బుద్ధుడు మరియు అతని కాలంలోని రాజకీయ సంఘటనలు

శాస్త్రీయ బౌద్ధమత గ్రంథం నుంచి చారిత్రక బుద్ధుని జీవితం అనేక దశల వారీగా బయటపడింది. మొదటి రకం ఏ ఒక్క గ్రంథంలోనూ కనిపించదు, కానీ పాళీ సూత్రం (సం. సూత్ర), థెరవాడ సంప్రదాయానికి చెందిన వినయ గ్రంథంలో రికార్డ్ చెయ్యబడిన సంఘటనల నుంచి మాత్రమే సేకరించబడ్డాయి. తర్వాతి మహాసాంఘిక, సర్వస్వస్తివాద, మహాయాన సంప్రదాయాల గ్రంథాలు ఈ మునుపటి గ్రంథాల నుంచి బయటపడిన రూపురేఖలను అనేక సార్లు మానవాతీత లక్షణాలతో వివరిస్తాయి. అయితే, పాళీ గ్రంథం నుంచి బయటపడిన మూల వివరణ ఏమిటంటే, ఒక సమస్యాత్మక, అభద్రతా సమయాల్లో నివసిస్తున్న ఒక వ్యక్తి వ్యక్తిగతంగా మరియు తన సన్యాస సమాజానికి అనేక ఇబ్బందులు మరియు సవాళ్లను ఎదుర్కున్నట్లు చెప్తుంది. ఇక్కడ, స్టీఫెన్ బ్యాచెలర్ తన ‘కన్ఫెషన్ ఆఫ్ ఎ బుద్ధిస్ట్ ఎథీస్ట్’ లో సమర్పించిన పండిత పరిశోధన ఆధారంగా బుద్ధుని జీవితం యొక్క ఈ ప్రారంభ రకాన్ని మనం తెలుసుకుంటాము. అన్ని పేర్లను వారి పాలి వెర్షన్లలోనే ఇవ్వాలి.

బుద్ధుడు క్రీస్తుపూర్వం 566లో ప్రస్తుత దక్షిణ నేపాల్ లో ఉన్న లుంబినీ పార్కు అనే ఊరులో జన్మించాడు. ఈ పార్కు సకియా (సం. శాక్య) రాజధాని అయిన కపిలవత్తుకి (సం. కపిలవస్తు) చాలా దగ్గరలో ఉంటుంది. అతని అసలు పేరు సిద్ధాత్త (సం. సిద్ధార్థ) పాళీ గ్రంథంలో కనిపించకపోయినా; మన సౌలభ్యం కోసం, దాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాము. బుద్ధుడిని సూచించడానికి బాగా ఉపయోగించే ఇంకొక పేరు గోతమ (సం. గౌతముడు), నిజానికి ఇది అతని వంశం పేరు. 

తర్వాత బౌద్ధమత గ్రంథంలో వర్ణించినట్లుగా సిద్ధాత్తుని తండ్రి, శుద్ధోదన (సం. శుద్ధోదనుడు), ఇతను అసలు రాజు కాదు. కానీ ఇతను తన గౌతమ వంశానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి, అతను బహుశా సకియాలో ఒక ప్రాంతీయ గవర్నరుగా పని చేసి ఉండొచ్చు. పాలి గ్రంథం తన తల్లి పేరును రికార్డ్ చెయ్యలేదు; కానీ తర్వాతి సంస్కృత ఆధారాలు ఆమెను మాయాదేవిగా గుర్తించాయి. సిద్ధాత్త యొక్క తల్లి పుట్టిన కొద్దిసేపటికే మరణించడంతో అప్పటి ఆచారం ప్రకారం అతని తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్న ఆమె సోదరి పజాపతి (సం. మహాప్రజాపతి) దగ్గర పెరిగాడు.

సకియా ఒక పురాతన రిపబ్లిక్, కానీ సిద్ధాత్తుని జననం నాటికి, ఇది కోసల (సం. కోశల) అనే శక్తివంతమైన రాజ్యంలో భాగంగా ఉంది. కోసల ప్రస్తుత బీహార్ లోని గంగానది ఉత్తర ఒడ్డు నుంచి హిమాలయాల చివరి వరకు విస్తరించింది. దీని రాజధాని సవత్తి (సం. శ్రవస్తి). 

బుద్ధుని జీవితంలోని ప్రధాన ప్రదేశాల భౌగోళిక వివరణను క్లుప్తంగా చెప్పడం వల్ల ఆయన జీవిత చరిత్రను అనుసరించడం సులభం, కాబట్టి దాన్ని ఇక్కడ ఔట్‌లైన్ చేసుకుందాం. సకియా కోసల రాజ్యపు తూర్పు భాగంలో ఉంది, సకియాకు ఆగ్నేయంగా మల్లా (సం. మల్లా) ప్రావిన్స్ ఉంది. మల్లాకు తూర్పున వజ్జి (సం. విర్జీ) రిపబ్లిక్ ఉంది, దీని రాజధాని వేశాలి (సం. వైశాలి). వజ్జి రిపబ్లిక్ ను కొన్ని వంశాల సమూహం పాలించింది. వీరిలో లిచ్చావి (సం. లిచ్చావి) వంశం బాగా ప్రసిద్ధి చెందింది. వజ్జి, కోసలకు దక్షిణ దిక్కున గంగానదికి అవతల మగధ (సం. మగధ) అనే ఒక శక్తివంతమైన రాజ్యం ఉంది, దీని రాజధాని రాజగహ (సం. రాజగృహ). కోసలకు పశ్చిమ దిక్కున, ప్రస్తుత పాకిస్థానీ పంజాబులో, పర్షియన్ అచమెనిడ్ సామ్రాజ్యానికి చెందిన గాంధార (సం. ఘాంధార) ఉంది. దాని రాజధాని టక్కశిల (సం. తక్షశిల), ఇది అప్పట్లో బాగా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ. అక్కడ గ్రీకు, పర్షియన్ ఐడియాలు, సంస్కృతులు తమ సమకాలీన భారతీయ సహచరులతో కలిసిపోయాయి.

