ధ్యానానికి కావలసిన ప్రాథమిక అంశాలు

Week%203%20preliminaries%20to%20meditation%20%281%29

ధ్యానానికి అనువైన వాతావరణం

నిజానికి ధ్యానం చెయ్యాలంటే దానికి అనువైన పరిస్థితులు ఉండాలి. ధ్యానానికి కావలసిన లిస్ట్ లో చాలానే ఉన్నాయి, కానీ ఇవి సాధారణంగా ధ్యాన రిట్రీట్ ల సందర్భంలో ఉపయోగపడతాయి, కానీ మనలో చాలా మంది ఇంట్లోనే ధ్యానం చేస్తున్నాం.

ఇంట్లో కూడా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండటమే చాలా బాగుంటుంది. అక్కడి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మనలో చాలా మంది ట్రాఫిక్ ఉన్న వీధుల్లో నివసిస్తున్నారు, కాబట్టి ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు ఉదయం లేదా అర్థరాత్రి పూట ధ్యానం చెయ్యడం చాలా మంచిది. అంతే కాకుండా, మనం ఉండే చోటులో మ్యూజిక్, టీవీ లాంటివి కూడా ఉండకూడదు. ఇలాంటి జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. నిశ్శబ్ద వాతావరణం కుదరకపోతే, మనం చెవిలో ఇయర్ ప్లగ్‌లను ఉపయోగించవచ్చు. అవి తప్పనిసరిగా అన్ని శబ్దాలను ఆపివేయవు, కానీ వాటి తీవ్రతను ఖచ్చితంగా తగ్గిస్తాయి.

మనలో చాలా మందికి ధ్యానం కోసం ప్రత్యేక గది ఉండే అవకాశం ఉండదు. మీకు అందుబాటులో ఉన్న చోటుని మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు కావాలంటే మీ మంచంపై కూడా ధ్యానం చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది టిబెటన్లు తమ మంచాలపై కూర్చొనే ధ్యానం చేస్తారు.

మంచి శుభ్రమైన, క్లీన్ రూమ్ ఉండటం చాలా ముఖ్యం. వాతావరణం శుభ్రంగా, నీట్ గా ఉంటే మనసు కూడా బాగుంటుంది. గది ఎలా పడితే అలా, గజిబిజిగా, మురికిగా ఉంటే మనసు కూడా అలాగే ఉంటుంది. ఆ కారణంగా, ధ్యానానికి ముందు ఎప్పుడూ మన గదిని శుభ్రపరుచుకుని ఒక రకమైన నైవేద్యం ఇచ్చుకోవాలి, అది కేవలం ఒక కప్పు నీరు అయినా పర్లేదు. మనం చేస్తున్న పనికి గౌరవం చూపించాలని, బుద్ధులను, బోధిసత్వులను మురికి గదికి కాకుండా శుభ్రమైన గదికి ఆహ్వానించాలని అనుకుంటాం. సాధారణ మానసిక స్థాయిలో కూడా, మనం చేస్తున్న పనిని గౌరవించడం మరియు దానిని ప్రత్యేకమైనదిగా పరిగణించడం చాలా ముఖ్యం. “ప్రత్యేకం" అంటే ధూపం, కొవ్వొత్తులతో సెట్ చేసిన హాలీవుడ్ సినిమా లాంటి వాతావరణాన్ని సృష్టించడం కాదు, సింపుల్ గా, సాదాసీదాగా, నీట్ గా, క్లీన్ గా ఉంచుకోవడం.

భంగిమ

వివిధ ఆసియా సంస్కృతులలో, ధ్యానం కోసం ఉపయోగించే భంగిమ మారుతూ ఉంటుంది. భారతదేశం / టిబెట్, చైనా / జపాన్ మరియు థాయిలాండ్ యొక్క ధ్యాన భంగిమలు అన్నీ వేరుగా ఉంటాయి, కాబట్టి ఒక నిర్దిష్ట భంగిమ మాత్రమే సరైనదని మనం చెప్పలేము. భారతీయులు, టిబెటన్లు కాళ్లు మడత పెట్టుకుని కూర్చొంటారు. జపనీయులు మరియు కొంతమంది చైనీయులు వారి కాళ్లను వాళ్ళ కింద పెట్టి ముడుచుకుంటారు. థాయ్ లాండ్ వాళ్ళు కాళ్లను పక్కకు పెట్టి కూర్చొంటారు. శరీర శక్తులతో పని చేసే తంత్ర సాధనకు, పూర్తి కమలం అవసరం పడుతుంది, కానీ మనలో చాలా మంది ఆ సాధన దశ వరకు ఇంకా చేరుకోలేదు. మీరు ఆ రకమైన ధ్యానాన్ని ప్రాక్టీస్ చెయ్యాలనుకుంటే, మీరు చాలా చిన్న వయస్సులోనే పూర్తి తామర భంగిమలో కూర్చోవడం ప్రారంభించాలి, ఎందుకంటే ఆ తర్వాత ఈ భంగిమను ఉపయోగించడం చాలా కష్టం అవుతుంది. పాశ్చాత్యులకు, మీరు ఈ సాంప్రదాయ ఆసియా భంగిమలలో దేనిలోనైనా కూర్చోగలిగితే, అది బాగా పనిచేస్తుంది; కుర్చీలో కూర్చొన్నా పర్లేదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వీపు నిటారుగా ఉండాలి.

