మనశ్శాంతి నుంచి శాంతిని పొందడం

Study buddhism universal values 06

శారీరక మరియు మానసిక అసౌకర్యం

నాలుగు దిక్కుల్లోని ఏ దిక్కులో నివసిస్తున్నా ప్రతి ఒక్కరికి శాంతి అనేది అవసరం. ఉన్నోళ్లు లేనోళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శాంతి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మనమందరం మనుషులం, కాబట్టి మనందరికీ సాధారణంగా ఒకే విషయం గురించి ఆలోచన ఉంటుంది: ఆనందంగా ఉండాలని, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని. మనమందరం సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అర్హులం. ఇక్కడ మనం ఆ స్థాయిలో మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి "నేను" లేదా "సొంత" అనే భావన ఉంటుంది, కానీ మనకు ఆ "నేను" లేదా "సొంత" అంటే ఏమిటో సరిగ్గా తెలీదు. ఏదేమైనా, ఇప్పటికీ మనకు "నేను" అనే ఒక బలమైన భావన ఉంటుంది. ఆ భావనతోనే మనకు ఎప్పుడూ సంతోషం కావాలని, ఎలాంటి బాధలు మన జీవితంలో ఉండకూడదని అనిపిస్తుంది. ఇటువంటి ఆలోచన దానికదే వస్తుంది. అందుకనే మనందరికీ సంతోషంగా ఉండే హక్కు ఉంది.

కానీ మన జీవితంలో అనేక అనుకోని సంఘటనలు జరగడం మరియు అడ్డంకులు ఎదురు పడటం ఖాయం. వీటిలో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒక బాధ ఏమో శారీరక సమస్యల వల్ల వస్తుంది, ఉదాహరణకు, అనారోగ్యం మరియు వృద్ధాప్యం. నాకు ఇప్పుడు ఈ వయసులో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి - సరిగ్గా వినలేకపోవడం, చూడలేకపోవడం, నడవలేకపోవడం వంటివి. ఇవన్నీ అందరికి వచ్చేవే. తర్వాతి కేటగిరీ ఏమో ముఖ్యమైన మానసిక స్థాయి. శారీరక స్థాయిలో అంతా సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండి అన్నీ ఉన్నా, కాస్త ఒత్తిడి, సందేహాలు ఉంటే మనం ఒంటరిగా ఫీలవుతాం. మనకు అసూయ, భయం, ద్వేషం ఉంటాయి, ఆ తర్వాత మనం మెల్లగా అసంతృప్తి చెందుతాం. కాబట్టి, శారీరక స్థాయిలో మంచిగా ఉన్నా కానీ, మానసిక స్థాయిలో మనం చాలా బాధలను అనుభవిస్తాం.

శారీరక సుఖం కోసం డబ్బులను ఉపయోగించి మనం కొంత వరకు బాధలను తగ్గించుకుని సంతృప్తిని పొందవచ్చు. కానీ ఆ శారీరక స్థాయిలో ఉండే అధికారం, పేరు, కీర్తి మనకు మనశ్శాంతిని తెచ్చిపెట్టవు. కొన్నిసార్లు, నిజానికి ఎక్కువ డబ్బులు మరియు ఆస్తులు మనకు చాలా ఇబ్బందులను కలిగిస్తాయి. మనం మన పేరు ప్రఖ్యాతుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచన మనల్ని కొంచెం హిపోక్రసి, కొంత అసౌకర్యం మరియు కొంత ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి, మానసిక ఆనందం అనేది బయట విషయాలపై ఆధారపడి ఉండదు, మన అంతర్గత ఆలోచనా విధానం పైనే ఉంటుంది.

మనం ఇప్పటికి చూస్తే కొంతమంది పేదవాళ్లు ఇప్పటికి కింది స్థాయిలో ఉండి బలంగా మరియు సంతోషంగా ఉన్నారు. నిజానికి, మనకు అంతర్గత సంతృప్తి ఉంటే, మనం ఎలాంటి కష్టమైనా శారీరక బాధ నుంచి అయినా తప్పించుకుని బయటపడగలము. కాబట్టి, శారీరక మరియు మానసిక బాధలకు మధ్య, నేను మానసిక బాధలే ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శారీరక అసౌకర్యాన్ని మానసిక సుఖంతో తొలగించుకోవచ్చు, కానీ శారీరక సౌకర్యం ద్వారా మానసిక అసౌకర్యాన్ని తొలగించలేము.

