How to meditate alfred schrock unsplash

ధ్యానం అనేది మన మనస్సులను శాంత పరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి సహాయపడే ఒక సాధనం. దీనిని ప్రారంభించే ఎక్కువ మంది బౌద్ధమత బోధనల గురించి ఏమీ తెలుసుకోకుండా ఉత్సాహంతో మొదలుపెడతారు. ఈ ధ్యానం దశల వారీగా నేర్చుకోవడం చాలా మంచిది. బుద్ధుడు బోధనలను నేర్చుకుంటున్న కొద్దీ మన ధ్యానం క్రమంగా బలపడుతుంది.

ఇందులో, మనం ధ్యానం యొక్క సాధన చేయడానికి కొన్ని సాధారణ విషయాలను తెలుసుకుందాం. ఒక అధునాతన అభ్యాసకుడు ఎప్పుడైనా, ఎక్కడైనా ధ్యానం చేయగలడు. ఇప్పుడే మొదలుపెట్టే వారికి, నిశ్శబ్దమైన ప్రదేశాన్ని కనిపెట్టడం బాగా సహాయపడుతుంది, ఎందుకంటే మన పరిసరాలు మనల్ని చాలా బలంగా ప్రభావితం చేస్తాయి.

ధ్యానం చెయ్యటానికి సరైన చోటు

ఒక గదిలో కొవ్వొత్తులు, విగ్రహాలు మరియు ధూపం ఉంటే అదే ఉత్తమమైనది అని మనం అనుకోవచ్చు. అదే మనకు ఉండాలంటే, మంచి విషయమే. అదృష్టవశాత్తూ, ధ్యానానికి ఇంత పెద్ద సెటప్ అవసరం లేదు; కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ గది శుభ్రంగా ఉండాలి.

మన చుట్టూ ఉన్న వాతావరణం క్రమబద్ధంగా ఉంటే, మన మనస్సు కూడా క్రమబద్ధంగా ఉంటుంది. ఇబ్బంది కలిగించే వాతావరణం మన మనస్సును చెడుగా ప్రభావితం చేస్తుంది.

ప్రారంభంలో, వాతావరణం నిశ్శబ్దంగా ఉంటే ఇది కూడా మనకు చాలా సహాయపడుతుంది. మనం బాగా రద్దీగా ఉండే సిటీలో ఉంటుంటే కష్టమే, కాబట్టి చాలా మంది ఉదయాన్నే లేదా రాత్రి పూట ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. చివరికి, శబ్దం మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, కానీ ప్రారంభంలో, కాస్త గందరగోళంగానే ఉన్నట్టు అనిపిస్తుంది.

సంగీతం మరియు ధ్యానం

బౌద్ధమతంలో, సంగీతంతో కలిపి ధ్యానం చేయడం మంచిది కాదు అని చెప్పబడింది, ఎందుకంటే ఇది ప్రశాంత కోసం బయట వాటిపై ఆధారపడటం లాగా అవుతుంది. దీనికి బదులుగా, మన అంతర్గతంగా శాంతిని మనం సృష్టించుకోగలగాలి.

ధ్యానం చేసే పద్ధతి(భంగిమ)

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన వీపును నిటారుగా ఉంచి, మన భుజాలు, మెడ మరియు ముఖ కండరాలను రిలాక్స్ చేస్తూ హాయిగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చోవడం మీకు బాగా సౌకర్యంగా అనిపిస్తే, అలా చెయ్యటమే మంచిది. ఇబ్బంది కలుగుతున్నట్టు ఉండకూడదు! కొన్ని రకాల జెన్ ధ్యానంలో, మనం అస్సలు కదలకూడదు. ఇంకొన్ని రకాల ధ్యానాలలో, మీరు మీ కాళ్లను కదిలించాలనుకుంటే, కదిలించవచ్చు - దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ధ్యానానికి కావలసిన సమయం

మనం ప్రారంభించినప్పుడు, చాలా తక్కువ సమయమే ధ్యానం చెయ్యాలని సలహా ఇవ్వబడుతుంది – అంటే మూడు నుండి ఐదు నిమిషాలు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సేపు దృష్టి పెట్టడం నిజంగా కష్టమే. ఎక్కువ సేపు చేసి దృష్టి పోగొట్టుకోవడం కంటే తక్కువ సేపు చేసి బాగా ఫోకస్ చెయ్యటం చాలా మంచిది.

గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సూత్రాలలో ఒకటి ఏమిటంటే, ప్రతీదీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్ని రోజులు మీ ధ్యానం బాగా జరుగుతుంది, కొన్ని రోజులు అలా జరగదు.

మన శరీరాలు మరియు మనస్సులు రిలాక్స్ గా ఉంచుకోవడం మరియు మనం ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. కొన్ని రోజులు మనకు ధ్యానం చెయ్యాలనిపిస్తుంది, ఇంకొన్ని రోజులు అలా అనిపించదు. ప్రోగ్రెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాబట్టి ఒక రోజు మనకు అద్భుతంగా అనిపిస్తుంది, ఇంకొక రోజు అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కొన్ని సంవత్సరాల పట్టుదల తర్వాత, మన ధ్యాన అభ్యాసం మెరుగుపడుతున్నట్లు మనం గమనిస్తాం.

తరచుగా ధ్యానం ఎలా చెయ్యాలి

ధ్యానానికి కట్టుబడి ఉండటమే కీలకమైనది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలతో మొదలుపెట్టి ధ్యానం చెయ్యటం మంచిది. మొదటి కొన్ని నిమిషాల తర్వాత, మనం చిన్న విరామం తీసుకోవచ్చు, తర్వాత మళ్ళీ మొదలు పెట్టవచ్చు. ఒక టార్చర్ సెషన్ లో గంటసేపు కూర్చోవడం కంటే ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది.

శ్వాసతో ధ్యానం చెయ్యండి

చాలా మంది ముందుగా ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెడతారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ఇది బాగా సహాయపడుతుంది.

  • ముక్కు నుంచి మామూలుగానే శ్వాస తీసుకోండి - వేగంగా కాకుండా, చాలా నెమ్మదిగా కూడా కాకుండా, చాలా లోతుగా కూడా తీసుకోకండి.
  • రెండింటిలో ఒకదాని శ్వాస పైనే దృష్టి పెట్టండి - మన శక్తిని పెంచడంలో సహాయపడటానికి ముక్కు లోపలికి మరియు బయటకు పీల్చటం మరియు వదలటం, మనం నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే, లేదా మన మనస్సు ఎటో వెళ్తూ ఉంటే అప్పుడు పొత్తికడుపు లోపలికి మరియు బయటకు వెళ్లడాన్ని గమనించండి.
  • పది సార్లు ఊపిరి లోపలి నుంచి బయటకి వెళ్ళేది లెక్కపెట్టండి - మనస్సు ఎటైనా వెళ్తున్నట్లు అనిపిస్తే, దాని దృష్టిని నెమ్మదిగా శ్వాస వైపుకు మళ్లించండి.

ఇక్కడ మన మనసు నిశ్శబ్దం అయిపొవట్లేదు. అది ఎంత త్వరగా దృష్టి మళ్లిందో గుర్తించి, దాన్ని తిరిగి తీసుకురావడమే అసలైన పని. లేదా, మనం నీరసంగా మరియు నిద్రలోకి జారుకుపోతే, మనల్ని మనం నిద్ర లేపుకోవాలి. ఇది అంత సులభం కాదు! మన నీరసాన్ని లేదా మానసిక కదలికను కూడా మనం గమనించలేము - ప్రత్యేకించి మనకు కోపంగా ఉన్న వ్యక్తి గురించి ఆలోచించడం వంటి ఇబ్బందికరమైన ఆలోచన ఏమైనా వస్తే. కానీ శ్వాస అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనం మన దృష్టిని తిరిగి తెచ్చుకోగలం.

