అనేక సమస్త జీవులలో, ముఖ్యంగా మనుషులకు మాత్రమే సుఖదుఃఖాలు, మంచి చెడులు, ఏది హానికరమైనది, ఏది ప్రయోజనకరమైనదనే అనే తేడాను గుర్తించే శక్తి ఉంటుంది. ఇన్ని రకాల భావాల మధ్య తేడాలను గుర్తించే సామర్థ్యం ఉండడంతో, మనమందరం ఒకే లాగా బాధను వద్దనుకుని ఆనందాన్ని కోరుకుంటున్నాం.
ఇన్ని రకాల భావాలు ఎలా అభివృద్ధి చెందాయనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మనందరికీ స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటంటే, మనందరికీ ఆనందం పట్ల ఈ అవగాహన ఉండి బాధను పొందకూడదనే భావన ఉంటుంది. అందువల్ల, సామరస్యం మరియు శాంతిని తీసుకువచ్చే జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. గొడవలు మరియు ఇబ్బందులను తీసుకువచ్చే జీవితం మనకు అవసరం లేదు.
శాంతి, సంతోషాలను పొందే విషయానికి వస్తే, అవన్నీ కేవలం బయట కనిపించే వస్తువుల నుంచి మాత్రమే వస్తాయని అనుకోవడం చాలా తప్పు. వస్తువుల సౌకర్యాలపై ఆధారపడటంతో, మన శారీరక ఆనందాన్ని మరియు సంతోషాలను పెంచుకుని మన శారీరక ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. కానీ వస్తువుల సౌకర్యాల నుండి మనం పొందేది కేవలం శరీర అనుభవానికి మాత్రమే పరిమితం.
ఇతర జాతుల జంతువుల మాదిరిగా కాకుండా, మానవులు ఆలోచించడానికి, లెక్కలు వెయ్యడానికి, తీర్పు ఇవ్వడానికి మరియు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అందువల్ల, మనుషులుగా మనం అనుభవించే బాధలు మరియు సంతోషాలు కూడా అంతే బలంగా మరియు శక్తివంతంగా ఉంటాయి. దాని కారణంగా, మనుషుల ఆలోచనా సామర్థ్యానికి తగినట్టుగా అంతటి బాధలను అనుభవించే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మనుషులు, జంతువుల లాగా కాకుండా, ఒక రకమైన తాత్కాలిక ఆనందాన్ని సాధించడంలో మరియు కొన్ని రకాల తాత్కాలిక బాధల నుంచి బయటపడడంతో సంతృప్తి చెందరు. ఆలా ఎందుకంటే, మనుషులమైన మనకు దీర్ఘకాలిక ప్రణాళిక మరియు లెక్కలు వేసే సామర్థ్యం ఉంటుంది, అందువల్ల మనకు ఇతరులకి మధ్య తేడాను చూస్తాము. ఈ తేడాల ఆధారంగా మనం వివిధ దేశాల గురించి, వివిధ జాతుల గురించి, వివిధ మతాల గురించి మాట్లాడుతాం. మనం లెక్క లేనన్ని తేడాలను చేసుకుంటాం, వాటి ఆధారంగా అనేక రకాల అనవసరమైన ఆలోచనలు, అపోహలు ఏర్పడతాయి. దాని కారణంగా, మనకు కొన్నిసార్లు చాలా ఆశలు ఇంకొన్ని సార్లు చాలా సందేహాలు వస్తాయి.
అందువల్ల, పూర్తిగా మనిషి యొక్క మేధస్సు మరియు భావనలపై ఆధారపడి, మనం అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తాము. ఆర్య దేవుడు రచించిన నాలుగు వందల వచన గ్రంథంలో ఇది చాలా స్పష్టంగా వివరించబడింది, (II.8)లో ఇలా చెబుతోంది: "ప్రత్యేక స్థానాలలో ఉన్నవారికి మానసిక కష్టాలు వస్తాయి, సామాన్యులకు శారీరక కష్టాలు వస్తాయి." అంటే, ఎక్కువ అధికారం, ఎక్కువ సంపద ఉన్నవారికి శారీరక కష్టాలు ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అధిక మానసిక బాధను అనుభవిస్తారు. ఇప్పుడు సామాన్యుల విషయానికొస్తే, వాళ్లకు ఉండే దుస్తుల, ఆహార సమస్యల వల్ల వాళ్లకు శారీరక కష్టాలు వస్తాయి. అందువల్ల మనం ఆలోచించే విధానం వల్లే మనం చాలా కష్టాలను అనుభవిస్తామని అర్ధం అవుతుంది.
నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, భౌతిక పురోగతిని పొందడం ద్వారా శారీరక బాధను తగ్గించుకోవచ్చు. కానీ, మీ మానసిక దృక్పథం వల్ల ఎదురయ్యే బాధలను మీ భౌతిక సౌకర్యాన్ని పెంచడం ద్వారా తగ్గించలేము. దీనికి ఉదాహరణ ఏమిటంటే, అనేక మంది డబ్బున్న వాళ్ళ వద్ద అన్ని భౌతిక సౌకర్యాలు ఉంటాయి, కానీ వాళ్ళు అనేక రకాల మానసిక బాధలను అనుభవిస్తూ ఉంటారు. ఇది మనమందరం గమనించదగిన విషయం. అందువల్ల, మీ మానసిక దృక్పథం ఫలితంగా కలిగే అశాంతి, సమస్యలు మరియు బాధలను బయట కనిపించే వస్తువుల సౌకర్యాల ద్వారా కాకుండా మీ మానసిక దృక్పథాన్ని మార్చడం ద్వారా తగ్గించుకోవచ్చు.
ఈ విషయం యొక్క సారాంశం ఏమిటంటే, సంతోషం మరియు బాధను అనుభవించే విషయానికి వస్తే, వాటిని అనుభవించడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియ అనుభవాలతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉండటం - అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం అనుభవించే సుఖ దుఃఖాలు - తర్వాత మన మనస్సు లేదా మానసిక దృక్పథం ఆధారంగా కలిగే సుఖ దుఃఖాలు. ఈ రెండింటిలో, మీరు ఇంద్రియాల ద్వారా అనుభవించే దాని కంటే మనస్సు ద్వారా అనుభవించే ఆనందం మరియు బాధే చాలా బలమైనది మరియు శక్తివంతమైనదిగా ఉంటుంది.
ఉదాహరణకు, మీ వద్ద అన్ని భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ, మీకు ఎటువంటి శారీరక సమస్యలు మరియు బాధలు లేకపోయినా, మీరు మానసికంగా బాధపడుతున్నప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, ఈ శారీరక సౌకర్యాలు మీ మానసిక స్థాయిలో మీరు ఎదుర్కొంటున్న బాధలను అధిగమించలేవు. మరోవైపు, మీరు కొంత శారీరక అసౌకర్యాన్ని మరియు బాధను ఎదుర్కొన్నప్పటికీ, మీరు ఆ పరిస్థితిని మానసికంగా అంగీకరిస్తే, ఆ శారీరక బాధను తట్టుకోగలుగుతారు.
ఉదాహరణకు ఒక మతపరమైన వ్యక్తిని తీసుకోండి. అతను ఆ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, అనేక శారీరక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది; ఏదేమైనా, సంతృప్తితో అతను అనుసరిస్తున్న లక్ష్యం గురించి స్పష్టమైన దృష్టి ఉండటం వల్ల, ఆ వ్యక్తి ఆ కష్టాలను ఒక రకమైన ఆభరణంగా చూస్తాడు. కాబట్టి, గొప్ప ప్రయోజనాలను చూడటం ద్వారా ఆ పరిస్థితిని అంగీకరించడానికి మానసిక సంసిద్ధత ద్వారా ఆ శారీరక బాధలను అధిగమించగలడు. ఒక ముఖ్యమైన ప్రయోజనం మరియు లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు శారీరక బాధను ఎలా అధిగమించగలుగుతామో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో, మనం చాలా శారీరక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆ శారీరక సమస్యలను మనం చాలా సంతోషంగా, గొప్ప ఆనందంతో మరియు ఒక ఆభరణలా పరిగణిస్తాము.
ఈ విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే, మీ ఇంద్రియాలు మరియు మనస్సు ద్వారా ఎదుర్కునే రెండు అనుభవాలలో, మనస్సు ద్వారా ఎదుర్కొని అనుభవించేదే చాలా ముఖ్యమైనది.
