ఒక నైతిక జీవితాన్ని గడపడం ఎలా

Uv how to lead an ethical life

నైతిక జీవితం ఆధారంగా మనపైన మనకు ఉండే ఆసక్తి మరియు ఇతరులపై ఉండే ఆసక్తి

బౌద్ధమతం యొక్క సారాంశం ఏమిటంటే: మనం ఇతరులకు సహాయం చెయ్యగలిగే స్థితిలో ఉంటే తప్పక సహాయం చెయ్యాలి; కుదరకపోతే, కనీసం వాళ్లకు హాని చెయ్యకుండా ఉండాలి. ఇదే నైతిక జీవితాన్ని గడపడం యొక్క సారాంశం.

ప్రతి యాక్షన్ ప్రేరణ నుంచి వస్తుంది. ఒకవేళ మనం ఇతరులకు హాని చేస్తే, అది కూడా ప్రేరణ నుంచి వస్తుంది; అలాగే మనం ఇతరులకు సహాయం చేస్తే, అది కూడా ప్రేరణ నుంచే వస్తుంది. కాబట్టి, ఇతరులకు సహాయం మరియు సేవ చెయ్యడానికి, మనకు కొంత ప్రేరణ అనేది అవసరం. అందుకోసం, మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. మన౦ సహాయ౦ చేస్తూ హాని చెయ్యకుండా ఎలా ఉంటాము?

ఉదాహరణకు, మనం ఎవరికైనా హాని చెయ్యబోతున్నప్పుడు, మనకు ఒక రకమైన ఆలోచన వచ్చి అది మనల్ని అలాంటి హాని చెయ్యకుండా ఆపుతుంది. అంటే అక్కడ మనకు ఒక విధమైన సంకల్పం అవసరం ఉంటుంది [హాని కలిగించకుండా ఉండటానికి.] మన మనస్సులోని ఒక భాగం ఎదుటి వాళ్లని హాని చెయ్యాలని చూస్తుంది, కానీ ఒక నిర్దిష్ట మానసిక స్థితి కారణంగా, మన మనస్సులోని ఇంకొక భాగం ఇది తప్పు అని చెప్తుంది. ఎందుకంటే అది తప్పని మనకు తెలుస్తుంది, అప్పుడు మనం ఒక ధైర్యాన్ని తెచ్చుకుని ఆ పని చెయ్యకుండా ఉంటాం. ఈ రెండు విషయాలలో (హాని చెయ్యడం లేదా చెయ్యకుండా ఉండటం) కొన్ని పనులు ముందు ముందు ఎక్కువ నష్టాలను కలిగిస్తాయని మనకు మనం తెలుసుకోవాలి. మనుషులుగా, దీర్ఘకాలిక నష్టాలను గ్రహించే శక్తి మనకు ఉంది. అప్పుడు, మనం వాటిని తెలుసుకున్నప్పుడు, వెంటనే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.

ఇక్కడ దీనిని మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు. మొదటిది, మన ప్రయోజనాల గురించి, అప్పుడు మనం సహాయం చేయగలిగితే స్థితిలో ఉంటే చేస్తాము; అలా చెయ్యలేకపోతే, వదిలేస్తాము [ఎటువంటి హాని కలిగించకుండా]. ఇతరుల ఆసక్తుల గురించి ఆలోచించడం ఇంకొక విధానం, అదే విధంగా, మనం సహాయం చేయగలిగితే, చేస్తాము; అలా కుదరకపోతే, మానుకుంటాము [హాని చెయ్యకుండా]. ఇతరులకు హాని చెయ్యకుండా ఉండాలంటే, "నేను ఇలా చేస్తే, చట్టపరమైన శిక్షలతో సహా కష్టాలను ఎదుర్కుంటాను" అనే ఆలోచన రావాలి. ఆ ఆలోచన వల్ల మనల్ని మనం కంట్రోల్ చేసుకుని మనకు ఎలాంటి చెడు జరగకుండా ఉండాలని సైలెంట్ గా ఉంటాం. ఇప్పుడు, ఇతరుల గురించి మన౦ ఇలా ఆలోచిస్తా౦: "ఇతరులు కూడా నాలాగే ఉన్నారు. వారికి బాధలు, కష్టాలు అవసరం లేదు కాబట్టి, నేను వారికి ఎలాంటి హాని చెయ్యకుండా అదుపులో ఉంటాను."