సిద్ధాత్తుడు పెరిగిన కపిలవత్తు, ఆనాటి ప్రధాన వాణిజ్య కేంద్రమైన నార్త్ రోడ్ లోని ఒక ముఖ్యమైన నగరం. ఉత్తర రహదారి కోసలను పశ్చిమాన గాంధారతో అనుసంధానించింది మరియు సకియా, మల్లా మరియు వజ్జి రిపబ్లిక్ గుండా దక్షిణ దిక్కున మగధ వరకు వెళ్తుంది. అందువల్ల పాతికేళ్ళ పూర్వం సిద్ధాత్త గోతముని గురించి పాళీ గ్రంథం చాలా తక్కువే చెప్పినప్పటికీ, అతను అనేక సంస్కృతులలో పెరిగాడు. అతను తక్కశిలలో కూడా చదువుకుని ఉండవచ్చు, కానీ అది నిర్ధారించబడలేదు.

సిద్ధాత్త భద్దకచ్చనను పెళ్లి చేసుకున్నాడు, ఈమెను సంస్కృత సాహిత్యంలో యశోధరగా పిలుస్తారు. ఆమె సిద్ధాత్తుని కజిన్ (పినతండ్రి కూతురు) మరియు దేవదత్తుని సోదరి (సం. దేవదత్త). దేవదత్తుడు తర్వాత బుద్ధుని ప్రధాన ప్రత్యర్థి అయ్యాడు. వీళ్ళకు ఒక కుమారుడు రాహుల (సం. రాహులా) ఉన్నాడు. ఆ కుమారుడు జన్మించిన కొద్ది రోజులకే బుద్ధుడు ఇరవై తొమ్మిదేళ్ల వయసులో కపిలవత్తుని వదిలి ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో మగధకు వెళ్లాడు. ఉత్తర రహదారిలో ప్రయాణించి గంగానదిని దాటుతూ రాజగహ చేరుకున్నాడు. ఆ సమయంలో, మగధను బింబిసారుడు, కోసలను పసేనడి (సం. ప్రసేనాజిత్) రాజు పాలిస్తున్నారు. కోసల మరియు మగధ రాజ్యాల మధ్య పొత్తులో భాగంగా, ఆ ఇద్దరు రాజులు ఒకరి సోదరులను ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు. పసేనడి రాజు సోదరికి దేవి (సం. దేవి) అని పేరు పెట్టారు.

మగధలో  సిద్ధాత్తుడు అలరా కలమ (సం. ఆరద కలమ), ఉద్దక రామపుత్త (సం. ఉద్రక రామపుత్ర) అనే ఇద్దరు గురువుల సంఘాల్లో చదువుకున్నాడు. బ్రాహ్మణ సంప్రదాయం నుంచి వచ్చిన వీళ్ళు శూన్యం మీద ఏకాగ్రత సాధించాలని, దేనినీ విడదీయకుండా ఉండాలని బోధించారు. అయితే, ఈ సాధనలతో సిద్ధాత్తుడు అసంతృప్తి చెందాడు, అందువల్ల అతను ఈ గురువులను విడిచిపెట్టాడు. ఆ తర్వాత దాదాపు ఏమీ తినకుండా అతను విపరీతమైన తపస్సు చేశాడు. మళ్ళీ, అటువంటి అభ్యాసం మోక్షానికి దారితీయదని అతను అనుకున్నాడు. ఆ తర్వాత అతను తన ఉపవాస దీక్షను విరమించుకుని సమీపంలోని ఉరువెల (సం. ఉరుబిల్వ), ప్రస్తుత బోధ్ గయాకు వెళ్లి, అక్కడ ముప్పై అయిదేళ్ళ వయస్సులో బోధి చెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందాడు. అతను మగధకు వచ్చిన ఆరేళ్ల తర్వాత ఇది జరిగింది.

జ్ఞానోదయం పొందిన తర్వాత, అతను వారణాసికి బయట ఉన్న ప్రస్తుత సారనాథ్ లోని ఇసపతానా (సం. శిపతానా) వద్ద ఉన్న జింకల పార్కు అయిన మిగదయ (సం. మృగదవ) కు పశ్చిమ వైపుగా వెళ్ళాడు. గంగా నదికి ఇది ఉత్తర దిక్కున ఉన్నప్పటికీ, పసేనడి మహారాజు తన సోదరి దేవిని బింబిసార మహారాజుకు ఇచ్చి వివాహం చేసినప్పుడు కట్నంలో భాగంగా ఈ ప్రాంతాన్ని మగధకు అప్పగించాడు. బుద్ధుడు తన ఐదుగురు సహచరులతో కలిసి ఆ జింకల పార్కులో వర్షాకాలపు సమయాన్ని గడిపాడు మరియు ఆ తర్వాత కొద్ది మంది అనుచరులను ఆకర్షించాడు, వాళ్ళు అతను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక బ్రహ్మచారి సమాజాన్ని ఏర్పరచుకున్నారు.

వేశాలికి చెందిన లిచ్చావి గొప్ప వ్యక్తి మహలి, తను బుద్ధుని గురించి విని, అతన్ని మగధకు ఆహ్వానించమని బింబిసార మహారాజుకు చెప్పాడు. అలా, ఆ వర్షాకాలం తర్వాత, బుద్ధుడు మరియు అతని పెరుగుతున్న సమాజం మగధ రాజధాని రాజగహకు తూర్పు దిశకు తిరిగి వచ్చారు. బింబిసార మహారాజు బుద్ధుని బోధనలకు ముగ్ధుడై ఆ వర్షాకాలంలో తన సమాజానికి సహాయంగా ఆధారం చేసుకోవడానికి "వెలువన" (సం. వేణువనం) అనే నిరుపయోగంగా పడి ఉన్న ఒక పార్కుని అతనికి ఇచ్చాడు.

