మరణం మరియు అశాశ్వతం యొక్క నాలుగు సూత్రాలు

ధ్యానం అనేది బోధనలను వినడం, వాటి గురించి ఆలోచించి వాటిని ధ్యానించడం అనే మూడు రకాల ప్రక్రియలో భాగం అని మనం చూశాము. ధ్యానం, ఈ మూడవ దశగా, నిజానికి మన బోధనలను మన జీవితాలలో ఎలా అన్వయించుకుంటాము అనే దాని గురించి ఉంటుంది. ఇది రిపీట్ చెయ్యడం ద్వారా వస్తుంది. దీన్ని రిపీట్ చేసుకుంటూ మనం సాధించాలనుకునే పాజిటివ్ మానసిక స్థితిని మనం ప్రాథమికంగా నిర్మించుకుంటాం, అలా అది ఒక అలవాటుగా మారుతుంది.

మనం బోధనలు వింటాము. దీని నుంచి, మనకు విచక్షణా అవగాహన వస్తుంది. అక్కడ మనం "అవును, ఇది బుద్ధుని బోధన" అని గుర్తించి దాని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాము. మనం బోధనలతో సంబంధాన్ని కలిగి ఉన్నామని కూడా తెలుసుకుంటాము; అన్ని బోధనలను మనం తప్పనిసరిగా అర్థం చేసుకోలేము, కానీ మన ప్రేరణ మరియు ఆసక్తి నుంచి మనం వేరు అని తెలిసే వరకు అవే నిజమని అనుకుంటాము. ఏదైనా నిజం కాదని అర్ధం అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ నిజమని భావించడానికి ఓపెన్ మైండ్ ను కలిగి ఉండటం చాలా ముఖ్యం, మరియు అది నిజంగా ఉందో లేదో తెలుసుకోవడానికి దాన్ని పరిశీలించాలని నిర్ణయించుకోవాలి. ఇది కూడా విటమిన్ల లాగానే ప్రయోజనకరంగా ఉంటుందని మనం అనుకోవాలి. "అది నిజంగా నన్ను చంపుతుందో లేదో తెలుసుకోవడానికి నేను దానిని పరీక్షిస్తాను" అని అనుకుంటూ మీరు విషం తీసుకోరు, కానీ మీరు విటమిన్లను అలానే తీసుకుంటారు. కాబట్టి, ఇది ప్రయోజనకరంగా ఉంటుందని మనం అనుకుంటాము, ఎందుకంటే చాలా మంది ఇలానే చెబుతారు, కాబట్టి మనమే దాన్ని ప్రయత్నించి తెలుసుకోవచ్చు.

బోధనల గురి౦చి ఆలోచి౦చినప్పుడు, "ఆలోచి౦చడ౦ ను౦డి వచ్చే విచక్షణాత్మక అవగాహన" అని పిలువబడే ఒక ప్రక్రియ యొక్క ముగింపుకు చేరుకోవడానికి మనం వాటిని పరిశీలిస్తాము. ఇక్కడే మనం బోధనలను అర్థం చేసుకున్నామని, బుద్ధుడు బోధించినది సత్యం అని, దానికి నిజంగా ప్రయోజనాలు ఉన్నాయని, మనం అనుకున్నది సాధించడం కుదురుతుందని పూర్తిగా నమ్ముతాం. ప్రజలు పై దశలను వదిలేసినప్పుడు, చాలా మంది లాగే, కొంతకాలం తర్వాత, వాళ్ళు "నిర్ణయాత్మక కదలికను” కలిగి ఉంటారు. మరో మాటలో చెప్పాలంటే, ఇవన్నీ నిజంగా సాధ్యమేనా అని వారికి ఖచ్చితంగా తెలియదు. అందుకే వాటిని వదిలేస్తారు.

విముక్తి అంటే ఏమిటి?

విముక్తి లేదా జ్ఞానోదయాన్ని సాధించే పద్ధతుల గురించి చదివినప్పుడు, విముక్తి పొందడం అంటే ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. జ్ఞానోదయం పొందడం అంటే ఏమిటి? ఆ తర్వాత ఏం జరుగుతుంది? బుద్ధుడు సర్వజ్ఞుడని, అన్ని విషయాలను సరిగ్గా, ఏకకాలంలో తెలుసుకుంటాడని బోధనలు చెబుతున్నాయి. బుద్ధుడు కూడా ప్రతి జీవి పట్ల సమాన శ్రద్ధను కలిగి ఉంటాడు, మరియు ప్రతి జీవితో పరిపూర్ణంగా సంభాషించగలడు. కాబట్టి, ఒక బుద్ధుడు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు.