మనం మన మనస్సులకు శిక్షణ ఇచ్చినప్పుడు, మొదట మనం సొంత ప్రయోజనం కోసం ఆలోచిస్తాము, తరువాతే ఇతరుల గురించి ఆలోచిస్తాము. సమర్థవంతంగా ఉండాలంటే, మనం ఇతరుల గురించి ఆలోచించడమే మంచిది. ప్రతిమోక్షం పరంగా - వ్యక్తిగత విముక్తి ప్రతిజ్ఞలు, సన్యాస శిక్షణ యొక్క వినయ సంప్రదాయం - మన సొంత ప్రయోజనం కోసం ఆలోచించడమే ప్రధాన అంశం. దాని వల్ల, మనం ఇతరులకు హాని చెయ్యకుండా ఉంటాము. ఎందుకంటే మనం ముక్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి. భోధిసత్వ ఆచరణలో, ఇతరులకు హాని చేయకుండా ఉండటానికి ప్రధాన కారణం ఇతరుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం. రెండవది, ఇతరులకు హాని కలిగించకుండా సహాయం చేస్తూ ఉండడం. ఇది నేను తరచుగా మాట్లాడే సార్వత్రిక బాధ్యతలతో సంబంధం కలిగి ఉంటుంది.

మనుషులుగా మన ప్రాథమిక స్వభావం

సాధారణంగా మనం సామాజిక జంతువులం. మన మనుగడ మిగిలిన మనుషులపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత మనుగడ మరియు శ్రేయస్సు అంతా సమాజంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించడం మరియు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం మన స్వంత ప్రాథమిక స్వభావం నుండి పుట్టింది. ఉదాహరణకు, బబూన్లను చూస్తే, ఆ గుంపులో పెద్ద తన మందకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది. మిగతావి ఆహారం తింటూ ఉంటే, ఒక పెద్ద మగ బబూన్ ఎప్పుడూ పక్కనే వాళ్లను చూసుకుంటూ ఉంటుంది. 

చరిత్ర పూర్వ కాలంలో మనుషులమైన మనకు విద్య, సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రాథమిక మానవ సమాజం సింపుల్ గా ఉండేది: అందరూ కలిసి పనిచేస్తూ అన్నిటినీ కలిసి పంచుకునేవారు. ఇది అసలైన కమ్యూనిజం అని కమ్యూనిస్టులు చెప్తూ ఉంటారు: అందరూ కలిసి పనిచేస్తూ ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత, క్రమంగా విద్య అభివృద్ధి చెంది నాగరికత వచ్చింది. [మనిషి] మనస్సు ఇప్పుడు మరింత అధునాతనంగా తయారయ్యి దురాశతో నిండి పోయింది. అది అసూయను, ద్వేషాన్ని తెచ్చిపెట్టింది, కాలక్రమేణా ఇవి బలపడ్డాయి.

ఈ రోజు, ఇరవై ఒకటవ శతాబ్దంలో, [మానవ సమాజంలో] అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మన మధ్య విభేదాలు పెరిగాయి – విద్య, ఉద్యోగాలు, సామాజిక నేపథ్యాల్లో తేడాలు కూడా పెరిగాయి. కానీ వయస్సు మరియు జాతిలో తేడాలు ఉన్నా - ఇవన్నీ సెకండరీ విషయాలే. ప్రాథమిక స్థాయిలో, మనమందరం ఇప్పటికీ మనుషులమే మరియు మనమంతా ఒక్కటే. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి పద్దతి.