ఆ తర్వాత, ఒక ప్రముఖ స్థానిక గురువు యొక్క ప్రధాన శిష్యులైన సరిపుత్త (సం. షరీపుత్ర), మరియు మొగ్గల్లన (సం. మౌద్గల్యాన) బుద్ధుని సంఘంలో చేరారు. అలా వీళ్ళు బుద్ధునికి అత్యంత సన్నిహిత శిష్యులయ్యారు. పెరుగుతున్న సన్యాస సమాజం కోసం ప్రతిజ్ఞలను రూపొందించమని సరిపుత్త బుద్ధుడిని కోరాడు మరియు బింబిసార రాజు జైనులు లాంటి ఇతర ఆధ్యాత్మిక సమూహాల ఆచారాలలో కొన్నింటిని ఈ సమాజం అనుసరించాలని చెప్పాడు. ముఖ్యంగా, బోధనల గురించి చర్చించడానికి వాళ్ళు త్రైమాసిక సమావేశాలు (సం. ఉపోషధ) నిర్వహించాలని రాజు రికమండ్ చేశారు. దానికి బుద్ధుడు అంగీకరించాడు.

ఒక రోజు, కోసల రాజధాని సవత్తి నుంచి సంపన్నుడైన బ్యాంకర్ అనంతపిండిక (సం. అనంతపిండాడ) వ్యాపార నిమిత్తం రాజగహకు వచ్చాడు. బుద్ధుని చేత ముగ్ధుడైన అతను పసేనడి రాజు యొక్క రాజధాని అయిన సవత్తిలో ఆ వర్షాకాలంలో ఉండడానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత, బుద్ధుడు మరియు అతని సన్యాసుల సంఘం కోసలకి వెళ్లారు; కానీ అనంతపిండిక వారికి అక్కడ ఉండడానికి అనువైన స్థలాన్ని ఇవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది.

ఈ మధ్యలో, బుద్ధుడు కపిలవత్తులోని తన కుటుంబాన్ని కలవడానికి తిరిగి వెళ్ళాడు. అతని తండ్రి శుద్దోధనుడు తక్కువ సమయంలోనే ఒక రక్షకుడిగా మారాడు మరియు అతని ఎనిమిదేళ్ళ కుమారుడు రాహులా ఒక కొత్తవాడిగా సన్యాసంలో చేరాడు. ఆ తర్వాతి సంవత్సరాలలో, బుద్ధుని కజిన్ లు ఆనంద (సం. ఆనంద), అనురుద్ధ (సం. అనురుద్ధుడు), దేవదత్తుడు, అలాగే బుద్ధుని హాఫ్-బ్రదర్ నంద (సం. నంద), ఇతనిని "సుందరానంద" (సం. సుందరానంద) అని కూడా పిలుస్తారు, ఇలా వీళ్ళతో పాటు అనేక మంది సాకియన్ ప్రభువులు కూడా బుద్ధునితో చేరారు.

బుద్ధుని సవతి తల్లి మరియు అత్త అయిన పజాపతి, ఈ ఎదుగుతున్న సమాజంలో తను కూడా చేరతానని కోరింది, కాని బుద్ధుడు దానికి అంగీకరించలేదు. ఈ విషయంతో నిరుత్సాహ పడకుండా ఆమె గుండు చేయించుకుని, పసుపు రంగు దుస్తులు ధరించి, ఇతర స్త్రీలతో కలిసి ఒక పెద్ద గ్రూప్ ని తయారుచేసి బుద్ధుడిని అనుసరించింది. పజాపతి బుద్ధుని అనుమతిని కోరడం కొనసాగించింది, కాని బుద్ధుడు రెండవ మరియు మూడవ సారి కూడా నిరాకరించాడు. చివరకు, బుద్ధుడు మరణించడానికి కొన్ని సంవత్సరాల ముందు, ఆనందుడు మధ్యవర్తిత్వం వహించి ఆమె తరపున ఇంకొక సారి అభ్యర్థించాడు, చివరికి బుద్ధుడు మహిళలను వాళ్లలో ఒకరిగా స్వీకరించడానికి అంగీకరించాడు. ఇది వజ్జి రిపబ్లిక్ లోని వేశాలిలో జరిగింది, మరియు బౌద్ధమతంలో సన్యాసిని క్రమానికి నాంది పలికింది.

అనంతపిండిక తన గొప్ప ఔదార్యానికి ప్రసిద్ధి చెందాడు మరియు బుద్ధుడు కోసలకి తిరిగి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత, అతను సవతిలో "జెతవన" (సం. జెతవన), "జెటాస్ గ్రోవ్" అని పిలువబడే ఒక పార్కును కొనడానికి భారీ మొత్తంలో బంగారం చెల్లించాడు. అక్కడ, అతను బుద్ధుడు మరియు అతని సన్యాసుల కోసం వర్షాకాలంలో అత్యంత విలాసవంతమైన చోటులో ఉండటానికి ఒక నివాసాన్ని నిర్మించాడు. చివరికి, జ్ఞానోదయం పొందిన సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత, బుద్ధుడు తన సన్యాస సమాజం కోసం అధికారిక వర్షాకాల రిట్రీట్ (సం. వర్షక) ఆచారాన్ని ఏర్పాటు చేశాడు, ఈ సమయంలో ఆ సన్యాసులు అందరూ ప్రతి సంవత్సరం వర్షాకాలపు మూడు నెలలు ఒకే చోట ఉండి మిగిలిన సంవత్సరంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తిరుగుతూ ఉండేవారు. మొత్తం కలిపి, బుద్ధుడు పందొమ్మిది వర్షాకాలపు రిట్రీట్ లను జెటాస్ గ్రోవ్ లోనే గడిపాడు, ఆ సమయంలో అతను 844 ప్రసంగాలను ఇచ్చాడు. అనంతపిండిక బుద్ధుని సన్యాస సమాజానికి ప్రధాన రక్షకుడిగా కొనసాగినప్పటికీ అతని జీవితం చివరిలో అతను ఎటో కనపడకుండా వెళ్ళిపోయాడు.

