"సంఘ" అనేది ఒక సంస్కృత పదం, దీని అర్థం "సమాజం", ఇది ప్రధానంగా బుద్ధుని నియమిత అనుచరులను సూచించడానికి ఉపయోగిస్తారు, వీరిని భిక్షువులు మరియు భిక్షునిలు లేదా సన్యాసులు మరియు సన్యాసినులు అని పిలుస్తారు. ఈ రోజుల్లో, బౌద్ధమతం పాశ్చాత్య ప్రపంచం అంతటా వ్యాపించినందున, బౌద్ధ సమాజంలో, లేదా ఒక ధర్మ కేంద్రంలోని సాధారణ అనుచరుల చిన్న సమూహాలు కూడా సంఘాన్ని ఏర్పరుచుకోవడం సర్వసాధారణంగా మారింది.
What is sangha 1

సంఘం యొక్క మూలాలు

బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత, ధర్మ చక్రం యొక్క సూత్రం లేదా ధర్మచక్రప్రవర్తన సూత్రం నాలుగు మంచి నిజాలపై తన మొదటి బోధనను ఐదుగురు పాత స్నేహితులకు ఇచ్చాడని, అలా వారితో పాటు అతను చాలా సంవత్సరాలు సన్యాసిగా ఉన్నాడని చెప్తుంది. ఈ బోధన సమయంలో, ఆ ఐదుగురు సన్యాసులు అతని శిష్యులయ్యారు, వారిలో కౌండిన్యుడు ఒక అర్హత కలిగిన ముక్తి జీవిగా మారాడు. కొన్ని రోజుల తర్వాత, ఆత్మ యొక్క శూన్యత గురించి లేదా అసాధ్యమైన మార్గాల్లో ఆత్మ ఎలా ఉనికిలో ఉండకూడదో బోధిస్తూ ఉన్నప్పుడు, మిగతా సన్యాసులందరూ ఆ అర్హతను సాధించారు. ఈ విధంగా ఈ ఐదుగురు అనుచరులు సంఘానికి మొదటి సభ్యులు లేదా మొదటి బౌద్ధ సన్యాసులు అయ్యారు.

అప్పుడు బుద్ధుడు తన శేష జీవితాన్ని - మొత్తం 45 సంవత్సరాలు - తాను కనుగొన్న ధర్మ బోధనలను వ్యాప్తి చేయడంలో గడిపాడు. అయితే అతని శిష్యులు కూడా బుద్ధుని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఉత్తర భారత దేశంలోని గ్రామాలు మరియు పట్టణాలకు ప్రయాణించారు. బుద్ధుడు అనేక మంది అనుచరులను ఆకర్షించాడు, అన్నిచోట్ల నుంచి వాళ్ళు చాలా మంది వచ్చారు: ఇతర ఆధ్యాత్మిక గురువులు, రాజులు, రాణులు, రైతులు, మరియు కసాయిలు కూడా వచ్చారు. అందులోని ఎక్కువమంది శిష్యులు ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడనప్పటికీ, సాధారణ జీవితాన్ని విడిచిపెట్టి సంఘంలో చేరాలనుకునే వారికి మాత్రమే స్వాగతం లభించింది. పని చేస్తూ, వివాహం చేసుకున్న సాధారణ శిష్యులు సంఘానికి ఆహారం, బట్టలను అందిస్తూ సహాయం చేశారు.

కాలక్రమేణా, ఎక్కువ మంది ప్రజలు అధికారికంగా బుద్ధుడితో చేరడంతో, ఒక సామరస్యపూర్వక ఆధ్యాత్మిక సమాజాన్ని సృష్టించడానికి శిష్యులు పాటించటానికి కొన్ని నియమాలను సృష్టించాల్సి వచ్చింది. సంఘంలో అవాంఛనీయ పరిణామాలు జరిగి వాటికి ప్రతిస్పందన అవసరమైనప్పుడు, విచారణ మరియు దోషాల ద్వారా నియమాలను రూపొందించారు. బుద్ధుని జీవితం ముగిసేనాటికి సన్యాసులకు, సన్యాసినులకు కొన్ని వందల నియమాలు వచ్చాయి.

