మన టాపిక్, జీవితంపై ఒక బౌద్దుని ఆలోచనా విధానం, అనేది ప్రాథమికంగా మనం ఈ బుద్ధుని బోధనలను మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో వివరిస్తుంది. అసలు వాటి అర్థం ఏమిటి? ఈ ప్రశ్న చాలా కీలకమైనది. మనం ఈ బోధనలను అధ్యయనం చేసుకుని ప్రతిరోజు ధ్యానం చేసుకోవచ్చు, కానీ వీటిని మన వాస్తవ జీవితానికి ఎలా అనుసంధానించాలో అనే స్పష్టత మనకు తెలీదు. నిజానికి ఆచరణాత్మకంగా వాటి అర్థం ఎలా ఉంటుంది? అవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయి లేదా మనల్ని వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చేస్తాయి? బౌద్ధమత అభ్యాసం అనేది ఒక అలవాటులా లేదా మన జీవితంలోని కష్టాల నుండి తప్పించుకోవడానికి ఉంటుందా? మనం ఏదైనా మంచి అందమైన ఊహలోకి లేదా ఫాంటసీలోకి వెళుతున్నామా, లేదా మన అభ్యాసం చాలా ఉపయోగకరంగా మన జీవితంలో నిజంగా మనకు సహాయపడుతోందా? అన్నింటికీ మించి, ఈ బౌద్ధమత బోధనలు మన జీవితంలోని బాధలను మరియు సమస్యలను అధిగమించడానికి ఉద్దేశించినవి.
ఉపయోగకరమైన మార్గదర్శకాలు
మన రోజువారీ జీవితంలో ఈ బోధనలను ఉపయోగించడానికి చాలా మంచి మార్గదర్శకాలు మనకు ఉన్నాయి. వాటినే మనం ఎప్పుడూ పాటించవలసిన మూడు అభ్యాసాలు అని పిలుస్తాము. సాధారణంగా వీటిని చాలా బోధనలకు ముందు చదువుతారు. ఇందులో, మనకు ఈ వాక్యాలు ఉంటాయి:
అసలు ఏ నెగెటివ్ పనులను చేయవద్దు. నిర్మాణాత్మక పనులను బాగా చెయ్యండి; మీ మనస్సును పూర్తిగా లొంగదీసుకోండి. ఇవే బుద్ధుని బోధనలు.
ఇవే బౌద్ధమత బోధనలలో అతి ముఖ్యమైన అంశాలు. మొదటి వాక్యం అయిన అసలు ఏ నెగెటివ్ పనులను చేయవద్దు లో, నెగెటివ్ అంటే మనకు వినాశనాన్ని కలిగించేది, ఇతరులకు లేదా దీర్ఘకాలికంగా, మనకు సమస్యలను మరియు అసంతృప్తిని కలిగించేది. కాబట్టి, బౌద్ధమత అభ్యాసంలో మనం చెయ్యాల్సిన మొదటి పని ఏమిటంటే ఇతరులకు లేదా మనకు ఏ హానిని కలిగించకుండా ఉండటానికి ప్రయత్నించడం. రెండవ వాక్యం అయిన నిర్మాణాత్మక పనులను బాగా చెయ్యండి లో అర్ధం ఇతరులకు మరియు మనకు మంచి మరియు సంతోషాన్ని కలిగించే పనులనే చెయ్యమని.
అలా చెయ్యటానికి మీ మనసును పూర్తిగా లొంగదీసుకోండి అని మూడో వాక్యం చెబుతుంది. ఇది మన విధ్వంసక మరియు నిర్మాణాత్మక పనులకు మూలాన్ని సూచిస్తుంది. మొదటి దానికి దూరంగా ఉండి రెండవదాన్ని అమలు చేయడానికి, మనపై మనం బాగా కష్టపడాలి - ఇవి మన వైఖరి, మన భావోద్వేగాలు, మరియు మన మనస్సుల నుంచి వస్తాయి. మన వైఖరి మరియు భావోద్వేగాలు మనం ఇతరులతో ఎలా సంబంధాలు చేసుకుంటామో మరియు జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తామో, మాట్లాడతామో మరియు ఆలోచిస్తామో అనే వాటిని ప్రభావితం చేస్తాయి. అలాగే చివరి వాక్యం కూడా దీనినే సూచిస్తుంది. ఇవే బుద్ధుని బోధనలు.
రియాలిటీని అర్థం చేసుకోవడం
కొంచెం లోతుగా ఆలోచిస్తే, నా స్నేహితుడైన ఒక బౌద్ధమత గురువు చెప్పినట్లుగా, బౌద్ధమతంలోని ప్రాథమిక విధానం మనం రియాలిటీని అర్ధం చేసుకోవడమే: వాస్తవం ఏమిటో తెలుసుకుని దానితో సరైన పద్ధతిలో వ్యవహరించాలి. మరో మాటలో చెప్పాలంటే, మన ప్రవర్తన మరియు విషయాలపై అవగాహనను రియాలిటీపై ఆధారం చేసుకోవాలి.
వాస్తవం అంటే ఏమిటి? వాస్తవం అనేది కారణం మరియు ప్రభావం లేదా సాధారణంగా ఇది "ఆధారిత ఉత్పన్నం" అని పిలువబడుతుంది. పనులు కారణాలు మరియు ప్రభావాల వల్లే జరుగుతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే, మన వినాశకరమైన లేదా నిర్మాణాత్మక పనులు కారణాల నుంచి జరుగుతాయి. మనం మన ప్రవర్తనను పరిశీలిస్తే, అది సమస్యలను తెచ్చిపెడుతుంది లేదా మనకు మరియు ఇతరులకు ఎక్కువ ఆనందం మరియు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కానీ మన ప్రవర్తనను ఎలాంటి తీర్పు లేకుండా మనం చూడాలి. జీవితంతో మనం ఎలా వ్యవహరిస్తాం అనేది ఎంత ముఖ్యమో తీర్పు ఇవ్వకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.
బౌద్ధమత నైతిక విలువలు అనేవి ఏదో ఒక దేవుడు ప్రసాదించిన వాటిపై లేదా ఒక చట్టం లేదా రూలర్ ఇచ్చిన నియమాలపై ఆధారపడి ఉండవు. ఇలాంటి చట్టాల ఆధారంగా మనకు నైతిక విలువలు ఉంటే మనకు తీర్పులు ఉంటాయి. మనం చట్టాలు మరియు నియమాలను అనుసరిస్తే, అప్పుడు మంచి వారిగా పరిగణించబడి మనకు మంచి జరుగుతుంది; వాటిని పాటించకపోతే - మనం చట్టాలను ఉల్లంఘించిన ఒక చెడ్డ వ్యక్తిగా పరిగణించబడతాము మరియు శిక్షకు అర్హులం అవుతాము. ఇది బౌద్ధమత నీతి కాదు లేదా బౌద్ధమత జీవన విధానం కూడా కాదు. మన పట్ల మనమే విచక్షణతో ఉన్నట్లు అనిపించినప్పుడు ఈ విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. ఇది మనకు కావలసిన ఆలోచనా విధానాలలో ముఖ్యమైనది: మన గురించి మనం తీర్పు ఇచ్చుకోవడం మానెయ్యాలి - ఉదాహరణకు, మనం చెడ్డ వాళ్లం, అసలు మంచి వాళ్లం కాదని, లేదా మనం చేసిన పని చాలా చెడ్డదని అనుకోవడం.
దానికి బదులుగా, మన౦ జీవిత౦తో మనం వ్యవహరి౦చే విధానాన్ని కారణం, మరియు ప్రభావ౦ ఫలితంగా చూడాలి. మనం సమస్యలు సృష్టించి ఇబ్బంది కలిగిస్తే, ఇది కారణాలు మరియు పరిస్థితుల నుంచి వచ్చినట్టే. దీని అర్ధం మనం చెడ్డ వాళ్లం అని కాదు. దీని గురించి బాగా ఆలోచిస్తే, మనం ఈ పరిస్థితి గురించి ఇబ్బందిలో పడినట్టు అవుతుంది. మనకు ఏమీ అర్థం కాదు. చివరికి ఇది అంచనాలకు దారితీస్తుంది. మనం విషయాలను పెద్దవిగా చూసుకుని అన్ని రకాల తప్పుల నిందలను మనపై, పరిస్థితులపై మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులపై వేసుకుంటాము. అప్పుడు, ఈ అంచనాలు వాస్తవానికి అనుగుణంగా ఉన్నాయని మనం నమ్ముతాము, నిజానికి అవి అలా ఉండవు. మనల్ని మనం ఎందుకు వినాశకర రీతిలో ఉహించుకుంటున్నామో పరిశీలిస్తే, సాధారణంగా మనం ఈ పరిస్థితిలలో అర్థం పర్థం లేని విషయాలను ఊహించుకుని మన అంచనాలకు ప్రతిస్పందిస్తున్నామని తెలుసుకోవచ్చు.
రెండు నిజాలు
దలైలామా గారు ఇటీవల కాలంలో ప్రజల జీవితాలలో తక్కువ సమస్యలు ఉండేలా చూడడానికి సహాయపడే అత్యంత సార్వత్రిక మార్గం గురించి మాట్లాడుతున్నారు. అతను తనను తాను బౌద్ధమత శ్రోతలకే పరిమితం చేయకుండా, విశ్వవ్యాప్తంగా ఉన్న అందరినీ పట్టించుకుంటున్నారు. రెండు సత్యాలను అర్థం చేసుకుని మనం దీనిని ప్రారంభించాలని ఆయన చెప్పారు. ఇది అత్యంత ప్రాథమికమైనది. ఈ రెండు సత్యాలను మనం చాలా అధునాతనమైన రీతిలో చూడవలసిన అవసరం ఏమీ లేదు, అందరూ రిలేట్ చేసుకోగలిగే ప్రాథమిక మార్గంలో చూస్తే సరిపోతుంది. ఒక వైపు, అతిశయోక్తుల ఆధారంగా లేదా మన క్రూరమైన ఆలోచనలపై ఆధారపడి మన అంచనాలు ఉన్నాయి; మరోవైపు, వాస్తవం అంటే నిజం అనేది ఉంది. ఇవే రెండు సత్యాలు.