జంతువులకు ఉండే వాటి కన్నా మనుషుల మానసిక సమస్యలు, మరియు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శారీరక స్థాయిలో ఇద్దరికి ఉండే కష్టాలు ఒకటిగానే ఉండవచ్చు. కానీ, మనుషులకు మాత్రం వాళ్లకు ఉండే తెలివితేటల వల్ల సందేహాలు, అభద్రతాభావం, ఒత్తిడి ఎక్కువ ఉంటాయి. అదే మనకు డిప్రెషన్ కు దారితీస్తుంది, ఇవన్నీ మనకు ఉన్న అతి తెలివితేటల నుంచి వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి మనం మానవ మేధస్సును ఉపయోగించాలి. భావోద్వేగ స్థాయిలో, కొన్ని భావాలు మన మనశ్శాంతిని పోగొడతాయి. కొన్ని భావోద్వేగాలు మనకు బాగా సహాయపడతాయి. అవి మన బలం మరియు ఆత్మవిశ్వాసానికి ఆధారం. మనకు మరింత ప్రశాంతమైన మానసిక స్థితిని అందించటానికి అవి పనిచేస్తాయి.

భావోద్వేగాలలో ఉండే రెండు రకాలు

భావోద్వేగాలలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మనశ్శాంతికి చాలా హాని కలిగించేది. ఇది కోపం మరియు ద్వేషం వంటి విధ్వంసక రూపాలను కలిగి ఉంటుంది. అవి మన మనశ్శాంతికి భంగం కలిగించటమే కాకుండా, మన శరీరానికి కూడా చాలా చెడుని కలిగిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, అవి మనం స్పందించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. మనల్ని హానికరమైన మార్గాల్లో ప్రవర్తించేలా చేస్తాయి. అందుకే అవి చాలా చెడ్డవి. అయితే, ఇతర భావోద్వేగాలు కరుణ లాంటి అంతర్గత బలాన్ని మరియు శాంతిని అందిస్తాయి. అవి మనకు క్షమించే బలాన్ని ఇస్తాయి. ఎప్పుడైనా మనకు ఎవరితోనైనా ఇబ్బందులు ఎదురైతే, ఆ క్షమాపణ చేసే తీరు చివరికి మనందరినీ ప్రశాంతంగా ఉంచడానికి, మరియు మనశ్శాంతి పొందడానికి సహాయపడుతుంది. మనకు బాగా కోపం తెప్పించిన వ్యక్తి కూడా మనకు ఒక మంచి స్నేహితుడు కాగలడు.

బయటి శాంతి

మనం శాంతి గురించి మాట్లాడేటప్పుడు, ఈ భావోద్వేగాల మరియు మనశ్శాంతి గురించి మాట్లాడాలి. అందుకని, ఏ భావోద్వేగాలు మనకు మనశ్శాంతిని అందిస్తాయి అనేది తెలుసుకోవాలి. కానీ ముందుగా నేను బయటి శాంతి గురించి ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను.

బయటి శాంతి అంటే కేవలం హింస లేకుండా ఉండటం కాదు. కోల్డ్ వార్ సమయంలో, మనకు శాంతి ఉండి ఉండొచ్చు; కానీ ఆ శాంతి అణ్వస్త్ర మారణహోమం లాంటి భయాలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎవరు బాంబులు వేస్తారో అని భయం ఉంటుంది, కాబట్టి ఇది నిజమైన శాంతి కాదు. నిజమైన శాంతి మనశ్శాంతి నుంచి రావాలి. గొడవలు జరిగినప్పుడల్లా, సరైన చర్చలు చేసి ఒక శాంతియుత పరిష్కారానికి రావాలని నేను అనుకుంటాను. కాబట్టి, శాంతికి మంచి మనసు మరియు ఇతరుల జీవితాల పట్ల గౌరవం, ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం అవసరం. మనం వాటిని గౌరవించి దాని ప్రకారంగా ఇతరులకు సహాయం చెయ్యాలి.

