లామ్-రిమ్ అభ్యాసం కోసం ధ్యాన సలహా

మనం బుద్ధుని బోధనలను ఆచరణలో పెట్టాలనుకుంటే ధ్యానం అనేది ఒక ముఖ్యమైన అంశం. అయితే, ధ్యానం అనేది ప్రత్యేకించి బౌద్ధ మతానికి సంబంధించినదే కాదు. ఇది అన్ని భారతీయ సంప్రదాయాలలో, అలాగే భారతదేశం బయట బౌద్ధేతర వ్యవస్థలలో కూడా కనిపిస్తుంది.

సంస్కృతంలో ధ్యానానికి పదం "భావన" అని అర్ధం ఉంటుంది. భావన అనేది "భు" అనే క్రియ నుంచి వచ్చింది, దీని అర్థం "మారడం", లేదా "ఒక దానిని వేరొకదానిగా మార్చడం" అని. కాబట్టి, భావన అనేది ఒక నిర్మాణాత్మక మానసిక స్థితిని ఎలా పెంపొందించుకోవాలో బోధించే ఒక ప్రక్రియ, మరియు మనం ఆ స్థితిలోకి "మారుతాము". మరో మాటలో చెప్పాలంటే, ధ్యాన ప్రక్రియ ద్వారా, మన మనస్సులను ఒక నిర్దిష్ట ప్రయోజనకరమైన స్థితిలోకి తీసుకువస్తాము.

భావన సంస్కృత మూలం "భు" నుంచి వచ్చింది కాబట్టి, "మారడం" అనే పదం నుంచి వచ్చింది కాబట్టి, భావన మార్పుని సూచిస్తుంది. ఉదాహరణకు, మనం ప్రేమ గురించి ధ్యానిస్తుంటే, మన హృదయాలలో ప్రేమ ఉన్న వ్యక్తిగా మనల్ని మనం మార్చుకుంటాము. ఈ పదాన్ని సంస్కృతం నుంచి టిబెటన్ భాషలోకి అనువదించినప్పుడు, అది "ఒక అలవాటును పెంపొందించుకోవడం" అనే పదంతో అనువదించబడింది. ఇది టిబెటన్ పదం "గోమ్". గోమ్ అంటే పాజిటివ్ విషయానికి అలవాటు పడడం - నెగెటివ్ లేదా న్యూట్రల్ దానికి కాదు - అలా ఒక పాజిటివ్, నిర్మాణాత్మక అలవాటును నిర్మించుకోవడం.

కాబట్టి, టిబెటన్ పదం సంస్కృత పదానికి అర్థంతో చాలా పోలికను కలిగి ఉంటుంది. ఈ రెండు పదాలు మనల్ని మన లక్ష్యాలుగా మార్చడానికి - అంటే మన హృదయాలలో ప్రేమ ఉన్న వ్యక్తిగా మార్చడానికి సూచిస్తాయి. ఉదాహరణకు - మనం ప్రేమను ఒక ప్రయోజనకరమైన అలవాటుగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తాయి. ఈ ప్రయోజనకరమైన అలవాటును పెంపొందించుకోవడానికి మనం ఉపయోగించే పద్ధతి ధ్యానం.

బోధనలను వినడం

బుద్ధుని కాలానికి ముందు ఉన్న ప్రధాన భారతీయ తాత్విక గ్రంథాలు ఉపనిషత్తులు, మరియు ఈ గ్రంథాలలో అప్పటికే ధ్యానానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఉపనిషత్తులలో, ధ్యానం అనేది మూడు దశల ప్రక్రియగా చర్చించబడింది: వినడం, ఆలోచించడం మరియు ధ్యానం చెయ్యడం లాగా. బుద్ధుడు ఈ మూడు దశల ప్రక్రియను కనిపెట్టలేదు; ఇది అతని కాలంలో అప్పటికే ఉంది. కాబట్టి, మనం ఏదైనా పాజిటివ్ అలవాటు చేసుకోవాలనుకుంటే, మనం ముందుగా దాని గురించి వినాలి; అప్పుడు మనం దాన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలి; చివరిగా, మనం దాన్ని మనలో విలీనం చేసుకోవాలి.

ధర్మం గురించి మనకు ఏమీ తెలియకపోతే, ముందుగా మనం బౌద్ధమతం గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి మరియు ఇది సరైనదా కాదా అని నిర్ధారించుకోవాలి. సరైన ప్రాథమిక సమాచారం మాత్రమే నిజమైన ధర్మబోధలపై ఆసక్తి చూపడానికి నమ్మదగిన పునాదిగా ఉపయోగపడుతుంది. అయితే బుద్ధుని కాలంలో తాత్విక బోధనలు ఎప్పుడూ రాయబడలేదు. వాటిని లిఖిత గ్రంథాలుగా సంకలనం చెయ్యడం శతాబ్దాల తర్వాత ప్రారంభమైంది. అందుకే మూడు దశల ప్రక్రియ బోధనను "వినడంతో” ప్రారంభమవుతుంది - మరో మాటలో చెప్పాలంటే, బోధించే బోధనను చెవులతో వినడం.

ఈ రోజు, మీరు పుస్తకాలు చదవడం లేదా ఇంటర్నెట్ లో మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్న అన్ని రకాల అభ్యాసాలు లేదా మానసిక స్థితుల గురించి కూడా చెప్పవచ్చు. అయితే, ఈ విషయం చర్చనీయాంశం ఎందుకంటే, ఒక ఉపాధ్యాయుడి నుంచి నేరుగా బోధన విన్నప్పుడు, ఆ ఉపాధ్యాయుడు మన ముందు ఉండటం వలన ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక బోధనను లైవ్ లో విన్నప్పుడు, ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా మనం ప్రేరణ పొందని విధంగా టీచర్ నుంచి ప్రేరణను పొందవచ్చు. ఎవరో ఒకరు పుస్తకం రాయాల్సి వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇది మన జీవితంలో కూడా నిజం అని మనం కనిపెడతాము. ఉదాహరణకు, మీరు ఒక లైవ్ కాన్సర్ట్ కు వెళ్ళినప్పుడు, మీరు ఇంట్లో ఉండి సిడి నుంచి వినడం కంటే ఆ అనుభవం చాలా శక్తివంతంగా మరియు స్ఫూర్తిదాయకమైనదిగా ఉంటుంది. ఇది చాలా విభిన్న అనుభూతి.

మన౦ బోధనలను విన్నప్పుడు, "మట్టి కుండీలా ఉన్న మూడు దోషాలను" తొలగి౦చడ౦ అనేది చాలా ఉపయోగకరమైన సూచనల్లో ఒకటి.

  • ముందుగా, తలకిందులైన కుండీలా ఉన్న పొరపాటును మనం పోగొట్టుకోవాలి, దీనిలోకి ఏమీ వెళ్ళదు. మరో మాటలో చెప్పాలంటే, మన మనస్సులు మూసుకుపోతే, మనం విన్న దాని నుంచి మనం ఏమీ నేర్చుకోలేము.
  • తర్వాత, మనం అడుగు భాగంలో రంధ్రం ఉన్న కుండీలా ఉండే పొరపాటును కూడా పోగొట్టుకోవాలి. అలా ఉంటే, పోసిన ప్రతీదీ ఆ రంధ్రం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆంగ్లంలో, ఇది "ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి వదలడం లాంటిది" అని చెప్పబడుతుంది. మనం దాన్ని నివారించాల్సి ఉంటుంది. 
  • చివరిగా, ఒక మురికి కుండీలా ఉండే తప్పును కూడా మనం నివారించాలి. మీరు ఒక మురికి కుండీలో శుభ్రమైన నీటిని పోసినప్పుడు, ఆ నీళ్ళు కూడా మురికిగా మారిపోతాయి. మరో మాటలో చెప్పాలంటే, మనకు అనేక ముందస్తు ఆలోచనలు ఉన్నప్పుడు, ఈ ముందస్తు ఆలోచనలు క్రొత్త విషయాల గురించి మన అవగాహనను పాడు చేస్తాయి. ఆ వ్యక్తి చెప్పేది వినడానికి బదులుగా, మనం ఎప్పుడూ ఆ కొత్త విషయాలకు మన ఆలోచనలను కలిపి ఆలోచిస్తాము.