అయోమయంగా ఉన్న మనస్సుకు, "నేను ఓడిపోయాను, నేను మంచివాడిని కాదు, నన్ను ఎవరూ ప్రేమించరు", లేదా "ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదం" అనేవి నిజం అనే అనిపిస్తాయి. మన భోజనం మాడిపోయినప్పుడు లేదా రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసింది అయిపోయినప్పుడు లేదా ట్రాఫిక్ లో చిక్కుకుని మనం ఇంక ఎప్పటికీ ఇంటికి చేరుకోలేమని అనుకుని ఇవి కూడా నిజం లాగే అనిపిస్తాయి. ఇవి మనకు జరిగే అత్యంత భయంకరమైన విషయాలు అని అనుకుంటాము. ఉదాహరణకు ట్రాఫిక్ లో చిక్కుకుని ఇంక మనం అక్కడే ఉండిపోతామని అనుకోవడం. ఈ అంచనాలు మనం నిజమని నమ్ముతాము. ఇది ఒక సాంప్రదాయిక సత్యం: గందరగోళానికి గురైన మనస్సు తప్పుని నిజంలా చూస్తుంది.
అక్కడ వాస్తవం అనేది ఉంటుంది, అదే లోతైన సత్యం. కారణాలు, పరిస్థితుల వల్ల అక్కడ ట్రాఫిక్ ఉంటుందనేది వాస్తవం. ఇది బిజీ సమయం అందుకని ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. దీనికి మనం ఏమి చేయగలం? చలికాలంలో చలి ఎక్కువగా ఉందని కంప్లైంట్ చెయ్యడం. ఎలా ఉంటుందో చెప్పండి? ఇది చలికాలం. అందుకే చలి వస్తుంది.
రెండు సత్యాల మధ్య తేడాను మనం గుర్తించగలగాలి. మనం ఈ విషయాలను పెద్దవిగా చూసి అసంబద్ధమైన వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నామని గుర్తించినప్పుడు, వీటిని మనం మర్చిపోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే, మన జీవితంలో మనకు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, రెండు సత్యాల మధ్య తేడాను మనం అర్థం చేసుకుని ఈ అవగాహనను మన జీవితాలలో అవలంబించుకోవాలి. ఇది మనకు చాలా అవసరం.
ఈ విషయం ఇదే ప్రార్ధనలోని తరువాతి వరుసలో సూచించబడింది:
నక్షత్రాల లాగా, మసకబారిన లేదా (తిరిగే) టార్చ్, ఒక భ్రమ, మంచు చుక్కలు లేదా బుడగ, ఒక కల, లేదా మేఘాల మెరుపులు, ప్రభావిత సంభ్రమాశ్చర్యాలు అలాగే ఉంటాయి.
మనం అన్నిటినీ ఎక్కువగా ఆలోచించి ప్రొజెక్ట్ చేస్తుంటే, వాటి వల్ల మన జీవితంలో ఎలాంటి తేడా ఉండదని మనం గుర్తించాలి. నిజంగా కనిపించేది అంతా ఒక భ్రమ, ఒక కల, బుడగ లాంటిది అని మనం గుర్తించాలి. ఇది కనిపించేంత నిజమైనది ఏమీ కాదు. కాబట్టి, ఇది వాస్తవానికి అనుగుణంగా ఉంటుందని మనం నమ్మలేము. నమ్మకపోవడం అనేది మన ఫాంటసీ బెలూన్ ను ఎగరవెయ్యడం లాంటిది.
అంచనా
ప్రాథమికంగా రెండు రకాల అంచనాలు ఉంటాయి; ఒకటి ఉపయోగకరమైనది, మరొకటి హానికరమైనది. ఏ అంచనాలు మనకు ఉపయోగపడతాయి? మనకు పాజిటివ్ లేదా న్యూట్రల్ ఆలోచనలు ఉండవచ్చు; ఉదాహరణకు, మనకు ఒక యాత్రకు వెళ్లాలనే ఆలోచన ఉండవచ్చు. ఇక్కడి నుంచి అక్కడకు ప్రయాణించి ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాం. అది ఒక అంచనా: మనం ఇది లేదా అది చేయాలి, దీనిని లేదా దానిని మనతో తీసుకెళ్లాలి, రిజర్వేషన్లు చేసుకోవాలి, మొదలైనవి. ఈ రకమైన అంచనాలు మనం స్టోర్ కు వెళ్లినప్పుడు షాపింగ్ లిస్ట్ కి లేదా మనం చేసే పనికి వర్తిస్తుంది. ఇవి మనం ఏమి చేయాలనుకుంటున్నాము, మనం ఏదైనా ఎలా సాధించాలనే ప్రణాళికకు సంబంధించిన అంచనాలు. ఈ సంవత్సరంలో మనం పనిలో ఏమి సాధించాలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసేటప్పుడు ఇలా చేస్తాము.
కానీ, అప్పుడు మనం అనుకున్న ప్లాన్ ఒక కల లాంటిదని తెలుసుకోవాలి. ప్రాక్టికల్ లెవెల్ లో దీని అర్థం ఏమిటి? దీని అర్ధం ఫ్లెక్సిబుల్ గా ఉండటం. ప్రార్థనలో చెప్పినట్లు ఇవి ప్రభావిత సంభవాలు. అవి కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమవుతాయి; వాటిని కొన్నిసార్లు "కండిషన్డ్ సంభవాలు" అని కూడా పిలుస్తారు. విషయాలు కారణాలు మరియు పరిస్థితుల ఆధారంగా జరుగుతాయి, కాబట్టి మనం ప్లాన్ చేసినప్పుడు, కారణాలు మరియు పరిస్థితుల వల్ల అవి ప్రభావితమయ్యి మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ మార్పుకు ఒక ఉదాహరణ ఏమిటంటే, విమానంలో మనకు అసలు ఒక్క సీట్ కూడా అందుబాటులో ఉండకపోవడం. ఆ ఫ్లైట్ ఎక్కాలని మనం అనుకున్నా, మన ప్లాన్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. దాని గురించి కంప్లైంట్ చేసి ఇబ్బంది పడటం కన్నా, మనం వాస్తవాన్ని అంగీకరిస్తాము. దీని కోసం మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. మనం అనుకున్న ప్లాన్ లో ఇరుక్కుపోయి, ఇది ఒక భ్రమ అని తెలుసుకోవటానికి అవకాశం లేనప్పుడు, ఈ ప్రేయర్ లో తేడాలను తెలుసుకోలేనప్పుడు, మనం దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోతాము.
దాని వల్ల ఏమి వస్తుంది? ఇది చాలా విచారకరమైన మానసిక స్థితిని తెచ్చిపెడుతుంది. మనకు చాలా కోపం లేదా చిరాకుని తెచ్చిపెడుతుంది. ఇది మనల్ని బాధపెట్టి ఆ పరిస్థితిని ఏమీ మార్చకుండా ఉండిపోతుంది. ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు దానిని తిట్టడం వల్ల మనకు ఏ ప్రయోజనం ఉండదు. హారన్ కొట్టడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం ఆశించిన ఆ పరిస్థితి మారిందన్న వాస్తవాన్ని అంగీకరించడమే మనకు మంచిది. ఉదాహరణకు, మనం ఒక నిర్దిష్ట సమయానికి చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటాము; మనం ఆ ట్రైన్ ఎక్కలేకపోతాము లేదా ఆ ట్రైన్ ఆలస్యంగా వస్తుంది, అప్పుడు అక్కడ మనం చెయ్యగలిగింది ఏమీ ఉండదు. ఈ విధంగా బోధనలను మన జీవితాల్లో ఉపయోగకరమైన స్థాయిలో అన్వయించుకుంటాం.
ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి సరైన మరియు తప్పు మార్గాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. మారుతున్న పరిస్థితుల వల్ల ఎప్పుడూ మనం అనుకున్నదే జరగాలని అనుకోవడం చాలా తప్పు. ఇలా ఆలోచించడం సర్వసాధారణమైన విషయమే. మన ప్లాన్స్ మనం అనుకున్నట్లు జరగనప్పుడు వాటిని మార్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ట్రాఫిక్ లో చిక్కుకుపోవచ్చు, లేదా ప్రజలు అపాయింట్‌మెంట్ లను రద్దు చేసుకోవచ్చు. భోధిసత్వ ప్రవర్తనలో, శాంతిదేవుడు దీనికి ఇలా ఒక ఉత్తమమైన సలహాను ఇచ్చాడు:
ఒక విషయాన్ని మనం సరిదిద్దుకోగలిగితే, దాని వల్ల చెడు మూడ్ లోకి ఎందుకు వెళ్లాలి? దానిని మనం సరిదిద్దుకోగలిగితే, అలా మనం చెడు మూడ్ లోకి వెళ్ళడం ఎంత వరకు సహాయపడుతుంది?
ఆ సలహా నిజంగా ప్రాథమికమైనది, మనం అర్ధం చేసుకోవాల్సిన మరియు మన జీవన విధానంలో ఒక ముఖ్యమైన విషయం. మన జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే, దానిని మనం మార్చగలిగితే, వెంటనే అలా చేసేయ్యాలి. మనం దాన్ని మార్చలేకపోతే, ఇంకేమీ చెయ్యలేకపోతే, అప్పుడు దాని గురించి కలత చెందడంలో ఎలాంటి అర్థం ఉండదు. ఉదాహరణకు, మన ప్రయాణంలో మన లగేజీ పోయింది, మరియు మనం దానిని కొన్ని రోజులు వరకు పొందలేము. అప్పుడు మనం ఆ నిజాన్ని అంగీకరించాలి.
