11 ways to help others

ప్రతిరోజూ ఎంతో మంది ప్రజలు, మరియు జంతువుల జీవితాలలో ఇబ్బందులు వస్తున్నాయి. వారికి సహాయం చెయ్యటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ వారి పరిస్థితిని గుర్తించి సహాయపడటానికి ఉత్తమమైన మార్గాన్ని తెలుసుకోవడంపై ఇది ఆధారపడి ఉంటుంది. దయ మరియు నైపుణ్యం ఉంటేనే సరిపోదు – మనం సమయాన్ని సరిగ్గా పాటిస్తూ సొంత క్రమశిక్షణ, సహనం, పట్టుదల, ఏకాగ్రత మరియు జ్ఞానం కూడా ఉండాలి. ఇతరులకు సహాయం చెయ్యటం కోసం ఇక్కడ పదకొండు మార్గాలు ఉన్నాయి. అవి అవసరమైన వారికి ప్రయోజనాన్ని తీసుకురావడమే కాకుండా, మనల్ని ఒంటరితనం నుండి బయట పడేసి మన జీవితాలను ఒక అర్ధం తీసుకురావడానికి సహాయపడతాయి:

1. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోండి.

అనారోగ్యంతో, వికలాంగులుగా, కష్టాల్లో ఉన్నవారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా అధిక భారం లేదా కష్టమైన పనితో ఇబ్బంది పడుతుంటే, మనం అక్కడికి వెళ్లి వారికి సహాయం అందించాలి.

2. తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియక అయోమయంలో ఉన్న వారికి ఒక దారిని చూపించండి.

కష్టమైన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వాళ్ళు మనల్ని సలహా అడిగితే మనం సహాయం చేస్తాం, లేదంటే కనీసం వాళ్ళు చెప్పింది అయినా వింటాం. మన కుక్క లేదా పిల్లి ఏదైనా గదిలో ఇరుక్కుపోతే, దానిని బయటకు తేవడానికి మనం తలుపులను తెరుస్తాము. కిటికీపై ఈగ తిరుగుతున్నప్పుడు కూడా మనం ఇదే పనిని చేస్తాము. ఆ ఈగకు మన గదిలో ఉండాలని లేదు; అది బయటకు రావాలనుకుంటుంది, అందుకే మనం ఆ కిటికీని తెరుస్తాము.

3. మనకు సహాయం చేసిన వారి సహాయాన్ని తిరిగి ఇచ్చెయ్యండి.

ప్రపంచాన్ని నడిపించే ఇతరుల కష్టాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మన కోసం చాలా పనులు చేసిన వారికి - మన తల్లిదండ్రులలాగా - సహాయం చేయడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇది కేవలం సహాయాన్ని తిరిగి ఇచ్చెయ్యాలనే భావనతో కాకుండా హృదయపూర్వకంగా చెయ్యాలి.

4. భయంతో ఉన్న వాళ్లని అక్కున చేర్చుకుని రక్షించండి.

భయపడుతున్న ప్రజలను, జంతువులను ఓదార్చడానికి మన వంతు కృషి మనం చెయ్యాలి. ఎవరైనా ప్రమాదకరమైన చోటికి వెళ్లాల్సి వస్తే మనం వారితో పాటు వెళ్ళి వాళ్లకు రక్షణగా ఉండాలి. హింసాత్మక జీవితాల నుంచి తప్పించుకుని వచ్చిన శరణార్థులకు, మనం భద్రత మరియు వాళ్ళు నివసించడానికి సహాయాన్ని అందించాలి. యుద్ధం లేదా ఒక రకంగా నష్టపోయి దెబ్బతిన్న వారి గాయాలను నయం చేయడానికి మన అవగాహన మరియు సహాయం ఎంతో అవసరం.

5. దుఃఖంలో ఉన్న వాళ్లని ఓదార్చండి.

విడాకులు లేదా ప్రియమైన వ్యక్తి యొక్క మరణం గురించి బాధపడుతున్న ప్రజలను దయతో ఓదార్చడానికి ప్రయత్నించాలి. వాళ్లతో "ఏమిటి మీకు ఇలా జరిగింది" అని అనకుండా, మనం వాళ్ళ చోటులో ఉండి పరిస్థితుల గురించి ఆలోచించాలి.

6. పేద వాళ్లకు వస్తువులను ఇచ్చి సహాయం చెయ్యండి.

స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడం మంచిదే కానీ వీధుల్లో మనం చూసే అడుక్కునే వాళ్లకు కూడా సహాయం చెయ్యడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నిరాశ్రయులైన వాళ్లు మురికిగా కనిపిస్తే, వారిని అలా చూసి వెళ్లిపోకుండా ఒక చిరునవ్వుతో పలకరించి సహాయం చెయ్యాలి. వీధిలో నివసిస్తున్న ఆ మనిషి మన తల్లి లేదా మన కొడుకే అయితే అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి: అప్పుడు మనం ఆలా పట్టించుకోకుండా ఒక మురికి వ్యక్తిలా చూసి చూడనట్టు వెళ్లిపోగలమా?