బుద్ధునికి నలభై ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు కోసల రాజు పసేనడి గౌతమ బుద్ధుడిని మొదటిసారిగా జెటా గ్రోవ్ దగ్గర కలుసుకున్నాడు. బుద్ధుడు ఆ రాజును ఎంతగానో మెప్పించాడు, ఆ తర్వాత పసేనడి కూడా అతని పోషకులలో మరియు అనుచరులలో ఒకరిగా మారాడు. అయితే, పసేనడి రాజుతో బుద్ధుని సంబంధం ఎప్పుడూ చాలా సున్నితంగా ఉండేది. రాజు కొత్త విషయాలను నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపించినప్పటికీ; ఏదేమైనా, అతను ఒక ఇంద్రియవాది మరియు ఎప్పుడూ చాలా క్రూరంగా ఉండేవాడు. ఉదాహరణకు, మానసిక అపవ్యవస్థ కారణంగా, రాజు మల్ల నుంచి తన స్నేహితుడు మరియు అతని సైన్యాధిపతి అయిన బంధులను చంపేశాడు; తర్వాత పశ్చాత్తాప్పడి, అతను తన సైన్యానికి నాయకత్వం వహించడానికి బంధులా మేనల్లుడు కరాయనుడిని నియమించాడు. చాలా సంవత్సరాల తర్వాత, జనరల్ కరయన తన మామ మరణానికి ప్రతీకారంగా పసేనడిని తన పదవిలో నుంచి తీసేశాడు. ఏదేమైనా, బుద్ధుడు రాజు యొక్క అస్తవ్యస్తమైన మార్గాలను మరియు మారుతున్న అదృష్టాన్ని సహించాడు, ఎందుకంటే అతనికి అక్కడి దొంగలు మరియు అడవి జంతువుల నుంచి తన సమూహానికి రక్షణ అవసరం, అలాగే వారికి సహాయం చేసే సంపన్న పోషకులకు యాక్సెస్ కూడా అవసరం.

తన పాలక రాజవంశం యొక్క వారసత్వాన్ని పొందడానికి, పసేనడి రాజుకు ఒక కొడుకు అవసరం. మగధ రాజు బింబిసారుని సోదరి అయిన అతని మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదు. అప్పుడు రాజు బుద్ధుని యొక్క అందమైన నిమ్న కుల అనుచరురాలు అయిన మల్లిక (సం. మల్లిక) ను రెండవ భార్యగా చేసుకున్నాడు. రాజసభలో ఉన్న బ్రాహ్మణ పూజారులు ఆమె నీచమైన జననాన్ని చూసి అపఖ్యాతి పాలయ్యారు. మల్లిక పసేనడి రాజుకు వాజిరి (సం. వజ్రి) అనే ఒక కుమార్తెను కని పెట్టింది.

అప్పుడు ఆ రాజు తనకు ఒక కొడుకు పుట్టాలంటే మూడవ భార్యను చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు, అతను బుద్ధుని తండ్రి మరణం తర్వాత సకియాకు గవర్నర్ అయిన బుద్ధుని కజిన్ మహానామ (సం. మహానామ) కుమార్తె వసభను పెళ్లి చేసుకున్నాడు. మహానామ బుద్ధుని సన్నిహిత శిష్యులైన ఆనంద, అనురుద్ధులకు సోదరి. మహానామ వసభను ఒక గొప్ప మహిళగా పెళ్లిచేసుకున్నప్పటికీ, నిజానికి తన ఒక బానిస స్త్రీ నుంచి వచ్చిన అక్రమ కుమార్తె. వసభ పసేనడి మహారాజుకు విదదభ అనే ఒక కుమారుడు కని పెట్టినప్పటికీ, అతని తల్లి వారసత్వానికి సంబంధించి దాగి ఉన్న మోసం కారణంగా కోసల సింహాసనానికి వారసుడిగా అతని స్థానం అగమ్యగోచరంగా మారింది. ఈ మోసం బుద్ధుడిని కూడా కష్టమైన పరిస్థితిలో ఉంచింది, ఎందుకంటే అతను వసభతో సంబంధంలో ఉన్నాడు కాబట్టి.

తన అపరిపక్వత గురించి తెలియని విదదభుడు పదహారేళ్ళ వయస్సులో మొదటిసారి సఖియను, అతని తాత మహానామాను కలిశాడు. అక్కడ ఉండగానే పసేనడి సైన్యానికి సేనాధిపతి అయిన కరాయనుడికి విదాదభుని తల్లి అసలు విషయాన్ని తెలుసుకుంది. అక్కడి సైన్యాధిపతి తన కుమారుడు ఒక బానిస స్త్రీ యొక్క అక్రమ మనవడు అని పసేనడికి చెప్పడంతో, రాజు సకియన్లపై కోపంతో విరుచుకుపడ్డాడు. తన భార్యాబిడ్డల రాజ్యాధికారాలను తొలగించి వాళ్ళను బానిసలుగా మార్చాడు. బుద్ధుడు వారి తరఫున మధ్యవర్తిత్వం వహించాడు అప్పుడు రాజు వాళ్ళను మళ్ళీ తిరిగి నియమించుకున్నాడు.