కొన్ని వారాల క్రితం నాకు చాలా ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. నేను హొలాండ్ లో దలైలామా గారి బోధనలను వినటానికి వెళ్తున్నాను. ఆమ్ స్టర్ డామ్ కు వెళ్ళటానికి నేను ఎయిర్‌పోర్టు కి వెళ్లి అక్కడ చెక్ ఇన్ కోసం క్యూలో నిల్చున్నాను. అక్కడి కంప్యూటర్ సిస్టమ్ పనిచేయలేదు అందుకే అక్కడ చాలా పొడవైన లైన్ ఉంది. తమ ఫ్లైట్ ల కోసం ను సకాలంలో చెక్ ఇన్ చేయలేమని అందరూ భయ పడ్డారు. అప్పుడు లైన్ లో నా ఎదురుగా ఉన్నవాళ్లు టికెట్లు, పాస్‌పోర్టులు బయటకు తీస్తున్నారు. నేను కూడా అలాగే చేద్దామని తియ్యబోయాను. అప్పుడు నేను నా పాస్‌పోర్టును తీసుకురాలేదని అర్ధం అయ్యింది. నేను పాస్ పోర్ట్ లేకుండా చెక్ ఇన్ చేయలేను మరియు నాకు జర్మన్ ఐడి కార్డు కూడా లేదు.
నా జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. నేను అప్పుడు ఏమి చెయ్యాలి? ? నేను ఎయిర్‌పోర్టు లో ఉన్నాను. నేను నా అపార్ట్‌మెంట్ కి తిరిగి వెళ్లి, పాస్‌పోర్టు తీసుకుని ఆ ఫ్లైట్ టైమ్ కి రాలేను. ఇలాంటిది ఏమైనా జరిగితే నాకు బాధ కలుగుతుంది. కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. నేను కోపం తెచ్చుకోవాలా? దాని వల్ల కూడా ఏ ప్రయోజనం ఉండదు. నేను ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరకు వెళ్లి సాయంత్రం ఇంకో ఫ్లైట్ ఉందా అని అడిగాను. ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంకేం లేవని వాళ్ళు చెప్పారు; కానీ, అదే రోజు రాత్రి సిటీకి అవతలి వైపు ఉన్న వేరే ఎయిర్‌పోర్ట్ నుంచి ఒకటి ఫ్లైట్ ఉందని చెప్పారు. దీని అర్థం నేను సాయంత్రం అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్ ని మిస్ అవుతాను అని. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఇంటికి వెళ్లి, ఇంకో ఫ్లైట్ కి రిజర్వేషన్ చేసుకుని ఆ సాయంత్రం దాన్లో ప్రయాణించాను, అంతే.
ఈ రకమైన అనుభవాలు ఇలాంటి బోధనలను మన జీవితాల్లో ఎలా అన్వయించుకుంటామో తెలుసుకోవటానికి ఒక పరీక్ష లాగా ఉంటాయి. ఈ విషయం గురించి తెలుసుకుని మనం బాధ పడి ఇబ్బందిలో పడాలా? మనకు కోపం వస్తే, ఆ కోపం మనల్ని ఇంకా బాధపెడుతుంది. ఈ పరిస్థితి యొక్క రియాలిటీని మనం వెంటనే అర్ధం చేసుకుని తర్వాత మనం ఏమి చెయ్యాలో ఆలోచించాలి. అందుకే బుద్ధుని బోధనలను అంచనాలపై ఆధారపడకుండా, అశాశ్వతపై ఆచరణాత్మక స్థాయిలో సమన్వయం చేసుకుని, ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, నేను ఒక విమానంలో ప్రయాణించి, ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి రోటర్డామ్ కు ట్రైన్ లో ప్రయాణించి, అలా ఆ సాయంత్రపు కార్యక్రమానికి వెళ్ళాలని ప్లాన్ వెయ్యటం. అది ఒక కల మాత్రమే కానీ అలా జరగదు. సరే, ఇప్పుడు మనకు వేరే ఆల్టర్నేట్ ప్లాన్ కూడా ఉంది.
ఇది ధ్యానం కోసం ఇవ్వబడిన చాలా ప్రాథమిక సూచనకు సంబంధించినది: మనం ఎటువంటి అంచనాలు లేకుండా ధ్యానం చేయాలి. మనం అంచనాలు పెట్టుకోకపోతే నిరాశ అనేది ఉండదు. బౌద్ధమతం యొక్క ఆచరణాత్మక పద్ధతులకు ఇది చాలా ముఖ్యమైనది.
నా చెల్లెలికి ఇద్దరు కొడుకులు, నలుగురు మనవళ్లు ఉన్నారు. తన కొడుకులు లేదా మనవళ్లు తనకు కాల్ చేస్తారని ఆశలు పెట్టుకోవద్దని నేను ఎప్పుడూ తనతో చెప్తూ ఉంటాను. మనం అలా ఆశిస్తే, నిరాశ పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అసలు కాల్ చెయ్యరు. మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, వారికి మనమే ఫోన్ చేయొచ్చు. ఇది అంత సులభం అనమాట; మనం వాస్తవాన్ని అంగీకరించాలి. మనం దాన్ని మార్చగలిగితే, మార్చాలి, అలా కుదరకపోతే, మార్చలేం, అంతే. మనం పోగొట్టుకున్న లగేజీ దానికంతట అది వచ్చేంత వరకు ఏమీ జరగదు. మనం ఆ విషయాన్ని అంగీకరించాలి.
దీన్ని రిపీట్ చెయ్యడానికి, మనకు రెండు రకాల అంచనాలు ఉన్నాయి. ఒకటి ఏమో ఉపయోగకరమైనది - మనం కొన్ని ప్లాన్స్ వేసి తీరాలి. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఫ్లైట్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మిగతావి ఉపయోగకరంగా కాకుండా హానికరం కూడా ఉంటాయి.
ఆలోచించటం మరియు ఆచరణలో పెట్టడం
మన హానికరమైన అంచనాలను తెలుసుకునే ముందు, మన స్వంత పరిస్థితి గురించి ఆలోచించడానికి ఒక క్షణం కేటాయించాలి. మనం ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాము? మనం అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు మనం ఎంత బాధపడతాం? ఒక విషయం ఎలా ఉండాలో అని దాని నిర్ణీత షెడ్యూల్ లో మనం ఎంతలా చిక్కుకుపోతాం; ఉదాహరణకు, ఈ పనిని ఈ ఖచ్చితమైన సమయంలో జరిగిపోవాలని; లేదా మనం రెస్టారెంట్ కు వెళితే, అక్కడ మనకు నచ్చిన ఐటెమ్స్ ఉండాలని మరియు అది త్వరగా వడ్డించబడాలని అనుకోవడం. ఒక రకమైన ప్లాన్ మరియు అంచనాకు మనం ఎంతవరకు కట్టుబడి ఉంటాము? మనం నిరాశకు లోనైతే అది ఎంత బాగుండదో గమనించడానికి ప్రయత్నించండి. మన అంచనాల కారణంగా మనం నిరాశకు గురవుతాం. వాస్తవానికి పరిస్థితులు ఎలా పనిచేస్తాయనే రియాలిటీకి అనుగుణంగా మన ప్రణాళిక ఉండాలని మనం అనుకుంటున్నాము.
కానీ ప్రతీదీ కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రెస్టారెంట్లలో మనకు కావాల్సిన ఆహారం అయిపోవచ్చు. ఇది కూడా కారణాలు మరియు పరిస్థితులు మీదే ఆధారపడి ఉంటుంది. ట్రైన్ ఆలస్యంగా వస్తుంది. మనం ట్రాఫిక్ లో చిక్కుకుని ఫ్లైట్ మిస్ అవుతాము. ఇవే కారణాలు మరియు పరిస్థితులు. మీరు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నారో ఒకసారి కూర్చొని ఆలోచించండి. వేటి కోసం అయినా మీరు పనిచేయాల్సిన అవసరం ఉందా? కేవలం అశాశ్వతం గురించి నేర్చుకుంటే సరిపోదు లేదా శ్వాసపై దృష్టి కేంద్రీకరించి అది అశాశ్వతం అని గ్రహించటం సరిపోదు. ఇది చాలా బాగుంది, కానీ దానిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? ఈ అశాశ్వతాన్ని అర్థం చేసుకోవడంలో అదే కీలకమైన అంశం.
ఒక ప్లేటుని పడేస్తే అది విరుగుతుంది అనే ఒక ఆచరణాత్మక ఉదాహరణను తీసుకోండి. దానికి మీ భావోద్వేగ ప్రతిస్పందన ఏమిటి? మీరు రాత్రి భోజనం వండుతున్నప్పుడు అది మాడిపోయింది. దాన్ని మీరు ఎమోషనల్ గా ఎలా డీల్ చేస్తారు? అక్కడే మన పనితనం బయటపడుతుంది. మనం కంప్యూటర్ లేదా ఫోన్ లో ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాము అప్పుడు అది పని చెయ్యదు. మీరు అప్పటికప్పుడే ఇంకేదైనా ప్రయత్నించగలరా? లేక బాధ పడతారా? లేదా ఇంకేమైనా చేస్తారా?
ఇవి బోధనల యొక్క ఆచరణాత్మక ఉపయోగాలు. ఆ పరిస్థితులలో మనం బాధ పడి, ప్లాన్ బి కి మారకపోతే - ఫోన్, కంప్యూటర్ లో మనకు ఏదొక నిర్ణయం తీసుకోవడానికి మరొక మార్గం ఉంటుంది - మనం బాధ పడితే, అప్పుడు మనం ఇంకేమీ చేయలేము.
హాని కలిగించే అంచనాలు
ఇంతకుముందు చెప్పినట్లుగా, అంచనాలలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ప్లానింగ్ మరియు షెడ్యూల్ కోసం ఉపయోగపడుతుంది, ఇంకొకటి హానికరమైనది. "నేను ఒక లూజర్; నన్ను ఎవరూ ప్రేమించరు; నేను ఒక భయంకరమైన వ్యక్తిని" అని ఊహించుకోవడం చాలా హానికరమైనది. లేదా భోజనం మాడినా, ట్రైన్ మిస్ అయినా అది చాలా దురదృష్టంగా భావిస్తారు. ఇటువంటి హానికరమైన అంచనాలు అతిగా ఆలోచించడం వల్లే వస్తాయి.
