మనమందరం బుద్ధులు కాగలమని బుద్ధుడు గట్టిగా చెప్పాడు, కానీ నిజానికి దీని అర్థం ఏమిటి? తమలోని లోపాలన్నింటినీ తొలగించి, వాటిని సరిదిద్ది, తమ శక్తి సామర్థ్యాలన్నీ గ్రహించిన వాడే బుద్ధుడు. ప్రతి బుద్ధుడు మనలాగే, వాస్తవికత గురించి గందరగోళం మరియు అవాస్తవ అంచనాలతో జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సాధారణ జీవులుగా ప్రారంభిస్తాడు. వారి మొండి అంచనాలు వాస్తవానికి అనుగుణంగా లేవని వాళ్ళు గ్రహించారు, మరియు వారి బాధల నుంచి విముక్తి పొందాలనే బలమైన సంకల్పం ద్వారా, వారు చివరికి వారి మనస్సులు ఊహించిన ఆలోచనలను నమ్మడం మానేశారు. వారు ఇబ్బందిపెట్టే భావోద్వేగాలను అనుభవించడం మానేసి, బలవంతంగా ప్రవర్తించారు, అలా అన్ని బాధల నుంచి తమను తాము విముక్తి చేసుకున్నారు.
వాళ్ళు ప్రేమ మరియు కరుణ వంటి సానుకూల భావోద్వేగాలను బలోపేతం చేయడానికి పనిచేశారు మరియు ఇతరులకు వీలైనంత వరకు సహాయం చేశారు. అమ్మకి తన ఒక్కగానొక్క బిడ్డ మీద ఉండే ప్రేమ లాంటి దాన్ని అందరి మీద చూపించారు. ప్రతి ఒక్కరి పట్ల బలమైన ప్రేమ, కరుణ, మరియు వాళ్లందరికీ సహాయం చేయాలనే వారి అసాధారణ సంకల్పంతో, వాస్తవికతపై వారి అవగాహన మరింత బలపడింది. అది ఎంత శక్తిమంతమైందంటే, ప్రతిదీ, ప్రతి ఒక్కరూ తమంతట తాముగా, అన్ని చెడు పనులను చెయ్యడం మానేశారు. ఏ ఆటంకం లేకుండా, ఉన్న అన్ని విషయాల యొక్క పరస్పర సంబంధాన్ని మరియు పరస్పర ఆధారపడడాన్ని వారు స్పష్టంగా చూసారు.
ఈ విజయంతో, వాళ్ళు జ్ఞానోదయాన్ని పొందారు: అలా వాళ్ళు బుద్ధులయ్యారు. వారి శరీరాలు, సంభాషణ చేయగల సామర్థ్యాలు మరియు వారి మనస్సులు అన్ని లిమిట్స్ నుంచి విముక్తి పొందాయి. తాము బోధించేది ఏదైనా ప్రతి వ్యక్తిపై అది చూపే ప్రభావాన్ని తెలుసుకొని, సాధ్యమైనంత వరకు అన్ని జీవులకు వాళ్ళు సహాయం చెయ్యగలిగారు. కానీ బుద్ధుడు కూడా సర్వ శక్తిమంతుడు కాదు. బుద్ధుడు తన సలహాలను ఓపెన్ గా స్వీకరించే మరియు దానిని సరిగ్గా పాటించే వారిపై మాత్రమే సానుకూల ప్రభావాన్ని చూపగలడు.
తను చేసింది ప్రతి ఒక్కరూ సాధించగలరని బుద్ధుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ బుద్ధుడు కాగలరు అని, ఎందుకంటే మనందరిలో "బుద్ధుని-స్వభావం" - అంటే బుద్ధత్వానికి దోహదపడే ప్రాథమిక స్వభావం ఉందని చెప్పాడు.
న్యూరోసైన్స్ న్యూరోప్లాస్టిసిటీ గురించి మాట్లాడుతుంది - ఇది మన జీవితమంతా కొత్త నాడీ మార్గాలను మార్చడానికి మరియు అభివృద్ధి చేయడానికి మెదడు యొక్క సామర్థ్యం గురించి వివరిస్తుంది. ఉదాహరణకు, మన కుడి చేతిని నియంత్రించే మెదడులోని భాగం చచ్చు పడిపోతే, ఫిజియోథెరపీ శిక్షణతో ఆ మెదడు భాగంలో కొత్త నాడీ మార్గాలను అభివృద్ధి చేస్తుంది. ఇది మన ఎడమ చేతిని ఉపయోగించడానికి సహకరిస్తుంది. కరుణ వంటి ధ్యానం కూడా కొత్త నాడీ మార్గాలను సృష్టించగలదని ఇటీవలి అధ్యయనాలు నిరూపించాయి. ఇది మరింత ఆనందం మరియు మనశ్శాంతిని అందిస్తుంది. కాబట్టి మనం మెదడు యొక్క న్యూరోప్లాస్టిసిటీ గురించి మాట్లాడినప్పుడు, మనస్సు యొక్క ప్లాస్టిసిటీ గురించి కూడా చర్చించవచ్చు. మన మనస్సులు, మరియు మన వ్యక్తిత్వ లక్షణాలు స్థిరంగా ఉండవు. కొత్త సానుకూల మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రేరేపించబడతాయి అనే నిజం మనం జ్ఞానవంతమైన బుద్ధులుగా మారడానికి సహాయపడే అత్యంత ముఖ్యమైన విషయం.
