ప్రేమ, కరుణ మరియు బోధిచిత్త యొక్క ప్రాముఖ్యత

బోధిచిత్తను అభివృద్ధి చేసుకోవడం కోసం మనందరికీ బేసిక్ వర్కింగ్ మెటీరియల్స్ ఉన్నాయి

"బోధిచిత్త" అనేది ఒక సంస్కృత పదం. దీన్ని అనువదించడం అంత సులభం కాదు. "చిత్త" అనే దీని రెండవ పదానికి "మనస్సు" అని అర్థం వస్తుంది. కానీ బౌద్ధమతంలో మనస్సు గురించి మాట్లాడేటప్పుడు మనస్సు మరియు హృదయం రెండింటి గురించి మనం మాట్లాడుతాం. మన పాశ్చాత్య ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి కాబట్టి బౌద్ధమతంలో ఈ రెండింటి మధ్య మనం తేడాను చూపించము. కాబట్టి మన తెలివిని - మన మనస్సు యొక్క హేతుబద్ధమైన కోణాన్ని - ఏకాగ్రత, అవగాహన మొదలైన వాటితో అభివృద్ధి చెయ్యడమే కాకుండా, దానితో పాటుగా, మనం మన హృదయాలను మంచిగా అభివృద్ధి చేసుకోవాలి, అంటే మన పూర్తి భావోద్వేగ వైపుని కూడా అభివృద్ధి చేసుకోవాలి, అప్పుడే మనం అందరం బోధిచిత్తలోని మొదటి పదాన్ని చేరుకోగలము: అదే "బోధి".

మరియు "బోధి" అనేది అత్యున్నత పెరుగుదల మరియు శుద్ధి స్థితిని వివరించే పదం. కాబట్టి శుద్ధీ కరణ అంటే మనకు ఉన్న అన్ని ఇబ్బందులు మరియు అడ్డంకులను వదిలించుకోవడం, అవి మానసిక అడ్డంకులు మరియు భావోద్వేగ అడ్డంకులు రెండూ, అంటే గందరగోళం, అవగాహన లోపం మరియు ఏకాగ్రత లోపాన్ని వదిలించుకోవడం. అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను వదిలించుకోవడానికి, భావోద్వేగ రీతిలో శుద్ధి చెయ్యడం అని అర్థం. ఇబ్బంది పెట్టే భావోద్వేగాలలో కోపం, దురాశ, మమకారం, స్వార్థం, అహంకారం, అసూయ, అమాయకత్వం... మొదలైన పెద్ద జాబితానే ఉంటుంది; మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్లొచ్చు. మన జీవితంలో అసలైన ఇబ్బందులను తెచ్చిపెట్టేవి ఇవే. కాబట్టి, మన మనస్సులతో, మన హృదయాలతో, ఈ సమస్యలన్నింటినీ వదిలించుకునే స్థితిని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము.

ఈ "బోధి" అనే పదం యొక్క వేరొక అర్ధం "పెరుగుదల" అని. దీని అర్థం మన లోపల బేసిక్ వర్కింగ్ మెటీరియల్స్ ఉన్నాయి అని: మనందరికీ ఒక శరీరం ఉంది. మనం సంభాషణలు చేసుకోగలము. మన శరీరంతో మనం పని చెయ్యగలం, పనులు చేసుకోగలం. మనందరికీ మనస్సులు (విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం) మరియు హృదయాలు (భావాలు, ఇతరుల పట్ల ఆప్యాయతను అనుభవించే సామర్థ్యం), మరియు తెలివితేటలు (సహాయపడేవి మరియు హానికరమైన వాటి మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం) ఉన్నాయి.

కాబట్టి, ఈ మంచి లక్షణాలన్నీ మనకు ఉన్నాయి మరియు వాటితో మనం ఏమి చేస్తాము అనేది మన ఇష్టం. వాటిని ఉపయోగించి మనం ప్రవర్తించే, మాట్లాడే, ఆలోచించే విధానం ద్వారా మనకు, ఇతరులకు సమస్యలు వస్తాయి. లేదా మనకు మరియు ఇతరులకు ప్రయోజనంతో పాటు ఎక్కువ ఆనందాన్ని తీసుకురావడానికి మనం వాటిని ఉపయోగించవచ్చు. మనం సంభాషించే మరియు ఆలోచించే మార్గాలు గందరగోళం మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావానికి లోనైతే, ఇది సమస్యలను కలిగిస్తుంది. మనం కోపం యొక్క ప్రభావంతో వ్యవహరించినప్పుడు, తర్వాత మనం పశ్చాత్తాపపడే పనులు చేస్తూనే ఉంటాము, కదా? మనం స్వార్ధంగా వ్యవహరించినప్పుడు, అది ఎప్పుడూ ఎక్కువ సమస్యలను సృష్టిస్తుంది. స్వార్థపరులను ఎవరూ ఇష్టపడరు.

అది ఒక వైపు. ఇంకొక వైపు, ప్రేమ, కరుణ మరియు ఇతరుల పట్ల శ్రద్ధ లాంటి పాజిటివ్ లక్షణాల ఆధారంగా మనం ప్రవర్తిస్తే మరియు కమ్యూనికేట్ చేసి ఆలోచిస్తే - ఇది మనకు జీవితంలో ఎక్కువ ఆనందాన్ని మరియు సంతృప్తిని తెచ్చిపెడుతుందని మనం తెలుసుకోవచ్చు: మనలాంటి ఇతరులకు; ఇతరులకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, మన స్నేహితులతో మన సంబంధాలలో దీన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మనం ఎప్పుడూ వాళ్ళను విమర్శిస్తూ, వారి మీద కోపాన్ని చూపిస్తుంటే మనతో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ మనం వారి పట్ల దయగా ఉండి వారితో మంచిగా ప్రవర్తిస్తే, వారు మన స్నేహాన్ని ఇష్టపడతారు. మన పెంపుడు పిల్లి మరియు కుక్కతో మనం వ్యవహరించే విధానంలో కూడా మనం దీన్ని గమనించవచ్చు: వాటిని ఎప్పుడూ అరవడం మరియు తిట్టడం ఇష్టపడకపోయినా; మంచిగా చూసుకుంటేనే అవి ఇష్టపడతాయి. కాబట్టి మన దగ్గర ఉన్న ఈ బేసిక్ వర్కింగ్ మెటీరియల్స్ పెరగవచ్చు. మనం వాటిని ఎక్కువ పాజిటివ్ గా అభివృద్ధి చెయ్యవచ్చు.