కోపంతో ఏదో ఒక వస్తువులోని ప్రతికూల లక్షణాలను ఎక్కువగా ఆలోచించి దాన్ని చెడగొట్టేస్తాం. సబ్వే లేదా మెట్రోలో చాలా మంది దీనిని అనుభవించారు: మనం మెట్లు దిగుతున్నప్పుడు, అప్పుడే ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్లిపోవడం చాలా సార్లు గమనించాం. దీన్ని మనం ఎలా డీల్ చెయ్యగలం? మనం ప్రమాణం చెయ్యాలా? ఐదు లేదా పది నిమిషాలు వేచి ఉండడం ఈ ప్రపంచంలో ఏమైనా ఘోరమైన పనా. కానీ దానికి కోపంతో రియాక్ట్ అయ్యి బాగా బాధపడతాం. ఇది మనల్ని అసంతృప్తికి గురిచేస్తుంది మరియు మనకు ఎలాంటి సహాయం చెయ్యదు, కదా?
అత్యాశతో, మమకారంతో, ప్రపంచంలో ఏదో ఒక అద్భుతమైన విషయంతో లేదా అత్యంత అద్భుతమైన వ్యక్తితో మనం ఉన్నామని భావిస్తాము. మనం అతిగా ఆలోచించుకుని, ప్రేమలో పడి ఆ వ్యక్తి యొక్క మంచి రూపాన్ని మాత్రమే చూస్తాము. ఆ వ్యక్తి మన ఊహలకు అనుగుణంగా జీవించాలని మనం ఆశిస్తాము, కాని అందరూ అలా ఉండలేరు. అప్పుడు మనం నిరాశకు గురవుతాం.
ఇలాంటి ప్రవర్తన సమస్యలను తెచ్చిపెడతాయి. ఎప్పుడూ జరిగేవి ఏమిటంటే, మనం విషయాలను చాలా సంకుచిత దృక్పథంతో చూస్తాము. ఉదాహరణకు, మన జీవితాల్లో మనకు ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు, లేదా ఎవరైనా మనల్ని తిరస్కరించినప్పుడు, లేదా ఎవరైనా మనకు నచ్చని పనిని చేసినప్పుడు దీనిని గమనించవచ్చు. మనతో రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి మనకు నచ్చని పని చేస్తే, మన పుట్టిన రోజున మనకు కాల్ చెయ్యకపోతే, కోపంగా అరిస్తే, తిడితే లేదా ఇంకేమైనా చేస్తే, ఆ ఒక్క సంఘటనపైనే దృష్టి పెడతాం. ఈ మంచి అనుబంధాన్ని మనం పూర్తిగా చూడము. ఇలాంటి ఆలోచనా విధానంతో మాత్రమే మనం ఆ వ్యక్తిని చూస్తాము, కాబట్టి మనకు చాలా కోపం వస్తుంది.
మనకు ఏదైనా సమస్య లేదా అనారోగ్యం వస్తే, "పాపం నేను; నేనేంటి ఇలా బాధ పడుతున్నాను." అనేది చాలా సంకుచిత దృక్పథం. ఇది విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేని సందర్భం. ఉదాహరణకు , "నన్ను ఎవరూ ప్రేమించరు." మన జీవితమంతా పరిశీలిస్తే, మనల్ని ఎవరూ ప్రేమించి ఉండరు కదా? మన కుక్క మనల్ని ప్రేమించి ఉండదు కదా? నాతో ఎవ్వరు మంచిగా ఉండలేదు మరియు పట్టించుకోలేదు కదా? అని ఆలోచిస్తాము. మరొక ఉదాహరణ, "నేను దేనికి పనికిరాని వాడిని." అనేది నిజమేనా? మనం ఏ విషయంలోనూ విజయం సాధించలేదన్నది నిజమేనా? నడవడం నేర్చుకోవడంలో లేదా టాయిలెట్ శిక్షణ పొందడంలో మనం విజయం సాధించాము, కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒకదానిలో విజయం సాధించగలం అని తెలుసుకోవాలి.
మళ్ళీ, మన అంచనాలు వాస్తవానికి అనుగుణంగా ఉండవు; కానీ అవి సరిగ్గా ఉండాలని మనం కోరుకుంటాము కాబట్టి అలాగే జరుగుతుందని మనం నమ్ముతాము. మన భాగస్వామి ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని మనం కోరుకుంటాము. దీనికి మంచి ఉదాహరణ ఏమిటంటే అంటార్కిటికాలోని పెంగ్విన్లు మరియు వాటికి ఉండే ఒకే ఒక జీవిత భాగస్వామి. మనకు అవన్నీ ఒకేలా కనిపిస్తాయి కానీ పెంగ్విన్ కి మాత్రం వాటన్నిటిలో దాని జోడీని మాత్రమే ప్రత్యేకంగా చూస్తుంది. ఖచ్చితంగా, పెంగ్విన్ల వైపు నుంచి మనం చూస్తే మనకు మనుషులందరు ఒకేలా కనిపిస్తారు; కానీ, మనల్ని మాత్రం ఇంకెవరైనా ప్రేమిస్తే అది మనకు సంబంధం ఉండదు. అలా కాకుండా నువ్వు మాత్రమే నన్ను అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా చూసి ప్రేమిస్తూ ఉండాలి అని కోరుకోవడం మనకు అస్సలు సహాయపడదు.
వాస్తవాన్ని అంగీకరించకపోవడం
హాని కలిగించే అంచనాల మరొక రూపం రియాలిటీని అంగీకరించకపోవడం, ఇతరుల రియాలిటీని చూడకుండా తిరస్కరించడం. మనుషులు భావోద్వేగాలతో కూడిన జీవులని చూడకుండా వారిని ఒక వస్తువుగా చూసినప్పుడు ఇది జరుగుతుంది. బౌద్ధమతంలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక వాక్యం ఉంది: "ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు ఎవరూ దుఃఖంతో బాధపడాలని కోరుకోరు." అని. ఎదుటివారి విషయంలో మనం దానిని ఎంత సీరియస్ గా తీసుకుంటాం? చాలా సార్లు మనం దానిని వదిలేసి ఎలా ప్రవర్తిస్తాము లేదా ఇతరులతో ఎలా మాట్లాడతాము అనేది ముఖ్యం అని అనుకోము. ఇక్కడ కారణం మరియు ప్రభావం వర్తించవు, మరియు ఇంకెవరికీ భావోద్వేగాలు ఉండనట్టు ప్రవర్తిస్తాము.
ఉదాహరణకు, మన ఆఫీస్ లో ఒక అసహ్యమైన వ్యక్తి ఉన్నాడు. కానీ, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు మరియు బాధలో ఉండటానికి ఇష్టపడడు. ప్రజలు అతనిని ఇష్టపడాలని కోరుకుంటాడు. అతను అసహ్యకరంగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే అతనికి ఏది సంతోషాన్ని ఇస్తుందో అతనికే సరిగ్గా తెలీదు. మళ్ళీ, ఇది నాన్ జడ్జిమెంటల్ గా మారుతుంది. శాంతిదేవుడు చెప్పినట్లు మన సంతోషాన్ని మన శత్రువు అనుకుని దాన్ని నాశనం చేసుకుంటాం. మరో మాటలో చెప్పాలంటే, మనం అసంతృప్తి యొక్క కారణాల కోసం పరిగెత్తుతాము. ఎవరైనా చాలా స్వార్ధపూరితంగా ప్రవర్తిస్తే, అది ప్రతి ఒక్కరినీ తిరస్కరించడానికి కారణమవుతుంది. వాళ్ళ ప్రవర్తన ఎవరికీ నచ్చదు, కానీ ఆ వ్యక్తి అది అతనికి సంతోషాన్ని కలిగిస్తుందని అనుకుంటాడు.
ఇది చాలా ముఖ్యమైనది: ఇతరులను కలిసినప్పుడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, "మీరు కూడా నాలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీకు కూడా నాలాగే ఫీలింగ్స్ ఉంటాయి. మీరు అసంతృప్తిగా ఉండటానికి ఇష్టపడరు మరియు నాలాగే అందరిచేత ఇష్టపడాలని కోరుకుంటారు. మీరు కూడా నాలాగే అసహ్యించబడకూడదని, తిరస్కరణకు గురి కాకూడదని అనుకుంటారు." మనం బస్సులో లేదా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయడానికి బాగా సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ తమ గమ్య స్థానానికి చేరుకోవాలనుకుంటారు, ఎవరూ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడానికి ఇష్టపడరు, మనలాగే అనమాట. ఎదుటివారి మీద కోపం తెచ్చుకోవడానికి అసలు ఏ కారణం లేదు. మన లాగే ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి.
బాగా సహాయపడే లైన్ ఏమిటంటే: "ప్రతి ఒక్కరూ బుద్ధుడిని ఇష్టపడరు; కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడతారని మనం ఎందుకు అనుకోవాలి?" లేదా, "వారు యేసును శిలువ వేశారు, కాబట్టి మన కోస౦ మనం ఏమి కోరుకోగలం?" అందరూ మనల్ని ప్రేమిస్తారా? ఎవరైనా మనల్ని ఇష్టపడనప్పుడు లేదా మనం కోరుకున్న విధంగా సానుకూలంగా స్పందించనప్పుడు ఇది మనకు బాగా సహాయపడుతుంది. మన అవాస్తవిక అంచనాలను ఎదుర్కోవటానికి ఆచరణాత్మక స్థాయిలో మన జీవితంలో ఇవి బాగా సహాయపడతాయి. "నేను ఎప్పుడూ సరైన వాడిగా ఉండాలి మరియు ప్రతి ఒక్కరూ నా మాటే వినాలి" అని మనం అనుకోవచ్చు. కానీ అలానే ఎందుకు జరగాలి?
గుర్తుంచుకోండి, మనం ఇక్కడ రియాలిటీకి మరియు నిజం కాని దానికి తేడాను తెలుసుకుంటున్నాము. మంచిగా చేయాలనే ఉద్దేశం, మెరుగుపరుచుకోవడం, ఎక్కువ ఏకాగ్రతను కలిగి ఉండటం లేదా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం మనకు ఉండవచ్చు. వాస్తవానికి, మనం ఆ సామర్థ్యం కలిగి ఉన్నాం కాబట్టే బాగా పనిచేయడం అనేది ఒక రియాలిటీ అంచనా. కానీ మనం "నేను ఎప్పుడూ నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు నాకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి" అని అనుకుంటాము. మన భాగస్వామి పని నుంచి ఇంటికి వచ్చినప్పుడు మరియు ఆ రోజు అసలు ఏమీ జరగనట్లు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడూ మనకు పూర్తిగా అందుబాటులో ఉండాలి అని అనుకోవటం నిజంగానే ఒక అవాస్తవికమైన అంచనా, అవునా కాదా?