ఇది అసలు సాధ్యమేనా లేక కేవలం ఇది కల్పిత కథ మాత్రమేనా? ఇది హాస్యాస్పదం అనుకుంటే దాన్ని సాధించడానికి మనం ఏం చేస్తున్నాం? ఇది ఒక కల్పిత కథ అని మనం అనుకుంటే, దాన్ని సాధించడం సాధ్యమేనని మనం నిజంగా నమ్మము. బౌద్ధమతంలో చర్చించబడిన లక్ష్యాలను మరియు మన స్వంత ప్రేరణను మనం సరిగ్గా పరిశీలించాలి.

మన లక్ష్యం ఏమిటి?

"ప్రేరణ" అనే పదానికి బౌద్ధమతంలో చాలా నిర్దిష్టమైన అర్థం ఉంది. "మీ ప్రేరణను పునరుద్ఘాటించండి లేదా సృష్టించండి" అని మనం ఎప్పుడూ చెప్తాము. ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి లక్ష్యం, మరొకటి, దాని వెనుక ఉన్న భావోద్వేగం లేదా అనుభూతి, అదే ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనల్ని ప్రేరేపించేది. సాధారణంగా ఇంగ్లిష్ లో ‘మోటివేషన్’ అనే పదానికి ప్రధానంగా ఇంకో అర్థం ఉంటుంది, మనల్ని ఏదో ఒకటి చెయ్యడానికి ప్రేరేపించే భావోద్వేగం అని.

బౌద్ధమత బోధన అయిన "ధర్మాన్ని" ఆచరించే చాలా మంది చిత్తశుద్ధితో ఉంటే, ఈ జీవితాన్ని కొంచెం సులభతరంగా మరియు మరింత సంతోషంగా చెయ్యడమే లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. మరియు ఇది మంచిదే – దీన్ని నేను "నిజమైన ధర్మం" అని కాకుండా "ధర్మ-లైట్" అని పిలుస్తాను. ఇదే మొదటి మెట్టు. నిజమైన విషయం ఏమిటంటే, మంచి పునర్జన్మల కోసం పనిచేయడం, ప్రాథమికంగా ఈ జీవితం తర్వాత ఒక విలువైన మానవ పునర్జన్మను కొనసాగించడం. కానీ మీకు పునర్జన్మపై నమ్మకం లేకపోతే, మంచి జీవితాన్ని పొందడానికి మీరు నిజాయితీగా ఏ లక్ష్యం పెట్టుకుంటారు? పునర్జన్మను అర్థం చేసుకోవాలంటే - పునర్జన్మ అంటే ఏమిటి, మనస్సు యొక్క స్వభావం, ఆత్మ స్వభావం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. నిజానికి, మంచి పునర్జన్మను లక్ష్యంగా చేసుకోవడం బౌద్ధమత విషయానికి సంబంధించినది కాదు. క్రైస్తవులు మరియు ఇతర మతాలు కూడా దీన్ని లక్ష్యంగా చేసుకుంటాయి; క్రైస్తవ మతానికి సంబంధించి, ఇది పరలోకపు పునర్జన్మ. 

నియంత్రణ లేకుండా రిపీట్ అయ్యే పునర్జన్మ నుంచి విముక్తి సాధించడం తర్వాతి లక్ష్యం. హిందూ మతాలు కూడా దీనినే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాబట్టి, ఈ విముక్తి అంటే బౌద్ధమతం ఏమి చెప్తుందో, దాన్ని సాధించే పద్ధతులు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు, అంతిమ లక్ష్యం బుద్ధుని జ్ఞానోదయ స్థితిని లక్ష్యంగా చేసుకోవడమే మిగులుతుంది - ఇది బౌద్ధమతానికి ప్రత్యేకమైనది.