మన౦ కష్టాలను ఎదుర్కున్నప్పుడు, ఎవరైనా వచ్చి మనకు సహాయ౦ చేస్తే అప్పుడు వాళ్లను మనం అభినందిస్తాం. వేరే ఎవరైనా బాధపడుతూ ఉంటే, మనం కేవలం వాళ్లను పట్టించుకున్నా, ఆ వ్యక్తి మనల్ని అభినందించి చాలా సంతోషపడతాడు. కాబట్టి, అంతర్గత కరుణ మరియు మనశ్శాంతి నుంచి, అన్ని పనులు ప్రశాంతంగా జరిగిపోతాయి. ఒకవేళ మనం మనశ్శాంతిని నెలకొల్పుకోగలిగితే అప్పుడు బయటి శాంతిని పొందవచ్చు.

మనుషులుగా, మనం ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు విడిగా వేరే ఆలోచనలను కలిగి ఉంటాము. "నేను" మరియు "వాళ్లు" అనే బలమైన భావనలతో మనకు "నా ఆసక్తి" మరియు "మీ ఆసక్తి" అనే భావనలను వస్తాయి. దీనివల్ల మనకు యుద్ధాలు కూడా జరగవచ్చు. మనం మన శత్రువును అంతం చేస్తే మనకు విజయం వస్తుందని అనుకుంటాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వేరేగా మారింది. మనం ఆర్థికంగా, మరియు పర్యావరణ కోణంలో ఒకరిపై ఒకరు ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. కాబట్టి, "మేము" మరియు "వాళ్లు" అనే భావనలు ఇకపై వర్తించవు. మనం "వాళ్లు" అనుకునే మనుషులు ఇప్పుడు "మేము" లో కలిసిపోయారు. మనశ్శాంతిని పెంపొందించుకోవడానికి ముఖ్యమైనది కరుణ, ఈ భూమి మీద ఉన్న ఆరు బిలియన్ల మంది ప్రజలందరికీ ఆనందాన్ని పొందే హక్కు సమానంగా ఉంది. దాని ప్రకారంగా, మనం ప్రతి ఒక్కరినీ సీరియస్ గా తీసుకుని మనం బయట శాంతిని పెంపొందించుకోవాలి.

చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టడం 

శాంతి కోసం, మన కుటుంబాలలో, తర్వాత మన సమాజాలలో శాంతిని పెంపొందించడం ప్రారంభించుకోవాలి. ఉదాహరణకు, మెక్సికోలో, ఒక స్నేహితుడు తన స్వంత కమ్యూనిటీలో "జోన్ ఆఫ్ పీస్" అనే దానిని తయారు చేశాడు. తన కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకునేలా అతను దీనిని సృష్టించాడు. ఆ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ "జోన్ ఆఫ్ పీస్" పరిధిలో ఎలాంటి చెడును చెయ్యకుండా ఉద్దేశపూర్వకంగా ఉండటానికి అంగీకరించారు. ఒకవేళ వాళ్లు గొడవ పడాలని అనుకుంటే, ఆ జోన్ బయటకు వెళ్లి అలా చేసుకుంటామని వాళ్ళందరూ అంగీకరించారు. ఇది చాలా మంచి విషయం.

ప్రపంచ శాంతిని కోరడం చాలా కష్టమే, కానీ చివరికి ప్రపంచ స్థాయిలో అలా జరగడం గొప్పదే. కానీ అసలైన రియలిస్టిక్ విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం సొంతంగా, కుటుంబం, సమాజం, జిల్లా మొదలైన వాటితో కింద నుంచి ప్రారంభించి, శాంతి ప్రదేశాలను స్థాపించాలి. ఎందుకంటే మనశ్శాంతి కరుణతో ముడిపడి ఉంటుంది.

