి. వైద్యులు, నర్సులు చూపిస్తున్న ధైర్యసాహసాలను చూసి మనం కూడా నేర్చుకుని ఈ పరిస్థితిని మలుపు తిప్పి ఇలాంటి ప్రమాదాల నుంచి మన భవిష్యత్తును కాపాడుకోవాలి.

ఇలాంటి భయంకరమైన సమయంలో, పూర్తి ప్రపంచం యొక్క దీర్ఘకాలిక సవాళ్లు - మరియు అవకాశాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుండి మన ప్రపంచం యొక్క చిత్రాలు మన భూమిపై నిజమైన సరిహద్దులు లేవని స్పష్టంగా చూపిస్తున్నాయి. కాబట్టి, మనమందరం దీనిని జాగ్రత్తగా చూసుకుని వాతావరణ మార్పులు మరియు ఇతర విధ్వంసక శక్తుల నుంచి కాపాడుకోవటానికి కష్ట పడాలి. సమన్వయంతో కూడిన, ప్రపంచ ప్రతిస్పందనతో కలిసి రావడం ద్వారా మాత్రమే మనం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లను ఎదుర్కోగలమని ఈ మహమ్మారి మనకు నేర్పించింది.

ఎవరూ బాధల నుంచి విముక్తులు కామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇళ్లు, రిసోర్స్ లు, కుటుంబం లేని వాళ్లను రక్షించడానికి మనం ముందుకు రావాలి. ఈ సంక్షోభం మనం ఒకరికొకరు వేరుగా లేమని చూపిస్తుంది - మనం విడిగా జీవిస్తున్నప్పటికీ అందరికి కరుణతో సహాయం చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది.

ఒక బౌద్ధుడిగా నేను అశాశ్వత సూత్రాలను నమ్ముతాను. చివరికి, ఈ వైరస్ పోతుంది, ఎందుకంటే నా జీవితకాలంలో యుద్ధాలు మరియు ఇతర భయంకరమైన ప్రమాదాలు వచ్చి వెళ్ళిపోవటం నేను చూశాను. మనం ఇంతకు ముందు చాలా సార్లు చేసినట్లుగా మన ప్రపంచ సమాజాన్ని పునర్నిర్మించే అవకాశం త్వరలోనే వస్తుంది. అందరూ సురక్షితంగా, ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అనివార్య సమయంలో, చాలా మంది చేస్తున్న నిర్మాణాత్మక ప్రయత్నాలపై ఆశను మరియు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం.

Top