బౌద్ధమతానికి మరియు ధ్యానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ ఇది ఏ రంగంలో అయినా ఉపయోగించగలిగే ఆలోచనలపై చాలా రకాల విషయాలను అందిస్తుంది. ఎలాంటి ప్రాజెక్టుని అయినా లేదా ఏ వ్యాపారాన్ని అయినా నడపడానికి సహాయపడే కొన్ని బౌద్ధమత సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
లక్ష్యాన్ని డిఫైన్ చేసుకోండి
బౌద్ధమత జీవితంలో నిమగ్నమయ్యే ముందు మన లక్ష్యం మరియు దిశపై ఒక స్పష్టమైన అవగాహనను కలిగి ఉండాలని బౌద్ధమతం గట్టిగా చెప్తుంది. మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను పూర్తిగా వదిలించుకోవడం మరియు మన మనస్సులు మరియు హృదయాల యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడం లాంటివి. ఈ ఆఖరి స్థితినే మనం "జ్ఞానోదయం" అంటాం.
అలాగే, మనం ఏదైనా ప్రాజెక్ట్ లేదా బిజినెస్ ని మొదలుపెట్టినప్పుడు, ఒక లక్ష్యాన్ని డిఫైన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అవునా కాదా? ఇది మన వినియోగదారులకు మంచి విలువను మరియు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తోందా లేదా? లక్ష్యాన్ని ఎంత సరిగ్గా డిఫైన్ చేసుకుంటే, దాన్ని పొందటానికి కావలసిన మార్గాన్ని గుర్తించడం అంత సులభం అవుతుంది. అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కూడా మనకు ఎక్కువ ఉంటుంది.
కారణం మరియు ప్రభావం యొక్క సూత్రాన్ని పాటించండి
లక్ష్యాన్ని డిఫైన్ చేసుకున్న తర్వాత, ఈ లక్ష్యానికి అవసరమైన కారణాలను మనం గుర్తించాలి. జ్ఞానోదయం కోసం, కారణాలు, మన చెడు ప్రవర్తనను అరికట్టి మన మనస్సులలోని మంచి లక్షణాలకు శిక్షణ ఇచ్చి, ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి మరియు దానితో తగినట్టుగా వ్యవహరించడానికి నిర్మాణాత్మక, వాస్తవిక మార్గాలతో మనల్ని మనం పరిచయం చేసుకోవడం లాంటిది ఇది.
ఒక బిజినెస్ ప్రాజెక్టు విషయంలో, మన ఆఖరి లక్ష్యానికి ఉండే కారణాలను కనిపెట్టడానికి మనం లాజిక్ ని ఉపయోగించాలి. ఇది రివర్స్ ఇంజినీరింగ్ లా ఉంటుంది. ఒక నిర్దిష్ట లక్ష్యానికి చేర్చే పనుల లాజిక్ వరుసను మనం కనిపెట్టడం ప్రారంభిస్తాము. ఈ ప్రక్రియ లక్ష్యాన్ని సాధించడానికి మనకు అవసరమైన దశలను నిర్వచించడానికి సహాయపడుతుంది మరియు ప్రాజెక్ట్ యొక్క రోడ్ మ్యాప్ కు మంచి పునాదిని ఏర్పరుస్తుంది.
కరుణ: ఒక వినియోగదారుని సమస్యను పరిష్కరించండి
కరుణ అనేది అతి ముఖ్యమైన బౌద్ధమత సూత్రాలలో ఒకటి. బుద్ధుని బోధనల ప్రకారం:
ఎదుటి వాళ్ళు తమ కష్టాల నుంచి విముక్తి పొందాలని కోరుకోవటమే కరుణ అంటే.
దీనికి బిజినెస్ తో సంబంధం ఏం ఉంది? బిజినెస్ ఒక కస్టమర్ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక బిజినెస్ అందించే పరిష్కారం ముందుగానే ఉన్న ఇతర పరిష్కారాల కన్నా బాగుంటే, అది ఆ పోటీలో గెలుస్తుంది. కాబట్టి, మన వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకుని దాని పట్ల ఒక సానుభూతి ఆలోచనను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మన వినియోగదారుల జీవితాల్లో ఎదుర్కొంటున్న కొన్ని నిజమైన సమస్యలను మనం గుర్తించి వాటిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, అలా వాటిని అర్ధం చేసుకుని, ఈ సమస్యలను సాధ్యమైనంత ఉత్తమమైన మార్గాలలో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. కరుణ అనేది ఒక బిజినెస్ కి కస్టమర్-ఫస్ట్ లేదా వినియోగదారు-కేంద్రీకృత విధానానికి పునాది.