దశలవారీగా

బౌద్ధమత బోధనలను పరిశీలిస్తే అవి దశలవారీగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఒక అంతర్దృష్టి మరొక దాన్ని అనుసరిస్తుంది, మరియు దీన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఎందుకంటే "నేను బుద్ధుడు కావాలనుకుంటున్నాను, అలా నేను సమస్త ప్రాణులకు సహాయం చెయ్యగలను" అని మనం చెబితే, అది కేవలం అర్థం లేని మాట మాత్రమే. మనం నిజంగా విశ్వంలోని ప్రతి కీటకాన్ని విముక్తి చేసి వాటికి జ్ఞానోదయం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామా? బహుశా అది కాకపోవచ్చు. నిజానికి దాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి దాదాపు ఊహించలేని మనస్సు యొక్క పరిధి అవసరం, కాబట్టి మనం మెల్లగా దాన్ని నిర్మించుకోవాలి. నేను అనువదించిన "నాలుగు సూత్రాలతో”, ప్రతి దాన్ని పరిశీలించడానికి నాలుగు దృక్కోణాలతో ప్రతి బోధనను పరిశీలించడం ద్వారా మనం ధర్మం యొక్క అత్యంత ఆధార విషయాలతో ప్రారంభిస్తాము.

ఒక ఉదాహరణగా, ఈ నాలుగు సూత్రాలను ఉపయోగించి, మరణం మరియు అశాశ్వతం గురించి ఆలోచిద్దాం మరియు ధ్యానిద్దాం. నా క్లోజ్ ఫ్రెండ్ గత వారం చనిపోయాడు అందుకే కొంచెం స్వార్థంతో వీటిని ఎంచుకుంటున్నాను. ఏదేమైనా, ఆ నాలుగు సూత్రాలు ఇవే:

  • పరాధీనత యొక్క సూత్రం – మనం సృష్టించాలనుకునే మానసిక స్థితి, మరణం గురించిన అవగాహన దేనిపై ఆధారపడి ఉంటుంది?
  • కార్యాచరణ సూత్రం – మనం ఈ మానసిక స్థితిని సాధిస్తే, అది ఏమి చేస్తుంది మరియు దాని ప్రయోజనాలు లేదా నష్టాలు ఏమిటి?
  • కారణం యొక్క సూత్రం – అది నిజమో కాదో తెలుసుకోవడానికి బోధనలను పరిశీలిస్తే, అది బుద్ధుని మిగిలిన బోధనలకు సరిపోతుందా? ఇది లాజికల్ గా ఉంటుందా? మనం దానిని ప్రయత్నించినప్పుడు, అది దాని ప్రకటిత ప్రభావాన్ని కలిగి ఉంటుందా?
  • ప్రకృతి సూత్రం – మరణం అనేది ప్రకృతి స్వభావానికి ఒక ఉదాహరణా? అందరూ చనిపోతారా?

మనం చేసేది ఏమిటంటే, మరణం గురించి ఒక నిర్దిష్ట బోధనను తీసుకొని, దాన్ని ఈ నాలుగు సూత్రాల కోణంలో విశ్లేషించి, మనకు అవసరమైనంత సమయాన్ని వెచ్చించడం. దీని కోసం పది నిమిషాలు, దాని కోసం ఇరవై నిమిషాలు వెచ్చించాలని ఫార్ములా ఏమీ లేదు. కానీ చాలా త్వరగా చెయ్యకపోవడమే మంచిది, ఎందుకంటే పద్దాక మీరు దృష్టి పెట్టే దానికి అర్థం ఉండదు. ప్రతి దాన్ని అర్ధం చేసుకుని నిజంగా దానితో పనిచేయడం చాలా బాగుంటుంది.

సమగ్ర అవగాహనను పొందడం

ప్రాథమికంగా, మనం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నామని నమ్మాలనుకుంటున్నాము మరియు విషయాలు ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తూ ముందుకు మరియు వెనుకకు వెళ్ళము. అందుకే టిబెటన్లకు చర్చా విధానం ఉంటుంది, ఇది మన అవగాహనను ప్రశ్నించడానికి బలవంతం చేస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలి - మీరు నిశ్శబ్దంగా క్లాస్ వెనుక కూర్చొని ఉండలేరు. ఒక వ్యక్తి ఏదో చెబుతాడు, మరియు ప్రత్యర్థి దానిని అంగీకరించాలి లేదా తిరస్కరించాలి. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం సరైన సమాధానాన్ని కనిపెట్టడం కాదు, ఒక అంశంపై మన అవగాహనను పొందడం. ఇది ఒక అద్భుతమైన పద్ధతి ఎందుకంటే ఇతరులు మన ఆలోచనలను మనకన్నా ఎక్కువగా సవాలు చేస్తారు. చర్చ సమయంలో, ప్రజలు చాలా సరదాగా ఉంటారు మరియు అవతలి వ్యక్తి తమతో విభేదిస్తున్నప్పుడు బాగా నవ్వుతారు. కానీ అదంతా మంచి హ్యూమర్ తో చేసి అందరూ ఎంజాయ్ చేస్తారు.