దీని తర్వాత, కోసలలో బుద్ధుని స్థానం భద్రతలో లేకపోవడంతో, డెబ్బై సంవత్సరాల వయస్సులో, అతను మొదటిసారి మగధకు మరియు దాని రాజధాని రాజగహకు తిరిగి వెళ్ళాడు. అక్కడ, అతను రాజు యొక్క వెదురు తోటలో కాకుండా, రాజ వైద్యుడు జివాక (సం. జివాక) కు చెందిన మామిడి తోటలో ఉన్నాడు. ఈ సమయంలోనే బుద్ధుడు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పబడుతుంది.

బుద్ధునికి డెబ్బైరెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని మొదటి రక్షకుడైన మగధ రాజు బింబిసారుడు తన కుమారుడైన అజాతసత్తు (సం. అజాతశత్రు) కోసం రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. అజాతసత్తు తన తండ్రిని బంధించి ఆకలితో ఉంచి  చంపాడు. బింబిసారుడి భార్య, పసేనడి మహారాజు సోదరి దేవి శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణానికి ప్రతీకారంగా, దేవి కట్నంలో భాగంగా బింబిసారుడికి సమర్పించిన గంగానదికి ఉత్తరాన ఉన్న వారణాసి చుట్టుపక్కల గ్రామాలను తిరిగి పొందడానికి పసేనడి తన మేనల్లుడు అజాతసత్తుపై యుద్ధాన్ని ప్రారంభించాడు. యుద్ధం అసంపూర్తిగా ఉండింది మరియు శాంతిని కాపాడటానికి, పసేనడి తన కుమార్తె వజిరిని అజాతసత్తుకు ఇచ్చి వివాహం చెయ్యాల్సి వచ్చింది.

అదే సమయంలో, అజాతసత్తు గురువుగా మారిన బుద్ధుని బంధువు దేవదత్తుడు బుద్ధుని సన్యాస క్రమాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. సన్యాసులు అడవుల్లో నివసించడం, చెట్ల కింద మాత్రమే నిద్రపోవడం, సామాన్యుల ఇళ్లలోకి ప్రవేశించకపోవడం, కేవలం దుప్పట్లు మాత్రమే ధరించడం, వారి నుంచి వస్త్రాలను బహుమతులుగా స్వీకరించకపోవడం, కఠినమైన శాకాహారులుగా ఉండటం లాంటి అనేక అదనపు క్రమశిక్షణా నియమాలను విధించమని దేవదత్తుడు బుద్ధుడిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. అది తన ఆజ్ఞను ఎక్కువ సన్యాసిగా మారుస్తుందని, సమాజం నుంచి వారిని దూరం చేస్తుందని భావించిన బుద్ధుడు దాన్ని నిరాకరించాడు. దేవదత్తుడు బుద్ధుని అధికారాన్ని సవాలు చేసి బుద్ధుని యువ సన్యాసులలో చాలా మందిని తన ఆలోచనల వైపు ఆకర్షించి, తన స్వంత ప్రత్యర్థి సన్యాస సమాజాన్ని ఏర్పాటు చేసి ఒక తేడాను సృష్టించాడు. నిజానికి దేవదత్తుడు బుద్ధుడిని హత్య చెయ్యడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు సరిపుత్త, మొగ్గల్లన బుద్ధుని సమాజాన్ని విడిచిపెట్టిన సన్యాసులను తిరిగి వచ్చేలా చేశారు.

దేవదత్తుడు తను చేసిన పనులకు పశ్చాత్తాపపడ్డాడని, కానీ బుద్ధుడిని క్షమాపణ అడగక ముందే మరణించాడని తెలుస్తోంది. ఏదేమైనా, బుద్ధుడు తనపై ఎప్పుడూ పగ లేదా చెడు ఉద్దేశాన్ని పెట్టుకోలేదు. అజాతసత్తు మహారాజు కూడా తన తండ్రిని చంపినందుకు పశ్చాత్తాపపడ్డాడు మరియు రాజ వైద్యుడు జీవకుడి సలహా మేరకు, బుద్ధుని వద్ద తను చేసిన హత్యను బహిరంగంగా అంగీకరించి మరియు పశ్చాత్తాపం చెందడానికి ప్రయత్నించాడు.

సుమారు ఒక సంవత్సరం తర్వాత, బుద్ధుడు మరోసారి తన స్వస్థలమైన సకియాకు ప్రయాణించాడు. పసేనడి రాజు బుద్ధుని దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించిన సమయంలో సేనాధిపతి కరయన తిరుగుబాటు చేసి యువరాజు విదదభని కోసల సింహాసనంపై కూర్చోబెట్టాడు. పదవిని కోల్పోయిన పసేనడి రాజు, ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో, రాజగహలోని తన మేనల్లుడు మరియు అల్లుడు రాజు అజాతసత్తు నుంచి రక్షణ కోసం మగధకు పారిపోయాడు. అయితే, పసేనడిని నగరంలోకి అనుమతించలేదు మరియు అతను ఆ తర్వాతి రోజు ఒక శవమై కనిపించాడు.

ఇంతలో, కొత్త కోసల రాజు విదదభ తన రక్తసంబంధం గురించి తన తాత మహానామా చేసిన మోసానికి ప్రతీకారంగా సకియపై యుద్ధం ప్రకటించాడు. మహానామ, బుద్ధుని కజిన్ మరియు ప్రస్తుత సకియ గవర్నరు అని మీకు గుర్తుండే ఉంటుంది. బుద్ధుడు ఆ రాజును దాడి చెయ్యవద్దని ఒప్పించడానికి మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ, అతను విఫలమయ్యాడు. కోసల దళాలకు సకియా రాజధాని కపిలవత్తు నివాసితులందరినీ చంపమని ఆదేశాలు వచ్చాయి. ఈ మారణకాండను నిరోధించలేక, బుద్ధుడు మగధలోని రాజగహకు పారిపోయాడు, అక్కడ అజాతసత్తు రాజు యొక్క రక్షణను కోరాడు, ఎందుకంటే పసేనడి ఈ విషయంలో విఫలమయ్యాడు కాబట్టి.

