COP26కు పూజ్యులైన దలైలామా గారి సందేశం

Uv hhdl cop message

ఈ రోజు మనం ఎదుర్కొంటున్న వాతావరణ అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు - COP26 - స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతుందని తెలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రస్తుతం మనం పట్టించుకోవాల్సిన ఒక అత్యవసర పరిస్థితి. మనలో ఎవరూ గతాన్ని మార్చలేము. కానీ మనమందరం మంచి భవిష్యత్తు కోసం సహాయం చెయ్యగలిగే స్థితిలో ఉన్నాము. వాస్తవానికి, మనమందరం శాంతి మరియు భద్రతతో జీవనం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఈ  ఏడు బిలియన్ల మనుషులైన మనపైనే ఉంది. ఆశతో, మరియు దృఢ సంకల్పంతో మనం మన జీవితాలను, మరియు మన పక్కవాళ్ల జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

మన పూర్వీకులు ఈ భూమిని సుసంపన్నంగా మరియు సమృద్ధిగా ఉంచారు. ఇది సుసంపన్నమైన భూమే, మనకు ఇది ఇల్లు కూడా. మన కోసమనే కాదు, రాబోయే భావితరాలకు, ఈ భూమిని పంచుకుంటున్న లెక్క లేనన్ని జాతుల కోసం దీన్ని మనం కాపాడుకోవాలి.

ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలు కాకుండా మంచు యొక్క అతిపెద్ద రిజర్వాయర్ అయిన టిబెటన్ పీఠభూమిని "మూడవ ధ్రువం" అని పిలుస్తారు. టిబెట్ ప్రపంచంలోని కొన్ని ప్రధాన నదులకు సోర్స్. వాటిలో బ్రహ్మపుత్ర, గంగ, సింధు, మెకాంగ్, సాల్వీన్, ఎల్లో నది మరియు యాంగ్జీ నదులు ఉన్నాయి. ఈ నదులు జీవనాధారంలా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి ఆసియా అంతటా దాదాపు రెండు బిలియన్ల ప్రజలకు తాగు నీటిని, వ్యవసాయానికి సాగునీటిని మరియు జలవిద్యుత్తుని అందిస్తాయి. టిబెట్ లోని అనేక మంచు పర్వతాలు కరిగిపోవడం, నదుల ఆనకట్టలు, మళ్లింపులు, ఒక ప్రాంతంలో విస్తృతమైన అటవీ నిర్మూలన  చేస్తూ ఉంటే పర్యావరణ నిర్లక్ష్యానికి దాదాపు అన్ని చోట్లా పర్యవసానాలు ఎలా ఉంటాయో ఉదాహరణగా చాలా చెప్పుకోవచ్చు.

ఈరోజు, మనం మన భవిష్యత్తును భయంతో ప్రేరేపించబడిన ప్రార్థనలతో కాకుండా, శాస్త్రీయ విషయాలపై ఆధారపడిన వాస్తవిక పనులతో పరిష్కరించుకోవాలి. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు మన భూమి మీద ఉండే జీవులు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటున్నారు. మనం చేసే ప్రతి పని మన మానవ సంబంధాలను, అలాగే అనేక జంతు మరియు వృక్ష జాతుల మీద ప్రభావం చూపిస్తుంది.

భూమిని నాశనం చేసే శక్తి మానవులైన మనకు మాత్రమే ఉంది, కానీ దీనిని రక్షించే గొప్ప సామర్థ్యం కూడా మనకే ఉంది. ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ప్రపంచ స్థాయిలో ఈ వాతావరణ మార్పుల సమస్యలను చర్చించాల్సి ఉంది. కానీ మనం మన వ్యక్తిగత స్థాయిలో ఏం చెయ్యగలమో అది తప్పకుండా చేసి తీరాలి. మనం నీటిని ఎలా ఉపయోగిస్తామో మరియు మనకు అవసరం లేని వాటిని ఎలా పారవేస్తామో వంటి చిన్న పనులు కూడా పర్యవసానాలను కలిగి ఉంటాయి. మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి, మరియు సైన్స్ మనకు ఏమి నేర్పుతుందో దాన్ని నేర్చుకోవాలి.

నాకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే, వాతావరణ మార్పులపై మంచి చర్యలు తీసుకోవాలని మన యువతరం డిమాండ్ చేస్తూ ఉండటం. ఇది భవిష్యత్తుపై నాకు కొంత ఆశను మిగుల్చుతుంది. గ్రెటా థన్ బర్గ్ వంటి యువ ఉద్యమకారులు సైన్స్ ను అర్ధం చేసుకోవటానికి అవగాహనను పెంచి దానికి తగిన పనులు చెయ్యటం చాలా అభినందనీయమైనది. వారి ఆలోచన వాస్తవికమైనది కాబట్టి, మనం వారిని తప్పకుండా ప్రోత్సహించాలి.

ప్రతి మనిషి మనలో ఒక భాగమేనన్న భావనతో, మానవత్వం యొక్క ఏకత్వ భావనను కొనసాగించమని నేను ప్రతిసారీ నొక్కి చెబుతాను. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల ముప్పు జాతీయ సరిహద్దులకు పరిమితమేమీ కాదు; మనందరినీ ప్రభావితం చేస్తుంది.

ఈ సంక్షోభాన్ని మనం కలిసి ఎదుర్కుంటున్నప్పుడు, దాని పర్యవసానాలను తగ్గించుకోవడానికి మనం సంఘీభావం మరియు సహకార స్ఫూర్తితో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈ ఎమర్జెన్సీ సమస్యను పరిష్కరించడానికి అందరూ కలిసి చర్య తీసుకోవడానికి మరియు ఈ మార్పుకు ఒక టైమ్ టేబుల్ ను నిర్దేశించడానికి మన నాయకులు కూడా ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. మన భూమిని సురక్షితమైన, పచ్చని, సంతోషకరమైనదిగా మార్చడానికి మనం కృషి చెయ్యాలి.

ప్రార్థనలు, మరియు శుభాకాంక్షలతో,

దలైలామా

31 అక్టోబర్ 2021 

Top