ఈ అభ్యాస శైలి యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, మీరు ఎవరైనా సరే, ఏదో ఒక సమయంలో మిమ్మల్ని మీరే విభేదిస్తారు మరియు మూర్ఖంగా ఏదొకటి చెప్తారు. ఇది అహంకారం మరియు గొప్పతనం అనే భావాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది సిగ్గును కూడా పోగొడుతుంది - మీరు ఖచ్చితంగా అసెంబ్లీ ముందు లేచి వాదించడానికి సిగ్గుపడరు.

మనం ఆ చర్చను "ఓహ్, ఇది ఒక మేధోపరమైన విషయం; నేను సహజంగా ఉండి ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను" అని అనుకుని ఆపెయ్యకూడదు. డిబేట్ మీకు ధ్యానం చెయ్యడానికి సహాయపడుతుంది, ఇదే అసలైన ఉద్దేశ్యం. చర్చ జరిగిన తర్వాత, మీకు ఇంక ఎటువంటి సందేహాలు ఉండవు మరియు మీ అవగాహన గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది, ఆ తర్వాత మీరు ఈ అంతర్దృష్టిని పూర్తి విశ్వాసంతో ఇంటిగ్రేట్ చెయ్యడానికి ధ్యానం చెయ్యవచ్చు. లేకపోతే, మీ ధ్యానం అంత దృఢంగా ఉండదు. వాస్తవానికి, మీరు ఇక్కడ ఒకరితో ఒకరు అధికారికంగా చర్చించకపోవచ్చు, కానీ గర్వం లేదా అహంకారం లేకుండా, రక్షణాత్మకంగా లేకుండా, అవతలి వ్యక్తి మనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడని భావించి బోధనల గురించి చర్చించడం చాలా గొప్ప పని.

మరో రెండు సాంకేతిక బౌద్ధమత విషయాలు "ఒక వాస్తవాన్ని నిజమని నమ్మడం" మరియు "దృఢమైన విశ్వాసం." తప్పుని నిజం అని మనం నమ్మవచ్చు, కాబట్టి బోధనలను పరిశీలించేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనకు సరైన అవగాహన లేనప్పుడు అది మనకు సరిగ్గా అర్ధం అయ్యిందని మనం అనుకోకూడదు. మన నమ్మకాన్ని ఏదీ మార్చదని మనం అనుకున్నప్పుడు దృఢమైన నమ్మకం ఏర్పడుతుంది, దీనినే మనం నిజంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

ముందుకు సాగుతూ ఉండండి

ఇవన్నీ మొండితనం, సన్నిహిత మనస్తత్వంలోకి మారిపోతాయి. మనకు తప్పుడు అవగాహన ఉంటుంది మరియు మనల్ని ఎవరూ సరిదిద్దలేనంత మొండిగా ఉంటాము - ఇది కొన్నిసార్లు "తప్పు ఆలోచనగా" అర్ధం అవుతుంది. మనం ఏదైనా తప్పుగా అనుకుని దాని గురించి చాలా మొండిగా ఉంటాము, దానితో శత్రుత్వాన్ని కలిగి ఉంటాము ఎవరైనా దాన్ని ఏదైనా చెయ్యడానికి వస్తే వాళ్లపై మనం దాడి చేస్తాము.

మనం బుద్ధులం అయ్యే వరకు, విషయాలను బాగా లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. "మీ అవగాహన స్థాయితో, మీ సాధన స్థాయితో ఎప్పుడూ సంతృప్తి చెందకండి, ఎందుకంటే మీరు లోతుగా ఆలోచించగలరు, ఉన్నత శిఖరాలను సాధించగలరు." కాబట్టి మనకు సరైన అవగాహన ఉన్నప్పటికీ, అది లోతైన అవగాహన అవ్వకపోవచ్చు. దలైలామా గురువులలో ఒకరైన త్రిజాంగ్ రింపోచే గారు ఇలా అనేవారు, "నేను లామ్-రిమ్ చెన్-మో ను (సాంగ్ ఖాప గారి ది గ్రాండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది గ్రేడెడ్ స్టేజెస్ ఆఫ్ ది పాత్ - ఒక ప్రాథమిక మరియు భారీ గ్రంథం) వందసార్లు చదివాను, మరియు నేను దాన్ని చదివిన ప్రతిసారీ, నాకు భిన్నమైన మరియు లోతైన అవగాహన వచ్చింది." ప్రారంభంలో సరిగ్గా అర్ధం అయినప్పటికీ, మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

మరణ ధ్యానం

ఇప్పుడు మనం మరణ ధ్యానానికి సంబంధించి నాలుగు పాయింట్లను చూద్దాం. అవి దేనిని సూచిస్తాయి మరియు వాటిని ఎలా అప్లై చెయ్యాలో మనకు ఒక ఉదాహరణ ఉంది. మరణ౦ గురి౦చి, మరణ ధ్యాన౦ గురి౦చి మనం బోధనలు విన్న తర్వాత మాత్రమే అలా చేస్తా౦. మరణానికి సంబంధించి, మనం అర్ధం చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక వాస్తవాలు ఉన్నాయి:

  • మరణం అనేది అనివార్యం.
  • మరణం ఎప్పుడైనా రావొచ్చు.
  • మరణ సమయంలో, ధర్మం తప్ప ఇంకేదీ ఉపయోగపడదు.

మనమందరం చనిపోబోతున్నాము. ఇది అనివార్యం - నేను, మీరు, మనకు వ్యక్తిగతంగా తెలిసిన ప్రతి ఒక్కరూ మరియు అందరూ. మరణం ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. మనం మరణించినప్పుడు, మనం అలవరచుకున్న మరియు మన మానసిక అలవాట్లలో ఒక భాగమైన పాజిటివ్ అలవాట్లు తప్ప ఇంకేదీ మనకు సహాయపడదు.

మరణం అనివార్యం, కానీ ఇది దేనిపై ఆధారపడి (ఆధారపడటం యొక్క సూత్రం) ఉంటుంది? దీన్ని మనం అనేక స్థాయిలలో విశ్లేషించవచ్చు. మొదటిది, మరణం జీవితంపై ఆధారపడి ఉంటుంది. బ్రతకకుండా మీరు చావలేవు. ప్రతిరోజూ, మనం వృద్ధులము అవుతున్నాము, మరియు మన శరీరాలు బలహీనపడుతున్నాయి. కాబట్టి, మరణం అనేది అనారోగ్యం, కారు ఢీ కొట్టడం మరియు మిగతా వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది.

మరణం గురించి ఎందుకు ఆలోచించాలి?

పరాధీనత యొక్క ఈ సూత్రానికి సంబంధించి లోతైన స్థాయిలో, మరణ ధ్యానానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సిన  విషయం ఏమిటంటే మనకు ఉన్న ఈ అద్భుతమైన, విలువైన జీవితం గురించి. ఈ అమూల్యమైన జీవితాన్ని ఉపయోగించుకోవడానికి మనల్ని ప్రేరేపించే మరణం గురించి అవగాహన అవసరం. మన జీవితాలను మనం మెచ్చుకోకపోతే, మన గురించి మనం పని చేసుకునే అవకాశం లేకపోతే, మన ప్రాణాలను కోల్పోవడం గురించి అంతగా పట్టించుకోము. "నేను బతికే ఉన్నాను, ఒక మంచి ఆశయాన్ని సాధించడానికి నేను నా శరీరాన్ని మరియు మనస్సును ఉపయోగించగలను" అని ఎక్కువ మంది అనుకోకుండా తమ జీవితాలను వృధా చేసుకుంటారు. కాబట్టి, మరణ అవగాహన నిజానికి జీవితం యొక్క అవగాహనపై ఆధారపడి ఉంటుంది.