ప్రపంచంలో పరిస్థితులు ఈ మధ్య విపరీతంగా మారుతున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఒక జర్మన్ ఫ్రెండ్, నా గురువుగా భావించే దివంగత ఫ్రెఢరిక్ వాన్ విజ్ సాకర్, అతని చిన్నతనంలో ఉన్నప్పుడు, ప్రతి జర్మన్ వ్యక్తికి ఫ్రెంచ్ వాళ్లు శత్రువులుగా చూడబడ్డారని మరియు ప్రతి ఫ్రెంచ్ వ్యక్తికి జర్మనీలు శత్రువులు కనపడ్డారని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు మనకు యూరోపియన్ యూనియన్ అనే ఒక యూనిఫైడ్ ఫోర్స్ ఉంది. ఇది చాలా మంచిది. ఇంతకుముందు, ప్రతి దేశం వాళ్ళ దృష్టి నుంచి, తమ స్వంత సార్వభౌమత్వాన్ని చాలా విలువైనదిగా పరిగణించుకున్నారు. కానీ ఇప్పుడు యూరప్ లో ఒక కొత్త శకం వచ్చింది. వ్యక్తిగత ఆసక్తుల కంటే ఒక ఉమ్మడి ఆసక్తి ముఖ్యమైనదిగా చూడబడుతుంది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే ప్రతి సభ్యదేశానికి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచనను ఈ భూమి మీద ఉన్న ఆరు బిలియన్ల మందికి విస్తరించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరినీ ఈ మానవ కుటుంబంలో ఒక సభ్యుడిగా చూడాలి.

ఒక బయాలజీ ఫ్యాక్టర్ గా కరుణ

ఇప్పుడు కరుణ విషయానికొస్తే, తల్లుల నుండి పుట్టిన జీవరాశులు అన్నీ - మానవులు, క్షీరదాలు, పక్షులు మొదలైనవి - వాటి అభివృద్ధి అవి పొందే ఆప్యాయత మరియు సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. సముద్ర తాబేలు, సీతాకోకచిలుకలు మరియు గుడ్లు పెట్టి చనిపోయే సాల్మన్లు వంటి కొన్ని జాతులను ఇందులో నుంచి మినహాయించవచ్చు. ఉదాహరణకు, సముద్ర తాబేలును తీసుకోండి. అవి ఒడ్డున గుడ్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కాబట్టి ఆ పిల్ల తాబేళ్ల మనుగడ సొంతంగానే ఆధారపడి ఉంటుంది. వాటికి తన తల్లి ప్రేమ మరియు సంరక్షణ లేకపోయినా అవి బతికేస్తాయి. కాబట్టి, నేను నా ప్రేక్షకులకు ఒక తాబేలు గుడ్డు నుంచి పుట్టిన పిల్ల తాబేలును తన తల్లిని కలిపి ఉంచి ఒక ప్రయోగం చెయ్యమని చెప్పాను. ఆ తల్లి మరియు పిల్ల తాబేలు మధ్య ఎంత ప్రేమ చూపిస్తుందో తెలుసుకోవడం కోసం. అవి అలా ఉంటాయని నేను అనుకోను. ప్రకృతి వాటిని అలానే సృష్టిస్తుంది కాబట్టి ఆ రెండింటికి ఆప్యాయత అవసరం లేదు. కానీ ప్రత్యేకమైన మనుషుల విషయానికొస్తే, తల్లి సంరక్షణ లేకపోతే, మనమందరం చనిపోతాము.

చిన్న పిల్లను జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని భావోద్వేగాలు అవసరం, అవి కరుణ, ఆప్యాయత మరియు పట్టించుకునే సంరక్షణ భావాలు. శిశువు పుట్టిన మొదటి కొన్ని వారాలు తల్లి స్పర్శ ఆ బిడ్డ మెదడు పెరుగుదలకు ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, సంరక్షణతో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు చాలా సంతోషంగా ఉండటం మనం గమనిస్తాం. వాళ్లు శారీరక స్థాయిలో కూడా బాగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆప్యాయత లేని పిల్లలు, ముఖ్యంగా చిన్నవయసులో ఉన్నప్పుడు వాళ్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు, ఇందులో వారు పిల్ల కోతులను వాటి తల్లుల నుంచి వేరు చేశారు. అప్పుడు ఆ చిన్న కోతులు సరైన మానసిక స్థితిలో లేవని వాళ్లు గమనించారు. అవి ఒక దానితో ఒకటి సరిగ్గా ఆడుకోవట్లేదు. కానీ తమ తల్లుల వద్ద ఉంచిన కోతులు సంతోషంగా ఉండి బాగా ఆడుకుంటూ కనిపించాయి. ముఖ్యంగా పసి పిల్లలుగా తల్లి ప్రేమను పొందని వాళ్లు - నీరసంగా తయారవుతారు. ఆ పిల్లలు ఇతరుల పట్ల ఆప్యాయతను చూపించలేరు. ఇంకొన్ని సందర్భాల్లో, హింసతో కూడిన ప్రవర్తనను చూపిస్తారు. కాబట్టి, అనురాగం ఒక జీవ ఫ్యాక్టర్, జీవశాస్త్ర ఆధారిత ఫ్యాక్టర్.

