లామ్-రిమ్ గ్రేడెడ్ మార్గం యొక్క వివరణ

విలువైన మానవ జీవితం యొక్క ఉత్తమమైన ఉపయోగం

ఈ విలువైన మానవ శరీరంతో మనందరికీ ఒక అమూల్యమైన మానవ పునర్జన్మ దక్కింది, ఇది సాధ్యమైనంత గొప్ప ఆధ్యాత్మిక పురోగతిని మనకు అందిస్తుంది. జ్ఞానోదయం పొందడానికి మనకు ఇప్పుడు మానవులుగా ఉన్న దాని కంటే ఇంక వేరే ఏ మంచి అవకాశం దొరకదు - దేవతల రాజు అయిన ఇంద్రుడిగా మనం పునర్జన్మ పొందినా కానీ ఉండదు!

మనకు ఇప్పుడు ఉన్న దాని కంటే మెరుగైన పని ఆధారం లేదు కాబట్టి, దాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి అన్ని విధానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అత్యద్భుతమైన మార్గం మనలో, బాగా, దయగల మరియు వెచ్చని హృదయాన్ని పెంపొందించుకోవడం. వెచ్చని హృదయం ఆధారంగా, మనం బోధిచిత్త లక్ష్యం యొక్క అంకితమైన హృదయాన్ని అభివృద్ధి చేసుకుంటాము. ఇది జ్ఞానోదయం సాధించాలనే కోరిక, మరో మాటలో చెప్పాలంటే మన లోపాలన్నింటినీ తొలగించి, సాధ్యమైనంత ఉత్తమంగా ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చడానికి మన పూర్తి సామర్థ్యాన్ని సాధించాలనే కోరిక. మనం మన హృదయాన్ని ఇతరులకు అంకితం చేసినప్పుడు, జ్ఞానోదయాన్ని సాధించడానికి, మన అమూల్యమైన మానవ పునర్జన్మను ఉత్తమంగా ఉపయోగించుకోగలం.

ఈ జన్మలో విజయానికి కారణం గత జీవిత ప్రవర్తన నుంచి వచ్చిన పాజిటివ్ శక్తి

మనుషుల్లో అనేక రకాల వాళ్ళు ఉన్నారు. వారందరిలో జ్ఞానోదయం పొందడం అనేది పక్కన పెడితే, తమ భవిష్యత్ జీవితాలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆసక్తి ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. చాలా మంది ఈ జన్మలో మాత్రమే తమ కోసం ఆనందాన్ని కనిపెట్టడం కోసమే ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా, అందరూ ఒకటే, ఇందులో మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాము మరియు ఎవరూ బాధపడాలని లేదా సమస్యలు తెచ్చుకోవాలని కోరుకోరు.

ఈ జన్మలో సుఖసంతోషాలు పొందేవారికి శారీరక ఆనందం, మానసిక ఆనందం అనే రెండు ఉంటాయి. చాలా మంది తమ దృష్టిని ఏదో ఒక శారీరక ఆనందానికే పరిమితం చేస్తారు. కానీ శారీరక ఆనందం గురించి కూడా, మనమందరం దాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, మనలో చాలా మందికి అది ఎలా చెయ్యాలో తెలియదు. ఉదాహరణకు, ఆహారం, దుస్తులు, ఆశ్రయం మరియు హోదా కోసం బయటకు వెళ్లి అమాయక జీవులను చంపి లేదా వధించే వారు కూడా  ఉన్నారు. మరికొందరు ఆనందం కోసం, ఏదో ఒక రకమైన శారీరక సంతోషాన్ని కనుక్కునే ప్రయత్నంలో దొంగతనం, మోసం లేదా దోపిడీకి పాల్పడతారు. కానీ, వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఆ సంతోషాన్ని ఎలా పొందాలో వాళ్లకు కూడా నిజంగా తెలియదు. ఆనందానికి బదులుగా, వారు తమకు ఎక్కువ సమస్యలను సృష్టించుకుంటారు.

మరోవైపు, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, విద్య, కళలు మొదలైన వాటిలో నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించే వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించవచ్చు. విజయం సాధించినవారు, సంపదలు, ఆస్తులను సంపాదించినవారు, మరోవైపు విజయం సాధించనివారు, లేదా పూర్తిగా విఫలమైన వారు కూడా ఉన్నారు. దీనికి కారణమేమిటని అడిగితే - కొందరు ఎందుకు విజయం సాధిస్తారు, మరికొందరు ఎందుకు విఫలమవుతారు అని - దీనికి కారణం వారు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు అని చెప్పుకోవచ్చు. గత జన్మలలో చెడుగా ఉన్నవారు గొప్ప నెగెటివ్ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు మరియు దానికి ఫలితంగా, వారు ఈ జన్మలో విఫలమయ్యారు. గత జన్మలో మంచిగా జీవించిన వారు పాజిటివ్ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు, మరియు అది ఈ జన్మలో వారి విజయానికి మరియు ఆనందానికి కారణమవుతుంది.

కొంతమంది ఎందుకు విజయం సాధిస్తారు మరియు వేరే వాళ్ళు ఎందుకు విఫలమవుతారు అనే దానికి మీరు ఈ వివరణను అంగీకరించకపోతే, అటువంటి తేడా ఉండటానికి నిజంగా ఎటువంటి కారణం లేదని పరిగణించండి. ఒకవేళ మనుషులు అదే ప్రయత్నం మరియు సామర్థ్యంతో పనిచేస్తుంటే, వారు అదే స్థాయిలో విజయాన్ని సాధించాలి. ఈ జన్మలో జీవనోపాధి కోసం వాళ్ళు చేసే పని ఫలితంగా విజయం వస్తుందని కొంతమంది అనుకుంటారు - వ్యాపారం లేదా వాణిజ్యం లాంటివి - కానీ అది పూర్తిగా లెక్కించబడదు. విజయానికి అసలు కారణాలు మునుపటి జన్మలలో నిర్మాణాత్మక పనులు చేసి నిర్మించబడిన సామర్థ్యాలు, అయితే ఈ జన్మలో మనం నిమగ్నమయ్యే పని మరియు కార్యాచరణ ఆ పరిస్థితులు మరియు కారణాలు పెరగడానికి పరిస్థితులుగా పని చేస్తాయి.          

దానికి అనుగుణంగా, విజయం కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కారణాలు గత జన్మల నుంచి వస్తాయి - ఆ జన్మలలో నిర్మించబడిన సామర్థ్యాలు. ఈ జన్మలో గడిపిన సమయం, మరియు పడిన శ్రమను బట్టి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రెండూ కలిసే రావాలి.

భవిష్యత్తు జీవితాల గురించి ఆందోళన చెందడం

ఈ జన్మలో మనుషులు ఎంత ధనవంతులైనా, ఎన్ని సుఖాలు అనుభవించినా; వారు కూడబెట్టిన దానితో ఎవరూ సంతృప్తి చెందినట్లు కనిపించరు. "ఇప్పుడు నాకు ఉన్నది చాలు; నాకు ఇంకేమీ అవసరం లేదు" అని ఎవరూ అనరు. వాళ్లకు ఉన్నదానితో ఎప్పుడూ సంతృప్తి పడరు. వాళ్ళు ఎప్పుడూ ఎక్కువ కోరుకుంటారు. వారు తమ జీవితమంతా పని చేస్తూనే గడుపుతారు. అయినా వారి పని ముగిసిపోదు.

సంవత్సరంలోని అన్ని సీజన్లలో శ్రమించడం, నాటడం, పొలాలకు వెళ్లడం మరియు కోతలు కోయడం లాంటి పనులు చేసే రైతు లాగా ఆగని చక్రంగా మారుతుంది. శీతాకాలంలో, అతను మళ్ళీ మొక్కలు నాటుతాడు, మళ్ళీ అదే పనిని రిపీట్ చేస్తాడు. మనం ఎలా పని చేస్తున్నామో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

ఈ జీవితపు పని ముగిసిపోతుందని మనం ఎప్పుడూ అనుకోనప్పటికి, నిజానికి అది ముగిసే సమయం ఉంటుంది - మన మరణ సమయం. ఆ సమయంలో, అది ఆనంద స్థితి కంటే దుఃఖం స్థితిలో ముగుస్తుంది.

కాబట్టి ఈ జన్మకు ఆహారం, దుస్తులు, గుర్తింపు పొందడానికి మాత్రమే పనిచేస్తున్న వారు నిజంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే, వారు శారీరక సుఖాన్ని పొందినప్పటికీ, మానసిక ఆనందాన్ని మాత్రం పొందలేరు. మానసిక సంతోషం లేకపోతే వారు జీవితంలో సంతృప్తి చెందకుండా, అసంతృప్తితోనే మరణిస్తారు.

కాబట్టి, దీర్ఘకాలిక, మానసిక ఆధారిత ఆనందం కోసం పనిచెయ్యడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఈ జన్మలో మనం పొందే ఈ శారీరక ఆనందం దీర్ఘకాలికమైనది కాదు. మనం నిజంగా శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటే, మన భవిష్యత్తు జీవితాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, దాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మనం నిజంగా దీర్ఘకాలిక ఆనందం కోసం పని చెయ్యవచ్చు.

మనం భవిష్యత్తు జన్మలలో ఆనందాన్ని సాధించడానికి కష్టపడితే, అది ధర్మం యొక్క ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండటం అంటే ఏమిటో నిర్వచనాన్ని నెరవేరుస్తుంది. మనం ఈ జీవితపు సమస్యలకే పరిమితమైతే - నశించిపోయే విషయాలకు - అప్పుడు మనం కేవలం ప్రాపంచిక, భౌతికమైన వ్యక్తిగా మాత్రమే ఉండిపోతాం. మన౦ భవిష్యత్తు జీవితాలలో ఉండే సమస్యల గురి౦చి ఆలోచి౦చడ౦ మొదలుపెట్టినప్పుడు, మన౦ ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మారుతాం.

వినాశకరమైన ప్రవర్తన తొలగించుకోవడం మన భవిష్యత్తు జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఒక మార్గం

భవిష్యత్తు జీవితాలలో ఆనందాన్ని నిర్ధారించే మార్గం ధర్మం యొక్క కొన్ని "నివారణ చర్యలు" పాటించడం. ముఖ్యంగా, వినాశకర పనులు చెయ్యకుండా మనల్ని మనం నిగ్రహించుకోవడం. పది నిర్దిష్ట విధ్వంసక చర్యలు ఉన్నాయి, వీటిలో శరీరం యొక్క మూడు, మాటల యొక్క నాలుగు మరియు మనస్సు యొక్క మూడు ఉన్నాయి. ఈ మార్గాల్లో వినాశకరంగా ప్రవర్తించకుండా మనల్ని మనం నిగ్రహించుకోవడం మరియు రక్షించుకోవడం ద్వారా, భవిష్యత్తు జన్మలలో మనం ఆనందాన్ని పొందుతాము.

మనం మంచి రీతిలో వ్యవహరిస్తే, దీనిలో మరియు భవిష్యత్తు జీవితాలలో అన్నీ బాగా జరిగే ఆధ్యాత్మిక అభ్యాసాన్ని మనం మొదలుపెడతాము. ఈ రకమైన నిర్మాణాత్మక ప్రవర్తన వల్ల, ఉదాహరణకు, ఒక జంతువు లేదా కీటకాన్ని ఉద్దేశపూర్వకంగా చంపడం లేదా దొంగతనం లాంటి పనుల నుంచి వచ్చే అన్ని లోపాలు మరియు నెగెటివ్ ఫలితాలను చూస్తాము. దాన్ని గుర్తించడం, ఆపై చంపడం లేదా దొంగతనం చేయకూడదనే దృఢమైన నిర్ణయం తీసుకోవడం ఇందులో ఒక భాగం. ప్రజలు అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, వాళ్ళు సక్రమంగా మరియు నిర్మాణాత్మకంగా వ్యవహరించేలా చూడటానికి సైన్యం లేదా పోలీసులు ఉండవలసిన అవసరం లేదు. వారి స్వంత నీటి మరియు నైతికత వారిని చెడు పనులు చెయ్యకుండా ఆపుతుంది.