ఈ పొరపాట్లు చెయ్యకుండా ఉండడానికి, మనం కొన్ని బోధనలను విన్న తర్వాత, వాటిని రాయడం లేదా ఏదో ఒక విధంగా రికార్డ్ చెయ్యడం లాంటివి చెయ్యాలి, అలా మనం విన్న విషయాలను సరిగ్గా గుర్తుంచుకోగలుగుతాము. మనకు పరిపూర్ణ జ్ఞాపకాలు లేకపోతే ఇది చాలా సహాయపడుతుంది - మనలో చాలా మందికి ఇది ఉండదు. మనం విన్న విషయాలను రాయడానికి ఎంత ఎక్కువసేపు వెయిట్ చేస్తే, మన లోపల ఉండే ఆలోచనలు మన జ్ఞాపకాలను అంతగా కలుషితం చేస్తాయి. వాటిని మనం రాసుకున్నా, లేదా రికార్డ్ చేసుకున్నా వాటిని పదే పదే వినాలి. మన షెల్ఫ్ లో నోట్స్ బుక్ లేదా మన కంప్యూటర్లలో ఫైల్స్ లేదా మన ఐపాడ్ లలో ఫైల్ లాగా బోధనలు ఉంటే సరిపోదు!

ధర్మ సాధనలోకి ప్రవేశించడానికి శాక్య గురువు సోనమ్ సెమో గారు ఇలా అన్నారు:

  • ముందుగా మనకు సమస్యలు ఉన్నాయని, మరియు మనం బాధ పడుతున్నామని గుర్తించాలి.
  • అప్పుడు మన బాధ పరిస్థితి ను౦చి బయటపడాలనే కోరిక మనకు ఉ౦డాలి.
  • చివరిగా, ఆ బాధల నుంచి బయటపడటానికి ఒక మార్గంగా ధర్మం పట్ల మనం ఆసక్తిని చూపాలి.

మనం కొత్త వాళ్ళము అయినప్పుడు, మనం ఖచ్చితంగా ఓపెన్ మైండ్ ను కలిగి ఉండాలి మరియు మనం నేర్చుకున్నదాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి; కానీ అన్నిటికంటే ముఖ్యంగా, మనం వింటున్న దాన్ని ఎవాల్యూయేట్ చెయ్యాలనే ఆసక్తి మరియు ఉద్దేశ్యంతో ఒక ధర్మ బోధనను వినాలి. మనం వినే బోధనను ఆచరణలో పెడితే సమస్యలను అధిగమించడానికి వ్యక్తిగతంగా మనకు సహాయపడే విషయమో కాదో తెలుసుకోవడానికి మనం దాన్ని ఎవాల్యూయేట్ చెయ్యాలని అనుకుంటాము. పాఠశాల పరీక్షలో పాస్ అవ్వడానికి లేదా మన పాండిత్య జ్ఞానంతో ఇతరులను ఆకట్టుకోవడానికి మనం బౌద్ధమత బోధనలను నేర్చుకోవడం లేదు. మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడేవి ఏవైనా దొరుకుతాయా లేదా అని తెలుసుకోవడానికి మనం ఆ బోధనలను వింటున్నాం.

బోధనలు వినేటప్పుడు, మనల్ని, మరియు మన పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. "మూడు గుర్తింపులు" అని పిలువబడే ఈ పద్ధతిలో, మనల్ని మనం రోగిగా, ఉపాధ్యాయుడిని వైద్యుడిగా మరియు బోధనలను వివిధ అనారోగ్యాలు లేదా సమస్యలను అధిగమించడంలో మనకు సహాయపడే మందులుగా భావిస్తాము - అనారోగ్యాలు మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు అని మనం అనుకుంటాము.

మన అభ్యాసంలో పురోగతి సాధిస్తున్న కొద్దీ, గురువును బుద్ధునిగా చూడటం లాంటి విషయాల్లో గురువు పట్ల మనకు అవసరమైన ఆలోచనా విధానాల గురించి ఇంకా అనేక సూచనలు ఉన్నాయి; కానీ ఆ సూచనలు ప్రారంభకులకు ఉద్దేశించబడినవి కావు.

మనం విన్న దాని గురించి ఆలోచించడం

రెండవ స్టెప్ మనం విన్న దాని గురించి ఆలోచించడం. బోధనను అర్థం చేసుకోవడానికి మనం దాని గురించి ఆలోచిస్తాం. బోధన అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ ఆలోచనా ప్రక్రియ యొక్క ముగింపు దశకు చేరుకుంటాము. బోధనను ఆచరణలో పెట్టడానికి మనం సరిగ్గా అర్థం చేసుకోవడమే కాదు, ఆ బోధన సరైనదే అని, అది మనలో మనం అవలంబించాల్సిన విషయం అని కూడా మనం నమ్మాలి, ఎందుకంటే అది మనకు ఉన్న కొన్ని సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఆ బోధనలో ఏది నేర్పితే దాన్ని మనం సాధించగలమనే నమ్మకం కూడా మనకు ఉండాలి. అది అసాధ్యం అని మనం అనుకుంటే – ఉదాహరణకు – కోపాన్ని జయించడానికి ఉద్దేశించిన అభ్యాసాన్ని అనుసరించడంలో అర్థం ఏమిటి? ఆ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడానికి ఈ అభ్యాసం పనిచేస్తుందని మనం నమ్మాలి.

ఒక బోధన గురించి మనం ఆలోచించినప్పుడు, దాని గురించి అనేక కోణాల నుంచి మనం ఆలోచిస్తాము. ఉదాహరణకు, మనం ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు, అందరి పట్ల సమానంగా ప్రేమను పెంపొందించడానికి మనం పాటించాల్సిన వివిధ దశలను తెలుసుకోవాలి. ఉదాహరణకు, అందరికీ సమానమైన ప్రేమ దేనిపై ఆధారపడి ఉంటుంది? అని. అది అందరిని సమానంగా చూడటం, అందరూ మన పట్ల దయ చూపారని తెలుసుకోవడం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మన మనస్సులో విశ్వజనీనమైన ప్రేమ అభివృద్ధి చెందాలంటే, ప్రేమ దేనిపై ఆధారపడి ఉంటుందో, మనలో ప్రేమ పెరగడానికి మనం ముందుగానే ఎటువంటి అంతర్దృష్టులను మరియు మానసిక స్థితిని అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోవాలి.

దీనికి తోడు, ప్రేమకు వ్యతిరేక కారణాలు ఏమిటో తెలుసుకోవాలి అదే ప్రేమకు పరిష్కారమవుతుంది. ముఖ్యంగా, వ్యతిరేక కారణాలు కోపం మరియు ద్వేషం అని మనం నమ్మాలి; మరియు ప్రేమ నిజానికి ఆ కారణాలను అధిగమించగలదని మరియు వాటిని వదిలించుకోగలదని మనం నమ్మాలి. ప్రేమ దాన్ని ఎలా వదిలించుకుంటుందో కూడా మనం అర్థం చేసుకోవాలి.

ఇంకా, ప్రేమను పెంపొందించుకోవడం యొక్క ఉద్దేశ్యం ఏమిటో మరియు ఈ ప్రేమను అభివృద్ధి చేసుకున్న తర్వాత మనం దానితో ఏమి చెయ్యబోతున్నామో తెలుసుకోవాలి, అంటే ప్రేమను అభివృద్ధి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం. ఉదాహరణకు, బోధిచిత్త లక్ష్యాన్ని అభివృద్ధి చెయ్యడంపై సూచనలు ఇచ్చే అనేక గ్రంథాలను చూసినప్పుడు - పరిమిత జీవులందరికి ప్రయోజనం చేకూర్చడానికి మన స్వంత, వ్యక్తిగత భవిష్యత్తు జ్ఞానోదయాలను సాధించాలనే లక్ష్యం - బోధిచిత్త లక్ష్యాన్ని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలతో ప్రారంభమవుతాయి. జీవితంలో అటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండటం మనం అభివృద్ధి చేసుకోవాలనుకునే విషయం అని నమ్మడమే ఈ విధంగా ప్రారంభమయ్యే గ్రంథాల ఉద్దేశ్యం.

చివరిగా, బోధనల యొక్క లాజిక్ ని మనం నమ్మాలి. అవి లాజికల్ గా ఉండాలి. అవి సహేతుకంగా ఉండాలి, మరియు అవి దశలు మరియు బోధనల యొక్క అసలైన వివరాల పరంగా అర్థవంతంగా ఉండాలి.

కాబట్టి, మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ముందుగా దేన్ని అభివృద్ధి చేసుకోవాలో, అది మనల్ని ఆ సమస్యాత్మక మానసిక స్థితి నుంచి ఎలా రక్షిస్తుందో, మనం గమనించాల్సిన వ్యతిరేక కారణాలు ఏమిటో అర్థం చేసుకోకుండా ధ్యాన సాధనలోకి దూకడం అవివేకం. దానికి పోలిక ఏమిటంటే: "వినడం మీ నోటిలో ఆహారాన్ని ఉంచడం లాంటిది; మరియు దాని గురించి ఆలోచించడం దాన్ని నమలడం లాంటిది." నమలకుండా మింగడానికి ప్రయత్నిస్తే, మనకు ఊపిరి సరిగ్గా ఆడదు. అదే విధంగా బోధనల గురించి ఆలోచించకుండా ధ్యానం చెయ్యడానికి ప్రయత్నిస్తే మనకు ఇబ్బందులు తప్పవు.