అలాగే, కరుణ మరియు భావోద్వేగాలు ఈ జీవ భౌతిక స్థాయికి సంబంధించినవి కాబట్టి, కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం, మనం ఎప్పుడూ కోపం, ద్వేషం మరియు భయాన్ని కలిగి ఉంటే, ఇది మన రోగనిరోధక శక్తిని తగ్గించేసి మనల్ని బలహీనం చేస్తుంది. కానీ ఒక దయగల మనస్సు రోగనిరోధక వ్యవస్థకు సహాయపడి దాన్ని బలోపేతం చేస్తుంది.

ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. వైద్య రంగాన్ని పరిశీలిస్తే ఒక వైపు నర్సులు, వైద్యులు, మరోవైపు రోగుల మధ్య నమ్మకాన్ని చూసుకుంటే రోగికి నయం కావడమే అక్కడ ముఖ్యమైన విషయం. కాబట్టి నమ్మకానికి ఆధారం ఏమిటి? డాక్టర్, మరియు నర్సుల ఆ రోగి కోలుకోవడానికి నిజమైన శ్రద్ధను చూపిస్తే, అప్పుడు అతనికి నమ్మకం కలుగుతుంది. కానీ, అక్కడ డాక్టర్ నిపుణుడైనా, రోగిని ఒక యంత్రంలా చూస్తే అక్కడ నమ్మకం పోతుంది. ఇక్కడ వైద్యుడికి గొప్ప అనుభవం ఉంటే, మనం నమ్మకంతో ఉండవచ్చు, కానీ వైద్యుడు మరింత దయను చూపిస్తే మనం ఇంకా నమ్మకంతో ఉండవచ్చు. అప్పుడు ఆ రోగులు ప్రశాంతంగా ఉండి ఇబ్బంది పడరు. ఒకవేళ వాళ్లు ఎక్కువగా ఇబ్బందులలో ఉంటే, అప్పుడు వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. ఇది వాళ్ల రికవరీని ప్రభావితం చేస్తుంది.

కానీ జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని విశ్లేషించుకోవాలని మన గొప్ప భారతీయ బౌద్ధ గురువు శాంతిదేవుడు సలహా ఇచ్చాడు. ఆ సమస్యల నుంచి బయట పడే మార్గం ఉంటే భయపడకుండా ఆ పద్ధతిని ఉపయోగించాలి. కానీ వాళ్లకు సహాయం చేయలేకపోతే, కంగారు పడాల్సిన అవసరం లేదు, అది మనకు ఏ మాత్రం ప్రయోజనాన్ని కలిగించదు. ఈ విషయం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. మనకు పెద్ద సమస్యలు వచ్చినా ఇలా ఆలోచించి వాటిని తగ్గించుకోవచ్చు.

మనకు ఇతరుల నుంచి సంరక్షణ అవసరమైనంత కాలం, ఉదాహరణకు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, మనకు ఆప్యాయత మరియు కరుణ అవసరం పడినట్టుగా. మనం పెద్దయ్యే కొద్దీ ఉన్న స్వతంత్రతతో, మన స్వంత మార్గాలను పొందడానికి కరుణ కంటే కోపమే చాలా ముఖ్యమని మనం అనుకుంటాము. కానీ ఈ ఆరు బిలియన్ల మంది తల్లుల నుంచి వచ్చిన వారే. ప్రతి ఒక్కరూ మాతృ ప్రేమ సంరక్షణలో ఆనందాన్ని, మరియు తృప్తిని అనుభవించారు. కొంత మందికి తల్లులు లేకపోతే, వాళ్లను పెంచిన వాళ్ళ నుంచి వీటిని పొందారు. మనం పెరుగుతున్న కొద్దీ ఈ ప్రేమలు మరియు ఆప్యాయతలు తగ్గిపోతాయి. ఆ తర్వాత మనం కోపంతో, ఎక్కువ బెదిరింపులతో, ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తాము.