కాబట్టి, కఠినమైన నైతిక విలువలను పాటించడం, మనం సంతోషకరమైన మానసిక స్థితితో మరణించడానికి అనుమతించే ఒక నివారణ చర్య. లేకపోతే, మనం చాలా దుఃఖం మరియు ఆందోళనతో చనిపోతాము. నైతికమైన వ్యక్తిగా మనం ఈ నివారణ చర్యలు తీసుకుంటే, మనం చనిపోయే సమయంలో ఇంక ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనం మానవునిగా, లేదా దేవుని లోకాలలో ఒక దేవునిగా - ఇంద్రుడిగా లేదా ఇంకెవరిలా అయినా - పునర్జన్మ పొందుతామనే నమ్మకం మనకు ఉంటుంది.

అన్ని జీవితాల్లో నియంత్రణలో లేని రిపీట్ అయ్యే సమస్యలు

మనిషిగా లేదా దేవతల రాజుగా మనం పునర్జన్మ పొందినా - ఆ జీవితంలో కూడా మనకు సమస్యలు ఎదురవుతాయి. మనం ఎక్కడ, ఎవరిలా పునర్జన్మను పొందినా నియంత్రణలో లేని రిపీట్ అయ్యే సమస్యలు వస్తాయి. కాబట్టి, వినాశకర పనులకు దూరంగా ఉండాలనే నైతికతను అనుసరించడంలో అర్థం ఏమీ లేదు, అలా చెయ్యడం ద్వారా, పునర్జన్మ యొక్క చెడు స్థితిలో మనం మళ్ళీ జన్మించకుండా ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే, మనం ఎక్కడ, ఎవరిలా పునర్జన్మను పొందినా సమస్యలు అనేవి తప్పవు.

ఒక విస్తృత పరిధి అవసరమని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, సంస్కృతంలో "షమత" మరియు టిబెటన్ భాషలో "షినే" అని పిలువబడే ఒక నిశ్చలమైన మరియు స్థిరమైన మానసిక స్థితిని మనం అభివృద్ధి చేసుకుంటే - దాని ఫలితంగా మనం అస్తిత్వం యొక్క ఉన్నత స్థాయిలలోని ఒకదానిలో దేవుడిగా పునర్జన్మను పొందవచ్చు: అతీంద్రియ రూపాల చోటు లేదా రూప రహిత జీవుల చోటు. అప్పుడు ఆ రకమైన పునర్జన్మను మనం అన్ని విధాలుగా పొందగలుగుతాము. కానీ ఇంతటి ఉన్నత అస్తిత్వంలో ఒక జీవిగా పునర్జన్మ పొందినా అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇది ఒక ఆకాశ భవనం యొక్క పై అంతస్తుకు వెళ్ళడం లాంటిది - అక్కడికి మనం వెళ్లిన తర్వాత, తిరిగి కిందకు రావడం తప్ప ఇంక మనం చేసేది ఏమీ లేదు.

బుద్ధుని మాటలపై విశ్వాసాన్ని పొందడం

కాబట్టి, మనం పునర్జన్మ పొందిన చోట మన సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నించడం మరియు ఇంకా ముందుకు వెళ్లడం అవసరం. అలా చెయ్యాలంటే వాస్తవికతకు, కల్పనకు మధ్య స్పష్టమైన వివక్షను చూపేలా విచక్షణ మరియు సరైన అవగాహనతో మన సమస్యలు, బాధల మూలాలను మనం తెలుసుకోవాలి. ఈ విధంగా, మనం చివరికి శూన్యతను గ్రహిస్తాము, అంటే ఉనికిలో అసాధ్యమైన మార్గాలు పూర్తిగా లేకపోవడాన్ని. ఈ నిజం గురించి స్పష్టమైన అవగాహన మన తప్పు అంచనాలను తొలగిస్తుంది మరియు అలా చెయ్యడంతో, మనం ఏ జన్మలోనైనా అనుభవించగల అన్ని సమస్యలు మరియు బాధలను శాశ్వతంగా వదిలిస్తుంది. ఇది ఎప్పటికీ నిలిచిపోయే ఆనందాన్ని తెచ్చిపెడుతుంది, మరియు ఇది నిజంగా మనం సాధించగలిగేదే.

బుద్ధుని మాటలను కాపాడే శాస్త్రీయ గ్రంథాల నుంచి శూన్యతపై బోధనల గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ గ్రంథాల వేలిడిటీపై, శూన్యత గురించి మాత్రమే కాకుండా వీటిల్లో బుద్ధుడు చెప్పిన ప్రతి దాని గురించి మనం నమ్మకాన్ని ఎలా పొందగలము? లాజిక్, అనాలసిస్ ఆధారంగా వాటి వేలిడిటీపై విశ్వాసాన్ని పొందాలి. ఉదాహరణకు శూన్యతను తీసుకోండి. లాజికల్ రీజనింగ్ పై ఆధారపడి శూన్యత యొక్క వేలిడిటీను మనం స్థాపించుకోవచ్చు. దీనికి తోడుగా, వాటిని సాధించడానికి ఈ సూచనలను ఆచరణలో పెట్టి నిజానికి ఈ స్థితులను మనం పొంది ఈ ఏకాగ్రత మరియు నిశ్చలమైన, స్థిరమైన మానసిక స్థితిని ఎలా సాధించాలో బోధనల నుంచి తెలుసుకోవచ్చు. ఇంకా, ఈ అభ్యాసాల నుంచి అటువంటి ఏకాగ్రతను సాధించడం అనేది వర్ణించబడిన వివిధ రకాల ఉన్నత, బాహ్య అవగాహనను మనం నిజంగా సాధించగలము. బుద్ధుడు బోధించిన ఈ వివిధ అంశాలను మన స్వంత అనుభవం నుంచే మనం తెలుసుకోవచ్చు.

ఈ విధంగా, లాజిక్ మరియు వ్యక్తిగత అనుభవం ద్వారా మనం అర్ధం చేసుకునే విషయాలకు సంబంధించి బుద్ధుడు బోధించినదాన్ని వాస్తవీకరించడానికి మన స్వంత కృషి మరియు ప్రయత్నంతో సాధారణంగా వాటిపై మనకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమైన విశ్వాసం యొక్క భద్రతతో, బుద్ధుడు చెప్పిన మిగతా అస్పష్టమైన విషయాల చెల్లుబాటుపై కూడా మనకు లోతైన నమ్మకం కలుగుతుంది.