మహిళల సన్యాసం

మొదట్లో బుద్ధుడు బౌద్ధ వ్యవస్థలోకి పురుషులను మాత్రమే చేర్చుకున్నాడు. సన్యాసులు స్థాపించబడిన ఐదు సంవత్సరాల తర్వాత, బుద్ధుని అత్త మహాప్రజపతి గౌతమి తనని ఒక సన్యాసినిగా మార్చమని బుద్ధుడిని కోరింది, కాని అతను దానికి నిరాకరించాడు. అయినా కానీ, మహాప్రజపతి ఏమాత్రం వెనుకాడకుండా మరో 500 మంది స్త్రీలతో కలిసి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి బుద్ధుని వెంట వెళ్ళాలని నిర్ణయించుకుంది.

మహాప్రజాపతి బుద్ధుడికి మరో రెండు అభ్యర్థనలు చేసింది బుద్ధుడు వాటిని కూడా నిరాకరించాడు. నాలుగవ సందర్భంలో బుద్ధుని బంధువు ఆనంద ఆమె తరఫున మధ్యవర్తిత్వం వహించి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మరియు జ్ఞానోదయం పొందడానికి పురుషులతో సమానంగా మహిళలకు సామర్థ్యం ఉందా అని అడిగారు, దీనికి బుద్ధుడు సానుకూలంగా జవాబిచ్చాడు. అప్పుడు ఆనంద, స్త్రీలు సన్యాసినులుగా మారితే బాగుంటుందని సూచించడంతో బుద్ధుడు సరేనని మహిళా శిష్యుల నియామకానికి అనుమతించాడు.

సంప్రదాయ సంఘం మరియు ఆర్య సంఘం

సాధారణంగా, బుద్ధుని బోధనలను అనుసరించే సన్యాసులు మరియు సన్యాసులైన భిక్షువులు మరియు భిక్షుణిల రెండు సమూహాలను సూచించడానికి సంఘ అనే పదాన్ని ఉపయోగిస్తారు. భిక్షువు అంటే నిజానికి "బిచ్చగాడు" అని అర్థం, ఎందుకంటే వాళ్ళు భౌతిక వస్తువులను విడిచిపెట్టి, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉంటారు. సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం నలుగురు పూర్తిగా నియమితులైన లేదా కొత్త సన్యాసులు లేదా సన్యాసినులు అవసరం. వారి అవగాహన ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. మనం దీనిని సంప్రదాయ సంఘం అని అంటాం. ఆర్య సంఘం అని కూడా ఒకటి ఉంది, ఇది ధర్మ మార్గం యొక్క కొన్ని సాక్షాత్కారాలను సాధించిన వ్యక్తులను సూచిస్తుంది.

సంప్రదాయ సంఘానికి, మరియు ఆర్య సంఘానికి మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది అద్భుతమైన సాధారణ సన్యాసులు మరియు సన్యాసినులు ఉన్నప్పటికీ, మన లాగే మానసికంగా బాధపడే వారు కూడా ఉంటారు - మరియు మనం వారి దగ్గర ఆశ్రయాన్ని ఎందుకు పొందాలి అనే ప్రశ్న కలుగుతుంది. ఈ విధంగా మూడు రత్నాలలో ఒకటైన ఆర్య సంఘమే మనకు ఆశ్రయం కల్పించే నిజమైన ఆభరణం. మన౦ సరైన దిశలో వెళ్లడానికి వాళ్లే నిజ౦గా సహాయ౦ చేయగలరు. 

సంఘం యొక్క లక్షణాలు

మనకు అవసరమైన లక్షణాలు ఈ సంఘంలో ఏమి ఉన్నాయి?

  1. వారు బోధించేటప్పుడు, పుస్తకాల నుండి నేర్చుకున్న వాటిని మాత్రమే చెప్పరు. వారు వారి స్వంత ప్రామాణిక అనుభవం నుంచి చెప్తారు - ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైనది.
  2. ఇతరులకు సహాయ౦ చేయాలనేదే వారి ఏకైక కోరిక, వారు చెప్పే వాటినే వాళ్ళు అనుసరిస్తారు. ధూమపానం చేసే వ్యక్తి ధూమపానం వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్తే, అతని సలహాను మనం ఎందుకు పాటించాలి అని ఆశ్చర్యపోతాము, అంతేకదా? ఆ కారణంగా, సంఘం వారు చేసే ప్రతి పనిలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు, కాబట్టి మనం వారిని నిజంగా నమ్మవచ్చు.
  3. మనం చెడు సావాసాలతో ఉంటే, వారి చెడు లక్షణాలను మనము ఎంతగా గ్రహిస్తామో కూడా మనకు తెలియదు. అదే విధంగా మనం మంచి స్నేహితులతో ఎక్కువ శ్రమ లేకుండా గడిపితే మనకు త్వరగా మంచి గుణాలు వస్తాయి. కాబట్టి, మన ధర్మ ఆచారాన్ని మెరుగుపరచడానికి సంఘం మనపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.