శారీరక స్థాయిలో, మనం నిర్మాణాత్మకంగా ఏదైనా చేసినప్పుడు, చెప్పినప్పుడు లేదా ఆలోచించినప్పుడు, మనం మన సానుకూల నాడీ మార్గాన్ని బలోపేతం చేసి సులభంగా అదే పనిని మళ్ళీ చేసే లాగా చేసుకుంటాము. మానసిక స్థాయిలో, ఇది సానుకూల శక్తిని మరియు సామర్థ్యాన్ని పెంచుతుందని బౌద్ధమతం చెబుతుంది. అటువంటి సానుకూల శక్తి యొక్క నెట్ వర్క్ ని మనం ఎంత బలపరుస్తామో, అది అంతకంటే బలంగా మారుతుంది. బుద్ధునిగా సమస్త జీవరాశులకు సంపూర్ణంగా సహాయం చేయగల సామర్థ్యాన్ని నిర్దేశించే సానుకూల శక్తి, విశ్వవ్యాప్తంగా సహాయపడే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది.
అదే విధంగా, వాస్తవికత యొక్క మన తప్పు అంచనాలకు అనుగుణంగా అసత్యమైన వాటిపై మనం ఎంత ఎక్కువగా దృష్టి పెడితే, మన నాడీ మార్గాలను మనం అంత బలహీన పరుస్తాము, ముందుగా ఈ మానసిక అసంబద్ధతను నమ్మి ఆ తర్వాత దానిని ప్రదర్శిస్తాము. చివరికి, మన మనస్సు ఈ భ్రమ కలిగించే నాడీ మరియు మానసిక మార్గాల నుంచి విముక్తి పొంది వాటిపై ఆధారపడిన ఆందోళన కలిగించే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తనా నమూనాల మార్గాల నుంచి స్వేచ్ఛను పొందుతుంది. దానికి బదులుగా, మనం వాస్తవికత గురించి బలమైన మార్గాలను అభివృద్ధి చేసుకుంటాము. ప్రతి పరిమిత జీవికి ఎలా సహాయం చేయాలో బాగా తెలిసిన బుద్ధుని సర్వజ్ఞ మనస్సును లక్ష్యంగా చేసుకుని, లోతైన అవగాహన యొక్క ఈ నెట్‌వర్క్ బుద్ధుని మనస్సును సాధించడానికి వీలు కల్పించేలా చేసుకుంటాము.
మనందరికీ శరీరం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి సౌకర్యాలు - ప్రధానంగా మాట్లాడే అవకాశం - మరియు మనస్సు కూడా ఉంది కాబట్టి, బుద్ధునికి ఉన్న వాటిని కూడా మనం పొందే అవకాశం ఉంది. ఈ మూడూ కూడా బుద్ధ స్వభావ విషయాలే. మనమందరం కొన్ని మంచి లక్షణాలను కలిగి ఉన్నాము. సొంత-రక్షణ కోసం మన జాగ్రత్తలు, జాతుల సంరక్షణ, మన అమ్మ మరియు నాన్న గురించి పట్టించుకునే అలవాట్లు మొదలైనవి - అలాగే ఇతరులను పట్టించుకునే మరియు ప్రభావితం చేసే సామర్ధ్యాలు కూడా. ఇవి కూడా బుద్ధ-స్వభావపు విషయాలే; అవి అపరిమితమైన ప్రేమ, సంరక్షణ మరియు బుద్ధుని జ్ఞానోదయ పనుల వంటి మంచి లక్షణాలను పెంపొందించడానికి మంచి ఉదాహరణలు.
మన మనస్సులు ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకున్నప్పుడు బుద్ధ-స్వభావపు విషయాలను కనుగొంటాము. మనమందరం సమాచారాన్ని తీసుకోగలుగుతాము, కొంత నాణ్యతను పంచుకునే విషయాలను ఒకచోట చేర్చి, వస్తువుల గురించి తెలుసుకుని, మనం గ్రహించే దానికి ప్రతిస్పందించి వాటి గురించి తెలుసుకోగలుగుతాము. మన మానసిక వ్యవస్థ పనిచేసే ఈ మార్గాలు ఇప్పుడు పరిమితం, కానీ అవి కూడా బుద్ధుని లాంటి మనస్సును సాధించడానికి పని చేసేవే, అక్కడ అవి ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి.
సారాంశం
బుద్ధుడిగా అవ్వడానికి మనందరికీ పని చెయ్యగలిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ, మనం జ్ఞానోదయం పొందడానికి ముందు ఇది ప్రేరణ మరియు నిరంతర కృషికి సంబంధించిన ఒక విషయం మాత్రమే. ప్రోగ్రెస్ ఎప్పుడూ ఒకేలా ఉండదు: కొన్ని రోజులు మంచిగా మరియు కొన్ని రోజులు అధ్వాన్నంగా ఉంటాయి; బుద్ధత్వానికి మార్గం సుదీర్ఘమైనది మరియు అది సులభంగా ఉండదు. కానీ మన బుద్ధ-స్వభావపు విషయాలను ఎంత ఎక్కువగా గుర్తు చేసుకుంటే, అంత నిరుత్సాహ పడకుండా ఉంటాము. మనలో సహజంగానే తప్పేమీ లేదని గుర్తుంచుకోవాలి. బలమైన మంచి ప్రేరణ, కరుణ మరియు జ్ఞానాన్ని నైపుణ్యంతో కలుపుకుని వాస్తవిక పద్ధతులను అనుసరించడం ద్వారా మనం అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు.