ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వైశాఖ (బుద్ధ పూర్ణిమ) పండుగను జరుపుకుంటున్న బౌద్ధ సోదర సోదరీమణులందరికి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
శాక్యముని బుద్ధుడు లుంబినీలో జన్మించాడు, బోధ్గయలో జ్ఞానోదయం పొందాడు మరియు 2600 సంవత్సరాల క్రితం కుషినగర్ లో తనువు చాలించాడు, కానీ అతని బోధనలు విశ్వజనీనమైనవి మరియు అవి నేటికీ సముచితంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మిగతా వాళ్లకు సహాయం చేయాలనే లోతైన ఆలోచనతో ఉత్తేజితుడైన బుద్ధుడు తనకు జ్ఞానోదయం అయిన తర్వాత తన మిగిలిన శేష జీవితాన్ని ఒక సన్యాసిగా గడిపాడు, ఆ సమయంలో అతని అనుభవాలను వినాలనుకునే వారికి అతని బోధనలను పంచాడు. ఎవరికీ హాని చెయ్యవద్దని, అందరు వాళ్ళ శక్తికి తగినంత సహాయం చెయ్యాలనే అతని సలహాలు అహింసా మార్గాన్ని బాగా వివరిస్తాయి. ఇప్పటి కాలంలో ఇది ఈ ప్రపంచంలో మంచి పనులలో ఇది ఒక ముఖ్యమైన శక్తిగా మిగిలిపోయింది. ఎందుకంటే కరుణతో ప్రేరేపించబడిన అహింస, మనతో జీవించే వాళ్లకు సేవ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ ఆధారిత ప్రపంచంలో, మన స్వంత సంక్షేమం మరియు ఆనందం చాలా మంది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు, మనం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లకు అందరి ఏకత్వాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. మన మధ్య ఉండే ఈ నమ్మకపు విభేదాలు ఉన్నప్పటికీ, శాంతి మరియు సంతోషం కోసం ప్రజలకు ఒకే రకంగా కోరికలు ఉన్నాయి. బౌద్ధ అభ్యాసంలో భాగంగా ధ్యానంతో మన మనస్సులకు శిక్షణను ఇవ్వాలి. మన మనస్సులను శాంత పరచడానికి ప్రేమ, కరుణ, ఉదారత మరియు సహనం వంటి లక్షణాలను పెంపొందించుకుని వాటిని మనం రోజువారీ జీవితంలో ఆచరించాలి.
ఈ మధ్య కాలం వరకు, ప్రపంచంలోని అన్ని బౌద్ధ సమాజాలలో ఒకరి ఉనికి గురించి మరొకరికి కొంతవరకే అవగాహన ఉంది. మనం ఎంత ఉమ్మడిగా కలిసి అన్నిటినీ పంచుకుంటున్నామో పొగుడుకునే అవకాశం లేదు. ఈ రోజు, అనేక దేశాలలో పుట్టి ఆసక్తి ఉండి నేర్చుకునే వాళ్లందరికి బౌద్ధ సంప్రదాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, ఈ అనేక బౌద్ధ సంప్రదాయాలను ఆచరించి మరియు బోధించే మనం ఇప్పుడు ఒకరినొకరు కలుసుకుని వాళ్ళ నుంచి అన్నిటినీ నేర్చుకోగలుగుతున్నాము.
ఒక టిబెటన్ బౌద్ధ సన్యాసిగా, నన్ను నేను నలందా సంప్రదాయానికి వారసుడిగా భావిస్తున్నాను. హేతుబద్ధత, లాజిక్ తో పాతుకుపోయిన నలందా విశ్వవిద్యాలయంలో బౌద్ధమతాన్ని బోధించి అధ్యయనం చేసిన తీరు భారతదేశంలో బౌద్ధమత వికాసం యొక్క రూపాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం 21వ శతాబ్దపు బౌద్ధులమైతే, కేవలం విశ్వాసం మీదే ఆధారపడకుండా అక్కడ ఉండే అందరి లాగా బుద్ధుని బోధనలను అధ్యయనం చేసి వాటి విశ్లేషణలో నిమగ్నం కావడం కూడా ముఖ్యం.
బుద్ధుని కాలం నుంచి ప్రపంచం గణనీయంగా మారుతూ ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతిక రంగంపై అధునాతన అవగాహనను పెంపొందించుకుంది. మరోవైపు, బౌద్ధ శాస్త్రం మనస్సు మరియు భావోద్వేగాల పనితీరు గురించి వివరణాత్మక, అవగాహనను సాధించింది. ఇది ఇంకా ఆధునిక శాస్త్రానికి కొత్త విషయమే. అందుకని, ప్రతి ఒక్క దానిని అలవరచుకునే కీలకమైన జ్ఞానం మిగిలి ఉంది. ఈ రెండు విధానాలను కలుపుకుని మన శారీరక, భావోద్వేగ మరియు సామాజిక మంచి కోసం అవసరమైన ఆవిష్కరణలకు దారితీసే గొప్ప సామర్థ్యం మనకు ఉందని నేను నమ్ముతున్నాను.
బౌద్ధులుగా మనం బుద్ధుని బోధనలను పొగుడుతున్నప్పటికీ, మిగిలిన వాళ్లందరితో మనందరం చేసే సంభాషణలో అతని సందేశం చాలా సముచితమైనది. అన్ని మతాలు ప్రజల ఆనందాన్ని ప్రమోట్ చెయ్యటం కోసం మతాంతర అవగాహనను పెంపొందించుకోవాలి. అలాగే, ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన సంక్షోభం సమయంలో, మన ఆరోగ్యానికి ముప్పు ఎదురైనప్పుడు, మనం కోల్పోయిన కుటుంబం మరియు స్నేహితుల గురించి మనకు కష్టాలు ఎదురైనప్పుడు, మనందరిని ఒకే కుటుంబంగా ఏకం చేసే వాటిపై దృష్టి పెట్టాలి. దానికి తగినట్టుగా, మనం అందరినీ కరుణతో చూసుకోవాలి. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే మనకు ఎదురయ్యే ఇలాంటి ప్రపంచ సవాళ్ళను జాగ్రత్తగా డాటగలం.
దలైలామా, 7 మే 2020