మనం ఆలోచనా ప్రక్రియను ఎలా పూర్తి చెయ్యాలి? ఆలోచనా దశ అనేది నేను చెప్పిన వివిధ అంశాల గురించి స్వేచ్ఛా-శైలి ఆలోచనా విధానం కావచ్చు, లేదా మనం అలా చేసిన తర్వాత, ఇది ఇంకా అధికారిక ప్రక్రియ కావచ్చు.

అధికారిక ఆలోచనా విధానం

అధికారిక ఆలోచనా విధానం అంటే రీజనింగ్ లైన్ ని ఫాలో అవ్వడం. మనం ఒక నిర్దిష్ట మానసిక స్థితిని పెంపొందించుకోవాలని అనుకున్నప్పుడు, దానికి అనుగుణంగా చెయ్యాలి. దశలు లేదా స్టెప్స్ ద్వారా వెళ్ళి మనం ఆ మానసిక స్థితిని నిర్మించుకోవాలి, మరియు ఆ స్టెప్స్ లలో తార్కిక మార్గాలతో పని చెయ్యడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు, బోధనలో అశాశ్వతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే తార్కిక మార్గం ఉండవచ్చు (కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమైన విషయాలు ఎప్పటికప్పుడూ మారుతూ ముగింపుకి వస్తాయి); లేదా శూన్యతను అర్థం చేసుకోవడానికి (ప్రతిదీ అసాధ్యమైన మార్గాల్లో ఉనికిలో ఉండదు) నిర్మించే తార్కిక మార్గాన్ని కలిగి ఉండవచ్చు. తార్కిక లైన్ ల లాజిక్ గురించి ఆలోచించి, పని చెయ్యడం ద్వారా, అశాశ్వతం, శూన్యత వాలిడ్ అవుతాయని మనం నమ్మడమే కాకుండా, తార్కిక మార్గాలు అశాశ్వతం మరియు శూన్యత నిజమని రుజువు చేస్తాయి. అంతే కాకుండా, తార్కిక మార్గాల లాజిక్ ని చదవడం ద్వారా, అశాశ్వతం మరియు శూన్యత గురించి సరైన మరియు నిర్ణయాత్మక అవగాహనను తెలుసుకోగలమని మనం నమ్ముతాము. గుర్తుంచుకోండి: నమ్మకం పొందడం అనేది ఆలోచనా ప్రక్రియలో ఒక భాగం.

ఇలా కాకుండా, మనం ఒక నిర్దిష్ట మానసిక స్థితిని నిర్మించుకోవచ్చు, తప్పనిసరిగా తార్కిక మార్గం ద్వారా కాదు, స్టేజ్ ల ద్వారా. ఉదాహరణకు, మనం ఒక బోధిచిత్త లక్ష్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటే, సమతౌల్యాన్ని పెంపొందించుకోవడం, ఆ తర్వాత ప్రతి ఒక్కరినీ మునుపటి జన్మలో మన తల్లులుగా చూడటం, మాతృ ప్రేమ యొక్క దయను స్మరించుకోవడం, దానికి కృతజ్ఞతను పెంపొందించుకోవడం లాంటి ప్రక్రియలను మనం దాటుతాము. ఈ పనులు చెయ్యడం ద్వారా బోధిచిత్త లక్ష్యాన్ని చేరుకోగలమనే నమ్మకాన్ని కలిగించేలా దశల వారీగా పనిచేస్తాం. ఇది ఇప్పటికీ ఆలోచనా ప్రక్రియలో ఒక భాగమే.

అలాగే, ఈ ఆలోచనా ప్రక్రియలో, మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్న మానసిక స్థితి ఏమిటో మనం బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని ధ్యానాలు ఒక నిర్దిష్ట వస్తువుపై దృష్టి పెట్టడం కోసం ఉద్దేశించబడ్డాయి, ఉదాహరణకు, ఒక విజువలైజ్ చెయ్యబడిన బుద్ధుడు. ఒక విజువలైజ్ చెయ్యబడిన బుద్ధుడిని ధ్యానించడానికి, ఇది ధ్యానం యొక్క కేంద్రీకరణ రకం అని మనం అర్థం చేసుకోవాలి మరియు దాని లక్ష్యం ఒక నిర్దిష్ట వస్తువుపై దృష్టి పెట్టడం, అంటే కాంతితో తయారైన చిన్న, త్రీ-డైమెన్షనల్, సజీవ బుద్ధుడు మన కంటి ముందు ఊహించుకోవడం.

మరోవైపు, ఒక నిర్దిష్ట మానసిక స్థితిని పెంపొందించడానికి ఉద్దేశించిన వివిధ రకాల ధ్యానాలు ఉన్నాయి, ఉదాహరణకు, ప్రేమ. ప్రేమ అనేది మనం దృష్టి పెట్టే వస్తువు కాదు; దానికి బదులుగా ఇది ఒక రకమైన మానసిక స్థితి, ఇది మనం అభివృద్ధి చేసే ఒక రకమైన మానసిక వైఖరి. కాబట్టి, మనం ఏ రకమైన ధ్యానంతో పనిచేస్తున్నామో తెలుసుకోవాలి: మనం ఒక నిర్దిష్ట వస్తువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నామా? ఒక నిర్దిష్ట మానసిక స్థితిని అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామా? లేదా మనం ఏమి సాధించడానికి ప్రయత్నిస్తున్నాము? అని.

ఈ రెండింటిలోనూ మనం రెండు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సోంగ్ ఖాపా గారు చాలా గట్టిగా నొక్కి చెప్పారు:

  • ముందుగా, మన మనస్సులో కనిపించాల్సిన వస్తువు ఏమిటో స్పష్టంగా ఉండాలి. మనం విజువలైజ్ చేసిన బుద్ధుని ధ్యానం గురించి మాట్లాడుతున్నామా లేదా ప్రేమపై చేసే ధ్యానం గురించి మాట్లాడుతున్నామా అని, మన ధ్యానంలో కనిపించే వస్తువు ఏమిటి?
  • రెండవది, మనస్సు ఆ వస్తువును ఎలా పట్టి ఉంచుతుంది, మరియు అది దాన్ని ఎలా గుర్తిస్తుందో అని మనం తెలుసుకోవాలి.

ఈ రెండు విషయాల గురించి మనకు పూర్తిగా స్పష్టత లేకపోతే, మనం అభివృద్ధి చేసుకోవాలనుకునే మానసిక స్థితిని మనం ఎలా సృష్టించగలం?

ఉదాహరణకు, కరుణ: కరుణ అంటే ఏమిటి? కనిపించే వస్తువు ఏమిటి? కరుణ గురించి ధ్యానిస్తున్నప్పుడు మన మనస్సులో కనిపించే వస్తువు ఇంద్రియ జీవులు, బాధతో కూడిన వివిధ పరిమిత జీవులు. మన మనస్సులు వాటిపై దృష్టి పెట్టి వాటి గురించి ఒక నిర్దిష్ట కోణాన్ని వేరు చేస్తాయి, అవే వాటి బాధలు మరియు ఆ బాధలకు కారణాలు. మనసు ఆ వస్తువులను ఎలా పట్టి ఉంచుతుంది? ఈ జీవులు తమ బాధల నుంచి, దాని కారణాల నుంచి విడిపోవాలనే బలమైన కోరికతో మనస్సు ఈ వస్తువులను పట్టి ఉంచుతుంది. ఈ విధంగా, మనం విన్న లేదా చదివిన సూచనల గురించి ఆలోచించడం ద్వారా, మనం సృష్టించాలనుకుంటున్న మానసిక స్థితిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము.

మనం బోధిచిత్త గురించి ధ్యానించాలనుకుంటే, అటువంటి ధ్యానంలో మన మనస్సు ఏమి చేస్తుందో మనం ఆలోచించాలి మరియు చాలా స్పష్టంగా ఉండాలి. చాలా మంది బోధిచిత్తను కరుణ అనుకుని కన్ఫ్యూస్ అవుతారు. అయితే, బోధిచిత్త మరియు కరుణ ఒకటి కాదు. బోధిచిత్త అనేది కరుణను ప్రాతిపదికగా కలిగి ఉన్న మానసిక స్థితి; కానీ బోధిచిత్త ఇతరులు అన్ని బాధలు మరియు దాని కారణాల నుంచి విముక్తి పొందాలని కోరుకోవడం కంటే చాలా అధునాతనమైనది. పరిమితమైన జీవులందరికి జ్ఞానోదయాన్ని అందించాలని కోరుకోవడం, మరియు ఆ బాధ్యతను స్వీకరించడం కంటే ఇది ఎక్కువ. కానీ ఈ శుభాకాంక్షలు, అనుభూతులు బోధిచిత్తపై ఆధారపడి, పెరిగే పాజిటివ్ భావోద్వేగాలు. ప్రేమ, కరుణ అనే పునాది మనకు ముందే ఉండాలి.