కాబట్టి బోధిచిత్త అనేది మన మనస్సుల మరియు హృదయాల యొక్క స్థితి ఇది బోధి స్థితిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ లోపాలన్నీ, మనలో ఉన్న ఈ సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోయి, మనలోని పాజిటివ్ లక్షణాలన్నీ సాధ్యమైనంత సంపూర్ణ స్థితికి అభివృద్ధి చెందడమే ఈ స్థితి యొక్క లక్ష్యం. ఇది చాలా అసాధారణమైన విషయం - మానసిక స్థితి మరియు హృదయం యొక్క స్థితి.

ఇది చాలా పాజిటివ్ ఎమోషన్స్ తో సాగుతుంది. అసలు ఈ భావోద్వేగాలు ఏమిటి? ఇది అత్యున్నతమైనది మరియు నేను అత్యున్నతంగా ఉండాలనుకుంటున్నాను అని ఈ స్థాయిని లక్ష్యంగా పెట్టుకోవడం లేదు. నేను బాగా సంతోషంగా ఉండాలని కోరుకోవడమనే కాదు ఇది నిజంగా నేను ఉండగల అత్యంత సంతోషమైన స్థాయి. కానీ మనం ప్రపంచంలోని అసంఖ్యాక జీవుల గురించి ఆలోచిస్తున్నాం: మానవులు, జంతువులు, మిగతావి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఎవరూ దుఃఖంలో ఉండాలని కోరుకోరు అనే అర్థంలో మనమందరం ఒకటే అని అర్థం చేసుకున్నాము. జంతువుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది, కదా? ప్రతి ఒక్కరూ తమకు మరియు వారి ప్రియమైన వారికి సంతోషాన్ని తీసుకురావడానికి వారి స్వంత మార్గంలో ప్రయత్నిస్తారు. కానీ, దురదృష్టవశాత్తు, మనలో చాలా మందికి ఆనందం కలిగించేది ఏమిటో అస్సలు తెలియదు. మనం వివిధ విషయాలను ప్రయత్నిస్తాము, అలా ఎప్పుడూ ఇది ఆనందం కంటే ఇంకా ఎక్కువ సమస్యలను సృష్టిస్తుంది. మనం ఒకరి కోసం మంచి వస్తువును కొంటాము - ఒక బహుమతిగా - మరియు వాళ్ళు దాన్ని ఇష్టపడరు. కాబట్టి, ఇది చాలా సింపుల్. అందర్నీ సంతోష పెట్టడం కష్టం కదా? కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ప్రయత్నించాల్సిందే.

అందరికీ బాగా సహాయపడాలనే ఉద్దేశ్యంతో జ్ఞానోదయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం

అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, మన ఉద్దేశం; మనం ఇతరులకు సహాయం చెయ్యాలని అనుకుంటాము: ప్రతి ఒక్కరూ వారి సమస్యలు మరియు ఆ సమస్యల కారణాల నుంచి స్వేచ్ఛ పొందగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. కరుణ అంటే ఇదే. కరుణ అనేది ఇతరులు తమ బాధల నుంచి మరియు ఆ బాధల కారణాల నుంచి విముక్తి పొందాలని కోరుకోవడం.

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండగలిగితే, ఆ సంతోషానికి కారణాలు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బౌద్ధమతంలో ప్రేమకు అర్ధం ఇదే. ప్రేమ అనేది దేన్నైనా తిరిగి కోరుకోవడంపై ఆధారపడి ఉండదు, "నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను." అని ఉండదు. అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనే దానిపై ఇది ఆధారపడి ఉండదు - "నువ్వు మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అయితేనే నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు అల్లరి చేస్తుంటే నేను ఇక నిన్ను ప్రేమించను. ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది ఇక్కడ ముఖ్యం కాదు. అది అసలైన విషయం కాదు. అందరూ హ్యాపీగా ఉంటే బాగుంటుందనేదే పాయింట్. కాబట్టి అదే ప్రేమ.

ప్రతి ఒక్కరికీ ఈ ఆనందాన్ని అందించడానికి మరియు వారి అసంతృప్తి మరియు సమస్యలను వదిలించుకోవడానికి వారికి సహాయపడటానికి నేను ఏదైనా ముఖ్యమైన పని చెయ్యగలిగితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నేను చాలా లిమిటెడ్ గా ఉన్నాను: నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు ఉన్నాయి, నేను ఎప్పుడూ బద్దకంతో ఉంటాను మరియు ఉద్యోగాన్ని పొందడంలో, భాగస్వామిని పొందడంలో సమస్యలు ఉన్నాయి. మనమందరం జీవితంలో ఎదుర్కునే అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ నాలో ఈ లోపాలన్నీ, ఈ కష్టాలన్నీ శాశ్వతంగా తొలగిపోయే స్థితిని నేను సాధించగలిగితే, నేను నా పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలిగితే, నేను అందరికీ సహాయం చెయ్యగల ఉత్తమ స్థితిలో ఉంటాను.

కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, బోధిచిత్తతో, "జ్ఞానోదయం" అని పిలువబడే మన భవిష్యత్తు స్థితిని లక్ష్యంగా చేసుకుని, ఆ స్థితికి చేరుకోవడానికి మన వంతు ప్రయత్నం చెయ్యడం, ఈ జ్ఞానోదయ స్థితికి వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత వరకు ఉత్తమ ప్రయోజనం చేకూర్చడం మరియు దాన్ని సాధించిన తర్వాత సాధ్యమైన పూర్తి స్థితికి చేరుకోవడం.

ఇప్పుడు, మనలో ఎవ్వరూ సర్వ శక్తిమంతుడైన దేవుడు కాలేరు; అది అసాధ్యం. ఒకవేళ అది సాధ్యమైతే ఇక ఎవ్వరూ బాధలను అనుభవించరు. కానీ మనం మన వంతు ప్రయత్నం చెయ్యాలి. కానీ ఇతరులు సహాయం చెయ్యడానికి సున్నితంగా మరియు ఓపెన్ గా ఉండాలి. మనం విషయాలను ఇతరులకు స్పష్టంగా వివరించగలిగినప్పటికీ, ఇతరులు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి; వారికి మనం వివరించి చెప్పలేము, కదా? మనం మంచి సలహా ఇవ్వగలం, కానీ ఇతరులే దాన్ని తీసుకోగలగాలి.