మనకు ఈ అమూల్యమైన మానవ జీవితం ఉందని మనం గుర్తిస్తాము మరియు బతికి ఉండటానికి మనల్ని నిజంగా సద్వినియోగం చేసుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి విముక్తి పొందుతాము. ఒక బొద్దింకను చూసిన ప్రతి ఒక్కరు తొక్కేద్దాం అని అనుకుంటారు, మనం అలా పుట్టలేదు. పెద్ద చేపలు తినే చిన్న చేపలాగా మనం పుట్టలేదు. మనం ఒక ఈగగా కూడా పుట్టలేదు. ఒకవేళ మనం ఈగ లాగా పుట్టి ఉంటే ఏం చెయ్యగలమో, ఏం సాధించగలమో ఆలోచించండి. ఏమీ చెయ్యలేము, మన జీవితాంతం మలం మరియు చెత్త దగ్గర తిరుగుతూ గడిపేవాళ్లము!

అందువల్ల, మరణం గురించి తెలుసుకోవడం (కార్యాచరణ యొక్క సూత్రం) అంటే నిరాశ చెందమని కాదు, "అయ్యో ఎంత భయంకరమైనది! నేను తప్పకుండా చచ్చిపోతాను!" అని అనుకోమని కాదు. ఇప్పుడు మనకున్న విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేకానీ ఇది ఎప్పుడు ముగుస్తుంది అని ఆలోచించకూడదు. గత వారం నా స్నేహితుడు కూడా అంతే, అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి ఎక్కువ వయసు కూడా లేదు. అతనికి సిగరెట్ లేదా తాగే అలవాటు లేదు, అతనికి అధిక రక్తపోటు కూడా లేదు, అతను వ్యాయామం మరియు ధ్యానం చేసే వ్యక్తి. చివరి వారం ఒక రోజు ఉదయం స్నానం చేస్తుంటే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇది అకస్మాత్తుగా జరిగిపోయింది.

ఈ అమూల్యమైన జీవితాన్ని మనం ఎప్పుడు కోల్పోతామో ఖచ్చితంగా చెప్పలేము. మరణం అసలు ఊహించని విధంగా వస్తుంది. మీరు ముసలి వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు, అనారోగ్యం కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి, మరణం గురించి తెలుసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బద్దకం మరియు సమయాన్ని వృధా చేయకుండా ఉండడం. ఇవి మన పనులను వాయిదా వేయించే విషయాలు. చనిపోయిన నా స్నేహితుడు ‘అలన్’ ఒక మంచి ఉదాహరణలా నిలిచాడు. అతని తల్లి చాలా ముసలి ఆమె మరియు సరైన ఆరోగ్యంతో లేదు, అతను నిజంగా ఆమెకు పనులు చేసి పెడుతూ ఆర్థికంగా సహాయం చెయ్యాలనుకున్నాడు. అలా, అతను ప్రతి వారం ఆమెను చూసుకోవడానికి వెళ్ళేవాడు - షాపింగ్ చేయించి మిగతా పనులు చేసిపెట్టేవాడు. తన తల్లి చనిపోయిన వెంటనే తాను ఉద్యోగాన్ని వదిలేసి, ముందుగా శుద్ధి కోసం ఏడాది పాటు వజ్రసత్వ దీక్ష చేస్తానని, ఆ తర్వాత మరికొన్ని విహార యాత్రలు చేస్తానని ఎప్పుడూ చెప్పేవాడు. ఇదే అతని ఆలోచన.

నేను చెప్పినట్లుగా, అతను చాలా తీవ్రమైన అభ్యాసకుడు, కానీ అతను ఎప్పుడూ ధ్యాన సభల్లోకి వెళ్ళలేదు ఎందుకంటే అతను తన తల్లి దగ్గరే ఉండాలని అనుకున్నాడు, కాబట్టి అతను పని చెయ్యాల్సి వచ్చింది. అతను తన తల్లికి సహాయం చెయ్యడానికి ఉండాలా, లేదా అవకాశం వచ్చినప్పుడు రిట్రీట్ కి వెళ్ళాలా? ధర్మం మనల్ని ఏం చేయమని చెప్తుంది? మరణ౦ గురి౦చిన బోధనలు మనల్ని ఏమి చెయ్యమని ప్రేరేపిస్తాయి? అలాంటి పరిస్థితిలో నేను ఏమి చెయ్యాలి? అని ఆలోచిస్తే బాగుంటుంది.