నిజానికి మన కుషన్ల మీద కూర్చొని బోధిచిత్త గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మనం దేనిపై దృష్టి పెడుతున్నాం? మనం మన స్వంత వ్యక్తిగత జ్ఞానోదయంపై దృష్టి పెడుతున్నాము, ఇది ఇంకా జరగడం లేదు, కానీ మన బుద్ధ-ప్రకృతి కారణాల ఆధారంగా మరియు ఆ జ్ఞానోదయాన్ని సాధించడానికి మనం చేయాల్సిన పూర్తి కష్టం మీద ఆధారపడి జరగవచ్చు. మన బుద్ధ-స్వభావ కారణాలు మనందరికీ ఉన్న ప్రాథమిక లక్షణాలు మరియు స్వభావాలు, ఇవి మన మనస్సుల స్వచ్ఛమైన స్వభావం లాంటి బుద్ధుడిగా అవ్వడానికి సహాయపడతాయి. బుద్ధ శాక్యముని జ్ఞానోదయంపై మనం దృష్టి పెట్టడం లేదు. మనం సాధారణంగా నైరూప్య జ్ఞానోదయంపై దృష్టి పెట్టడం లేదు; కానీ దానికి బదులుగా మనం మన స్వంత వ్యక్తిగత జ్ఞానోదయం, ఇంకా రాని జ్ఞానోదయంపై దృష్టి పెడుతున్నాము.

మన౦ ఇంకా రాని జ్ఞానోదయ౦పై ఎలా దృష్టి పెట్టాలి? అది అంత సులువు కాదు. ముందుగా మనం దాని అర్థం ఏమిటో, అది ఏ రకంగా పని చేస్తుందో చేసుకోవాలి – అదే ఇంకా రాని విషయం. ఉదాహరణకు, మనం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి: ఇంకా జరగని మొలక విత్తనంలో ఇప్పటికే పుట్టి ఉందా? లేదా విత్తనం అయిన  సమయంలో ఇంకా రాని మొలక పూర్తిగా లేదా? అని. 

స్పష్టంగా, మనం ఇంకా రాని జ్ఞానోదయంపై దృష్టి పెట్టినప్పుడు మనం దేనిపై దృష్టి పెడుతున్నామో స్పష్టమైన అవగాహనను పొందడానికి ఇక్కడ శూన్యత యొక్క అవగాహన అవసరం. ఇంకా రాని మన జ్ఞానోదయం మనం ఏ పరుగు పందెం వైపు వెళ్తున్నామో ఆ పరుగు పందెం ముగింపు మార్గంలా ఎక్కడో ఉండదు. అలాగే మన మనస్సుల్లోనో, మన బుద్ధ స్వభావాల్లోనో ఎక్కడో కూర్చొని బయటకు వచ్చేందుకు అది ఎదురుచూడటం లేదు. అది అలాంటి వస్తువు కాదు. మరోవైపు, మనం ఉనికిలో లేని దానిపై దృష్టి పెట్టడం లేదు; మనం దేనిపైనా దృష్టి పెట్టడం లేదు. దానికి బదులుగా, మన బుద్ధ-స్వభావ కారణాల ఆధారంగా మన మానసిక కొనసాగింపులపై వాలిడ్ అయ్యే జ్ఞానోదయం అని మనం అర్థం చేసుకోవాలి. ఒక వస్తువు సరైన ప్రాతిపదికన వాలిడ్ కాకపోవడం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. 

అయితే, ఇంకా జరగని ఆ జ్ఞానోదయంపై దృష్టి పెట్టడానికి, మన మనస్సులో కనిపించే జ్ఞానోదయం యొక్క ఒక రకమైన మానసిక ప్రాతినిధ్యం ద్వారా దానిపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు, "జ్ఞానోదయం" అనే పదం యొక్క శబ్దాన్ని మనం ఊహించుకోవచ్చు లేదా మన ముందు ఒక బుద్ధుడు ఉన్నట్టు ఊహించుకోవచ్చు. తంత్రంలో మనల్ని మనం బుద్ధుని రూపంలో ఊహించుకోవచ్చు. ఈ అన్ని ఉదాహరణలతో, మన మనస్సులో కనిపించే మానసిక ధ్వని లేదా మానసిక చిత్రాన్ని మనం ఇంకా జరగని జ్ఞానోదయానికి ప్రాతినిధ్యంగా పరిగణించాలి.

తర్వాత, కనిపించే ఈ మానసిక వస్తువుపై మన మనస్సులు ఎలా దృష్టి పెడతాయి? మన మనస్సులో కనిపించే మానసిక వస్తువు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తూ, ఇంకా జరగని జ్ఞానోదయంపై రెండు ఉద్దేశాలతో మనం దృష్టి పెడతాము. మొదటి ఉద్దేశం ఏమిటంటే: "నేను జ్ఞానోదయాన్ని పొందబోతున్నాను" అని. ఇప్పుడు, జ్ఞానోదయాన్ని సాధించాలనే ఉద్దేశ్యం ఉండటం అనేది మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అనేక ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానోదయం పొందడానికి మనం ఏమి చెయ్యాలో రియలిస్టిక్ గా తెలుసుకోవాలి. "ఓహ్, నేను దీన్ని సాధించబోతున్నాను" అని మన ఆలోచన మామూలుగా ఉండదు. మనం దాన్ని ఎలా సాధించబోతున్నామో తెలుసుకోవాలి మరియు దాన్ని మనం సాధించగలమనే నమ్మకం ఉండాలి. జ్ఞానోదయ స్థితిని సాధించడానికి మనకు సరైన ఉద్దేశ్యం ఉండాలి; లేకపోతే, దాన్ని సాధించడం ఒక కల లాగే మిగిలిపోతుంది. నిజానికి, జ్ఞానోదయం అంటే ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఇది కూడా అంత సులభం కాదు. ఈ ప్రక్రియలో ఈ రెండవ దశ ద్వారా మనం ఈ అవగాహనలన్నింటినీ పొందుతాము.

ఈ మానసిక ఆలోచనలపై దృష్టి పెట్టేటప్పుడు మనకు ఉండే రెండవ ఉద్దేశ్యం ఏమిటంటే, ఆ జ్ఞానోదయంతో, మనం ఇతరులకు సాధ్యమైనంత వరకు సహాయం చెయ్యబోతున్నాము. ఏది ఏమైనా, జ్ఞానోదయం అంటే సర్వ శక్తిమంతుడైన దేవుడు గా అవ్వడం అని కాదు. ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యగలగడం అనేది బోధిచిత్తపై ఆధారపడిన పునాదిని, అంటే ప్రేమ, కరుణను ముందుగానే పెంపొందించడంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇతరులను జ్ఞానోదయాన్ని అందించడానికి మనం బాధ్యతను తీసుకుంటున్నాము, ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల బాధల నుంచి విముక్తి మరియు సంపూర్ణ ఆనందాన్ని పొందాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి.

ఈ ఆలోచనా దశ చాలా పెద్దది మరియు దానికి చాలా పని అవసరం. కానీ ఈ దశ చివరలో, మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న మానసిక స్థితి ఏమిటో మరియు ఆ మానసిక స్థితిని ఎలా నిర్మించుకోవాలో ఖచ్చితంగా మరియు పూర్తి నమ్మకంతో మనం అర్థం చేసుకుని తెలుసుకుంటాము. ఆ మానసిక స్థితిని మనం సృష్టించగలమని మరియు అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మనం పూర్తిగా నమ్ముతున్నాము.

ఈ ఆలోచనా విధానం ధ్యానం లాగా కనిపించినప్పటికీ, సాంప్రదాయ నిర్వచనం ప్రకారం ఇది అసలైన ధ్యానం కాదు. ఈ పదజాలాన్ని సరిగ్గా ఉపయోగించని పాశ్చాత్యులు ఈ ఆలోచనా విధానాన్ని "ధ్యానం" అని పిలుస్తారు, కాని అది సరైనది కాదు. ఆలోచనకు మరియు ధ్యానానికి మధ్య తేడాల గురించి మనం స్పష్టంగా ఉండాలి.