చిన్న పిల్లల ఆలోచనా విధానం కూడా అలాంటిదే. ఇతర పిల్లల సామాజిక నేపథ్యం, మతం, జాతి, రంగు లేదా సంపద గురించి వాళ్లు పట్టించుకోరు. వారంతా కలిసి ఆడుకుంటారు. వారు ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నంత వరకు వాళ్లు నిజమైన స్నేహితులు. ఇప్పుడు మన పెద్ద వాళ్ళు మరింత తెలివైనవాళ్లు, బాగా అభివృద్ధి చెందిన వాళ్లు, కానీ మనం ఇతరుల సామాజిక నేపథ్యాన్ని అంచనా వేస్తాం. "నేను నవ్వితే, నేను కోరుకున్నది నాకు దొరుకుతుందా; నేను పట్టించుకోకపోతే, ఏదైనా కోల్పోతానా?" అని లెక్కలు వేసుకుంటాం.

సార్వత్రిక బాధ్యత

సార్వత్రిక లేదా ప్రపంచ బాధ్యత అనే భావన మనుషుల స్థాయిలో పనిచేస్తుంది. మనం ఇతర వాళ్ల గురించి ఆందోళన పడుతూ ఉంటాము.  ఎందుకంటే: "నేను వాళ్లలో ఒకడిని; మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నా మంచి అతని పైనే ఆధారపడి ఉంది" అని. గొడవలు ఎప్పుడూ ఉంటాయి కానీ వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు.

కొన్ని శతాబ్దాల పాటు, ఈ భూమిపై జనాభా కేవలం ఒక బిలియన్ మాత్రమే ఉండేది; ఇప్పుడు ఆరు బిలియన్లు దాటింది. ఇప్పటికే, అధిక జనాభా వల్ల, ఒక దేశం అయితే తన సొంత ప్రజలకు ఆహారాన్ని మరియు వనరులను అందించ లేకపోతుంది. కాబట్టి మనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉంది. అందువల్ల, నేడు ఈ చిన్న ప్రపంచంలో అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారు. ఇదే రియాలిటీ. దానికి తోడు, గ్లోబల్ వార్మింగ్ అనే ఒక పర్యావరణ సమస్య ఉంది. ఇది ఒకటి రెండు దేశాలకే కాకుండా ఈ భూమి మీద ఉన్న ఆరు బిలియన్ల మందికి ఆందోళన కలిగించే విషయం. ఈ కొత్త రియాలిటీకి ప్రపంచ బాధ్యత ఎంతో అవసరం.

ఉదాహరణకు, ఇంతకుముందు, బ్రిటిష్ వాళ్లు తమ గురించి మాత్రమే ఆలోచించి ప్రపంచంలోని ఇతర దేశాలను ఆక్రమించుకున్నారు. వేరే వాళ్ల ఆందోళనలు లేదా బాధలను వాళ్లు పట్టించుకోలేదు. సరే, ఇది ఎలాగో గడిచిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు మనం ఇతర దేశాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

నిజానికి బ్రిటిష్ సామ్రాజ్య వాదులు కొన్ని మంచి పనుల్నే చేశారు. వారు ఇండియాలోకి ఇంగ్లీష్ భాషతో మంచి చదువును తీసుకువచ్చారు. దీని గురించి ఇండియా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఉంది. అలాగే బ్రిటన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, రైలుమార్గ వ్యవస్థను తీసుకువచ్చింది. ఇది మీ పునరుద్ధరణ లక్షణాలలో ఒకటి. నేను ఇండియాకి వచ్చినప్పుడు, కొంతమంది గాంధేయవాదులు ఇంకా జీవించే ఉన్నారు. వారు గాంధేయ అహింసా పద్ధతులను తీసుకోమని నాకు సలహా ఇచ్చారు. ఆ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదులు మంచివాళ్లు కాదని నాకు అనిపించింది. కానీ నేను ఒక స్వతంత్ర భారతదేశంలో న్యాయవ్యవస్థ, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలైనవి ఉండటం చూశాను. కాబట్టి, నేను బాగా లోతుగా ఆలోచించినప్పుడు, ఇవన్నీ చాలా మంచివని గమనించాను.

