కోపాన్ని ఎదుర్కోవటానికి 8 బౌద్ధమత చిట్కాలు

మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే మనకు కోపం వస్తే దాన్ని బయట చూపించమని అందరూ చెప్తారు, కాని బుద్ధుడు దీనికి అంగీకరించడు. కోపాన్ని చూపిస్తే మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పనే సులభంగా చేసేస్తాం. ఇది ఎప్పటికీ అంతం కాని ఒక సైకిల్ కు దారితీస్తుంది. బుద్ధుడు మన కోపాన్ని బయట చూపించనివ్వకుండా, దానిని విశ్లేషించి, ఆ కోపం వెనుక ఉన్న అసలైన ఆలోచనను అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చాడు.
Study buddhism 8 buddhist tips dealing with anger

బౌద్దులు ప్రేమ, కరుణ, సహనం గురించి ఎక్కువగా మాట్లాడవచ్చు, కానీ దలైలామా వంటి గొప్ప గురువులే కొన్నిసార్లు కోపంగా ఉన్నట్లు అంగీకరించినప్పుడు, మిగిలిన మనకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? కోపం రావటం పూర్తిగా సాధారణమే అని సైన్స్ చెప్తుంది. సైకాలజిస్టులు మనకు కోపం వచ్చినప్పుడు బయటపెట్టమని సలహా ఇస్తారు. కొన్ని మతాలు మంచి కోపాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. మరోవైపు, కోపం అసలు ఎప్పుడూ చెడ్డదే అని బౌద్ధమతం చెబుతుంది.

8 వ శతాబ్దపు బౌద్ధమత పండితుడు అయిన శాంతి దేవుడు కోపాన్ని అత్యంత తీవ్రమైన నెగెటివ్ శక్తిగా వర్ణించాడు, ఇది మనం ఇప్పటి వరకు సృష్టించుకున్న మంచిని నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పాడు. దీని గురించి ఆలోచించండి. తుపాకీతో కూడిన ఒక క్షణం కోపం ఒక వ్యక్తి భవిష్యత్తును స్వేచ్ఛా జీవితం నుండి జైలు జీవితంలోకి నెట్టి వేస్తుంది. మన రోజువారీ జీవితంలో ఉండే ఉదాహరణ ఏమిటంటే, కోపం స్నేహాలను మరియు ఎన్నో రోజుల నుంచి నిర్మించుకున్న నమ్మకాన్ని ఒక్క క్షణంలో వమ్ము చేస్తుంది. అంతిమంగా, ప్రపంచంలోని అన్ని బాంబులు మరియు తుపాకులు మరియు కత్తుల కంటే ఈ కోపమే చాలా ప్రమాదకరమైనది.

మనందరికీ తెలుసు కోపం అనేది ఒక సంతోషకరమైన మానసిక స్థితి కాదని, కానీ దాని గురించి మనం ఏమి చేయగలము? బౌద్ధమతం మన మనస్సులను మార్చడంలో సహాయపడటానికి అనేక సరళమైన పద్ధతులను అందిస్తుంది. అప్రమత్తంగా ఉండండి - దీనికి మ్యాజిక్ పిల్ లాంటిది ఏదీ లేదు! ఈ కోపాన్ని ఎదుర్కోవటానికి మనకు ఉత్తమమైన ఎనిమిది బౌద్ధమత చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

1. జీవితం అంటే: సంసారం

2,500 సంవత్సరాల క్రితం బుద్ధుని మొదటి బోధనలో ఈ విషయం సూటిగా చెప్పాడు: జీవితం అంటేనే సంతృప్తికరంగా ఉండదు. మన జీవితాలలో ఎప్పటికీ సంతృప్తి అనేది ఉండదు.