ఈ ఆలోచనా ప్రక్రియ చాలా విలువైన పని, మరియు బోధనల గురించి ఆలోచించడం అనేది మనం ఎప్పుడైనా చెయ్యగలిగేది. మన రోజువారీ జీవితంలో ఇతర పనుల్లో నిమగ్నమైనప్పుడు ఇది చాలా ఉపయోగపడే విషయం. ఉదాహరణకు, మనం ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు, ఒక నిర్దిష్ట మానసిక స్థితి, అంటే ప్రేమ లాంటి దాని గురించి ఆలోచించవచ్చు, ఈ పరిస్థితిలో అది ఎలా వర్తిస్తుందో మనం ఆలోచించవచ్చు. ఇది ఎలా సముచితంగా ఉంటుంది? దాని ప్రయోజనాలు ఏమిటి? మొదలైనవి. ఇవి మనం ఆలోచించగలిగే విషయాలు.

ధ్యానం

ఇప్పుడు మనం ఈ ప్రక్రియలో మూడవ స్టేజ్ కు చేరుకున్నాము: అదే ధ్యానం. ధ్యానం అనేది ఆహారాన్ని నమిలిన తర్వాత జీర్ణం చేసుకోవడంతో సమానం. ధ్యానం యొక్క ఉద్దేశ్యం ఒక నిర్దిష్ట సానుకూల మానసిక స్థితిని ఒక అలవాటుగా మార్చుకోవడం, మనం ఆ స్థితి గురించి ఆలోచించి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మనం సృష్టించగలమని నమ్మిన తర్వాత ఆ మానసిక స్థితిలోకి మారడం.

ధ్యానం అనేది ప్రధానంగా రెండు దశల ప్రక్రియ. ఒక దశను నేను "విచక్షణాత్మక ధ్యానం" అని అనువదిస్తాను, కాని దీన్ని "విశ్లేషణాత్మకం" అని పిలవడం ఆలోచనా దశతో గందరగోళానికి గురిచేస్తుంది. "విచక్షణ" అనే పదం ఈ పదానికి బాగా సరైన అనువాదం అని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంలో, "వివేచన" అంటే ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడం మరియు దాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో అర్థం చేసుకోవడం అని అర్ధం. ధ్యానం యొక్క రెండవ దశ స్థిరీకరణ ధ్యానం, దీనిలో మనం ఆ మానసిక స్థితిని స్థిరీకరించి దానిపై దృష్టి పెడతాము. ఈ రెండవ దశను మనం "స్థిరీకరణ ధ్యానం" అని పిలవవచ్చు. మొదటి దశ అయిన విశ్లేషణాత్మక ధ్యానాన్ని మనం ఎలా సాధిస్తాము? ఆలోచనా ప్రక్రియలో, మనం ఒక తార్కిక మార్గం ద్వారా వెళ్ళాము లేదా ఒక నిర్దిష్ట మానసిక స్థితిని నిర్మించడానికి స్టేజ్ లు మరియు దశలను దాటాము. మనం అభివృద్ధి చెయ్యాలనుకునే మానసిక స్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి మరియు దాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చనే దానిపై అవగాహన పొందడానికి మనం అలా చేసాము. ఇప్పుడు, విచక్షణ ధ్యానంతో, మనం ఇంకోసారి తార్కిక మార్గాన్ని లేదా ఒక నిర్దిష్ట మానసిక స్థితిని సృష్టించే దశలను పరిశీలిస్తాము. కానీ ఇప్పుడు ఆ మానసిక స్థితిని సృష్టించడానికి మరియు దాన్ని మనలో తాజాగా ఉంచడానికి మనం ఈ ప్రక్రియ ద్వారా వెళుతున్నాము. ఉదాహరణకు, ప్రతి ఒక్కరి పట్ల కరుణను పెంపొందించడానికి, "ప్రతి ఒక్కరూ నా తల్లి, అందరూ నా పట్ల దయను చూపారు." అనే తర్క మార్గాన్ని అనుసరిస్తాము, మనం అనుకున్న మానసిక స్థితికి అనుగుణంగా పనిచేసి దాన్ని అనుభూతి చెందుతాము.

ఈ దశలవారీ ప్రక్రియలో, మనల్ని మనం అలవాటు చేసుకోవాలనుకునే మానసిక స్థితికి మెరుగుపరుచుకున్న తర్వాత, ఆ విధంగా దృష్టి యొక్క వస్తువును మనం చురుకుగా వివేచన చేస్తాము లేదా అర్థం చేసుకుంటాము. ఉదాహరణకు, మన౦ జాలి గురి౦చి ధ్యానం చేస్తున్నప్పుడు, పరిమిత జీవులన్నిటి గురి౦చి, ప్రత్యేక౦గా, వాటి గురి౦చి మనకున్న ఈ వివర౦ గురి౦చి ఆలోచిస్తాము: అవి వారి సమస్యలు, మరియు బాధలు. వాళ్ళు బాధపడుతున్నారని మనం తెలుసుకుని వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తి పొందాలనే కోరిక, మరియు దాని నుంచి బయటపడటానికి వారికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యం మనకు ఉంటుంది. మన మనస్సులో సున్నితమైన జీవులను చూస్తున్నాము; వాటిని మన మనస్సులో ఈ విధంగా చూస్తాము; లేదా నిజ జీవితంలో మనుషులను చూసినప్పుడు కూడా మనకు ఇలా అనిపించవచ్చు. కరుణ అనేది ఇతరులపై మరియు వారి బాధలపై దృష్టి పెడుతుంది, మరియు వాళ్ళు దాని నుంచి విముక్తి పొందాలనే కోరికను కలిగి ఉంటుంది.

ఒక చురుకైన ప్రక్రియలో, ఆ విచక్షణతో మనం కొంతకాలం ఉంటాము. దాని తర్వాత, స్థిరీకరణ ధ్యానం అంటే ఈ విషయంపై లేదా ఈ మానసిక స్థితిపై పూర్తి ఏకాగ్రతతో, మనం గ్రహించిన దానిలో మునిగిపోవడం జరుగుతుంది. మనం విచక్షణతో కూడిన ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనకు ఏకాగ్రత అవసరం, కానీ ఈ స్థిరీకరణ దశలో మనం మన హృదయాలలో భావాన్ని లోతుగా ఇమిడిపోయేలా చేస్తున్నాము: మనం కరుణను బలంగా అనుభవిస్తున్నాము.

విచక్షణ మరియు స్థిరీకరణ అనే ఈ రెండు స్టేజ్ లను మనం మార్చి మార్చి ఉపయోగిస్తాము, అలా చివరికి, మనం వాటిని కలపగలుగుతాము. ధ్యానం యొక్క విచక్షణ మరియు స్థిరీకరణ స్టేజ్ లను కలిపి చెయ్యడం చాలా కష్టం. మనం వాటిని కలిపే స్టేజ్ ల చర్చ కూడా చాలా కష్టమైనదే. మీరు కొన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే, నా వెబ్‌సైట్లో వాటి గురించి పూర్తిగా చదివి తెలుసుకోవచ్చు.

అలాగే, మన౦ చాలా అభివృద్ధి చెందినప్పుడు, "శ్రమతో కూడిన ధ్యాన౦" లాంటి దాన్ని చెయ్యాల్సిన అవసర౦ లేదు. శ్రమతో కూడిన ధ్యానం అనేది వివేచనాత్మక ధ్యాన ప్రక్రియలో దశలను దాటి ఒక మానసిక స్థితిని నిర్మించడం గురించి ఉంటుంది. ఈ అధునాతన స్థాయిలో, మనం విచక్షణ లేని ధ్యానం చెయ్యవచ్చు. మనం కోరుకున్న మానసిక స్థితిని దశలు లేదా తార్కిక మార్గం ద్వారా నిర్మించకుండా అప్పటికప్పుడే సృష్టించవచ్చు. అయినప్పటికీ, మన వివేచనాత్మక ధ్యానం శ్రమించబడినట్లే మన దృష్టి యొక్క లక్ష్యాన్ని గుర్తించడానికి మనం ఇప్పటికీ ఆ మానసిక స్థితినే ఉపయోగిస్తాము.

ధ్యానంలోని రకాలు

మనం తరచుగా రెండు రకాల ధ్యానాల గురించి వింటుంటాం. వీటికి సంస్కృత పదాలు "షమత" మరియు "విపశ్యన", లేదా టిబెటన్ భాషలో "షినే" మరియు "లగ్టాంగ్". ఈ రెండు పదాలు ధ్యాన ప్రక్రియ ద్వారా మనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రెండు మానసిక స్థితులను సూచిస్తాయి. షమత ఒక నిశ్చలమైన మరియు స్థిరమైన మానసిక స్థితి. దానితో మానసిక డల్ నెస్ ని, మానసిక ఆందోళన (వేరే ఆకర్షణీయమైన వస్తువు వైపు వెళ్ళే మనసు) యొక్క అన్ని స్థాయిలను శాంతింపచేస్తుంది. ఒక వస్తువు మీద తన ఫోకస్ గట్టిగా స్థిరపడిందనే అర్థంలో కూడా షమత స్థిరపడుతుంది. కాబట్టి, ధ్యానాన్ని స్థిరీకరించడంపై మనం దృష్టి పెట్టాలి.