ఉదాహరణకు, మనం మంచి నిర్మాణాత్మక పద్ధతిలో ప్రవర్తిస్తే, దాని ఫలితం మనం మంచి స్థితిలో పునర్జన్మను పొందుతాము - మనిషిగా లేదా దేవుడిగా. మరోవైపు, మనం వినాశకరమైన మరియు నెగెటివ్ గా ప్రవర్తిస్తే, తర్వాత ఒక నరక జీవిగా, "ఆకలితో ఉన్న" దెయ్యం లా లేదా జంతువుగా పునర్జన్మను పొందుతాము. ఇవి ప్రవర్తన యొక్క కారణం మరియు ప్రభావం గురించి స్టేట్ మెంట్లు, ఇవి మన స్వంత అనుభవం ద్వారా లేదా స్వచ్ఛమైన లాజిక్ ద్వారా తేల్చడం కష్టం. కానీ లేఖన అధికార౦పై గుడ్డి విశ్వాస౦తో మన౦ వాటిని అంగీకరించవలసిన అవసర౦ లేదు. ఎందుకంటే ఏకాగ్రతను పొందడం మరియు శూన్యత గురించి సరైన అవగాహనను పొందడం గురించి బుద్ధుడు బోధించిన దాన్ని ప్రామాణికతను లాజిక్ మరియు అనుభవం నిరూపిస్తే, ప్రవర్తన మరియు దాని ఫలితాల గురించి బుద్ధుడు చెప్పిన వాటిని అంగీకరించడం పూర్తిగా సహేతుకంగా మారుతుంది.

అలా, శూన్యత గురించి, వాస్తవికత గురించి, అసాధ్యమైన మార్గాలు పూర్తిగా లేకపోవడం గురించి బుద్ధుడు చేసిన ప్రకటనల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి సరైనవని గుర్తించిన తర్వాత, బుద్ధుని మిగతా ప్రకటనలను మనం పరిగణనలోకి తీసుకోవాలి: నిర్మాణాత్మకంగా వ్యవహరించడం వల్ల కలిగే ఫలితం ఆనందం అని; వినాశకరంగా, నెగెటివ్ గా ఉండడం వల్ల కలిగేది బాధ అని తెలుసుకోవాలి. అప్పుడు ఈ ప్రకటనలు కూడా సరైనవే అనే నమ్మకాన్ని మనం పొందుతాము మరియు దాని ఆధారంగా మన ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి దృఢమైన నిర్ణయాన్ని తీసుకుంటాము. మనం సంతోషాన్ని కోరుకుంటే, దానిని పొందే విధంగా మనం వ్యవహరించాలి. అంటే నిర్మాణాత్మకంగా, పాజిటివ్ గా మనం ఉండాలి.

త్యాగం: అన్ని సమస్యల నుంచి విముక్తి పొందాలనే సంకల్పం

ఆధ్యాత్మిక పురోగతి అన్ని అవకాశాలతో ఇప్పుడు మనకు ఉన్న అద్భుతమైన మానవ పునర్జన్మ ఎక్కడి నుంచో వచ్చింది కాదని మనం తెలుసుకోవడం మంచిది. ఇది ఇంతకుముందు జన్మలలో అపారమైన పాజిటివ్ సామర్థ్యాన్ని నిర్మించుకున్న ఫలితం. మనం చాలా నిర్మాణాత్మకంగా మరియు పాజిటివ్ గా వ్యవహరించాలి, అప్పుడు అది మనకు ఉన్న పునర్జన్మను మరియు మంచి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి, మనం ఈ అవకాశాలను వృథా చేసుకోకూడదు. ఆహారం, బట్టలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం లాంటి వాటితో మాత్రమే ఈ జన్మలో మనం పూర్తిగా నిమగ్నమైతే, ఇది నిజంగా వృధా అయినట్లే. ఇవన్నీ మన ఆందోళనలైతే, ఈ స్థిరీకరణ కారణంగా, ఈ జన్మలో మాత్రమే మనం పూర్తిగా వ్యామోహం నుంచి దూరం కాలేము.

మరోవైపు ఇంద్రుని లాంటి దేవుడిగా పునర్జన్మను పొందాలని మన వంతు కృషి మనం చేస్తే, ఇక్కడ కూడా మనకు సమస్యలు వస్తాయి. అలాంటి దేవుడి జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఈ దేవునికి అపారమైన ఆనందం, తాత్కాలిక సమస్యలు అనేవి ఏమీ లేవు. కానీ అటువంటి దేవునికి మరణ సమయంలో అపారమైన పశ్చాత్తాపం, బాధ కలుగుతాయి, ఎందుకంటే జీవితంలో సుఖం అంతా కేవలం ఒక కలగానే అనిపించి, మరణించే సమయంలో చాలా బాధను, మరియు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి, అలాంటి పునర్జన్మను మన ధ్యేయంగా కలిగి ఉండటం అనేది మన సమస్యలన్నిటికి పరిష్కారం కాదు.

అంతేకాక, విలువైన మానవ శరీరం యొక్క ఈ పని ఆధారాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే అది ముగిసిపోబోతోంది కాబట్టి. పుట్టిన తర్వాత చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మరణం అనేది మనందరికీ ఖచ్చితంగా జరిగేదే, ఇది కేవలం కాలానికి సంబంధించిన విషయం మాత్రమే. ఎవరి టైమ్ ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ నిజం గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనకున్న అవకాశాలను ఉపయోగించుకోవాలనే కోరిక కలుగుతుంది.

కాబట్టి, ఈ జన్మలో మాత్రమే వస్తువులను సంపాదించాలనే మన పూర్తి వ్యామోహం నుంచి మనం బయటపడాలి. ఈ జన్మలోని వివిధ రకాల పాడైపోయే విషయాలకు శాశ్వత సారం లేదని ఆలోచించడం ద్వారా మనం ఇలా చేస్తాము. ఈ విధంగా, మనం ఈ జీవితకాలానికి వస్తువులపై మన వ్యామోహాన్ని వదిలించుకుని ఆ రకమైన ఆవేశంతో సమస్యల నుంచి విముక్తి పొందాలనే సంకల్పాన్ని పెంపొందించుకుంటాము. స్వేచ్ఛగా ఉండాలనే ఈ రకమైన సంకల్పాన్ని "త్యాగం" అంటారు.