మనం పుడతాం, చచ్చిపోతాం. ఈ మధ్యలో మనకు మంచి జరుగుతుంది మరియు చెడు కూడా జరుగుతుంది, మరియు కొన్నిసార్లు మనకు ఏం పెద్దగా జరగలేదు అని అనిపిస్తుంది: ఈ అంతం కానీ సైకిల్ ని బౌద్ధమతం "సంసారం" అని పిలుస్తుంది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, జీవితం బాగుంటూ అపరిమితమైన సంతోషంతో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయని ఎవరూ చెప్పలేదు. సంసారంలో మన పరిస్థితిని మనమే అర్థం చేసుకున్నప్పుడు, ఇది ఇతరుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మనమందరం ఇందులో ఒక భాగమే. పరిస్థితులపై, ఇతరులపై లేదా మనపై కోపంగా ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇతరులు మనకు నచ్చని పనిని చేస్తూ ఉండొచ్చు - అవును - వారి జీవితాలు కూడా కష్టాలలో ఉంటాయి.

ఈ రకమైన ఆలోచన మన ఆలోచనను పూర్తిగా మార్చగలదు. మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత విశ్వానికి కేంద్రంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, ప్రతీదీ మనం కోరుకున్న విధంగా జరగాలి - లేదా ఎప్పుడూ అలాగే జరుగుతుందని దీని అర్థం కాదు.

2. ఒక హీరో లాగా ఉండండి: ఓర్పు

ఆందోళన కలిగించే భావోద్వేగాలను ప్రత్యర్థి ద్వారా అధిగమించడం ఉత్తమం; మంటలను మంటలతో ఆర్పలేము. ఎందుకని? మన మనస్సులలో ఒకేసారి రెండు వ్యతిరేక భావోద్వేగాలను ఉంచుకోవడం అసాధ్యం. మీరు ఒకరితో తిడుతూ ఒకేసారి వారితో ఓపికగా ఉండలేరు - ఇది అస్సలు పని చెయ్యదు. సహనాన్ని చాలా మంది ఒక బలహీనతలా చూస్తారు, ఇక్కడ మీరు ఇతరులను మీ చుట్టూ నడవడానికి అనుమతిస్తారు మరియు వారు కోరుకున్న దాని నుంచి తప్పించుకుంటారు. అయితే, నిజానికి ఇది వేరుగా ఏమీ ఉండదు. మనం విసుగు చెందినప్పుడు, అరవడం ఎంత సులభం? ప్రశాంతంగా ఉంటూ మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎంత కష్టం? మన భావాలు అసలు మనల్ని హీరోలుగా మార్చవు – అవి కేవలం మనల్ని ఒక బలహీనుడిగానే చేస్తాయి. కాబట్టి ఈసారి మీరు అరిచే పరిస్థితిలో ఉన్నప్పుడు, మీ సహనాన్ని చూపించి కోపాన్ని తగ్గించుకుని నిశ్శబ్దంగా ఉండండి.

దీన్ని మనం ఎలా చెయ్యాలి? మనం లోతుగా ఒక శ్వాస తీసుకుని దీనిని ప్రయత్నించవచ్చు - కోపంగా ఉన్నప్పుడు మనం తీసుకునే ఒక చిన్న శ్వాస విరుగుడు లాంటిది - మనల్ని మనం ఉద్రిక్తంగా గమనించినట్లయితే ఇలా చెయ్యవచ్చు. మనం తర్వాత పశ్చాత్తాపపడకుండా ఉండాలంటే నెమ్మదిగా 100 లెక్కపెట్టవచ్చు. లేదా, మనం అప్పటికే ఒక గొడవలో ఉంటే, ఆ పరిస్థితి నుంచి ఇంకా దిగజారక ముందే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు. ప్రతి పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది, కాబట్టి మీకు ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి మీ మెదడును ఉపయోగించాలి.

3. నిజాయితీగా ఉండండి: పరిస్థితిని విశ్లేషించండి

మనకు కోపం వచ్చినప్పుడు, మన ఆవేశం ఒక రక్షకుడిగా, మన ప్రయోజనాలను చూసుకునే మన ప్రాణ స్నేహితుడిలా, యుద్ధభూమిలో మనకు సహాయం చేసేదిలా కనిపిస్తుంది. ఈ భ్రమ కోపంగా ఉండటం సరైనదే అని అనుకునేలా చేస్తుంది. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే కోపం మన మిత్రుడు కాదు, శత్రువు.