మనకు అవాస్తవిక అంచనాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. మనలో ఈ అవాస్తవికమైన అంచనాలు ఎన్ని ఉన్నాయి మరియు వాటిని మనం ఎలా గుర్తించగలం? వాటిని మనం నమ్మినప్పుడు అవి మనకు హాని కలిగిస్తాయని మనం గుర్తిస్తామా? అవి భావోద్వేగ నొప్పిని ఎలా కలిగిస్తాయో మనకు తెలుస్తుందా? దలైలామా గారు వాటిని మన అంతర్గత సమస్యలను తెచ్చి పెట్టేవని పిలవడానికి ఇష్టపడతారు.
పాశ్చాత్య దేశాలలో చాలా మంది దీని తీర్పు-ఆధారిత ఫిలాసఫీలచే ప్రభావితమయ్యారు. మనలో చాలా మందికి, చాలా ఇబ్బందికరమైన ఆలోచన ఏమిటంటే మనం అనుకున్నంత మంచిగా ఉండము. ఇది చాలా జడ్జిమెంటల్. మనల్ని ఎవరూ జడ్జ్ చేయడం లేదని, మనల్ని మనం కూడా జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదని గుర్తించాలి. మనం అయోమయంలో పడి ఉండవచ్చు, కానీ దాని అర్ధం మనలో లోపం ఉందని కానీ మనం చెడ్డ వాళ్లమని కానీ కాదు. ఇది చాలా సొంత-విధ్వంసక అంచనా.
ఈ రెండు సత్యాల మధ్య తేడాను గుర్తించగలగడం చాలా అవసరం. మనకు నిజం అనిపించేది - ఉదాహరణకు, మనం తగినంత మంచి వాళ్లం కాదు - అనేది వాస్తవానికి ఒక అబద్ధం. దానిని నమ్మడానికి కారణం లేదు, కాబట్టి మనం దానిని నమ్మడం మానేసి, కారణం మరియు ప్రభావానికి అనుగుణంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే, మనం కారణాలను తీసుకురావాలి. అది సాధ్యమైతే, అలా చెయ్యాలి; అలా కుదరకపోతే, వాస్తవాన్ని అంగీకరించాలి. ఉదాహరణకు, మనం మంచి ఉద్యోగం కావాలనుకుంటే, మనం దాని కోసం వెతకాలి, అంతేగాని అది ఆకాశం నుండి వచ్చి పడుతుందని లేదా ఎవరైనా మనకు దాన్ని ఇస్తారని వేచి చూడకూడదు. ప్రతీ దానికి కారణం, మరియు ప్రభావం ఉంటాయి. అవకాశాలను అందిపుచ్చుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలే తప్ప, అది చాలా భయంకరమైనదని, మనం ఇంకా ఎప్పటికీ ముందుకు వెళ్లలేమని, దాని గురించి ఏమీ చేయలేమని భావించే స్థితిలో చిక్కుకోకూడదు. ఈ రకమైన ఆలోచన చాలా నెగెటివ్ గా ఉంటుంది. ప్రార్థనలో ఇలా ఉంటుంది: ఎలాంటి నెగెటివ్ పనులను చెయ్యొద్దు అని. ఇది చేయడం లేదా మాట్లాడటం లోనే కాదు, ఇది ఆలోచన పరంగా కూడా ఉంటుంది. ఇది మనల్ని, మరియు ఇతరులను మనం ఎలా చూస్తామో అనే దాని గురించి ఉంటుంది.
నాలుగు ఉత్తమమైన నిజాలు
రియాలిటీ నుంచి ఈ అంచనాలను వేరు చేసుకోవటానికి ఈ నాలుగు ఉత్తమమైన సత్యాలను మన జీవితాలలో ఎలా అన్వయించుకోవాలి వివరిస్తుంది. గురువు గారు చెప్పినట్లుగా, మనం రెండు సత్యాల నుండి నాలుగు సత్యాల వైపు వెళ్ళాలి. మన సమస్యలు, మొదటి ఉత్తమమైన సత్యం, కారణాల నుంచి, రెండవ ఉత్తమమైన సత్యం నుంచి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఈ అంచనాలు ఉన్నాయి మరియు దీనికి తోడుగా, ఈ అంచనాలు రియాలిటీకి అనుగుణంగా లేవనే నిజం మనకు తెలియాలి. మనం దానిని - మూడవ ఉత్తమమైన సత్యాన్ని - వదిలించుకోవాలంటే - నాలుగవ ఉత్తమమైన సత్యం అయిన రియాలిటీని - అర్థం చేసుకోవాలి మరియు మన ఊహలను వదిలెయ్యాలి.
దీనిని వాడటానికి మనం బౌద్దులు కానవసరం లేదు. దలైలామా గారు చెప్పినట్లుగా, ఇది ఒక విశ్వజనీనమైన విధానం. దీనిని మనం నాలుగు ఉత్తమమైన సత్యాలుగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఇంకేదో లాగా పిలవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా, ఇది వాస్తవానికి మూడు రత్నాలుగా చెప్పబడుతుంది. అవి ఏమిటో కూడా మనం బయటకు చెప్పనవసరం లేదు. మన సమస్యలకు కారణాలను నిర్మూలిస్తే, సమస్యలు తొలగిపోతాయని మనం అర్థం చేసుకున్నాం. ఈ అన్ని కారణాలు, సమస్యలు పోయిన స్థితి, మరియు దానికి కారణమైన అవగాహన మొత్తాన్ని కలిపి ధర్మాభరణం అని పిలుస్తారు. ఇవి మూడవ, మరియు నాలుగవ ఉత్తమమైన సత్యాలు. దాన్ని పూర్తిగా పాటించిన వారే బుద్ధులు, కొంచెం కొంచెంగా పాటించిన వారే సంఘం వాళ్లు.
ఈ విధంగా మనకు రెండు సత్యాలు, నాలుగు సత్యాలు, మరియు మూడు రత్నాలు ఉన్నాయి. అందుకోసం మనం బౌద్దులు కూడా కానవసరం లేదు. బౌద్ధుడిగా విభజించే ఈ లైన్ మన భవిష్యత్తుని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా, ఈ విధానానికి గతం మరియు భవిష్యత్తు జీవితాలపై నమ్మకం అవసరం. అతిషా కాలంలో టిబెట్ లో ప్రవేశపెట్టిన మన సంప్రదాయ సూత్ర విధానం లామ్-రిమ్, మూడు స్థాయి ప్రేరణను కలిగి ఉంటుంది. ఇవి మన భవిష్యత్తుని మెరుగుపరచడం కోసం, కంట్రోల్ లో లేని మళ్ళీ మళ్ళీ సంభవించే భవిష్యత్తు జీవితాల నుంచి విముక్తి పొందడం కోసం, ఆపై జ్ఞానోదయాన్ని పొందడం కోసం, అలా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ విముక్తి పొందడానికి ఉత్తమంగా సహాయపడుతుంది. ఈ మొత్తం నిర్మాణం భవిష్యత్తు మరియు పునర్జన్మపై ఆధారపడి ఉంటుంది. మనసును ధర్మం వైపు నడిపించే నాలుగు ఆలోచనలలోనిదే – ఈ పునర్జన్మ. పునర్జన్మ అనేది ఒకటి ఉందనే విశ్వాసం మీదే అంతా ఆధారపడి ఉంటుంది.
పాశ్చాత్యులకు లేదా మరింత సాధారణ ఆలోచనా విధానం కోసం, ఈ రెండు సత్యాలు, నాలుగు సత్యాలు మరియు మూడు రత్నాలతో ప్రారంభించడం చాలా మంచిది. దీని తర్వాత, మనం కారణం మరియు ప్రభావం యొక్క విషయాన్ని పరిచయం చేయవచ్చు; కానీ మనకు ఖచ్చితమైన మొదలు ఉంటే ఈ కారణం మరియు ఫలితం సరిగ్గా అర్థం కాదు. ఇది ఒక మొదలు లేని మనస్సుకు దారితీస్తుంది; ఒక మొదలు లేని మనస్సును మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మనం పునర్జన్మను అర్థం చేసుకుంటాం. ఈ సమయంలో, మన భవిష్యత్తు కోసం ప్రయోజనం పొంది సంసారం నుంచి విముక్తి పొంది, అలాగే ఈ అనియంత్రిత పునర్జన్మ నుంచి కూడా విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లామ్-రిమ్ గ్రేడెడ్ మార్గంలో మన నమ్మకం పునర్జన్మపై మాత్రమే ఆధారపడి ఉంటే, అది స్థిరంగా ఉండదు. దీని అర్థం ఈ లామ్-రిమ్ సాధన చేయడం నిరుపయోగం అని కాదు; కానీ సాంప్రదాయకంగా టిబిటెన్లు మొదలయ్యే ప్రదేశాన్ని, అంటే పునర్జన్మపై నమ్మకంతో ఉన్న ప్రదేశంలో అది బాగా స్థిరంగా ఉంటుంది.