చూపు యొక్క దిశానిర్దేశం

కళ్ళ విషయానికొస్తే, కొన్ని ధ్యానాలు మీ కళ్ళు మూసుకుని, కొన్ని కళ్ళు తెరిచి, కొన్ని మీ కళ్ళు క్రిందికి చూస్తూ, మరికొన్ని మీ కళ్లను పైకి చూస్తూ చేస్తారు; ఇది ధ్యానం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, టిబెటన్లు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యడాన్ని ఇష్టపడరు. కళ్ళు మూసుకున్నప్పుడు నిద్రపోవడం చాలా సులభం అనే నిజాన్ని పక్కన పెడితే, ధ్యానం చెయ్యడానికి, మీరు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఉందని ఆలోచనను ఇది ఏర్పరుస్తుంది. మీకు అలా అనిపిస్తే, ధ్యానంలో మీరు నేర్చుకుంటున్న దాన్ని నిజ జీవితంలో ఉపయోగించడం చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు, నేను ఎవరితోనైనా మాట్లాడుతుంటే, ప్రేమ భావనను కలిగించడానికి నేను కళ్ళు మూసుకోవాలి, అది వింతగా అనిపిస్తుంది కదా. కాబట్టి, టిబెటన్ సంప్రదాయంలో, చాలా ధ్యానాలలో, మీరు మీ కళ్లను సగం తెరిచి, వదులుగా ఉంచి నేల వైపు చూస్తూ దృష్టి పెడతారు.

దిండు

మీరు కాళ్లను మడత పెట్టుకుని కూర్చుంటే, సరైన దిండుని ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది నేలపై ఏమీ లేకుండా కూర్చోగలరు, అప్పుడు వాళ్ళ కాళ్లు తిమ్మిరి ఎక్కవు. ఉదాహరణకు దలైలామా గారు తన బోధనా చోటులో అలానే కూర్చొని బోధిస్తారు. కానీ మనలో చాలా మందికి దిండు లేకుండా కూర్చుంటే కాళ్లు త్వరగా తిమ్మిరి ఎక్కుతాయి. కాబట్టి, మీకు ఆ సమస్య ఉంటే, మీ కింద ఒక దిండును వేసుకుని కూర్చోవడానికి ప్రయత్నించండి, అలా మీ హిప్స్ మీ మోకాళ్ల కంటే ఎత్తులో ఉంటాయి. మీకు బాగా పనిచేసే దిండుని ఎంచుకోండి: లావుగా ఉన్నా లేదా సన్నగా ఉన్నా, గట్టిగా ఉన్నా లేదా మృదువుగా ఉన్నది. ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా ఉంటారు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు సౌకర్యవంతంగా ఉంటారు మరియు మీ దిండు మీ కాళ్లు తిమ్మిరిపోకుండా చూసుకుంటుంది. అనేక బౌద్ధమత కేంద్రాలు లావైన, గుండ్రని లేదా స్క్వేర్ షేప్ లో ఉన్న జఫులను కలిగి ఉంటాయి, కానీ ఆ జెన్ జఫులు జపనీస్ భంగిమలో కూర్చోవడానికి పెట్టినవి, కాళ్లు క్రింద ఉండేలా. కొంత మందికి ఇలా కాళ్లు మడత పెట్టుకుని కూర్చోవడం హాయిగా ఉంటుంది. కానీ చాలా మందికి, అవి చాలా ఎత్తుగా మరియు గట్టిగా అనిపిస్తాయి. మీ సెంటర్ లావుగా ఉండే జఫులను మాత్రమే ఇస్తుంటే, మరియు మీరు కాళ్ళను మడత పెట్టుకుని కూర్చోవాలనుకుంటే మీ స్వంత దిండుని తెచ్చుకోవచ్చు.