శ్వాస, విజువలైజ్డ్ బుద్ధుడు మొదలైన అనేక విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మనం ఈ నిశ్చలమైన మరియు స్థిరమైన మానసిక స్థితిని అభివృద్ధి చేసుకోవచ్చు. అవకాశాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది.

షమత ధ్యానంలో కూడా మనం సూచనలు విని, ఆ తర్వాత ధ్యానం యొక్క స్టేజ్ ల గురించి ఆలోచించాలి. ఉదాహరణకు, మనం ఒక బుద్ధుడిని ఊహిస్తూ ఉంటే, ఆ ఊహను దశలవారీగా ఎలా నిర్మించాలో సూచనలు వింటాము. ఆ తర్వాత మొదటిగా, రెండోదిగా ఏం చెయ్యాలో ఆలోచిస్తాము. 

"విపశ్యన" అంటే అసాధారణంగా గ్రహించే మానసిక స్థితి అని అర్థం. ఇది చాలా అసాధారణమైన రీతిలో విషయాలను గ్రహించగల మానసిక స్థితి. కాబట్టి, విపశ్యన ధ్యానం, విచక్షణతో కూడిన ధ్యానానికి ప్రాధాన్యతను ఇస్తుంది. విపశ్యన స్థితిని సాధించడం గురించి మాట్లాడేటప్పుడు, అది అశాశ్వతాన్ని లేదా శూన్యతను గుర్తించే అసాధారణమైన గ్రహణాత్మక మానసిక స్థితిగా సాధించవచ్చు, కాని ఇది ఆ రెండింటిలో ఉండే ఒకటి మాత్రం కాదు. తంత్రం యొక్క అత్యున్నత తరగతి అయిన అనుత్తరయోగ తంత్రంలో, ఈ విపశ్యన, అసాధారణమైన గ్రహణాత్మక మానసిక స్థితిని అభివృద్ధి చెయ్యడానికి ఒక పద్ధతి, ఇది ముక్కు చివరన ఒక చిన్న చుక్క లేదా బొట్టును ఊహించుకోవడం లాంటిది. అప్పుడు, ఆ ఒక్క చుక్క యొక్క ఊహను మెయింటైన్ చేసేటప్పుడు, మీరు తర్వాతి వరుసలో రెండు చుక్కలను ఊహించుకుంటారు, తర్వాత నాలుగు, ఎనిమిది, పదహారు, ముప్పై రెండు, అలా ఇంకా ఎన్నో. మీరు వాటన్నిటినీ సరిగ్గా ఒక క్రమపద్ధతిలో ఉంచుకోవాలి, ఆ తర్వాత ఊహను దశలవారీగా తగ్గించాలి. ఈ రకమైన ఊహను అనుసరించడం ద్వారా, మీరు చాలా పదునైన, అసాధారణంగా గ్రహించే మానసిక స్థితిని అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఈ మానసిక స్థితిని చాలా ఉన్నత స్థాయికి పెంచుకోవాలనుకుంటే, మీరు ఆచరిస్తున్న దేవతా వ్యవస్థ యొక్క పూర్తి మండలాన్ని, సకల దేవతలు మరియు వాటి వివరాలతో ఊహించగలిగే ఇతర అభ్యాసాలు కూడా ఉన్నాయి. మీరు దీన్ని సాధిస్తే, మీరు అసాధారణంగా గ్రహించే మానసిక స్థితిని పొందుతారు!

ఈ రెండు రకాల ధ్యానం, షమత, విపశ్యన అన్ని బౌద్ధమత సంప్రదాయాలలో, మరియు అనేక భారతీయ బౌద్ధేతర వ్యవస్థలలో కూడా ఉన్నాయి. థెరవాడ బౌద్ధమత సంప్రదాయాలలో వీటిని పాళీ పదాలతో "సమత", "విపాశన" అని పిలుస్తారు. ఈ రెండూ జెన్ లో కూడా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు, జెన్ యొక్క కొరియన్ రూపమైన సోన్ బౌద్ధమతంలో, "అది ఏమిటి?" అనే విషయం ఒకటి ఉంది. మన౦ "అది ఏమిటి?" అనే దానిపై దృష్టి పెట్టినప్పుడు, అసలు మనకు ఏ సమాధాన౦ దొరకదు, ఉదాహరణకు: "ఇది టేబుల్; ఇది గ్లాస్" మొదలైనవి. దానికి బదులుగా, మన మనస్సును "లోతైన సందేహ" స్థితిలో అభివృద్ధి చేసుకుంటాము - ఎప్పుడూ "అది ఏమిటి?" అనే రియాలిటీని ప్రశ్నిస్తాము. అప్పుడు మన మానసిక స్థితి అసాధారణమైన స్థితిలోకి మారుతుంది.

చాలా మంది టిబెటన్ గురువులు జెన్ సంప్రదాయాన్ని అధ్యయనం చెయ్యలేదని చెప్పే ఒక ఫన్నీ కథ ఉంది; అది వారికి తెలియదు. ఒక జెన్ గురువుకు, కలూ రింపోచేకు మధ్య ఒక ప్రసిద్ధ సమావేశం జరిగింది. జెన్ గురువు ఒక నారింజ పండును పట్టుకుని కలూ రింపోచేను ఇలా అడిగాడు, "ఇది ఏమిటి?" అని. కలూ రింపోచే తన అనువాదకుడి వైపు ఆశ్చర్యంగా చూసి, "ఏమైంది, వారి దేశంలో ఈ నారింజ పండ్లు ఉండవా?" అని అడిగారు.

కాబట్టి, మనకు షమత, మరియు విపశ్యన ఉన్నాయి. షమత అనేది పరిపూర్ణ ఏకాగ్రత మాత్రమే కాదు, ఇది వివిధ రకాల శ్రద్ధను ఉపయోగించి తొమ్మిది దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. కానీ షమత పరిపూర్ణమైన ఏకాగ్రతతో పాటు, "ఉత్తేజకరమైన మానసిక స్థితి" అని కూడా పిలువబడుతుంది. " ఫిట్‌నెస్ యొక్క భావన" అనేది ఒక సాంకేతిక పదం. పరిపూర్ణ ఏకాగ్రతతో పాటు, ఫిట్‌నెస్ యొక్క భావన ఉంటుంది, ఇది ఉత్తేజకరమైన శారీరక మరియు మానసిక స్థితి. " ఫిట్‌నెస్ యొక్క భావన" అనేది సంపూర్ణంగా శిక్షణ పొందిన అథ్లెట్ యొక్క స్థితిని పోలి ఉంటుంది.

నా గురువు సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు, షమత మానసిక స్థితిని కలిగి ఉండటం జంబో జెట్ ను కలిగి ఉండటం లాంటిదని చెప్పారు: మీరు దాన్ని నేలపై ఉంచితే అది అలాగే ఉంటుంది మరియు మీరు దాన్ని గాలిలో ఎగరేస్తే అది ఎగురుతుంది. ఎంత సేపు అయినా దేని మీదైనా ఏకాగ్రత సాధించవచ్చనే భావన ఉంటుంది. మీ శరీరం, మరియు మనసు అలసిపోదు; మీరు ఫిట్ గా ఉంటారు; మరియు ఇది ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. షమత అనేది చాలా ఉత్తేజకరమైన, ఆనందకరమైన మానసిక స్థితి. కానీ సినిమాలో లాగా పాడుతూ, డాన్స్ వేస్తూ ఉత్సాహంగా వీధుల్లో పరిగెత్తడం ఆనందదాయకం కాదు - అది అలాంటిది కాదు. బాగా ట్రైన్ అయిన అథ్లెట్ లాగా షమతతో మనసు ఉత్తేజపరుస్తుంది.

విపశ్యన మానసిక స్థితి కూడా షమత స్థితికి కలిసి ఉంటుందని స్పష్టం చెయ్యడం ముఖ్యం. షమత యొక్క పరిపూర్ణ ఏకాగ్రత మరియు ఫిట్‌నెస్ స్థితితో పాటు, విపశ్యన దాని పైన రెండవ ఫిట్‌నెస్ ను జోడిస్తుంది. దేన్నైనా అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి మనసు ఫిట్ గా ఉందనే భావన ఇది.

