What is karma raimond klavins unsplash

కర్మ అనేది మానసిక ప్రేరణలను సూచిస్తుంది - మన మునుపటి ప్రవర్తన ఆధారంగా - ఇది మనల్ని పనిచేయడానికి, మాట్లాడటానికి మరియు ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. మన అలవాట్లు మన మెదడులో నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి, అవి సరైన పరిస్థితుల ద్వారా ప్రేరేపించబడినప్పుడు, మన సాధారణ ప్రవర్తనా విధానాలను మళ్ళీ అలాగే జరిగేలా చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే మనకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఆ తర్వాత మనం ఆ పనినే తప్పనిసరిగా చేస్తాం.

కర్మను మనం తరచుగా విధి లేదా ముందస్తు అంచనాగా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎవరైనా గాయపడినప్పుడు లేదా చాలా డబ్బు కోల్పోయినప్పుడు, అందరూ ఇలా అంటారు "సరేలే, వాడి అదృష్టం బాలేదు, ఇది వాడి కర్మ" అని. ఇది దేవుని చిత్తం యొక్క ఆలోచనతో సమానం - దీనిని మనం అర్థం చేసుకోలేము లేదా నియంత్రించలేము. అది బౌద్ధమత కర్మ భావన అస్సలు కాదు. కర్మ అనేది మానసిక ప్రేరణలను సూచిస్తుంది, ఇది ఎవరైనా మనలను బాధపెట్టినప్పుడు వారిపై అరవడానికి లేదా సమస్యను పరిష్కరించడానికి తగినంత ప్రశాంతంగా ఉండే వరకు ఓపికగా వేచి ఉండటానికి కారణమవుతుంది. ఇది మనం అలవాటుగా మెట్లు దిగేటప్పుడు మన మడాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా నడవడానికి దారితీసే ప్రేరణలను కూడా సూచిస్తుంది.

కర్మ అనేది ఎలా పనిచేస్తుందో ఒక మంచి ఉదాహరణ నుంచి తెలుసుకుందాం. అదే ధూమపానం, ఎందుకంటే మనం ఒక సిగరెట్ తాగినప్పుడల్లా, అది ఇంకొక సిగరెట్ తాగేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మనం ఇంకా ఎక్కువగా సిగరెట్లు తాగితే, అసలు ఆలోచించకుండానే, కర్మ ప్రేరణలు మనల్ని బలవంతంగా అసలు నష్టం తెలిసే వరకు ఈ ధూమపానం చేసే ధోరణి ఇంకా బలంగా మారుస్తుంది. ధూమపానం చేయాలనే భావన మరియు ప్రేరణ ఎక్కడ నుండి వస్తుందో కర్మ వివరిస్తుంది - అంటే, ఇంతకు ముందు ఉన్న అలవాటు నుంచి. ధూమపానం మళ్ళీ మళ్ళీ చెయ్యాలనే ప్రేరణను సృష్టించడమే కాకుండా, ధూమపానం నుంచి క్యాన్సర్ రావడానికి శరీరంలోని శారీరక విషయాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ, ప్రేరణ మరియు క్యాన్సర్ రావడం రెండూ మనం ఇంతకుముందు చేసిన పనుల ఫలితమే. వీటిని "కర్మ యొక్క అభివృద్ధి" అని పిలుస్తారు.

మన అలవాట్లను మార్చుకోవడం

కర్మ అర్ధవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన భావాలు మరియు ప్రేరణలు ఎక్కడ నుండి వస్తాయో మరియు కొన్నిసార్లు మనం ఎందుకు సంతోషంగా మరియు కొన్నిసార్లు మనం ఎందుకు అసంతృప్తిగా ఉంటామో వివరిస్తుంది. ఇవన్నీ మన ప్రవర్తనా విధానాల నుంచి వస్తాయి. అందుకని, మనం ఏమి చేస్తాము మరియు మనకు ఏమి జరుగుతుంది అనేది ముందుగా నిర్ణయించబడదు. విధి లాంటిది ఏదీ ఉండదు.

"కర్మ" అనేది ఒక ఉత్తేజమైన శక్తి యొక్క అర్ధం, ఇది మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని సూచిస్తుంది. - 14వ దలైలామా

మన అలవాట్లకు మనం బానిసలం అని అనిపించినా మనకు అలవాటైన ప్రవర్తన బాగా స్థాపించబడిన నాడీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. బౌద్ధమతం దీనిని అధిగమించడం సాధ్యమే అని చెబుతుంది. మన జీవితమంతా సరికొత్త నాడీ వ్యవస్థను మార్చి రూపొందించే సామర్థ్యం మనకు ఉంది.