రియాలిటీని చూడాల్సిన అవసరం

స్వీడన్ కు చెందిన ఒక శాస్త్రవేత్త నాకు ఇలా చెప్పారు, మనం ఈ వ్యక్తిపై చూపిస్తున్న 90% కోపం ఒక మానసిక ప్రొజెక్షన్ నుంచి వస్తుంది అని. ఇంకో లాగా చెప్పాలంటే, 90% నెగెటివిటి అనేది మానసిక అంచనాతో వచ్చినదే. మనకు ఒకరిపై ఎక్కువ ప్రేమ మరియు బలమైన కోరిక ఉన్నప్పుడు కూడా ఇది ఇలాగే ఉంటుంది: మనం ఆ వ్యక్తిని 100% బాగా చూసుకుంటాము. కానీ అందులోని ఎక్కువ శాతం మన మానసిక అంచనా మాత్రమే; మనం అక్కడ రియాలిటీని చూడటం లేదు.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే: ఎవరూ కష్టాలని కోరుకోరు, కానీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం మన అమాయకత్వం, అజ్ఞానం, మరియు ఆలోచన: మనం రియాలిటీని చూడటం లేదు. మనకు తెలిసిన కొంత పరిమిత ఆలోచనల నుంచి, రియాలిటీని పూర్తిగా చూడలేకపోతున్నాము. మనం రెండు వైపుల మాత్రమే చూస్తున్నాం, ఇది సరిపోదు. ఇంకా మూడు, నాలుగు, ఐదు వైపుల నుంచి చూడాల్సిన అవసరం ఉంది. ముందుగా దీని గురించి ఆలోచించటానికి మన మనసులను ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ఇక్కడ కూడా, నిర్మాణాత్మక మరియు విధ్వంసక భావోద్వేగాల మధ్య తేడాలను తెలుసుకోవటానికి ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం పెరిగే కొద్దీ, కరుణ అనేది తగ్గుతూ వస్తూ పూర్తిగా పోతుంది, కాబట్టి దానిని మళ్ళీ పెంపొందించుకోవడానికి మనకు విద్య మరియు శిక్షణ అవసరం. ఏదేమైనా, కరుణ పక్షపాతంగా ఉంటుంది: ఇది ఇతరుల అభిమానాన్ని పొందడంపై ఆధారపడి ఉంటుంది. కానీ దానిని ఒక ఆధారంగా తీసుకొని, మన పరిశోధనకు హేతుబద్ధత మరియు శాస్త్రీయ కారణాలను జోడిస్తే, మనం ఈ జీవ స్థాయి కరుణను కొనసాగించుకోవటమే కాకుండా దానిని పెంచుకోగలుగుతాము. కాబట్టి, శిక్షణ మరియు విద్యతో, ఈ పరిమిత పక్షపాత కరుణ ఆరు బిలియన్ల మందికి బాగా విస్తరించి అనంత నిష్పాక్షిక కరుణగా మారుతుంది.

విద్య యొక్క ప్రాముఖ్యత

అన్నిటికి అవసరమైనది విద్య. ఇప్పటి ఆధునిక విద్య మెదడు, బుద్ధి వికాసంపై దృష్టి పెడుతుంది, కానీ మనకు ఇది మాత్రమే సరిపోదు. మన విద్యా విధానాలతో ఆప్యాయతను పెంపొందించుకోగలగాలి. ఇది కిండర్ గార్డెన్ నుంచి యూనివర్సిటీ వరకు మనకు అవసరం.