అదే విధంగా, మనం భవిష్యత్తు జీవితాలను మరియు పునర్జన్మ పొందే వివిధ రకాల పరిస్థితులను చూడాలి. మనిషిగానో, దేవుడిగానో భవిష్యత్తులో మనం పొందే మహిమలు, ఆనందాల గురించి ఆలోచించినప్పుడు, ఇవి కూడా సమస్యలను కలిగిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత బాగా ఉన్నా, సమస్యలు పద్దాక వస్తూనే ఉంటాయి. కాబట్టి, భవిష్యత్తు జన్మల కోసం ఈ విషయాలతో మమేకమై, వ్యామోహంతో ఉండకుండా చూసుకోవాలి. ఒక రెండవ రకమైన సంకల్పాన్ని పెంపొందించడానికి ప్రయత్నించడంతో మనం ఇలా చేస్తాము. అంటే, భవిష్యత్ జన్మలలో ఈ వ్యసనాలతో వచ్చే సమస్యల నుంచి విముక్తి పొందాలనే సంకల్పంతో.

కాబట్టి, స్వేచ్ఛగా ఉండటానికి రెండు రకాల సంకల్పాలు ఉన్నాయి. ఈ జన్మలో సమస్యలు లేకుండా ఉండాలనే సంకల్పం, వచ్చే జన్మలో సమస్యల నుంచి విముక్తి పొందాలనే సంకల్పం ఉన్నాయి.

అశాశ్వతం

జీవితంలో ఏ పరిస్థితి కూడా స్థిరంగా ఉండదనే నిజాన్ని గుర్తుంచుకునేవాడే ఆధ్యాత్మిక అభ్యాసకుడు; అశాశ్వతాన్ని, మరణాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తి; తన సమస్యలు మరియు జీవితంలో ఉన్న అన్ని సమస్యల గురించి కూడా బుద్ధిపూర్వకంగా మరియు అవగాహనను కలిగి ఉన్న వ్యక్తి అతను. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి వివిధ నివారణ చర్యలు తీసుకోవడానికి అటువంటి అభ్యాసకుడిని ప్రేరేపించే విషయం ఇది. అశాశ్వతాన్ని, సమస్యలను మరచిపోయి, చావు గురించి మరచిపోయి, మనం వాటిని దూరం చేసుకోగలిగితే, అది చాలా బాగుంటుంది - అది చాలా గొప్ప విషయం. కానీ నిజం ఏమిటంటే, మనం అలా చెయ్యలేము. మనం చనిపోబోతున్నామనే నిజాన్ని మరచిపోయి, మన జీవితంలో సమస్యలు ఉన్నాయని మరచిపోయినంత మాత్రాన ఆ నిజాన్ని కప్పిపుచ్చవు. కాబట్టి మన సమస్యల గురించి తెలుసుకుని ఉండడం, వాటిని నిజంగా ఎదుర్కోవడం, ఆ తర్వాత వాటిని తొలగించడానికి వివిధ చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మిక సాధనలో ఉండేది ఇదే.

బుద్ధుడు స్వయంగా ఈ పనుల యొక్క వివిధ రౌండ్ల ప్రసార ప్రవాహాన్ని ముందు ఏర్పాటు చేసినప్పుడు, అశాశ్వతం గురించి, ఏదీ స్థిరంగా ఎలా ఉంటుందో చెప్పడానికి అలా చేశాడు. అతని ఆధ్యాత్మిక అన్వేషణ అంతా అశాశ్వత సాక్షాత్కారంతోనే ప్రారంభమైంది. అదే విధంగా, అతని జీవితం ముగిసి మరణించినప్పుడు, అది కూడా అశాశ్వత సత్యాన్ని అందరికీ నిరూపించే సందర్భంలో జరిగింది.

నాలుగు ఉత్తమమైన సత్యాలు

సమస్యలు ఎక్కడి నుంచో వాటికవే రావు. అవి మనకు ఏ కారణం లేకుండా జరగవు. అలా కాకుండా, మన సమస్యలు మరియు అసంతృప్తి నిజమైన కారణాల నుంచి వస్తాయి - అంటే, మన హఠాత్తు ప్రవర్తన మరియు మన కలవరపరిచే భావోద్వేగాలు మరియు వైఖరులు - మరో మాటలో చెప్పాలంటే, మన కర్మ మరియు మన భ్రమలు. ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు వైఖరులతో వ్యవహరించడం అన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

ఇప్పుడు, మన సమస్యల ఈ రెండు కారణాలలో, మన ప్రవర్తన భావోద్వేగాలు మరియు వైఖరులను ఇబ్బంది పెట్టడానికి కారణమని మనం చూడవచ్చు. బౌద్ధమత గ్రంధాలలో వర్ణించబడిన 84,000 విభిన్న రకాల ఆందోళనలు కలిగించే భావోద్వేగాలు మరియు వైఖరులను పరిశీలిస్తే, అవన్నీ ఒకే మూలం నుంచి వచ్చాయని మనం కనిపెడతాము: అంటే, అజ్ఞానం లేదా తెలుసుకోలేకపోవడం అనేది నిజంగా స్థాపించబడిన ఉనికి కోసం మరియు నిజంగా స్థాపించబడిన గుర్తింపుల కోసం తెలుసుకోవడానికి దారితీస్తుంది.

ఏదేమైనా, నిజంగా స్థాపించబడిన గుర్తింపుగా అలాంటిదేమీ లేదు - మన కోసం లేదా దేని కోసం కాదు - అయినప్పటికీ, మనం విషయాలను నిజంగా స్థాపించబడిన గుర్తింపు లేదా ఉనికిని కలిగి ఉన్నట్లుగా గ్రహిస్తాము. అందుకని, నిజంగా స్థాపించబడిన గుర్తింపుగా అటువంటిది అసాధ్యమని మనం తెలుసుకోగలిగితే మరియు వివక్ష చూపగలిగితే, అది ఇలాంటి మన ఆలోచనలకు ఒక విరుగుడుగా పనిచేస్తుంది.