ఏదైనా చేయాలనే భావన మన మనస్సులోకి వచ్చినప్పుడు, కర్మ ప్రేరణ మనల్ని పనిచేయడానికి ప్రేరేపించడానికి ముందు కాస్త సమయం తీసుకుంటుంది. ఏ ఫీలింగ్ వచ్చినా మనం వెంటనే స్పందించం - మనకి మనమే టాయిలెట్ ట్రైనింగ్ ను నేర్చుకున్నాం! అదే విధంగా, ఏదైనా బాధ కలిగించే విషయం చెప్పాలనే భావన వచ్చినప్పుడు, "నేను ఇలా అనాలా వద్దా?" అని మనం ఆలోచిస్తాం. ఒకరిని తిట్టి మన చికాకును చూపించినప్పుడు మనకు క్షణిక ఆనందం కలగచ్చు, కానీ ఇతరులను తిట్టడం అలవాటు చేసుకోవడం ఒక చెడు మానసిక అలవాటుగా మారుతుంది. మాట్లాడి గొడవలను పరిష్కరించుకోవడం చాలా సంతోషకరమైన, మరింత శాంతియుత పని అని మనందరికీ తెలుసు. సంబంధాలు పెంచుకోవడం మరియు గొడవలు పెట్టుకోవడం మధ్య వివక్ష చూపే ఈ సామర్థ్యం నిజంగా మానవులను జంతువుల నుంచి వేరు చేస్తుంది - ఇది మనకున్న గొప్ప ప్రయోజనం.

నష్టం కలిగించే పనులకు ఎప్పుడూ దూరంగా ఉండాలని అనుకోవడం సులభం కాదు. వచ్చే భావాలను గుర్తుంచుకోవడానికి మన తలలో తగినంత స్థలం ఉన్నప్పుడు ఇది సులభం అవుతుంది, అందుకే బౌద్ధ శిక్షణ మనకు బుద్ధిపూర్వకతను పెంపొందించడానికి ప్రోత్సహిస్తుంది. మనం నెమ్మదిగా ఉంటే, మనం ఏమి ఆలోచిస్తున్నాము మరియు ఏమి చెప్పబోతున్నాము లేదా ఏమి చేయబోతున్నాము అనే దాని గురించి మనకు మరింత అవగాహన ఉంటుంది. మనం ఇలా ఆలోచించడం ప్రారంభిస్తాము, "నేను ఒకరిని బాధపెట్టే విధంగా ఏదో చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అలా అంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను అలా అనను." ఈ విధంగా, మనం ఆలోచించవచ్చు. మనం జాగ్రత్తగా లేనప్పుడు, సాధారణంగా ఆలోచనలు మరియు భావాల యొక్క హడావిడి ఉంటుంది, మనకు ఏ ఆలోచన వస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవుతాము, దీనివల్ల మనకు కష్టాలు ఇక ఆగవు.

మీ భవిష్యత్తును అంచనా వెయ్యండి

మన మునుపటి మరియు ప్రస్తుత కర్మ ఆధారంగా భవిష్యత్తులో మనం ఏమి అనుభవించగలమో అంచనా వేయవచ్చు. దీర్ఘకాలికంగా, మనం చేసిన మంచి పనులు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి, చేసిన చెడు పనులు ఇబ్బందులను కలిగిస్తాయి.

ఒక నిర్దిష్ట కర్మ యొక్క ఫలితం అనేది అనేక అంశాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక బంతిని గాల్లోకి విసిరినప్పుడు, అది నేలపై పడుతుందని మనం ఊహించవచ్చు. కానీ, మనం ఆ బంతిని పట్టుకుంటే, అది కింద పడదు. అదే విధంగా, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మునుపటి చర్యల నుంచి మనం అంచనా వేయగలిగినప్పటికీ, అది రాతిలో చెక్కబడినదిగా ఉండదు. ఇతర ఆలోచనలు, పనులు మరియు పరిస్థితులు కర్మను ప్రభావితం చేస్తాయి. మనం స్థూలకాయంతో బాధపడుతూ, అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తింటుంటే భవిష్యత్తులో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేయవచ్చు, కానీ కఠినమైన డైట్ పాటిస్తూ బరువు తగ్గితే అసలు ఎలాంటి అనారోగ్యం మనకు రాదు.

మన కాలుకి దెబ్బ తగిలినప్పుడు, ఆ నొప్పిని అనుభవించడానికి కర్మ లేదా కారణం మరియు ప్రభావాన్ని నమ్మాల్సిన అవసరం లేదు - ఇది సహజంగానే తెలుస్తుంది. మన అలవాట్లను మార్చుకుని, మంచి వాటిని అలవరచుకుంటే, మన నమ్మకాలతో సంబంధం లేకుండా దాని ఫలితం పాజిటివ్ గా ఉంటుంది.

Top