ఒక ఆలోచన ఏమిటంటే, చిన్న రిట్రీట్ కి వెళ్లి అదే సమయంలో మీ తల్లికి సహాయం చెయ్యడానికి వెళ్లొచ్చు. రిట్రీట్ లు ఫుల్-టైమ్ గానే చెయ్యాల్సిన అవసరం లేదు - మనం ఒక ఉదయం సెషన్ మరియు ఒక సాయంత్రం సెషన్ ను చెయ్యవచ్చు మరియు పగలు మన పనిని చేసుకోవచ్చు. రిట్రీట్ లకు వెళ్లడం మంచి విషయమే, కానీ అందరికి సహాయం చెయ్యాలని, ముఖ్యంగా మనకు జీవితాన్ని ప్రసాదించిన మన తల్లికి సేవ చేసుకోవాలని బోధనలు ఎప్పుడూ చెప్తూనే ఉంటాయి. "నాకు నా ఉద్యోగం ఇష్టం లేదు అందుకే నేను దీన్ని వదిలేద్దాం అని అనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళు ఇప్పటికే చనిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను" లాంటి కోపం ఏమీ లేకుండా మీరు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మీరు మంచి పాజిటివ్ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రుల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోతే, మన జీవితాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవాలి.

తరచుగా, టిబెటన్ లామాలు పాశ్చాత్య ధర్మ విద్యార్థులను సీరియస్ గా తీసుకోరు, ఎందుకంటే మనలో చాలా మందికి నిజంగా ధర్మం పట్ల అంకితభావం మరియు నిబద్ధత ఉండదు. చాలా మంది టిబెటన్లకు దాని విలువ గురించి నిజమైన అవగాహన ఉండదు. పాశ్చాత్యులు తరచుగా వారి వైఖరితో చాలా రిలాక్స్ గా ఉంటారు, "నేను ఈ రోజు అలసిపోయాను, నేను ఆ బోధనకు తర్వాత వెళ్తాను అని" అనుకుంటూ ఉంటారు. కానీ మన౦ నిజంగా సీరియస్ గా ఉ౦టే, మరణ౦ గురి౦చి, మనకున్న ఈ అమూల్యమైన మానవ జీవిత౦ గురి౦చి మనకు అవగాహన ఉ౦టే, మనకెలా ఉన్నా అందుబాటులో ఉండే బోధనలకు మన౦ ప్రతిరోజు వెళ్తాము.

మరణం రాబోతోంది: రిలాక్స్ గా ఉండండి!

మన అమూల్యమైన జీవితం అంతం కాబోతోంది. అది ఎప్పుడో మనకు తెలియదు. మనం గుండెపోటుతో షవర్ లో చనిపోవచ్చు; మనల్ని ఒక బస్సు ఢీ కొట్టవచ్చు. మనం మన జీవితాన్ని వృధా చేయాలనుకోవడం లేదు. మరణం గురించిన అవగాహన బద్దకాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది మరియు మనకు ఉన్న అన్ని అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తుంది. కానీ, అలా చేసేటప్పుడు, ఒత్తిడికి గురి కాకుండా ఉండటం చాలా ముఖ్యం. తరచుగా, మనం చాలా ఒత్తిడికి గురవుతాము మరియు ముఖ్యమైన, చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురవుతాము. మనం ధర్మం గురించి సరిగ్గా ఆలోచించము. మన సాధనలో మనం చిత్తశుద్ధితో ఉండాలి, రిలాక్స్ గా ఉండాలి - అయితే దీని అర్థం లేజీగా ఉండమని కాదు. మీరు పాజిటివ్ అలవాట్లను పెంపొందించుకున్నప్పుడు, మరణ సమయంలో అది సమస్యగా ఉండదు, ఎందుకంటే ఆ అలవాట్లు మీకు సహాయపడతాయని మీకు తెలుసు.

మరణం అనేది జీవితానికి లాజికల్ ముగింపు

అప్పుడు, బుద్ధుడు బోధించిన బోధనలు దానికి అనుగుణంగా ఉన్నాయో లేదో మనం హేతుబద్ధంగా నిర్ధారిస్తాము (కారణం యొక్క సూత్రం). ఇలా చెయ్యడానికి మనం సాధారణంగా కొన్ని బోధనలను వినాలి లేదా బౌద్ధమత పుస్తకాలను చదవాలి. అనేక బౌద్ధమత బోధనలు అశాశ్వతం గురించి మాట్లాడతాయి, కాబట్టి ఇది బుద్ధుడు బోధించిన దానికి అనుగుణంగా ఉంటుంది.