సంఘం యొక్క ప్రాముఖ్యత

బుద్ధుడు సుమారు 2500 సంవత్సరాల క్రితం మరణించాడు, అతని బోధనలు – అంటే ధర్మాన్ని - మనం ఆచరించడానికి విడిచిపెట్టి వెళ్ళాడు. బౌద్ధమతం అంటే ఇదే. కానీ మనం వీటిని సరిగ్గా ఆచరించడానికి, మనకు ఉదాహరణలు అవసరం, అంటే బుద్ధుని బోధనలను నిజంగా నేర్చుకుని అధ్యయనం చేసి మరియు ఆచరించి, దాని లక్ష్యాలలో కొన్నింటిని సాధించిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారి కలయికే సంఘం.

ఈ రోజుల్లో, మనం తరచుగా సెలబ్రిటీలను మన రోల్ మోడల్స్ గా తీసుకుంటున్నాము: నటులు మరియు నటీమణులు, మోడల్స్, గాయకులు మరియు క్రీడాకారులను. కానీ వీళ్లకే వారి సొంత సమస్యలు ఉన్నాయి, అవునా కాదా? వారి వ్యక్తిగత జీవితంలో వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయని మనకు తెలుసు! అంతే కాదు, సెలబ్రిటీల పట్ల, వారి జీవితాల పట్ల మనకు వ్యామోహం కలిగినప్పుడు, మనం మన స్నేహితులతో గుసగుసలాడుతాము; ఇలాంటి పనులు నిజంగా మనకు లేదా ఇతరులకు ఎలాంటి ప్రయోజనాన్ని కానీ ఆనందాన్ని కానీ కలిగించవు. మరోవైపు, సంఘం వాళ్ళు ఇప్పటికే ఆ సమస్యలలో కొంతవరకు సమాధానాన్ని పొందారు - అది గొప్ప విషయమేగా! - ఇంకా మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కష్టపడుతున్నారు. మన సమస్యలను కూడా వదిలించుకోవాలంటే వాళ్ళ మాటలను అనుసరించడంలో అర్థం ఉంది కదా?

ఈరోజుకి కూడా మన ఆధునిక ప్రపంచంలో బుద్ధుని అద్భుతమైన బోధనలు అందరికి తెలిసేలా చేసినందుకు మనం సంఘానికి పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన తక్షణ సమస్యలకు అతీతంగా చూడటానికి మరియు అన్ని బాధల నుండి పూర్తిగా బయటకు తీసుకువెళ్ళే మార్గాన్ని చూపించటానికి సంఘం మనల్ని ప్రేరేపిస్తుంది. వారు మనల్ని ప్రేరేపించడమే కాకుండా, మార్గనిర్దేశం చేసి, ప్రోత్సహిస్తారు మరియు పూర్తి సహాయం చేస్తారు. అందుకే సంఘం లేనిదే బౌద్ధమతం లేదని చాలా సార్లు చెబుతుంటారు.

సారాంశం

మన జీవితంలో ఒక మంచి రోల్ మోడల్ ను ఎలా ఎంచుకోవచ్చు? సంఘానికి చెందిన ఒక నిజమైన సభ్యుడిని మనం కలుసుకోలేకపోయినా - నిజమైన విజయాలు సాధించిన వ్యక్తి, ఆర్య సంఘంలో ఉన్న అనుభవజ్ఞులైన వ్యక్తులను మనం కలుసుకోవచ్చు. వారి నుండి మనం ప్రేరణను పొందవచ్చు. వారి ఉదాహరణలను చూసి, వారి అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రోత్సహించబడతాము.

సంప్రదాయ సంఘమైన బౌద్ధ సన్యాసులు, సన్యాసినుల సమర్పణ ద్వారానే ధర్మం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. బుద్ధుడిని వైద్యుడితో, ధర్మాన్ని వైద్యంతో పోల్చినట్లే, సంఘం మనల్ని ప్రోత్సహించే, మార్గ నిర్దేశం చేసే నర్సు లాంటిది, ఇది మన సమస్యలన్నింటినీ శాశ్వతంగా పోగొట్టడానికి సహాయం చేస్తుంది.

Top