మరొక రకమైన ధ్యానం కూడా ఉంది, దీన్ని సాధారణంగా "క్షణకాలపు ధ్యానం" అని పిలుస్తారు. మనం ఒక నిర్దిష్ట ధ్యాన సాధనలో పనిచేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు మనం ఈ పూర్తి బౌద్ధమత మార్గాన్ని రివ్యూ చెయ్యాల్సి ఉంటుంది. మన నిర్దిష్ట ధ్యాన విషయం పూర్తి చిత్రంలో ఎక్కడ సరిపోతుందో గుర్తు చెయ్యడమే దీని ఉద్దేశ్యం, అలా మనం ఒక అంశాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా, మరొక దాన్ని దాటకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా ఉంటాము. కాబట్టి, క్షణకాలపు ధ్యానం అంటే పూర్తి మార్గాన్ని సమీక్షించడం; ఇది ఒక రకమైన సమీక్ష లాంటిది.

చాలా ఏళ్ల క్రితం, దలైలామా గారి వైద్యుడైన డాక్టర్. టెన్జిన్ చోద్రాక్ తో కలిసి నేను మాస్కోకు వచ్చాను. చెర్నోబిల్ రేడియేషన్ బాధితులకు సహాయం చెయ్యడానికి టిబెటన్ వైద్యాన్ని ఉపయోగించే ప్రాజెక్టుపై మేము పనిచేస్తున్నాము. మేము చాలా మంచి హోటళ్లలో ఉన్నాము మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మాకు అధికారికంగా రక్షణను కల్పించారు. తరచూ, మమ్మల్ని ప్రసిద్ధ రష్యన్ సెవెన్ కోర్స్ విందులకు తీసుకువెళ్ళేవారు. టిబెట్ వదిలి భారతదేశానికి రావడానికి ముందు డాక్టర్ టెన్జిన్ చోద్రాక్ చైనా నిర్బంధ శిబిరంలో ఇరవై సంవత్సరాలు గడిపారు. అందుకని, ఏడు కోర్సుల విందులో మొదటి కోర్సు ఇవ్వబడింది, మేము అతనిని ఎంత హెచ్చరించినా, అతను మొదటి కోర్సులోనే వీలైనంత ఎక్కువగా తినేవాడు. వచ్చే వారం రోజులకు తినడానికి ఇది ఒక్కటే అన్నట్టు అనిపించింది. అలా అతను చాలా ఎక్కువగా తినేసి, తర్వాతి మిగతా ఆరు కోర్సులలో ఏమీ తినేవాడు కాదు. క్షణకాలపు ధ్యానంతో మనం నివారించాలనుకునే పరిస్థితికి ఇది ఒక ఉదాహరణ. మొత్తం ఏడు కోర్సుల మెనూ మొత్తాన్ని సమీక్షించి గుర్తుంచుకోవాలని, అలా మనం ఒక దాన్ని ఎక్కువగా తినకుండా, ఎక్కువ ధ్యానం చెయ్యకుండా ఉండాలని తెలుసుకుంటాం. ఇది మొదటి కోర్సులో మునిగిపోయి, మిగిలిన భోజనాన్ని మిస్ అయినట్లే ఉంటుంది.

ఇప్పుడు, నేను ఒక నిర్దిష్ట మానసిక స్థితికి చేరుకునే ధ్యాన రకాన్ని వివరిస్తున్నాను, కాని బౌద్ధమతంలో చేసే ధ్యానం అది మాత్రమే కాదు. కొన్ని ధ్యాన అభ్యాసాలలో, ఉదాహరణకు, మనస్సు యొక్క స్వభావంపై చేసే కొన్ని కాగ్యు ధ్యానాలలో లేదా కొన్ని జెన్ అభ్యాసాలలో, భిన్నమైన విధానం ఉంటుంది. మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి బదులుగా, మన మనస్సులో ప్రేమ లేదా మనస్సు యొక్క స్పష్టత లాంటి కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మరియు వాటిని పొందడానికి మానసిక స్థితిని నిశ్శబ్ద పరుస్తాము. కానీ మనం ఈ రకమైన ధ్యానం చేసేటప్పుడు కూడా, ముందు మనం సూచనలను విని, ఆ తర్వాత వాటిని అర్థం చేసుకునే వరకు వాటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మనం నిశ్శబ్దంగా ఉంచుతున్న మానసిక స్థితి, మనం ఏమి సాధించబోతున్నాం, ముందుగా మనం ఏమి చెయ్యాలి, తర్వాత ఏమి చెయ్యాలి అనే మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. "నిశ్శబ్ద" రకం ధ్యానంతో నిర్మాణం "పెంపొందించుకోవడం" రకం ధ్యానంతో సమానంగా ఉంటుంది.

ధ్యానానికి అత్యంత అనుకూలమైన వాతావరణం

ధ్యాన సెషన్ ను ఎలా ఏర్పాటు చెయ్యాలి, ధ్యాన స్థలాన్ని ఎలా ఏర్పాటు చెయ్యాలి, నేలను ఎలా ఊడ్చాలి, ఆ గదిని ఎలా శుభ్రపరచాలి, మరియు సాష్టాంగ నమస్కారాలు చెయ్యడం, నైవేద్యాలు చెయ్యడం మొదలైన వాటిపై సూచనలు ఉన్నాయి - ఇవన్నీ ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండటానికి చాలా ముఖ్యమైనవి. ధ్యానానికి అనుకూలమైన పరిస్థితులు మరియు దానికి తగిన వాతావరణం ఉండటం చాలా అవసరం, ముఖ్యంగా సరైన సీటు మరియు నిశ్శబ్ద, శుభ్రమైన వాతావరణం ఉండాలి; ఏదేమైనా, మన చుట్టూ ఒక పెద్ద సీన్ జరుగుతూ ఉండాల్సిన అవసరం లేదు. సరైన బంగారు ఆభరణాలు, ధూపం, బ్యాక్ గ్రౌండ్ లో కొత్త మ్యూజిక్ ఇలా అన్నిటిని పొందడానికి మనం పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. మిలారెపాకు ఇవన్నీ ఉండేవి కావు అయినా కానీ అతను తన ధ్యాన సాధనలో చాలా విజయవంతమయ్యాడు! మనం మన ధ్యానం చేసుకునే చోటు వీలైనంత చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము, కానీ ఎక్కువగా షో చేసినట్టు ఉండకుండా చూసుకుంటాము.

అలాగే మనం ఎక్కడైనా ధ్యానం చెయ్యగలగాలి. మనం ఒక సుదీర్ఘ రైలు ప్రయాణం చేస్తుంటే, "నా దగ్గర నీటి గిన్నెలు లేవు, నేను ధూపం వెలిగించలేను, మరియు నేను సాష్టాంగ నమస్కారం చెయ్యలేను అందుకే నేను రైలులో ధ్యానం చెయ్యలేను" అని చెప్పకూడదు. మనం ఎక్కడైనా ధ్యానం చెయ్యవచ్చు, దానిలో మనం కొంచెం ప్రావీణ్యం పొందితే - రైలులో, ఎక్కడైనా, క్యూలో నిలబడి కూడా. మన రోజూ జీవితంలో కూడా, అధికారిక ధ్యాన సెషన్ల మధ్య మనం ఇతరులను ప్రేమ మరియు కరుణతో ఉండడానికి ప్రయత్నించవచ్చు - అదే ధ్యానం, కదా?

గుర్తుంచుకోండి, ధ్యానం యొక్క అసలైన ఉద్దేశం బోధనలను ఇంటిగ్రేట్ చెయ్యడం - వాటిని మనలో ఒక భాగంగా చేసుకోవడం, అలా మనం వాటిని మన రోజువారీ జీవితంలో అన్వయించుకోవాలి. కానీ ధ్యానం మన రోజువారీ జీవితాల నుంచి పూర్తిగా వేరు అయినప్పుడు, అది ఒక హాబీలా మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా మన ధ్యానంలో అన్య దేశ తాంత్రిక ఊహలు ఉన్నప్పుడు, అది సులభంగా డిస్నీల్యాండ్ కు ఒక ట్రిప్ లాగా మారుతుంది, అది మన రోజువారీ జీవితాలతో సంబంధం లేని ఏదో ఒక ఫాంటసీ ప్రపంచంలా మారుతుంది. ఒకవేళ ఆ మార్గంలో వెళితే, మనం మానసికంగా ఇబ్బందులు పడి ఆ ధ్యానం మన రోజువారీ జీవితంపై చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకోండి, ధ్యానం యొక్క అసలైన ఉద్దేశం దాన్ని మన జీవితంలో అప్లై చెయ్యడమే.