ధ్యానం చెయ్యడానికి ఒక సమయాన్ని ఎంచుకోండి

చాలా మందికి, ధ్యానం చెయ్యడానికి మంచి సమయం పొద్దున్నే లేదా రాత్రి పడుకునే ముందు అయి ఉంటుంది, అప్పుడు వాళ్లకు తక్కువ ఇబ్బంది ఉంటుంది. కొంతమంది ఉదయం ఎక్కువగా మేలుకుని ఉంటారు, ఇంకొందరు రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉంటారు - వీళ్ళని "మార్నింగ్ పీపుల్" మరియు "నైట్ ఔల్స్" అని పిలుస్తారు. మీ జీవితం గురించి ఇతరులకన్నా మీకే బాగా తెలుసు, కాబట్టి రోజులో ఏ సమయం బాగుంటుందో మీరే నిర్ణయించుకోవచ్చు.

నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ ధ్యానం చెయ్యకూడదు. మీరు రాత్రి పూట నిద్ర మత్తులో ఉంటే, లేదా నిద్రపోవడానికి ముందు ధ్యానం చెయ్యడానికి ప్రయత్నిస్తే, మీరు మీ ధ్యానం మధ్యలో నిద్రపోవచ్చు, దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే విధంగా, ఉదయాన్నే: మీరు ఇంకా నిద్ర మత్తులోనే ఉంటే, అప్పుడు ధ్యానం సరిగ్గా చెయ్యలేరు. మీకు ఏది బాగా పనిచేస్తుందో నిర్ణయించుకోండి. చాలా మంది టిబెటన్లకు ఆ అలవాటు లేనప్పటికీ, ఉదయాన్నే ధ్యానం చేసే ముందు కాఫీ లేదా టీ తాగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

నా గురువు సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు దలైలామా గురువులలో ఒకరు. టిబెట్ లోని తాంత్రిక కళాశాల మఠాలలో వారు ఎలా ధ్యానం చేశారో వివరించేవారు. సన్యాసులందరూ ధ్యాన మందిరంలో కూర్చొని, పక్కన వాళ్ళ ఒడిలో తలలు పెట్టుకుని తమ చోటులోనే ఉండి నిద్రపోయేవారు. టిబెటన్లకు శారీరక స్పర్శతో ఎలాంటి సమస్య ఉండదు. ఉదయాన్నే నిద్రలేవడానికి గంట మొగగానే లేచి కూర్చొని ధ్యానం,  ప్రారంభించాలని అనుకుంటారు. కానీ మీరు అర్ధరాత్రి నిద్రలేచి వెంటనే లేచి సర్జరీ లేదా అలాంటివి చెయ్యడం అలవాటైన వైద్యుడు కాకపోతే, నిద్ర లేచిన వెంటనే ధ్యానం ప్రారంభించడం చాలా కష్టం.

ఎంతసేపు ధ్యానం చెయ్యాలి

మీరు ధ్యాన అభ్యాసాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, మీ ధ్యాన సెషన్లు వివరంగా ఎక్కువ సార్లు ఉండటం చాలా ముఖ్యం. ప్రారంభంలో, ఒకేసారి గంటల తరబడి కూర్చొని ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించడం అగ్నిపరీక్షగా ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళు ఆ రకమైన అలవాటును అనుసరిస్తారు, కాని సాధారణంగా టిబెటన్లు దానిని ఒప్పుకోరు, ఎందుకంటే ధ్యానం ఒక పరీక్షలా ఉంటే మీరు దానిని చెయ్యాలనుకోరు! ఆ సెషన్ ఎప్పుడు ముగుస్తోందా అని ఆత్రుతగా ఎదురు చూస్తారు. కాబట్టి, ప్రారంభంలో, కేవలం ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యడం సరిపోతుంది. థెరవాడ మఠాలలో, వారు కూర్చొనే ధ్యానాన్ని నడక ధ్యానంతో పూర్తి చేస్తారు, కాబట్టి వారు ఎక్కువ కాలం ఒకే రకమైన ధ్యానం చెయ్యరు.