అమెరికాలో, కొంతమంది శాస్త్రవేత్తలు పిల్లలకు కరుణ మరియు బుద్ధిని పెంపొందించే శిక్షణ ఇవ్వడానికి విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేశారు. ఇది ఈ పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి మరియు నిర్వాణాన్ని సాధించడానికి సహాయపడటం కోసమే చేయట్లేదు, ఇది వాళ్ల జీవితం యొక్క ప్రయోజనం కోసం చేస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలలో కూడా, ఆప్యాయత మరియు కరుణను పెంపొందించడానికి ఇప్పటికే కొన్ని విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి నిష్పాక్షిక కరుణ ఇతరుల వైఖరులపై దృష్టి పెట్టదు, కానీ వాళ్ళు మానవులుగా ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ భూమి మీద ఉన్న ఆరు బిలియన్ల జనాభాలో మనమందరం ఒక భాగం, కాబట్టి సమానత్వం అనే అంశం ఆధారంగా ప్రతి ఒక్కరూ మన కరుణను పొందటానికి అర్హులు.

లోపల మరియు బయటవాటన్నిటినీ వదులుకోవాలి

కాబట్టి, లోపలి శాంతి మరియు ప్రపంచ శాంతి కోసం, మనకు లోపలి మరియు బయట ఉండే వాటిని కూడా వదులుకోవడం అవసరం. దీని అర్థం, మన లోపల ఉండే స్థాయిలో, మనం కరుణను అభివృద్ధి చేసుకుని చివరకు దాని ఆధారంగా, అన్ని దేశాలను, బయట స్థాయిలో చెడు వాటిని వదులుకోవాలి. ఇది ఫ్రాంకో-జర్మన్ యూరోపియన్ ఆర్మీ కార్ప్స్ లాంటి ఏకీకృత దళాన్ని కలిగి ఉండటం ‍వంటిది; ఇది చాలా గొప్పది.  మొత్తం యూరోపియన్ యూనియన్ కు ఏకీకృత శక్తి ఉంటే, సభ్యుల మధ్య సాయుధ పోరాటం ఉండదు.

ఒకసారి బ్రస్సెల్స్ లో విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయాలను తూర్పుకు, ఉదాహరణకు పోలండ్ లాంటి తూర్పు ఐరోపా దేశాలకు మారిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్పాను. ఆ తర్వాత దాన్ని రష్యాకు కూడా విస్తరింపజేయడం, ఆ తర్వాత NATO ప్రధాన కార్యాలయాన్ని మాస్కోకు మార్చడం మంచిదని చెప్పాను. అలాగే జరిగితే ఐరోపాలో నిజంగా శాంతి నెలకొంటుందని, దానితో యుద్ధ ప్రమాదాలు తగ్గుతాయని చెప్పాను. ప్రస్తుతం ఉన్న సమయంలో రష్యా, జార్జియాల మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ఆశలను అలాగే నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విధంగా శాంతిని విస్తరింపచేస్తూ ఉండటంతో, ఫ్రాన్స్ లోని ఆయుధ పరిశ్రమ చివరికి మూతబడేటట్లుగా చేస్తే మరియు ఆర్థిక వ్యవస్థను ఉత్పాదక వ్యవస్థగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ట్యాంకులకు బదులు ఫ్యాక్టరీలను బుల్‌డోజర్ల తయారీ చేయవచ్చు. ఆఫ్రికా దేశాలకు కూడా మన సహాయం చాలా అవసరం. ఉన్నోళ్లు లేనోళ్ల మధ్య తేడానే ఒక సమస్య, ప్రపంచం అంతా కాదు; కానీ దేశం స్థాయిలో కూడా, ఈ ఉన్నోళ్లు లేనోళ్ల మధ్య తేడా చాలా భయంకరంగా ఉంటుంది. ఉదాహరణకు, ఫ్రాన్స్ లో, ఇక్కడ ఉన్నోళ్లకి మరియు లేనోళ్లకి మధ్య చాలా తేడా ఉంది. కొంతమంది కరువులో కూడా ఉన్నారు. కానీ మనమందరం మనుషులమే, మనకు ఒకే రకమైన ఆశలు, అవసరాలు మరియు సమస్యలు ఉన్నాయి. మనశ్శాంతి ద్వారా శాంతిని పెంపొందించడానికి మనం ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

Top