శాశ్వతం కానిది: మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండాలి
బౌద్ధమత విశ్లేషణ వాస్తవికత గురించి ఇంకొక విలువైన ఆలోచనను తెస్తుంది: ప్రతీదీ నిరంతరం మారుతూనే ఉంటుంది - మనం, పర్యావరణం మరియు మన చుట్టూ ఉన్న ప్రజలందరూ స్పష్టంగా మరియు దృఢంగా అనిపించే ఆలోచనలో పడిపోవటం చాలా సులభం; కానీ, వేగంగా మారుతున్న ఈ రియాలిటీలో, ఇది తరచుగా సంకుచిత ఆలోచనకు, మొండితనానికి ఒక కారణంగా మారుతుంది.
ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ నే తీసుకుందాం. ఇంటర్నెట్ అనేది మీడియాను వాడే తీరుని మార్చిందని వాళ్ళు గ్రహించారు. పాత కాలపు ఆలోచనలో వీడియో కంటెంట్ చూడటానికి ఉన్న ఒకే ఒక పరిష్కారం: డివిడిని అద్దెకు తీసుకోవడం. కానీ నెట్ ఫ్లిక్స్ ఆ పనికి వేరే సులభమైన మార్గం ఒకటి ఉందని గ్రహించింది - అదే వీడియో స్ట్రీమింగ్. మీడియా వినియోగ పరిశ్రమ మొత్తం ఈ మార్కెట్ యొక్క అస్థిరతను మరియు వినియోగదారుల అలవాట్లను తెలుసుకోలేకపోయింది. కానీ నెట్ ఫ్లిక్స్ ముందుగా దీనిని గ్రహించి, ఆ మొత్తం పరిశ్రమను శాశ్వతంగా మార్చేసింది.
నైతికత: మిమ్మల్ని, మీ టీమ్ ని మరియు మీ వినియోగదారులని గౌరవించండి
బౌద్ధమత నైతికత మొత్తం అహింస మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మరియు ఎవ్వరికీ బాధలు ఉండకూడదని మనకు తెలుసు. ఈ అవగాహనను అర్ధం చేసుకుని మనం ఇతరులకు హాని కలిగించకుండా ఉంటే, మనం వారి గౌరవాన్ని మరియు నమ్మకాన్ని పొందుతాం.
మనం మన సహోద్యోగులను గౌరవిస్తే, అది మన టీమ్ కు నమ్మకాన్ని మరియు అవగాహనను తెస్తుంది. ప్రజల వెనక లేదా వారి ముఖం మీద చెడుగా మాట్లాడకుండా ఉండటానికి మనం ప్రయత్నిస్తాము మరియు దానితో పాటు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాము. ఇంకా, మనం మన కస్టమర్లను ఎంత గౌరవిస్తామో, అంత ఎక్కువ నమ్మకం మరియు విశ్వసనీయతను వాళ్ళ నుంచి తిరిగి పొందుతాము. జప్పోస్ వంటి గొప్ప కంపెనీలు, తమ వ్యాపార మోడల్ లో వినియోగదారుల అవసరాలను గౌరవించడం మరియు పనిచేసే వాళ్లలో సమతౌల్యం మరియు నిజాయితీగా ఉండటంపై ఆధారపడి ఉన్నాయి.
సారాంశం
మన బిజినెస్ ని బలంగా తయారు చేసుకోవడానికి మనం 5 బౌద్ధమత సూత్రాలను ఉపయోగించవచ్చు. అవి:
- లక్ష్యాన్ని డిఫైన్ చేసుకోవడం.
- కారణం మరియు ప్రభావంపై ఆధారపడటం.
- వినియోగదారుని పట్ల సహానుభూతి మరియు కరుణను పెంపొందించుకోవడం.
- శాశ్వతం కాని దాన్ని గుర్తుంచుకుని అనువుగా మరియు సృజనాత్మకంగా ఉండటం.
- నైతిక సూత్రాలను పాటించి సహోద్యోగులు మరియు వినియోగదారుల పట్ల గౌరవాన్ని పాటించటం.