టిబెటన్లు ఉపయోగించే సారూప్యత ఏమిటంటే, ఒక స్నేహితుడు వచ్చి ఎక్కువసేపు ఉంటే, మీరు అతనిని వెళ్లనివ్వరు. అతను వెళ్ళిపోయిన తర్వాత, అతన్ని లేదా ఆమెను మళ్లీ చూడటానికి మీరు అంత ఆత్రుత చూపించరు. కానీ మీరు అతనితో కలిసి ఎక్కువ సమయం గడపాలనుకున్నప్పుడు వాడిని మళ్లీ చూడటానికి బాగా ప్రయత్నిస్తారు. అదే విధంగా, మన ధ్యాన భంగిమ, ధ్యాన సీటు మరియు ధ్యాన సెషన్ పొడవు అన్నీ సౌకర్యవంతంగా ఉండాలి, అప్పుడే మన అభ్యాసం గురించి మనం ఉత్సాహంగా ఉంటాము.

ఉద్దేశ్యాన్ని సెట్ చెయ్యడం

ధ్యానం చెయ్యడానికి ముందు, మీ ఉద్దేశ్యాన్ని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి, మీ ఉద్దేశ్యాన్ని సెట్ చేయడం అనేది మీరు కళ్ళు తెరిచిన వెంటనే అంటే పొద్దున్నే మీకు మీరు చెప్పుకునే విషయం. మీరు నిద్ర లేచిన వెంటనే, మంచంపై ఉన్నప్పుడే, మీరు ఆ రోజు కోసం మీ ఉద్దేశ్యాన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు ఇలా అనుకోవచ్చు: "ఈ రోజు నేను కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను మంచి సహనంతో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇతరుల పట్ల మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజును వృథా చెయ్యకుండా అర్థవంతమైన రోజుగా మార్చడానికి ప్రయత్నిస్తాను” అని.

ఒక అద్భుతమైన జెన్ డైలాగ్ ఉంది, ఇది నాకు బాగా ఇష్టమైనది: "మరణం ఎప్పుడైనా రావచ్చు: రిలాక్స్!" దీని గురించి మీరు ఆలోచిస్తే, ఇందులో చాలా లోతైన అర్ధం ఉంది. మీరు చాలా ఉత్సాహభరితంగా ఉంటే, మరణం ఎప్పుడైనా రావచ్చని మీరు ఆందోళన చెందుతుంటే, మీరు దేన్నీ సాధించలేరు. మీకు ఇలాంటి ఆలోచనలు ఉండవచ్చు: "నేను అనుకున్నది చెయ్యడం లేదు; నేను సరిగ్గా లేను" అని. కానీ మరణం ఎప్పుడైనా రావచ్చని మీకు తెలిస్తే, దాని గురించి మీరు రిలాక్స్ అయ్యి, మీ ఆత్రుత, ఆందోళన లేదా ఉత్తేజం లేకుండా అర్థవంతమైన, వాస్తవిక మార్గంలో అనుకున్నదంతా చేస్తారు. కాబట్టి, మరణం ఎప్పుడైనా రావచ్చని గుర్తుంచుకుని విశ్రాంతి తీసుకోండి!

ధ్యానం చెయ్యడానికి ముందు, "నేను 'x' నిమిషాల వరకు ధ్యానం చెయ్యడానికి ప్రయత్నిస్తాను. నేను ఏకాగ్రతతో ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను నిద్రపోవడం ప్రారంభిస్తే, నన్ను నేను నిద్ర లేపుకుంటాను. నా దృష్టి మళ్లితే దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను." దీన్ని సీరియస్ గా తీసుకోండి, కేవలం మాటలనే చెప్పకండి - నిజంగా మీ ఉద్దేశ్యాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించి దానిని అనుసరించండి. మీ ఉద్దేశ్యానికి కట్టుబడి ఉండటం చాలా కష్టం. ఇతర సమస్యల గురించి ఆలోచించడానికి మీ ధ్యాన సెషన్లను ఉపయోగించే చెడు అలవాటు మీకు ఉంటే, అవి ఇతర ధర్మ భావనలు అయినప్పటికీ, దాన్ని మానుకోవడం చాలా కష్టం. నేను అనుభవం నుంచే మాట్లాడుతున్నాను: దాన్ని మానుకోవడం నిజంగా కష్టమే, కాబట్టి మీ ధ్యాన సెషన్ కు ముందు సరైన ఉద్దేశ్యాన్ని సెట్ చేసుకుని దాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి.