కాబట్టి మనం లక్ష్యంగా పెట్టుకున్నది అదే, ఇతరులకు సహాయం చెయ్యడానికి మంచి స్థాయిలో ఉండటం, కానీ రియలిస్టిక్ ఆలోచనతో - సరిగ్గా అర్థం చేసుకుని - వారికి సహాయం కావాలా వద్దా అనేది వారి మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మన అయోమయమంతా పోయే స్థితికి మనం చేరుకుంటే, ఇతరులకు సహాయం చెయ్యడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది; ఇప్పుడు ఎవరైనా ఉన్న విధానంలో ఇమిడి ఉన్న అన్ని విషయాలు ఏమిటో మనం అర్థం చేసుకుంటాము.

మనమందరం అనేక విషయాల వల్ల ప్రభావితమవుతాము - మన కుటుంబం, మన స్నేహితులు, మనం నివసించే సమాజం మరియు మనం నివసించే రోజులు: కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు ఆరోగ్యం క్షీణిస్తుంది. అవన్నీ మనపై ప్రభావం చూపుతాయి. బౌద్ధమతం పూర్వ జన్మల గురించి, భావి జన్మల గురించి మాట్లాడుతుంది. ఆ కోణం నుంచి చూస్తే, మనమందరం మన పూర్వ జన్మల ద్వారా కూడా ప్రభావితమవుతాము. కాబట్టి మనం నిజంగా ఎవరికైనా సహాయం చెయ్యాలనుకుంటే లేదా ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటే, మనం వారి గురించి తెలుసుకుని వాళ్ళను బాగా అర్థం చేసుకోవాలి - వారి ప్రవర్తనను ప్రభావితం చేసే అన్ని విషయాలను అర్థం చేసుకోవాలి - అంటే వారిపై ఆసక్తి చూపించి శ్రద్ధగా వాళ్ళ జీవిత విధానం పట్ల సున్నితంగా ఉండాలి.

ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాల పరంగా మీరు దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. మీరు ఒక స్నేహితుడితో ఉంటే మరియు మీకు వారి పట్ల ఆసక్తి లేకపోతే, మీరు మీ గురించి మాత్రమే మాట్లాడుతారు, నిజానికి మీకు వారి గురించి చాలా తక్కువ తెలిసి ఉంటుంది. మరియు మీరు మీ స్నేహితుడిని పట్టించుకోకపోతే - ఉదాహరణకు, మీరు వేరొకరితో ఉన్నప్పుడు, మీరు మీ సెల్ ఫోన్ లో ఇతర వ్యక్తులకు టెక్స్ట్ మెసేజ్ లను పంపుతున్నప్పుడు మీరు మీ స్నేహితుడిని పట్టించుకోరు - అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి మీ పట్ల కొంచెం అసహనం మరియు అసంతృప్తిని వ్యక్తం చెయ్యవచ్చు. కాబట్టి మీరు నిజంగా ఎవరికైనా సహాయం చెయ్యాలనుకుంటే, మీరు వారి పట్ల శ్రద్ధను చూపించి వారి పట్ల ఆసక్తితో ఉండాలి, ఏమి జరుగుతుందో గమనించాలి మరియు దానికి అనుగుణంగా ప్రతిస్పందించాలి, ఇతరులు మనల్ని సీరియస్ గా తీసుకుని మనపై శ్రద్ధ చూపాలని మనం ఎలాగైతే కోరుకుంటామో.

మన మరియు ఇతరుల సమానత్వాన్ని అర్థం చేసుకోవడం

ఇదంతా మనది మరియు  ఇతరుల సమానత్వాన్ని అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. మనకు ఫీలింగ్స్ ఉన్నట్లే అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. నన్ను అందరూ ఎంత సీరియస్ గా తీసుకోవాలని ఉంటుందో అందరూ వాళ్ళను అంతే సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటారు. నేను ఇతరులను పట్టించుకోనప్పుడు లేదా వారితో చెడుగా ప్రవర్తిస్తే నేను ఎలా బాధపడతానో, అలాగే వాళ్ళు కూడా చెడ్డగా భావిస్తారు. నేను ఇష్టపడాలని కోరుకున్నట్లే ప్రతి ఒక్కరూ వాళ్ళను ఇష్టపడాలనే కోరుకుంటారు. నాకు నచ్చనట్లే ఎవరూ తిరస్కరణకు, లేదా నిర్లక్ష్యానికి గురి కావాలని కోరుకోరు. మనమందరం ఒకరికొకరం కనెక్ట్ అయి ఉంటాము; మనమందరం కలిసి ఉంటాము.

దీన్ని వివరించడానికి కొన్నిసార్లు ఒక చిన్న, ఫన్నీ ఉదాహరణ ఉపయోగించబడుతుంది: మీరు సుమారు పది మందితో ఒక లిఫ్ట్ లో ఉన్నారని ఊహించుకోండి, మరియు ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. మిగతా వాళ్ళతో ఒక రోజంతా మీరు ఆ లిఫ్ట్ లోనే చిక్కుకుపోయారు అని అనుకుందాం. మీరు అందరితో ఎలా కలిసిపోయి ఉంటారు? ఆ చిన్న చోటులో మీరు స్వార్ధంగానే ఆలోచిస్తుంటే, పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే, చాలా గొడవలు మరియు వాదనలు వస్తాయి అలా ఆ సమయం చాలా అసహ్యకరమైనదిగా మారుతుంది. "మనమందరం ఒకే పరిస్థితిలో ఇరుక్కుపోయాము మరియు మనం ఒకరికొకరు సహాయం చేసుకుని ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి" అని మీరు తెలుసుకున్నట్లయితే, ఆ లిఫ్ట్ లో చిక్కుకోవడం అంత ఆహ్లాదకరంగా లేనప్పటికీ, మనం ఆ పరిస్థితిని మేనేజ్ చేసుకోగలము.