ఈ రెండు సత్యాలు మరియు మిగతావన్నీ ఈ బోధనలను మన జీవితాలలో అన్వయించుకునే మార్గాన్ని సూచిస్తుంది. మన అంచనాలకు, రియాలిటీకి మధ్య తేడా, మనం ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నామో గుర్తించడం, మరియు ఆ అంచనాలపై మన తప్పుడు నమ్మకంతో ఇది మొదలవుతుంది. వీటన్నిటి తీర్పు గురించి ఆలోచించకుండా మనం దీన్ని సాధించాలి. ఉదాహరణకు, "మీరు నాకు సహాయం చేస్తారని నేను అనుకున్నాను కాని మీరు అలా చెయ్యలేదు" లేదా "మీరు దానిని సరిగ్గా చేస్తారని నేను అనుకున్నాను, కాని మీరు అలా చేయలేదు." మన పనిలో, వాళ్ళు బాగా చేస్తారనే ఆశతో ఒకరికి ఒక పనిని మనం అప్పగించాము కాని అది అలా జరగలేదు. అప్పుడు మనం ఏమి చెయ్యాలి? ఆ పని మనమే చేసుకుంటాం. ఆ వ్యక్తి మీద మనకు కోపం వస్తుందా? దాని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. భవిష్యత్తులో వారికి ఇలాంటి పని మళ్ళీ ఇవ్వవద్దు లేదా దానిని సరిగ్గా ఎలా చేయాలో వారికి నేర్పించాలి. రియాలిటీతో వ్యవహరించండి. ఎటువంటి సహాయం లేకుండా ఆ వ్యక్తి పనిని సరిగ్గా చేస్తాడనే ఆశ వల్ల మనం బాధ పడాల్సి వచ్చింది. వాళ్ళు ఆ పని చేస్తారని మనం ఆశించవచ్చు; అది వేరు. ఎలాంటి అంచనాలు లేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు
మనం ఈ పద్ధతులను అనుసరించాలనుకున్నప్పుడు, నెగెటివ్ పనులు అస్సలు ఏమీ చేయవద్దు, మనకు ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావానికి లోనయ్యే విధంగా మనం ప్రవర్తించినా, మాట్లాడుతున్నా లేదా ఆలోచిస్తున్నా వాటిని వెంటనే గుర్తించాలి. ఇబ్బంది పెట్టే భావోద్వేగం అనేది ఒక మానసిక స్థితి, ఇది మన మనశ్శాంతిని మరియు సొంత నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. మనకు కోపం వచ్చినప్పుడు, మనశ్శాంతి అనేది ఏమీ ఉండదు, తర్వాత మనం పశ్చాత్తాపపడాల్సిన మాటలు చెప్తాము, మరియు అలాంటి పనులనే చేస్తాము. మనం అత్యాశలో ఉండి ఒకరికి బాగా దగ్గరైనప్పుడు, అది ప్రశాంతమైన మానసిక స్థితి కాదు, ఆ తర్వాత మనం చాలా హాస్యాస్పదంగా భావించే విషయాలను చెబుతాము.
ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావంతో మనం ప్రవర్తిస్తున్నప్పుడు దీనిని గుర్తించాలి. మన స్వంత శక్తికి మనం కొంచెం సున్నితంగా మారినప్పుడు, ఏదైనా అంతర్లీన శత్రుత్వం లేదా కంట్రోల్ ఉన్నప్పుడు మనం కొంచెం ఆందోళన చెందుతున్నట్లు అనిపించవచ్చు. ఈ వినాశకరమైన మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మన అజ్ఞానం మరియు మన తెలివితక్కువ బుద్ధి నుంచి వస్తాయి. మనకు కారణం, మరియు ప్రభావం గురించి తెలియదు. మనం మూర్ఖులమని కాదు; విషయాలు అన్నీ కారణం మరియు ప్రభావం నుంచి వస్తాయని మనకు తెలియదు, మరియు మన అంచనాలు వాస్తవానికి అనుగుణంగా ఉండవని మనకు తెలియదు.
ఏడు పాయింట్ల మైండ్ ట్రైనింగ్ వివరంగా ఇలా చెబుతుంది:
నిందలన్నిటినీ ఒకే విషయం మీద పడెయ్యండి, అదే సొంత-ప్రేమ.
దీని అర్థం పనులు మనం కోరుకున్న విధంగా జరగాలని మనం ఎప్పుడూ కోరుకుంటున్నాము. ఇది "నేను ముందు" అనే పద్ధతి: "నేను ప్రొజెక్ట్ చేసే మరియు విషయాలు నేను అనుకున్నట్టే జరగాలని ఆశించడం." ఇలాంటి ప్రవర్తనలపై మన సమస్యలను నిందించడం చాలా ఉపయోగకరమైన సలహా. ఉదాహరణలు: "ఈ రెస్టారెంట్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను", లేదా "ఈ సాయంత్రం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను" లేదా "మీరు నా పట్ల మంచిగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను." ఇది "నేను, నేను, నేను" అనే దాని నుంచి వస్తుంది. మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం, మిగతా వాళ్ళ గురించి కాదు. ఎవరికైనా కష్టమైన రోజు ఉండవచ్చు లేదా వేరే పనిలో నిమగ్నమై ఉండవచ్చు అని మనం ఎప్పుడూ అనుకోవడం లేదు. ఇది కేవలం "నేను" మరియు నాకు ఏమి కావాలో అనే దాని గురించి మాత్రమే ఉంటుంది. ఈ రకమైన సమస్యలపై దృష్టి పెట్టి మన జీవితంలో వీటిని మార్చుకోవాలి. జీవితంపై బౌద్ధమత ఆలోచనా విధానం ఏమిటంటే, మన అన్ని సమస్యలకు కారణం మనం మాత్రమే బాగుపడాలని కోరుకోవడం. దీని అర్థం స్వార్థపరుడిలా ఉండటం. ఇది మన అవసరాలను పూర్తిగా పట్టించుకోకూడదని చెప్పదు, కానీ మన అవసరాలను మాత్రమే ముఖ్యమైనదిగా తీసుకోకుండా ఇతరుల అవసరాలను పట్టించుకోకుండా ఉండకూడదు. ఇది చాలా ప్రాథమిక విధానం.
నిర్మాణాత్మకమైన దాన్ని బాగా అమలు చేయడం అంటే కోపం, అత్యాశ లేదా అవసరం లేకుండా అవగాహనతో వ్యవహరించడం. ఎప్పుడూ శ్రద్ధ అవసరమయ్యే వ్యక్తిగా కాకుండా మనం వేరేలా ఉండాలనుకుంటున్నాము. ఆ ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది, అవునా కాదా? ఇతరుల మీద అవాస్తవికమైన డిమాండ్లు చేసి మనం నిరాశ చెందుతాం. నిర్మాణాత్మకంగా వ్యవహరించడం అంటే అలా లేకుండా ఉండటమే. దీని అర్థం లోతైన స్థాయిలో మనం ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు ఈ ప్రవర్తనను వదిలెయ్యటమని కాదు; కానీ దాని బలమైన ప్రభావంతో మనం వ్యవహరించలేకపోతున్నాం అనే.
జీవితమే మన శిక్షణ ప్రదేశం
మనం అమాయకంగా ఉండి ఇతరుల లక్షణాలను గుర్తించకుండా ఉండటం అని కాదు. మనకు కూడా భావాలు ఉన్నట్లే, ఇతరులకు కూడా ఉంటాయని మనం గుర్తించాలి. రిజెక్షన్ లేదా పట్టించుకోకపోవడం మనకు ఇష్టం లేనట్లే, ఇతరులు కూడా రిజెక్షన్ కి లేదా పట్టించుకోకపోవడానికి ఇష్టపడరు. ఇవి మనం మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన సాక్షాత్కారాలు. అలా చేయడానికి, ప్రార్థనలోని మూడవ లైన్ లో చెప్పినట్లుగా, మన మనస్సులను పూర్తిగా అణచివేయాలి.
మన జీవితాలను ఒక శిక్షణా ప్రదేశంగా చూడటం మనకు చాలా సహాయపడుతుంది. ప్రాక్టీస్ అంటే ఇదే. కొవ్వొత్తులు, ధూపం, నిశ్శబ్దం మరియు ఏడ్వని పిల్లలతో అందమైన వాతావరణంలో కుషన్ మీద కూర్చోవడానికి ఇది పరిమితం కాదు.
ఒకసారి నేను ఒక బౌద్ధమత కేంద్రానికి వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్లకు నా శిష్యుడు బోధిస్తున్నాడు, ఎవరో ఒకరు వాళ్ళ రెండేళ్ల పాపను అక్కడకు తీసుకువచ్చారు. సెషన్ జరుగుతున్న సమయంలో ఆ రెండేళ్ల పాప టీచింగ్ రూమ్ లో పరిగెత్తుతూ ఉంది. ఆ రెండేళ్ల పాప నుంచి మనం ఇంకేం ఆశిస్తాం - గంటన్నర సేపు అక్కడే కూర్చొని ఉండగలదా? ఆ పాపని క్లాస్ లోకి తీసుకురావడమే సరైన పని ఆ ఉపాధ్యాయుడు సూచించాడు; మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ చిన్న పాప పరిగెత్తడం మరియు శబ్దం చేయడం మనకు చాలా కష్టంగానే ఉంటుంది. ఇదే అసలైన పద్ధతి. మనం అప్పుడు సరిగ్గా ప్రాక్టీస్ చేయగలమా మరియు ఇబ్బంది పడకుండా దృష్టి పోగొట్టుకోకుండా ఉండగలమా? పిల్లలు గాయపడకుండా ఉండటానికి తల్లిదండ్రులు శ్రద్ధ వహించరని దీని అర్థం కాదు. కానీ బయట ఉండే ఎక్కువ శబ్దంతో ఉన్న ట్రాఫిక్ లో లేదా మనం ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చెయ్యగలమా?
ఇదే జీవితం, మన అజ్ఞానం, తెలుసుకోలేకపోవడం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు వ్యతిరేకంగా జీవితం, ఆచరణకు నిజమైన యుద్ధభూమిగా ఉండాలి. భోధిసత్వుని రత్నాల మాలలో అతిషా దీనిని స్పష్టంగా ఇలా చెప్పాడు:
ఎక్కువ మంది మధ్యలో ఉన్నప్పుడు, నా స్పీచ్ ని చెక్ చేసుకుంటాను. ఒంటరిగా ఉన్నప్పుడు, నేను నా మనస్సును చెక్ చేసుకుంటాను.
ఇది చాలా ఉపయోగకరమైనది. మనం ఇతరులతో ఉన్నప్పుడు, వారితో ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. ఇది కేవలం మాటల గురించి మాత్రమే కాదు, గొంతు, భావోద్వేగాలు, వాటి వెనుక ఉన్న ప్రవర్తనలకు కూడా. మనం శత్రుత్వంతోనో, అహంకారంతోనో మాట్లాడుతున్నామని అనిపిస్తే, ఆ విషయాన్ని గమనించి మెల్లగా మాట్లాడండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సుల విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో తెలుసుకోవాలి.