ప్రేరణ

తర్వాతది ప్రేరణ. టిబెటన్ బౌద్ధమత సందర్భంలో, ప్రేరణ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది లక్ష్యం: మనం ఏమి సాధించడానికి ప్రయత్నిస్తున్నాము? అని. ఈ ప్రామాణిక లక్ష్యాలు "మార్గం యొక్క గ్రేడెడ్ దశలు" (లామ్-రిమ్) లో వివరించబడతాయి. లామ్-రిమ్ లో వివరించినట్లుగా, లక్ష్యాలు: (ఎ) భవిష్యత్తు జీవితాలను మెరుగుపరచడం, (బి) పునర్జన్మ నుంచి సంపూర్ణ విముక్తిని పొందడం మరియు (సి) పునర్జన్మ నుంచి విముక్తి పొందిన వాళ్లందరికి సహాయపడటానికి జ్ఞానోదయాన్ని పొందడం. రెండవ భాగం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనల్ని నడిపించే భావోద్వేగం.

మన ప్రేరణ గురించి ఆలోచించేటప్పుడు, మనం మనతో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. నేను నిజంగా పునర్జన్మను నమ్ముతున్నానా? మనలో చాలా మందికి, "నా తర్వాతి జన్మలో నాకు ఇంకొక విలువైన పునర్జన్మను పొందడానికి నేను ఇలా చేస్తున్నాను", లేదా "పునర్జన్మ నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి నేను ఇలా చేస్తున్నాను", లేదా "పునర్జన్మ నుంచి విముక్తి పొంది ప్రతి ఒక్కరికి సహాయం చెయ్యడానికి జ్ఞానోదయం పొందడానికి ఇలా చేస్తున్నాను" అని తెలియదు. మీకు పునర్జన్మపై నమ్మకం లేకపోతే అవి కేవలం ఉత్తుత్తి మాటలే.

కాబట్టి, నేను "ధర్మ-లైట్" అని పిలువబడే దానిలో భాగంగా మీరు ధ్యానాన్ని అభ్యసిస్తుంటే, అది పునర్జన్మ లేని బౌద్ధమతంలా ఉంటుంది. మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ ప్రేరణ గురించి మీతో నిజాయితీగా ఉండాలి: "ఈ జన్మలో నా పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను” అని అనుకోండి. మనం దాని గురించి నిజాయితీగా ఉన్నంత వరకు అది మంచి ప్రేరణ. మరోవైపు, నేను "నిజమైన ధర్మం" అని పిలిచే దానిలో ప్రామాణిక దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమిటో గౌరవించడం చాలా ముఖ్యం మరియు బౌద్ధమతం యొక్క అభ్యాసం ఈ జన్మను మెరుగుపరచడానికి మాత్రమే అని అనుకోకూడదు.

మన ప్రేరణ యొక్క రెండవ భాగం విషయానికొస్తే - మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనల్ని నడిపిస్తున్న భావోద్వేగం – ప్రేరణ యొక్క మొదటి స్థాయి "నేను భవిష్యత్తులో విలువైన పునర్జన్మను లక్ష్యంగా పెట్టుకున్నాను, ఎందుకంటే ఈగగా లేదా బొద్దింకగా లేదా మరేదైనా తక్కువ జీవిగా పునర్జన్మను పొందడం ఎంత భయంకరంగా ఉంటుందో అని నేను భయపడుతున్నాను. నేను నిజంగా అలాంటి భవిష్యత్తును నివారించాలనుకుంటున్నాను, మరియు దాన్ని నివారించడానికి ఒక మార్గం ఉందని నేను నమ్ముతున్నాను." దీని యొక్క ధర్మ-లైట్ వెర్షన్ "జీవితంలో అన్నీ బాగా సాగాలని మరియు ఇంకా మెరుగ్గా ఉండాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను, ఎందుకంటే పరిస్థితులు ఇంకా దిగజారితే ఎంత భయంకరంగా ఉంటుందో అని నేను భయపడుతున్నాను మరియు దాన్ని నివారించడానికి నేను చేయగలిగిన పనులన్నీ ఉన్నాయని నాకు తెలుసు." ఏదేమైనా, ఇది "పరిస్థితి నిరాశాజనకంగా ఉంది" అనేటటువంటి భయం లాంటిది కాదు. నేను నాశనమై పోయాను," కానీ ఇది ఒక ఆరోగ్యకరమైన భావన, "నాకు నిజంగా అది వద్దు, మరియు దాన్ని నివారించడానికి నాకు ఒక మార్గం ఉందని నేను తెలుసుకున్నాను." నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదం జరుగుతుందనే భయం లాగానే - జాగ్రత్తగా ఉంటాను, కానీ ఇంక ఎప్పుడూ డ్రైవింగ్ చెయ్యలేను అనే భయంతో ఉండను.

