ఆశ్రయం: జీవితంలో ఒక సురక్షితమైన మరియు అర్థవంతమైన మార్గం

25:53
ఆశ్రయం పొందడం అనేది బౌద్ధమత బోధనలకు మరియు ఆచారాలన్నిటికి ఒక పునాది. దీన్ని "బౌద్ధమత మార్గానికి ఒక ప్రవేశ ద్వారం" అని పిలుస్తారు. ఆశ్రయం పొందడం అంటే మనపై మనం పని చేసుకోవడం అని అర్థం, ఇది మన జీవితాలకు సురక్షితమైన మరియు అర్థవంతమైన మార్గాన్ని ఇచ్చే ఒక చురుకైన ప్రాసెస్. బుద్ధుడు నేర్పించిన పద్ధతులను అనుసరించి మనం గందరగోళం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తన నుంచి బయటపడి అన్ని మంచి లక్షణాలను పెంపొందించుకుంటాము. బౌద్దులందరూ ఇదే చేశారు, మంచి జ్ఞానోదయం పొందిన గురువులు కూడా ఇదే చేశారు, వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం ఇలాగే చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము.

మన జీవితాల్లో బౌద్ధమత అభ్యాసం గురించి ఉండే గందరగోళాన్ని తొలగించడం

మన జీవితంలో ఆశ్రయం యొక్క సంబంధం గురించి మాట్లాడమని నన్ను అడిగారు. ఇది పదవ శతాబ్దం చివరలో టిబెట్ కు వెళ్ళిన గొప్ప భారతీయ గురువు అయిన అతిషా గారి ఉదాహరణను గుర్తుకు తెచ్చింది. భారతదేశం నుంచి వెళ్లిన బౌద్ధమతం టిబెట్ లో క్షీణించిన తర్వాత దానిని పునరుద్ధరించడానికి సహాయపడిన గొప్ప గురువులలో ఆయన ఒకడు. ఆ సమయంలో టిబెట్ లో పరిస్థితి ఏమిటంటే, ముఖ్యంగా తంత్రం మరియు మరింత అధునాతన బోధనల గురించి చాలా అపార్థాలు ఉన్నాయి. నిజానికి అక్కడ అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరు. నిజానికి, బోధనలను స్పష్టంగా వివరించే ఉపాధ్యాయులు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అనువదించబడిన గ్రంథాలు చాలానే ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువ మంది చదవలేకపోయారు మరియు కాపీలు కూడా ఎక్కువ లేవు. వారు అవి చదువగలిగినప్పటికీ, వాటిని అర్ధం చేసుకోవడానికి చాలా కష్టం అయ్యేది.

ఈ పరిస్థితికి సహాయం చెయ్యడానికి, పశ్చిమ టిబెట్ లోని ఒక రాజు కొంతమంది విద్యార్థులను భారతదేశానికి పంపాడు. వాళ్లతో పాటు ఒక గొప్ప బౌద్ధమత గురువును టిబెట్ కు రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళు కాలినడకన ప్రయాణించి, భాషలు నేర్చుకుని, వాతావరణాన్ని మేనేజ్ చేసుకోవాల్సి వచ్చేది. వారిలో చాలా మంది వస్తున్నప్పుడు లేదా భారతదేశంలో ఉన్నప్పుడే మరణించారు. ఏదేమైనా, వారు భారతదేశానికి చెందిన ఈ గొప్ప గురువు అయిన అతిషాను టిబెట్ కు తీసుకురాగలిగారు. ఆయన అక్కడ చాలా సంవత్సరాలు ప్రధానంగా ఆశ్రయం మరియు కర్మ గురించి భోదించారు. నిజానికి ఆయనను "ఆశ్రయం మరియు కర్మ లామా" అని పిలిచేవారు. అదే టిబెటన్లు ఆయనకు పెట్టిన పేరు.

అతిషా ఉదాహరణ ఈ రోజుల్లో చాలా సముచితమైనది. ఈ రోజుల్లో కూడా, బౌద్ధమతం మరియు దాని అభ్యాసం గురించి చాలా గందరగోళం ఉంది. ఇంకా, తంత్రం మరియు ఇతర అధునాతన బోధనల గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ప్రజలు ప్రాథమిక బౌద్ధమత బోధనల యొక్క జ్ఞానం లేకుండా వీటిని నేర్చుకోవడానికి వెళ్తున్నారు. బౌద్ధమతాన్ని ఆచరించడం అంటే ఏదో ఒక మాయా పని చెయ్యడం అని వాళ్ళు భావిస్తారు. ఆశ్రయం యొక్క ఔచిత్యాన్ని మరియు ప్రాముఖ్యతను మరియు అది మన జీవితంలో తీసుకొచ్చిన తేడాను తక్కువగా చూడటంతో, వారికి అసలు విషయం అర్ధం అవ్వలేదు.

జీవితంలో మన పరిస్థితి ఎలా ఉన్నా, బౌద్ధమత అభ్యాసం మన కోసం మనం పని చేసుకోవడానికి మరియు ఒక మంచి వ్యక్తిగా మారడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక హాబీ లేదా ఆట లాగా, ప్రతిరోజూ ఒక అరగంట లేదా వారానికి ఒకసారి మనం బాగా అలసిపోయినప్పుడు ఒక చిన్న సెషన్ లాగా చేసేది కాదు. దీనికి బదులుగా, ఇది మనం ఎప్పుడూ చెయ్యడానికి ప్రయత్నించే ఒక ఆచరణాత్మక విషయం - ఎప్పుడూ మనపై మనం పని చేసుకోవడానికి ఉండేలాగా. దీని అర్థం మన లోపాలను మరియు మన మంచి లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత చెడు శక్తిని బలహీనపరిచే మంచి పద్ధతులను బలోపేతం చేసుకోవడానికి. చివరిగా అన్ని లోపాలను వదిలించుకొని అన్ని మంచి గుణాలను సంపూర్ణంగా పొందడమే ఇక్కడి లక్ష్యం. ఇది కేవలం మన సొంత ప్రయోజనాల కోసం కాదు, వాటి నుంచి మనం మన జీవితంలో సంతోషాన్ని పొందుతాము. ఇది ఇతరులకు బాగా సహాయం చెయ్యడానికి, మరియు ఇతరుల ప్రయోజనం అందించడం కోసం ఉంటుంది. బౌద్ధమత ఆచారం అంటే ఇదే. ఈ లక్ష్యాలను సాధించడంలో ఉండే పద్ధతులే దీన్ని స్పష్టమైన బౌద్ధమతంగా చూపిస్తాయి. ఆశ్రయం అంటే మనం ఆ పద్ధతులను ఎడాప్ట్ చేసుకుని వాటిని మన జీవితంలో అవలంబించుకోవడం.

Top