ఇది ఏడు-పాయింట్ల మైండ్ ట్రైనింగ్ లో మూడు క్లిష్టమైన విషయాలు ఉన్నాయని చెప్తుంది: ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండటం - వారిని గుర్తుంచుకోవడానికి - వాటిని అప్లై చెయ్యడానికి మరియు వాటిని నిర్వహించడానికి బుద్ధిపూర్వకంగా ఉండటం అనేవి గుర్తుంచుకోవాల్సిన అత్యంత కష్టమైన మరియు ముఖ్యమైన విషయాలు. బుద్ధిపూర్వకత అభ్యాసం గురించి మనం విన్నాము, కానీ పాశ్చాత్య సందర్భంలో అర్థం చేసుకున్నట్లుగా, మనం ప్రస్తుత క్షణంలో ఉండాలని దీని అర్థం కాదు. "బుద్ధిపూర్వకత" అనే పదం గుర్తుంచుకోవాల్సిన పదం. మనం ప్రొజెక్ట్ చేస్తున్నది చెత్త విషయం అని గుర్తుపెట్టుకుని, ఆ తర్వాత ఈ అవగాహనను అన్వయించుకుని దాన్ని కొనసాగించాలి. అదే నిజ జీవితంలో అసలైన ప్రాక్టీస్.
భావాత్మకం కానిది మరియు భావనాత్మకమైనది
ఈ బౌద్ధమత సలహాలన్నీ మనం వింటూ ఉంటాం, భావాత్మకం కానిది మరియు భావనాత్మకమైనది అని. అసలు దాని అర్థం ఏమిటి? వాస్తవానికి, మనం దాని గురించి చాలా సాంకేతిక నిర్వచనం మరియు విశ్లేషణను తెలుసుకోవచ్చు; కానీ మనం దానిని ఆచరణాత్మక స్థాయిలో చూస్తే, వాటిని ఉపయోగించడానికి ఈ విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఫ్లైట్ లేదా ట్రైన్ ని మిస్ అయినప్పుడు, మన చేతిలో లేని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతీదీ కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమవుతుంది. మనం కోప్పడితే అది మనకు ఎలాంటి సహాయం చెయ్యదు. మొదటి అడుగుగా మనం ఈ అంశాల గురించి ఆలోచించవచ్చు, కానీ అది ఆటోమేటిక్ గా మారిపోవాలని మనం కోరుకుంటున్నాము. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది అక్కడే ఉంది. ఆటోమేటిక్ గా, మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా మామూలుగానే ఉంటాము.
దీనినే మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది ఏదో మాంత్రిక స్థితి కాదు. బహుశా ఇది పూర్తి లోతైన నాన్ కాన్సెప్చువల్ స్థితి కాకపోవచ్చు, కానీ సాంకేతికేతర మార్గంలో, దీనిని సాధించడానికి మనం సాధన చేస్తున్నాము. మనకు మరియు ఇతరులకు ఎక్కువ బాధలను సృష్టించకుండా ఉండటానికి ఈ బోధనలన్నింటినీ మన జీవితంలో అనుసరిస్తున్నాము. ఇదంతా దాని గురించే.
ప్రశ్నలు
ఒక ప్లాన్ ను అనుసరించడంలో ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి?
నేను ఫ్లెక్సిబుల్ అని మరియు రియాలిటీని ఎదుర్కోవాలనుకుంటున్నాను అని ఆలోచించాలి, కానీ ఇది ఎప్పుడూ నిజం కాదు. రియాలిటీని తెలుసుకోవడంలో నాకు ఎదురయ్యే ఒక సమస్య ఏమిటంటే, ఒక ప్లాన్ ని ఎప్పుడు వదిలెయ్యాలి మరియు ఎప్పుడు వదిలెయ్యకూడదు, మరియు దేన్ని మార్చవచ్చో దేన్ని మార్చకూడదో అని తెలుసుకోవడమే. ఉదాహరణకు, నేను ట్రైన్ ని మిస్ అయ్యి, ఒక టాక్సీ తీసుకుని తర్వాతి స్టేషన్లో ఆ ట్రైన్ ఎక్కాను. మన ప్లాన్ కోసం పోరాడటానికి ప్రయత్నించడం ఉపయోగకరంగా ఉంటుందో లేదో అని మనం ఎలా అంచనా వేయాలి?
ఒక ప్లాన్ ను అనుసరించడంలో లేదా వదులుకోవడంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. దానికి అల్టెర్నేటివ్ లు ఉన్నాయా లేదా, దాన్ని మార్చవచ్చా లేదా అని మనం చూడాలి. ఉదాహరణకు టాక్సీలో వెళ్లి తర్వాతి స్టేషన్ లో ట్రైన్ పట్టుకోవడం వంటివి. టాక్సీలు అందుబాటులో లేకపోతే, ఆ ప్లాన్ ని మానుకోవాల్సి వస్తుంది. ఇది ప్రాక్టికల్ స్థాయిలో ఒక ఉదాహరణ. కానీ వేరే విషయంలో, మనం ఒక స్కూల్ లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాము కానీ ఈ సంవత్సరం మనకు ఆ అవకాశం దక్కలేదు. దాన్ని మనం వదులుకోవాలా లేదా వచ్చే సంవత్సరం మళ్ళీ అప్లై చెయ్యాలా? దీన్ని మనం ఎవాల్యూయేట్ చేసుకోవాలి. మనకు ఇంకెక్కడా సీట్ దొరకకపోతే వచ్చే సంవత్సరం అప్లై చెయ్యడంలో ఎలాంటి తప్పు లేదు. అందులో రియాలిటీ అంశాలను విశ్లేషించాల్సి ఉంటుంది. మన సామర్థ్యాలను, అర్హతలను ఎక్కువగా చూపిస్తున్నామా లేదా? మనం ఇతరుల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి వ్యక్తి యొక్క ఛాయిస్ కి విశ్లేషణ అవసరం; ప్రతి దాన్ని కవర్ చేసే పేటెంట్ సమాధానం ఏదీ ఉండదు. మన లక్ష్యాలను సాధించడం దేనిపై ఆధారపడి ఉంటుందో మనం పరిశీలించాలి, ఎందుకంటే కారణాలు మరియు పరిస్థితుల వల్లే అన్నీ జరుగుతాయి. ఆ కారణాలు మరియు పరిస్థితులను మనం తీర్చవచ్చా? ఇప్పుడు మనం వాటిని తీర్చలేకపోతే భవిష్యత్తులో అవకాశం ఉంటుందా? దీనికి అల్టెర్నేటివ్ లు ఏమైనా ఉన్నాయా? ఈ నిర్ణయాలను, మార్పులను చాలా హేతుబద్ధంగా పరిశీలించాలి.
చాలా ఎమోషనల్ మనిషిగా ఉండటం
నన్ను నేను ఇలా బాధలో చిక్కుకుని చూడటం ఇదే మొదటిసారి. నా అంచనాలు హేతుబద్ధమైనవి కావని నేను గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ నా భావాలు భిన్నంగా ఉంటాయి మరియు నేను వెనక్కి తగ్గుతూనే ఉంటాను. నన్ను నేను తగ్గించుకోకుండా ప్రాక్టీస్ చేయడానికి ఏమి చేయగలను, ఎందుకంటే ఇప్పుడు ఇది గుర్తుంచుకోవడం కష్టం?
తరచుగా, మనకు ఏది సహాయపడుతుందో మరియు ఏది ఉత్తమమో తెలుస్తుంది, కానీ మన భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. వాస్తవానికి దాని గురించి మనం ఏమైనా చెయ్యాలంటే కష్టంగా ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా సాధారణ విషయం. మనం మరింత నిర్ణయాత్మకంగా ఉండటానికి ప్రయత్నించాలి, అంటే నేను చాలా భావోద్వేగానికి లోనైనప్పటికీ మరియు బాధ పడినప్పటికీ, ఇది నేను అంత సీరియస్ గా తీసుకునే విషయం కాదు అని అనుకోవాలి.
దీని అర్ధాన్ని తప్పుగా అర్థం చేసుకోకపోవడం చాలా ముఖ్యం. మనం దేని వల్ల అయినా బాగా బాధపడవచ్చు, కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. మనోభావాలు, మరియు భావోద్వేగాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. మనం వాటినే పట్టుకొని వేలాడనవసరం లేదు. ఉదాహరణకు, "నేను మళ్ళీ పాడుచేసి నా అంచనాలకు తగినట్టుగా ఈ పనిని చెయ్యలేదు కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. నేను అసలు మంచివాడిని కాదు." ఆ విధంగా ఆలోచిస్తూ, మనం ఆ మానసిక స్థితితో గుర్తించబడుతున్నాము, అందుకే దాని గురించే ఆలోచిస్తున్నాము. మనకు ఏది చాలా ముఖ్యమైనదిగా లేదా ప్రత్యేకమైనదిగా అనిపిస్తుందో దాని గురించే మనం ఆలోచిస్తున్నాం, కానీ నిజానికి అలా ఏమీ ఉండదు. ఇది కేవలం ఒక పాసింగ్ మూడ్ మాత్రమే. అది నిజంగా మనకు కావలసింది కాదని మనం నమ్మాలి. ఈ మూడ్ పోతుందని మనం నమ్మాలి, ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. ఇది మనకు ఉన్న అవాస్తవిక అంచనా అని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకు బాధగా అనిపిస్తుంది, కానీ ఆ బాధ తొందర్లోనే పోతుంది. ఆ బాధను మనం ప్రపంచం అంతం అయిపోతున్నట్టు సీరియస్ గా తీసుకోకూడదు.