రెండవ విషయం ఏమిటంటే "పునర్జన్మతో ముడిపడి ఉన్న అన్ని బాధలతో నేను పూర్తిగా అలసిపోయి ఉన్నాను, విసుగు చెందాను మరియు నేను లక్ష్యాన్ని కోరుకుంటున్నాను." త్యాగం వెనుక ఉన్న భావోద్వేగాల సారాంశం "మళ్ళీ బేబీగా ఉండటం, అన్నీ మళ్ళీ నేర్చుకోవడం, చదువుకోవడం మరియు ఎలా జీవించాలో తెలుసుకోవడం. అనారోగ్యానికి గురికావడం మరియు పదే పదే ముసలి వయసుతో వ్యవహరించడం చాలా కష్టంతో కూడుకున్నది. ఇది ఒక చెడ్డ సినిమాను పద్దాక చూసినట్లే ఉంటుంది. అంటే ఎంత బోరింగ్ గా ఉంటుందో నాకు తెలుసు!"

అత్యంత అధునాతన ప్రేరణ జ్ఞానోదయం కోసం బోధిచిత్తకు లక్ష్యంగా పెట్టుకుని మరియు కరుణ ద్వారా కదిలించబడడం: "ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతూ ఉండడం చూసి నేను భరించలేను. ప్రతి ఒక్కరి కష్టాలను తగ్గించడానికి నేను సహాయపడే స్థితికి చేరుకోగలగాలి" అని.

ప్రేరణ అనేది మన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మనం ఏమి చేస్తామో అనే దాని గురించి ఉంటుంది. మనం మహాయాన సంప్రదాయంలో సాధన చేస్తున్నప్పుడు, ప్రేరణ యొక్క ప్రతి స్థాయి జ్ఞానోదయం కోసం పనిచేసే విధంగా ఉంటుంది. జ్ఞానోదయం పొంది, మన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మనం ఏమి చేస్తాము.

ధర్మ-లైట్ స్థాయిలో, ఈ జన్మలో జ్ఞానోదయంలో సాధ్యమైనంత పురోగతి సాధించాలని మనం కోరుకుంటున్నాము, అది సులభం అని అనుకోము, ఆ తర్వాత మన మరణం సమీపించినప్పుడు నిరాశకు గురవుతాము అప్పటికీ జ్ఞానోదయం పొందకుండా ఉంటాము.

  • ప్రేరణ యొక్క ఈ మూడు నిజమైన స్థాయిలలో, మొదటిది "జ్ఞానోదయం మార్గంలో వెళ్ళడానికి నేను ఇంకొక విలువైన మానవ పునర్జన్మను పొందాలనుకుంటున్నాను, ఎందుకంటే నా లక్ష్యాన్ని సాధించడానికి చాలా జన్మల అవసరం పడుతుంది."
  • రెండవది "నేను కర్మ మరియు ఇబ్బందిపెట్టే భావోద్వేగాల నుంచి విముక్తి పొందాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వారితో బంధాన్ని కలిగి ఉంటే లేదా నాకు బలవంతపు ప్రవర్తన ఉంటే నేను ఇతరులకు సహాయం చెయ్యలేను. నాకు గర్వం, అహంకారంగా అనిపిస్తే ఇతరులకు సహాయం చెయ్యలేను. కాబట్టి, నేను నా స్వంత విముక్తిని పొందాలి."
  • అత్యున్నత ప్రేరణ "నేను జ్ఞానోదయం పొందాలనుకుంటున్నాను, అలా ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా సహాయం చెయ్యడానికి నాకు పూర్తి జ్ఞానం ఉంటుంది" అని.

ప్రేరణ అనేది చాలా ముఖ్యం. ప్రేరణ అనేది ధ్యాన సెషన్ ప్రారంభంలో మాత్రమే కాకుండా రోజంతా మనకు ఉండాల్సిన ఒక విషయం అని సోంగ్ ఖాపా గారు చెప్పారు. ప్రేరణ కేవలం మంచి మాటల లాగానే ఉండకూడదు; మనం దాన్ని నిజంగా పొందాలి. మరియు "పొందడం" అంటే ఏమిటి? ధ్యాన సాధన ద్వారా ప్రేరణను మనం చాలా క్షుణ్ణంగా అంతర్గతం చేసుకున్నామని దీని అర్థం, ప్రేరణ ఒక ప్రామాణికమైన, సహజమైన భావోద్వేగం, మరియు ఇది ప్రతిరోజూ మన జీవితంలో అంతర్భాగమవుతుంది.