నిజమైన స్థాపిత అస్తిత్వం ఏదీ లేదని - దేనికీ నిజమైన స్థిరమైన గుర్తింపు లేదని మనం అర్థం చేసుకున్నప్పుడు - ఈ అవగాహనను "నిజమైన మనస్సు యొక్క మార్గం" అని పిలుస్తారు - ఇది నాలుగు ఉత్తమమైన సత్యాలలో ఒకటి. "ఆర్యులు" అనే అత్యంత సాక్షాత్కారం పొందిన జీవులు సత్యం లేదా సరైనవిగా భావించి ముక్తి మరియు జ్ఞానోదయం పొందడానికి దారితీసే మానసిక మార్గం ఇది.

మనకు నిజమైన మానసిక మార్గం ఉన్నప్పుడు - అంటే దేనికీ నిజంగా స్థాపించబడిన గుర్తింపు లేదనే అవగాహన ఉన్నప్పుడు - మనకు ఇకపై ఎటువంటి ఇబ్బందికరమైన భావోద్వేగాలు లేదా వైఖరులు ఉండవు, ఎందుకంటే అటువంటి భ్రమలు ఉనికిలో ఉన్న అసాధ్యమైన మార్గాలను ప్రదర్శించడం మరియు విశ్వసించడంపై ఆధారపడి ఉంటాయి. మనకు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు లేదా వైఖరులు లేనప్పుడు, మనం తొందరపాటుగా వ్యవహరించము. అలా మనం తొందరపాటుగా వ్యవహరించనప్పుడు, ఇంక సమస్యలను సృష్టించుకోలేము. మన అనుభవంలో సమస్యలు తలెత్తని స్థితిని "నిజమైన అడ్డు", "నిజమైన ముగింపు" అని పిలుస్తారు.

ఆర్యులు, అత్యంత సాక్షాత్కారం పొందిన జీవులు నిజమని భావించే నాలుగు వాస్తవాల సమర్పణ ఇది. ఇవే నాలుగు ఉత్తమమైన సత్యాలు. మొదటి రెండు సత్యాలు ఇబ్బందిని కలిగించే వాటితో వ్యవహరిస్తాయి, అవి నిజమైన సమస్యలు మరియు వాటి నిజమైన కారణాలు: తొందరపడే ప్రవర్తన మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు వైఖరులు. ముక్తిని ఇచ్చే వాటితో వ్యవహరించే చివరి రెండు సత్యాల వైపు మన దృష్టిని మరల్చినప్పుడు, వాటి కారణాలను శాశ్వతంగా తొలగించడం ద్వారా అన్ని సమస్యలకు సరైన ముగింపును సాధించాలనుకుంటున్నాము. అందుకు మార్గం నిజమైన మానసిక మార్గాలను పెంపొందించుకోవడం. ఈ విధంగా మనం అత్యంత సాక్షాత్కారం పొందిన జీవులు నిజమని భావించే ఈ నాలుగు వాస్తవాలను గుర్తించి అర్థం చేసుకుంటాము.

మన అమూల్యమైన మానవ పునర్జన్మలో మనకు ఉన్న ఈ అద్భుతమైన పని పునాదిని నిర్మించి, ఈ నాలుగు మహోన్నత సత్యాలను సాకారం చేసుకోవడానికి మన ప్రయత్నాలన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు, ఈ పునర్జన్మతో మనకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం. మన మనస్సుకు ఒక ప్రయోజనకరమైన అలవాటుగా, నిజమైన స్థాపిత ఉనికి అనేదే ఏదీ లేదనే ఒక మంచి అవగాహనను పెంపొందించుకున్నప్పుడు, మన సమస్యలన్నింటినీ శాశ్వతంగా తొలగించుకుంటాం.

కరుణను పెంపొందించుకోవడం

ఇప్పుడు, మన కోసం అన్ని సమస్యలను వదిలించుకోవడం చాలా మంచిది - కానీ అది సరిపోదు. ఎందుకంటే మనం ఒక్కరమే, కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకెంత మంది జీవులు ఉన్నారో మనం ఎప్పటికీ లెక్కించలేము, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి - వాళ్లంతా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు. అందుకని, మన కోసం మాత్రమే పని చేసుకోవడం అన్యాయం: మనం ప్రతి ఒక్కరికి ఒక పరిష్కారాన్ని వెతకాలి.

ఆలోచిస్తే, పరిమిత మనస్సులు ఉన్న ఇతర జీవులందరూ మన పట్ల చాలా దయగా ఉన్నారని తెలుస్తుంది - నిజానికి, ఇతర జీవుల కంటే దయను ఇంకెవరూ అలా చూపలేరు. బుద్ధుల దయను, పరిమిత జీవుల దయను పరిగణనలోకి తీసుకుంటే వాళ్ళందరూ సమానమే అని మనం తెలుసుకుంటాము. ఉదాహరణకు, మనకు తేనె అనేది ఇష్టమైతే అది ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి. ఇది చాలా తేనెటీగల నుంచి వస్తుంది, మరియు ఈ తేనెటీగలు దీనిని తయారు చెయ్యడానికి చాలా పని చెయ్యాలి: చాలా పువ్వుల మీద ఎగరడం, పుప్పొడిని సేకరించడం మరియు తేనెను వదలడం మరియు ఆ తుట్టులో దాన్ని నిల్వ చెయ్యడం. మనకు ఎప్పుడైనా తేనెను ఆస్వాదించగలమనే ఆశ కలిగితే, ఈ చిన్న కీటకాల పని మరియు దయపై ఆధారపడాలి. అదే విధంగా, మనలో కొందరు తినే మాంసం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఉదాహరణకు, మనం అనారోగ్యంతో మరియు బలహీనంగా ఉన్నప్పుడు మన శరీరాలకు మరింత బలాన్ని ఇచ్చే ఆహారం అవసరమైనప్పుడు, అది ఎక్కడ నుండి వస్తుంది? అని ఆలోచించాలి. అది మన బలానికి, పోషణకు ఆ మాంసాన్ని అందించడానికి తమ ప్రాణాలను త్యాగం చేయాల్సిన జంతువుల నుంచి వస్తుంది అని తెలుస్తుంది.