ఇది లాజికల్ గా ఉంటుందా? అవును, ప్రతిరోజూ మనం మరణానికి దగ్గరవుతున్నాము. ఒకానొక సమయంలో మన ఆట ముగిసిపోతుంది. మరణం ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మరణం వచ్చినప్పుడు దానిని తిప్పికొట్టే అవకాశం ఏమీ లేదు. మన జీవితకాలాన్ని పొడిగించలేము, మన మిగిలిన జీవిత కాల పరిమితి రోజురోజుకు, ప్రతి నిమిషానికి, ప్రతి సెకనుకు తగ్గుతూ వస్తుంది. ఇది నిజంగా భావోద్వేగపరంగా అర్ధం కావడానికి చాలా లోతైన విషయం, మనం దానిని పూర్తిగా నిరాశ చెందని విధంగా చెప్పగలిగినప్పుడు, దాని గురించి రిలాక్స్ గా ఉండగలిగినప్పుడు అలా ఉండవచ్చు. బతికున్నప్పుడు ధర్మాన్ని ఆచరించడానికి సమయం లేకపోయినా మనం చావక తప్పదు. ఇప్పటి వరకు బతికిన వాళ్ళందరూ చనిపోయారు.

ఉపయోగకరమైన ఫలితాలు

ఫలితం ఎలా ఉంటుంది? మరణం రాబోతోందని, మనకు ఈ అమూల్యమైన మానవ జీవితం ఉందని నిజంగా నమ్మితే, దాని ఫలితం మన బద్దకాన్ని తగ్గిస్తుంది మరియు మనకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చేస్తుంది. ఇది మన స్వంత అనుభవం నుంచి ప్రయోజనకరంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు.

వస్తువుల స్వభావానికి సంబంధించి నాలుగవ సూత్రం ఏమిటంటే, జీవించే ప్రతిదీ మరణిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఇదే నిజం, ఈ నిజాన్ని అంగీకరించడం తప్ప మనం చెయ్యగలిగింది ఇంకేదీ లేదు.

మన స్వంత అనుభవానికి సంబంధించిన ఈ నాలుగు సూత్రాలతో బోధనలను విశ్లేషించడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఎందుకంటే 100% నమ్మకం పొందడానికి మరియు దాన్ని మన జీవితాలతో అనుసంధానించడానికి చాలా కష్టపడాలి. మేధా శక్తి పరంగా ఒప్పించడం సులభం, కానీ భావోద్వేగపరంగా ఒప్పించడం చాలా కష్టం. మనస్సు మరియు శరీరం కూడా వేరుగా ఉంటాయి - ఉదాహరణకు, నా స్నేహితుడి మరణం తర్వాత, మానసికంగా మరియు భావోద్వేగపరంగా, నేను చాలా ప్రశాంతంగానే ఉన్నాను, కాని నా శరీరం చాలా శక్తిని కోల్పోయింది.

కాబట్టి శారీరక స్థాయిలో విచారం ఉంటుంది, ఎందుకంటే "అందరూ చనిపోతారు" అనే నిజం శరీరానికి అర్ధం కాదు. మరియు ఇది సహజమైనది కాబట్టి ఎప్పటికప్పుడు మానసిక స్థాయిలో బాధ ఉంటుంది. మనం బుద్ధులం కాదు; మనం స్వాతంత్ర జీవులం కాదు. ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు లేదా బాధల నుంచి మనం ఇంకా విముక్తి పొందలేదు. కానీ మన లక్ష్యం అదే.

సారాంశం

విముక్తి, జ్ఞానోదయం అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత, మనం మన లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. మనకు నిజంగా ఏమి కావాలో దాని కోసం మనం పని చేసినప్పుడు, అక్కడికి చేరుకోవడానికి దశలను రూపొందించవచ్చు. ఈ నాలుగు సూత్రాలు మనం చేసే పనిలో విజయాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి.

మరణం గురించి మనం ధ్యానం చేసినప్పుడు, మనమందరం చనిపోబోతున్నామని నిజంగా అర్థం చేసుకుని మనకు తెలియకుండానే ముఖ్యమైన పనులను చెయ్యడానికి ప్రేరేపించబడతాము. మరణం గురించి అవగాహన మనలో నమ్మలేని మార్పును తీసుకొస్తుంది, బద్దకం లేదా నిరాశకు లొంగిపోవడం అసాధ్యం చేస్తుంది.

Top