బౌద్ధమతంలోని రకాలు

02:58
బుద్ధుని బోధనలు వివిధ ఆసియా దేశాలు మరియు సంస్కృతులకు వ్యాపించడంతో, స్థానిక ప్రజలు తమ స్వంత స్థానిక విశ్వాసాలతో సామరస్యంగా అనిపించిన అంశాలను స్వీకరించారు. ఈ విధంగా, బౌద్ధమతం యొక్క అనేక రూపాలు అభివృద్ధి చెందాయి, ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేకమైన విధానాన్ని మరియు శైలిని కలిగి ఉంది, ఇవన్నీ ఆ బోధనల యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది బుద్ధుని బోధనా పద్ధతికి అనుగుణంగా ఉంటుంది. ఇది అతని ప్రతి శిష్యుని మనస్తత్వానికి అనుగుణంగా తన సందేశాన్ని రూపు దిద్దుకుని ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ప్రధాన వ్యవస్థలలో బౌద్ధమతం యొక్క థెరవాడ, చైనీస్ మరియు టిబెటన్ రూపాల యొక్క కొన్ని విభిన్న లక్షణాలను తెలుసుకుందాం.

థెరవాడ

ఆగ్నేయ ఆసియాలో ఆచరించబడే థెరవాడ, బుద్ధిపూర్వకత ధ్యానం యొక్క అభ్యాసానికి ప్రాధాన్యతను ఇస్తుంది. కూర్చొని శ్వాస మరియు శరీరంలోని అనుభూతులను మరియు చాలా నెమ్మదిగా నడుస్తున్నప్పుడు కదలికలపై దృష్టి పెడుతూ ఇది చెయ్యబడుతుంది. ప్రతి క్షణం ఉద్భవించడం, పడిపోవడం అనే స్పృహతో, అశాశ్వత సాక్షాత్కారాన్ని పొందుతారు. ఈ అవగాహనను ఒక వ్యక్తి యొక్క అన్ని అనుభవాలను విశ్లేషించడానికి అప్లై చేసినప్పుడు, ప్రతి దానికి మరియు ప్రతి ఒక్కరికి స్వతంత్రంగా ఉన్న శాశ్వత, మారని ఆత్మ ఉండదని గ్రహించబడుతుంది. అన్నీ క్షణికావేశాలే. ఈ విధంగా, స్వార్ధపు ఆందోళన మరియు అది తీసుకువచ్చే దుఃఖం నుంచి తనను తాను విముక్తి చేసుకునే వాస్తవికత యొక్క అవగాహనను పొందుతారు.

అపారమైన ప్రేమ, కరుణ, సమతుల్యం మరియు ఆనందంపై ధ్యానాలను కూడా థెరవాడ బోధిస్తుంది, కానీ గత దశాబ్దాలలో మాత్రమే బౌద్దులను సామాజిక మరియు పర్యావరణ సహాయ కార్యక్రమాలలో నిమగ్నం చెయ్యడానికి థాయిలాండ్ లో "నిమగ్నమైన బౌద్ధం" అని పిలువబడే ఉద్యమం జరిగింది.

థెరవాడ సన్యాసులు బౌద్ధమత గ్రంథాలను అధ్యయనం చేస్తారు, వాటిని జపిస్తారు, మరియు సాధారణ ప్రజల కోసం ఆచార వేడుకలు నిర్వహిస్తారు. సన్యాసులు ప్రతిరోజూ నిశ్శబ్దంగా భిక్షాటన చేస్తారు, గృహస్థులు వారికి ఆహారాన్ని అందించి ఉదారతను పాటిస్తారు.

తూర్పు ఆసియా మహాయాన

చైనా నుండి ఉద్భవించిన తూర్పు ఆసియా మహాయాన సంప్రదాయాలలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి: స్వచ్ఛమైన భూమి, మరియు జపాన్ లో పిలవబడే జెన్.

  • స్వచ్ఛమైన భూమి ఆచారం అనంత కాంతి బుద్ధుడైన అమితాబ నామాన్ని తన స్వచ్ఛమైన ఆనంద భూమికి వెళ్ళడానికి ఒక పద్ధతిగా చెబుతుంది, ఇది బుద్ధుడు అవ్వడానికి అనుకూలించే ఒక రకమైన స్వర్గం.
  • జెన్ కఠినమైన ధ్యానాన్ని నొక్కి చెబుతుంది, దీనిలో ఒక వ్యక్తి అన్ని భావాత్మక ఆలోచనల నుంచి మనస్సును శాంతపరుచుకుని కరుణ మరియు జ్ఞానంతో కూడిన మనస్సు యొక్క స్వచ్ఛమైన స్వభావం మెరుగుపడుతుంది.