మనం ఈ ఉదాహరణను పెద్దది చేసి చూస్తే: మనమందరం ఒక పెద్ద లిఫ్ట్ లాగా ఈ గ్రహంపై చిక్కుకున్నట్లయితే, మరియు మనం ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే, ఇది దయనీయమైన సమయం అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒకే పరిస్థితిలో ఉంటారు. లిఫ్టులో కేవలం పది మంది ఉన్నా, ఈ గ్రహం మీద ఇంత మంది జనాభా ఉన్నా మనం వ్యవహరించే విధానం అందరినీ ప్రభావితం చేస్తుంది. అందువల్ల అందరికీ సహకరించడానికి ప్రయత్నించడం అర్ధవంతంగా ఉంటుంది. "లిఫ్టులో ఇరుక్కుపోయిన ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడగలను?" అనే కోణంలో ఆలోచించడానికి బదులుగా, "మనమందరం కలిసి ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడగలం?" అని ఆలోచిస్తాము. లిఫ్ట్ మాత్రమే కాదు, మన జీవితం కూడా అలాగే ఉంటుంది.

నా సొంత సమస్యలను పరిష్కరించే విషయంలో నేను ఎలా ఆలోచించగలను (ఎందుకంటే నా గురించి ప్రత్యేకమైనది ఏమీ లేదు; లిఫ్ట్ లో చిక్కుకున్న వ్యక్తుల్లో నేనూ ఒకడిని)? నిజానికి, ఈ సమస్య నా వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు: ఇది ప్రతి ఒక్కరి సమస్య. కోపం, స్వార్థం, దురాశ, అజ్ఞానం లాంటి సమస్యల గురించి మాట్లాడుతున్నామని మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ ఉండే సమస్యలే. వాటిని వ్యక్తిగతంగా ఎవరూ కొని తెచ్చుకోరు.

సమస్త ప్రాణులను, అన్నీ జీవరాశులను చేర్చుకోవడానికి మన మనస్సులను మరియు హృదయాలను విస్తరించడం

అందుకే మనం బోధిచిత్త గురించి మాట్లాడేటప్పుడు విశ్వజనీనమైన మనస్సు, హృదయం గురించి మాట్లాడుతున్నాం. ఇష్టమైనవి లేకుండా, మనం వదిలిపెట్టే జీవులు లేకుండా అందరి గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇది చాలా పెద్ద ఆలోచనా విధానం, మానసిక స్థితి. మన మనస్సులను విస్తరించడం గురించి మాట్లాడినప్పుడు, ఇది మనం విస్తరించగలిగే అతి పెద్ద విషయం. మనం ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాం, ఉదాహరణకు, ఈ గ్రహం మీద ఉన్న మనుషుల గురించి మాత్రమే కాదు, ఈ గ్రహం మీద మరియు ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవుల గురించి. ఉదాహరణకు, మన పర్యావరణం యొక్క క్షీణత గురించి ఆలోచిస్తే - ఇది ఇందులో  నివసించే ప్రజలను మాత్రమే ప్రభావితం చెయ్యదు; అన్ని జంతువులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది, కదా?

కాబట్టి, మనకు ఇంత పరిధి ఉంటుంది, దీని గురించి మనం ఆలోచిస్తాము. దీర్ఘకాలిక పరిష్కారాల గురించి ఆలోచించడానికి మనకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది, ఇది కొద్దిసేపటికి మాత్రమే ఉపయోగపడే పరిష్కారం కాదు. మన స్వంత సామర్థ్యం గురించి  ఆలోచించినప్పుడు, మన సామర్థ్యాన్ని సాధించడానికి అతిపెద్ద పరిధి గురించి మనం ఆలోచిస్తాము; ఇది కొంచెం కాదు, సాధ్యమైనంత వరకు ఉంటుంది.

మరియు, నేను చెప్పినట్లుగా, ఇది మనపై మనకు ఉన్న గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్థితిని సాధించడానికి మనందరికీ వర్కింగ్ మెటీరియల్ ఉందని మనం గ్రహిస్తాము, మరియు ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే అనుకుంటారు. కాబట్టి మనల్ని మనం మరియు ఇతరులను కూడా సీరియస్ గా తీసుకుంటాం, మనల్ని మరియు ఇతరులను ఒకేలాగ గౌరవిస్తాం – మనమందరం మనుషులం, మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ఎవరూ అసంతృప్తిగా ఉండాలని కోరుకోరు. ఇదంతా మనం ఏమి చేస్తాము మరియు మన జీవితాన్ని ఎలా గడుపుతున్నాము అనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

ధ్యానంతో మంచి మానసిక స్థితిని మరియు అలవాట్లను అభివృద్ధి చేసుకోవడం

ఈ మానసిక స్థితులను పెంపొందించుకోవడానికి అనేక వివిధ పద్ధతులను అందించడంలో బౌద్ధమతం చాలా గొప్పది. "ప్రతి ఒక్కరినీ ప్రేమించండి" అని చెప్పడమే కాకుండా ఇది అంతకుమించి ఉంటుంది. అది చాలా బాగుంది అని చెప్పడానికి మనం అందరినీ ప్రేమించాలి, కానీ మనం అలా ఎలా చెయ్యగలం? దీని కోసం మనకు ధ్యానం ఉంది. ధ్యానం అంటే ఒక ప్రయోజనకరమైన అలవాటును పెంపొందించుకోవడం. అంటే మనం ఏదైనా ఆట ఆడాలన్నా, సంగీత వాయిద్యం వాయించాలన్నా మనం సాధన చెయ్యాలి. మనం దానిలో మంచిగా మారే వరకు పదే పదే చేస్తాం. మరియు అభ్యాసంతో మనం దాన్ని నేర్చుకుంటాము, అలా కొంతకాలం తర్వాత మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు; మనం ఆ ఆటను చాలా బాగా ఆడవచ్చు లేదా సంగీతాన్ని చాలా సులభంగా ప్లే చేయవచ్చు.

మన ఆలోచనలకు శిక్షణ ఇచ్చే విషయంలో కూడా మనం ఇలాగే చేస్తాము. ధ్యానంతో మనం చేసేది ఇదే. ఒక నిర్దిష్ట అనుభూతిని, ఒక నిర్దిష్ట మానసిక స్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తాము, ఎలాగంటే దానికి అనుగుణంగా పని చెయ్యడం ద్వారా. మీరు ఒక ఆట కోసం శిక్షణ తీసుకోవడం లాగా: ముందుగా, మీరు కొన్ని వార్మప్ వ్యాయామాలు చెయ్యాలి, ఆ తర్వాత మీరు ఆ ఆటను ప్రాక్టీస్ చెయ్యవచ్చు. కాబట్టి మన మానసిక స్థితితో కూడా మనం కొన్ని వార్మప్ వ్యాయామాలు చేస్తుంటాం.

