ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే) సందర్భంగా దలైలామా గారి సందేశం

Sb nasa earth

ఎర్త్ డే యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా, మన భూప్రజల ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించి అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, ఈ పోరాటం మధ్యలో, కరుణ మరియు పరస్పర సహాయం చేసే విలువ మనకు గుర్తుకు వస్తుంది. ప్రస్తుత ప్రపంచ మహమ్మారి మన జాతి, సంస్కృతి లేదా లింగ భేదాలను చూడకుండా మనందరినీ భయపెడుతోంది. దీనికి మనం కలిసిగట్టుగా ఎదిరించాలి, అందరికీ ముఖ్యమైన అవసరాలను అందిస్తూ సహాయం చెయ్యాలి.

మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక గొప్ప కుటుంబంలో భాగంగా ఈ భూమిమీద మనం జన్మించాం. ధనికులు, పేదలు, విద్యావంతులు, నిరక్షరాస్యులు, ఏ జాతికి చెందిన వారైనా, అందరూ మనలాంటి మనుషులే. అంతేకాకుండా, మనందరికీ సంతోషాన్ని పొందుతూ బాధను తొలగించుకునే సమాన హక్కు ఉంది. ఈ విషయంలో అందరూ సమానమేనని గుర్తించినప్పుడు, మనకు మనమే స్వయంగా ఇతరుల పట్ల సహానుభూతిని మరియు సాన్నిహిత్యాన్ని చూపిస్తాము. దీని నుండి ఒక సార్వజనిక బాధ్యత అనే నిజమైన భావన పుట్టుకొస్తుంది: ఇతరుల సమస్యలను పోగొట్టాలని సహాయం చేసే ఆలోచన అనమాట.

మన భూతల్లి మనకు సార్వజనిక బాధ్యత అనే పాఠాన్ని నేర్పుతోంది. ఈ నీలి గ్రహం ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. దాని జీవితమే మన జీవితం. దాని భవిష్యత్తే, మన భవిష్యత్తు. నిజానికి భూమి మనందరికీ ఒక తల్లిలా పనిచేస్తుంది. ఆమె పిల్లలుగా, మనం తనపై ఆధారపడి ఉన్నాము. మనం ఎదుర్కొంటున్న ఈ ప్రపంచ సమస్యల నుంచి బయటపడటానికి కలిసి పనిచేయడం చాలా ముఖ్యం.

1959లో టిబెట్ నుంచి తప్పించుకున్న తర్వాతే నేను పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను. ఉదాహరణకు, మనం ఎక్కడన్నా నీటి ప్రవాహాన్ని చూసినప్పుడు అవి త్రాగడానికి మంచివా కాదా అని ఆలోచిస్తున్నాం. దురదృష్టవశాత్తూ, ఇప్పుడు చాలా చోట్ల స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది.

వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు స్వచ్ఛమైన నీరు మరియు సరైన పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండేలా మనం చూసుకోవాలి. పరిశుభ్రత అనేది సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణకు చాలా ముఖ్యమైనది.

సరిగ్గా సన్నద్ధమైన సిబ్బందితో కూడిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, మన ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న ప్రస్తుత మహమ్మారి యొక్క సవాళ్లను ఎదుర్కోవడంలో బాగా సహాయపడతాయి. ఇవి భవిష్యత్తులో వచ్చే ప్రజారోగ్య సంక్షోభాలకు కూడా మంచి వ్యతిరేకతతో కూడిన బలమైన రక్షణను అందిస్తాయి. ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో వివరించిన విషయాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరిస్తాయని నేను అర్థం చేసుకున్నాను.

మనమందరం కలిసి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొ౦టున్నప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన అన్నా చెల్లెళ్లందరి అత్యవసర అవసరాలను తీర్చడానికి మన౦ సంఘీభావం, సహకార స్ఫూర్తితో పనిచేయగలుగుతాం. రాబోయే రోజుల్లో, మనలో ప్రతి ఒక్కరూ సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి మన వంతు కృషి చెయ్యాలని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను.   

దలైలామా

22 ఏప్రిల్ 2020

Top