కోపం మనకు ఒత్తిడి, బాధ, నిద్ర లేమి, ఆకలిని తెచ్చిపెడుతుంది. మనం ఒకరిపై కోపంగా ఉంటే, అది ఇతరులపై దీర్ఘకాలిక ఇబ్బందిని సృష్టిస్తుంది. దీన్ని మనం ఎదుర్కుందాం: కోపంగా ఉన్న వ్యక్తి చుట్టూ ఉండాలని ఎవరు కోరుకుంటారు?

మనపై ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు, మన రక్షణాత్మక ఆలోచనలు మనల్ని కట్టిపడేసినప్పుడు, మనం కొంచెం సేపు ఆగి హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇందులో రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి: ఆ ఆరోపణ నిజమా, లేక అబద్ధమా అని. అది నిజమైతే మనకెందుకు కోపం వస్తుంది? మనం పరిపక్వత చెందిన పెద్ద మనుషులుగా ఉండాలనుకుంటే, మనం దానిని అంగీకరించి దాని నుంచి నేర్చుకోవాలి మరియు మన జీవితాలతో ముందుకు సాగాలి. అది నిజం కాకపోతే మళ్ళీ మనకెందుకు కోపం వస్తుంది? ఆ వ్యక్తి తప్పు చేశాడు - మన జీవితంలో మనం ఎప్పుడూ అలా చెయ్యలేదా? అని అనిపిస్తుంది.

4. మీ మనస్సును తెలుసుకోండి: ధ్యానం

కోపాన్ని ఎదుర్కోవడంలో ధ్యానం మరియు బుద్ధిపూర్వక అభ్యాసాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా మంది ధ్యానాన్ని సమయం వృధా చేసే పనిలాగా చూస్తారు - మన రోజును సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు ఆ కుషన్ పై కూర్చొని 20 నిమిషాలు ఎందుకు గడపాలి? అన్నట్టుగా. ఇంకొందరు ధ్యానం అనేది నిజ జీవితం నుంచి ఒక విశ్రాంతిలా భావిస్తారు, పిల్లలు / ఇమెయిల్స్ / భర్త / భార్యకు దూరంగా ఉండొచ్చని.

కానీ ధ్యానం అనేది ఇది కాదు - ఇది నిజ జీవితానికి సిద్ధం చేసుకోవడం లాంటిది. మనం ప్రతిరోజూ ఉదయం కరుణ గురించి ధ్యానం చేయడం మంచిది కాదు, కానీ మనం పనికి వచ్చిన వెంటనే మన ఉద్యోగులపై అరుస్తాము మరియు మన సహోద్యోగుల గురించి ఫిర్యాదులు చేస్తాము.

ధ్యానం మన మనస్సుకు ఒక పాజిటివ్ ఆలోచనలను అందిస్తుంది - సహనం, ప్రేమ, కరుణ. ఇది మనం ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలిగే పని. మన ఉదయంలో ఒక అరగంట మనకు ఇష్టమైన ట్యూన్లు వింటూ గడిపితే, ఆ సమయంలో కనీసం పది నిమిషాలు ఇతరుల పట్ల దయతో ఉండాలని, ప్రేమించాలనే ఆలోచనలను సృష్టించడం - కోపాన్ని తగ్గించడం మరియు ఇతరులు చుట్టూ ఉండాలని కోరుకునే వ్యక్తిగా మనల్ని మార్చడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

5. తల వంచండి: మీ శత్రువు నుంచి నేర్చుకోండి

బౌద్ధమతం తరచుగా మనం సాధారణంగా చేసే వాటికి విరుద్ధంగా చేయమని బోధిస్తుంది. మనం ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది. దీనికి ఫలితం? మనం ఇంతకు ముందు కంటే ఎక్కువ కాకపోయినా, కొంత వరకు బాధతో మిగిలిపోతాం. ఇది మనకు వ్యతిరేకమైనదిగా అనిపిస్తుంది, కానీ దీనికి విరుద్ధంగా చేయడం ఒక వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది: అదే సంతోషానికి మార్గం.