ఈ రోజు, దేశం నుంచి దేశానికి మరియు ఖండం నుంచి ఖండానికి, భారీ పరస్పర ఆధారం ఉంది. ఈ రియాలిటీ ప్రకారం, మనకు నిజంగా ప్రపంచ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ స్వంత ప్రయోజనాలు ఇతరుల అభివృద్ధి మరియు ఆసక్తులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటి కోసం, మీరు ఇతరులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక రంగంలో ఇది ఇప్పటికే ఉంది. వేరే వేరే ఆలోచనా విధానాలు ఉన్నా, ఒకరినొకరు నమ్మకపోయినా, మన ప్రపంచ పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అందువల్ల, ఇతరుల ప్రయోజనాలను గౌరవించే ఆధారంగా ప్రపంచ బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇతరులను తమ్ముళ్లుగా చెల్లెళ్లుగా భావించి సన్నిహితంగా మెలగాలి. దీనికి మతంతో సంబంధం లేదు. ఇది మనకు నిజంగా అవసరం. "మనం మరియు వాళ్లు" అనే భావన - ఒక స్థాయి వరకు ఓకే, - కానీ ప్రపంచం మొత్తం "మనలో" భాగంగా భావించాల్సిన అవసరం ఉంది, మన పొరుగు వారి ప్రయోజనాలు మన సొంత ప్రయోజనాల లాగా.

సంతృప్తి

ఒక వ్యక్తిగా నైతిక జీవితాన్ని గడపడం అంటే ఇతరులకు హాని కలిగించకుండా, కుదిరిన వారికి సహాయం చేస్తూ ఉండడం. [ఇలా చేయడంతో] మన నైతికతకు ఇతరుల సంతోషాన్ని ఆధారంగా తీసుకుంటే - ఇది నైతికత యొక్క విస్తృత పరిధి అవుతుంది. మన జీవనశైలి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

అమెరికాలో కూడా ధనికులు, మరియు పేదల మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. ఈ అత్యంత ధనిక దేశమైన అమెరికాను మనం పరిశీలిస్తే ఇప్పటికీ అక్కడ పేదరికం అనేది ఉంది. ఒకసారి నేను ధనిక దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్నప్పుడు అక్కడ చాలా పేద గ్రామాలు ఉన్నాయని గమనించాను. వీరి కనీస అవసరాలు కూడా సక్రమంగా తీర్చలేకపోతుంది వాళ్ల ప్రభుత్వం. [అలాగే,] ప్రపంచ స్థాయిలో, పారిశ్రామీకరించడని ఉత్తర దేశాలు చాలా అభివృద్ధి చెంది సంపన్నంగా ఉన్నాయి [మిగిలిన దేశాల కంటే]; కానీ ప్రపంచంలోని దక్షిణ భాగంలోని అనేక దేశాలు పేదరికాన్ని ఎదుర్కుంటూనే ఉన్నాయి. అది నైతికంగా తప్పే కాదు; ఇది సమస్యలకు మూలం. కాబట్టి, కొన్ని ధనిక దేశాలు వారి జీవనశైలిని పరిశీలించాల్సి ఉంది; వాళ్ళు కొంతవరకు సంతృప్తిని పాటించాల్సి ఉంది.

పదిహేనేళ్ల క్రితం జపాన్ లో ఒకసారి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, ప్రతి సంవత్సరం భౌతిక పురోగతి జరగాలని మీరు అనుకోవడం పెద్ద తప్పని అక్కడి ప్రజలకు చెప్పాను. ఒక రోజు, మీ ఆర్థిక వ్యవస్థ మరింత పరిమితం కావడాన్ని మీరు చూస్తారు అని చెప్పాను. అలా జరిగినపుడు, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పాను. కొన్నేళ్ళ తర్వాత జపాన్ లో ఆ పరిస్థితి రానే వచ్చింది.

కొందరి జీవనశైలిలో లగ్జరీలు ఎక్కువగా ఉంటాయి. దొంగతనం, దోపిడీ, మోసం చెయ్యకుండా వీరి దగ్గర బోలెడంత డబ్బు ఉంటుంది. సొంత ప్రయోజనాల దృష్ట్యా, వారి డబ్బు సంపాదించే మార్గాలు అనైతికం కానంత వరకు తప్పు ఏమీ లేదు. కానీ, ఇతరుల ప్రయోజనాలను బట్టి చూస్తే, తమ విషయంలో తప్పు లేనప్పటికీ; నైతికంగా, ఇతరులు పేదరికాన్ని ఎదుర్కుంటున్నప్పుడు అలా ఉండటం మంచిది కాదు. ప్రతి ఒక్కరికీ అదే విలాసవంతమైన జీవనశైలి ఉంటే, సరే; కానీ అది సాధించే వరకు, మంచి జీవనశైలిలో మాత్రమే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. నేను జపాన్ లో, యునైటెడ్ స్టేట్స్ లో మరియు ఇతర సంపన్న దేశాలలో చూసినట్లుగా, వాళ్ళ జీవనశైలిలో కొంత మార్పు అవసరం.