కాబట్టి, మన సమస్యలన్నిటి నుంచి విముక్తి పొందాలనే బలమైన సంకల్పాన్ని పెంపొందించుకున్న తర్వాత, ఆ ఆలోచనా విధానాన్ని  ఇతరులకు నేర్పించాలి. మన సమస్యల నుంచి విముక్తి పొందాలనే సంకల్పం మనకు ఉంటే, మిగతా వాళ్ళు కూడా వారి సమస్యల నుంచి విముక్తి పొందాలని మనం కోరుకోవాలి. అటువంటి ఆలోచనను "కరుణ" అంటారు.

మన సమస్యల గురించి మనం సీరియస్ గా ఆలోచించకపోతే, వాటిని మనం ఎలా కోరుకోకపోతే - మరియు వాటి నుంచి విముక్తి పొందాలనే సంకల్పాన్ని మనం పెంపొందించుకోకపోతే - ఇతరుల సమస్యలను తీవ్రంగా పరిగణించడం చాలా కష్టం. ఇతరులు తమ కష్టాల నుంచి విముక్తి పొందాలని కోరుకునే చిత్తశుద్ధిని మనం పెంపొందించుకోలేము. ఉదాహరణకు, ఒక అధికారి తన జీవితంలో చాలా బాధలు పడి, ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నట్లయితే, ఆ వ్యక్తికి ఇతరుల సమస్యల పట్ల సానుభూతి మరియు కరుణ ఉంటుంది. బాధపడటం అంటే ఏమిటో తెలియక, జీవితాంతం సుఖంగా గడిపిన అధికారి కంటే ఇతరులకు సహాయం చెయ్యడానికి అలాంటి వ్యక్తి చాలా బాగా ముందుకు వస్తాడు.

బోధిచిత్త

ఇతరులు బాధల నుంచి విముక్తి పొందాలని మనం కోరుకునే ఆలోచనను "కరుణ" అంటారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే ఆలోచనే "ప్రేమ” కు నిర్వచనం. ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు సమస్యలు లేకుండా ఉండాలనే ఆలోచనను మనం ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ మన పట్ల చాలా దయగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి మరియు కేవలం పైపైన మాత్రమే కాకుండా వారి అన్ని సమస్యలను తొలగించడానికి సహాయపడాలి - ఈ బాధ్యత తీసుకోవడాన్ని "అసాధారణ సంకల్పం" అని పిలుస్తారు.

కేవలం మనం మన స్వార్థ ఆలోచనలలో చిక్కుకుంటే, బుద్ధుని యొక్క సద్గుణాలను పొందడానికి లేదా పెంపొందించుకోవడానికి మనకు మార్గం దొరకదు. అయితే, స్వార్థానికి స్వస్తి చెప్పి, ఇతరుల గురించి ఆందోళన చెందితే, మనమే జ్ఞానవంతులైన బుద్ధుడిగా మారడానికి ఆధారం అవుతుంది. స్వార్థంతోనే మన కోసం రిసోర్స్ లను కూడబెట్టుకోవడం కోసం హత్యలు, దొంగతనాలు లాంటి పనులు చేస్తాము. ఇలాంటి నైపుణ్యం లేని పద్ధతులు ఇంకా సమస్యలను మాత్రమే తెచ్చిపెడతాయి, వీటన్నింటికీ మూలం మన స్వార్థం.

శాక్యముని బుద్ధుడు తన జ్ఞానోదయాన్ని సాధించగలిగాడు, పూర్తిగా స్పష్టమైన మనస్సుతో మరియు పూర్తిగా పరిణామం చెందాడు, దీని ఫలితంగా ఇతరుల సంక్షేమం గురించి మాత్రమే అతను పట్టించుకున్నాడు. నిజానికి, అన్ని కాలాల్లోని బౌద్దులందరూ ఇతరుల పట్ల వారి శ్రద్ధ ఆధారంగా తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించే స్థితిని సాధించారు. కాబట్టి, మన౦ రియలిస్టిక్ గా ఉ౦టే, "ప్రతి ఒక్కరికి స౦తోషాన్ని తెచ్చిపెట్టడానికి, వారి సమస్యల ను౦చి వారిని విముక్తులను చెయ్యాలనే" అసాధారణమైన సంకల్ప౦ మనకు ఉన్నప్పటికీ, మన౦ ఎ౦త కోరుకున్నా అలా చేసే సామర్థ్య౦ మనకు లేదని మనకు అర్థమవుతు౦ది. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అధిగమించడానికి మరియు ఆనందాన్ని పొందడానికి సహాయపడే సామర్థ్యం బుద్ధుడికి మాత్రమే ఉంటుంది.

అందుకని, సాధ్యమైనంత ఉత్తమంగా ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి మరియు బుద్ధుని జ్ఞానోదయ స్థితిని సాధించడానికి అంకితం చెయ్యడం అవసరం. దీన్నే "బోధిచిత్త లక్ష్యం" అంటారు.

ఇలాంటి అంకితభావం ఉన్న హృదయంతో, బోధిచిత్త లక్ష్యం ఉన్న మనం ఒక పువ్వు లాంటి దానిని ఒక సింపుల్ నైవేద్యాన్ని ఇస్తాము. అటువంటి సమర్పణ యొక్క ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికి సహాయం చెయ్యడం, జ్ఞానోదయం అందించడం అయితే, సాధ్యమైనంత ఉత్తమంగా ఇలా చెయ్యగలగడం, ఆ సాధారణ పని గురించి నిర్మించుకున్న పాజిటివ్ సామర్థ్యం చాలా పెద్దది. నిజానికి, ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చడమే మన లక్ష్యం అయినప్పుడు, ఆ ప్రయోజనం ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇది జీవుల సంఖ్య ఎంత విశాలమైనదో అంతే పెద్దది. ఈ విధంగా మన హృదయాలను స్వచ్ఛంగా మరియు చిత్తశుద్ధితో అంకితం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు బుద్ధుడికి బంగారం మరియు రత్నాలతో నిండిన ప్రపంచాన్ని సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే చాలా ఎక్కువ. విశ్వంలోని అన్ని జీవరాశులకు మనం అన్నం పెట్టినా, అలాంటి హృదయంలో ఒక్క క్షణం అయినా బోధిచిత్త లక్ష్యానికి అంకితం కావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరికి ఒక పూట భోజనం అందిస్తేనే ప్రజల ఆకలి తీరుతుందనుకుంటే ఈ లాజిక్ వస్తుంది. వాళ్ళు త్వరలోనే మళ్ళీ ఆకలితో అలమటిస్తారు, అలా వారి ఆకలి సమస్య కొనసాగుతూనే ఉంటుంది. కానీ, బోధిచిత్త ధ్యేయంతో ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలూ తొలగిపోవాలనే సంకల్పంతో, సాధ్యమైనంత వరకు జ్ఞానోదయం పొందాలని మనల్ని మనం అంకితం చేసుకుంటే, ఇది ప్రతి ఒక్కరి ఆకలిని తగ్గించడమే కాకుండా, వారి సమస్యలను పూర్తిగా అంతం చేసే సామర్థ్యాన్ని మనకు అందిస్తుంది.

