మనమందరం మన జీవితానికి అర్ధం ఏమిటో తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటాము. కొందరు తమ కెరీర్ లో, కొందరు లేటెస్ట్ ఫ్యాషన్స్ ను ఫాలో అవుతూ, మరికొందరు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ వెతుకుతూ ఉంటారు. కానీ చివరికి కెరీర్ రిటైర్మెంట్ లో ముగుస్తుంది, ఫ్యాషన్లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, సెలవులు కనురెప్ప కాలంలో ముగిసిపోతూ ఉంటాయి. ఇవేవీ మనకు శాశ్వత సంతృప్తిని, సంతోషాన్ని తెచ్చిపెట్టవు. మన ఆధునిక ప్రపంచంలో భౌతికవాద మరియు ఆధ్యాత్మిక అవకాశాలు చాలా అందుబాటులో ఉన్నందుకు, మనకు అసలు ఈ జీవితంలో ఏమి చేయాలో చాలా గజిబిజిగా ఉంటుంది.
బౌద్ధమతంలో, ఆశ్రయం అంటే మన జీవితాలను ఒక అర్థవంతమైన దారిలో ఉంచడం. మనలోని లోపాలను సరిదిద్దుకుని, మనకు, మరియు ప్రతి ఒక్కరికి మంచిగా ఉపయోగపడేలా మన సామర్ధ్యాన్ని గ్రహించడమే ఆ దారి. బౌద్ధమత ఆశ్రయం తాత్కాలిక విశ్రాంతి, ఆకలి లేదా ఒత్తిడి ఉన్న వాళ్ళ కంటే ఇంకా ఎక్కువ అర్ధంలో ఆశ్రయంగా పనిచేస్తుంది. ఇది బయట దేనినీ మార్చడం గురించి చెప్పదు: మనం ఎటువంటి ప్రత్యేకమైన దుస్తులను ధరించాల్సిన అవసరం లేదు లేదా మన హెయిర్ స్టైల్ ని మార్చాల్సిన పని లేదు. బౌద్ధమతంలో ఆశ్రయం అనేది మన మానసిక స్థితిని మార్చడం గురించి ఉంటుంది. దీని అర్థం జీవితంలో మన లక్ష్యం ఏమిటి, ఏది మనకు ఇప్పుడు మరియు భవిష్యత్తులో సంతోషాన్ని ఇస్తుంది అనే దానిపై ఒక అవగాహనను పెంచుకోవడం. బౌద్ధమత ఆశ్రయం మనల్ని బాధల నుండి రక్షిస్తుంది.
బౌద్దులు సాధారణంగా "ఆశ్రయం కోసం వెళ్ళండి" లేదా "ఆశ్రయాన్ని పొందండి" అనే మాటలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆశ్రయం అనేది చురుకుగా జరుగుతుంది. ఇది బౌద్ధ మార్గానికి మనల్ని మనం అంకితం చేసుకునే ఒక ప్రాథమిక దశ. కానీ మనం ఇలా ఎందుకు చెయ్యాలి? మానవ స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు - మనమందరం ఆనందం మరియు సంతృప్తి కోసం వెతుకుతాము. మనలో ఏ ఒక్కరూ బాధను కోరుకోరు - మనకు సహాయపడే వాటి కోసం మనం వెతుకుతూ ఉంటాం. అందుకని బౌద్ధమతంలో మనం మూడు రత్నాలకు ఆశ్రయాన్ని కల్పిస్తాం.
ఈ మూడు రత్నాలు బుద్ధుడు, ధర్మం, సంఘం.