ఒక పాజిటివ్ మానసిక స్థితిని సృష్టించడానికి, ముందు మనం శాంతంగా ఉండి, భావోద్వేగాలను నిశ్శబ్దం చేసి, మన ఆలోచనలు అన్ని చోట్లా ఉంటే లేదా మన భావాలన్నీ కలిసిపోయి ఉంటే వాటిని కూడా శాంతపరచాలి. మనం సాధారణంగా మన శ్వాసపై నిశ్శబ్దంగా దృష్టి పెట్టడం ద్వారా అలా చేస్తాము. మన శ్వాస ఎప్పుడూ అక్కడే ఉంటుంది, మరియు మనం దానిపై దృష్టి పెడితే, అది మన శ్వాస యొక్క స్థిరమైన లయకు శాంతపరచడానికి సహాయపడుతుంది మరియు మన ఆలోచనలు "గాలిలో" ఉంటే వాటిని మన శరీరంతో కలుపుతుంది. ఇది ప్రాథమిక వార్మప్ వ్యాయామం.

మరియు మనం దీన్ని మన ప్రేరణగా ఆలోచిస్తాము. నేను ఎందుకు ధ్యానం చెయ్యాలని అనుకుంటున్నాను? అని. అది కూడా వార్మప్ లో భాగమే. మనం ఒక ఆటను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లేదా సంగీతం నేర్చుకుంటున్నప్పుడు, "నేను దీన్ని ఎందుకు చేస్తున్నాను?" అని అర్థం చేసుకోవడం మరియు బాగా పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనకు అది నచ్చుతుంది కాబట్టి మనం దీన్ని చేస్తున్నాము, శిక్షణ చాలా కష్టమైన పని కాబట్టి మనం వాటిని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ధ్యానం ద్వారా నేను పాజిటివ్ అలవాటును ఎందుకు పెంపొందించుకోవాలని అనుకుంటున్నానో అని మనం ఆలోచిస్తాము. దీనికి కారణం ఏమిటంటే, జీవితంలోని సమస్యలను మంచి మార్గంలో ఎదుర్కోవటానికి ఇది మనకు సహాయపడుతుంది - ఉదాహరణకు, నేను అంత సులభంగా కోప్పడకుండా ఉండడం. నేను ఎప్పుడూ కోపంగా ఉండి మానసికంగా ఇబ్బంది పడితే, నేను ఇంకెవరికీ సహాయం చెయ్యలేను.

కాబట్టి, మనం ఈ వార్మప్ వ్యాయామాలన్నిటినీ చేస్తాం. ఆ తర్వాత అసలైన ధ్యానం చేస్తాము: మనం కోరుకున్న ఒక మానసిక స్థితిని సృష్టించడానికి ఒక రకమైన ఆలోచనా విధానాన్ని ఉపయోగిస్తాము. దీన్ని మన వ్యక్తిగత జీవితాలతో కనెక్ట్ చెయ్యడానికి ఇలా చెయ్యడం చాలా ముఖ్యం. మనం ఏదో ఒక నైరూప్య సిద్ధాంతం గురించి ఆలోచించడం లేదు: నా స్వంత జీవితంలో నాకు సహాయపడటానికి నేను తీసుకోగల స్టెప్స్ గురించి ఆలోచిస్తున్నాను.

ఒక ఉదాహరణ

మన స్నేహితుల్లో ఒక వ్యక్తి మనతో చాలా అసహ్యకరమైన రీతిలో ప్రవర్తించారని అనుకుందాం - వాళ్ళు మనతో ఏదో క్రూరంగా చెప్పి ఉండవచ్చు, లేదా మనకు కాల్ చెయ్యకుండా ఉండవచ్చు, లేదా మనల్ని పట్టించుకోకుండా ఎగతాళి చేసి ఉండవచ్చు. ఇవి ప్రతి ఒక్కరికీ జరిగే భయంకరమైన విషయాలు. ముఖ్యంగా వాళ్ళు మన స్నేహితులు అయితే మనకు బాగా కోపం వచ్చి, చిరాకులో ఉండి మనం స్పందిస్తాము.

శ్వాసపై దృష్టి పెట్టిన తర్వాత మన మనస్సులు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానంలో వాటి గురించి మనం ఆలోచిస్తాము. మన స్నేహితులు, మన క్లాస్ మేట్స్ కూడా నాలాంటి వాళ్ళే అని మనం గుర్తు చేసుకుంటాము: వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు దుఃఖంలో ఉండటానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళు నాతో అసహ్యంగా ప్రవర్తించడానికి ఏదొక కారణం వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, లేదా వారు నా గురించి అయోమయంలో ఉండవచ్చు - అందుకు వాళ్ళు నా మంచి లక్షణాలను మెచ్చుకోలేదు - మరియు నన్ను ఎగతాళి చేశారు. వారి మీద కోపం తెచ్చుకోవడం, డిప్రెషన్ కు గురికావడం - అది ఏమాత్రం ఉపయోగపడదు. దానికి బదులుగా, వాళ్ళను ఇబ్బంది పెట్టే వాటి నుంచి వాళ్ళు విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను, అప్పుడు వాళ్ళు నాతో మంచిగా ఉంటారు, అప్పుడు అందరూ సంతోషంగా ఉండవచ్చు.

కాబట్టి వారి మీద కోప౦తో ఉ౦డడానికి బదులుగా, మనకు ప్రేమ, జాలి కలుగుతు౦ది: "వాళ్లను బాధపెట్టే విషయాల గురి౦చి వాళ్ళు దూరంగా ఉ౦టే చాలా బాగు౦టు౦ది. వాళ్ళు సంతోషంగా ఉండాలి. అప్పుడు మనతో మంచిగా ప్రవర్తిస్తారు." ఈ విధంగా, కోపం కంటే వారి పట్ల ప్రేమను అనుభూతి చెందడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటాము. వారి పరిస్థితితో బాగా ఓపికగా ఉండటానికి ఇది మనకు సహాయపడుతుంది. మరియు మనం బాగా ప్రశాంతంగా మరియు ప్రేమగా మరియు క్షమించే విధంగా ప్రవర్తిస్తే, ఇది వాళ్ళను శాంతపరచడానికి కూడా సహాయపడుతుంది మరియు మన పరిస్థితిని మేనేజ్ చెయ్యడం చాలా సులభంగా ఉంటుంది.