మానసిక సమస్యలతో వ్యవహరించేటప్పుడు, నేను చెప్పినట్లుగా, మీ మానసిక దృక్పథం వల్ల వచ్చే సమస్యల వైఖరిని మార్చుకోవడం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. కాబట్టి, మానసిక సమస్యలను తొలగించుకోడానికి ఒక మార్గం ఉంది. అందుకని, ఈ మానసిక సమస్యలను తగ్గించుకోవడానికి మరియు తొలగించుకోడానికి మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా, ఈ మానసిక సమస్యలను తొలగించడానికి ఈ మార్గాలు మరియు పద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు, మన పుట్టుకతో వచ్చిన మంచి మానవ లక్షణాలను తెలుసుకోవడం మరియు గుర్తించడం చాలా ముఖ్యం.
ఉదాహరణకు, నేను దీన్ని ఇలా అర్ధం చేసుకుంటాను: మీరు ఈ మానవ సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం సామాజిక జంతువులమని మీకు తెలుస్తుంది. అంటే మనం సమాజంలో జీవిస్తున్నామని, ఒకరిపై ఒకరు పూర్తిగా ఆధారపడి ఉన్నామని అర్థం అనమాట. మనం పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు మన మంచి కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. దీనికి కారణం మన జీవశాస్త్రం మరియు మన శరీరం యొక్క నిర్మాణం. మనం ఎంత సాన్నిహిత్యం చూపిస్తే, ఒకరి పట్ల మరొకరు ఎంత కరుణ, శ్రద్ధ పెంచుకుంటే అంత ఎక్కువ శాంతి, సంతోషాలను సాధించగలుగుతాం. ఈ ప్రాథమిక మానవ విలువలు చాలా ముఖ్యమైనవి, అవి అవసరం కాబట్టి అవి మనకు అంత ముఖ్యమైన లక్షణాలు.
సీతాకోకచిలుక పిల్లలు లేదా తాబేలు పిల్లల విషయంలో, తల్లికి మరియు పిల్లల మధ్య పెద్దగా ఆధారపడటం అవసరం లేదని మనకు తెలుసు. ఉదాహరణకు, గుడ్లు పెట్టిన తరువాత, సీతాకోకచిలుకల విషయంలో, పిల్లలు వారి తల్లిదండ్రులను కలవలేకపోతాయి, మరియు తాబేలు విషయంలో కూడా గుడ్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. మీరు వారి తల్లిని పిల్లల దగ్గరకు తీసుకువచ్చినా, ఈ పిల్లలు వారి తల్లిదండ్రుల చూసి అసలు స్పందిస్తాయా లేదా అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అవి పుట్టినప్పటి నుండి వాటికవే బతుకుతాయి. ఇది వారి గత జీవన అలవాట్లు లేదా వారి శారీరక నిర్మాణం వల్ల కావచ్చు. తాబేలు పిల్లల విషయంలో కూడా అంతే. సముద్రపు అలల శబ్దం వినగానే అవి క్రమంగా సముద్రం వైపుకి కదులుతూ జీవితాన్ని కొనసాగించగలవు. తల్లులు ఆ పిల్లలను పిలిచి ఈత నేర్పించవు; ఇలాంటివి ఏమీ జరగవు. అందుకని, అవి స్వతంత్ర జీవితాన్ని గడుపుతాయి. అక్కడ తల్లికి మరియు పిల్లల మధ్య అంత ఆప్యాయతను మనం చూడలేము.
ఇప్పుడు మనుషుల విషయానికొస్తే, మన శారీరక నిర్మాణం కారణంగా, మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులతో, ముఖ్యంగా మన తల్లి పట్ల బలమైన ప్రేమను మరియు ఆప్యాయతను చూపిస్తాము. నేను ఈ అంశాలను గతంలో మరియు భవిష్యత్తు జీవితాన్ని లేదా మతపరమైన విషయంగా హైలెట్ చెయ్యడం లేదు, కానీ మీరు మనుషులు ఎలా జీవిస్తారు మరియు ఎలా అభివృద్ధి చెందుతారు అని జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం పూర్తిగా మానవ విలువలు, ప్రేమ మరియు కరుణపై ఆధారపడి ఉన్నామని తెలుస్తుంది. ఇక మనుషుల పిల్లల విషయానికొస్తే, పుట్టినప్పటి నుండి తల్లి పాలపై ఆధార పడతారు, తర్వాత వాళ్ళు తమను తాము చూసుకోగలిగే వరకు, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులపైనే పూర్తిగా ఆధార పడతారు. వారు పెద్దయ్యాక కూడా, ఇతర వ్యక్తుల మీద ఆధార పడతారు.