మగధకు వెళ్ళే మార్గం వజ్జి రిపబ్లిక్ గుండా వెళ్తుంది, అక్కడ బుద్ధుని సన్నిహిత శిష్యుడు సరిపుత్తుడు రాజధాని వెసలిలో అతని కోసం వేచి చూస్తున్నాడు. అయితే అక్కడ బుద్ధుని మాజీ సహాయకులలో ఒకరైన వెశాలికి చెందిన సునకట్ట (సం. సునక్షత్ర) అనే కులీనుడు గతంలో బౌద్ధమత సమాజాన్ని వీడి, బుద్ధుడిని వజ్జి పార్లమెంటుకు అపఖ్యాతి పాలు చేశాడు. బుద్ధుడికి మానవాతీత శక్తులు ఏవీ లేవని, కేవలం లాజిక్ ప్రకారం కోరికను ఎలా ఆపాలో బోధించాడే తప్ప అతీంద్రియ స్థితులను ఎలా సాధించాలో బోధించలేదని వారికి చెప్పాడు. బుద్ధుడు దీన్ని ఒక కాంప్లిమెంట్‌ గా తీసుకున్నాడు. ఏదేమైనా, దీనివల్ల ఈ సమయంలో అతను ఒక సన్యాసినుల ఆదేశాన్ని స్థాపించడం వల్ల బుద్ధుడు వజ్జిలో తన మద్దతును మరియు మంచి స్థానాన్ని కోల్పోయాడు. దీని పర్యవసానంగా, బుద్ధుడు గంగానదిని దాటి రాజగహకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ అతను రాబందుల శిఖరం సమీపంలోని గిజ్జకూట (సం. గ్రద్రకూట) లోని గుహలలో బస చేశాడు.

అజాతసత్తు రాజు యొక్క ప్రధాన మంత్రి అయిన వస్సాకరుడు బుద్ధుడిని కలవడానికి వచ్చాడు. తన రాజ్యాన్ని విస్తరించడానికి అజాతసత్తు యొక్క ప్లాన్ గురించి మరియు వజ్జి రిపబ్లిక్ ను ఆ తర్వాత వెంటనే ఆక్రమించాలనే తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు. బుద్ధుడు వజ్జియన్లను బలప్రయోగంతో జయించలేమని, వారి సాంప్రదాయ గౌరవప్రదమైన పద్ధతులను కొనసాగించాలని సలహా ఇచ్చినప్పటికీ, సకియపై కోసల దండయాత్ర లాగానే రాబోయే యుద్ధాన్ని అతను ఆపలేకపోయాడు. దీనికి తోడుగా, బుద్ధునికి అత్యంత సన్నిహితులైన సరిపుట్ట, మొగ్గల్లన ఇద్దరూ ఇదే సమయంలో మరణించారు. వృద్ధుడైన సరిపుట్ట అనారోగ్యంతో మరణించగా, మొగ్గల్లనను బందిపోట్లు కొట్టి చంపారు.

మగధలో ఎటువంటి సానుభూతి లేదా సహాయాన్ని పొందని బుద్ధుడు, కోసల దాడి తర్వాత ఒక ఆశతో ఇంకొక సారి ఉత్తర దిశకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి బయలుదేరే ముందు, బుద్ధుడు ఆనందుని రాబందుల శిఖరం వద్ద సన్యాసులందరినీ సమావేశపరచమని కోరాడు, అక్కడ అతను వారికి తన చివరి సలహాను ఇచ్చాడు. వజ్జియన్ పార్లమెంటులోని ప్రజాస్వామిక వ్యవస్థ తర్వాత సన్యాస సమాజాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, సామరస్యంగా జీవించాలని, భిక్షను పంచుకోవాలని, పెద్దలను గౌరవించాలని చెప్పబడింది.

బుద్ధుడు ఆ తర్వాత రాబందుల శిఖరం మరియు మగధను విడిచిపెట్టి, వజ్జి రిపబ్లిక్ లోని వేశాలి చేరుకుని అక్కడ ఆ వర్షాకాలపు సమయాన్ని గడపడానికి ఉండిపోయాడు. యుద్ధపు ముప్పు పొంచి ఉన్నప్పటికీ అక్కడి సమాజం అధోగతి పాలవుతూ అతనికి కనిపించింది. వజ్జి పార్లమెంటు పట్ల అభిమానాన్ని కోల్పోయిన బుద్ధుడు, వర్షాకాలాన్ని ఒంటరిగా గడిపి తన సన్యాసులను వారి స్నేహితుల దగ్గర ఆశ్రయం పొందమని చెప్పాడు.

ఆ వర్షాకాలం సమయంలో ఎనభై ఏళ్ల బుద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణానికి దగ్గరయ్యాడు. ఆనందుడు సన్యాసులకు చివరి సలహాను ఇవ్వమని కోరాడు. బుద్ధుడు తనకు తెలిసినవన్నీ వారికి బోధించానని, భవిష్యత్తులో ఆ బోధనలే వారికి ప్రధాన ఆశ్రయమని, వాటి నుంచే అందరికి దిశానిర్దేశం చెయ్యాలని చెప్పాడు. బాధల నుంచి విముక్తి పొందాలంటే, వారు బోధనలను అలవరచుకోవాలని మరియు వారిని రక్షించడానికి ఏదో ఒక నాయకుడిపై లేదా ఒక సమాజంపై ఆధారపడకూడదని చెప్పాడు. ఆ తర్వాత బుద్ధుడు తొందరలోనే చనిపోతానని కూడా వాళ్ళకు చెప్పాడు.