మనం ఎక్కడ ఉన్నా, ధ్యానం చేసేటప్పుడు, ముందుగా ఒక ప్రేరణను సెట్ చేసుకోవాలి, ఆ ప్రేరణను ధృవీకరించాలి మరియు ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. మన మనసు దేన్నైనా ఆలోచిస్తూ ఉంటే దాన్ని తిరిగి ఒక చోటుకు చేర్చుకోవాలి. మనకు నిద్ర వస్తే మనమే మేల్కుంటాం. చివరిగా, మనకు పాజిటివ్ శక్తి యొక్క డెడికేషన్ ఉంటుంది. ధ్యానం చెయ్యడం ద్వారా మనం సృష్టించిన పాజిటివ్ ఎనర్జీని మనం డెడికేట్ చెయ్యకపోతే, ధ్యానంలో మన ప్రయత్నాలు మన సంసార పరిస్థితులను మెరుగుపరుచవు. పాజిటివ్ ఎనర్జీని జ్ఞానోదయానికి, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా డెడికేట్ చెయ్యాలని మనం అనుకుంటాం. 

వ్యక్తిగతం వర్సెస్ గ్రూప్ ధ్యానం

కొంతమంది వ్యక్తిగతంగా ధ్యానం చేసుకుంటారు. టిబెటన్లు ఎక్కువగా వ్యక్తిగత ధ్యానం చేస్తారు; వాళ్ళు గ్రూప్ లలో ధ్యానం చెయ్యరు, కానీ మఠాలలో సన్యాసులు మరియు సన్యాసినులు ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రార్థనలు మరియు ఆచార గ్రంథాలను కలిసి చదువుతారు. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం గ్రూప్ మెడిటేషన్ అలవాటును మనం పెంపొందించుకున్నాం. చాలా మందికి, గ్రూప్ ధ్యానం యొక్క అతిపెద్ద ప్రయోజనం క్రమశిక్షణ. మనం ఒంటరిగా ఉంటే, కేవలం కూర్చొని ధ్యానం చేసే క్రమశిక్షణ ఉండదు. మనం మన సెషన్లను ముగించాలని అనుకున్న దానికి చాలా ముందే లేస్తాము; కానీ మన చుట్టూ ఇంకెవరైనా ఉంటే, మనకు మంచి క్రమశిక్షణ ఉంటుంది. ఇతరుల ముందు అలా చెయ్యడానికి సిగ్గుపడి అలానే ఉండిపోతాం.

కొంతమంది గ్రూప్ ధ్యానాన్ని చాలా భయంకరంగా భావిస్తారు ఎందుకంటే వాళ్ళు ఇతరుల చేత దృష్టిని కోల్పోతారు. ముఖ్యంగా ఎవరైనా దగ్గినప్పుడు లేదా అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు, వాళ్ళు తమ ధ్యాన దృష్టిని పోగొట్టుకుంటారు, కాబట్టి వాళ్ళు ఒంటరిగా ఉండి ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆ గ్రూప్ ఏదైనా పైకి పెద్దగా చదువుతుంటే, కొంతమంది మనం సాధారణంగా చేసే దానికంటే చాలా నెమ్మదిగా చదువుతుంటే, అప్పుడు మనకు చాలా విసుగు మరియు కోపం వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, అది చాలా వేగంగా జరుగుతుంటే, మనకు కూడా కోపం వస్తుంది.

మనకు ఏది మంచిదో మనమే నిర్ణయించుకోవాలి - వ్యక్తిగతమైనదా లేదా గ్రూప్ ధ్యానమా అని. ఏదేమైనా, చిన్న గ్రూప్ ధ్యానంలో పాల్గొన్నప్పుడు నేను ఒక ఆసక్తికరమైన లక్షణాన్ని గమనించాను, అంటే ఒకరిద్దరు వ్యక్తులతో ధ్యానం చెయ్యడం. మీరు ఇతరులతో మంచి సన్నిహిత బంధం మరియు కనెక్షన్ ను కలిగి ఉన్నప్పుడు ఆ ధ్యానం చాలా విజయవంతమవుతుంది, అలా మీరు వాళ్ళతో చాలా సామరస్యంగా ఉంటారు. మీ శక్తులు అన్నీ కలుసుకుని బలాన్ని చేకూరుస్తాయి. వారితో కలిసి ధ్యానం చేస్తే  మీకు ఎక్కువ శక్తిని, ఎక్కువ స్పష్టతను ఇస్తుంది. కానీ ఒక చిన్న సమూహంలో ధ్యానం చేస్తున్న వ్యక్తుల శక్తులు ఒక దానితో ఒకటి ఎదురుపడినప్పుడు, ప్రభావం దీనికి విరుద్ధంగా ఉంటుంది: ఇది చికాకును కలిగిస్తుంది మరియు మీ మనస్సును ఇంకా నీరసం అయ్యేలా చేస్తుంది. కాబట్టి, మీరు ఇతరులతో కలిసి ధ్యానం చెయ్యాలనుకుంటే, వాళ్ళు ఎవరు అని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

పట్టుదల యొక్క ప్రాముఖ్యత

ఈ ఆఖరి సలహా చాలా ముఖ్యమైనది, మరియు ఇది సంసారం యొక్క స్వభావంలా ఎప్పుడూ మారుతూ ఉండేది. కాబట్టి, సహజంగానే మన ధ్యానం కూడా ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజూ మెరుగ్గా ఉండే రేఖీయ ప్రక్రియ కాదు. కొన్ని రోజులు మన ధ్యానం సవ్యంగా సాగుతుంది, మరికొన్ని రోజులు అలా సాగదు. కొన్ని రోజులు మనం ధ్యానం చెయ్యాలని అనుకుంటాం, మరికొన్ని రోజులు ధ్యానం చెయ్యాలని అస్సలు అనిపించదు. ఇది పూర్తిగా సాధారణం మరియు సహజమైనదే - ఇది సంసారం యొక్క స్వభావం. ఇక్కడ విషయం ఏమిటంటే, మీకు ఏమి అనిపించినా, మీరు పట్టుదలతో ముందుకు సాగాలి. "నాకు ధ్యానం చెయ్యాలని అనిపించడం లేదు" అని మీకు అనిపిస్తే - ఏమవుతుంది? ఎలాగైనా ధ్యానం చేసుకోండి. దీన్ని కొనసాగిస్తూనే ఉండండి; ప్రతిరోజూ చేస్తూ ఉండండి, ఇది రెండు లేదా మూడు నిమిషాలు మాత్రం అయినా కానీ. ఆ కొనసాగింపు మనల్ని దారిలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

అలాగే, ధ్యాన సెషన్లను ఎక్కువ సేపు వరకు ఉంచవద్దు, ముఖ్యంగా ప్రారంభంలో. మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది. లేకపోతే, "ఇది ముగిసే వరకు నేను వేచి ఉండలేను" అని మీరు అనుకుంటారు, ఆ తర్వాత మీరు మీ ధ్యానానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నప్పుడు మీరు ధ్యానాన్ని ముగించినట్లయితే, మీరు తిరిగి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. మీరు ఎవరితోనైనా ఉంటే మరియు మీరు ఇంకా ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలని ఉన్నా కానీ అక్కడి నుంచి వెళ్లిపోతే, మీరు మళ్లీ అతనిని త్వరలోనే కలవాలని అనుకుంటారు. కానీ మీరు అతనితో అలసిపోయే స్థాయికి వెళ్లి అక్కడే ఉండిపోతే, అతను వెళ్లిపోవాలని మీరు అనుకుంటే, మీరు మళ్లీ అతనిని చూడటానికి అంత ఆసక్తిగా ఉండరు.

చివరిగా, మీరు ధ్యానం చేసే సమయాన్ని క్రమంగా పొడిగించడం చాలా ముఖ్యం. ఫ్లెక్సిబుల్ గా ఉండండి - ఫ్లెక్సిబుల్ గా ఉండటం చాలా ముఖ్యం. నేను చెప్పినట్లుగా: ఒక్క రోజు కూడా ధ్యానాన్ని మిస్ కావద్దు. మీరు ప్రతిరోజూ ధ్యానం చేస్తే స్థిరత్వం, విశ్వసనీయత మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. కానీ ఫ్లెక్సిబుల్ గా ఉండండి: కొన్నిసార్లు మీరు చేయాలనుకుంటున్న పూర్తి ధ్యానం చేయవచ్చు మరియు మీకు సమయం లేనప్పుడు, చిన్నదిగా చెయ్యవచ్చు. కానీ కనీసం ప్రతిరోజూ ఎంతో కొంత సేపు చెయ్యండి. ఒక మతోన్మాదిగా ఉండకండి; మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి. నాకు ఇష్టమైన జెన్ కోన్: "మరణం ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి రిలాక్స్ గా ఉండండి!"

Top