మనం బుద్ధుని ఆశ్రయానికి వెళతాం. ఎందుకంటే అతను ఒక జ్ఞానోదయ గురువుగా, మనకు అర్థరహితమైన ఉనికి నుండి బయటపడటానికి మరియు బాధ నుండి పూర్తిగా ఉపశమనాన్ని కలిగించడానికి సహాయం చేస్తాడు. మనస్సు ప్రాథమికంగా స్వచ్ఛమైనదని, కరుణ మరియు జ్ఞానంతో, మనకు ఉన్న గందరగోళం మరియు ప్రతికూల భావోద్వేగాలను శాశ్వతంగా తొలగించవచ్చని, అలా చేస్తే అవి మళ్ళీ తిరిగి రావని అతను బోధించాడు. ధర్మం అనేది వీటిని సాధించడానికి ఉన్న బుద్ధుని బోధనలు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆశ్రయం కోసం వెళతామో, మనం మన జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించుకోవటానికి వివిధ బౌద్ధమత పద్ధతులను ఆచరిస్తాము. సంఘము అంటే సన్యాసులు, సన్యాసినులు మరియు మన బౌద్ధమత సహచరులు. వారిలో బుద్ధుని బోధనలను నిజంగా ఆచరించే వారు ఆదర్శంగా నిలుస్తారు మరియు బౌద్ధ మార్గాన్ని అనుసరించడానికి మనకు ప్రేరణను ఇస్తారు.
నిబద్ధత అంటే మన స్నేహితులు లేదా సమాజం నుంచి మనల్ని మనం వేరు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, మనం ఈ మూడు రత్నాలలో ఆశ్రయం పొందినప్పుడు, మన కోసం ఒక అర్థవంతమైన జీవితాన్ని సృష్టించుకోవడమే కాకుండా, ఇతరులతో మనం బాగా కలిసిపోయి, మన చుట్టూ ఉన్నవారికి మరియు మొత్తం ప్రపంచానికి సహాయం చెయ్యడం ప్రారంభిస్తాము.
మనం బుద్ధుడు, ధర్మం, సంఘంలో ఆశ్రయం పొందినప్పుడు, ఇకపై ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇకపై ఆధ్యాత్మిక౦గా విషయాలను వెతకాల్సిన అవసర౦ లేదు, వాస్తవానికి మనకు ఇప్పటికీ భౌతిక సౌఖ్య౦, స౦పదలు అవసరమే అయినప్పటికీ, అది మనల్ని ఎప్పటికీ స౦తోష౦గా ఉ౦చదని తెలుసుకుని, మన౦ ఇక నుంచి వాటిపై ఆధారపడము. బౌద్ధమత సూత్రాల పట్ల మనం చూపించే నిబద్ధత వాస్తవానికి ఒత్తిడి నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. మిగతా ముఖ్యమైన విషయాలపై పనిచేయడానికి మనకు ఎక్కువ సమయాన్ని ఇస్తుంది: మనల్ని మానసికంగా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
అందుకే ఆశ్రయం అనేది ఒక నిరంతర, చురుకైన ప్రక్రియ. దీనికోసం మనం నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. అలాగని బుద్ధుడిని ఏదో ఒక దేవుడిలా నమ్మి అతన్ని ప్రార్థిస్తాం అని కాదు. మన బౌద్ధ మిత్రులు మన కోసం పని చేస్తారని కూడా కాదు. అందుకే అత్యున్నత ఆశ్రయం బుద్ధుని బోధనలైన ధర్మం అని చెబుతారు. బుద్ధుడిపై మనకు బలమైన విశ్వాసం ఉన్నప్పటికీ, వివేకవంతులు, దయగల బౌద్ధ మిత్రులు మనకు ఎక్కువ మంది ఉన్నప్పటికీ, ధర్మ బోధనలను మనము అనుసరించి, వాటిని ఉపయోగించకపోతే ఈ ఆశ్రయం యొక్క ప్రయోజనాన్ని మనం పొందలేము. ఇతరులకు హాని చెయ్యకుండా, ప్రయోజనకరమైన పనుల్లో పాల్గొంటూ, మన మనస్సులను సరిచేసుకోవాలి అనే ప్రధాన సలహాను మనం పాటిస్తే, మన జీవితం ఖచ్చితంగా మరింత అర్థవంతంగా తయారవుతుంది.
బౌద్ధ మార్గంలో మన ప్రయాణాన్ని సరిగ్గా ప్రారంభించడానికి ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పటికీ, అసలైన నిబద్ధత మన హృదయం నుంచి రావాలి. మనపై మనం ఎప్పుడైతే నిజంగా పనిచేయడం ప్రారంభిస్తామో, అప్పుడే మనం నిజంగా ఆశ్రయాన్ని పొందుతాం.