మీకు ఒక తోడు ఉన్నంత కాలం, మిమ్మల్ని చూసుకునే ఒక వ్యక్తి ఉన్నంత కాలం, మీరు చాలా ప్రశాంతంగా, రిలాక్స్ గా, ఇంట్లో చాలా ఎక్కువ సంతోషాన్ని అనుభూతి చెందుతారు. కాబట్టి, మీరు ఎవరికీ హాని చేయకుండా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ప్రయత్నించే జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. మీకు ఈ ప్రేమ, ఇతర జీవుల పట్ల ఆప్యాయత ఉంటే, ప్రతిస్పందనగా మీరు అందరి చేత ఇష్టపడి ప్రేమించబడతారు, అలాగే మీ చివరి క్షణాల్లో కూడా మీకు ఎటువంటి ఆందోళన, భయం, లేదా మానసిక ఇబ్బందులు ఉండవు.
అయితే, మనం పెద్దయ్యాక, ఒక రకమైన మానవ మేధస్సు బయటకు వచ్చి కొన్నిసార్లు ఇది మనకు తీరని లోటుని ఇస్తుంది. మానవ మేధస్సు ద్వారా కొత్త విషయాలను నేర్చుకుని కొత్త జ్ఞానాన్ని పొందుతాం. ఈ రకమైన పరిజ్ఞానంతో, మనం కొన్నిసార్లు ఇలా ఆలోచిస్తాము: "నేను ఇతరులను బెదిరించగలను, నేను ఇతరులను దోపిడీ చేయగలను ఎందుకంటే నాకు ఈ అద్భుతమైన తెలివితేటలు మరియు జ్ఞానం ఉంది" అని. మీరు ఇలాంటి ఒక తెలియని ఆశను పొందుతారు. ఈ విధంగా, వేరే రకమైన మానసిక దృక్పథాన్ని అభివృద్ధి చేసుకుంటారు, అలా ఇతరులను దోపిడీ చేయడానికి మరియు బెదిరించడానికి వెనుకాడరు, అలా చేస్తే మీకు ఏదో మంచి జరుగుతుందని అనుకుంటారు.
మీరు ఇతరుల సంతోషం గురించి పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటే, అప్పుడు ప్రతి ఒక్కరూ మీకు శత్రువులు అవుతారు. మీరు ఎవరిని చూసినా కానీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. అలాంటి ప్రతికూల జీవితాన్ని గడపడం వల్ల, మీరు పోయేటప్పుడు మిమ్మల్ని చూసి సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు గడిపిన జీవితాన్ని తెలుసుకుని మీరే పశ్చాత్తాపం పడతారు. మీ జీవన విధానం కారణంగా, మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని మీరు చాలా నిరాశ చెందుతారు. అందుకని, మీరు ఈ ప్రాథమిక మానవ విలువలను పట్టించుకోకపోతే, నిజమైన ఆనందం లేదా దీర్ఘకాలిక శాంతిని కోరుకోవడం సరైనది కాదని అర్ధం చేసుకోండి. అందువలన, మీరు పోయేటప్పుడు, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు, మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరూ ఉండరు, మీరు ఈ లోకాన్ని ఖాళీ చేతులతో, గొప్ప నిరాశతో విడిచి వెళ్ళిపోతారు. అటువంటి బతుకు, అంటే ఇతరుల గురించి పట్టించుకోని బతుకు నిజంగా ఒక మూర్ఖమైన బతుకు.
మరోవైపు, మీరు ఈ ప్రాథమిక మానవ విలువలను పెంపొందించుకోగలిగితే, మన గొప్ప మానవ మేధస్సు మరియు జ్ఞానంతో, మీరు బాగా అభివృద్ధి కాగలరు. మీ జీవితాన్ని ఈ విధంగా నడిపించడమే వివేకవంతుల మార్గం; ఇది మీ జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి మార్గం.