ఇది పిచ్చితనంగా అనిపిస్తుంది, కానీ మీ కోపాన్ని మీకు ఒక గురువుగా తీసుకుని ఆలోచించండి. మనం ఇంకా మంచిగా మారాలనుకుంటే - అంటే, మంచి సహనం, మరింత ప్రేమ, దయగల, సంతోషకరమైన వ్యక్తులుగా మారాలంటే - ఈ సాధనను చేయాలి. ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ క్రీడాకారుడు లేదా వయోలిన్ విద్వాంసుడు కావడానికి చాలా సమయం మరియు ప్రయత్నం అవసరమని మనందరికీ తెలుసు, కాబట్టి మన మానసిక వ్యాయామాలతో ఇది ఎందుకు వేరేగా ఉంటుంది? మన చుట్టూ ఎప్పుడూ మనకు కావలసినవన్నీ చేసే మరియు అంగీకరించే వ్యక్తులు ఉంటే, మనకు ఎటువంటి సమస్యలు ఉండవు.

ఈ విధంగా, మనకు కోపం తెప్పించే వ్యక్తి చాలా విలువైన వాడిగా అవుతాడు, ఇది నిజంగా మనకు సహనాన్ని అభ్యసించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది వెంటనే వచ్చే మన కోపాన్ని ఆపేస్తుంది, ఎందుకంటే ఇది వాళ్ళు మనకు ఏమి చేశారో దాని నుంచి, వాళ్ళు మన కోసం ఏమి చేస్తున్నారు అనే ఆలోచనలోకి మారుస్తుంది.

6. మరణాన్ని గుర్తుంచుకోండి: శాశ్వతం కానిది

మీరు చనిపోబోతున్నారు. నేను చనిపోబోతున్నాను. మనమందరం చనిపోబోతున్నాము. కాబట్టి ఒక వ్యక్తి మనకు నిజంగా బాధపెట్టే పని చేసినప్పుడు, ఒకసారి ఆగి ఇది ఆలోచించండి: "నేను నా శవ పేటికలో ఉన్నప్పుడు, నేను అతనిని పట్టించుకుంటానా?" అని. ఆ వ్యక్తి నిజంగా ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మనకు తెలియకపోతే, దీనికి సమాధానం "లేదు" అనే వస్తుంది. ఈ చిన్న టిప్ చాలా సులభమైనది, కానీ జీవితంలోని అనేక చికాకులను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

మనందరికీ చనిపోతామని తెలుసు, కానీ ఇది మనకు నిజంగా తెలిసిన విషయం కాదు. మరణం అనేది ఇతర వ్యక్తులకు ఎప్పుడో ఒక రోజు సంభవించే సంఘటన - వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, వింత ప్రమాదాలకు గురయ్యేవారికి కూడా. కానీ అదే నిజం కాదు. కొన్నిసార్లు వృద్ధుల కంటే ముందే యువకులు మరణిస్తారు, ఆరోగ్యవంతులు ప్రతిరోజూ అనారోగ్యంతో ఉన్నవారి ముందే మరణిస్తూ ఉంటారు.

మన భవిష్యత్తులో వచ్చే ఖచ్చితమైన మరణంపై (రేపు? ఒక సంవత్సరంలో? 50 సంవత్సరాలలో?) మనం దృష్టి పెట్టినప్పుడు, సాధారణంగా మనల్ని ఇబ్బంది పెట్టె చాలా విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. అవి ఇకపై మనల్ని ఇబ్బంది పెట్టవని కాదు, కానీ వాటిపై మన విలువైన సమయం లేదా శక్తిని వృధా చేయడంలో అర్థం లేదని మనం గుర్తిస్తాము.

7. మనం ఏదైతే చేస్తామో అదే: కర్మ

అందరూ ఇలా అంటారు, "మనం ఏదైతే ఇతరులకు చేస్తామో అదే మనకు జరుగుతుంది," అని, లేదా, "ఇది అతని కర్మ - అతనికి అలాగే జరగాలని రాసిపెట్టి ఉందిలే" అని. అంటే ప్రజలు వాళ్ళు చేసిన కర్మను తిరిగి పొందుతారు. బౌద్ధమతంలో కర్మ అనేది ఇలా ఉండదు, అది చాలా సంక్లిష్టమైనది మరియు సూక్ష్మమైనది. అయినా కానీ, ఇతరుల బాధ వారి కర్మ అని ఎత్తి చూపడానికి ప్రజలు చాలా సంతోషిస్తారు, చాలా మంది తాము కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అది వారి కర్మ నుంచే వస్తుందని వాళ్ళు అనుకుంటారు.