శ్వాసతో ధ్యానం చెయ్యడం వల్ల వచ్చే ఉపయోగాలు

ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు, శ్వాసపై ధ్యానం చెయ్యడం వల్ల చాలా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన ఆలోచనలు ఎప్పుడూ ఎక్కడో తేలుతూ ఉంటే, అప్పుడు మనం మన శ్వాసపై దృష్టి పెట్టడం అనేది బాగా సహాయపడుతుంది. కొన్ని ఆసుపత్రులలో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో నొప్పిని తగ్గించడం కోసం ఈ శ్వాసతో కూడిన ధ్యానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది శారీరక నొప్పినే కాకుండా భావోద్వేగ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇతరుల పట్ల ప్రేమను పెంపొందించుకోవడం

శ్వాసపై ధ్యానం చేసి మన మనస్సులను శాంతపరుస్తే, ఇతరుల పట్ల మరింత ప్రేమను సృష్టించడానికి మన ఆలోచనలను ఉపయోగించుకోవచ్చు. ప్రారంభంలో, "ఇప్పుడు నేను ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాను" అని ఆలోచించి ఆ తర్వాత వాస్తవాన్ని అనుభూతి చెందలేము. దాని వెనుక ఎలాంటి శక్తి ఉండదు. ప్రేమను పెంపొందించడానికి మనం ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని ఉపయోగిస్తాము:

  • అన్ని జీవరాశులు ఒక దానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. మనమందరం ఇందులో కలిసిగట్టుగా ఉన్నాము.
  • సుఖాన్ని కోరుకోవడంలో, దుఃఖాన్ని కోరుకోకపోవడంలో అందరూ సమానమే.
  • ప్రతి ఒక్కరూ అందరి చేత ఇష్టపడాలని కోరుకుంటారు; ఎవరూ అసహ్యించుకోబడాలని లేదా పట్టించుకోకుండా ఉండాలని కోరుకోరు.
  • నాతో సహా అందరూ ఒకేలా ఉంటారు. 

మనమందరం ఒకరితో ఒకరం అనుసంధానించబడి ఉన్నాం కాబట్టి, మనం ఇలా భావిస్తాము:

  • ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి మరియు ఆ సంతోషానికి అనేక కారణాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండి, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా.

ఈ విషయం గురించి ఆలోచిస్తూ, సూర్యుని లాగా వెచ్చని, పసుపు రంగు కాంతిని మన హృదయాలలో ఊహించుకుంటాము. ఇది ప్రతి ఒక్కరిపై ప్రేమతో అన్ని దిశలలో వ్యాపిస్తుంది. మన ఆలోచన ఎటు పడితే అటు వెళ్తే, "అందరూ సంతోషంగా ఉండాలి" అనే భావనకు తిరిగి వచ్చేలా చేస్తుంది.

రోజూ ధ్యానం

ఈ రకమైన ధ్యానాన్ని పాటిస్తే, మనం రోజూ ఉపయోగించగల సాధనాలను అభివృద్ధి చేసుకోగలం. అంతిమ లక్ష్యం ఒక రోజంతా మన శ్వాసపై దృష్టి పెట్టలేకపోవడం కాదు, మనం కోరుకున్నప్పుడల్లా సాధారణంగా దృష్టి పెట్టడానికి మనం సంపాదించిన నైపుణ్యాలను ఉపయోగించుకోవడం. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, "వారు ఇంక ఎప్పుడు నోరు మూసుకుంటారు?!" అని మనకు అనిపిస్తే?! అప్పుడు మనకు ఈ ధ్యానం "అతను కూడా ఒక మనిషే, అతని మాటలు కూడా అందరూ వినాలని అనుకుంటాడు" అని అర్థమయ్యేలా చేస్తుంది. ఈ విధంగా, ధ్యానం మన వ్యక్తిగత జీవితంలో మరియు ఇతరులతో కుదుర్చుకునే సంబంధాలలో బాగా సహాయపడుతుంది.

Top