ఇతరులు మనల్ని అనే మాటలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండడం

బుద్ధుడు ఒకసారి ఒక శిష్యుడిని ఇలా అడిగాడు, "ఎవరైనా మీకు ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తే, దాన్ని మీరు అంగీకరించకపోతే, అది ఎవరికి చెందుతుంది?" మీరు అంగీకరించకపోతే అది మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికే చెందుతుంది. కాబట్టి ఎవరైనా మీకు చెడు వైబ్రేషన్లు, నెగెటివ్ ఫీలింగ్స్ మరియు విమర్శలు మొదలైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే, దాన్ని అంగీకరించి వ్యక్తిగతంగా తీసుకోవడం చాలా ముఖ్యం – ఇంకొక మాటలో చెప్పాలంటే, దాన్ని ఆ అవతలి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్న ఒక విషయంగా చూడొచ్చు. నిజానికి, ఎవరైనా మనల్ని విమర్శిస్తే, బహుశా వాళ్ళు నేను సరిదిద్దుకోవాల్సిన ఒక విషయాన్ని ఎత్తి చూపుతుంటే అది మనల్ని మనం పరీక్షించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి మనం దాన్ని పట్టించుకుంటాము, కానీ దాని కోసమే వెళ్ళి ఎవరైనా మనపై విసిరిన చెత్త బంతిని మరియు చెడు ఆలోచనలను తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే బంతి ఆటలో ఒక క్యాచర్ లాగా ఉండకపోవడం చాలా ముఖ్యం.

ఎందుకో కొన్నిసార్లు మనం అలా ప్రవర్తిస్తుంటాం కదా, మనుషులు మనపై విసిరే చెత్తను పట్టుకోవాలనే ఆత్రుతతో మనం ఉంటాం - అసభ్యకరమైన మాటలు, చెడ్డ చూపులు లాంటివి ఏవైనా కానీ. ఇది అంత సులభం కానప్పటికీ, మనకు జరిగే ఈ విషయాలన్నింటినీ వ్యక్తిగతంగా, నన్ను తిరస్కరించడంగా కాకుండా, ఈ అవతలి వ్యక్తికి ఉన్న సమస్యగా తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ అవతలి వ్యక్తిని మనం భయానకంగా చూసే ఆలోచన ఉండటానికి బదులుగా, మనం వాళ్ళను ఇలా చూస్తాము: "అయ్యో, వాళ్ళను ఏదో ఇబ్బంది పెడుతోంది. అక్కడ ఏదో తప్పు ఉంది" అని.

ఇది రెండు, మూడేళ్ల పిల్లలను మనం చూసుకుంటూ, ఆ పిల్లవాడు బాగా అలసిపోయి నిద్రపోవడానికి ఇష్టపడని పరిస్థితిలాగా ఉంటుంది. "సరే, ఇప్పుడు నిద్రపోయే సమయం" అని మనం చెప్తాము, అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు, "నాకు నువ్వంటే ఇష్టం లేదు!" అని. మనం దాన్ని పర్సనల్ గా తీసుకుంటామా? ఆ పిల్లవాడు బాగా అలసిపోయాడు, కాబట్టి ఆ మాటలను మనం ఏమీ పట్టించుకోము, ఎందుకంటే మనకు ఆ పిల్లాడిపై ఎక్కువ సహనం మరియు ప్రేమ ఉంటుంది. అప్పుడు మనం ఆ పిల్లవాడిని శాంతపరచడానికి ప్రయత్నిస్తాము.

ధ్యానంలో, మనకు సమస్యలను కలిగిస్తున్న అవతలి వ్యక్తిని బాగా నిర్మాణాత్మకంగా చూడటానికి మనం ప్రయత్నిస్తాము మరియు ఈ కష్టమైన పరిస్థితిలో ఈ వ్యక్తి పట్ల ఎక్కువ సహనం, ప్రేమ, మంచి పాజిటివ్ ఆలోచనను కలిగి ఉండటం కోసం సాధన చేస్తాము, అలా మనం నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళను ఎదుర్కున్నప్పుడు, బాగా మేనేజ్ చెయ్యగలుగుతాము. క్లుప్తంగా చెప్పాలంటే, బోధిచిత్త యొక్క ఈ అద్భుతమైన మానసిక స్థితిని మనం సాధించడానికి బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది, దీని ద్వారా మనం ధ్యానం మరియు ఇతర పద్ధతులతో ఇతరులకు సాధ్యమైనంత బాగా సహాయపడడానికి, మరియు మన లోపాలను సరిగ్గా వదిలించుకుని పూర్తి సామర్థ్యాలను గ్రహించడానికి మనం బాధ్యత తీసుకుంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పొందడానికి సహాయపడటానికి నేను పనిచేస్తే, ఖచ్చితంగా నేను చాలా సంతోషంగా ఉంటాను. కానీ నేను నా స్వంత ఆనందం కోసం మాత్రమే పనిచేస్తే, ఇతరులను పట్టించుకోకుండా లేదా ఇతరులను అడ్డుగా పెడితే, మనమందరం బాధపడతాము.

ఇప్పుడు, మీరు చిన్నవయసులో ఉన్నప్పుడు, మీరు విద్యార్థులు, మీ సామర్థ్యాన్ని గౌరవించడం నేర్చుకోవడానికి మరియు నెగెటివ్ దిశలో కాకుండా పాజిటివ్ దిశలో అభివృద్ధి చెందడానికి మీకు అన్ని శక్తులు ఉన్నాయని గ్రహించడానికి ఇదే సరైన సమయం. ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా లేము. సమాచార, సామాజిక మాధ్యమాలు మొదలైనవి ఉన్న ఈ యుగంలో మనమందరం కనెక్ట్ అయ్యి ఉన్నాము. ప్రతి ఒక్కరినీ నిర్మాణాత్మకంగా ప్రభావితం చేసే మంచి పాజిటివ్ మార్గాల్లో మనం అభివృద్ధి చెందవచ్చు.

ఇది బోధిచిత్త గురించి కొంచెం వివరణ. ఇప్పుడు మనకు ఉన్న ప్రశ్నలను చూద్దాం.

బౌద్ధమత ఆలోచనా విధానం నుంచి ప్రేమ యొక్క అర్ధం

బౌద్ధమత ఆలోచనా విధానం నుంచి, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలో ప్రేమ గురించి మీరు ఇంకా ఏమైనా వివరించగలరా?