మనం అనుభవించే ప్రతీదీ - అత్యంత ఆనందకరమైన క్షణాల నుంచి పూర్తి నిరాశ వరకు - అన్నీ కారణాల నుంచే వస్తుంది. ఈ కారణాలు ఎక్కడి నుంచో మన ఒడిలోకి వచ్చి పడిపోవు. మనమే వాటిని సృష్టించుకుంటాము. కాబట్టి, మనకు ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, కోపాన్ని మనకు రాకుండా దాన్ని ఆపి కాసేపు ఆలోచించుకోవచ్చు: అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఇంకా నేను అధ్వానంగా చెయ్యాలనుకుంటున్నానా? అని.

కర్మ అనేది మనం ఎప్పుడూ మనకున్న పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తాము అనే దాని గురించి ఉంటుంది. కర్మ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం చేసే పనితో మన భవిష్యత్తు అనుభవాలను మార్చగల సామర్థ్యం మనకు ఉందని తెలుసుకుంటాము - ఇక్కడ అర్ధం ఏమిటంటే కోపం వచ్చినప్పుడు మనం సహనాన్ని పాటించాలి.

8. ఇది నిజం కాదు: శూన్యం

సహనం సరైన విరుగుడు అయినప్పటికీ, శూన్యం కోపానికి మాత్రమే కాదు, మన సమస్యలకు మరియు కష్టాలన్నింటికీ ఒక బలమైన విరుగుడు. నిజానికి మనం ఎంత ఓపికగా ఉన్నా కానీ, శూన్యతను అర్థం చేసుకోకపోతే భారతీయ రుతుపవనాల లాగా మనపై సమస్యలు వర్షంలా కురుస్తూనే ఉంటాయి.

మన౦ కోప౦లో ఉన్నప్పుడు మన మనస్సులను విశ్లేషి౦చుకోవడానికి ఒకసారి ఆలోచిస్తే, మన౦ ఒక విషయాన్ని గమని౦చగలుగుతా౦: "నేను" అనే ఒక బలమైన భావ౦ ఉ౦టు౦ది. "నువ్వు చెప్పిన దానికి నాకు చాలా కోపంగా వచ్చింది. నా స్నేహితుడికి అతను చేసిన పనిని నేను నమ్మలేకపోతున్నాను! నేను ఈ విషయంలో ఖచ్చితంగా ఉన్నాను తనదే తప్పు!" అని.

మనం కోపంగా ఉన్నప్పుడు, చాలా స్పష్టంగా కనిపించే ఈ "నేను" అనే దానిని విశ్లేషించడానికి మనకు సరైన అవకాశం ఉంటుంది. ఇది ఉనికిలో లేదు! మనం అసలు బతికి లేమని లేదా మనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పడం లేదు, కానీ మనం ఈ "నేను" ను కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు - ఇది మన మనస్సులో ఉందా? మన శరీరంలో ఉందా? లేదా ఈ రెండింటిలో ఉందా? - "అవును, అది ఉంది!" అని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదు.

దీనిని ప్రజలు అర్థం చేసుకోవడం కష్టం, కానీ నిజం ఏమిటంటే, మనం నిజాన్ని విశ్లేషించడం ప్రారంభించినప్పుడు, అది మన ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. అప్పుడు మనం అసలు కోపంగా ఉండటానికి ఏ విషయం లేదని తెలుసుకుంటాం.

సారాంశం

"నాకు కోపం రాదు", అని ఎన్నిసార్లు చెప్పినా కానీ, అసలు ప్రయత్నం చెయ్యకుండా, మనమందరం కోరుకునే మనశ్శాంతిని ఎప్పటికీ పొందలేము.

పైన చెప్పినవన్నీ కేవలం ఒక లిస్ట్ మాత్రమే కాదు - అవి మన నిరాశ, కోపం మరియు బాధల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ఉపయోగించే నిజమైన సాధనాలు. సాధనతో మనలో ఎవరైనా ఇలా చేయొచ్చు.

Top