ఈ రెండు సంప్రదాయాలలో సన్యాసులు మరియు సన్యాసినులు గ్రంథాలను చదువుతారు మరియు కన్ఫ్యూషియన్ సంస్కృతికి అనుగుణంగా, ప్రత్యేకించి చనిపోయిన పూర్వీకుల కోసం వేడుకలు నిర్వహిస్తారు.

టిబెటన్ మహాయాన

మధ్య ఆసియా అంతటా కనిపించే మహాయాన బౌద్ధమతం యొక్క టిబెటన్ రూపం భారతీయ బౌద్ధమతం యొక్క పూర్తి చారిత్రక అభివృద్ధిని, ముఖ్యంగా నలంద వంటి గొప్ప సన్యాస విశ్వవిద్యాలయాల సంప్రదాయాలను సంరక్షిస్తుంది. అందువల్ల, ఇది ముఖ్యంగా మనస్సు, భావోద్వేగాలు మరియు వాస్తవికత యొక్క స్వభావం గురించి, లాజిక్ మరియు చర్చ మాధ్యమంతో, ఈ అంశాలపై తీవ్రమైన ధ్యానం నిర్వహించే అధ్యయనానికి ప్రాధాన్యతను ఇస్తుంది.

ఈ విధానం టిబెట్ లో, భారతీయ బౌద్ధమత సంప్రదాయమైన తంత్ర అభ్యాసంతో కలిసి ఉంటుంది, దీనిలో ఒక వ్యక్తి ఊహా శక్తిని ఉపయోగిస్తాడు మరియు శరీరంలోని సూక్ష్మ శక్తులతో తనను తాను బుద్ధుడిగా మార్చుకుంటాడు. శూన్యత (శూన్యం) మరియు కరుణపై దృష్టి పెట్టడం ద్వారా ఇది జరుగుతుంది మరియు ఆ సందర్భంలో, తనను తాను ఒక నిర్దిష్ట బుద్ధ రూపంగా ఊహించుకుంటాడు. ఇటువంటి రూపాలను కొన్నిసార్లు "ధ్యాన దేవతలు" అని పిలుస్తారు, అవి అర్థం లేదా పనితీరులో దేవుడితో సమానం కాదు, మరియు బౌద్ధమతం ఏ విధంగానూ ఎక్కువ మందిని కొలిచే మతం కాదు. ప్రతి బుద్ధ రూపం బుద్ధుని జ్ఞానోదయం యొక్క ఒక అంశానికి ప్రతీక, అంటే జ్ఞానం లేదా కరుణకి. అటువంటి రూపంలో తనను తాను ఊహించుకోవడం మరియు దానికి సంబంధించిన పవిత్ర వాక్యాలను (మంత్రాలను) చదవడం ఒక వ్యక్తి యొక్క మోసపూరిత, ప్రతికూల సొంత ప్రతిబింబాన్ని అధిగమించడానికి మరియు ఆ బొమ్మలో పొందుపరిచిన లక్షణాలను అభివృద్ధి చెయ్యడానికి సహాయపడుతుంది. ఇటువంటి పద్ధతులు చాలా అధునాతనమైనవి మరియు వీటికి పూర్తి అర్హత కలిగిన ఉపాధ్యాయుడి యొక్క పర్యవేక్షణ అవసరం పడుతుంది.

టిబెటన్ బౌద్ధమతంలో జపం చెయ్యడం మరియు ఆచారాలను పాటించడం కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రతికూల శక్తులను మరియు దయ్యాల రూపంలో జోక్యం చేసుకునేవాటిని తొలగించడానికి రూపొందించబడ్డాయి. ఇలాంటి పనులు చేసేటప్పుడు, కష్టాలను అధిగమించడానికి శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి ధ్యాన సహాయంగా తమను  తాము అత్యంత శక్తివంతమైన రూపంలో ఊహించుకుంటారు. ప్రేమ మరియు కరుణను పెంపొందించడానికి ధ్యాన పద్ధతులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఇందులో ఊహ యొక్క ఉపయోగం కూడా ఉంటుంది.

సారాంశం

థెరవాడ యొక్క బుద్ధిపూర్వకత అభ్యాసాలను చూసినా, చైనాలో అమితాబ బుద్ధుని పేరును చదవడం లేదా టిబెట్‌లో చర్చ మరియు ఊహల అభ్యాసాలను చూసినా, బౌద్ధమతం యొక్క అన్ని రూపాలు ఒకే సందర్భంలో సరిపోతాయి. అవన్నీ బాధలను అధిగమించడానికి మరియు ఒకరి సామర్థ్యాన్ని గ్రహించడానికి సమర్థవంతమైన పద్ధతులను అందిస్తాయి, ఒకరి స్వంత ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా ఇతరులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి ఉంటాయి.

Top