మనం బౌద్ధమత ఆలోచనా విధానంలో ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు, ప్రేమ మనం చెప్పుకున్నట్లుగా, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలని మరియు ఆ సంతోషానికి కారణాలు ఉండాలని కోరుకోవడం. దీని అర్థం అవతలి వ్యక్తిని, వారి బలమైన పాయింట్లు మరియు వారి బలహీనతలను అంగీకరించడం. వాళ్ళు సంతోషంగా ఉండాలనే నా కోరిక వారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపై ఆధారపడి ఉండదు. దేనితో సంబంధం లేకుండా, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను, అంటే వారికి కొంత చోటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా.

ఎప్పుడూ, ప్రేమ కోరికతో కలిసి ఉంటుంది (కోరిక అనేది మనకు ఏదైనా లేనప్పుడు మరియు దాన్ని మనం పొందాలి అని అనుకున్నప్పుడు ఉంటుంది). ఇది అనుబంధం (మనకు అది ఉన్నప్పటికీ, దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడము) మరియు దురాశ (మనకు ఒక స్నేహితుడు లేదా ప్రేమించే వ్యక్తి ఉన్నా కానీ, వారి నుంచి ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాము). ఇదంతా కేవలం వారి మంచి గుణాలను మాత్రమే చూసి, వాటిని అతిశయోక్తి చేసి, దాన్ని పెద్దదిగా చూసి, వారిలో ఉన్న లోటుపాట్లను మరచిపోవడంపై ఆధారపడి ఉంటుంది. మరియు వారికి ఉన్న మంచి లక్షణాలు వాళ్ళు నన్ను ఇష్టపడటం కావచ్చు, నేను ఈ వ్యక్తితో ఉన్నప్పుడు నాకు మంచి అనుభూతిని కావొచ్చు, వాళ్ళు అందంగా సెక్సీగా ఉండవచ్చు, ఏదైనా కానీ. కాబట్టి మనం ఆ వ్యక్తి యొక్క చాలా చిన్న భాగాన్ని మాత్రమే చూస్తున్నాము, దీన్ని మనం చాలా ముఖ్యమైనదిగా చూస్తాము. కాబట్టి ఇది రియలిస్టిక్ ఆలోచనా విధానం కాదు. మరియు ఈ వ్యక్తి నాతో ఎలా ప్రవర్తిస్తాడనే దానిపై ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది: వాళ్ళు నాతో మంచిగా ప్రవర్తిస్తే, నేను వాళ్ళను ప్రేమిస్తాను; వాళ్ళు నన్ను సరిగ్గా చూడకపోతే, నేను వాళ్ళను ప్రేమించను. ఇది స్థిరమైన రకపు ప్రేమ కాదు.

నేను చెప్పినట్లుగా, స్థిరమైన రకపు ప్రేమ - బౌద్ధమతంలో మనం మాట్లాడేది - ప్రతి ఒక్కరికీ బలమైన పాయింట్లు మరియు బలహీనమైన పాయింట్లు ఉన్నట్లే ఒకరికి ఉండే మంచి సైడ్ మరియు నెగెటివ్ సైడ్ రెండింటినీ మనం అంగీకరిస్తాము; ఎవరూ ఆదర్శవంతులు లేదా పరిపూర్ణులు కాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే, మనలో చాలా మంది ఇప్పటికీ కల్పిత కథలనే నమ్ముతున్నారు. ఈ కల్పిత కథలో, తెల్ల గుర్రంపై పరిపూర్ణంగా ఉండే ప్రిన్స్ చార్మింగ్ లేదా ప్రిన్సెస్ చార్మింగ్ ఉంటారు. మనం ఎప్పుడూ యువరాజు లేదా యువరాణి కోసం వెతుకుతూ ఉంటాము, మరియు మనం ప్రేమలో పడిన వివిధ వ్యక్తులను యువరాజు లేదా యువరాణిగా చూస్తాము. కానీ దురదృష్టవశాత్తు, ఇది కేవలం ఒక కల్పిత కథ మాత్రమే మరియు ఫాదర్ క్రిస్టమస్ లాగా, నిజమైన దేన్నీ ఇది సూచించదు.

ఇది తెలుసుకోవడానికి అసలు మంచి విషయమే కాదు; దీన్ని అంగీకరించడం చాలా కష్టం. "ఇతను యువరాజుగా, యువరాణిగా లేదు, కానీ తర్వాత వచ్చే వ్యక్తి అలా ఉండొచ్చు" అని మనం ఎన్నడూ వదులుకోము. తెల్ల గుర్రం మీద వచ్చే రాజకుమారుడు లేదా యువరాణిని ఊహించుకుంటూ, వెతుకుతూ ఉన్నన్ని రోజులు, మనతో సంబంధాలు ఉన్న వారికి సమస్యలు ఉంటాయి, ఎందుకంటే మనకు సరైన భాగస్వామి అనే ఆదర్శానికి అనుగుణంగా ఎవరూ ఉండరు. వాళ్ళు యువరాజు లేదా యువరాణిలా లేనప్పుడు మనకు కోపం వస్తుంది. అంటే, వాళ్ళు నాలాగే మనుషులని, బలమైన పాయింట్లు, బలహీన పాయింట్లు ఉన్నాయనే రియాలిటీని మనం అంగీకరించడం లేదని అర్థం. కాబట్టి నిజమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ, అవతలి వ్యక్తి యొక్క రియాలిటీను అంగీకరించడంపై ఇది ఆధారపడి ఉంటుంది.

మనం ప్రేమించే వ్యక్తి రియాలిటీ యొక్క ఇంకొక విషయం, మనం ఎప్పుడూ మర్చిపోయేది ఏమిటంటే, వాళ్ళ జీవితంలో మనం మాత్రమే ఉండము. ఎప్పుడూ, వాళ్ళు నాతో ఉండటమే కాకుండా వాళ్ళకు కూడా ఒక జీవితం ఉందనే నిజాన్ని మనం మర్చిపోతాము - వాళ్ళకు ఇతర స్నేహితులు ఉన్నారు, కుటుంబం ఉంది, వారికి ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. వారి జీవితంలో భాగమైన ఇతర విషయాలు చాలా ఉన్నాయి; నేనొక్కడినే కాదు. కాబట్టి వాళ్ళు ఇతరులతో మరియు ఇతర విషయాలతో సమయం గడిపినప్పుడు మనం అసూయతో ఇబ్బంది పడడం చాలా అనవసరమైనది. ఉదాహరణకు, వాళ్ళు చెడు మూడ్ లో ఉన్నప్పుడు లేదా మనతో ఉండాలని అనిపించనప్పుడు, అది నా వల్ల కాదు, ఈ అవతలి వ్యక్తి అనుభూతి చెందే మరియు చేసే ప్రతి దానికి నేను కారణం కాదు అని తెలుసుకోవాలి. వాళ్ళు చెడు మూడ్ లో ఉంటే, దానికి కారణం వారి కుటుంబంలోని ఏదొక సమస్య అయ్యి ఉండొచ్చు; లేదా వారి ఇతర స్నేహితుల కారణం కూడా అయ్యి ఉండొచ్చు; లేదా అనారోగ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు; ఇది అనేక విషయాల ద్వారా ప్రభావితమవుతుంది. ఈ వ్యక్తి సమస్యలన్నిటికి నేను మాత్రమే కారణమని ఎందుకు అనుకోవాలి?