చాలా దేశాలలో, ఒక కుటుంబమే ఉంటుంది, కానీ కొన్ని దేశాలలో రెండు కుటుంబాలు, మూడు కార్లు ఉన్నాయి. భారత్, చైనాలను చూడండి, ఈ రెండు దేశాలు రెండు బిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి. రెండు బిలియన్ల మంది ప్రజలు రెండు బిలియన్ కార్లు లేదా అంతకంటే ఎక్కువ కొంటే, అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఆయిల్, భౌతిక వనరులు, సహజ వనరులు మొదలైన వాటిల్లో చాలా సమస్యలు వస్తాయి. ఇది చాలా కష్టతరంగా మారిపోతుంది.

పర్యావరణాన్ని పరిగణనలోకి తీసుకోవడం

నైతిక జీవితంలో మనం పట్టించుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే పర్యావరణాన్ని పట్టించుకోవడం, ఉదాహరణకు మనం నీటిని సరిగ్గా ఉపయోగించడం. నా విషయం వింటే మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ చాలా సంవత్సరాల నుంచి నేను అస్సలు బాత్ టబ్ లో స్నానం చెయ్యలేదు; నేను షవర్ లోనే స్నానం చేస్తాను. బాత్ టబ్ కోసం ఎక్కువ నీళ్లు అవసరం పడతాయి. మీకు ఇది కూడా సిల్లీగా అనిపించవచ్చు, ఎందుకంటే ప్రతిరోజూ నేను రెండు సార్లు స్నానం చేస్తాను, కాబట్టి ఈ రెండు సార్లు నేను ఉపయోగించే నీళ్లు సమానంగా ఉంటుంది. ఇంకా, విద్యుత్ లైట్ల విషయానికొస్తే, ఉదాహరణకు, నేను గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు, ప్రతిసారీ నేను లైట్లను ఆఫ్ చేసి వెళ్తాను. అలా, నేను పర్యావరణానికి ఒక చిన్న సహాయం చేస్తున్నాను. ప్రపంచ బాధ్యత అనే భావన నుంచి ఇలాంటి నైతిక బాధ్యతగా ఉండాలని ఆలోచన వస్తుంది.

ఇతరులకు ఎలా సహాయం చెయ్యాలి

ఇతరులకు ఎలా సహాయం చెయ్యాలనే విషయానికి వస్తే, దీనికి అనేక మార్గాలు ఉన్నాయి; ఇవన్నీ మన పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నా చిన్నతనంలో, ఏడెనిమిదేళ్ల వయస్సులో, చదువుకుంటున్నప్పుడు, నా గురువు గారైన లింగ్ రింపోచే గారి దగ్గర ఎప్పుడూ ఒక కొరడా ఉండేది. నేను, మా అన్నయ్య కలిసి చదువుకుంటున్నప్పుడు నిజానికి రెండు కొరడాలు ఉండేవి. ఒక కొరడా పసుపు రంగులో ఉండేది - అది పవిత్రమైన కొరడా, ఇది పవిత్రమైన దలైలామా గారిది. ఆ పవిత్ర కొరడాను ఉపయోగిస్తే, అసలు ఎలాంటి నొప్పి అనేది ఉండేది కాదు! ఇది ఒక కఠినమైన పద్ధతిలా ఉండేది, కానీ అదే నాకు చాలా సహాయపడింది.