చివరి విషయాలు

కాబట్టి, బోధిచిత్త లక్ష్యాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ, మనం ఏ ప్రాణికి హాని చెయ్యము అని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇతరులను బాధపెట్టడం వల్ల కలిగే నష్టాలు, లోపాలు, వాళ్ళు ఎవరైనా కానీ, అలా నేను చెయ్యను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు, ఇది మంచి ప్రయోజనాలను అందిస్తుంది. దాని కారణంగా ఇది మంచి ప్రశంసనీయమైన ప్రవర్తన. మనం ఎవరినీ బాధపెట్టమని లేదా హాని చెయ్యమని ఒక బలమైన ప్రతిజ్ఞ ఇప్పుడు మనమందరం తీసుకోగల ఒక ఆధ్యాత్మిక చర్య. ఆధ్యాత్మిక సాధనను చాలా ఉన్నతమైనదిగా, సుదూరమైనదిగా మనం భావించనవసరం లేదు.

క్లుప్తంగా చెప్పాలంటే, ఆధ్యాత్మిక అభ్యాసకుడిగా ఉండటానికి ఒక రకమైన అన్య దేశ జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు. గొప్ప ఆధ్యాత్మిక అభ్యాసకులుగా ఉన్న గృహస్థుల చరిత్ర లో అనేక కథనాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలోని ఎనభై నాలుగు మహా సిద్ధుల జీవితచరిత్రలను మనం పరిశీలిస్తే, వారిలో గృహస్థులైన వారు చాలామందే ఉన్నారు..

వృద్ధాప్యంలో ఉంటే మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు, లేదా వృద్ధులు ఆధ్యాత్మిక అభ్యాసకులు కాలేరని అనుకోవాల్సిన అవసరం లేదు. మన చరిత్రను పరిశీలిస్తే, ఒక ఉదాహరణ, 80 సంవత్సరాల వయస్సులో ఉన్న గృహస్థుడు శ్రీజాతి ఆధ్యాత్మిక అభ్యాసకుడిగా మారడం. అతను తన జీవితకాలంలో విముక్త జీవి అయ్యి, లేదా అర్హాత స్థితిని సాధించగలిగాడు. కాబట్టి, ఎప్పుడూ ముసలివాళ్ళం కాదు.

మరోవైపు, మన౦ యవ్వన౦లో ఉ౦టే, మన౦ పనికిమాలిన వాళ్ళలా ఉండకుండా, మన ఆధ్యాత్మిక సాధనలో నిర్ణయాత్మక౦గా ఉ౦డడానికి మనకున్న శక్తులను ఉపయోగించుకోవాలి. చావు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి మార్గం అనేది ఏదీ లేదు కాబట్టి, మనం పెద్దయ్యే వరకు ఈ నివారణ ఆధ్యాత్మిక చర్యలు తీసుకోకుండా వాయిదా వెయ్యగలమని మనం అనుకోకూడదు. అంతేకాకుండా, వృద్ధాప్యం అనేది మనందరికీ జరిగేదే. అలా జరిగినప్పుడు అకస్మాత్తుగా మన జీవితం మన చేతుల్లో నుంచి జారిపోయినట్లు అనిపిస్తుంది.

మనం చెయ్యగలిగే అనేక సాధారణ పాజిటివ్ విషయాలు ఉన్నాయి. ఇతర దేశాలలో కొంతమంది వ్యక్తులు పక్షులకు ఆహారం పెట్టడానికి చాలా శ్రమ మరియు డబ్బును ఖర్చు చేస్తారని నాకు తెలుసు. వారి ఇళ్ల బయట ఫీడర్లు ఉంటాయి మరియు ప్రతిరోజూ వాటిల్లో ఆహారం పెట్టడానికి వాళ్ళు వేల రూపాయలు ఖర్చు చేస్తారు. నిజానికి, వారు తమ సెలవులను కూడా వదులుకుంటారు ఎందుకంటే ఆ పక్షులకు ఆహారం పెట్టకుండా ఉండలేరు కాబట్టి. ఇది ఒక అద్భుతమైన ప్రాక్టీస్; దీన్ని చూడటం నాకు ఏంటో సంతోషాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే ఇది నిజంగా భోధిసత్వుని అభ్యాసం. టిబెటన్లు యాత్రికులుగా భారతదేశానికి వెళ్లి పావురాలకు రొట్టెలు, అన్నం పెట్టిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. దీర్ఘాయుష్షును పొందడానికి ఇది ఒక అద్భుతమైన ప్రాక్టీస్.

సారాంశం

మన సంభాషణను సంక్షిప్తీకరించాలనుకుంటే, ఇవే ముఖ్యమైన అంశాలు:

  • ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం నిరంతరం పనిచేసే దయ మరియు మంచి హృదయాన్ని పెంపొందించుకోండి.
  • ఎవరినీ లేదా దేనినీ నొప్పించకండి; ఎప్పుడూ హాని లేదా సమస్యలను కలిగించకండి.

అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనకు ఇవి ముఖ్యమైన అంశాలు. ఒక బోధిచిత్త లక్ష్యంతో, ఇతరులకు, జ్ఞానోదయాన్ని సాధించడానికి మన హృదయాలను అంకితం చేసి ఈ మన అద్భుతమైన మానవ పునర్జన్మలో ఈ పని ఆధారాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా, మనం నిజానికి పూర్తిగా స్పష్టమైన మనస్సు కలిగిన మరియు పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యక్తిలాగా మారుతాము - ఒక పూర్తిగా జ్ఞానోదయం పొందిన బుద్ధుడిలాగా.

Top