ధ్యానం చెయ్యడానికి ముందు నిశ్శబ్దంగా ఉండటం

సరైన వాతావరణాన్ని సృష్టించి, మన ఉద్దేశం మరియు ప్రేరణను సెట్ చేసుకున్న తర్వాత, మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఇది ఎప్పుడూ శ్వాసను లెక్కించడం లాంటి ఒక రకమైన శ్వాస ధ్యానంతో జరుగుతుంది. శ్వాసతో మనం చేయగలిగే అనేక విస్తృతమైన వ్యాయామాలు ఉన్నాయి, కానీ ముక్కు ద్వారా సాధారణంగా శ్వాస తీసుకోవడం మరియు పదకొండు సార్లు శ్వాసను లెక్కించడం సరిపోతుంది. ఈ విధంగా మన మనస్సులను శాంత పరచడం వల్ల మనం ఇప్పటి వరకు చేస్తున్నదానికి, తర్వాత చెయ్యబోయే ధ్యానానికి మధ్య నిశ్శబ్ద చోటు ఏర్పడుతుంది. అటువంటి చోటుని సృష్టించడం మన బిజీ జీవితానికి మరియు ధ్యానానికి మధ్య పరివర్తన చెయ్యడానికి సహాయపడుతుంది.

ఏడు అవయవాల ప్రాక్టీస్

సెషన్ ప్రారంభంలో మనం కొంత పాజిటివ్ శక్తిని పెంపొందించుకోవాలని చెప్పబడుతుంది. దాని కోసం మనం "ఏడు-అవయవాల ప్రార్థన" లేదా "ఏడు-అవయవాల ప్రాక్టీస్" అనే దాన్ని ఉపయోగిస్తాము. ఈ సందర్భంలో, "అవయవం" అంటే "దశ(స్టెప్)" అని అర్థం.

(1) సాష్టాంగ నమస్కారం, ఆశ్రయం మరియు బోధిచిత్త

మొదటి దశ సాష్టాంగ నమస్కారం, అంటే జ్ఞానోదయం పొందిన వారిని గౌరవించడం; మన భవిష్యత్తు జ్ఞానోదయానికి గౌరవాన్ని చూపించడం, దీన్ని బోధిచిత్తతో సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము; మరియు మన స్వంత బుద్ధ-స్వభావాన్ని గౌరవించడం, ఇది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. అందుకని, ఆశ్రయం యొక్క సురక్షితమైన దిశను మరియు బోధిచిత్త లక్ష్యాన్ని మన జీవితంలో ఉంచే సందర్భంలో సాష్టాంగ నమస్కారం చేయడం జరుగుతుంది. మనం వెళ్లాలనుకునే సురక్షితమైన దిశను బుద్ధులు, వారి ధర్మ బోధనలు, సాధనలు, ముక్తిని, జ్ఞానోదయాన్ని పొందే మార్గంలో ఉన్న వారి సంఘ సమాజం సూచిస్తాయి. ఒక బోధిచిత్త లక్ష్యంతో మన మనస్సును, హృదయాలను మనమే బుద్ధులుగా మార్చుకుంటాము.

(2) సమర్పణ

రెండవ దశ సమర్పణలు చేసుకోవడం, అది కూడా గౌరవాన్ని చూపించడమే.

(3) లోపాలను అంగీకరించడం

తర్వాత మన తప్పులు, లోపాలను అందరి ముందు ఒప్పుకోవడం. దాని అర్థం మన తప్పుల పట్ల అపరాధ భావన ఉండటం అని కాదు; అపరాధ భావం సరైనది కాదు. అపరాధం అంటే మనం చేసిన పనికి సమాధానం ఇచ్చుకోవడం, అది ఒక చెడ్డ పనిగా అనుకోవడం. చెత్తను బయట పారెయ్యకుండా, మన ఇంట్లోనే ఉంచుకుని ఇలా ఆలోచించడం: "ఈ చెత్త అస్సలు బాలేదు. చాలా చెడు వాసన వస్తుంది" అని. అపరాధ భావానికి లోనవకుండా, మూడవ దశ మన తప్పులకు పశ్చాత్తాపం చెందడం: "నేను చేసిన తప్పులకు బాధపడుతున్నాను వాటిని మళ్ళీ చెయ్యకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. నా లోపాలను అధిగమించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను" అని అనుకోవడం.