చివరికి, ఏ పని అయినా సహాయపడుతోందా లేదా అనేది ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి, కొన్నిసార్లు సున్నితంగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక చిన్న అబద్ధం కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు, ఎక్కడో దూరంగా ఉన్న దేశ౦లోని ఒక ప్రియమైన స్నేహితుడు లేదా అతని తల్లిద౦డ్రులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యి దాదాపు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, మీరు అతనికి తన తల్లిదండ్రులు చనిపోబోతున్నారని చెబితే, ఆ వ్యక్తి చాలా బాధ పడతాడు, ఆ మాట విని అతను మూర్ఛపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు, "వాళ్ళకి ఏం కాలేదు బాగానే ఉన్నారు " అని చెప్పాలి. ఎదుటి వ్యక్తిని బాధపెట్టకుండా ఉండాలని మీరు అనుకుంటే, అటువంటి సందర్భంలో, ఒకరి సొంత ప్రయోజనం కోసం ఒక అబద్ధం చెప్పాలి. ఇది అనైతికం అయినప్పటికీ, ఇంకొకరికి ఇది మంచిగా అనిపించవచ్చు.

హింసాత్మక మరియు అహింసాత్మక పద్ధతులు

ఇతరులకు మంచిగా ఎలా సహాయం చేయాలి? అది కష్టమే. దానికోసం మనం వివేకవంతులై ఉండాలి. పరిస్థితులపై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి; వేరే వేరే పరిస్థితులలో వాటికి అనుగుణమైన పద్ధతులను ఉపయోగించే సౌలభ్యం మనకు ఉండాలి. మరీ ముఖ్యంగా, మనకు ప్రేరణ ఉండాలి: మనకు ఇతరుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి.

ఉదాహరణకు, ఒక పద్ధతి హింసాత్మకంగా లేదా అహింసాత్మకంగా ఉందా లేదా అనేది ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. ఒక పచ్చి అబద్ధం చెప్పడం హింసాత్మకమే అయినప్పటికీ, ప్రేరణ ప్రకారం ఇది ఇతరులకు సహాయం చేసే పద్ధతి అయి ఉండవచ్చు. కాబట్టి, ఆ కోణం నుంచి, ఇది అహింసాత్మక పద్ధతి. ఇంకోవైపు, మనం ఇతరుల నుంచి ఏదైనా కోరుకుంటే అప్పుడు వాళ్లకు మనం ఇదొక బహుమతిని ఇస్తాము, ఇది అహింసాత్మకం; కానీ చివరిగా, మనం అవతలి వ్యక్తిని మోసం చేయాలనుకుని వారిని వాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి, ఇది హింసాత్మక పద్ధతే. కాబట్టి, హింసాత్మక లేదా అహింసాత్మక అనేది ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. మనుషులు చేసే పనులన్నీ ప్రేరణపై ఆధారపడి ఉంటాయి. ఇది కూడా కొంతవరకు లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది.

మతాంతర సామరస్యం

ఇక్కడి నుంచి మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మనశ్శాంతిని పెంపొందించడానికి ప్రయత్నించడం. దీని గురించి ఆలోచించి మనలో మనం అలవరచుకోవాలి. దీనికి తోడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక మతాన్ని అనుసరించి విశ్వాసులుగా ఉండేవారు కొందరైతే, నా ప్రధాన మాటల్లో ఒక సందేశం ఎప్పుడూ మతాంతర సామరస్యం మీదే ఉంటుంది. అన్ని ప్రధాన మతాలు, సూర్య చంద్రులను ఆరాధించే చిన్నవి కాకుండా - వాటికి ఎక్కువ ఫిలాసఫీలు ఉండవు - కానీ చాలా ప్రధాన మతాలలో ఫిలాసఫీ మరియు వేదాంతాన్ని కలిగి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వారి మతం ఒక నిర్దిష్ట ఫిలాసఫీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, అది వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. కానీ విభిన్న ఫిలాసఫీలు ఉన్నప్పటికీ, అన్ని మతాలు ప్రేమ మరియు కరుణను అత్యున్నత అభ్యాసంగా భావిస్తాయి.