అదే విధంగా, ఈ వ్యక్తితో నాకు దీర్ఘకాలిక సంబంధం ఉంటే, రోజూ చాలా విషయాలు మరియు సంభాషణలు జరుగుతాయి. ఎప్పుడూ, ఏమి జరుగుతుంది అంటే, "వాళ్ళు ఈ రోజు నాకు కాల్ చెయ్యలేదు. వాళ్ళు నా టెక్స్ట్ మెసేజ్ కి సమాధానం ఇవ్వలేదు" మరియు మనం ఈ ఒక్క సంఘటనను పెద్దదిగా చూస్తాము; మన ఈ సంబంధం ఎక్కువ రోజులలో మనం చూడము. ఈ ఒక్క సంఘటనతో వాళ్ళు నన్ను ప్రేమించడం లేదని అనుకుంటాం. కానీ ఇది సరైనది కాదు - ఒక చిన్న విషయాన్ని మాత్రమే చూసి దాన్ని పూర్తి సంబంధం నుంచి వేరుగా చెయ్యడం సరైనది కాదు.

రియాలిటీ ఏమిటంటే, ప్రతి ఒక్కరి జీవితం, మూడ్ లు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. మన విషయంలో కూడా అదే నిజం; అందరి విషయంలో కూడా అంతే. కాబట్టి కొన్నిసార్లు నేను ప్రేమిస్తున్న ఈ వ్యక్తి నాతో ఉన్నట్లు అనిపించడం సహజం; కొన్నిసార్లు అలా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు మంచి మూడ్ లో ఉంటారు; కొన్నిసార్లు అలా ఉండరు. మరియు వాళ్ళు చెడ్డ మూడ్ లో ఉంటే - లేదా వారు నా టెక్స్ట్ మెసేజ్ కి సమాధానం ఇవ్వగలిగి ఇతర విషయాలతో బిజీగా ఉంటే - వాళ్ళు ఇకపై నన్ను ప్రేమించడం లేదని అర్ధం కాదు; అది జీవితంలో ఒక భాగం మాత్రమే.

మన ప్రేమపూర్వకమైన సంబంధాలను స్థిరంగా ఉంచుకోవాలనుకుంటే మనం నేర్చుకుని అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఇవి; లేకపోతే, చాలా భావోద్వేగ ఇబ్బందులు ఎదురవుతాయి.

ఒక గొప్ప భారతీయ బౌద్ధమత గురువు ఇచ్చిన ఒక మంచి ఉదాహరణ ఉంది, ఇది ఇతరులతో మన సంబంధాలు శరదృతువులో చెట్టు నుండి గాలిలో ఎగిరే ఆకుల ఉదాహరణ లాగా ఉంటాయి. కొన్నిసార్లు ఆకులు కలిసి గాలిలో ఎగురుతాయి; కొన్నిసార్లు అవి విడిపోతాయి. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి ఎవరితోనైనా ఏదైనా సంబంధం - మన జీవితాంతం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.

మన కిటికీ దగ్గరకు వచ్చిన ఒక అడవి పక్షిలా అవతలి వ్యక్తిని చూడటానికి ప్రయత్నించడం ముఖ్యం. ఒక అందమైన అడవి పక్షి మన కిటికీ దగ్గరకు వస్తుంది, మరియు అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అడవి పక్షి నాతో కాసేపు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ, తర్వాత ఖచ్చితంగా అది ఎగిరిపోతుంది: స్వేచ్ఛగా. ఆ పక్షి మళ్ళీ నా కిటికీ దగ్గరకు వస్తే, చాలా బాగుంటుంది, అప్పుడు నేను ఎంత అదృష్టవంతుడిని. కానీ నేను ఆ పక్షిని బంధించి ఒక బోనులో పెట్టడానికి ప్రయత్నిస్తే, ఆ పక్షి చాలా అసంతృప్తిగా ఉండి చనిపోయే అవకాశం ఉండొచ్చు.

కాబట్టి, మన జీవితంలోకి వచ్చే వాళ్ళతో, మనం ప్రేమించే వాళ్ళతోనూ అదే జరుగుతుంది. వాళ్ళు ఈ అందమైన అడవి పక్షి లాంటి వాళ్ళు. వాళ్ళు మన జీవితాల్లోకి వచ్చి ఎంతో ఆనందాన్ని తెస్తారు. కానీ అడవి పక్షిలానే స్వేచ్ఛగా ఉంటారు. కానీ మనం వాళ్ళను ఆపి మనతోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే, వాళ్ళను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాము – "నువ్వు నాకు ఎందుకు కాల్ చేయలేదు? నన్ను చూడటానికి నువ్వు ఎందుకు రాలేదు? నాతో నువ్వు ఎక్కువ సమయం ఎందుకు గడపవు?" అని. ఇది అడవి పక్షిని బోనులో పెట్టడం లాంటిది. ఆ అడవి పక్షి వీలైనంత వరకు దానిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక అపరాధ భావంతో ఈ వ్యక్తి మనతోనే ఉండిపోతే, అప్పుడు ఆ వ్యక్తి చాలా అసంతృప్తికి లోనవుతారు.

ఇది చాలా మంచి ఆలోచన - మనం ప్రేమించే, మన జీవితంలోకి వచ్చిన ఎవరినైనా ఈ అందమైన అడవి పక్షిలా అనుకోవడం. మనం ఎంత రిలాక్స్ గా ఉంటామో - మనం ఎంత తక్కువగా అతుక్కుపోయి ఉంటామో - ఆ అడవి పక్షి మన కిటికీ దగ్గరకు రావడానికి అంత ఎక్కువ ఇష్టపడుతుంది.

Top