సాంప్రదాయకంగా, ఒక మానసిక స్థితిని ఆకాశంలో మేఘంగా వర్ణించవచ్చు మరియు అది మనల్ని దాటుకుని వెళ్ళిపోతుంది. దానిని ఎదుర్కోవడం ప్రారంభించడానికి అదొక్కటే మార్గం. అలాగే భావోద్వేగాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని మనం గ్రహించాలి. మనలో కొంతమంది మిగతా వాళ్ళ కన్నా ఎక్కువ ఎమోషనల్ అవుతారు. మనం వాళ్ళ గురించి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది రియాలిటీని అంగీకరించడంలో ఒక భాగం. వాస్తవం ఏమిటంటే, మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాము; మనం చాలా ఎమోషనల్ అయ్యి సులభంగా బాధ పడవచ్చు, కానీ మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజం అంటే ఏమిటో తెలుసుకోవడానికి బాగా పని చేయండి.
ఉదాహరణకు, "నేను ఈ రిట్రీట్ కు వెళ్ళాను అప్పుడు నాకు అద్భుతమైన ఏకాగ్రత ఉంటుందని అనుకున్నాను, కాని నా మనస్సులో ఏవేవో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి." కాబట్టి, మనకు ఒక అవాస్తవమైన అంచనా ఉంది. వాస్తవానికి, మన మనస్సు ఎటో తిరుగుతూ ఉంటుంది. అది అంత మంచి విషయం కాదు. అంచనాను తగ్గించుకుని దాని గురించి నిజాయితీగా ఉండండి. ఉదాహరణకు, "నేను అత్యున్నత స్థాయికి వెళ్ళగలను, కానీ అది కారణం మరియు పరిస్థితులపై ఆధారపడకుండా కుదరదు. నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది."
అలాగే, మనం చాలా భావోద్వేగానికి లోనైతే, ఆ ధోరణిని మార్చి పాజిటివ్ భావోద్వేగాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు. అలాంటప్పుడు మనం బలమైన ప్రేమను, కరుణను అనుభవించగలుగుతాం. అలా ఆలోచిస్తే, భావోద్వేగానికి గురికావడం ఒక పాజిటివ్ విషయమే. ఏదేమైనా, కొంతమంది చాలా హేతుబద్ధంగా ఉంటారు మరియు వాళ్ళకు ఏ భావోద్వేగాన్ని అయినా అనుభవించడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్లకు, నిజంగా ప్రేమ మరియు కరుణను అనుభవించడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలా భావోద్వేగ వ్యక్తి అయితే, ఇప్పటికే మీలో ఏదో ఒక పాజిటివ్ విషయం ఉండి ఉంటుంది, ఇప్పుడు దానిని మార్చగలిగితే చాలు. మీరు కారణాన్ని మరియు ప్రభావాన్ని వర్తింపజేస్తే అది తప్పకుండా జరుగుతుంది.
మా కంఫర్ట్ జోన్ ల బయట ఉండి పనిచేయడం
మనం ఈ శిక్షణను తీసుకుంటున్నాము మరియు సమాజంలో అనేక పరిస్థితులలో ప్రజలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మనకు కూడా తెలుసు. మన కంఫర్ట్ జోన్ ల నుంచి బయటకు వచ్చి మనకు మానసికంగా సవాలు చేసే విషయాలను ఎదుర్కోవటానికి ఈ విధంగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని మనకు ఎప్పుడు తెలుస్తుంది?
ఇది నిర్మాణాత్మకమైన లేదా వినాశకరమైన దానితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బార్ కు వెళ్లడం, అక్కడ సమయం గడపడం ఉపయోగకరమైనది కాకపోవచ్చు. ఒక భోధిసత్వుడు అక్కడ ఉన్న వాళ్లకు సహాయం చేయడానికి నరకానికి వెళ్తాడని మనం చెప్పవచ్చు, కానీ అది మనలాంటి వారికి కొంచెం తేడాగా అనిపించవచ్చు. కానీ మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా మంచి పని చెయ్యడం, వీధిలో ఉన్న నిరాశ్రయుడితో కొన్ని మంచి మాటలు మాట్లాడటం వేరుగా ఉంటుంది.
మనం గుర్తించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న దాని పరంగా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఎంత సహాయకరంగా ఉంటుంది అని. కొంతమంది యువకులు క్లబ్ కు వెళ్లి ఆ రాత్రి నుంచి ఉదయం వరకు టెక్నో సంగీతానికి డాన్సులు చేస్తారు. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అలా చేయడం వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం మాత్రమే, కానీ ఇది నెగెటివ్ విషయాలను అధిగమించడానికి ప్రయత్నిస్తే తప్ప మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ పొద్దున దాకా డాన్సులు వేయకుండా, మ్యూజిక్ వల్ల చెవుడు తెచ్చుకోకుండా ఉంటే వాటిని అధిగమించడానికి మనం కష్ట పడవచ్చు. ఏదేమైనా, శరణార్థులతో పనిచేయడం లాంటి ఇతర విషయాలు మన కంఫర్ట్ జోన్లకు బయట ఉంటాయి. వారితో కలిసి పనిచేయడానికి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం నిర్మాణాత్మకంగా మరియు సానుకూలంగా ఉంటుంది. ఇది మన ఉదారత భావం యొక్క అభివృద్ధికి సహాయపడుతుంది.
బెర్లిన్ లో, నాకు ఒక చిన్న వీక్లీ డిస్కషన్ క్లాస్ ఉంది. నేను నా స్నేహితులతో కలిసి క్లాస్ అయిపోయిన తర్వాత భోజనం చెయ్యటానికి బయటకు వెళ్ళాము. వారి జీవితంలో ధర్మం వారికి ఎలా సహాయపడుతుందని నేను అడిగాను. ఆ విద్యార్థుల్లో ఒకరు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు, అతను బాగా శ్రద్ధ వహించే మరియు అందంగా కనిపించే వాళ్లకు దగ్గరవుతాడు. ఒక రకంగా చెప్పాలంటే, అతను మిగతా వాళ్ల కంటే ముఖ్యమైన వాడని భావిస్తూ ఉంటాడు. అందుకని, అతను ఒక లావుగా మరియు ముఖం మీద ఏదో ఒక రకమైన మచ్చ ఉన్న వాడితో స్నేహం చేశాడు. అతను సంతోషంగా ఉండాలని, అతను అందరిచేత ఇష్టపడాలని, ఎవరి చేత అసహ్యించబడటానికి ఇష్టపడని వ్యక్తి లాగా ఉండాలనుకున్నాడు. ఈ వ్యక్తి రత్నం లాంటి ఒక కొత్త గొప్ప స్నేహితుడు అవ్వొచ్చు. అతను ఈ వ్యక్తిని దూరం పెట్టకూడదు అని అనుకున్నాడు. మన కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు రావడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. ఇలాంటి పనులు చెయ్యడం చాలా సులభం. మనం మన సాధారణ పరిమితులను దాటి వెళ్లాలనుకుంటే, అది సాధ్యమయ్యే మరియు చేరుకోలేని దశలలో చేయండి.
మరో మిత్రుడు తీవ్రస్థాయికి వెళ్లాడు. అతను ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడతాడు. ఉదాహరణకు, అతను పార్కులో మాదక ద్రవ్యాలు అమ్మే వెధవలతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్లతో ఉండటం అసౌకర్యంగా ఉంటుంది కాబట్టే అలా చేశాడు. దాని వల్ల ఉపయోగం ఉన్నట్టు నాకేమీ అనిపించడం లేదు. అలా చేయడం దాదాపు అనవసరమైన పనే అనిపించింది.
మన కంఫర్ట్ జోన్ ల నుంచి ఎలా బయటకు రావాలి మరియు మన కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలు. మన కంఫర్ట్ జోన్ లోపల మనం సురక్షితంగా ఉన్నామని అనుకోవడం ఎంతవరకు సమంజసం? కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి? అది మనలో మనం విశ్లేషించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఎలాంటి వ్యక్తితో అయినా మనం ఏ పరిస్థితిలో అయినా సౌకర్యవంతంగా ఉండగలమా?
దానికి కీలకమైనది ఒక విషయం మీద నింద వేయడం: అదే స్వార్ధం. మన౦ ఇతరులతో లేదా పరిస్థితులలో అసౌకర్య౦గా ఉన్నప్పుడు, దానికి కారణం "నేను, నేను, నేను" అని స్వార్ధంగా ఆలోచి౦చడ౦ వల్లే. ఉదాహరణకు, "ఇది నాకు నచ్చదు, మరియు నేను దానిని హ్యాండిల్ చెయ్యలేను" అని మనం అనుకుంటాము. అప్పుడు మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించము. ఇతరుల గురించి ఆలోచించి వాళ్లను కూడా మనలాగే మనుషులుగా చూడాలి.
సారాంశం
ఇవి కొన్ని ప్రాథమిక సూత్రాలు. ఇలా స్వార్ధంగా ఉండకపోతే మనం పూర్తి సంతోషంతో ఉండగలం. మనం మరొక వ్యక్తితో ఉన్నప్పుడు, మన గురించి మాత్రమే మాట్లాడకుండా, ఆ అవతలి వ్యక్తి పట్ల మనస్ఫూర్తిగా ఆసక్తి చూపి, వారి జీవితాల గురించి అడిగితే, అప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాము. అప్పుడు ఖచ్చితంగా అవతలి వ్యక్తి కూడా సంతోషపడతాడు. ఇవి జీవితంతో మరియు ఇతరులతో వ్యవహరించే మన విధానాలలో ప్రాథమిక మరియు ఆచరణాత్మక మార్పులు. ఇది మనం సాధించాలనుకునే బుద్ధిపూర్వకత అని గుర్తుంచుకోండి. మనం స్వార్థపరులుగా ఉన్నప్పుడు లేదా మన గురించి మనం మాత్రమే ఆలోచిస్తున్నప్పుడు ఈ సలహాలను ఉపయోగించాలని ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, అవతలి వ్యక్తి బిజీగా ఉండి వెళ్లిపోవాలనుకుంటున్నాడు, కానీ మనం అతనితో మాట్లాడుతూనే ఉంటాము. మనం చెప్పాల్సిందే చాలా ముఖ్యమని మనం భావిస్తూ ఉంటాం. అవతలి వ్యక్తి నిజంగా మనం చెప్పేది వినాలనుకుంటున్నాడా? లేదు కదా, కానీ మనం వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. మన జీవితంలో ధర్మాన్ని ఆచరించాలి.