బుద్ధుడు తన శిష్యులైన ఆనంద, అనురుద్ధులతో కలిసి ఆ వర్షాకాలం తర్వాత ఇంకొక సారి ప్రయాణాన్ని కొనసాగించాడు. సకియకు వెళ్ళే దారిలో, వాళ్ళు మల్లాలోని రెండు ప్రధాన నగరాలలో ఒకటైన పావాలో ఆగారు. అక్కడ ఆ సమూహం చుండా (సం. సుండా) అనే కమ్మరి చేత విషం కలిపిన పంది మాంసాన్ని స్వీకరించారు. ఏదో చెడు జరిగిందని అనుమానించిన బుద్ధుడు ఆ పంది మాంసం తినవద్దని, తానే స్వయంగా తిని మిగిలిన వాటిని పూడ్చిపెట్టమని తన కజిన్ లకు చెప్పాడు. సకియలో ఊచకోతలకు నాయకత్వం వహించిన సేనాధిపతి కరయన స్వస్థలం మల్లా, బుద్ధుని బోధనలన్నింటినీ గుర్తు తెచ్చినందుకు ఆనంద కోసం ఈ విషం ఉద్దేశించబడి ఉండవచ్చు. ఆనందని చంపితే బుద్ధుని బోధనలు, సమాజం ఎప్పటికీ నిలవవు అని.

తీవ్రమైన రక్త విరేచనాలతో బాధపడుతున్న బుద్ధుడు, ఆనందతో అతనిని దగ్గరలోని కుసినరకు (సం. కుషినగర) తీసుకువెళ్ళమని చెప్పాడు. అక్కడ రెండు చెట్ల మధ్య ఏర్పాటు చేసిన ఒక మంచంపై బుద్ధుడు పడుకుని, తనతో ఉన్న కొద్దిమంది సన్యాసులను మీకు ఇంకేమైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉన్నాయా అని అడిగాడు. దుఃఖంలో మునిగిపోయిన ఆనంద మరియు ఇతరులు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బుద్ధుడు క్రీస్తుపూర్వం 485 లో ఎనభై ఏళ్ళ వయసులో మరణించాడు.

బుద్ధుని అవశేషాలను దహనం చెయ్యడానికి ముందు, పావ నుంచి ఒక సన్యాసుల బృందం అక్కడికి వచ్చింది. వారికి మహాకాశప (సం. మహాకశ్యప) నాయకత్వం వహించాడు, వాళ్ళు తమ అంతిమ నివాళులు అర్పించే వరకు దహన సంస్కారాలు వేచి ఉంచాలని పట్టుబట్టారు. మగధకు చెందిన మహాకాశప అనే బ్రాహ్మణుడు కొన్నేళ్ల క్రితం వృద్ధాప్యంలో సన్యాసిగా మారాడు. బుద్ధుడు మొదటిసారి అతనిని కలిసినప్పుడు, బ్రాహ్మణుని కొత్త వస్త్రానికి బదులుగా తన పాత అరిగిపోయిన వస్త్రాన్ని మహాకాశకుడికి ఇచ్చాడు. తర్వాత, బుద్ధుని వస్త్రం యొక్క ఈ ప్రదర్శన అధికార ప్రసారం మరియు బౌద్ధమత అనుచరుల శ్రేణి ప్రారంభానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

అయితే, బుద్ధుడు తాను మరణించిన తర్వాత, ధర్మమే వారికి గురువుగా పనిచేస్తుందని అనేక సందర్భాల్లో తన శిష్యులకు స్పష్టంగా చెప్పాడు. వజ్జి పార్లమెంటరీ వ్యవస్థ తరహాలో తమ సామాజికవర్గం కొనసాగాలని కోరాడు. కోసల, మగధ లాంటి రాజ్యాన్ని అనుసరించి, దానికి ఒకే ప్రధాన సన్యాసిని అధిపతిగా కలిగి ఉండాలని ఆయన అనుకోలేదు.

ఏదేమైనా, బుద్ధుని మరణం తర్వాత, మహాకాశప మరియు ఆనందుల మధ్య అధికార పోరాటం జరిగినట్లు తెలుస్తుంది, ఇంకొక మాటలో చెప్పాలంటే నిరంకుశ అధికారాన్ని గురువు నుంచి శిష్యుడికి బదిలీ చేసే సాంప్రదాయ భారతీయ వ్యవస్థ మరియు చిన్న సమాజాలలో నివసిస్తున్న మరియు ఉమ్మడి ఆచారాలు మరియు సూత్రాలను అనుసరించే సన్యాసుల ఇంకా ప్రజాస్వామిక సమానత్వ వ్యవస్థ మధ్య పోరాటం ఉండింది. ఇందులో మహాకాశప విజయం సాధించాడు.

బుద్ధుడిని దహనం చేసి, అతని అవశేషాలను పంచిన తర్వాత, బుద్ధుడు బోధించిన విషయాలను వివరించడానికి, ధృవీకరించడానికి మరియు క్రోడీకరించడానికి తర్వాతి వర్షాకాల రోజులలో రాజగహలో ఒక మండలిని నిర్వహించాలనే మహాకాశప ప్రతిపాదనకు సన్యాసులు అంగీకరించారు. మహాకాశప అక్కడికి హాజరు కావాల్సిన పెద్దలను ఎన్నుకున్నాడు. మోక్షం పొందిన అర్హతులను మాత్రమే ఆయన ఎంచుకున్నాడు, వీరి సాంఖ్య 499 అని అంటారు. మొదట్లో, మహాకాశపుడు ఆనందుడిని ఇంకా అర్హత సాధించలేదనే కారణంతో చేర్చుకోలేదు. బుద్ధుని ప్రవచనాల గురించి ఆనందానికి మంచి జ్ఞాపకశక్తి ఉన్నప్పటికీ మహాకాశపుడు అతన్ని కలుపుకోలేదు. దీనికి తోడు, ఆనందుడు ఒక ఏకైక నాయకుడు ఉండకూడదనే బుద్ధుని కోరికకు బలమైన సహాయకుడు మరియు వోకల్ మద్దతుదారుడు. ఆనందుని పట్ల మహాకాశపానికి అయిష్టత రావడానికి ఇంకొక కారణం ఏమిటంటే, స్త్రీలను వీళ్లలో స్వీకరించడానికి బుద్ధుడిని ఒప్పించిన వ్యక్తి ఆనందుడే అవ్వడం. ఇది మహాకాశప సంప్రదాయ బ్రాహ్మణ నేపథ్యాన్ని కించపరిచేది. చివరికి, సన్యాసి పెద్దలు ఆనందుడిని బహిష్కరించడాన్ని వ్యతిరేకించడంతో మహాకాశపుడు లొంగిపోయి ఆనందుడిని హాజరు కావడానికి అనుమతించారు. థెరవాడ కథనం ప్రకారం, మండలికి ముందు రోజు రాత్రి ఆనందుడు అర్హత్ ను పొందాడు.