7. మనతో సంబంధం ఉన్నవారికి ధర్మాన్ని పరిచయం చేయండి

ఎప్పుడూ మన చుట్టూ ఉండటానికి ఇష్టపడే వారికి సహాయం చేయడానికి కూడా మనం కష్టపడాలి. వాళ్లు మన మీద ఆధారపడాలని మనమేమీ కోరుకోవడం లేదు, కానీ వాళ్లతో మనకు బలమైన సంబంధం ఉంది కాబట్టి, సంతోషాన్ని పొందడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి ప్రాథమిక బౌద్ధమత పద్ధతులను నేర్పడం ద్వారా మనం వారికి సహాయం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ వాళ్లు ఇందులో ఆసక్తి చూపిస్తే మాత్రమే ఇలా చెప్పాలి. ఇది ప్రజలను మార్చడం గురించి కాదు, మామూలు సహాయం మరియు సలహాలను అందించడం గురించి ఉంటుంది. ఈ విధంగా, మనం సంబంధాన్ని అర్థవంతంగా చేసుకోవచ్చు.

8. ఇతరులు కోరికలకు అనుగుణంగా వాళ్లకు సహాయం చెయ్యండి.

ఇతరులకు నచ్చిన విధంగా సహాయం చేయడానికి మనం ప్రయత్నించాలి. మనల్ని ఎవరైనా వారికి ఏదైనా నేర్పించమని అడిగితే, అది మనకు ఇష్టమైనది కాకపోయినా, అది వారికి నచ్చినదై ఉండి, మనం దానిని చేయగలిగితే, దాని కోసం మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్తే అక్కడ మనకు నచ్చిన ఆహారమే అందరూ తినాలని పట్టుబట్టడం అనాలోచితం మరియు స్వార్థంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇతరులకు నచ్చే పనులను కూడా మనం చెయ్యాలి. ఒక రిలేషన్ షిప్ లో లాగానే మనకు ఏం కావాలో, మరియు అవతలి వ్యక్తికి ఏం కావాలో అనే దాని దగ్గర రాజీ పడాలి. ఇది ఎప్పుడూ మన గురించి మరియు మనకు నచ్చిన దాని గురించే ఉండాల్సిన అవసరం లేదు.

9. నీతివంతమైన జీవితాలను గడిపేవారిని ప్రోత్సహించండి.

నిజాయితీగా జీవించేవారిని - సానుకూల మార్గాన్ని అనుసరిస్తూ మంచి పని చేస్తున్న వారిని - అహంకారపూరితంగా మార్చకుండా జాగ్రత్త పడుతూ వాళ్లకు మనం సహాయపడవచ్చు. తక్కువ ఆత్మగౌరవం ఉన్న వారితో వ్యవహరించేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అహంకారపూరితంగా ఉన్న మంచి వాళ్ల విషయంలో, మనం వారి గురించి ఇతరుల దగ్గర పొగడవచ్చు, కానీ వారి ముఖం మీదే ఏం చెప్పకూడదు. మనం ఇప్పటికీ వారి సామర్థ్యాలను ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగించమని ప్రోత్సహిస్తాము, అయితే వారు ఏవైనా తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపడం ద్వారా వారి అహంకారాన్ని తగ్గించడానికి వారికి సహాయపడతాము.

10. వినాశకరమైన జీవితాలను గడిపేవారికి నిర్మాణాత్మక ప్రవర్తనను నేర్పించండి.

చాలా వినాశకరమైన, నెగెటివ్ జీవితాలను గడుపుతున్న వ్యక్తులు మనకు ఎదురుపడితే, వాళ్లను మనం ఎప్పుడూ తోసిపుచ్చకూడదు, తిరస్కరించకూడదు లేదా ఖండించకూడదు. వ్యక్తులను జడ్జ్ చేసే ముందు, వాళ్లు మార్పుకు సిద్ధంగా ఉంటే ఆ నెగెటివ్ ప్రవర్తనను అధిగమించే మార్గాలను చూపించడానికి మనం ప్రయత్నించాలి.

11. ఎప్పుడైతే మిగతావన్నీ ఫలించవో, అప్పుడు మీ అసాధారణ సామర్థ్యాలను ఉపయోగించండి.

మనలో కొంత మందికి సాధారణ శక్తులకు మించిన సామర్థ్యాలు ఉంటాయి. మనం మార్షల్ ఆర్ట్స్ నిపుణులు కావచ్చు, కాని దానిని ఇతరులకు చూపించము.  అయినా కానీ, ఎవరి పైన అయిన దాడి జరుగుతున్నట్లు మనం చూస్తే, వాళ్లను ఆపడానికి మనకు ఇంక వేరే మార్గం లేకపోతే, ఆ దాడి చేసిన వ్యక్తిని లొంగదీసుకోడానికి మన సామర్థ్యాలను ఉపయోగించాలి.

ఇతరులకు సహాయం చెయ్యడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఎలా సహాయం చేయాలో, అసలు ఏ మనిషికి సహాయం చేయాలో అని కాకుండా, అటువంటి సహాయాన్ని ఎప్పుడు చెయ్యాలో అని తెలుసుకోవడం అసలైన నైపుణ్యం. అలా ఇతరులు తమకు తాము సహాయం చేసుకోవడం కూడా నేర్చుకోవచ్చు. శారీరకంగానైనా, మానసికంగానైనా బాధపడుతున్న వారిని వెంటనే రక్షించాల్సిన అవసరం చాలా ఉంది. కానీ సహాయం సరైన రీతిలో మాత్రమే చెయ్యాలి - ఎక్కువ చెయ్యకూడదు అలా అని తక్కువ కూడా చెయ్యకూడదు. దురదృష్టవంతులు తిరిగి వారి కాళ్లపై నిలబడటానికి మనం సహాయం చెయ్యాలి. కానీ మంచి సహాయం అంటే ఇతరులు తమ కాళ్లపై నిలబడేలా చెయ్యటానికి తగిన పరిస్థితులను మరియు సాధనాలను అందించడం.

Top