కరుణతో, క్షమా గుణం దానికదే వస్తుంది, దాని తర్వాత సహనం మరియు సంతృప్తి కూడా వస్తాయి. ఈ మూడు అంశాలతో సంతృప్తి కలుగుతుంది. ఇది అన్ని మతాలలో కామన్ గా ఉంటుంది. మనం మాట్లాడుతున్న ప్రాథమిక మానవతా విలువలను విస్తరించడానికి ఇవి ముఖ్యమైనవి. కాబట్టి ఈ విషయంలో, మన అన్ని మతాలు మన ఆనందానికి ఆధారం అయిన నైతిక జీవితాన్ని గడపాలనే అర్థంలో సహాయం చేస్తూ ఉన్నాయి. అందుకని, అన్ని మతాలు ఒకే సందేశాన్ని కలిగి ఉన్నాయి. మానవాళికి సహాయపడటానికి వాళ్ళందరి దగ్గర ఒకే సామర్థ్యం ఉంది.

వేరు వేరు సమయాల్లో, ప్రదేశాలలో, బోధనలు వచ్చాయి. అవి అవసరం. ఈ వివిధ రకాల కాలాలు, ప్రదేశాలు మరియు విభిన్న జీవన విధానాలు పర్యావరణ వ్యత్యాసాల కారణంగా పరిణామం చెందాయి. దాని కారణంగా మతాలలో తేడాలు అనేవి వచ్చాయి. ఆ ప్రతి కాల౦లో, కొన్ని మతపరమైన ఆలోచనలు అనువైనవిగా ఉండేవి [అందువలన అవి స్వీకరించబడ్డాయి]. అలా, వేల సంవత్సరాల పురాతన మతాలు ఒక్కొక్కటీ వారి స్వంత సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. మనకు ఈ రకమైన గొప్ప సంప్రదాయాలు అవసరం: అవి అన్ని రకాల ప్రజలకు సేవ చేస్తాయి. అందరికీ ఒక మతం సరిపోదు, మరియు సేవ చెయ్యలేదు.

బుద్ధుని కాలంలో భారతదేశంలో బౌద్ధేతర సంప్రదాయాలు చాలా ఉండేవి. భారతీయులందరినీ బౌద్ధమతంలోకి మార్చడానికి బుద్ధుడు ప్రయత్నించలేదు. ఇతర మతాలు బాగానే ఉండేవి. అప్పుడప్పుడూ వాళ్ళ మధ్య కొన్ని డిబేట్ లు జరిగేవి. ముఖ్యంగా బుద్ధుని తర్వాత అనేక శతాబ్దాల పాటు గురువులు ఒకరిపై ఒకరు డిబేట్ లు జరుపుకునేవారు. ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర రంగంలో ఈ డిబేట్ లు బాగా ఉపయోగపడ్డాయి. మరొక సంప్రదాయానికి చెందిన ఒక పండితుడు వేరే మతం యొక్క తత్వశాస్త్రం మరియు అభిప్రాయాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తాడు. ఇది ప్రతి ఒక్కరూ వారి స్వంత మతాల గురించి మరియు వారి స్వంత సంప్రదాయాల గురించి ఆలోచించడానికి కారణమయ్యేది. కాబట్టి, సహజంగానే ఇది పురోగతిని తెస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఈ డిబేట్ లలో కొద్దిగా హింస కూడా జరిగింది అది మన దురదృష్టకరం; కానీ, సాధారణంగా, ఎక్కువ ఉపయోగమే జరిగింది.

శతాబ్దాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతున్న నిజమైన మత సహనానికి భారతదేశం చాలా మంచి ఉదాహరణ; ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇది మిగతా ప్రపంచానికి మంచి స్ఫూర్తిగా నిలుస్తుంది.

పురాతన కాలంలో, ప్రజలు ఒంటరిగా ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు మనం వేరే వేరే పరిస్థితుల్లో ఉంటున్నాం. ఉదాహరణకు, లండన్ ను తీసుకోండి - ఇది ఇప్పుడు చాలా మతాల ప్రజలు కలిసి ఉండే సమాజం. అలాంటప్పుడు మత సహనం చాలా ముఖ్యం. ఒక మతంపై విశ్వాసం ఉన్నవారికి మత సామరస్యం మరియు సహనం చాలా ముఖ్యం. మీకు అవకాశం వచ్చినప్పుడు, ఈ విషయంలో మీ వంతు సహాయం చెయ్యండి.

Top