అయితే మండలి సమావేశం కోసం ఎదురుచూస్తూ ఆనందుడు అజాతసత్తు రాజు ప్రధానమంత్రి వస్కకరుడిని (సం. వర్షాకర) కలుసుకున్నాడు. మగధ సేనలు వజ్జిపై దాడికి సిద్ధపడటంతో పాటు, మగధకు పశ్చిమాన ఉన్న అవంతి (సం. అవంతి) రాజు పజ్జోత (సం. ప్రద్యుత) నుంచి కూడా దాడికి సిద్ధమవుతున్నారని ఆనందుడు అతని ద్వారా తెలుసుకున్నాడు. అందువలన, బుద్ధుడు తన సమాజానికి నాయకత్వం వహించే పితృస్వాముల వరుస ఉండాలని కోరుకోనప్పటికీ, మహాకాశప నాయకత్వ బాధ్యతలు చేపట్టడం నిస్సందేహంగా ఈ ప్రమాదకరమైన మరియు అనిశ్చిత సమయాల్లో బుద్ధుని బోధనలు మరియు సన్యాస సమాజం మనుగడకు సహాయపడింది.

రాజగహ సమీపంలోని ఏడు ఆకుల గుహ అయిన సత్తిపన్నిగుహ (సం. సప్తపర్ణగుహ) దగ్గర జరిగిన ఈ మొదటి బౌద్ధమత మండలికి ఐదు వందల మంది హాజరయ్యారు. దీన్ని మహాకాశప అధ్యక్షత వహించగా, ఆనందుడు చాలా సూత్రాలను గుర్తుతెచ్చుకుని చదివాడు మరియు ఉపాలి (సం. ఉపాలి) సన్యాస క్రమశిక్షణ యొక్క వినయ నియమాలను చదివాడు. ఈ మండలి యొక్క థెరవాడ వెర్షన్ ప్రకారం, జ్ఞానానికి సంబంధించిన ప్రత్యేక అంశాలపై అభిధామ (సం. అభిధర్మ) బోధనలు ఈ సమయంలో చదవలేదు. అయితే సర్వస్వస్తివాద సంప్రదాయంలో, వైభాషిక వెర్షన్ మహాకాశపుడు అభిధామ బోధనలలో కొన్నింటిని చదివాడని, కానీ అన్ని అభిధామ బోధనలను చదవలేదని చెప్తుంది. కానీ సౌతాంత్రిక వాదనల ప్రకారం, ఈ అభిధామ బోధనలు నిజానికి బుద్ధుని బోధనలు కావు, కానీ ఏడుగురు అర్హత్ ల ద్వారా ఇవి రచించబడ్డాయి.

టిబెటన్ సంప్రదాయాల ప్రకారం, మహాకాశప ఏడుగురు గురువుల వరుసను ప్రారంభించాడు. కొరియన్ సన్ మరియు జపనీస్ జెన్ సంప్రదాయాలను అనుసరించే చైనా యొక్క చాన్ సంప్రదాయాలు భారతదేశంలో ఇరవై ఎనిమిది మంది గురువుల శ్రేణిని కలిగి ఉన్నాయి, బోధిధర్మ ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉంటుంది. చాన్ బోధనలను చైనాకు తీసుకువచ్చింది భారతీయ గురువు బోధిధర్మ. తూర్పు ఆసియాలో, అతనే మొదటి చాన్ గురువుగా చెప్పుకోబడతాడు.

థెరవాడల పాళీ సాహిత్యం బుద్ధుడు అత్యంత కష్టమైన పరిస్థితులలో నిరంతరం పెరుగుతున్న తన శిష్యులు మరియు అనుచరుల సమాజాన్ని స్థాపించడానికి మరియు వాళ్ళకు సహాయం చెయ్యడానికి కష్టపడిన ఆకర్షణీయమైన, దాదాపు విషాదకరమైన ఆధ్యాత్మిక నాయకుడిగా చూపిస్తుంది. రాజకీయ కుట్రలు, అనేక యుద్ధాలు, తన స్వంత దేశ ప్రజల ఊచకోత, ప్రభుత్వం ముందు వ్యక్తిగత నిందలు, తన శిష్యుల నుంచి అతని నాయకత్వానికి సవాళ్లు, తన సన్నిహిత శిష్యులలో ఒకరి హత్య, చివరికి విష ప్రయోగం ద్వారా మరణం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఇన్ని పరీక్షల్లో బుద్ధుడు తన మనశ్శాంతిని కాపాడుకున్నాడు మరియు ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. అతను జ్ఞానోదయం పొందిన తర్వాత బోధించిన నలభై ఆరు సంవత్సరాలూ, ప్రపంచానికి మోక్షం మరియు జ్ఞానోదయానికి మార్గాన్ని చూపించాలనే తన నిబద్ధతలో చాలా స్థిరంగా ఉన్నాడు.

Top