నిజాయితీ, నమ్మకం మరియు స్నేహం

Study buddhism dalai lama oa

సంతోషం అంటే ఏమిటి?

ప్రతి ఒక్కరికి సంతోషకరమైన జీవితం కావాలి, కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సంతోషం అంటే ఏమిటి? నిజంగా ఎక్కువ రోజులు, నమ్మదగిన సంతోషం అంటే ఏమిటి? దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఇది ప్రధానంగా మన ఇంద్రియాల నుంచి వచ్చే సంతోషం లేదా ఆనందం - ఏదైనా మంచి దానిని చూసినా, మంచి మాటలు విన్నా లేదా మంచి పదార్ధాలు తిన్నా లేదా వాటి వాసనను చూసినా కలిగే అనుభవాలు - ఇవన్నీ మనకు కొంత సంతృప్తిని అందిస్తాయి. కానీ ఈ ఇంద్రియ అనుభవాలపై ఆధారపడిన సంతోషం కొంచెం సేపే ఉంటుంది. మీకు కొన్ని సౌకర్యాలు ఉంటే అప్పుడు ఒక రకమైన ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని పొందుతారు. కానీ ఒక్కసారిగా ఏదన్నా పెద్ద శబ్దం వస్తే వెంటనే మీరు ఆ సంతోషాన్ని కోల్పోతారు. లేదా టీవీ చూడటంలో ఒక రకమైన ఆనందాన్ని కోరుకునే వాళ్లు, అదే టీవీని ఆపేస్తే, ఒక గంట లోనే వారికి విసుగు వచ్చేస్తుంది. కొంతమంది బాగా సరదాగా ఉండటానికి మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించడానికి మరియు క్రొత్త ప్రదేశాలు, సంస్కృతులు, సంగీతం మరియు అభిరుచులను ఎప్పుడూ అనుభవించడానికి ఇష్టపడతారు. మానసిక శిక్షణ తీసుకుని మనశ్శాంతి  సృష్టించుకునే సామర్థ్యం లేకపోవడం వల్ల వీళ్లు ఇలా అయ్యారని నేను అనుకుంటున్నాను.

కానీ నిజంగా ఏళ్ల తరబడి సన్యాసిగా బతికే వారు నిజంగా సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఒకసారి బార్సిలోనాలో నేను ఒక కాథలిక్ సన్యాసిని కలిశాను, అతను నాతో సమానంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, కాబట్టి అతనితో ఎక్కువగా మాట్లాడటానికి నాకు ధైర్యం కలిగింది! ఆ సన్యాసి అయిదేళ్లు పర్వతాలలో సన్యాసి జీవితాన్ని గడిపాడని అక్కడి నిర్వాహకుడు నాతో చెప్పాడు. అతను పర్వతాలలో ఏం చేసేవాడని నేను అడిగాను, అతను ప్రేమ గురించి ఆలోచిస్తూ ధ్యానం చేసేవాడని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన భావన నాకు కనిపించింది, అతను నిజంగా అక్కడ చాలా మనశ్శాంతిని ఆస్వాదించాడని నాకు అర్ధం అయ్యింది. కాబట్టి ఇంద్రియ అనుభూతులపై ఆధార పడకుండా కొన్ని లోతైన విలువలను పెంపొందించుకోవడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు అది నిజంగా ప్రశాంతతను తెచ్చిపెడుతుంది.

కాబట్టి ఇప్పుడు నేను ప్రసంగాలు ఇస్తున్నప్పుడు, శారీరక సౌకర్యం కోసం భౌతిక వికాసం అనేది చాలా అవసరమని నేను బాగా నొక్కి చెప్తూ ఉంటాను, కానీ ఆ భౌతిక విలువ నిజానికి మానసిక ఓదార్పు లేదా సంతోషాన్ని ఇవ్వలేదని చెప్తాను. కొన్నిసార్లు ప్రజలు ధనవంతులైనప్పుడు, వారు అత్యాశకు మరియు మరింత ఒత్తిడికి గురవుతారు. దీని ఫలితంగా వాళ్లు అసంతృప్తికి లోనవుతారు. అందువల్ల, సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి, కేవలం భౌతిక విలువల పైనే నమ్మకం పెట్టుకోవద్దు. భౌతిక విలువలు అవసరమే, కానీ, మన అంతర్గత విలువలు ఇంకా ముఖ్యమైనవి. మనం మత విశ్వాసులమా కాదా అనే దానితో సంబంధం లేకుండా, మనం మనుషులుగా ఉన్నంత కాలం, మనశ్శాంతి అనేది చాలా అవసరం.

మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం

కొంతమంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ప్రకారం, అధిక స్ట్రెస్ అనేది రక్తపోటు మరియు ఇతర అనేక సమస్యలను సృష్టిస్తుందని అంటున్నారు. మరికొందరు వైద్య శాస్త్రవేత్తలు నిరంతర భయం, కోపం, ద్వేషం మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయని చెబుతున్నారు. కాబట్టి మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన వాటిలో ఒకటి మనశ్శాంతి. ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరం మరియు ఆరోగ్యకరమైన మనస్సు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నా అనుభవంలో, రెండేళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్ లో ఒక మీడియా వ్యక్తి నా పునర్జన్మ గురించి అడిగారు. నేను సరదాగా అతని వైపు చూసి, నా కళ్ళజోడు తీసి, అతన్ని "నా ముఖాన్ని చూస్తే, నా పునర్జన్మ అంత అర్జెంటుగా జరగాలా?!" అని అడిగాను. దానికి అతను తొందరేమీ లేదని చెప్పారు!

ఈ మధ్య కాలంలో నేను యూరప్ లో ఉన్నప్పుడు కొంతమంది నా చిన్ననాటి స్నేహితులు నన్ను నా ఇరవై, ముప్పై లేదా నలభై సంవత్సరాల క్రితం తీసిన ఫొటోలతో పోల్చారు. వాళ్లలో ప్రతి ఒక్కరూ నా ముఖం ఇప్పటికీ యవ్వనంగానే కనిపిస్తోందని చెప్పారు. నా జీవితంలో, నేను నిజంగా చాలా సమస్యలను దాటుకుంటూ వచ్చానని మీకు తెలుసు, మరియు అలాంటి ఇబ్బందులు, నిరాశ మరియు ఒంటరితనాన్ని సృష్టించడానికి నా జీవితంలో చాలా జరిగాయి. కానీ నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. అప్పుడప్పుడు నేను నా టెంపర్ ని కోల్పోయాను, కానీ ఎప్పుడూ నా మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉండేది.

కాస్మొటిక్స్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేసే ఆ అమ్మాయిలను ఆటపట్టించడం అంటే నాకు ఇష్టం. ముందుగా, ఇది చాలా ఖరీదైనదని, మీ హస్బెండ్ కంప్లైంట్ చెయ్యవచ్చు! అని. ఎలా చూసినా కానీ బయటి అందం ముఖ్యమైనదే కానీ లోపలి అందం దాని కంటే ముఖ్యమైనది. మీకు ఒక అందమైన ముఖం ఉండొచ్చు, కానీ ఎలాంటి మేకప్ లేకుండా బాగోలేని ముఖంపై నిజాయితీతో కూడిన ఒక చిరునవ్వు మరియు ఆప్యాయత ఉంటే అదే బాగుంటుంది. ఇదే అసలైన అందం. అసలైన విలువ మన లోపలే ఉంటుంది. బయట కనిపించే వాటికి చాలా డబ్బు అవసరం - వాటికోసం ఎప్పుడూ పెద్ద దుకాణాలకు మరియు పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనశ్శాంతికి ఎలాంటి ఖర్చు అవసరం లేదు! ఈ అంతర్గత విలువల గురించి ఆలోచించండి, అప్పుడు క్రమంగా మీలో ఉండే చెడు భావోద్వేగాలు తగ్గిపోతాయి. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది.

పూర్తి దయ కలిగి ఉండే వ్యక్తిత్వం లేదా శ్రద్ధ అనేది ఇతరుల శ్రేయస్సు పట్ల  ఆత్మవిశ్వాసాన్ని సృష్టిస్తుంది. మీకు ఆత్మవిశ్వాసం ఉంటే, మీరు మీ పనులన్నింటినీ మంచిగా, మరియు నిజాయితీగా చేసుకోవచ్చు. ఇది ఇతరులతో నమ్మకాన్ని సృష్టిస్తుంది మరియు ఈ నమ్మకమే స్నేహానికి ఆధారం. మనం, మానవులం, ఒక సామాజిక జంతువులం మనకు స్నేహితులు చాలా అవసరం. స్నేహితులు అధికారం, డబ్బు, విద్య, లేదా జ్ఞానం కోసం మన దగ్గరకు రారు, స్నేహానికి కీలకమైనది విశ్వాసం. కాబట్టి ఎదుటివారి జీవితాల పట్ల శ్రేయస్సు, శ్రద్ధ, మరియు గౌరవం ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైన విషయం.

Top