(4) ఆనందించడం

నాలుగవ దశ మనం మరియు ఇతరులు చేసిన పాజిటివ్ విషయాలలో ఆనందాన్ని పొందడం, కాబట్టి మన పట్ల మరియు ఇతరుల పట్ల మరింత పాజిటివ్ ఆలోచనను కలిగి ఉండడం.

(5) బోధనలను అభ్యర్థించడం

అక్కడ మనం ఉపాధ్యాయులను మరియు బుద్ధులను బోధించమని అభ్యర్థించడం: "నాకు ఎప్పుడూ బోధిస్తూ ఉండమని. నేను ఓపెన్ గా, ఎప్పుడూ స్వీకరించే విధంగా ఉంటాను" అని అడగడం.

(6) ఉపాధ్యాయుల విడిచి వెళ్లిపోవద్దని వేడుకోవడం

తర్వాతి దశ: "వెళ్లిపోకండి; నన్ను వదిలి వెళ్లిపోకండి. నేను చాలా సీరియస్ గా నేర్చుకోవాలని అనుకుంటున్నాను, మీరు మాతోనే ఉండమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను" అని వేడుకోవడం.

(7) డెడికేషన్

చివరకు డెడికేషన్ వస్తుంది. డెడికేషన్ అనేది ఒక రకంగా శక్తిని ఒక నిర్దిష్ట మార్గంలో నడిపించడం. ఇక్కడ మన౦ ఇలా ఆలోచిస్తా౦: "ఏ పాజిటివ్ శక్తి అయినా, ఏ అవగాహన ఏర్పడినా, అది నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయపడుతుంది." నేను ఉపయోగించడానికి ఇష్టపడే పద్ధతి కంప్యూటర్ లో మన పనిని సేవ్ చేసుకోవడం. "విముక్తి" లేదా "జ్ఞానోదయం" కోసం ఒక ప్రత్యేక ఫోల్డర్ లో మనం దాన్ని సేవ్ చెయ్యకపోతే, అప్పుడు డీఫాల్ట్ సెట్టింగ్ ఏమిటంటే మన పని దానికదే "సంసారాన్ని మెరుగుపరచండి" అనే ఫోల్డర్ లో సేవ్ చెయ్యబడుతుంది. "సంసారాన్ని మెరుగుపరచండి" ఫోల్డర్ లో మన పనిని భద్రపరచడం మంచిదే, కానీ మన పని మోక్షం పొందడానికి లేదా జ్ఞానోదయం పొందడానికి పెట్టుకోవాలంటే, మనం దానిని ఉద్దేశపూర్వకంగా "విముక్తి" లేదా "జ్ఞానోదయం" ఫోల్డర్ లో ఉంచాలి. అదే డెడికేషన్. మనం దాన్ని నిజంగా అర్థం చేసుకున్నాము; కేవలం మాటలను మాత్రమే చెప్పటం లేదు. పాజిటివ్ ఎనర్జీని దాని వెనుక కొంత భావోద్వేగంతో, కరుణతో ఉంచుతున్నాము. 

ఏడు దశల ప్రార్థన తరువాత నిజమైన ధ్యానం వస్తుంది, మరియు ఆ ధ్యానం ముగింపులో, మనం ఇంకొక దాన్ని డేడికేట్ చేసుకుంటాము.

సారాంశం

ధ్యానం అనేది చాలా అధునాతన ప్రక్రియ మరియు దాన్ని ఎలా చెయ్యాలో ఉండే సూచనలు చాలా ఖచ్చితమైనవి. ఇక్కడ ఒక సాధారణ సూచన ఇవ్వబడింది; ప్రతి నిర్దిష్ట ధ్యానం దాని స్వంత నిర్దిష్ట సూచనలను కలిగి ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో, మనం ఏమి చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము మరియు ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

జెన్ లాంటి కొన్ని బౌద్ధమత సంప్రదాయాలు ఉన్నాయి, ఇవి "కూర్చొని, ధ్యానం చెయ్యండి, అప్పుడు మీరు ఎటు వైపు వెళ్తున్నారో తెలుసుకుంటారు" అని చెబుతాయి. ఇది కొంత మందికి పని చేసినప్పటికీ, ఇతరులకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఇండో-టిబెటన్ సంప్రదాయం.

Top